అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 12

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౧౨ - మొగలాయీలతో ఘర్షణ

బిజాపురమునకు సాయము చేసినందులకు తానాషా మీఁదికి పాదుషా దండు పంపెనని ముందుప్రకరణమున గ్రహించితిమిగదా. క్రీ. శ. 1680 సం. జూౝనెల 28 తారీఖున తన కుమారుని షాఆలం అనువానిని గొప్పసైన్యముతో హైదరాబాదుమీఁదికి పంపెను. మార్గమున ‘ఇండి’ అను ప్రదేశమున కాపున్నటువంటి ఖానీజహాను అనువానిని రాజకుమారునితో కలసికొనవలసినదని ఆజ్ఞాపించెను. ఈ వ్యూహముచేత బిజాపురమును ముట్టడించు బలములుతగ్గినను తానాషాను దండించుటకు పాదుషా తనసైన్యమును విడదీసెను.

మొగలాయీసైన్యములు భీమానదీతీరమున ఆగ్నేయముగా నడచినవి. గుల్బర్గా షోలాపూరులనడిమి డెబ్బదిమైళ్లు మొగలాయీల స్వాధీనమున నున్నందున సులువుగా నడక సాగెను. తర్వాత మందగించెను. ముందుపోవుసైన్యమును నడపుచు ఖానీజహాను మాల్ఖేడుకోటను సమీపించెను. రాజకుమారుఁడు మూఁడు నాలుగుప్రయాణములు వెనుకఁబడి వచ్చుచుండెను. రెండుసైన్యములకును నడుమ 25 మైళ్ల దూరముండెను. సేనా ముఖరక్షకముగా నొకసైన్యమును నడుపుచు జాౝనిసార్‌ఖాౝ అను నతఁడు ముందుపోవుచుండెను. ఈసైన్యము మాన్యఖేటమునకు తూర్పుగా ఎనిమిదిమైళ్లదూరముననుండు ‘సెడం’ అను ప్రదేశమునకు రాఁగానే గోలకొండవారిసైన్యము, (నలుబదివేలు మొదలు డెబ్బదివేలవఱకు నుండవచ్చును) మొగలాయీలను ఎదుర్కొనెను. గోలకొండవారి సేనాపతులు మీర్‌మహమ్మద్ ఇబ్రహీం, షేక్‌మిౝహాజ్, మాదన్నపంతులుగారి మేనల్లుఁడు రూస్తంరావు అనువారలు. గోలకొండవారి గుఱ్ఱపు దళము మొగలాయీవారిని చుట్టవేసికొనినది. అతికష్టము మీఁద పోరాడి మొగలాయిలు దీనిని జయించినను వారిపురోగమనము భంగమైనది. జాౝనిసార్‌ఖాను మాన్యఖేటమునకు మరలి అచటినుండి యుద్ధముచేయ నారంభించెను. గోలకొండ సైన్యములు తమ యనుకూలములను చూచుకొని అనుదినము శత్రువులను కొట్టుచుండినవి. గోలకొండసైన్యములు గొప్పవగుటచే ఖానీజహాను తన స్కంధావారముచుట్టును ప్రాకారము లేర్పఱచుకొనుచు మాన్యఖేటమునందే యుండి ముట్టడింపఁ బడినవానివలె నాయెను. శత్రువుల నెదుర్కొని యుద్ధము చేయుట కష్టమని ఆతఁడు దుర్గము నిర్మించుకొని ఆత్మరక్షణ ప్రయత్నములు చేయసాగెను. ఒకయడుగైనను ముందునకు సాగుటకు లేకుండెను. తర్వాత కొంతకాలమునకు చక్రవర్తి కుమారుఁడు షాఆలం వచ్చిచేరెను. ఇంతలో యుద్ధతీవ్రత తగ్గెను. తానాషావచ్చి ఢిల్లీపాదుషాకు పాదాక్రాంతుఁ డైన యెడల తా నాయనకుచెప్పి తానాషాను క్షమింపింతునని షాఆలం రాయబారము పంపెను. విజయము తమదైయుండుటచే ఈమాటలను తెలంగాణమువారు పరిహసించి తిరస్కరించి వేసిరి. ఉత్తరప్రత్యుత్తరములతో కొంత కాలము గడచెను.

మొగలాయీలు మాన్యఖేటమున తమ సామానులను చేర్చుకొని తమ సేనాముఖమును ఖానీజహాను నేతృత్వమున హైదరాబాదునకు మార్గము కనిపట్టుటకు పంపిరి. ఈసైన్యమునకు మూఁడింతలసైన్యమువచ్చి ఎదుర్కొనెను. మొగలుసైన్యములో హిమ్మత్‌ఖాను, సయ్యద్ అబ్దుల్లాఖాౝ అను వారల క్రింద సైన్యములు మొండిపట్టుపట్టి పోరాడుచు ప్రతిదినము సాయంకాల మగుసరికి గోలకొండవారిని జయించుచుండినవి.
గోలకొండసైన్యములో బారిఖాౝ అనువాఁడు, తుపాకితో గుఱిగాకొట్టినట్లు ఱాతితోకొట్టు నేర్పుగలవాఁడు, ఖానీజహానును ఎదుర్కొనెను. కాని ఎచటనుండియో శత్రువులు కొట్టిన బాణమునకు కూలిపోయెను. ఒకపర్యాయము మొగలాయీవారు తామోడిపోవుటకు సిద్ధముగానుండు సమయమున రాజా రామసింగ్ అనువాని యేనుఁగును ఉసికొల్పి శత్రువుల నడిమికి త్రోలిరి. అది తనదంతములకు కట్టియుండిన మూఁడుమణుగుల బరువుగల ఇనుపగొలుసును ఇటునటుకొట్టుచు పరుగిడి తటాలున రాఁగా గోలకొండవారి గుఱ్ఱములు బెదరి రౌతులనుత్రోసి చిందరవందరగా పాఱిపోయినవి. మొగలాయీవారికి జయమబ్బినది. ఈవిధముగా ఒక్కొక్కయుద్ధముచేతను వారిపురోగమనము మూఁడు నాలుగుదినములు ఆలస్యమగుచు వచ్చినది.

ఇంతలో ఆగస్టునెల వచ్చెను. ఎడతెంపులేని వానలచేత మొగలాయీలు కష్టపడఁజొచ్చిరి. వారిగమనము చాల మందగించినది. ఇంతలో గోలకొండవారు ఆయత్తపడఁజొచ్చిరి. మాదన్నపంతులుగారి సొంత గుఱ్ఱపుదండు, పదివేలస్తోమము వచ్చి యుద్ధరంగమును ప్రవేశించెను. జాౝనిసార్‌ఖాను సెడంలోని మట్టికోటలో చేరఁగా గోలకొండఫౌజు వారిని ముట్టడించినదిగాని మొగలాయీలు ధైర్యముగా కోటను కాపాడుకొనిరి. ఈ నిత్యయుద్ధములలో ఇరుపక్షములలోను లెక్కలేనివారు చనిపోవుచుండిరి. మొగలాయీలకు దినమంతయు ఘోరముగా పోరాడినందున సాయంకాలమునకు జయమబ్బినను అలసి పోయియుండినందున శత్రువును వెన్నంటుటకు సాధ్యపడనందున ఫలవంతము కాఁజాలకుండెను. మీఁదుమిక్కిలి మొగలాయీ దండనాయకులలో ఐకమత్యము లేకుండెను. రాజకుమారుఁడు చాల మృదుస్వభావుఁ డైనందున వీరిజగడములు పెరుగుచుండినవి. మొగలాయీసైనికులకు ధైర్యము పోసాగినది. తుదకు యుద్ధము నిలిపి విశ్రాంతి నందసాగిరి. గోలకొండ సైనికులును చెంతనేయుండి అప్పుడప్పుడు రాత్రులు మొగలాయీస్కంధావారములోనికి అగ్నిబాణములను ప్రయోగించుచుండిరి.

ఇట్లుండఁగా పాదుషా తనకుమారుని అదలించుచు ఒక రాయబారిని పంపెను. అంత, మరల యుద్ధ మారంభమాయెను. ఒకదినము సూర్యాస్తమయమునకు షేక్‌మిౝహాజ్ రూస్తము రావులకు గాయములు తగిలినవి. వెంటనే గోలకొండసైన్యము వెనుదిరిగెను. ఇప్పుడు ఇరువాగులును హైదరాబాదును సమీపించినవి, మఱునాటి యుదయము మొగలాయీవారు విచారణచేయఁగా గోలకొండసైన్యము హైదరాబాదునకు పాఱిపోయెనని తెలిసినది.