సత్యశోధన/మూడవభాగం/13. భారతదేశానికి ప్రయాణం

వికీసోర్స్ నుండి

13. భారతదేశానికి ప్రయాణం

ఈ విధంగా నేను ఏర్పాట్లు పూర్తిచేసుకొని భారత దేశానికి ప్రయాణమయ్యాను. దారిలో మారిషస్ రేవు తగిలింది. అక్కడ ఓడ కొద్ది రోజులు ఆగుతుంది. నేనక్కడ దిగి అక్కడ వారి స్థితిగతుల్ని తెలుసుకున్నాను. అక్కడ గవర్నరుగా వున్న చార్లెస్‌బ్రూస్ గారికి అతిథిగా ఒక రాత్రి వున్నాను.

దేశానికి వచ్చిన తరువాత కొంత కాలం అటుయిటు తిరుగుతూ పర్యటిస్తూ వున్నాను. 1901 నాటి విషయం, కలకత్తాలో ఆ ఏడు కాంగ్రెస్ జరుగుతున్నది. అధ్యక్షులు దిన్షా ఎడల్జి వాచాగారు. నేను ఆ కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్‌ను చూడటం నాకు అదే మొదటిసారి.

బొంబాయి నుండి సర్‌ఫిరోజ్‌షాగారు కలకత్తా వెళుతున్న రైల్లోనే నేను కూడా ఎక్కాను. దక్షిణ - ఆఫ్రికా విషయాలు వారితో మాట్లాడవలసి వున్నది. వారి పెట్టెలో కూర్చొని ఒక స్టేషను దాకా ప్రయాణించవచ్చని నాకు అనుమతి లభించింది. వారు ఒక పెట్టెను పూర్తిగా తీసుకున్నారు. వారి రాజ వైభవం, ఠీవి, అందుకుగాను అయ్యే ఖర్చుల వ్యవహారమంతా నాకు కొంత తెలుసు. నిర్ణయించబడిన స్టేషనులో వారి పెట్టె ఎక్కాను. అప్పుడా పెట్టెలో దిన్షావాచాగారు, చిమన్‌లాల్ సెతల్వాడు గారు వున్నారు. వారంతా రాజకీయాల్ని గురించి మాట్లాడుతూ వున్నారు. నన్ను చూచి ఫిరోజ్ షా మెహతా గారు “గాంధీ! నీ పని అనుకూలంగా లేదు. నీ తీర్మానం కాంగ్రెస్సులో ఆమోదించినా ప్రయోజనం ఏముంటుంది? అసలు మనకు మనదేశాల్లో వున్న హక్కులేమిటి? మనదేశంలో మనకు సత్తా లేనంత కాలం పరాయి దేశాల్లో మన స్థితి ఎలా బాగు పడుతుంది?” అని అన్నారు. నేను నివ్వెరబోయాను. చిమన్‌లాల్‌గారు కూడా వారితో ఏకీభవించారు. కాని దిన్షాగారు మాత్రం దయ దృష్టితో నావంక చూచారు.

ఫిరోజ్‌షాగారిని ఒప్పించాలని ప్రయత్నించాను. వారు బొంబాయికి మకుటంలేని మహీపతి. అట్టివారిని నాబోటివాడు ఒప్పించడం సాధ్యమా? అయితే కాంగ్రెస్‌లో దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందుతుందని సంతోషించాను.

వారికి ధన్యవాదాలు తెలిపి రైలు ఆగగానే పెట్టె దిగి నా పెట్టె ఎక్కి నా స్థానంలో కూర్చున్నాను. షాగారి దగ్గర నుండి వచ్చేసేముందు లేవగానే నాకు ఉత్సాహం కలిగించేందుకు వాచాగారు “తీర్మానం తయారు చేసి నాకు చూపించండి” అని చెప్పారు. రైలు కలకత్తా చేరింది. నగరవాసులు అధ్యక్షుల వారిని మహా వైభవంగా తీసుకు వెళ్ళారు. అక్కడ అనేక మంది ప్రతినిధులు వున్నారు. అదృష్టవశాత్తు నేనున్న విభాగానికి లోకమాన్యులు విచ్చేశారు. వారు ఒక రోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తు. లోకమాన్యులు ఎక్కడ వుంటే అక్కడ ఒక చిన్న దర్బారు జరుగుతూ వుంటుంది. లోకమాన్యులు శయ్యపై కూర్చుంటారు. చిత్రకారుణ్ణి అయితే శయ్యపై కూర్చున్నవారి చిత్రం గీసేవాణ్ణి. ఆ దృశ్యం అంత స్పష్టంగా నాకు గుర్తువుంది. వారి దర్శనం కోసం వచ్చేవారి సంఖ్య అపరిమితంగా వుంటుంది. పెద్ద సంఖ్యలో వుంటుందంటే అతిశయోక్తికానేరాదు. వారిలో అమృత బజారు పత్రికాధిపతి మోతీబాబుగారు నాకు బాగా గుర్తు. వారిద్దరి నవ్వు, పరిపాలకుల అన్యాయాల్ని గురించి వారనుకున్న మాటలు యిప్పటికీ నాకు గుర్తు. ఇక అచటి కాంగ్రెస్ వారి నివాసాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

వాలంటీర్లలో ఒకరికొకరికి పడదు. ఎవనికైనా ఒకపని అప్పగించితే అతడు ఆ పని చేయడు. అతడు వెంటనే మరొకడికి చెబుతాడు. అతడు యింకొకడికి పురమాయిస్తాడు. యిక పాపం ప్రతినిధులపని హుళక్కే.

కొంతమంది స్వచ్ఛంద సేవకులతో నేను మాట్లాడాను. దక్షిణ - ఆఫ్రికాలో జరిగే పద్ధతి కొద్దిగా చెప్పాను. వాళ్ళు కొంచెం సిగ్గు పడ్డారు. వారికి సేవాధర్మం అంటే ఏమిటో చెబుదామని ప్రయత్నించాను. వారికి కొంచెం కొంచెం బోధపడింది. కాని సేవాభావం, ప్రేమభావం ఎప్పటికప్పుడు ఎక్కడ బడితే అక్కడ పుట్టుకురావడానికి అవి పుట్టకొక్కులు కావుగదా! అవి లోపలి నుండి పుట్టుకురావాలి. దానికి అభ్యాసం కూడా అవసరం. అమాయకులు, సరళ స్వభావులు అయిన ఈ వాలంటీర్లకు సేవ చేద్దామని వుంది, కాని చేసి ఎరగరు. అలవాటు లేదు. ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? అందుకు కారణం కూడ వున్నది. కాంగ్రెస్ జరిగేది సంవత్సరానికి ఒక్కసారి. అదికూడా మూన్నాళ్ల ముచ్చట. తరువాత కథ కంచికి అది ఇంటికి. అట్టి స్థితిలో ఏడాదికి మూడు రోజులు మాత్రం జరిగే తతంగంలో వాలంటీర్లు సవ్యంగా పనిచేయాలంటే సాధ్యమా?

ప్రతినిధులు కూడా స్వచ్ఛంద సేవకుల వంటివారే. వారికి కూడా అది మూన్నాళ్ళ ముచ్చటే. ఈ ప్రతినిధులు తమ పని తాము చేసుకోరు. హుకుములిచ్చి పనులు చేయించుకుంటూ వుంటారు. ‘ఏయ్! వాలంటీరూ! అది తే, ఇది తే’ యిదీ వాళ్ల వరస. ఇక్కడ అంటరానితనం జాస్తి. అరవవారికోసం వంట యిల్లు స్పెషల్‌గా ఏర్పాటుచేయబడింది. వాళ్లు భోజనం చేస్తుంటే ఎవ్వరూ చూడకూడదు. అందువల్ల వారికోసం కాలేజీ ఆవరణలో వేరే ఏర్పాట్లు చేశారు. దిష్టి తగలకుండా చుట్టూ దడికట్టారు. లోపల ఊపిరి సలపనంత పొగ. అది వంట గదిలా లేదు. సందూకు పెట్టెలా వుంది. అన్ని వైపుల దాన్ని మూసివేశారు.

ఇది వర్ణాశ్రమ ధర్మానికి విరుద్దం. కాంగ్రెసు ప్రతినిధుల్లోనే అంటరానితనం యింత అధికంగా వుంటే వాళ్లను ఎన్నుకునే జనంలో ఎంత అంటరానితనం వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారమంతా చూసేసరికి నాకు అమితంగా నిరాశ కలిగింది.

ఇక అక్కడ దుర్గంధం విపరీతం. ఎక్కడ చూచినా నీళ్లు, నీళ్లు, నీళ్లు. మరుగు దొడ్లు తక్కువగా వున్నాయి. ఒకటే కంపు. తలుచుకుంటేనే డోకు వస్తుంది. ఒక వాలంటీరుని పిలిచి యీ విషయం చెప్పాను. అది పాకీ వాళ్లు చేయాల్సిన పని అని అతడు ఠపీమని సమాధానం యిచ్చాడు. ‘నాకు ఒక చీపురు కట్ట తెచ్చి పెట్టగలరా’ అని అడిగాను. అతడు తెల్లబోయాడు, నా ముఖం ఎగాదిగా చూడసాగాడు. చివరికి నేనే వెతికి తెచ్చుకున్నాను. మరుగుదొడ్డి బాగు చేశాను. కాని అది నాకు ఉపయోగపడే మరుగుదొడ్డి. ఇదెక్కడి లోకం? ఇవెక్కడి మరుగుదొడ్లు? ఎన్ని సార్లు బాగుచేసినా ప్రయోజనం శూన్యం. వాటిని బాగుచేయాలంటే నా శక్తికి మించినపని. అందువల్ల నాపని మాత్రం చేసుకొని సంతోషపడ్డాను. మిగతావాళ్లకు కంపు కొట్టినట్లులేదు. ఈ వ్యవహారం యింతటితో ఆగలేదు. కొందరు రాత్రిపూట తాము వుంటున్న గది వరండాలోనే మలవిసర్జనం, మూత్ర విసర్జనం చేశారు. వాలంటీర్లకు ప్రొద్దున్నే ఆ దృశ్యం చూపించాను. కాని బాగుచేసే నాధుడెవరు? చివరికి నాకే ఆ గౌరవం దక్కింది.

తరువాత మొదటి కంటే కొద్దిగా మార్పు వచ్చింది. కాని పరిశుభ్రతను గురించి పట్టించుకునేవారు తక్కువ. ప్రతినిధులు తమ చెడ్డ అలవాటును మార్చుకోరు. వాలంటీర్లు అసలు పట్టించుకోరు.

కాంగ్రెస్ మరికొన్ని రోజులు యిలాగే జరిగితే అంటురోగాలు తప్పవు అని అనిపించింది.