స్మృతికాలపు స్త్రీలు/చతుర్థాధ్యాయము

వికీసోర్స్ నుండి

స్మృతికాలపు స్త్రీలు

చతుర్థాధ్యాయము

వివాహవిధానము

ఎనిమిది తెఱగులవివాహములు స్మృతులలో పేర్కొనబడినవి. కొన్నిస్మృతులలో షడ్విధవివాహములే చెప్పబడినవి. ఈ వివాహములలో కొన్ని యధర్మ్యములనియు వానిని చేసికొనరాదనియు చెప్పబడినది. వివాహభేదములను ముందుగ పరికించి పిమ్మట నాయావివాహముల ప్రాశస్త్యాప్రాశస్త్యములను పరిశీలింతము.

    బ్రాహ్మోదైవస్తధైవార్షః ప్రాజాపత్యస్తథాసురః
    గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చాష్టమోధమ:
(మను. 3-21)

(బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆనురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము-అని వివాహ మెనిమిదివిధములు)

ఈ యష్టవిధవివాహముల స్వరూపమెట్టిదనిన:

    ఆచ్ఛాద్యచార్చయిత్వాచ శ్రుతిశీలవతే స్వయం
    ఆహూయదానం కన్యాయా బ్రాహ్మెధర్మ్య: ప్రకీర్త్యతే
    యజ్ఞేతువితతే నమ్యగృత్విజేకర్మ కుర్వతే

    ఆలంకృత్య సుతాదానందైవం ధర్మ్యం ప్రచక్షతే
    ఏకంగో మిధునంద్వేవావరా దాదాయధర్మత:
    కన్యాప్రదానం విధివదార్షో ధర్మస్స ఉచ్యతే.
    
    సహోభౌచరతాం ధర్మమితివాచానుభాష్యచ
    కన్యాప్రదానమభ్యర్చ్య ప్రాజాపత్యో విధిఃస్మృతః
    జ్ఞాతిభ్యోద్రవిణం దత్వాకన్యాయై చైవశక్తితః
    కన్యాప్రదానం స్వాచ్ఛంద్యాదాసురోధర్మ ఉచ్యతే
    ఇచ్ఛయాన్యోన్యసంయోగ: కన్యాయాశ్చవరస్యచ
    గాంధర్వస్సతువిజ్ఞేయో మైధున్యః కామ సంభవః
    హత్నాభిత్వాచఛిత్వా చక్రోశన్తీం రుదతీం గృహాత్
    ప్రనహ్యకన్యాహరణం రాక్షసోవిధిరుచ్యతే
    సుప్తాం మత్తాం ప్రమత్తాం వారహోయత్రోపగచ్ఛతి
    సపాపిష్ఠోవివాహానాం పైశాచష్టాష్టమో ధమ:
(మను. 3-27 నుండి 34 వరకు)

(వేదముచదివి చక్కనిశీలము గల్గియున్న వానిని పిలచి వస్త్రాలంకారాదులచే పూజించి యట్లే పూజింపబడిన కన్య నాతనికిచ్చుచో నది బ్రాహ్మవివాహమనబడును. ఇది ధర్మ్య వివాహము యజ్ఞమందు నార్త్విజ్యముచేయువానికి సాలంకృత కన్యాదానము చేయుచో నా వివాహమునకు దైవ వివాహమని పేరు. ఇదియు ధర్మ్యమే. ఒకటికాని రెండుకాని గోమిథునములను యాగాదిసిద్ధికై వరునినుండి తీసికొని విధ్యుక్తముగా కన్యాదానము చేయుచో నార్షవివాహమగును. అదియు ధర్మ్యమే. 'మీ రిరువురును గలసి ధర్మమాచరింపుడు', అని నియమముచేయుచు సాలంకృత కన్యాదానముచేయుచో నా వివాహమునకు ప్రాజాపత్యమని పేరు. మఱొకస్త్రీని వివాహమాడరాదనియే యీ నియమములోని విశేషము. కన్యకును జ్ఞాతులకును శక్తికొలది ధనమునిచ్చి కోరి కన్యను స్వీకరించుచో నది యాసురవివాహమగును. కన్యావరులు కోరుకొని పరస్పరము పొందుట గాంధర్వవివాహము. ఇది మైథునమునకు హితమైనది. కామమువలన బయలుదేరినది. కన్యయొక్క బంధువులనుచంపి, నరికి, కొట్టి యేడ్చుచున్న కన్యను పితృగృహమునుండి బలవంతముగ తీసికొనిపోవుట రాక్షస వివాహమనబడును. నిద్రపోవుచున్న దానిని, నొడలు తెలియకున్న దానిని, పిచ్చిదానిని, నేకాస్తముగ పొందుట పైశాచవివాహము. ఇది వివాహము లన్నిటిలోను పాపిష్ఠము.)

వసిష్ఠస్మృతిప్రాజాపత్య పైశాచములను పేర్కొనలేదు.

బ్రాహ్మదై వఆర్ష గాన్ధర్వక్షాత్రోమానుషశ్చేతి

(వసిష్ఠ. 2-29)

ఇచట 'క్షాత్రము' రాక్షసమను నర్థమున వాడబడినది.

యాంహరన్తి సక్షాత్ర:

(వసిష్ఠ 2-34)

(స్త్రీని హరించి వివాహము చేసికొనుచో నదిక్షాత్రము.) అట్లే 'మానుష' శబ్దము ఆసురార్థమున వాడబడినది.

పణిత్వాధనక్రీతాం సమానుషః

(వసిష్ఠ 2-35)

(స్త్రీని ధనముచే కొని వివాహమాడుచో నదిమానుషమని చెప్పబడును)

ఆపస్తంబ ధర్మసూత్రముకూడ నిట్లే ప్రాజాపత్య పై శాచములను వదలివేసినది.

(ఆ.ధ.సూ. 2-12-2)

ఈ యష్టవిధ వివాహములలోను బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము-అను నాల్గును ధర్మ్యములని గౌతముడు చెప్పుచున్నాడు.

చత్వారోధర్మ్యాః ప్రథమాః

(గౌతమ. 4-14)

(మొదటి నాల్గువివాహములును ధర్మ్యములు)

కొందఱి మతములో గాంధర్వరాక్షసములు గూడ ధర్మ్యములే యని గౌతముడు చెప్పుచున్నాడు.

షడిత్యేకే

(గౌతమ.4-15)

నారదుడు.

     ఏషాంతుధర్మ్యాశ్చత్వారో బ్రాహ్మాద్యాస్సముదాహృతాః
     సాధారణఃస్యాద్గాన్ధర్వస్త్రయోధర్మాస్తతః పరే.
(నారద. 12-44)

(వీనిలో బ్రాహ్మము మున్నగు నాల్గేధర్మ్యములు గాన్ధర్వము సామాన్యము. మిగిలిన మూడును నధర్మ్యములు.)

అని చెప్పినాడు.

బ్రాహ్మణునకు బ్రాహ్మదైవార్ష ప్రాజాపత్యములును క్షత్రియునకు గాంధర్వ రాక్షసములును మంచివని మనువు చెప్పు చున్నాడు.

చతురోబ్రాహ్మణస్యాద్యాన్ ప్రశస్తాన్ కవయోవిదుః

(మను. 3-24)

గాంధర్వోరాక్షసశ్చైవధర్మ్యౌక్షత్రస్యతౌ స్మృతౌ.

(మను 3-26)

లిఖితస్మృతికూడ నిట్లే చెప్పుచున్నది.

     ఏతేధర్మ్యాస్తుచత్వార: పూర్వంవిప్రేప్రకీర్తితాః
     గాంధర్వో రాక్షసశ్చైవ క్షత్రియన్య వ్రశన్యతే.

(లిఖిత 4-3)

గాంధర్వ రాక్షసములలో రాక్షసమే క్షత్రియున కెక్కుడు ప్రశస్తమనియు వైశ్యశూద్రులకు నాసురము ముఖ్యమనియు గూడ మనుస్మృతిలో నొకచోటగలదు.

రాక్షసం క్షత్రియస్యైకమాసురం వైశ్యశూద్రయోః

(మను 3-24)

ఇట మనువు వైశ్య శూద్రులలో కన్యాశుల్క మంగీకరించినాడు. కాని యాతడు స్థలాన్తరమున కన్యాశుల్కమును శూద్రులలో గూడ నిషేధించుచున్నాడు. స్మృతులలోని యంతర్వైరుద్ధ్యములను ప్రక్షిప్తములను ప్రస్తుత గ్రంథమున చర్చించుట సాధ్యముకాదు. కాన నీయంశమిచట చర్చింపబడుటలేదు.

    అదదీతనశూద్రోపి శుల్కందు హితరందదత్
    శుల్కంహిగృహ్ణన్ కురుతేచ్ఛన్నం దుహితృవిక్రయం
(మను 9-98)

(శూద్రుడైనను కుమార్తెనిచ్చుచు శుల్కము తీసికొనరాదు. అట్లు తీసికొనుచో కుమార్తె నమ్మిన వాడగును.)

ధనమిచ్చి కన్యను తెచ్చికొనుట యత్రిసంహితలో నీక్రింది విధముగ నిందింపబడినది:

     క్రియక్రీతాచయాకన్యా పత్నీసానవిధీయతే
     తస్యాంజాతాః సుతాస్తే షాంపితృపిండంనవిద్యతే
(అత్రి 377)

(ధనముచే కొనబడిన స్త్రీ పత్ని కానేరదు. ఆమెయందు జనించినవారికి పిండప్రదానము కూడ నుండదు.)

కన్యాశుల్కమును మనువిట్లు నిందించుచున్నాడు.

    నకన్యాయాః పితావిద్వాన్ గృహ్ణీయాచ్ఛుల్కమణ్వపి
    గృహ్ణంచ్ఛుల్కంహిలో భేనస్యాన్నరో౽ పత్యవిక్రయీ.
(మను. 3-51)

(కన్యయొక్క తండ్రి. తెలిసినవాడగుచో కొంచెమైనను శుల్కమును తీసికొనకూడదు. లోభముచే శుల్కమును తీసికొనుచో సంతానము నమ్ముకొను వాడగుచున్నాడు.) సంతానము నమ్ముకొనుట యుపపాతకములలో చెప్ప బడినది.(అవత్యస్యచవిక్రయః మను 11-61)

అట్లగుచో నార్షవివాహములో కన్యాదాతకు గోమిథున మీయవలెనని యున్నదికదా యది యపత్య విక్రయమగుటచే నార్షవివాహము కూడ గర్హ్యమగుట లేదా యను ప్రశ్న బయలు దేరుచున్నది.

     ఆర్షేగోమిథునం శుల్కంకేచిదా హుర్మృషైవతత్
     అల్పో౽ప్యేవం మహాన్ వా౽పి విక్రయస్తావ దేవ స:
(మను. 3-53)

(ఆర్ష వివాహములోని గోమిధునము కన్యాశుల్కమని కొందఱు చెప్పుచున్నారు. కాని యది యసత్యము, అది శుల్కమే యగుచో నెంత స్వల్పమైనదయినను కన్యా విక్రయమే కావలసివచ్చును. అనగా: అది శుల్కముగాదు. అని తాత్పర్యము)

ఆర్షవివాహ నిర్వచనము చేయుచున్న 'ఏకం గోమిథానం' అను శ్లోకములో 'ధర్మత' అని యుండుటచేతనే కన్యాదాత యీగోమిథునమును ధర్మార్థము తీసికొనుచున్నాడని తేలుచున్నది. ఆధర్మమేమనగా: 'ఆర్షవివాహ సంపత్తి కొఱకవశ్యాచరణీయమైన యాగాది సిద్ధికొఱకు' అని కుల్లూకభట్టు చెప్పుచున్నాడు. కన్య తండ్రికే కాక కన్యకు శుల్కమునిచ్చుట గూడ గర్హ్యమేయని పైననీయబడిన యాసురవివాహ నిర్వచనమునుబట్టి తెలియుచున్నది. వివాహసమయమున కన్యకు వరుడేమైన నిచ్చుచోనది శుల్కము కానేరదు.

వివాహసమయమున పలువురు కన్యకు కాన్కలిచ్చుట స్మృతులవలన తెలియవచ్చుచున్నది. అది "ధనము" అను నధ్యాయమున వివరింపబడును.

కన్యాశుల్కముపట్ల స్మృతుల దృష్టిని చూచితిమి. వరశుల్కముయొక్క వాసనయైనను స్మృతులలో నెచ్చటను కానవచ్చుట లేదు.

"వివాహమెంత ప్రశస్తమైన సంతానమంత ప్రశస్తమైనదగును. వివాహమెంత నింద్యమైన సంతానమంత నింద్యమగును. కావున నింద్య వివాహములను చేసికొనరాదు" అని మనువు చెప్పినాడు.

    అనిందితైః స్త్రీవివాహైరనింద్యా భవతిప్రజా
    నిందితైర్నిందితాన్హణాం తస్మాన్నింద్యా న్ప్రవర్జయేత్
(మను. 3-42)

     త్రిపురుష మార్షాత్
(గౌతమ 4-29)

(ఆర్ష వివాహమువలన మూడు పురుషములు పవిత్రములగును) దశదైవాత్

(గౌతమ 4-20)

(దైవవివాహమువలన పదిపురుషములు పవిత్రములగును)

దశైవప్రాజాపత్యాత్

(గౌతమ. 4-31)

(ప్రాజాపత్య వివాహమువలన పదిపురుషములు పవితములగును)

    దశపూర్వాన్ దశాపరాన్ ఆత్మానంచ
    బ్రాహ్మీపుత్రో బ్రాహ్మీపుతః
(గౌతమ 4-32)

(బ్రాహ్మవివాహమువలన జనించినవాడు పదితరములు క్రిందివారిని పదితరములు పైవారిని తనను పవిత్రులుగ జేయును)

సందిగ్ధస్థితిలో నున్న మనుస్మృతి దక్క మిగిలిన ధర్మశాస్త్రము లనేకములు స్పష్టముగ గాంధర్వరాక్షస పైశాచము లప్రశస్తములని గాని యథర్మ్యములనిగాని చెప్పినట్లు పైన చూచియున్నాము. ధర్మ్యములగు బ్రహ్మాదివివాహము లన్నిటిలోను కన్యాదానము జరుగును. కన్యాదానము చేయుటకు తండ్రియే యర్హుడు. ఆతని యాజ్ఞతోగాని యాతడు లేనపుడుగాని యితరులు కన్యాదానము చేయవలెను.

    పితాదద్యాత్స్వకాం కన్యాం భ్రాతావాసుమతేపితుః
    పితామహోమాతులశ్చసకుల్యా బాస్థవాస్తథా
    మాతాత్వభావే సర్వేషాం ప్రకృతౌ యదివర్తతే
    తస్యామప్రకృతిస్థాయాం దద్యు:కన్యాం ననాభయ:
    యదా తునైవకశ్చి త్స్యాత్కన్యా రాజానమాశ్రయేత్
    అనుజ్ఞయాతస్యవరం ప్రతీత్యవరయేత్స్యయం
(నారద. 12-20, 21,22)

(తండ్రి స్వయముగ కన్యను దానముచేయవలెను. ఆతని యనుమతితో జ్యేష్ఠసోదరుడుగాని తాతగాని, మేనమామగాని స్వకులస్థులుగాని బాంధవులుగాని దానము చేయవలెను. వీరెవరును లేనిచో తల్లి కన్యాదానము చేయవలెను. ఆమె తగినస్థితిలో లేనిచో జ్ఞాతులు దానము చేయవలెను. ఎవ్వరును లేనిచో కన్య రాజునొద్దకు పోవలెను. ఆతని యనుజ్ఞనొంది స్వయముగ వరుని నెన్నుకొనవలెను.)

యాజ్ఞవల్క్య డిట్లు చెప్పుచున్నాడు.

    పితా పితామహో భ్రాతా, సకుల్యోజననీతథా
    కన్యాప్రద: పూర్వనాశే ప్రకృతిస్థ: పర: పర:

(తండ్రి, తాత, భ్రాత, జ్ఞాతి, తల్లి-వీరిలో పై వారు లేనిచో క్రిందివారు కన్యాదానము చేయవలెను.)

(ద్విజులలో కన్యాదాన ముదకపూర్వకముగనే జరుగ వలెను.) అద్భి రేనద్విజాగ్య్రాణాం కన్యాదానం ప్రశస్యతే

(యాజ్ఞ.1-64)

కన్యాదానమైన పిమ్మట కావలసినది పాణిగ్రహణము. సవర్ణవివాహములోనే పాణిగ్రహణ ముండునుగాని యసవర్ణ వివాహములలో నదియుండదు. అందలి విధానములు వేరుగ నుండును.

     ప్రాణిగ్రహణ సంస్కార:సవర్ణాసూపదిశ్యతే
     అసవర్ణాన్వయంజ్ఞేయో విధిరుద్వాహకర్మణి
     శరఃక్షత్రియ యాగ్రాహ్యః ప్రతోదో వైశ్యకన్యయా
     వసనస్యదశాగ్రాహ్యా శూద్రయోత్కృష్ట వేదనే
(మను. 3-35)

(పాణిగ్రహణసంస్కారము సవర్ణస్త్రీల విషయముననే విహితము. అసవర్ణల యందన్ననో యీ క్రింది విధిగలదు. బ్రాహ్మణుడు క్షత్రియను వివాహమాడునపుడాతడు కత్తిని చేతబట్టుకొనవలెను. ఆ కత్తిని వధువుపట్టుకొనవలెను. అట్లే అనులోమ వివాహములో వైశ్యవథువు మునికోలపట్టుకొన వలెను. శూద్రకన్య పై వర్ణములవారి వస్త్రముయొక్క యంచును గ్రహింపవలెను.)

పాణిగ్రహణమునకు పిమ్మట జరుగు ప్రథానతంత్రము సప్తపది. దీనితో వధువు పితృగోత్రమును వీడి భర్తృగోత్రమును ప్రవేశించుచున్నది.

     స్వగోత్రాద్భ్రశ్యతేనారీ ఉద్వాహాత్సప్తమేపదే
     భర్తృగోత్రేణ కర్తవ్యందానం పిండోదకక్రియా
(లిఖిత. 1-27)

(వివాహములో సప్తపదియగుటతోడనే వథువు పితృ గోత్రమునుండి భ్రష్టయగుచున్నది. పిమ్మట దానము, పిండోదక క్రియమున్నగువానిని భర్తృగోత్రముతోనే చేయవలెను)

స్థాలీపాకమైన పిమ్మట మూడుదినములు వధూవరులు బ్రహ్మచర్యము పాటించవలెను. క్రిందపరుండవలెను. చేదు, ఉప్పుగల పదార్థములను తినరాదు.

త్రిరాత్ర ముభయోరధశ్శయ్యా బ్రహ్మచర్యం క్షారలవణ వర్జ నంచ.

(ఆ.గృ.సూ. 3-8-8)

ఇట 'ఉభయో:' అని చెప్పుటచేతను తర్వాతిసూత్రములో 'వారిమధ్యను దండము నుంచవలె'నని చెప్పుటచేతను వధూవరులిరువురు నొకేశయ్యపై పరుండవలెనని స్పష్టమగు చున్నది. కావుననే యీ సూత్రములో బ్రహ్మచర్య నియమనము ముఖ్యమగు చున్నది. వథువు అప్రాప్తవయస్కయైనను వరుడు ప్రా ప్తవయస్కుడగుటచే బ్రహ్మచర్య భంగము గలుగుట కవకాశముండుటచే నది పాటింపబడవలెనని స్పష్టముగ చెప్పబడినది. నాల్గవనాటి తెల్లవారుజామునకు దీక్షముగియును. అపుడు జరుగుహోమము తో వివాహము ముగియును. దానికే శేష హోమమని పేరు. 'ప్రజాపతేనత్వంమే' అను మూడుఋక్కుల నపుడు జపింపవలెను. ఇక మిగిలియున్నది సమావేశనము.ఇది వివాహములో నంతర్భూతమా కాదా యను నంశమును ముందు చూతము. 'ఆరోహోరుమ్' అను ననువాకశేషమును సమావేశనములో జపింపవలెను.

ఉత్తరాస్తిస్రోజపిత్వా శేషగ్ సమావేశనే జపేత్

(ఆ.గృ.సూ. 3-8-10)

పైన తెల్పబడిన కన్యాదానము, పాణిగ్రహణము, సప్తపది, శేషహోమము - అను నాల్గుఘట్టములలో నొక్కొకదాని కొక్కొకప్రాముఖ్యము గలదు. కన్యాదానము వలన వరునకు కన్యపై స్వామ్యము గల్గునని మనువు చెప్పుచున్నాడు. ప్రదానం స్వామ్యకారణం.

పాణిగ్రహణమువలన నామె వరునకు భార్యయగును

పాణిగ్రహణికామంత్రాని యతందారలక్షణం

(మను. 8-227)

(పాణిగ్రహణమంత్రములు భార్యత్వము గల్గించును) ఈ పాణిగ్రహణమువలననే భార్యాభర్తలకు కర్మలలో సహత్వము గల్గును.)

పాణిగ్రహణాద్ధిసహత్వం కర్మసు

(బో.ధ.సూ. 11-14-17) పాణిగ్రహణము వలన గల్గిన భార్యాత్వము సప్తపది వలన స్థిరపడును.

తేషాంనిష్ఠాతులిజ్ఞేయావిద్వద్భిస్సప్తమేపదే.

(మను. 8-217)

శేషహోమముతో వివాహసంస్కారము పూర్తియగును. సప్త పదియైనపిమ్మట వరుడు వధువు నగ్నికి ప్రదక్షిణము చేయించును. వరుడు వధువు నగ్నికి చుట్టును త్రిప్పుట చేతనే వివాహమునకు పరిణయము అను నామము కల్గినది.

గృహ్యసూత్రములలోని క్రమము ననుసరించి స్థాలీపాకాది కర్మకలాపమంతయు వరుని గృహముననే జరుగవలెను.

(ఆ.గృ.సూ. 2-5-23)

మద్రచితమైన "వేదకాలపుస్త్రీలు" అను గ్రంథమున సూర్యాసోముల వివాహవర్ణనావసరమున వివరింపబడిన వైవాహికమంత్రములే గృహ్యసూత్రములలో గూడ విధింపబడినవి గాన వాని నిట మఱల వివరించుట పునరుక్తియగు నను నూహతో నవి యిట వదలివేయబడినవి.

వివాహమునకు పూర్వము జరుగు సంబంధనిశ్చయమును గూర్చి యొకింత చెప్పవలసియున్నది. వివాహాంగముగ చెప్పబడిన కన్యావరణము కేవలము సంస్కారమాత్రమే యనుట స్పష్టము. ఏమన: వధూవర నిర్ణయమంతకు పూర్వమే జరిగి యుండవలెను. అట్లు కానిచో వివాహము జరుగుకాలమున వథూనిర్ణయము చేయుట యసంభవము. వివాహము జరుగుటకు కొంతకాలము పూర్వము వధూవరనిర్ణయము జరుగుటయేకాక యానిర్ణయము సామాన్య పరిస్థితులలో ననుల్లంఘ్యమను నంశముకూడ స్మృతులవలన తెలియుచున్నది. అట్టి నిర్ణయమైనది మొదలు వివాహమగు లోపల నేవైన కొన్ని యసాధారణ పరిస్థితులు గల్గుచో మాత్రమే యాసంబంధ నిర్ణయమును మార్చుటకు స్మృతులంగీకరించుచున్నవి. అట్టి నిర్ణయము జరుగుటకును వివాహమగుటకును నడుమ కొంతకాలము గడచుట గలదని యీ క్రిందిశ్లోకమువలన తెలియు చున్నది.

     ప్రతిగృహ్యచయః కన్యాంవరో దేశాన్తరంవ్రజేత్
     త్రీనృతూన్ సమతిక్రమ్య కన్యాన్యం వరయేద్వరం
(నారద 12-24)

(ఏవరుడు కన్యను స్వీకరించి దేశాన్తరము పోవునో యట్టివరునిరాకకై కన్య మూడు ఋతుకాలములు వేచియుండి యాతడప్పటికిని రానిచో మఱొక వరుని కోరుకొనవలెను.)

'వరుడు కన్యను స్వీకరించి' యని చెప్పుటచే నిచటికన్య కింకను వివాహము కాలేదనియు నామెవాగ్దత్త మాత్రమే యైనదనియు తెలియుచున్నది. ఇట్టి వాగ్దానమునకును వివాహమునకును నడుమ నెంతకాలము గడచినను నాకన్యావరు లిద్దఱు నించుమించుగ దంపతులేయని చెప్పవచ్చును. వారి సంబంధములో దాంపత్యాంశ మెంత హెచ్చుగనున్న దనగాః ఆస్థితిలో కన్య మరణించుచో వరుని జ్ఞాతులకశౌచముండును.

     స్త్రీణామ సంస్కృతానాంతుత్య్ర హాచ్ఛుద్ధ్యంతిబాంధవాః
     యధోక్తై నైవకల్పేన శుద్ధ్యంతి తుననాభయః.
(మను. 5-72)

(వివాహముకాని స్త్రీలు మరణించుచో, ననగా వాగ్దత్తలు మరణించుచో, భర్తృజ్ఞాతులు మూడుదినము లాశౌచము పట్టవలెను. ఆమెతండ్రి దాయాదులన్ననో, యిదివఱలో చెప్పిన వివాహిత విషయములోవలెనే, మూడునాళ్లా శౌచము పట్టవలెను.)

దీనివలన వాగ్దాన ప్రాబల్యము స్పష్టమగుచున్నది. వాగ్దత్త భార్యయన్నట్లేకాని కేవలము భార్యకాదని దీనివలన తెలియుచున్నది. జ్ఞాతులకున్నట్లు దశరాత్రాశౌచము విధింపబడలేదు. ఏసంబంధమును లేనివారికివలె నాశౌచము లేకుండగను లేదు. కాన వాగ్దత్తా భార్యవంటిదే కాని భార్య కాదనిచెప్పుట యుక్తముగనుండును. అనగా నామె పత్నీ భిన్నయేకాని పత్నీసదృశ. అట్లే వాగ్దానపతికూడ పతిభిన్న పతి సదృశుడగుచున్నాడు. 'నఞ'కు తద్భిన్నతత్సదృశత్వ మర్థమున్నది కాన నట్టివానిని 'అపతి' యని చెప్పవచ్చును. ఇట్టి 'అపతి' దేశాంతరగతుడై చిరకాలము తిరిగి రానిచో కన్య మఱొకని వివాహమాడవచ్చునని నారదుడును పరాశరుడును చెప్పుచున్నారు

    నష్టే మృతే ప్రప్రజితే క్లీబేచ పతితేపతౌ
    వంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే
(పరాశర.4-30)

(అపతి దేశాన్తరగతుడై తిరిగి రాకపోయినను, చని పోయినను, సన్యాసియైనను, నపుంసకుడైనను, పతితుడైనను - నీ యైదాపత్తులలోను - స్త్రీలు మఱొక పతిని పొందవలెను.)

ఇచట అపతిశబ్దము సప్తమ్యేకవచనములో 'అపతౌ' అని యున్నది. దాని పూర్వపదము 'పతితే'అని యున్నది. సంధిలో 'అ' కారము లోపించి 'పతితేపతౌ' అని యైనది ఇచట సంధిలో 'అ' లోపించినదని భావింపక శబ్దమే 'పతౌ' అని యున్నదని భావింపరాదు. ఏలన నార్షములో మాత్రమే పతిశబ్దమునకు సప్తమ్యేకవచనము 'పతౌ' అగును కాని లౌకికముతో 'పత్యౌ' అనియే యుండును. అది యైనను షష్ఠ్యంతము పూర్వమందున్నపుడే యగును (పాణిని 1-4-9) ఇచట షష్ఠ్యంతము లేదుకాన నార్షమనుటకు వీలులేదు. అంతేకాక, అని యుండవలెను. చక్కని యర్థము కుదురుచున్న పదమును వ్యర్థముగ నార్షముగ విరుచుట న్యాయ్యముకాదు. కావున 'అపతౌ' అనియే పదచ్ఛేదము చేయవలెనని తేలుచున్నది. వాగ్దాన ప్రాబల్యము మనుస్మృతిలోని యీక్రింది శ్లోకమువలన గూడ తెలియుచున్నది.

    ఏతత్తునవరే చక్రుర్నావరే జాతునాధవమాః
    యదన్యస్య ప్రతిజ్ఞాయ పునరస్యస్యదీయతే.
(మను 9-99)

(ఒకనికి కన్యను వాగ్దానముచేసి మఱొకని కామె నిచ్చుటను పూర్వనవీన శిష్టులలో నెవరును చేయలేదు.)

వాగ్దానము కూడ కొంత లౌకికాడంబరముతో జరుగు చుండెనని యూహింప వలసియున్నది. ఏలన వాగ్దానము ననుసరించి వివాహము జరుగకపోయినచో వాగ్దానమునకగు వ్యయము నెవరు భరింపవలెనను ప్రశ్న యాజ్ఞవల్క్యస్మృతిలో పరిష్కరింపబడినది.

దత్వాకన్యాం హరన్‌దండ్యో వ్యయందద్యా చ్చ సోదయం

(యాజ్ఞ 2-144)

(కన్యను వాగ్దానముచేసి మరల తీసికొనినవాడు వాగ్దానవ్యయమును వడ్డీతోకూడ నిచ్చుకొనవలెను.)

వివాహములోని యితరాంశములు "వేదకాలపుస్త్రీలు" అనుగ్రంథమున వివరింపబడి యున్నవి. అవియే గృహ్యసూత్రములలో గూడ గన్పట్టుచున్నవి. ఒకవిశేషము గలదు. సూర్యాసోముల వివాహమును వర్ణించు మంత్రములను బట్టి యా వివాహము రజస్వలా వివాహమని తెలియుచున్నదని నాపూర్వగ్రంథములో సహేతుకముగ దెల్పియుంటిని. ఆమంత్రములే గృహ్యసూత్రములలో వివాహమునకు విధింపబడినవి. గృహ్యసూత్రములును ధర్మసూత్రములును నొకేకాలమున రచింపబడినవని యందఱు నంగీకరింతురు. ఆ కాలమున రజస్వల కాకుండ వివాహము చేయుటయే ప్రశస్తముగ భావింపబడు చుండెనని చూచియుంటిమి. అట్టి వివాహములలో రజస్వలా వివాహమునకు వర్తించు మంత్రములను వాడుట యసంగతము గనే కన్పట్టును కాని యట్లు గృహ్యసూత్ర మా దేశించుట మన కాశ్చర్యమును గల్గింపనక్కరలేదు. మంత్రమునకును కర్మకును సంబంధము గన్పట్టని ఘట్టములు కర్మకాండలో చాలగలవు. సాయంసంధ్యావందనములో సూర్యోవస్థానమునకు వరుణ దేవతాకమంత్రము చెప్పబడుచున్నది. అంతేకాదు వరుడు చెప్పవలసిన 'అహంగర్భమదధామ్‌' (నేను గర్భము నిచ్చితిని) అను మంత్రముతో వథువు నితరుడైనను నభిమంత్రింప వచ్చునని యాతపస్తంబ గృహ్యసూత్రము తెల్పుచున్నది.

అన్యోవైనామభిమంత్రయేత

(ఆ.గృ.సూ. 3-8-11)

ఇట్లే వథువు రజస్వలయని సూచించు మంత్రములను నగ్నికా వివాహములో వాడుటకు గృహ్యసూత్ర కారు లాదేశించుటలో నాశ్చర్యములేదు. స్మృతికారులకు నగ్ని కా వివాహమే సమ్మతమను సిద్ధాన్తమునకిది యీషణ్మాత్రము భంగకరము గాదు. కర్మకును నందుపయోగింపబడు మంత్రముల కును వైరుద్ధ్యము గన్పట్టుటకుగల హేతువులను విచారించుట యిట నప్రస్తుతమగుటచే నది వదలివేయబడినది.

కర్మకును నందువాడబడు మంత్రములకును వైరుద్ధ్యముకన్పట్టినట్లే గృహ్యసూత్రకారులు చెప్పిన కర్మక్రమమునకును వారిననుసరించి నేడు చేయబడు చున్న కర్మకును కొంత వైరుద్ధ్యమున్నది. పైననీయబడిన 'శేషగ్ సమావేశనేజపేత్‌' అనుటనుబట్టి 'ఆరోహోరుమ్‌' మున్నగుననువాక శేషము. సమావేశనమందు జపింపబడవలెనని స్పష్టమగుచుండగా శేషహోమమైనవెంటనే ప్రస్తుతము కొందఱు జపించుచున్నారు. వీరిమతములో సమావేశన మప్పుడే జరుగవలెనని కాబోలు! కాని యప్రాప్తవయస్కకు సమావేశనము గావించుట శాస్త్రీయము కాదని భావించికాబోలు వీరు జపమును మాత్రమే యిపుడు కావించి సమావేశనమును ముందునకు నిలిపి వైచు చున్నారు. వంగదేశము మున్నగు కొన్ని ప్రాంతములలో వధువప్రాప్తవయస్కయైనను నపుడే సమావేశనము గావించుటకలదని తెలియుచున్నది. కాని 'శేషగ్ సమావేశనేజపేత్‌' అనుదానినిబట్టి యిట్టి చిక్కులను పడవలసిన పనిలేదు. ఏమన ఆపస్తంబుని మతము అనువాక శేషము సమావేశములో జపింపవలెననియే కాని సమావేశన మిప్పుడే కావింపవలెనని కాదని స్పష్టముగ తెలియుచునే యున్నది. కాన నామంత్రము నిపుడు జపింపను నక్కరలేదు; సమావేశనము నిపుడు కావింపను నక్కరలేదు. ఈసూత్రభాగమునకు కొందఱీ క్రిందివిధముగ నన్వయమును జెప్పుచున్నారు. "అనువాక శేషము నిప్పుడే జపింపవలెను. ఇదియే సమావేశనజపము. సమావేశనమన్ననో ముందెన్నడో కాదగును. ఇట సమావేశన మనగా సమావేశన జపమనియే యర్థము." ఈసమాధానము కూడ యుక్తియుక్తముగనే కన్పట్టుచున్నది. వాగ్రూవసంస్కారమాత్రమున నిపుడు సమావేశనము జరుగవలెనని చెప్పినంత మాత్రమున క్రియారూపసంస్కారముకూడ నిపుడే జరుగవలెనని తేలదు. దీనికి గృహ్యసూత్రముల నుండియే యనేకోదాహరణములను జూపవచ్చును. గృహ్యసూత్రములలో కన్యావరణము మున్నగునవి రెండుసార్లు చెప్పబడినవి. ఇందొకటి మాత్రమే క్రియారూపము.

సుస్తాం రుదంతీం నిష్క్రాన్తాం వరణేపరివర్జయేత్.

(ఆ.గృ.సూ. 1-3-11)

ఇది సంబంధనిశ్చయమునకు పూర్వము చేయబడు కన్యావరణమునకు సంబంధించిన విషయము.

సుహృదన్సమవేతాన్మంత్ర వతోవరాన్ ప్రహిణుయాత్.

(ఆ.గృ.సూ. 2-2-1)

ఇది సంబంధనిశ్చయమునకు పిమ్మట వివాహసమయమున చేయబడు కన్యావరణమునకు సంబంధించినది. ఇందు యథార్థముగ కన్యావరణము జరుగుట మొదటి సందర్భములోనే రెండవసందర్భములోని కన్యావరణము సంస్కారమాత్రమే; కేవలము వాగ్రూపమే. అట్లే శేషహోమమైన వెంటనే జపరూపసంస్కారమాత్రమైన సమావేశనము ముందెన్నడో క్రియారూపమున జరుగవచ్చుననుటలో నేమియు నాక్షేపముండదు.

పైన చేయబడిన చర్చయంతయు నాపస్తంబగృహ్య సూత్రము ననుసరించియే చేయబడినది. కాన నిపుడితర గృహ్యసూత్రముల ననుసరించి కూడ నీయంశమును పరిశీలింతము.

కొన్ని గృహ్యసూత్రములను బట్టి వివాహములోని దీక్షయొక్క పరిసమాప్తిలో దంపతులకు సమావేశసము జరుగవలెనని స్పష్టముగ కలదు.

హిరణ్యకేశి గృహ్యసూత్ర మిట్లు చెప్పుచున్నది.

అథైనాముపయచ్ఛతే (హిరణ్యకేశి 1-7-11-4)

(త్రిరాత్రదీక్షానన్తరము వరుడు వధువును పరుండబెట్టి యోనిని స్పృశించి యామెను పొందును.)

బోధాయనుడు గూడ వ్రతాన్తమం దుపనంవేశనము చెప్పుచున్నాడు. అతడు వ్రతకాలపరిమితిలో వికల్పములను సూచించియున్నాడు.

అథయదికామయేత శ్రోత్రియం జనయేయమితి ఆరున్ధత్యుపస్థానాత్కృత్వా త్రిరాత్రమక్షార లవణాశినౌ అథఃశ్శాయినౌ వ్రతచారిణావాసాతే చతుర్థ్యాంపక్వహోమ ఉపసంవేశసంచ...... అథయదికామ యేతదేవం జనయేయమితి సంవత్సరమే తద్వ్రతంచరేత్ వ్రతాన్తేపక్వహోమ ఉపసంవేశనం చ (బో. గృ. సూ. 1-7-11)

(శ్రోత్రియుడగు కుమారుని కనవలెనని కోరు దంపతులు అరున్ధత్యుపస్థానము మొదలు మూడునాళ్లు క్షారలవణములులేని యాహారము భుజించుచు క్రింద శయనించుచు వ్రతమాచరింపవలెను. నాల్గవనాడు పక్వహోమము, ఉపసంవేశనము జరుగవలెను....... దేవతుల్యుని కనవలెననని కోరుదంపతులీ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. వ్రతాన్తమందు పక్వహోమము నుపసంవేశనము జరుగవలెను.)

పెండ్లికూతు రెంతవయస్సు కలదైనను గూడ సమావేశనము జరుగవలసినదేనా యను ప్రశ్న యుదయించును. రజస్వలకాని భార్యను పొందరాదని గౌతముడు చెప్పిన ట్లిదివఱలో చూచియున్నాము. గృహ్యసూత్రకారుల మతములో వథువు రజస్వల యైనదిగనే యుండవలెనని చెప్పుటకు నేమియు నాధారము లేదు. అంతేకాక యించుమించుగ స్మృతులన్నియు రజోదర్శనానన్తర వివాహమును నిషేధించుచున్న ట్లిదివఱలో చూచియున్నాము. కాన నిచటివధువు రజోదర్శనము కాని రజస్వలయై యుండుటకు వీలున్నది.

అనగా పండ్రెండేండ్ల వయస్సుగలదై యుండవలెను. పండ్రెండేండ్లు వచ్చిన బాలికకు రజోదర్శనము కాకున్నను నామె రజస్వల యైనట్లే భావింపవలెనని కొన్ని స్మృతులు సూచించుచున్నవి.

      ప్రాప్తేతుద్వాదశే పర్షేయ: కన్యాంనప్రయచ్ఛతి
      మాసిమాసి రజస్తస్యా: పితాపిబతిశోణితం
                                     (పరాశర. 8- 5)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానముచేయడో యాతండ్రి ప్రతి మాసమునను నామె రజస్సును త్రాగుచున్నాడు.)

దీనిని బట్టి పండ్రెండేడ్ల బాలిక రజస్వలయే యని తేలుచున్నది. పైకి రజోదర్శనము కాకున్నను లోన రజస్స్రావమైనట్లే భావింపవలెనని దీని యభిప్రాయము. ఆవయస్సున వివాహమగు వథువునకు సమావేశనము కావచ్చునని గృహ్య సూత్రకారుల మతమని యూహింపవచ్చును. అంతకుపూర్వము వివాహమగుదానికి సమావేశనము లేదని యీవిధముగ నూహింపవలసి యున్నది. ఈ సమావేశనము వివాహాంగమేయని చెప్పవలెను. ఈసమావేశమైన పిమ్మట రజోదర్శనానన్తరము ఋతుకాలములోనే సమావేశనము జరుగును. ఈలోపున జరుగదు. రజోదర్శనానన్తరము చతుర్థ రాత్రమున భర్త చేయవలసిన కృత్యమును వర్ణించుచు బోధాయనుడు,

ఆతడామెను పొందును' (అథైనాముపైతి 1-7-44) అని చెప్పియున్నాడు. ఇదియే రెండవ సమావేశనము. ఇచటి నుండి యనిషిద్ధ దినములలో భార్యను పొందుచుండవలెను. వివాహాంగమైన సమావేశనమునకు పిమ్మటనే ఋతుమతి విషయము ప్రస్తావింపబడుటచే వివాహములో సమావేశనమును విధించిన బోధాయనాదుల మతములోగూడ కన్యదృష్ట రజస్కకాదని తేలుచున్నది. వివాహము దృష్టరజస్కకే ఋత్వితరకాలములో జరుగుచో గూడనిటి ప్రస్తావన కవకాశమున్నది కాదాయనుటకు వీలులేదు. ఏలన నిట పేర్కొనబడిన రజోదర్శనము ప్రథమమే యనుటకు నిటనీయబడిన రజస్వలా నియమములే సాక్ష్యములు. (1-7-22 నుండి 36 వఱకు) ఈవిషయములు వివాహముకాని స్త్రీ రజస్వలయైనను పాటింపవలసినవే కాన వాని నిచటనే చెప్పుటచే వివాహమైనపిమ్మటనే రజస్వలయగుటయే బోధాయనుని దృష్టిలో క్రమమని తేలుచున్నది.

ఆపస్తంబుడు సమావేశనమును వివాహాంగముగ విధింపలేదని యిదివఱలో చూచియుంటిమి. సమావేశనము వివాహాంగమా కాదాయను నంశమున ఋషులలో నభిప్రాయ భేదమున్నట్లు గోభిలగృహ్యసూత్రము చెప్పుచున్నది.

    ఊర్థ్వంత్రిరాత్రాత్ సంభవ ఇత్యేకే
              (గో.గృ.సూ. 2-5-7)

(త్రిరాత్రానంతరము సమావేశనము కావలెనని కొందఱు చెప్పుచున్నారు.)