Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 16

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౧౬ - రామదాసుచరిత్రము

అక్కన్న మాదన్నలు మంత్రులైనవెంటనే తమబంధువుల కనేకులకు గొప్పయుద్యోగము లిచ్చియుండిరిగదా. వానిలో గోపన్న తహసీలు ఒకటి. తొలుత నాతఁడు సాధారణమైన తహసీలుదారుగానే వచ్చెను. తనపనియందు చాల జాగరూకుఁడై ఏమాత్రము లెక్కలలో నెక్కువతక్కువలు రానీయక పాడిదప్పక తహసీలు చేయుచుండెను. కాని త్వరలోనే ఈతనికి [1] కబీరుదాసను భక్తునిసాంగత్యము కల్గెను. హిందూ మహమ్మదీయ మతాభిప్రాయములు మేళవించి వేదాంతము ప్రబలియుండిన దినము లవి. రామరహీముగా దైవప్రార్థనలు సలుపుకాలము. కబీరుదాసు గోపన్నకు రామమంత్రప్రభావమును తెల్పెను. అది మొదలు గోపన్న రామదాసై నిరంతరము భజనలయందును భద్రాదిదేవుని సేవయందును తనకాలము గడపుచుండెను. భక్తి దినదిన ప్రవర్ధమానముకాఁగా దేవాలయమున కైంకర్యములు చేయించెను. తనసొంతద్రవ్యము ఖర్చయిపోఁగా నీతఁడు ‘రామభక్తులకు ఆపదలు రావు’ అని భద్రాద్రి రామునికి నిత్యోత్సవములు చేయించుచుండఁగా సర్కారు


ఖజానాపైకము ఆఱుసంవత్సరములది నిలువయైనదని మాదన్న కడనుండి దూతవచ్చి చెప్పెను. భక్తిపారవశ్యమున నుండిన గోపన్నకు ఆమాటలు ఎక్కలేదు.

ఈలోపల రాజధానిలో చాల మార్పు లేర్పడినవి. అక్కన్న మాదన్నల యధికారమునకు లోపములేదుగాని వీరికి శత్రువు లేర్పడిరి. రెండుపర్యాయములు ఆశత్రువులు చాడీలు చెప్పియు తానాషా వినలేదు. తామే వారినిచంపుటకు ప్రయత్నించియు ఫలింపలేదు. రామదాసుచర్యలు అత్తిమత్త షేక్ మిౝహాజులకు తెలిసినది. ఊరంతయు గందరగోళముగానుండు కాలమున తానాషాపేరిట గోపన్నను తర్కింపసాగిరి. గోపన్నయు వారుపెట్టుబాధలను సహించెనేగాని మామలకు చెప్పి పంపలేదు. ఆదుర్మార్గులు రహస్యముగా తమకు క్రిందిసర్దార్ల చేత గోపన్నను చెఱలోపెట్టించి క్రమముగా నొకదినము తానాషా అండనుచేరి భద్రాచలము తాసిల్దారు సర్కారుఖజానాకు పైకముపంపక భక్షించెనని చెప్పిరి. వెంటనే దర్బారులో విచారణ జరిగెను. అది వాస్తవమే. మాదన్న ఏమియు బదులు చెప్పటకులేక ఆవిషయము ఈ దేశోపద్రవకాలములో తమ కింకను తెలియరాలేదనియు ఎవరైననేమి న్యాయముప్రకారము శిక్షింపవలసినదే అనియు సభలో నుడివెను. ఆమాటయే చాలునని మిౝహాజుపక్షమువారును అంతఃపురములోనివారును గోపన్నను తీవ్రముగ శిక్షింపవలసినదని తానాషాను పురికొల్పుచుండిరి. తానాషా గోపన్నను పిలిపించెను, విచారణ జరిపెను.

6 ఆయన మహారామభక్తుఁడని ఎఱిఁగి తనమంత్రులమీఁదనుండిన యనురాగముచే తత్క్షణమే క్షమించి భద్రాచలమునకే మర్యాదలతో పంపెను. ఈ ఘటన తానాషామీఁద మహమ్మదీయులలో కొందఱికి ద్వేషమునకును హిందువులలో అందఱికిని అభిమానమునకును కారణమాయెను.

పూర్వాచారములు మూఢవిశ్వాసములుగల ఆదినములలో ఎట్టి స్వల్పవిషయమునుగూర్చి యైనను సులువుగా కథలు అల్లుకొని పర్వుటలో నాశ్చర్యములేదు. ఇంత సులువుగా విషయము తేలిపోయినందువలన శ్రీరాములవారే తానాషాకు దర్శన మనుగ్రహించి రామదాసును చెఱవిడిపించిరని జనులు చెప్పకొనసాగిరి. మఱికొందఱు తానాషాకు పూర్వజన్మ వృత్తాంతమును సయితము కల్పించిరి. ఆయన పూర్వజన్మమున నొక దొడ్డబ్రాహ్మణుఁ డనియు గంగాతీరమున నిత్యము స్నానముచేయుచు, శివునకు గంగోదకము నభిషేకముచేసిన దేవేంద్రపదవి కలుగునని చెప్పఁగా అట్లే కొంతకాలముచేసి, ఎన్నాళ్లకును శివుఁడు ప్రత్యక్షముకాలేదని విసిగి తుదకు నీటి కుండను ఒకదినము శివలింగముపైఁ బడవేసె ననియు నంతట శివుఁడు ప్రత్యక్షమై యాతని మ్లేచ్ఛుఁడవై జనించి రాజవగుదువనియు నంతట భగవంతుని దయ కలుగుననియు వరమిచ్చెననియు నీజన్మమున తానాషా ఇంతవేదాంతిగా నుండుట కదే కారణమనియు పెక్కుకథలు బయలుదేరినవి. వాస్తవముగా తానాషా హిందువుల కంతప్రియుఁడుగా నుండెను. వీనికెల్ల కారణము ఆతనిగురువు షారాజుకొత్తాల్‌గారి ఉపదేశమే.




  1. ఈకబీరు మఱియొకఁడుగానుండును. 13-వ శతాబ్దపు సుప్రసిద్ధ భక్తుఁడుకాఁడు.