స్మృతికాలపు స్త్రీలు/తృతీయాధ్యాయము

వికీసోర్స్ నుండి

స్మృతికాలపు స్త్రీలు

తృతీయాధ్యాయము

వధూ వరార్హతలు

వథూవరు లిరువురు నొకే వర్ణమునకు చెందినవారుగ నుండవలెనని స్మృతులు తెల్పుచున్నవి.

ఉద్వహే ద్విజో భార్యాం సవర్ణాం

(మను 3-4)

(ద్విజుడు తన వర్ణమునకు జెందిన భార్యను చేసికొనవలెను.)

ద్విజాద్వజవివక్షత లేకుండ గౌతము డిట్లు చెప్పు చున్నాడు.

గృహస్థస్పదృశీం భార్యాం విందేత

(గౌ.ధ. 4-1)

(గృహస్థు కాబోవువాడు సమానవర్ణముగల స్త్రీని చేసికొనవలెను.)

సవర్ణ వివాహము వలన జన్మించిన వారు మాత్రమే సజాతులగుచున్నారు. అనవర్ణ వివాహమువలన జన్మించిన వారట్లు కాక సంకరజాతులవా రగుచున్నారు.

సవర్ణేభ్య స్సవర్ణా సుజాయంతే హిసజాతయ:

(యాజ్ఞ 1-91) (సమానవర్ణుల వలన సమానవర్ణస్త్రీలయందు సమాన వర్ణులు జన్మించుచున్నారు.)

కావున తన వంశమును నిలబెట్టుకొనగోరువా డెల్ల సమానవర్ణములోని స్త్రీని వివాహ మాడవలసి యుండును. పితౄణవిమోచన మను ధర్మ మట్టి పుత్రునివలననే గల్గుచున్నది. ఏలన: సమానవర్ణదంపతులకు జన్మించినవారికే కర్మతోడి సంబంధము.

    సవర్ణా పూర్వశాస్త్ర విహితాయాం యథర్తు
    గచ్ఛత న్తేషాం కర్మభి: సంబంధ:

(ఆ.ధ.సూ.2-13-1)

(సవర్ణయు, పూర్వ మితరునిచే వివాహిత కానట్టియు శాస్త్రీయముగ పొందబడినట్టియు భార్యను ఋతుకాలములో పొందగా కల్గిన సంతానమునకే కర్మతో సంబంధము.)

ఇతరసంతతి యన్ననో బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర జాతులలో దేనిక్రిందకును గూడరాదు. ఆ సంకరజాతుల నామములు గల రెండు సూత్రములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను.

     అనులోమా అనంత రై కాంతద్వ్యంతరా సుజాతా
     స్సవర్ణాం బష్ఠోగ్రనిషాద దౌష్యంద పారశవా:
(గౌ.ధ.సూ.4-15)

     ప్రతిలోమాస్సూతమాగధ యోగపక్షత్తృవైదేహ కచండాలా:
(గౌ.ధ.సూ. 4-17)

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో పై వర్ణపు పురుషులు క్రిందివర్ణపు స్త్రీలను వివాహ మాడుచో నవి యనులోను వివాహములగును. క్రిందివర్ణపు పురుషులు పైవర్ణపు స్త్రీలను వివాహ మాడుచో నా వివాహములకు ప్రతిలోమ వివాహములని పేరు. అనులోమములకంటెను ప్రతిలోమము లెక్కుడు గర్హ్యములు. అనులోమవివాహములు కాముక పక్షములో నంగీకరింపబడినవి. కాని ప్రతిలోమ వివాహములు ధర్మహీనములని స్పష్టముగ చెప్పబడినవి.

ప్రతిలోమాస్తు ధర్మహీనాః

(గౌ.ధ.సూ. 4-24)

అందునను బ్రాహ్మణస్త్రీ శూద్రుని వివాహమాడుట మిక్కిలి దోషము. అట్టి వివాహమువలన జన్మించువాడు చండాలుడని పైన నీయబడిన గౌతమసూత్రములో (4-17) నున్నది. వా డందఱికంటెను పాపిష్ఠుడని చెప్పబడినది.

అంత్యః పాపిష్ఠ:

(గౌ.ధ.సూ. 4-27)

అనులోమ వివాహములు కాముకపక్షములో నంగీకరింపబడిన విధము నించుక పరిశీలింపవలసియున్నది.

కామతస్తుప్రవృత్తానామి మాస్స్యుః క్రమశోవరా:

(మను 3-12)

   శూద్రైవభార్యాశూద్రస్య సాచస్వాచవిశ: సృతే
   తేచస్మాచైవ రాజ్ఞశ్చతాశ్చస్వాచాగ్రజన్మన:
(మను 3-13)

(కామమార్గమున ప్రవర్తించువారికి క్రమముగ నీక్రింద జెప్పబడిన భార్య లుండవచ్చును. శూద్రునకు శూద్రయే భార్య. వైశ్యునికామెయు వైశ్యయు, క్షత్రియునకు నాయిర్వురు క్షత్రియయు, బ్రాహ్మణునకా మువ్వురును బ్రాహ్మణియు నుండదగును.)

ఇందలి క్రమముననుసరించి బ్రాహ్మణ క్షత్రియులకు శూద్రస్త్రీ భార్యయగుట యధమకాముక పక్షముగ తేలుచుండుటచే మనువు వీరిజాతి శ్లోకములో నీ రెండు విధములగు వివాహములను స్పష్టముగ నిషేధించుచున్నాడు.

    సబ్రాహ్మణక్షత్రియయోరాపద్యపి హి తిష్ఠతోః
    కస్మింశ్చిదపి వృత్తాన్తే శూద్రాభార్యోపదిశ్యతే
    హీనజాతి స్త్రియం మోహాదుద్వహన్తోద్విజాతయః
    కులాన్యేవ నయన్త్యాశు ససంతానాని శూద్రతాం
(మను 3-14, 15)

(ఆపత్తులో నున్నపుడుగూడ బ్రాహ్మణ క్షత్రియులకు శూద్రభార్య యెచటను జెప్పబడలేదు. మోహముచే శూద్రస్త్రీవివాహమాడువారు సంతానముతో కూడ తమకులమును శూద్రత్వము నొందించుచున్నారు.)

శూద్రును వివాహమాడినవా డత్రి గౌతముల మతములలోను, సంతానమును గనినవాడు శౌనకుని మతములోను, మనుమలను గనినవాడు భృగుని మతములోను పతితులగుదురని మనువు చెప్పుచున్నాడు.

    శూద్రావేదీపతత్యత్రేరుతధ్యతసయస్యచ
    శౌనకస్యసుతోత్పత్యా తదపత్యతయాభృగో:
(మను 3-16)

ఈ శూద్ర భార్యనుగూర్చి యభిప్రాయ బేధములున్న నవియంగీకరించుచు యాజ్ఞవల్క్యు డిట్లు చెప్పుచున్నాడు.

    యదుత్యతే ద్విజాతీనాం శూద్రాద్దారోప సంగ్రహ:
    నైతన్మమమతం యస్మాత్తత్రాత్మా జాయతేస్వయం
(యాజ్ఞ 1-56)

(శూద్రకులమునుండి భార్యను తీసికొనవచ్చుదని చెప్పబడు నంశము నాకు సమ్మతము కాదు. ఏలన: భార్యయందు తానే పుట్టుచున్నాడు.)

మన ప్రస్తుతాంశము వర్ణములను గుఱించి కాక స్త్రీల వివాహమును గుఱించి మాత్రమే యగుటచే వర్ణాన్తర వివాహ విషయక చర్చ నింతటితో ముగింపవచ్చును.

వధూవర నిర్ణయములో గోత్రప్రవరలు చాల ముఖ్యముగ విచారింపబడవలసి యున్నవి.

    అసపిండాచయామాతురసగోత్రాచయాపితు:
    సాప్రశస్తాద్విజాతీనాం దారకర్మణిమైథునే
(మను3-5)

(తల్లికి సపిండురాలు గానట్టియు, తండ్రికి సగోత్రరాలు కానట్టియు స్త్రీ ద్విజునకు వివాహమునకు ప్రశస్తురాలు.) ఏడు పురుషముల వఱకును సపిండత యుండును గాన మాతృవంశమున నేడుతరములలో జన్మ గల్గిన కన్యను వివాహమాడ రాదని తేలుచున్నది.

మాతృవంశమున నైదు తరముల నియమము చాలునని కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.

మాతృబంధుభ్యశ్చ పంచమాత్

(గౌ.ధ.సూ. 4-5)

(అయిదు తరములలోని మాతృ బంధువులయింటి కన్యను వివాహ మాడరాదు.)

పితృవంశమున నేడు తరముల వఱకును సంబంధము లేని కన్యను చేసికొనవలెనను నియమము కూడ కలదు.

పంచమాత్సప్త పిండాదూర్థ్వం మాతృతః పితృత స్తథా

(యాజ్ఞ 1-54)

పంచమీం మాతృబంధుభ్యః సప్తమీం పితృబంధుభ్యః

(వసి.8-2)

మాతృతః పంచమీం పితృతః సప్తమీం

(లిఖిత 4-1)

మేనత్త మేనమామ బిడ్డలను వివాహ మాడరాదని దీనివలన తేలుచునేయున్నను మనువీ యంశమునీ విధముగ స్పష్టముగ వక్కాణించు చున్నాడు.

    పైతృష్వసేయీం భగినీం స్వస్రీయాం మాతురేవచ
    మాతుశ్చభ్రాతుస్తనయాం గత్వాచాంద్రాయణంచరేత్

    నతాస్తిస్రస్తుభార్యార్థే నోపయేచ్ఛే త్తుబుద్ధిమాన్
    జ్ఞాతిత్వేనానుపేయాస్తా: పతతిహ్యుపయన్నథ:
(మను 11-171, 172)

(మేనత్తమేనమామ కూతులను మేనకోడలిని, పొందినచో సోదరిని పొందినట్లే, అట్టివాడు చాంద్రాయణము చేసికొనవలెను. వారిమువ్వురను వివాహమాడరాదు. ఏలన వారు జ్ఞాతులే. వారిని వివాహమాడువాడు పతితుడగును.)

ఒకే ప్రవరకలవారు గాని కొందఱు ఋషులైనను కలిసినవారుగాని పరస్పరము వివాహము చేసికొనరాదు.

విందేతవిధివద్భార్యామ సమానార్షగోత్రజాం

(లిఖిత 4-1)

(సమానార్షగోత్రములులేని దానిని శాస్త్రీయముగ వివాహమాడవలెను.)

అవివాహ్యా: సగోత్రాస్స్యున్సమాన ప్రవరా స్తథా.

(నార 12-7)

(సమానగోత్రప్రవరలు గలవారు వివాహమాడరాదు.)

సమానవర్ణయై ప్రవరసంబంధములేనిదై యున్నను గూడ నీక్రింది లక్షణములుగల కులమందు జన్మించిన కన్యను వివాహమాడరాదని మనుస్మృతి చెప్పుచున్నది.

     మహాన్త్యపినమృద్ధాని గోజావిధనధాన్యత:
     స్త్రీసంబంధే దశై తాని కులాని పరివర్జయేత్

     హీనక్రియం నిష్పురుషం నిశ్ఛందోరోమశార్శనం
     క్షయ్యామయావ్యపస్మారి శ్విత్రికుష్ఠికులానిచ.
(మను 3-6, 7)

(గోవులు, మేకలు, ధనము, ధాన్యముగల్గి సమృద్ధములై గొప్పవై యున్నను నీ క్రింది పదికులములును స్త్రీసంబంధములో విడిచిపెట్టతగినవి: (1) జాతకర్మాది సంస్కారలోపము గలది (2) పురుషసంతతిలేనిది (3) వేదములు చదువుకొననిది (4) పెద్దరోమములు గలది (5) మూలవ్యాధికలది (6) క్షయవ్యాధికలది (7) అజీర్ణముగలది (8) అవస్మారవ్యాధిగలది (9) బొల్లికలది (10) కుష్టుకలది

సోదరులు లేని కన్యను వివాహమాడరాదను నంశమును 'స్త్రీసంతతి' యను నధ్యాయమున చూచియున్నాము.

ఈ దుర్గుణములు లేక, యితరదుర్గుణములున్నచో నా కులమునుండి కన్యమంచిదైనచో తెచ్చికొనవచ్చును.

స్త్రీరత్నం దుష్కులాదపి

(మను 2-238)

(దుష్కులమునుండినను మంచిస్త్రీనితెచ్చికొనవచ్చును)

దీనినిబట్టి మహాపాతకుని కన్యనైనను చేసికొనవచ్చునని తేలుచున్నది. అట్టికన్యను నివాహమాడుచో నాపూర్వ దినమున నామె నుపవసింపజేయవలెనని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పుచున్నది. కన్యాంసముద్వహేదేషాం సోపవాసామకించనాం

(యాజ్ఞ 1-251)

పతితుని కన్యను వివాహమాడవచ్చు ననుటకు వసిష్టుని యీక్రింది వాక్యమా ధారమని చెప్పవచ్చును.

పతితేకోత్పన్న: పతితో భవతి అన్యత్రస్త్రీయీ:

(వసి. 13-31)

(పతితుని బుట్టినవాడు పతితుడు. కాని స్త్రీసంతతి పతితముకాదు.)

దీనికి హేతువు 'స్త్రీసంతతి' యను ప్రకరణమున జెప్పబడినట్లు స్త్రీయందు పురుషుని యందువలె పిత్రంశము హెచ్చుగ లేకుంటయే యని చెప్పవలెను. ఆపస్తంబుడిదేయంశమును చర్చించుచు పతితుని పుత్రునకుగూడ పతితత్వములేదనినాడు. పతితత్వము పుత్రునకు రాకుండవచ్చునని యాతనివాదము. ఎట్లన:

అంగహీనోపి సాంగంజనయతి.

(ఆ.ధ.సూ. 1-29-11)

(అంగహీనునకు గూడ పూర్ణాంగుడు పుట్టుచున్నాడు గదా!)

హారీతుని వాదము కేవలము దీనికి వ్యతిరేకముగ నున్నది. హారీతుని యభిప్రాయముగ నాపస్తంబుడే యిట్లు చెప్పుచున్నాడు.

దధిధాసి సధర్మా స్త్రీభవతి.

(ఆ.ధ.సూ. 1-29-18) (స్త్రీ దధిస్థాలివంటిది.)

అనగా: పెరుగు మంచిదే యైనను నపవిత్రస్థాలిలో దానినుంచినచో నది యపవిత్రమగునట్లు భార్య మంచి దేయైనను భర్త పతితుడగుచో నామెకును పతిత్వమంటి యామె స్త్రీ సంతతికూడ నపవిత్రమై గ్రహణార్హము కాకపోవునని దీనివలన తేలుచున్నది.

మొత్తముపైన పతితములగు కులములు పరస్పరము వివాహము చేసికొనుట మంచిదని యాపస్తంబుని యభిప్రాయము.

అభిశస్తా:............మిథోవివాహమానాః

(ఆపస్తం. 1-29-8)

(అభిశస్తులు పరస్పరము వివాహములు చేసికొనుచుండ వలెను.)

చాల ధర్మశాస్త్రములలో విడువకుండ చెప్పబడిన వధూలక్షణములు రెండుగలవు: (1) ఆమె కిదివఱలో వివాహమై యుండకూడదు. (2) ఆమె వరునికంటె చిన్నదై యుండవలెను.

అనన్యపూర్వాం యవీయసీం

(గౌతమ 4-1)

(పూర్వ మితరులచే పొందబడని దానిని తనకంటె చిన్న దానిని వివాహమాడవలెను.) అనన్యపూర్వికాం కాంతామసహిడాం యవీయసీం

(యాజ్ఞ. 1-53)

(పూర్వ మితరుని పొందనిదియు, సుందరియు, నసపిండకానిదియు, తనకంటె చిన్నదియునగు స్త్రీని వివాహమాడ వలెను.)

వసిష్ఠుడు 'అనన్యపూర్వాం' అనుటకు మాఱుగ 'అస్పృష్టమైథునాం' (మిథునకర్మ పొందనిదానిని) అని చెప్పియున్నాడు.

అస్పృష్టమైథునామ వరయవీయసీం.

(వసి. 8-1)

సత్ర్పవర్తనయు, సర్వావయవ పరిపూర్ణతయుగూడ వధువునకు ప్రథానములే యని చాలస్మృతులు చెప్పుచున్నవి.

సర్వావయవసంపూర్ణాం నువృత్తాముద్వహేన్నర:

(హారిత 4-2)

(సర్వాయవ సంపూర్ణయై, మంచినడతగల్గి యున్న దానిని వివాహమాడవలెను.)

రోగముగల కన్యను వివాహమాడరాదు.

బంధుశీలలక్షణ సంపన్నా మరోగా ముపయచ్ఛేత.

(ఆప.గృ.సూ 1-19)

(బంధుశీల లక్షణసంపన్నయు నరోగయునగు దానిని వివాహమాడవలెను) వరునకు గూడ నిట్టిలక్షణములే యుండవలెను. కాని యాతడు వేదాధ్యయనము చేసియుండవలెననుట విశేషము.

బంధుశీల లక్షణసంపన్నశ్శ్రుతవానరోగ ఇతివరసంపత్

(ఆ.గృ.సూ 1-2-20)

(బంధుశీల లక్షణసంపన్నుడు నధ్యయనము చేసినవాడు నగుట వరునిలో నుండవలసిన సంపత్తు)

ఆరోగ్యవిషయములో వరుని పుంస్త్వమును పరీక్షించి యది బాగుగనున్నచో కన్యనీయవలెననియు లేనిచో నీయ కూడదనియు నారదుడు చెప్పుచున్నాడు.

    పరీక్ష్య: పురుష: పుంస్త్వేనిజై రేవాంగలక్షణైః
    పుమాంశ్చేదవికల్పేన సకన్యాంలబ్థుమర్హతి.
(నారద 13-8)

(వరుడు తన యంగలక్షణములచేతనే పుంస్త్వవిషయములో పరీక్షింపబడవలెను. అందులోటు లేకున్ననే కన్యను పొందుటకర్హుడు.)

ఇచట నారదుడు పుంస్త్వపరీక్షకు సంబంధించిన వివరములను గొన్నిటి నిచ్చియున్నాడు.

వధూనిర్ణయవిషయమున మఱికొన్ని నియమములు గూడ మనువుచే పేర్కొనబడినవి.

    నోద్వహేత్కపిలాంకన్యాం నాధికాంగీం నరోగిణీం
    నాలోమికాం నాతిలోమాం నవాచాటాం సపింగళాం.
(మను 3-8)

(కపిలవర్ణముగల కేశములుగల్గినదానిని, పెద్దశరీరము గలదానిని, రోమములు హెచ్చుగ గలదానిని, మిక్కిలి మాట్లాడుదానిని, పచ్చనికన్నులు గలదానిని వివాహమాడరాదు.)

ఏకన్యయొక్క యక్కకు వివాహము కాలేదో యట్టి కన్యను వివాహమాడరాదని స్మృతులు చెప్పుచున్నవి. అట్లు వివాహమాడబడిన కన్యతకు 'అగ్రేదిధిషువు' అని పేరు.

    జ్యేష్ఠాయాం యద్యనూఢాయాం
    కన్యాయత్రో హ్యాతేనుజా!
    సాచాగ్రేదిధిషూర్జ్ఞేయా
    పూర్వాచదిధిషూస్మృతా.

(జ్యేష్ఠసోదరి యవివాహితయై యుండగానే కన్య వివాహమాడునో, యాకన్య 'అగ్రేదిధిషు' వని చెప్పబడును. అజ్యేష్ఠసోదరికి దిధిషువని పేరు)

దేవలస్మృతి యీ నిర్వచనము నిచ్చుచున్నదని మాధవాచార్యులు (పరాశరమాధవీయము 4-24 ) చెప్పుచున్నారు. కాని యా దేవలస్మృతి మనకిపుడు లభ్యమగుట లేదు.

అగ్రేదిధిషువును వివాహమాడినవాడు పండ్రెండు దినములు కృచ్ఛ్రములు చేసికొనవలెనని వసిష్ఠస్మృతి చెప్పుచున్నది.

    అగ్రేదిధిషూవతిః కృచ్ఛ్రంద్వాదశ
    రాత్రం చరిత్వానివిశేత తాంచోపయచ్ఛేత్.
(వసిష్ఠ 20-9)

ఇట్టినియమము వరుని విషయములో గూడ గలదు. జ్యేష్ఠునకు వివాహము కాకుండ వివాహమాడువానికి పరివేత్తయని పేరు. అట్టి జ్యేష్ఠునికి పరివిత్తయని పేరు.

    పరివిత్తిః వేరివేత్తాయయాచ పరివిద్యతే
    సర్వేతేనరకం యాన్తిదాతృయాజక పంచమా:
(పరా. 4-25)

(పరివిత్తి, పరివేత్త, యాతని వివాహమాడునది, యాకన్యనిచ్చినవాడు. పురోహితుడు - ఈ యైదుగురును నరకమునకు బోదురు.)

కాని యొక్కొకపుడు పరివేదనము దోషము కాదు.

     కుబ్జవామనషండేషు గద్గదేషుజడేషుచ
     జాత్యంధే బధిరేమూకే నదోషఃపరివేదనే
     పితృవ్యపుత్రస్సాపత్న్యః వరనారీసుత స్తథా
     దారాగ్నిహోత్రసంయోగే నదోష:పరివేదనే.
(పరా. 4-27,28)

(జ్యేష్ఠుడు గూనెవాడు, మరగుజ్జు, షండుడు, వణుకు రోగముగలవాడు, స్తబ్ధుడు, పుట్టుగ్రుడ్డి, చెవిటివాడు, మూగవాడు, పినతండ్రికొడుకు, సవతితల్లికొడుకు, పరస్త్రీవలన జనించినవాడునైనచో కనిష్ఠుడు పరివేదనము చేసికొనుటలో దోషము లేదు.) మఱొకవరునిపై దృష్టినిడుకొనియున్న కన్యను వివాహమాడరాదని నారదస్మృతి చెప్పుచున్నది.

దుష్టాన్యగతభావావాచ కన్యాదోషాః ప్రకీర్తితాః

(నారద 12-88)

(దుష్టమగు నితరగతభావమును గల్గియుండుటకూడ కన్యాదోషములలోనిదే)

వరపక్షము వారన్వేషణమునకు బోయినపుడు నిద్రపోవుచున్న దానిని, నేడ్చుచున్నదానిని, బయటకుబోయిన దానిని వివాహమాడరాదు.

సుప్తాంరుదంతీం నిష్క్రాన్తాం వరణేపరివర్జయేత్.

(ఆ.గృ.సూ 1-3-11)

ఒక కన్యను వివాహమాడుటచేగలుగు లాభాలాభముల విషయమై యొకవిధమగు శకునము చూచుట నాపస్తంబుడు సూచించుచున్నాడు. అదియెట్లన:

(ఆ.గృ.సూ 1-3. 15)

శక్తివిషయేద్రవ్యాణి ప్రతిచ్ఛన్నాన్యుపనిధాయబ్రూయాదుపస్పృశేతి.

(శక్తి ననుసరించి కొన్ని పదార్థములను తెచ్చి వానిని కప్పిపుచ్చి యందేదోయొక దానిని స్పృశింపుమని కన్యతో చెప్పవలెను.

ఆ పదార్థము లేవన:

     నానాబీజాని సగ్‌సృష్టాని వేద్యా: పాగ్‌నూన్
     క్షేత్రాల్లోష్టగ్ శకృచ్ఛ్మశావలోష్టమితి
(ఆ.గృ.సూ. 1-3-16)

(కలిపి యుంచబడిన వివిదములగు గింజలును, యజ్ఞ వేదికలోని ధూళిని పొలమునుండి తేబడిన లోష్టమును, శకృత్తును, శ్మశానమునుండి తేబడిన లోష్టమును.)

పూర్వేషాముపస్పర్శనే యథాలింగమృద్ధి:

(ఆ.గృ.సూ. 1-3-17)

(ఈ పదార్థములలో మొదటినాల్గింటిలో దేనినైన కన్య స్పృశించుచో నామెవలన నామెభర్తకు తదనుగుణమైన వృద్ధివచ్చునట్లు గ్రహింపవలెను)

ఆనగా: ఆమెగింజలను స్పృశించినచో:నామెకు సంతానబాహుళ్యము గల్గుననియు, యజ్ఞవేదికలోని థూళిని స్పృశించుచో నామె భర్తతో గూడి చాలయజ్ఞములను జేయుననియు క్షేత్రలోష్టమును స్పృశించుచో సస్యసమృద్ది గల్గుననియు, శకృత్తును స్పృశించుచో పశుసమృద్ధి గలుగుననియు తెలిసికొనవలెను.

ఉత్తమంచపరిచక్షతే.

(ఆ.గృ.సూ. 1-3-18)

(శ్మశానలోష్టమును పెద్దలు గర్హించుచున్నారు) అనగా: కన్య శ్మశానలోష్టమును స్మృశించుచో నామెయో యామెను వివాహమాడు నాతడో మరణించునని తెలిసికొన వలెను.

కొన్నివిధములైన పేళ్లను గల్గిన కన్యలను వివ్వహ మాడరాదని కూడ చెప్పబడినది.

   నర్క్షవృక్షనదీనామ్నీం నాంశ్యపర్వతనామికాం
   నపక్ష్యహిప్రేష్యనామ్నీం నచభీషణనామికాం.
(మను 3-9)

(నక్షత్రనామము, వృక్షనామము, నదీనామము, పర్వతనామము, పక్షినామము, దాసీనామము, భీషణనామము గలదానిని వివాహమాడరాదు)

    అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగమినీం
    తనులో మకేశదశనాం మృద్వంగేముద్వహేత్ స్త్రీయం
(మను 3-10)

(అంగములలో లోపములేనిదానిని, చక్కనిపేరుగలదానిని, హంస, యేనుగువలె నడచుదానిని, చిన్న రోమ కేశములు, మృదువైన శరీరముగలదానిని వివాహమాడవలెను.)

కన్యానామములో చివఱినుండి రెండవవర్ణము రేఫకాని, లకారముగాని యైయుండకూడదని ఆపస్తంబ గృహ్య సూత్రము చెప్పుచున్నది.

సర్వాశ్చ రేఫలకారో పాంతావరణే పరివర్జయేత్.

(ఆ.గృ.సూ. 1-3-14) అనగా: గౌరీ, శాలీమున్నగు నామములో చివఱివర్ణము 'ఈ' దానికి పూర్వము రేఫల కారములున్నవిగాన యట్టి నామములు నిషిద్ధములు.

వధువుయొక్క యంగసౌష్ఠవాది విషయములో

యస్యాంమనశ్చక్షుపోర్ని బంధస్తస్యామృద్ధిర్నేత రదాద్రియే తేత్యేకే.

(ఆ.గృ.సూ. 1-3-2)

ఎవతెయందు మనస్సు, దృష్టితగుల్కొనునో యామెను వివాహమాడిననే సంపదగల్గునుగాని మఱొక యాలోచన యక్కఱలేదని కొందఱు చెప్పుచున్నారు.

వధూవరుల వయస్సునుగూర్చి పూర్వాధ్యాయమున తగినంత విపులముగ చర్చింపబడినది. కాన నాయంశమీ యధ్యాయమున నెత్తుకొనబడలేదు.


_____________