హైందవ స్వరాజ్యము/పదునాఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాఱవ ప్రకరణము.


పశుబలము.

చదువరి: ఇది నవీనసిద్ధాంతము. భయముమై యిచ్చినది మరల పుచ్చుకొందురా? ఒకపర్యాయమిచ్చినది ఎవరైనను. మరల్చుకొందురా.

సంపా: అటనవలదు. సిపాయిల తిరుగుబాటుకు తరువాత 1857 సంవత్సరపు వరదానపత్రము ప్రకటితమయ్యెను. శాంతి నెలకొల్పుటకుగా నీపని జరిగినది. శాంతినెలకొని ప్రజలు చల్లబడినపిదప ఆవరదానపువర్గము తగ్గినది. నేను దొంగనను కొందము. భయము కలదని తోచినప్పుడు దొంగిలించుట మానివేయుదును. ఆభయముతొలగెనా మరల నాపనిని ప్రారంభింతును. ఇది లోకస్వభావము. పశుబలము వినియోగించిననే ఏపనినైనను చేయించవచ్చునని తలంపుగొనినాము. కాబట్టి పశుబలము నుపయోగించుచున్నాము.

చదువరి: మీమాటలకు మీరే విఘాతము కలిగించుకొనుచున్నారే. ఇంగ్లీషువారు తమదేశములో సంపాదించినది పశుబలముచేతనే సంపాదించినారు. వారు గడించినది వ్యర్ధమని మీరు వాదించుట నాకు జ్ఞాపకమున్నది కాని అది నావాదమును విఘాతము చేయజాలదు. వారికి వ్యర్థపదార్థములపై ఆశయుండినది. వానిని గడించినారు. వారి ఆశాపూర్తియై నదనుటయే నాకవసరము. వారేమియుపాయములు వినియోగించిన నేమిపోయె? మన యాదర్శము ఉత్తమము ? దానిని చేరుటకు ఏయుపాయములైనను మనము ఉపయోగింపవచ్చును పశుబలముకూడ వినియోగార్హ మే. ఇంటిలో దొంగ దూరినప్పుడు వానిని తరుముటకు సాధనము లాలోచించుచు కూర్చొను వెర్రివారుందురా ? ఎట్లైనను అతనిని వెడలగొట్టుట కార్యము. మనవులు పెట్టుకొనుటచేత మన కేమియు ఫలము కలుగ లేదనియు కలుగపోదనియు మీ రంగీకరించుట స్పష్టము. అప్పుడు పశుబల ముపయోగించి యేల ఫలమందరాదు, సంపాదించినది నిలుపుకొనుటకుకూడ అవసరమైనంతవరకు ఆ సాధనమునే ప్రయోగార్హముగా పెట్టుకొందము. శిశువు అగ్నిలో కాలుపెట్టకుండ నిరంతరము నిర్బంధించుట సరియందురా కాదా ? ఎట్లైనను మనయుద్దేశముల సాధించుట యుత్తమము.

సంపా: మీవాదము పై చూపునకు బాగుగదోచును. ఇది యనేకుల నిదివరలో మోసపుచ్చినది. అయిన నేనితరులకంటె బాగుగా నెరుంగుదురు. కావున మీమోహమును తీర్చుటకు ప్రయత్నింతును. ఇంగ్లీషువారు పశుబలముమూలకముగా నుద్దే శముల దీర్చికొనిరి కాన మనమును అట్లు చేయుట న్యాయ మనువాదమును మొదట నాలోచింతము. వారు పశుబల ప్రయోగముచేసి యుండుట నిశ్చయము. మనమును అట్టి సాధనమునే వినియోగింపనగుననుటయు సంభావ్యమే. కాని మనకు అట్టి సాధనముచే అట్టిఫలమే సిద్ధించుననుట ! స్పష్టము. అట్టి ఫలము మనకు వలదని మీరంగీకరింతురుగదా! సాధనమునకు ఫలమునకు సంబంధములేదను మీయభిప్రాయము తప్పు. ఆతప్పుచేయుటచే దేశాభిమానులైన మహాపురుషులుకూడ మహానర్థములను లోకమున కల్పించినారు. విషబీజము నాటి సుందరమగు గులాబిపుష్పమును సృష్టింతుమని మీరు ప్రారంభించినారు. సముద్రముదాటుటకు నావయే యవసరము. బండి మీద ప్రయాణమైతిమా మనతోకూడ బండియు మునుగును. 'యథా రాజా తథా ప్రజా!' అనునది మననముచేయదగినది.దీని యర్థమెరుంగకమానవుడుపలుపాట్లపడినాడు. సాధనముబీజము, ఆదర్శము వృక్షము. బీజమునకు వృక్షమునకుగల అవార్యసంబంధమే సాధనమునకు ఆదర్శమునకు గలదు. దైవభక్తివలన కలుగుఫలము శనిభక్తివలన నెప్పుడును కలుగదు. కాబట్టి ఎవ్వరైనను నేను దైవమునారాధింపవలెను. కాని శనినారాధించి దైవము నారాధించినట్లనుకొందును' అందు రేని ఆది అజ్ఞానమని యందరును పరిహసింతురు. ఏవిత్తనమున కాఫలము తప్పదు. ఇంగ్లీషువారు పశుబలము ప్రయోగించి 1833లో ఎక్కువ నిర్వచనాధికారము సంపాదించిరి. పశుబలప్రయోగముచే వారిధర్మము వారి కెక్కువయర్థమయ్యెనా ! నిర్వచనాధికారముకోరిరి. పశుబలప్రయోగము చేసిరి. అధికారమలవడెను.అయిన నిశ్చయస్వాతంత్య్రము ధర్మనిర్వహణము వలనకానిరాదు: ఆ స్వాతంత్ర్యమింకను వారికి కలుగ లేదు. కాబట్టి ఇంగ్లండున ఇప్పుడొకనాటక మేర్పడియున్నది. ప్రతివాడును స్వాతంత్య్రములు కోరువాడే. తనధర్మము నెఱింగినవాడు మాత్రమరుదు. ప్రతివాడు స్వాతంత్య్రములు కోరువాడైనప్పుడు ఎవ్వడు ఎవ్వరికి ఇయ్యగలడు? ఇంగ్లీషువారుధర్మము నిర్వహించుటే లేదని కాదు నామతము. వారుకోరు స్వాతంత్య్రముల కనుగుణమగు ధర్మనిర్వహణముమాత్రము మృగ్యము. అది లేక పోవుటచేత, అర్హతగడింపకపోవుట చేత, వారుగడించినస్వాతంత్ర్యములు వారికి మోయరానిభారమగుచున్నవి. అనగా వారు వినియోగించిన సాధనమునకుపూర్ణముగా ననుగుణమగుఫలము వారికి కలిగినది. ఫలమున కనుగుణమగుసాధనము వారు వినియోగించిరి. మీగడియారము నే నపహరింపవలెననినయెడల నేనుమీతోపోరవలెను, కొనవలెననిన మీకు ద్రవ్యమీయ వలెను, దానమడుగవలెనన్న మిముప్రార్థింపవలెను. ఈ యుపాయములలో నేనుపయోగించునుపాయము ననుసరించి ఆగడి యారము దొంగసొత్తో, స్వార్జితమో, దానమో ఆగ చున్నది. ఈ రీతిని మూడువిధములగుసాధనముల చేత మూడువిధములగు ఫలము లేర్పడుచున్నవి. సాధనములతో ఫలమునకు సంబంధము లేదని ఇంకను వాదింతురా?

దొంగను పారదోలవలెనని మీరిచ్చిన యుదాహరణమును విమర్శింతము. ఏసాధనమైనను దొంగను పారదోలునని నేను నమ్మను. మాతండ్రి దొంగలించుటకు వచ్చెను. అతనిని తప్పించుకొనుట కొక యుపాయము వెదకుదును. నాకు తెలిసినవాడు ఆపనికి దూరె ననుకొందము. ఇంకొకవిధమగు సాధనమును వినియోగించుకొందును. ఎవ్వడో సంబంధము లేనివాడు దొంగ. అప్పటియుపాయమే వేరు. తెల్లవాడు దొంగ యైన నల్లవానియెడల నుపయోగించు సాధనముకాక ఇంకొక సాధనము నుపయోగించెదరు కాబోలు మీరు. బలవి హీనుడు, ఒక్కికట్టె దొంగయైనయెడల సమబలునియెడల నుపయోగించు నుపాయమును వినియోగింపబోము. ఆపాద మస్తకము ఆయుధధారి యగునేని కిక్కుమిక్కుమనక యూర కుందుము, ఈవిధముగా దొంగయొక్క స్వభావము ననుసరించి అతని నివారించునూర్గములు మారుచుండును. ఇంతేకాదు. దొంగ నాతండ్రియైనను, ఆపాదమస్తకము ఆయుధములు ధరించిన ఆమోటరియైనను, నేను నిద్రించుట నభినయింతును ఏల, నాతండ్రికూడ సాయుధుడుగా రావచ్చును.నాకు ఇరువుర దౌర్జన్యము ఫలమున నొక్కటే. ఇరువురును నాయాస్తి కొనిపోవువారే. అయిన తండ్రివిషయమగునేని కరుణారసము నేడ్పు కలుగును. మఱియొక్కడేని ఆగ్రహముకలిగి వైర ముత్పన్న మగును. ఇట్టిది చిత్రస్థితి. దీనినంతయు నాలోచింతుమేని సాధనము లిట్టివియే యుపయోగింప నగుననువిషయమున మనమేకీభవింపకపోవచ్చును. ఈయన్ని సందర్భములలో చేయవలసినది నాకు స్పష్టము. కాని నా సాధనము మీకు భయమును కలిగించవచ్చును. కాబట్టి మీకు తెలుపుటకు వెనుదీయుచున్నాను. మీరూహించుకొందురుగాక. అట్లూహకు తట్టదేని వేరువేరుసందర్భములలో వేరువేరుపాయముల చేసికొందురుగాక . ఒక్కటి మీకు విదితము, ఏయుపాయమైన నేమి యని మాత్రము ఉపయోగించుటకు రాదు. ప్రతిసందర్భమునకు ఆను గుణోపొయమునే మీ రాలోచించవలసియుందురు. కాబట్టి ఏయుపాయము చేత నైన వెదలగొట్టుట మీధర్మము కాదనుట స్పష్టము.

ఇంకను నాలోచింతము. ఆపాదమస్తకాయుధుడు మీసొత్తు దొంగిలించినాడు. మీచిత్త మావిషయమున మగ్నమయినది. మీ యాగ్రహ మనంతముగా పెరిగినది. మాస్వలాభమునకు గాక మీ ఇరుగుపొరుగువారి లాభమునకై వానిని మీరు దండింపవలె నందురు సాయుధులకొందరను చేర్చితిరి. పైబడి వానిఇల్లు స్వాధీనముచేసికొన నెంచితిరి. అది యతని కెరుకయైనది. అతడు పారిపోయినాడు. కాని అతని మనస్సున కూడ ఉద్రేకము కల్గినది. తన సోదర చోరబృందమును చేర్చినాడు. పట్టపగటివేళ మిము దోచుకొందునని అట్టహాసముగ సందేశము పంపినాడు. మీరు బలవంతులు. మీకు భయము లేదు. అతని నెదుర్కొనుసాహసము కలదు. ఈలోపుగ నా దొంగ మీ పరిసరవర్తుల పీడించును. వారు మీకడ మొఱ పెట్టుదురు ? మీ రేమందురు. అయ్యలారా అంతయు మీకొరకే చేయుచున్నాను. అతడు నాద్రవ్యము నపహరించినాడని నాకాగ్రహములేదు. అని ప్రత్యుత్తరమిత్తురు. మీ పరిసరవక్తు లందురుగదా 'వీడెప్పుడు మమ్ము హింసింపడు, మీరు వీనితో పోరాటము పెట్టికొనిన పిదపనే యీగతి తటస్థించినది.' ముందుకుపోయిన గోయి వెనుకకు తరలిన చెరువు అయినది. మీ పరిసరవర్తులగు బీదలయెడ మీ కెక్కు.వకరుణ. వారు చెప్పునది నిజము. మీకు తెలుసును. మీరేమి చేయవలెను ? దొంగను వదలితిరా మీకు నవమానము. కాబట్టి బీదల మీ రేమందురు ? "అయ్యలారా రండు. నాద్రవ్యముమీది. నేను మీకు ఆయుధముల నిచ్చెద. ఆదొంగను మీరు పట్టి తన్నుడు వదలవలదు ఈరీతిగా పోరాటము పెరుగును. దొంగలు సంఖ్యాతీతులగుదురు. మీపరిసరజనము అననసరముగా అనాను కూలముల బడుదురు. ఈకారణముచేత దొంగమీద కసిదీర్చు కొననెంచి మీశాంతికే మీరు భంగము తెచ్చికొనినారు. ఎప్పుడు దోపిడికలుగునో ఎప్పుడు శత్రువు పైబడునో అనుభయము మీకు శాశ్వతమై పోయినది. మీ ధైర్యము అధైర్యముగా పరిణమించినది. నావాదమంతయు జాగ్రత్తగా ఆలోచింపుడు. నేవిపరీత మేమియు వర్ణింపలేదనుట మీ కె గోచరమగును. ఇది మొదటిసాధనము సంగతి. రెండవసాధనము నాలోచింతము. ఆపాదమస్త కాయుధుడైనదొంగ జ్ఞానవిహీనుడగుసోదరు డని గుర్తెరుగుదు రేని సరియైన తరుణమున ఆతనికి సంగతులు స్పష్టపరుప నిశ్చయింతురు. ఎట్లైనను సోదర మానవుడుకదా యని జాలిగొందురు. ఎందు కతడు దొంగలింపబయలు దేరినాడో ఊహింపజొత్తురు. అంతట సమయ మయినప్పు డీతనిదొంగ గుణము నశింప జేతును గాక యని తీర్మానించుకొందురు. మీ రీయాలోచనలలోనుండగనే అతడు మరల దొంగలించుటకు వచ్చును. మీరు నానిని కోపపడరు. వానిపై జాలిగొందురు. ఈదొంగగుణము వానికి నంటిన రోగమని మీ రెన్నుదురు నాటినుండి మీరు తలుపులు, కిటికీలు తెరచిపెట్టుదురు. మీరు పరుండుతావు మార్చి మీసొత్తు అతనికి సులభముగా దొరకునట్లుగా పెట్టియుంతురు. మరల దొంగ వచ్చినాడు. పరిస్థితి యంతయు క్రొత్త యయినది. అతనికి విభ్రమము తోచినది. అయిన మీవస్తువులమాత్ర మెత్తుకొనిపోయినాడు. అతనిమానస మూరకయుండునా? ఆందోళన కాకర మగును. గ్రామములో మిమ్మునుగురించి అతడు విచారణ ప్రారంభము చేయును. అందరును విశాలము ఉదారము నగుమీహృదయమును ప్రశంసింతురు. అతనికి ఖేదము తప్పదు. మీపాదముల బడినాడు. మీ మన్ననను వేడినాడు, మీవస్తువుల మీ కిడినాడు, దొంగగుణమును మానినాడు, మీ సేవకు డైనాడు, గౌరవాస్పదవృత్తి నందినాడు. ఇది రెండవరీతి సాధనము. సాధనగుణమునుబట్టి ఫల గుణమును మారిన దనుట విదితము. ఇందువలన అందరు దొంగ లిట్లే నడుతు రనిగాని అందరకును మీకుగల కరుణార్ద్రహృదయమే కలుగు ననిగాని చెప్పరా లేదు. మంచి మార్గ మవలంబించిన మంచిఫలము సాధ్య మనుట కిది తార్కాణముగ చెప్పితిని. శాంతిమార్గ మనేక సందర్భముల ఫల ప్రదము. ఫలప్రదము కానప్పుడు నష్టదాయకము కాదు. పశుబలప్రయోగమున నష్ట మున్న దికాని ఇందు లేదు.

అర్జీలు పెట్టుకొనుఆచార మాలోచింతము. బలాధారము లేనిఅర్జీ వ్యర్థ మనుట నిత్యము. అయినను కీర్తి శేషులైన రనడే గారు. అర్జీలవలన ప్రజలవిజ్ఞాన మభివృద్ధి యగుఫల మున్నది కావున అవి ఆరీతిని ఉపయోగకరము లనిచెప్పిరి. వానివలన ప్రజలమతము యొక్క నిజస్థితి తెలియగలదు. పరిపాలకులకు హుషారు కాగలదు.. ఇట్లాలోచించినయెడల ఒక వేళ అర్జీలు వ్యర్థములు కావేమో. . సమానుడు పెట్టుకొను. అర్జీమర్యా దను సూచించును. దాసుడు పెట్టుకొనుఅర్జీ వానిదాస్యమును ప్రకటించును. బల మాధారముగాగల అర్జీ సమానునిది. అతడు అర్జీమూలకముగా స్వాతంత్ర్యముకోరుట అతని హృదయగౌరవమునకు నిదర్శనము. అర్జీల కాధారము రెండు విధము లగుబలము కావచ్చును. "ఇది ఈయవేని మేము మీకు చెరుపు చేయుదుము ” అనుట యొకరీతి. పశుబలము దీని కాధారము. దీని దుష్టఫలము లిదివర కే వర్ణితములు. రెండవవిధ మిట్లు పేర్కొననగును. "మాయుద్దేశముల నెరవేర్చ లేని ఇక మీ కర్జీలు మేము పెట్టము. మేము పరిపాలితులముగా నున్నంతకాలము మీరు మమ్ము పరిపాలించగలరు. ఇకముందు మేము మీతో సంబంధము పెట్టుకొనము ” ఇందు కాధార మగుబలము ప్రేమబల మనవచ్చును. ఆత్మబల మనవచ్చును. లేదా సామాన్యముగా వ్యవహరింపబడురీతిని సాత్త్వికనిరోధ మనవచ్చును. ఇది అంత సరియైనపదము కాదు. ఈబలముమాత్రము నశ్వరము. దీనిని పూర్ణముగా ప్రయోగింపగలవాడు తనస్థితి కెప్పుడును వగవడు. ప్రాతలోకోక్తి యొక్కటికలదు. దానియర్థ మిది. ఒక్క-నహి ముప్పది మూడు రోగముల కుదుర్చును. ఈప్రేమ బలమునకు అథవా ఆత్మబలమునకు ఎదురుపడినప్పుడు పశుబలము వ్యర్థము. కడపటనిచ్చిన యుదాహరణమును విమర్శింతము. అదెద్ది ? శిశువు అగ్నిలో కాలిడుట మాన్పు టెట్లు అనునది. మీరు చెప్పినయుపాయము నిజముగా పనికిరాదు. శిశువును మీ రేమిచేయుచున్నారో ఆలచింపుడు. మిమ్మును కాదని తన పశుబలముచే శిశువు అగ్ని నురకగలదేని మీ యుపాయ మాపదను వారింపదు. అప్పుడు మీకు రెం డుపాయములు నిలువయుండును. అది యగ్ని నురుకకుండుటకు మీరు దానిని చంపనైన చంపవలెను లేదా చూచుట కోర్వలేక మీ రైనను చావవలెను. దానిని మీరుచంపరు. మీహృదయము అంత కరుణార్ద్రము కాదేని శిశువునకు ముందుగా మీ రగ్ని నురికి నశింపరు. మీ రేమిచేయుదురు ? చేతగామి శిశువు నగ్ని నురుకనిత్తురు. ఇట్లు మీరు పశుబలము నుపయోగించుట మానివైతురు. మీచేతనైనచో శిశువును అగ్ని నురక కుండ నిర్బంధింతు రే అదియు పశుబలమే. అయిన క్రింది దర్జాకు చేరినది, అని మీరందురేమో, అదికాదు దాని స్వభానము వేరు. మన మింకను నరయవలసియున్నాము,

ఆరీతిని మీరు శిశువును నిర్బంధించుటలో మీరు దాని లాభమునుమాత్ర మాలోచించుచున్నారు. దాని మేలునకై మాత్రమే మీరు అధికారము చేయుచున్నారు. ఇది మరువ రాదు. మీ నిదర్శనము ఇంగ్లీషువారికి సమన్వయము కాజాలదు. ఇంగ్లీషువారిపై పశుబలప్రయోగము చేయునప్పుడు మీ రాలోచించునది మీ మేలుమాత్రమే, మీజాతియొక్క లాభముమాత్రమే. ఇందులో దయకుగాని ప్రేమకుగాని తావులేదు. ఇంగ్లీషువారు చేయుపని చెడ్డది. అందువలన అది అగ్ని. ఇంగ్లీషువారు శిశుపదమున నున్నారు, నే నాశిశువును సంరక్షింతును, ఆ సంరక్షణకై నాదేహ మర్పింతును అందు రేని అది ఇంగ్లీషువారియెడలమాత్ర మనుట గాదు. తప్పు చేయు ప్రతివారియెడల అట్లే చేయుదు ననుట యగును. అంత దయార్ద్రహృదయము మీదియగు నేని మీకు శుభం బగుగాక.


____________