Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 19

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౧౯ - గోలకొండముట్టడి ప్రారంభము

బిజాపూరునకు పట్టినగతియే గోలకొండకును పట్టినది. పాదుషాకు దయాదాక్షిణ్యములు లేవు. 1686 వ సంవత్సరము డిసంబరులో నాతఁడు బిజాపురమును వదలెను. బయలుదేరుచునే, తానాషా తనకు అప్పుపడియున్న పేష్కస్సు తత్క్షణమే చెల్లింప వలసినదని ఫర్మానా వ్రాసెను. ఫర్మానాతెచ్చువారిచేత రహస్యముగా తనరాయబారి కొక జాబువ్రాసి పంపెను. “మనము హైదరాబాదును జయించుటకు ప్రయత్నింపవలెను. త్వరలో మా విజయపతాకలు అచటికి రాఁగలవు. ఇంతలోపల మీరు తానాషానుగుంజి సాధ్యమైనంత ధనమును లాగి మీ యుద్యోగధర్మమును నిర్వహింపవలెను.”

మొగలురాయబారి సాదత్‌ఖాను తానాషాతో అబద్ధములు చెప్పి పాదుషా ఆజ్ఞను ప్రతి యక్షరమును నిర్వహింప సాగెను. పాదుషా కోర్కెలు వర్ణనాతీతములు. తానాషాకడ ధనము లేనందున నాతఁడు తనరత్నాభరణాదులను తాకట్టుగా పంపఁగలనని చెప్పిపంపెను. సాదత్‌ఖాను అందులకు ఒప్పకొనలేదు. ఇంతలో పాదుషా బయలుదేరి వచ్చుచున్నాఁడని తెలియఁగానే తానాషా తానే తాకట్టుగా తనరత్నాభరణాదులను ఒకపెట్టెలోపెట్టి, ముద్రవేసి, మిగిలినపైకము ఎంతవసూలగునో దానిని మూఁడుదినములలో పంపునట్టును తన సదుద్దేశమును పాదుషావారికి తెలుప వలసినదనియు కోరి సాదత్ ఖానుకడకు పంపెను.

రెండుదినములు గడచినవి. పాదుషాకడనుండి బదులు లేదు సరిగదా ఆతఁడు దండువెడలి వచ్చుచున్నాఁడని తెలిసినది. ఇదంతయు మొగలాయీవారి కపటోపాయమని తానాషా గ్రహించి తనయుద్దేశము విఫలమైనదనియు తాను పంపిన తాకట్టును వాపసుచేయుమనియు కోరెను. సాదత్‌ఖాను ఆ నగలు పాదుషావారికి తానుపంపివేసినట్లు బదులు చెప్పిపంపెను. పైగా తాను తనధర్మమును నెఱవేర్చితిననియు ఇప్పడు ఆ వస్తువులకు బదులు తనతలను ప్రాణములను పాదుషావారి పేరు చెప్పి బలివేయవలసినదే యని కూడ వ్రాసెను. తానాషాకు కోపమువచ్చి సాదత్‌‌ఖానుని యింటిని ముట్టడి వేయించెను. సాదత్‌ఖాను సమయోచితముగ సంచరించు నేర్పరిగాన తనది సదుద్దేశమనియు, తన్ను శిక్షించుటచేత పాదుషాగారికి కోపమే యధికమగుననియు, తన్ను వదలిపెట్టిన తాను ఎట్లో పాదుషా వారికి నచ్చచెప్పి తానాషాను మన్నింపించుట కవకాశ ముండు ననియు చెప్పఁగా మెత్తటిమనసువాఁడు గాన తానాషా ఆతని వదలి చాల మర్యాద చేసిపంపెను.

ఇంతలో ఔరంగజేబు బయలుదేరెను. తానాషా కలఁతపడసాగెను. పరిస్థితులు విషమింప సాగినవి. మరల తానాషా పాదుషాకు తానుచేసినదంతయు నపరాధమే యని యొప్పుకొనుచు ఎంతధనమైనను చెల్లింతునని రాయబారమంపెనుగాని అంతయు వ్యర్థమాయెను. పాదుషా తానాషాపై పెక్కు తప్పులువ్రాసెను. తానాషా ఆసలుడిగెను. ఆత్మరక్షణ వ్యూహము పన్నసాగెను. కొలువులో షేక్‌మిౝహాజ్, షారెజ్‌ఖాౝ, అబ్దుల్‌రజాక్‌లారీ, అబ్దుల్లాఖాౝపానీ అనువారలుండిరి. తానాషా గొప్పదండిచ్చి వారిని పాదుషామీఁదికి

7 పంపుచు, వారిని పాదుషాను పట్టుకొనినయెడల సాధ్యమైనంత వఱకు ప్రాణములతో చాలమర్యాదలతో తెమ్మని యాజ్ఞాపించెను. అబ్దుల్‌రజాక్‌లారీ మొదలగువారు, పాదుషాను చూడఁగనే తమ హృదయములు దహించుకొని పోవుననియు, ఆతఁడు కావించిన ఘోరములకు ఆతనియందు తమకెట్టి గౌరవ ముండుటకుగాని అవకాశము లేదనియు చెప్పిపోయిరి.

గోలకొండముట్టడి ప్రారంభమైనది. మోర్జాలను అచ్చటచ్చట ఫిరంగులు కాల్చుటకు నిలుపునప్పటికి బిజాపూరు జయించిన ఫిరోజుజంగను నతఁడు వచ్చిచేరెను. మొగలాయీలు సొరంగములు మొదలైనవి త్రవ్వుటకును ఆ కార్యము పైన కనఁబడకుండుటకు పందిళ్లను కట్టుటకును మొదలిడిరి. సముద్ర తరంగములవలె పొంగుచు సైన్యములు వచ్చుచుండినవి. ముట్టడి ప్రయత్నము లిట్లు జరుగుచుండఁగా గోలకొండవారు ఎదిరించుచు అనుదినము అటనట యుద్ధములు చేయుచునే యుండిరి. కోటనుపట్టుట కేర్పాటుచేయఁబడిన మోర్జాలవారు దినదినము కోటవైపు వచ్చుచుండిరి. ఒకదినము ఫిరోజుజంగు మోర్జాలవారిని ముందు నడుపుచుండఁగా గోలకొండసైన్యమును వెంటఁబెట్టుకొని అబ్దుల్‌రజాక్‌లారీ మహావేశముతో మొగలాయీవారిని ఎదుర్కొనెను. మొగలాయీసైన్యములో రాజపుత్రు లనేకులుండిరి. గోలకొండవారు వారిలో చాలమందినిచంపి కిషోర్ సింగ్‌హాదా యనువానిని గాయపఱచి ఖయిదు పట్టుకొనిపోనుండఁగా మొగలాయీలు ప్రయత్నముతో తప్పిం చిరి. గోలకొండవారు చాలమంది చనిపోయిరి. కాని దక్కనీలు చూపిన పరాక్రమమునకు మొగలాయీలు భయపడిరి. పాదుషాసైన్యములోనివారు తమలో చనిపోయినవారిని ఎత్తుకొనిపోవుటయే చాల కష్టముగానుండెను. ఎంత ధైర్యముతో ప్రయత్నించినను సాధ్యము కాలేదు. దాక్షిణాత్యులు తమవారి శవములనేగాక ఢిల్లీవారివికూడ తీసికొనిపోవుచుండిరి. తుదకు పర్షియను తురానీసైన్యములు వచ్చి రంగమును ప్రవేశించినవి. ఆతర్వాత అబ్దుల్‌రజాక్‌యొక్క సైన్యము నాఁటికి విశ్రమించెను.

ఆదినము మొదలు మరల నట్టియుద్ధములు జరుగలేదు. కారణమున్నది. పాదుషా దూతలనుపంపి షేక్‌మిౝహాజ్, షేక్‌నైజామ్ అను నిరువురను గోలకొండ సేనాపతులను లంచములిచ్చి స్వాధీనము చేసికొనసాగెను. వారును తానాషా చేసిన యుపకారములను మరచిపోయి మొగలాయీవారితో చేరిరి. తత్క్షణమే ఔరంగజేబు వారికి మర్యాదచేసి గొప్ప పదవులను బిరుదములను ఇచ్చెను. ఈ యిరువురును కోటను పట్టుటలో శత్రువునకు చాలసాయము చేయసాగిరి. ముట్టడి చాల కాలము సాగినది. కోటలోపల కొంత తుపాకిమందును ఆయుధసామగ్రులు నుండినవి. వీనితో మొగలాయీలమీఁదికి గోలకొండవారు తలుపుల సందులనుండియు, బురుజలనుండియు గోడల మాటులనుండియు ఫిరంగులను తుపాకులను కాల్చుచు బాణములు ప్రయోగించుచు నుండిరి. వీని ప్రయోగముచేత ఆకాశమంతయు పొగగ్రమ్మి పగలురాత్రి యనుభేదము పోయినది. అంతయు చీఁకటియైనది. ప్రతిదినమును ఢిల్లీవారి సైన్యము మహాపరాక్రమమునుచూపి పోరాడుచునే యుండిరి. అనేకులు చనిపోవుచుండిరి. కొందఱు పాదుషాను మెప్పించుటకును ఆతనిమీఁది తమభక్తిని ప్రకటించుటకును సంవత్సరపు పని ఒక నెలలోను ఒక నెలపని ఒక దినములోను చేయుచు సొరంగములు త్రవ్వుచు, యంత్రములు నిర్మించుచు కోటలో ప్రవేశించుటకు మార్గములు వెదకుచు కష్టపడి ఎట్లెట్లో ప్రాణములకు తెగించి అగడితను సమీపించిరి. తర్వాత అగడితను మట్టితో పూడ్చుటకు పాదుషా ఆజ్ఞయాయెను. పాదుషా తానే స్వయముగా నొక గోనెసంచిలో మన్నుపోసి కుట్టి అఖాతములో వేసెను. సైన్యమంతయు పాదుషాను అనుకరింప నారంభించెను; ఫిరంగులు ఎక్కించి కోటమీఁదికి ప్రయోగించుటకు ఎత్తు కట్టడములు కట్టనారంభించెను.