సత్యశోధన/మూడవభాగం/12. స్వదేశాగమనం

వికీసోర్స్ నుండి

12. స్వదేశాగమనం

యుద్ధం ముగిసిన తరువాత దక్షిణ - ఆఫ్రికాలో యిక నా పని పూర్తి అయిందని స్వదేశంలో చేయవలసిన పని చాలా వున్నదని గ్రహించాను. దక్షిణ ఆఫ్రికాలోనే వుంటే ఏదో కొంత సేవకార్యం దొరకకపోదు. కాని అక్కడ వుండిపోతే డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారుతుందనే సందేహం నాకు కలిగింది. దేశమునందలి మిత్రులు దేశం రమ్మని వత్తిడి చేయసాగారు. దేశం వెళితే ఎక్కువ ఉపయోగం వుంటుందని అనుకున్నాను. నేటాలులో ఖాన్‌గారు మన సుఖలాలుగారు వుండనే వున్నారు.

నాకు యిక సెలవు యిమ్మని మిత్రుల్ని కోరాను. అతికష్టం మీద ఒక షరతు పెట్టి సెలవు మంజూరు చేశారు “ఒక్క సంవత్సరంలో తిరిగి పనిబడితే మీరు యిక్కడికి రావాలి.” అనేది వారి షరతు. నాకది విషమ షరతు అనిపించింది. కాని ప్రేమపాశంచే బద్ధుడనైనాను.

“కాచేరే తాంతణే మన్ హరజీఏ బాందీ,
జేమ తాణే తేమ తేమనీరీ,
మనేలాగీ కటారీ ప్రేమనీ”

(ఆ నారాయణుడు నా మెడకు ప్రేమ బంధం వేశాడు. దాన్ని పుచ్చుకొని అతడు లాగిన కొద్దీ ఆహాహా, నేను అతని దానినయిపోతున్నాను.)

మీరాబాయి గానం చేసిన యీ గీతం నాకు బాగా వర్తించింది. జనతా జనార్ధనుని మాట కాదనలేక పోయాను. వారికి మాటయిచ్చి సెలవు తీసుకున్నాను. ఈ పర్యాయం నేటాలుతో నాకు సంబంధం అధికంగా ఏర్పడింది. నేటాలు నందలి భారతీయులు, నామీద ప్రేమామృతం అపరిమితంగా కురిపించారు. ఊరూర అభినందన పత్రాలు, ఊరూర కానుకలు అందజేశారు. 1899 వ సంవత్సరంలో దేశానికి పస్తున్నప్పుడు కూడా కానుకలు లభించాయి. యీ సారి ఆ కానుకల్ని, ఆ సభల్ని చూచి బెదిరిపోయాను. బంగారు, వెండియేగాక వజ్రాలు కూడా లభించాయి.

నేను యీ కానుకల్ని స్వీకరించవచ్చునా? నేను యీ కానుకల్ని తీసుకుంటే డబ్బు తీసుకోకుండా ప్రజల సేవ చేసినట్లవుతుందా? నాక్లయింటు యిచ్చినవి కొన్ని మాత్రం కాక మిగతావన్నీ ప్రజాసేవకుగాను యివ్వబడినవే గదా! అయితే యీ రెండింటికీ నా దృష్టిలో తేడా లేదు. పెద్ద పెద్ద క్లయింట్లందరు ప్రజా కార్యక్రమాలకు సాయపడ్డవారే. ఒక రోజున రెండు గొప్ప కానుకలు వచ్చాయి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పిచ్చివానివలె అటుయిటు తిరుగుతూ జాగారం చేశాను. ఏమి చేయాలో పాలుబోలేదు. వేల కొద్ది రూపాయలు తీసుకోకుండా వుందామంటే కష్టంగానే వుంది. తీసుకుందామంటే అంతకంటే కష్టంగా వుంది.

ఈ కానుకలు నేను జీర్ణం చేసుకోవచ్చు. కాని నా భార్యా బిడ్డల పరిస్థితి ఏమిటి? వాళ్ళు కూడా ప్రజాసేవకు అలవాటు పడుతున్నారు. సేవకు విలువ కట్టకూడదని రోజూ వారికి నూరి పోస్తున్నాను. ఇంట్లో ఖరీదైన నగలు వుంచడం మానుకున్నాను. ఇంటిలో మితంగా ఖర్చు పెట్టడం అలవాటు అవుతున్నది. అట్టి స్థితిలో బంగారు గడియారాలు, బంగారు గొలుసులు యింట్లో ఎలా ఉంచడం? వజ్రాల ఉంగరాలు ఎలా పెట్టుకోవడం? అప్పటికే నగల వ్యామోహం కూడదని అందరికీ చెబుతూ వున్నాను. అందువల్ల ఈ నగలు, ఉంగరాలు తీసుకొని ఏం చేయను? చివరికి వీటిని ఇంట్లో వుంచకూడదనే నిర్ణయానికి వచ్చాను. పారసీ రుస్తుంజీ మొదలగు వారిని ధర్మ కర్తలుగా ఏర్పాటు చేసి పత్రం వ్రాసి పెట్టుకొని ప్రొద్దున్నే భార్యాబిడ్డలతో సంప్రదించి బరువు దించుకుందామని నిర్ణయించుకున్నాను.

నా భార్యను ఒప్పించడం తేలికపని కాదని తోచింది. అందుకని నా పక్షాన వాదించుటకు నా పిల్లల్ని వకీళ్లుగా నియమించాను. పిల్లలతో మాట్లాడాను.

వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. “మాకీ నగలతో పనిలేదు. వాటి ఉపయోగం లేదు. ఎవరివి వారికిచ్చి వేయడం మంచిదని మా ఉద్దేశ్యం, మనకు కావలసివస్తే మనం చేయించుకోలేమా?” అని వాళ్ళు అన్నారు.

నాకు సంతోషం కలిగింది. “అయితే మీ అమ్మను ఒప్పించగలరని అనుకుంటున్నాను” అని వాళ్ళతో అన్నాను.

“తప్పక, అది మాపని. ఈ నగలు మా అమ్మ కెందుకు? ఆమె కావాలనేది ఎవరికోసం? మా కోసమే కదా? మేము వద్దంటే ఆమె ఇక ముట్టదు” అని అన్నారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు.

“ఇవి మీకు అక్కర లేకపోవచ్చును. మీ పిల్లలకు అక్కరలేక పోవచ్చును. పిల్లలదేముంది? మనం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. నాకు పెట్టుకోవాలని వున్నదనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? జనం ఎంతో ప్రేమతో యీ ఆభరణాలు యిచ్చారు. వాటిని తిరిగి వారికివ్వడం సరికాదు.” అంటూ కస్తూరిబాయి వాగ్ధార జోరుగా ప్రారంభించింది. దానితో అశ్రుధార కూడా కలిసింది. అయితే పిల్లలు చలించలేదు. నేనూ చలించలేదు. మెల్లమెల్లగా ప్రారంభించాను. “మన పిల్లలికి అప్పుడే పెళ్ళా! చిన్నతనంలో వాళ్ళకు పెళ్ళి చేయముకదా! పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళ పెళ్ళిళ్లు వాళ్లే చేసుకుంటారు. నగలు కావాలనే కోడళ్లు మనకెందుకు? అయినా నగలే అవసరమైతే నేను లేనా? నేను ఎక్కడి పోతాను?” అని అన్నాను.

“ఆ సంగతి నాకు తెలియదా? నా ఒంటిమీద వున్న నగలన్నీ ఒలిచి తీసుకొన్నవారు కదూ మీరు? నన్నే పెట్టుకోనీయనివారు రేపు నా కోడళ్ళని పెట్టుకోనిస్తారా? నా పిల్లల్ని యిప్పటి నుండే బైరాగుల్ని చేసి పెడుతున్నారు. ఈ నగలు నేనెవ్వరికీ యివ్వను. పైగా అవి నావి, నాకు యిచ్చారు. వాటిమీద మీకు హక్కుఎక్కడుంది?” “ఆ బంగారు హారం నీవు చేసిన సేవను చూచి యిచ్చారా చెప్పు! నేను చేసిన సేవకే గదా యిచ్చారు?” “పోనియ్యండి మీరు చేస్తే నేను చేసినట్లు కాదా? మీకు రాత్రింబవళ్ళు నేను సేవచేయడం లేదా? ఇది సేవ కాదా? ఇంటికి తీసికొని వచ్చిన అడ్డమైన వాళ్లందరికీ ఎముకలు విరిగేలా సేవచేయడం లేదా? దీన్ని ఏమంటారు? యిది సేవకాదా?” ఆమె వదిలిన బాణాలన్నీ వాడిగలవే. ఎన్నో నాకు గ్రుచ్చుకున్నాయి. కాని నేను నగలు తిరిగి యిచ్చి వేయాలని నిర్ణయించుకున్నాను. తరువాత చివరికి ఏదో విధంగా కానుకలు తిరిగి యిచ్చి వేసేందుకు ఆమెను ఒప్పించాను. 1896, 1901 వ సంవత్సరాలలో వచ్చిన కానుకలన్నింటిని తిరిగి ఇచ్చివేశాను. దానపత్రం వ్రాశాను. నా అనుమతితో కాని ధర్మకర్తల అనుమతితో కాని ప్రజాసేవకు యివి ఉపయోగించబడాలనే షరతుతో సొమ్మంతా బాంకులో జమ చేశాను.

ప్రజాసేవకు సంబంధించిన కార్యాలకు ఈ సొమ్ము ఉపయోగించాలని భావించాను. కాని అందుకు అవసరమైన సొమ్ము ఎప్పటికప్పుడు వస్తూ వుండటం వల్ల ఆ సొమ్మును ముట్టుకోలేదు. ఆ సొమ్ము సురక్షితంగా వుండిపోయింది. పైగా అది పెరుగుతూవున్నది.

ఇలా చేసినందుకు నాకు ఎన్నడూ పశ్చాత్తాపం కలుగలేదు. కాలం గడిచిన కొద్దీ కస్తూరిబాయి కూడా నేను చేసిన పని యొక్క ఔచిత్యాన్ని అర్థం చేసుకోసాగింది. ఈ విధంగా నేను ప్రలోభాల నుండి తప్పించుకోగలిగాను. ప్రజల సేవ చేసేవారికి ఎన్నో కానుకలు వస్తాయి. కాని అవి వారి సొంతం కాజాలవని నా నిశ్చితాభిప్రాయం.