Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 13

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౧౩ - కుట్రలు, కుయుక్తులు

ఆకస్మికముగా గోలకొండసైన్యము పాఱిపోవుటకు కారణము చాలగొప్పదై యుండవలయును. అత్తిమత్తరాయడు ఎట్లయినను అక్కన్న మాదన్నలను కడతేర్చునుపాయ మాలోచించుచుండెను. ఇట్లుండఁగా నాతనికి సందుచిక్కెను. షేక్ మిౝహాజ్ ఏకారణముచేతనో అక్కన్నతో వైరమూనియుండెను. మొదటినుండియు అంతఃపురమందలి స్త్రీలకు అక్కన్న మాదన్నలన్న ద్వేషమే. అబ్దుల్లాసుల్తానుభార్యలైన సరోమా జనీసాహెబులకు తానాషామీఁద మొదటనేర్పడిన ద్వేషము ఆతనిమంత్రులమీఁదికి ప్రసరించెను. వీరికి ఈ హిందువులను తొలఁగించి మహమ్మదీయులను మంత్రులుగా నియమించుకొన వలయునను కోర్కెయుండెను.

స్కంథావారమునుండి ప్రతిదినము యుద్ధ మొనరించు చుండిన షేక్‌మిన్హాజునకును నగరిలోనుండు అత్తిమత్తరాయనికిని ఆ పూర్వసువాసినులైన పూర్వరాణులకును ఉత్తరప్రత్యుత్తరములు జరుగుచుండినవి. మీర్ ఇబ్రహీం అను వానిని మొగలాయీలు తమవైపు లాగుటకు ప్రయత్నించుచుండిరి. షేక్‌మిౝహాజ్‌కూడ మొగలాయీలతో చేరుటకు యత్నించుచు ఆవిషయమును పైకితెలియనీయక మెలఁగుచుండెను. రహస్యముగా గోలకొండకు చారులనుపంపి ప్రతిదినము సాయంకాల మగుసరికి గోలకొండఫౌజు ఓడిపోవుటకు కారణము ఇబ్రహీము కార్యశ్రద్ధ వహింపకపోవుటయే యని తానాషాయును మంత్రులును తలంచునట్లు చేయుచుండెను. అట్లే ప్రచారమగుచుండెను. మీరుమహమ్మదు తనమాటలలో, మీర్‌ఇబ్రహీం మొగలాయీలకు అనుకూలుఁ డనునట్లు చెప్పుచుండెను. సుల్తాను మాదన్నను పిలిపించి ఇట్లుండునా యని యడిగెను. మాదన్నకు ఇందు సత్యముతెలియనందున తానేమియు గట్టిగా చెప్పజాలకున్నాననియు విషయము చక్కఁగా తెలిసికొనవలసి యున్నదనియు కాని అట్లుండదనియు బదులిడెను.

గోలకొండలో మీర్ మహమ్మదును అంతఃపురములోని వారును వీరితోచేరినవారును ‘తానాషాసుల్తానును మాదన్నయు కలసి ఇబ్రహీమును ఖైదు చేయనున్నారు’ అని ప్రవాద పుట్టించిరి. ఈమాటలు స్కంధావారమున ఇబ్రహీం చెవిలో పడెను. ఇందులకు దోహదముగా కూడనుండి స్నేహము నటించుచుండిన మిౝహాజు అతనికి అపాయము తప్పదనియు వెంటనే మొగలాయీలకడకు పాఱిపొమ్మనియు తానును శీఘ్రముగ వెనుకవచ్చునట్లును నమ్మించెను. లోకులను మోసముచేయుటకు ప్రత్యక్షముగా నిరువురును ఒకదినము జగడమాడి తటాలున ఆకారణముచేత వెడలిపోయినట్లు ఇబ్రహీము మొగలాయీల కడకు పాఱిపోయెను. అతనిని వారు గౌరవించి ఆఱువేలసైన్యమునకు మన్సబ్దారుగా నియమించి మహబత్‌ఖానను బిరుదమిచ్చిరి.

ఇబ్రహీము పాఱిపోయెనని తెలిసినంతనే మాదన్న మీఁద నాతనిశత్రువులు చాడీలు చెప్ప నారంభించిరి. శత్రుపక్షమునచేరిన మీర్ ఇబ్రహీం మాదన్నకు ఆశ్రితుఁడనియు, ఆతఁడు వంచనచేయఁబోవుట మాదన్నకు ముందుగానే తెలియుననియు, అందుచేతనే ఆనాఁడు తెలిసియు, ఇంకను విచారించుట మంచిదని పల్కెననియు, ఇంక త్వరలోనే మాదన్నయు గోలకొండవారిని మోసముచేసి శత్రువులతో చేరుననియు షేక్ మిౝహాజ్ తానాషాకు చెప్ప నారంభించెను. ఈమాటలను తానాషా నమ్మలేదు. తన చిరకాలమిత్రుఁడును, తనకు విశ్వాసపాత్రుఁడును మహామేథావియు ధర్మబుద్ధియునైన మాదన్న ఈరీతిగానుండఁడని తానాషా గట్టిగాచెప్పి మిౝహాజును నోరెత్తనీయలేదు.

ఇంతలో అంతఃపురమందలి స్త్రీలు తమకు హైదరాబాదు నగరములోనుండిన అపాయమనియు మొగలాయీలు బలవంతులగుటచేత నగరమునువీడి తాము గోలకొండదుర్గమును ప్రవేశించుట మంచిదని మిౝహాజ్ మొదలైనవారి దుర్బోధనలచేత ఆందోళన చేయసాగిరి. మిౝహాజ్ స్వయముగా పోయి తానాషాసుల్తానుతో నిదేరీతిని మాటలాడెను. సుల్తాను మాదన్నతో ఆలోచించెను. మాదన్న దూరదర్శి; ఆప్రకారము చేయరాదనెను. గోలకొండలో చేరుటకన్న ఓరుగంటికో కాక మఱియేదైన దూరప్రదేశమునకో పోవుట మంచిదనియు కోటను శత్రువులు ముట్టడించిన తాము బయట ధారాళముగా తిరుగుచు లోపలివారికి సాయముచేయుచు యుద్ధముచేయుట కవకాశ ముండుననియు హితోపదేశ మొనర్చెను. మిౝహాజ్ యొక్కకుట్ర మాదన్న గ్రహింపలేకపోయెను. ఇదంతయు మాదన్న దురుద్దేశమని మిౝహాజ్ చెప్పసాగెను. సుల్తాను అతనివాక్యములను నమ్మకపోయినను రాణివాసముయొక్క ప్రోద్బలముచేత గోలకొండలో ప్రవేశించెను. ఇది చాలపొరబాటే యైనను మాదన్న ప్రభువాక్యమును మన్నించెను. గోలకొండ పతనములోనిది ప్రథమసోపానము. రాజద్రోహపరంపరలో నిది మొదటివిజయము. ఈ సేనాపతిచేసిన ద్రోహము హైదరాబాదును తలక్రిందులుచేసెను. రాజ్య రక్షణప్రయత్న మంతయు భగ్నమాయెను. ఇంకను చాల సైన్యము సురక్షితముగానున్నను తానాషాకు ఏదో అధైర్య మేర్పడెను. తానుచేసినది సరికాదేమో అని సందేహింప నారంభించెను.

మిౝహాజ్‌యొక్క కుట్రచేత మాదన్నమర్యాద పోలేదుగాని భాగ్యనగరము (హైదరాబాదు) అభాగ్యమాయెను. గోలకొండసైన్యము పాఱిపోవుటయు వెంటనే సుల్తాను నగరమువదలి కోటలో చేరుటయు షాఆలమునకు తెలియుటకు మునుపే ఊరిలో అల్లకల్లోలములు రేఁగినవి. సుల్తాను తనకు సాధ్యమైన వస్తువులు, నగలు, నాణెములు, రత్నములు, రూప్యములు గ్రహించి స్త్రీలతోకూడ కోటకు పాఱిపోయెనని జనులు రచ్చచేయసాగిరి. వర్తకులును సిబ్బందియు వెనుకనుండి కోటలోనికి పరుగిడసాగిరి. సామాన్యగృహస్థులును రక్షణ కొఱకు దిగులుపడసాగిరి. ఎక్కడివా రక్కడ పాఱిపోవుటకు సిద్ధులైరి. సొత్తు, ఇల్లు, వాకిలి ఎట్లుపోయిననేమి, ప్రాణమానము లుండిన చాలునని కొందఱు బంధుమిత్రులతో పరారియైరి. స్త్రీలు బురఖాలు తగిలించుకొనుటకుకూడ అవకాశము లేకపోయెను. ఇంతలో దొంగలు కొల్లగాండ్రు దోపిడీలు మొదలు పెట్టిరి. సుల్తాను కోటలో ప్రవేశించిననాటి రాత్రియంతయు నిట్లే జరిగెను. కొందఱు వీరులు తమశక్తినంతయు వినియోగించి పలువురు జనులను వారి ఆస్తిని కాపాడిరి. మాదన్నయు అక్కన్నయు రూస్తంరావును చాలపాటుపడిరి. మిౝహాజ్ స్వాధీనముననున్న సేన మాదన్నకు సాయపడలేదు.

తెల్లవాఱునప్పటికి మొగలాయీవారిసైన్యము హైదరాబాదునగరమును ప్రవేశించెను; మూలమూలలను సందు గొందులను ప్రవేశించి దోఁచుకొనసాగెను. బంగారము, జవాహరీ, రత్నములు, నగలు, వస్త్రములు, వస్తువులు కొన్ని వందల బండ్లకు దోపిడీ ఆయెను. రత్నకంబళములు గొప్పవి కొనిపోలేక ద్వేషముచేత వానిని కత్తులతో చించి చెండాడిరి. హిందూ మహమ్మదీయస్త్రీలను, బాలురను, బాలికలను చెఱగొనిపోయిరి. వృద్ధులను బలహీనులను నానావిధములుగా హింసించిరి. బలవంతులను కొద్దిమందిని పెక్కురు పరివేష్టించి బాధించిరి. ఇండ్లను తగులఁబెట్టరి. షాఆలము ఎంత ప్రయత్నించియు తనసేనకుపట్టిన యావేశమును మాన్పలేకపోయెను తుదకు సేనయొక్కకొత్వాలును దివానును ఇంక కొందఱుద్యోగులును ఈదోపిడిని ఎట్లో నిలిపించి వారిచేత నింకనుపడనట్టి కొన్ని కార్ఖానాలలోనిద్రవ్యమునుమాత్రము తాము హరించిరి. ఇంతలో తానాషా షాఆలంకడకు రాయబారినిపంపి మన్ననకోరఁగా నాతఁడు దోపిడి గాండ్రను శిక్షించి జనులను కాపాడెను. తగులఁబడుచుండిన యిండ్లను ఆర్పించెను. దాదాఁపు డెబ్బదిలక్షలహొన్నుల విలువ గలవస్తువులు దోపిడిపోఁగా మిగిలినవి షాఆలము చేతఁ జిక్కి నవి. ఎంతకొల్ల పోయినదో! పాదుషాకుమారుఁడు పశ్చాత్తాప పడసాగెను. అతనిది మెత్తనిహృదయము; పాదుషావంటి కర్కశుఁడుగాఁడు. ఏమైనను తానాషా మహమ్మదీయుఁడేగదా యని తలఁచి ఒకకోటియు నిరువదిలక్షలహొన్నుల కప్పము సంవత్సర మొకటింటికి తానాషా కట్టుట కొప్పుకొనునెడల తాను పాదుషాతోచెప్పి మన్నన యిప్పింతుననెను.