అంటువ్యాధులు/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1

అంటు వ్యాధులు.


మొదటి ప్రకరణము


అంటువ్యాధు లెవ్వి?

మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్టురోగము అనగా కుష్ఠువ్యాధి, సుఖ రోగములు మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి అంటుకొనునని సామాన్యముగా మన మందరము వినుచుండు విషయమే. కాని స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అనేక మంది కొక్కసారి మిక్కిలి వేగముతో వచ్చి ఒకరి నుండి మరియొకరి కంటు తమ స్వభావమును ఎల్లరకును వెలిబుచ్చును. మరి కొన్ని వ్వాధులు ఇంత కంటే తక్కువ తీవ్రమైనవై తమ చుట్టు నుండు వారలనెల్ల నంటుకొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే అంటుకొనును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయవ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో నందరకు వచ్చుట లేదు. ఈ కారణముల చేత నీ వాధులు కొందరను విడిచివేసి యితరులను పీడించునో ముందు తెలిసికొన గలరు. ఇట్లందరకు అంటకపోవుటచేత వాని కంటుకొను స్వభావమున్నదో లేదోయని కొందరు సందేహపడుదురు. 2.

ఇదిగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులు ఇతరుల కంటిన తరువాత కొన్ని నిమిషములలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరికొన్ని వ్యాధులంటిన తరువాత వాని లక్షణములు బయలుపడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణములను బట్టి కూడ నీవ్యాధులు అంటువ్యాధులని ప్రజలు తెలిసికొనుట కంతగా వీలు లేదు.

అంటువ్యాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యేవి అంటువ్యాధులో యేవి కావో శోధకులు గ్రహింపగలరు. అంటువ్యాధులను వ్యాపింపజేయు విత్తనములు చెట్ల విత్తనముల బోలి యుండును. సెనగమొక్కలు గింజనుండి మరునాటికే మొలచును. తాటి మొక్కలు చాల దినములకు గాని బయట పడవు. ఇట్లే అంటు వాధుల విత్తనములు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతిభేదములను బట్టి ఆయా వ్యాధులు బయట పడుటకు వేరువేరు కాలములు పట్టును. అంటువ్యాధుల కన్నిటికి ఒక్కొక్క వ్యాధిని వ్వాపింప చేయుటకు ఒక్కొక్క జాతి విత్తనము కలదు. వృక్షములలో వేపచెట్టు, మర్రిచెట్టు రావిచెట్టు, చింతచెట్టు, మొదలగు చెట్లకు ఒక్కొక్క చెట్టునకు ఒక్కొక్క జాతి విత్తనములు పుట్టి అవి పోయి వేరొక చోట మొలచి ఆయాజాతి చెట్లను ఎట్లు వృద్ధి చేయునో, అట్లే అంటువ్యాధులను తమ తమ విత్తనముల మూలమున వ్యాప్తిని జెందును. ఒక వ్యాధిని కలుగజేయు విత్తనము ఒక రోగి నుండి పుట్టి, అది క్రింద వివరింప బోవు నేదో యొక విధమూ మరియొక మానవుని శరీరములో జేరి తిరిగి అక్కడ పెరుగుచు అదే వ్యాధిని కలుగ జేయును. అనగా కలరా రోగి నుండి పుట్టిన విత్తనములు మరియొక మానవునికి శరీరములో జేరి కలరావ్యాధినే కలిగించును. ఇట్లే మశూచక విత్తనములు ఎప్పుడును మశూకమునే కలిగించును కాని మరియొక వ్యాధిని కలిగింప నేరవు. మామిడి టెంకను పాతి పెట్టిన చింత చెట్టు మొలచునా?

పైని చెప్పబడిన అంటువ్యాధులను కలిగించు విత్తనములు మిక్కిలి సూక్ష్మమైన పరిమాణము గలవగుట చేత వానికి సూక్ష్మజీవులని పేరు. కావున సూక్ష్మజీవుల మూలమున గలుగు వ్వాధులన్నియు అంటువ్యాధులని గ్రహింపవలెను.

ఒక వ్వాధి అంటువ్యాధి యగునా కాదా అని తెలిసికొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింపవలెను.

1. ఒక వ్వాధిని పుట్టించు సూక్ష్మజీవులు అదే వ్యాధి గల రోగులందరి శరీరములయందును కనబడవలెను.

2. ఇట్లు కనిపెట్టబడిన సూక్ష్మజీవులను మనము ప్రత్యేకముగ తీసి సాధారణముగా సూక్ష్మజీవులు తిను ఆహారము వానికి పెట్టి పెంచినయెడల అవి తిరిగి పెరగ వలెను.

3. ఇట్లు పెంచిన సూక్ష్మజీవులను వేరుపరచి వానిని సౌక్యముగ నున్న ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ సూక్ష్మజీవులు క్రొత్త వాని శరీరములో మొదటి రోగి కుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను. 4. ఈ ప్రకారము వ్యాధిని పొందిన రోగి యొక్క శరీరములో ఈ సూక్ష్మజీవులను తిరిగి మనము కనిపెట్టవలెను.

5. ఈ సూక్ష్మజీవులు తిరిగి మరియొకనికి ఇదే వ్యాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

ఈ శోధనలన్నియు మానవులపట్ల చేయుట కొక్కొకచో హానికరము కావున సాధరణముగ ఒక వ్వాధి ఇతరులకు వ్యాపించునా లేదా ని తెలిసికొనవలసి వచ్చినప్పుడు మానవునకు మిక్కిలి దగ్గర కుంటుంబములో చేరిన కోతులకు ఆవ్వాధుల నంటించి శోధనలు చేయుదురు. పైని చెప్పిన శోధన ప్రకారము కలరా మొదలగు అంటువ్యాధు లన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్ఠువ్యాధి విషయములో మాత్ర మీ శోధనలు పూర్తికాలేదు. కుష్ఠువ్వాధిగల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మజీవులుండును గాని, ఇవి క్రొత్తవారల కంటించి నప్పుడు వారికి ఈ వ్యాధి తప్పక అంటునట్లు శోధనలవలన తేలలేదు. బహుశః కుష్ఠువ్యాధి సూక్ష్మజీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్వాధి లక్షణములు బయలుపడు వరకు పట్ట కాలము అనగా అంతర్గత కాలము అనేక సంవత్సరములే గాక రెండు మూడు తరములు కూడా వుండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్వాధుల విషయములో మధ్య మధ్య కొన్ని విషయములు తెలియకపోవు చేత నవి అంటువ్యాధులగునో కావో అను సందేహములున్నవి.