అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రకరణము 18. బిజాపూరు ముట్టడి

క్రీ. శ. 1686 వ సంవత్సరము ఔరంగజేబు పాదుషా ఆజ్ఞమీఁద మహమ్మద్ ఆజామ్‌షా బిజాపూరును ముట్టడించెను. ముట్టడించునట్టి మొగలాయీ సర్దారులలో పాదుషాకుమారులు, కోటనుపట్టినకీర్తి తమకే రావలయునని ఒకరినిమించి యొకరు కుట్రలు చేయుచుండిరి. పైగా ఆసంవత్సరము క్షామ మేర్పడెను. ఆహారపదార్థములు దొరకవయ్యెను. కోటలో పనివారిబాధలు వీరికి పదింతలుగా నుండినవి. మొగలాయీలు బయటనున్నందున వారికి సరఫరాలు ఎచటనుండియైన రాగలవుగాని కోటలోనివారి కెట్లు రాఁగలవు? వారికి ఆలోపలనే సర్దుబాటు కావలసియుండెను. మొగలాయీవారు కోటను పూర్తిగా ముట్టడింపఁగానే ఆ యవకాశమును పోయినది. లెక్కలేని జనమును గుఱ్ఱములను కోటలోపల మరణించుచుండినవి. తమకు గుఱ్ఱములు తక్కువయైనందున దక్కనీలు మొగలాయీల సరఫరాలను కొల్లగొట్ట లేకపోయిరి.

తర్వాత నొక వారమునకంతయు బిజాపూరుకోట పడిపోయినది. కాని మొగలాయీల ప్రతాపము వలనకాదు. ఒక దినము సికందర్ ఆడిల్‌షా సుల్తాను తనమంత్రులతో నాలోచించి ఇఁక నీ సర్వజనసంహారమును నిలుపుటకు తాను పాదుషాకు పాదాక్రాంతుఁ డగుటకు నిశ్చయించుకొనెను. కోటలోనిసిబ్బంది చాలవఱకు నాశము కాఁగా రెండు వేలమంది మాత్రమే మిగిలియుండిరి. క్రీ. శ. 1686 వ సంవత్సరము సెప్టెంబరు 12వ తారీఖున విజయాపురముయొక్క కడపటి సుల్తాను సికందర్ ఆడిల్‌షా తనపూర్వుల సింహసనమును పట్టణమును వదలి, మధ్యాహ్నము ఒంటిగంటకు కొందఱు మొగలాయీ ఉద్యోగులతో ఔరంగజేబును దర్శించుటకు బయలుదేరెను. వీథులకు రెండువైపులను పురజనులు బారులుతీరి నిలుచుండి ఏడ్చుచుండిరి. సికందరుషా తననగరిని కడసారిచూపు చూచుకొని బయలువెడలి రాఁగానే మొగలాయీవారు జయభేరి వాయింపసాగిరి.

ఈలోపల పాదుషా కొలువుతీరియున్న గుడారమును హెచ్చుగాశృంగారించి యుంచిరి. చెంతకు సికందరు రాఁగానే గొప్పయధికారులు కొంద ఱాతని పాదుషాచెంతకు తోడ్కొని పోయిరి. పాపము సికందరుషా పాదుషాపాదములలో వ్రాలెను. ఆతని నవయౌవన సుందరాకారమును రాచఠీవియు చూపరుల గుండెలను కరఁగించి జాలిఁగొల్పుచుండినవి. పాదుషాకే ఆ యువకుని చూచినంతట జాలికలిగినది. సికందరును చూచి దయతో నిట్లనెను. “భగవంతుఁడు నిన్ను కాపాడునుగాక. నీవు బుద్ధిమంతుఁడవై ఇంతతెలివిగా ప్రవర్తించినది నీ మేలుకొఱకే గదా. నిన్ను నేను గొప్పపదవియం దుంచెదను. నీవేమియు భయపడవలదు. ధైర్యముగానుండుము.” అని అతనిని తన మనుమని ప్రక్క కూర్చుండఁబెట్టుకొని గొప్పదుస్తులు బహుమతిగానిచ్చి ఏడువేలరూప్యములు వెలగలిగిన రత్నములు తాపిన బాకును, పచ్చరాల పతకముతోడి ముత్యాలహారమును పదమూడువేల రూప్యములు వెలగలదానిని, రత్నములుతాపిన కత్తిని, వెలపొడవు గదను ఇచ్చి సమ్మానించి, ఖానను బిరుదముతో నొక మొగలాయీ సర్దారునిగా జేసి, సంవత్సరమునకు లక్షరూపాయలు భరణ మేర్పాటుచేసెను. ఈ మర్యాద యైనంతట సికందరునుకొనిపోయి ఆతనికై ఏర్పాటు చేయఁబడియున్న గుడారములో ప్రవేశపెట్టిరి. బిజాపూరు సర్దారులందఱును మొగలాయీ సర్దారులైరి. పాదుషాయాజ్ఞ పై మొగలాయీ అధికారులు బిజాపురమును స్వాధీనము చేసికొనిరి.

బిజాపూరు కళావిహీనమై పోయెను. స్వతంత్ర రాజవంశము పోయినది; రాజప్రతినిధియొక్క పరిపాలనము ప్రారంభమైనది, ధనాదాయమంతయు ఢిల్లీకి పోసాగినది. సంగీతసాహిత్యాది లలితకళలను లాలించువారు లేరు. ఆస్థానము అధ్వాన్నమాయెను. కవి పండిత గాయక చిత్రకార గణికాదుల మొగములు చూచువారు లేరు. రాచనగరిలో గోడలమీఁద నానా విధములైనచిత్రము లుండినవి. అవన్నియు ఖొరానుధర్మమునకు విరుద్ధములని, పరమాత్మతో మనుష్యుడు పోటీచేయ రా దనియు మానవులచరిత్రములు ఎంతమాత్రము పనికిరావనియు పాదుషా వానినెల్ల తుడిపించెను. చాలమనోహరములైన చిత్రములు పాడైపోయినవి. ఆతర్వాత రెండుసంవత్సరములకు ప్లేగువ్యాధి బయలుదేరి దాదాఁపు సగము జనమును తినివేసినది. ఊరంతయు పాడుపడినట్లయినది. ఏ కారణముచేతనో ఎప్పడును సమృద్ధిగానుండు బావులుకూడ ఎండిపోయినవి. ఊరిలో గొప్పగోరీలు అలంకరణములవలె నుండుచు బిజాపురమునకు ఎప్పుడును ప్రత్యేకశోభను కూర్చెడివి. ఇప్పడు ఆ గోరీలే ఆయూరిని శ్మశానమువలె చేసినవి. ఎంతదూరముపోయినను పడిపోయిన భవనములు, గొప్పబురుజులు, మసీదులు, నిర్మానుష్యమైన వీథులు, అచ్చట వీథులలోనే మహావృక్షములు మొలచి వీనిని చూచుకొనువారు పోయిరని చెప్పునట్లుండినవి. పెక్కు సాధనములమీద సయితము చెట్లు మొలచియుండినవి. పక్షులగూండ్లును, అందుండి పక్షుల యఱుపులును, గబ్బిలముల కంపును తప్ప ఆపాడుపడిన ఇండ్లలో విశేషములు లేవు.

పాదుషాకు పాదాక్రాంతుఁడైన సికందర్ ఆడిల్‌షా ఏమియు సుఖపడలేదు. కొంతకాలము పాదుషాతో నూరేఁగిన యనంతరము, ఆతఁడు తనరాజ్యములోని కృష్ణ కుత్తరభాగము తనకు సామంతరాజ్యముగా ప్రసాదింపుమని ఎంత ప్రార్థించినను వినక పాదుషా సికందరును చల్లగా దౌలతాబాదులోని చెఱసాలకుపంపెసు. ఆ గిరిదుర్గములో నాతడు తన జీవిత శేషమునంతయు నిట్టూర్పుచు గడపెను. కొంతకాలము బందిలో నున్న తర్వాత మరల పాదుషా తనకడకు పిలిపించి తనవెంట ఖైదుల గుడారములోనుంచి కూడ కొనిపోవుచుండెను. ఇట్టి పరిస్థితిలో సికందర్ ఆడిల్‌షా క్రీ. శ. 1700 సంవత్సరమున ఏప్రిలు 3వ తారీఖున తన ముప్పదిరెండవ సంవత్సరమున చనిపోయెను. పదునాలుగేండ్ల వయసున సింహాసనమారోహించి మంత్రులచేతి కీలుబొమ్మగా కొన్ని సంవత్సరములుండి తర్వాత పదునాలుగేండ్లు ఔరంగజేబుయొక్క బందిగానుండి పాదుషా బంధమును ఈ సంసారబంధమునుకూడ సికందరువదలెను.

తనబందినుండి స్వయముగా విముక్తుఁడైన తమ కడపటి సుల్తానుయొక్క శవము ఊరిలోనికి రాఁగానే వేలకొలఁది జనులు పోయిచూచి ఏడ్చిరి. పెక్కు స్త్రీలు తమ భర్తలే మరణించిన నెట్లో అట్లు ఏడ్చి గాజులు పగులఁగొట్టుకొని అంగ లార్చిరి. పాపము వారేమి చేయఁగలరు! పదునాలుగేండ్లుగా వారికి సుల్తాను లేఁడు. ఆతఁడుండినప్పుడును పాలించి యెఱుఁగఁడు. కాని తమకు సుల్తానని యొక డుండెనుగదా యను స్వాతంత్ర్యభావముకూడ పోయినది. తాము కేవలము బానిసలై పాదుషా ప్రీతికి తగినట్లు మెలఁగవలయును గదా యని బిజాపూరువారు ఆక్రందించిరి.