అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 15
ప్రకరణము ౧౫ - పాదుషాతో రాయబారము
షాఆలము పంపిన రాయబారులు పాదుషాకు సకలవృత్తాంతమును నివేదించిరి. పాదుషా సంతోషించుటకు బదులు మండి పడెను. అంతధనము లూటీ కానిచ్చినందులకు షాఆలము చేతఁ గానివాఁడనియు బుద్ధిహీనుఁ డనియు అఱచెను. తనకుమారుఁడు లూటీలో చాలభాగము దాఁచుకొని కొంతయే తనకుపంపి ద్రోహముచేసియుండునని యనుమానించెను. అందుచే మొగలాయీలు రెండవమారు గోలకొండమీఁదికి దాడివెడలిరి. అక్టోబరునెల 1685 సంవత్సరము షాఆలము మొదట డోబీపేట మీఁదుగా హైదరాబాదునకు పదునాఱుమైళ్లు పడమటినుండి గగౝపహారి పేటకు వచ్చియుండెను. అచ్చటినుండి ఇప్పడు ఘోషామహలు నగరునకుపోయి కోటకుచెంత తానాషాయొక్క ఉద్యానవనమును ఆక్రమించెను. కొన్ని దినములవఱకు అక్కన్న మాదన్న తానాషాలు రాజకుమారునితో రాయబారములు జరుపుచుండిరి. పాదుషా కోరినదెల్ల తాముచేయుటకు సంసిద్ధుల మని తెలుపుచుండిరి. పాదుషా సంధినిబంధనలలో దేశభాగమును డబ్బునుగాక పైపెచ్చు అక్కన్న మాదన్నలను తొలఁగించుట ప్రధానభాగ మైనది.
షాఆలము తానాషాప్రార్థనపై గోలకొండనుండి లేచి నలువదియెనిమిదిమైళ్లదూరమున కుహిర్ అను చోటికిపోయి పాదుషా ఆజ్ఞను తానాషా నిర్వహించు నని ఎదురుచూచు చుండెను. ప్రస్తుతము గోలకొండలోనుండిన పరిస్థితులప్రకారము ఈకార్యము తత్క్షణమే సాధ్యముకాదు. అన్నిలక్షలు వెంటనే ఎట్లుదొరకును? రెండవది అక్కన్నమాదన్నలను ఎట్లు తొలఁగించుట? తానాషాహృదయము వారియెడ కృతజ్ఞతా జడమైయుండెను. తమశరీరములు వేఱుగాని హృదయము లొకటేయని ఆమంత్రులును ఆసుల్తానును తలంచియుండిరి. వారియం దేమిదోషము? తానాషా వేదాంతి. రాచకార్యములకును మతమునకు సంబంధము ఆతనికి గోచరింపలేదు. పైగా కుతుబుషాహి (గోలకొండ) రాజ్యములో మహమ్మదీయేతరులు మంత్రులుగా నుండియున్నారు. వారికి రాజభక్తియు దేశభక్తియు లేకపోలేదు. ఇంతవఱకు ద్రోహమొనర్చిన వారందఱు మహమ్మదీయులే. ఈ హిందువులే సుల్తానును వదలక యున్నారు.
అక్కన్న మాదన్నలు సుల్తానును సమీపించిరి. ఆతఁడు పాదుషా రాయబారములోని ఈవాక్యములను వారికి వినిపింప లేదు. కాని ఆమహాత్ముని హృదయమును వారు గ్రహించిరి. వెంటనే తానాషా పాదములకు సాష్టాంగముగా మ్రొక్కి “మహాత్మా, మేము హిందువులము, బ్రాహణోత్తములము. మాగురువులకుతప్ప నమస్కరింపము. తాము మహమ్మదీయు లైనను భగవత్స్వరూపులు. మీవంటి వేదాంతియు పండితుఁడును మా యాంధ్రదేశమును ఎన్నఁడును పాలించియుండఁడని తలంచుచున్నాము, మీగురువులు జగద్గురువులేగాని వేఱు గారు. స్వామీ ఈదేహము నశ్వరము. దీనికై మాకు చింత లేదు. తమసింహాసనమును రాజ్యమును కాపాడుటకు వీని నర్పించుచున్నాము. గ్రహింపుఁడు. మమ్ము పంపివేసిన మేము కాశికో రామేశ్వరమునకో పోయెదము. లేదా మాప్రాణములనే గ్రహింపుఁడు.” అని తానాషా హృదయము కరఁగునట్లు పలికిరి.
తానాషా తటాలున నేడువసాగెను. అంతటిసుల్తాసు, అంతటిదొర, అంతటి వేదాంతి, పండితుఁడు సింహాసనమును వదలి, తన గాంభీర్యమంతయు అదృశ్యముకాఁగా ఆసోదరులను కౌఁగిలించుకొనెను. అబ్దుల్‌రజాకులారీకూడ కన్నీరు వదలెను. కూడనుండిన సర్దారులు పలువురు నేడ్చిరి. అక్కన్న మాదన్నలు నేడ్చిరి. “వలదు, వలదు, అంతపని వలదు. మీ ప్రాణము నాప్రాణము ఒక్కటేగాని వేఱుకావు. మేము ఏదైనను వదలఁగలముగాని మిమ్ముమాత్రము వదలఁజాలము. మీరు లేకపోయిన మాకు ఈసింహాసనమే అక్కరలేదు. ఇదంతయు భగవంతుని లీల” అనిపలికి ఎన్నికష్టములు వచ్చినను మంత్రులను స్నేహితులును వదలరాదని నిశ్చయించుకొనెను. ఆపత్కాలమున ధైర్యము వహింపవలయుననియు, తాము క్రమముగా నుపాయ మాలోచింపఁగలమనియు సోదరులు పలికి సుల్తానును వీడ్కొనిరి.
మిౝహాజ్ అత్తిమత్తరావులు మొగమొగములు చూచుకొనిరి. వారికిని దుఃఖమువచ్చినది కాని అది వేఱుదుఃఖము. తమపన్నాగములు నెఱవేఱుటకుబదులు వీరి స్నేహబంధము దృఢమగుచున్న దేయని వారిదుఃఖము.