అంటువ్యాధులు/పీఠిక
పీఠిక
అంటువ్యాధులను గూర్చిన ఈ గ్రంథములోని ఇంచుమించు అన్నివిషయములను ఆంధ్రవిజ్ఞాన సర్వస్వమునకొక వ్యాసముగా వ్రాసియుంటిని. ఇపు డనేకులు దీనినొక ప్రత్యేక గ్రంథముగా ప్రకటించిన మిక్కిలి యుపయోగముగా నుండునని వ్రాసియున్నందున సర్వస్వము వారి అనుమతిమీద దీనినిట్లు సంపుటముగా ముద్రింపించితిని.
ఇందిపుడు ‘కలరా,’ ‘సన్నిపాతజ్వరము,’ గ్రహణి విరేచనములు,’ ‘మశూచకము,’ ‘తట్టమ్మ (పొంగు)’ ‘ ఆటలమ్మ,’ ‘కోరింతదగ్గు,’ ‘గవదలు,’ ‘డెంగ్యూజ్వరము,’ ఇౝప్లూఇంజా,’ ‘న్యూమోనియా,’ ‘పచ్చసెగ,’ ‘కొరకు,’ ‘అడ్డగర్రలు,’ ‘తామర,’ ‘శోభి,’ ‘గజ్జి’ మొదలగు వ్యాధులను గూర్చి విపులముగా ఏబదిపుటలవరకువ్రాసి పెంచియున్నాను.
జనసామాన్యమునకు సుభోధక మగుటకు గాను శాస్త్ర సంబంధమైన విషయములనుగూడ సాధ్యమైనంత సులభశైలిని వ్రాసియుంటిని. ఒకేవిషయమును గూర్చి రెండుమూడు ప్రదేశముల, మరింత బాగుగా మనస్సున నాటుటకుగాను, వివరించి యుంటిని. ఇట్టి పునరు క్తిదోషమును మన్నింతురుగాక. ఈగ్రంథమునందు అంటువ్యాధుల వ్యాపకమును, నివారించు మార్గములను మాత్రమే వ్రాసియుంటినికాని, చికిత్సను గూర్చిగాని ఆయావ్యాధులలక్షణములను గూర్చిగాని వివరించి యుండలేదు. ‘అడుసుద్రొక్కనేల? కాలు గడుగనేల?’ అనునట్లు వ్యాధివచ్చిన తరువాత చికిత్స చేసికొనుటకంటె వ్యాధి రాకుండ జేసికొను ప్రయత్నములనేర్పుట ఈగ్రంథముయొక్క ఉద్దేశ్యము.
ఆంధ్రభాషను జదువనేర్చిన వారందఱును దీనినొక్క సారి పఠించి లాభమునుబొంది నన్ను కృతార్థుని జేయవలయునని మిక్కిలి ప్రార్థించుచున్నాను.
- చింతాద్రిపేట, ఇట్లు,
౧౨-వ తేది ఆగష్టు ౧౯౧౫ ఆచంట. లక్ష్మీపతి.