శివరాత్రిమాహాత్మ్యము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచమాశ్వాసము

క.

శ్రీదయితప్రియసేవక
భూదివిజాశీర్వివృద్ధభూరిశ్రీపు-
ణ్యోదయ సమస్తజనసం-
మోదనసుఖకరవసంత ముమ్మయశాంతా.

1


వ.

అక్కథకుం డిట్లని చెప్పె. నివ్విధంబున నుక్కుమిగిలి ముక్కంటి ప్రమథులు ఘంటాహుడుక్కాడమరు ఢాంకారారవంబుగా వెంటాడించి తోలినఁ బలాయితులై (యమ)కింకరులు వసంతకాలకుసుమిత కంకేళీపాదపంబులభంగి పారిషదవీరఘోరత్రిశూలప్రహరణప్రహారంబులం బ్రభవించు క్రొత్తనెత్తురుల జొత్తిల్లుచు నెదురి కేతెంచిన పరివారంబునకుం బాటిల్లిన పలాయనత్వంబునకు జటాధారుల దౌష్ట్యంబునకు దుర్వృత్తుండగు సుకుమారు నుత్త[మ]పదప్రాప్తికిం జిత్తంబున విషాదంబు నొందుచుఁ జిత్రగుప్తు రావించి కృతాంతుం డతనితో నిట్లనియె.

2


చ.

కవిలియ విచ్చి చెప్పు గణకత్వవిశారద చిత్రగుప్త సం-
భవదశ యాదిగాఁగ సుకుమారుఁడు చేసిన పుణ్యపాపముల్
వివరములైన వేదము[ఖ]విద్యలకుం బదునాలుగింటికిన్
శివుఁడు ప్రబంధకర్తయట నేరక చేసె ననంగ వచ్చునే.

3


వ.

అనినఁ జిత్రగుప్తుండు కవిలియ సమ్ముఖంబునకుఁ దెచ్చి పాయపుచ్చి జంబూద్వీపంబున నార్యావర్తవిషయంబున వింధ్యాచలోత్తరభాగంబున నైరావతీశతద్రూవిపాశా సింధు[1]వితస్తానదీమధ్యంబున హేమాంగదుం డను రాజు రాజధాని రత్నపురంబున యజ్ఞదత్తుం డను బ్రాహ్మణుని భార్య సుశీలకుం బ్రభవించిన కుమారుండు సుకుమారుండు.

4


సీ.

జూదంబు లాడెను శూద్రాన్నము భుజించెఁ
          గలవారి గృహములు కన్నపెట్టెఁ
గొండెంబు చెప్పెను గురుల నిర్భర్త్సించె
          బ్రాహ్మణాచారంబు పదటఁ గలపె
మదిర యాస్వాదించె మాలతొయ్యలిఁ గూడె
          గంజాయి దినె [2]నన్యకాంతఁ జెఱచె
వెలవాడయోషిత్తువలన సంతతిఁ గాంచెఁ
          గన్నకూతు రమించెఁ [3]గావరమున


గీ.

జెంచు సేవించె నిల్లూఱడించుకొనియె
నధిప సుకుమారుఁ డిట్టి పాపాత్ముఁ డనిన
శ్రవణములు మూసుకొనియె హస్తముల యముఁడు
హరహర శ్రీమహాదేవ యభవ యనుచు.

5


వ.

కృతాంతుండు గొంతతడవు విచారించి చిత్రగుప్తుం గనుంగొని.

6


శా.

ఏలా యీ యధమాధికారము పరాధీనత్వదుఃఖాఢ్యమున్
గైలాసంబున కేఁగియుఁ శివుని శ్రీకంఠున్ విరూపాక్షునిన్
త్రైలోక్యాధిపు సంస్తుతించెద మదధ్యక్షత్వచిహ్నంబు [4]ము
గ్రాలంకారము పాదపద్మమణిపీఠాగ్రంబునం బెట్టెదన్.

7

సీ.

విడువరో [5]యెందేని విహరింపఁ జనుఁగాని
          కరవాఁడి ముక్కుల కాకిపిండు
ఖండింపరో వంటకాష్ఠంబులకుఁ గాఁగ
          నసిపత్రములతోడి [6]యవనిజములఁ
దోలింపరో వజ్రతుండకీటంబులఁ
          బ్రాకారపరిఖాంబుపార్శ్వములకు
నార్పరో ఘటసహస్రాంబుపూరంబులఁ
          బ్రబలకుంభీపాకపావకములు


గీ.

శాఠ్యముననైనఁ బరిహాససరణినైన
శంభునైనను హరినైన సంస్మరించి
పాపు లేఁగుచునున్నారు పరమగతికి
నారకము (వీడి) యీ యధికారమేల.

8


వ.

అని యాక్షణంబ చిత్రగుప్తాదులతోడం గూడి యముండు విరూపాక్షసందర్శనార్థంబు శివలోకంబున కరుగువాఁడు త్రయోవింశతిసంఖ్యాకంబులైన స్వర్గలోకంబు(లు) గడచి సప్తర్షిమండలంబు లంఘించి మహర్లోకంబు దాఁటి సత్యలోకం బతిక్రమించి సర్వలోకోత్తమోత్తమంబును ద్వాత్రింశత్కోటియోజనవిస్తారంబును జాంబూనదవిమానసహస్రసంకులంబును బహ్వాశ్చర్యధుర్యంబునునగు మహాస్థానంబు ప్రవేశించి బహుయోజనవిస్తీర్ణంబులును నానాద్వారసమంచితంబులును మణితోరణసంయుక్తంబులును హేమరత్నవితర్దికోటిశోభితంబులు దివ్యరత్నవిమానాఢ్యంబులు దివ్యపతాకాచ్ఛత్రవిచిత్రంబులు శాతకుంభస్ఫటికరత్నస్తంభసంభరితంబులు మహాకాళ భృంగిరిటి కుంభకుంభోదర ప్రముఖ ప్రమథగణాకీర్ణంబులు ననంతాశ్చర్యయుక్తంబులునగు దివ్యకక్ష్యాంతరంబులు దఱిసి పూర్వద్వారంబున.

9


క.

[7]సుయశోధీధనకాంతా-
దయితుని భసితత్రిపుండ్రధవళలలాటున్
నయనాభిరామమూర్తిన్
నియతాత్ముని నందికేశునిఁ బొడఁ గనియెన్.

10


వ.

కాంచి దండప్రణామంబు చేసి శైలాది కిట్లని విన్నవించె.

11


సీ.

దర్శింపవచ్చితిఁ దరుణేందుశేఖరు
          నఖిలలోకాధీశు నమరవంద్యు
కార్యంబు లెన్నేని గలవు విన్నపము సే-
          యంగ (నే) నధికారి నౌదుఁగానొ
[8]నీ శరణ్యుండనై నీవు ప్రతిష్ఠింప
          ననఘ యున్నాఁడ ధర్మాసనమున
భృత్యభూతుఁడ నీకు సత్యంబ పల్కెద
          నిన్ను దప్పంగ నే[9]నెన్న నొరుల


గీ.

ననుచుఁ బ్రియమాడు యమరాజు నాదరించి
నంది శంభుని [10]సన్నిధానమున కేఁగి

మ్రొక్కి హస్తసరోరుహంబులు మొగిడ్చి
వినయ మొప్పఁగ నిట్లని విన్నవించె.

12


సీ.

ఓ జగన్నాథ యో యుడురాజశేఖర
          యో కృపాంభోరాశి యో త్రినేత్ర
యో విష్ణుధాత్రాది దేవతాకోటీర
          పరిచిత శ్రీపాదపద్మయుగళ
యో జలంధరవైర యో గంధకరికృత్తి-
          [11]కంథాధురంధర స్కంధపీఠ
యో నీలలోహిత యో లలాటాంబక-
          జ్వలనజిహ్వాదగ్ధశరభచిహ్న


గీ.

దక్షిణాశాధిపతి దండధరుఁడు దాను
చిత్రగుప్తుండు దేవర సేవ సేయ
నరుగుదెంచినవాఁడు తే నవసరంబు
ననువుపడ దుండుమందమో యానతిమ్ము.

13


వ.

అని పలికి శివుని ముఖప్రసాదంబు నింగితం బెఱింగి నందికేశ్వరుండు తన్నుం బ్రవేశింపంజేయఁ జిత్రగుప్తసహితుండై చనువాఁడు ముందట.

14


సీ.

దేవదేవుని పూర్వదిగ్భాగమునయందుఁ
          పరమ(మా)హేశులఁ బాశుపతుల
[12]... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...


గీ.

వికటపాటలఘనజటామకుటకోటి-
ఘటిత కుటిలశశాంకరేఖాకలాప
భూషితులఁ జతుర్బాహుల భూరిబలుల
శ్రాద్ధదేవుండు చూచి విస్మయముఁ బొందె.

15


గీ.

దక్షిణంబున వీక్షించె దండపాణి
యజునిఁ బాండురపుండరీకాసనస్థు
నంగిరోవామదేవకణ్వాక్షపాద
కపిలసనకవసిష్ఠాది గణముతోడ.

16


సీ.

బ్రాహ్మి [13]మాహేశ్వరి వారాహి కౌమారి
          చాముండ యైంద్రి వైష్ణవి యనంగ

మాలతినాఁగ సుబాలికనా బల-
          [14]ప్రమథినినా వికరాళి యనఁగ
కాళరాత్రి కరాళికా ప్రచండులనాఁగ
          బ్రాహ్మ్యాది మాతృకాపరికరంబు
పార్వతి ప్రముఖబల ... ... ... ... ... ...
          ప్రమథనాధిక భూతపరికరములు


గీ.

ప్రమథవర్గంబు లయకాలభైరవుండు
పాశుపతములు చండకోపప్రచండ
చండచండార్చులును ఘోరశారభముల
శివుని పడమటి యెడ నిరీక్షించె యముఁడు.

17


వ.

శంఖచక్రధరుండును పీతాంబరుండును గౌస్తుభోద్భాసితవక్షఃస్థలుండును గిరీట కటక హార నూపుర గ్రైవేయ కంఠికాది నానావిధ దివ్యాభరణభూషితుండును లక్ష్మీసహాయుండునునై పురాణపురుషోత్తముండును, నష్టవసువులును, ద్వాదశాదిత్యులును, సిద్ధ విద్యాధర గంధర్వాక్షీణ యక్ష భుజంగ గుహ్యకులును మొదలుగాఁ గలవారును మఱియునుం గలవారల హరుని యుత్తరదిక్కునం గాంచి వైవస్వతుం డద్భుతంబందుచు నభ్యంతరమందిరంబు ప్రవేశించి.

18


సీ.

వేదోక్తమగు క్రియావిధిఁ బాశుపతమహా-
          వ్రతదీక్ష గైకొన్న వ్రతులఁ జూచె
విచ్ఛిన్నపాశులై విరహితద్వంద్వులై
          విమలాత్ములైన యుత్తములఁ జూచె
[15]నద్వైతతత్వవిద్యారహస్య జ్ఞాన-
          సంపన్నులగు యతీశ్వరులఁ జూచె
నిగమాంతవివిధోపనిషదర్థ వాసనా-
          ఘనులైన యోగిపుంగవులఁ జూచె


గీ.

దివ్యసింహాసనాసీనుఁ ద్రిపురహరునిఁ
[16]బర్వతోద్భవాపరిపూర్ణపార్శ్వభాగుఁ
గాలకంఠునిఁ జంద్రరేఖాకిరీటు
శ్రీమహాదేవు నభవు వీక్షించె యముఁడు.

19


వ.

వీక్షించి దండప్రణామంబు చేసి నిలిచి చేతులు మొగిడ్చి మహేశున కిట్లని స్తుతించె.

20


తాళ రగడ.

జయజయ సచరాచరసర్వజగత్సర్గస్థితిసంహారతిరోభా-
          [వా]నుగ్రహలీలాపంచవిధవ్యవహారవినోదైకపరాయణ
జయజయ హాటకగర్భకిరీటస్థాపితబహువిధమణిఘృణిపటల-
          వ్యతికరకిమ్మీరిత[17]పాదాబ్జద్వంద్వపీఠికోపాంతవసుంధర
అహరహ [18]రహమహమిక యా త్వా మభివందే పృథుగోధివీథికా-
          దృగ్ధూమధ్వజజిహ్వా[19]రంహోమృత్కణాయమానప్రసవాయుధ
మహిమానం తవ కో వా స్తోతు[ం] ప్రభవతి విషనిధివిషకల్మాషిత-
          కంఠమూలకంఠోక్తాశేషజగత్సంరక్షాదాక్షిణ్యక్షమ

శరణం మమ తవ చరణం భూయాత్సరసిరుహపలాశోదరారుణం
          ఫణిధరపరివృఢకాభర[ణాంచిత] పరమకృపాగుణకింకర శంకర
కురు మయి దాక్షిణ్యం ప్రాలేయక్షోణీధరదుహితృస్తనకుంభ-
          స్థల(కస్తూరీ)స్థాసకముద్రాస్థగితవిపులవక్షఃపీఠాంతర
హర శంభో విశ్వేశ మహాదేవామరవల్లభ శివ సర్వాత్మన్
          నీలకంఠ శంకర వృషభధ్వజ [20]నిటాలలోచన భర్గ పాహి మాం
ధరణీధరకోదండశింజినీదందశూకపరివృఢగుణటాంకృతి-
          ధారానిర్భిన్నత్రిపురాసురదారహృదయసంపుట మాం పాలయ
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మస్వప్రతిష్ఠిత మాద్య మనాద్యం-
          త మనాధారం వ్యోమ్నిపతే [21]సంతతం సమస్తోపాధి ధ్రువమితి
నిత్యం నిత్యవివేకశాలినో నియతా శ్శాంతా నిరహంకారా
          ధ్యాయన్తి మహాయోగిపుంగవాఽయం తస్మై భవతే నమశ్శివ
జ్వాలాజాలకరా(ళ)జ్వలనస్తంభరూప మభిబిభ్రతా త్వయా
          త్రైలోక్యాతిశయాళు మోహితౌ తామరసాసనకైటభాంతకౌ
లీలాయోర్ధ్వభాగాధోభాగోల్లేఖ కుతూహల [22]హంసపోత్రిణీ
          కింపచానవిజ్ఞానవైభవా [23]కే వయం భవ తాం జ్ఞాతుం భ్రమ
స్ఖలితగతి రతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్త శ్రుతి రపి రభవాన్
          [24]కస్య హి వాచా సంస్తోతవ్యః [25]కతివిధగుణకః కస్య హి విషయః
హర శంభో వృషభధ్వజ శూలిన్ హాలా[హల]ధర శంకర గిరిశే
          త్యహరరహ [రహం] పఠామి [ఏతైః] కుఠరాయుధస్థితై ర్భూయో స్థిత
సమున్నతై ర్భూయా చ్చరణాంబురుహ మున్నతం దీర్ఘాయుష్యాయ [మమ]
          జటాదిపలాస్తే భూయాసుః మమ
ప్రత్యాసీదతి సంధ్యాసమయే ప్రారబ్ధజగత్సంస్క్రియావిధౌ
          దండపాణి చంక్రమణోత్సాహీ తాండవకేళి[26]శీలినః (?)

21


సీ.

హరినీలలింగంబునందు దైత్యారాతి
          మణిలింగమున నగ్రమాధవుఁడు
కమలరాగాశ్మలింగమునందు సప్తార్చి
          కమనీయరత్నలింగమున నేను
నీలలింగమునందుఁ బౌలోమ్యధీశుండు
          కరువలి వజ్రలింగంబునందు
గరుడదానవయక్షగంధర్వకిన్నర-
          ఖచరులు లోహలింగంబునందు


గీ.

భక్తిఁ బూజించి తమతమపదవు లొంది-
రేను నా యధిరాజ్యంబు నేలికొంటి
నర్థి నెవ్వని కృపఁ జేసి యట్టి నిన్ను
సంస్తుతించెదఁ జంద్రార్ధశకలమౌళి.

22

వ.

సర్వజ్ఞ [27]సకలసృష్టిస్థిత్యంతకారణవరేణ్య భక్తిగమ్య సకలకల్మషాపహ శ్రీపాదపద్మ వేదాగమపురాణేతిహాససంహితామహాఫలభూత సర్వభూతహృదయస్థిత అఖిలదేవమయ మహాదేవ నీకు నమస్కరింతు.

23


సీ.

ఎవ్వానియందుండు నెల్లభూతంబులు
          సింధువునందు వీచికలు వోలె
నెవ్వాఁడు వసియించు నెల్లభూతములందు
          నంబువుల్లోలంబునందు వోలె
నెల్లభూతంబుల హృదయంబులందును
          వసియించు నెవ్వఁ డాకసము వోలె
నొకఁడు పెక్కై తోచు నుదధిఁ జంద్రుఁడు వోలె
          నెవ్వఁ డజ్ఞానమూఢేంద్రియులకు


గీ.

పురు(షుఁ)డని బ్రహ్మమని యజ్ఞపురుషుఁడనియు
నర్కుఁడని వాయువని శక్రుఁడని హరియని
చంద్రుఁడని కొల్తు రాయాయి సరణివారు
భక్తి నెవ్వాని నట్టి నీ బంట నభవ.

24


వ.

ఒక విన్నపం బవధరింపుమా.

25


సీ.

ధర్మాసనమున [28]కాఢ్యతఁ గృప చేసితి
          [29]దక్షిణాశాధిపత్యంబు నొసఁగి
పాపులం బా(పా)నురూపదండంబుల
          దమియించుటకు నియోగము ఘటించి
చనవరిఁ జేసి [30]పంచిననాటినుండియు
          నేర్చిన చందాన నియమపరత
దేవరయాజ్ఞ యేదియు వెలిగాకుండ
          వర్తిల్లుదును సమవర్తి నగుచు


గీ.

నభవ యెన్నండు నా దూత [31]లాటువడరు
భర్గ యెన్నండు నా యాజ్ఞ పలుచఁగాదు
శర్వ సుకుమారుఁ[32]డనెడు దుర్జాతి పుట్టి
చావఁబట్టి యే నష్టకష్టములఁ బడితి.

26


గీ.

అభవ నీ కింకరుండు ఖట్వాంగహేతి
కాలమృత్యువు [33]మునిపండ్లు రాల మొత్త
మూలఁబడియున్నయది ముండమోపి వోలె
నిల్లు వెడలక యది మహాహ్రీభరమున.

27


హరిగతి రగడ.

[34]అయయో మొఱ్ఱో యబ్రహ్మ(ణ్య)ం [35]బనుచును నాక్రోశించుచు(ను మహా)-
భయవిహ్వలులై యేతెంచిరి మత్పార్శ్వమ్ములకు మదీయకింకరులు
[36]జయనాద హలా సమధికలీలాసంరంభంబున దేవర ప్రమథులు
పయికొని వచ్చిరి పులికళవసముల [37]ప్రహరించుచు వీఁపుల వెంటాడగ.

మ.

అవుఁగాకేమి జగజ్జనిస్థితిలయవ్యాపారపారంగతుం-
డవు నీ లెంకలచేత శిశుఁబడు టెగ్గా మద్భటశ్రేణి కీ
యవినీతాత్మునకై పిశాచమునకై యాభాసదుర్బ్రాహ్మణ-
బ్రువచండాలునకై [38]పెనంబడుటకై భూతేశ సిగ్గయ్యెడిన్.

29


సీ.

ముట్టైన చండాలి [39]ముట్టెనో ముట్టఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి
నన్యకామినుల ఱంకాడెనో యాడఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి
త్రావెనో త్రావఁడో [40]తాళ్ళ హాలారసం
          బడుగంగరాదె యీ యధమజాతి
గారాపుఁగన్నియఁ గవిసెనో కవియఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి


గీ.

రాజరేఖావిభూషణా! రాజసంపు
[41]తప్పు దండువు లేకుంట తథ్యమయ్యె
నిట్టి పాపాత్ము సర్వలోకేశ్వరుండు
[42]వెనుక నిడుకొన్న మాకు నేమనఁగ వచ్చు.

30


గీ.

ప్రమథు లవనిసురుని మేన బంధ మూడ్చి
వరుణపాఠంబు లెచ్చోట వైచినారొ
యరసి తెప్పించు వానిఁ జంద్రావతంస
నాకు నెర విచ్చినాఁ డంబునాయకుండు.

31


సీ.

జలధరంబులనుండి స్రవియించు జలధార
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చు
గగనమండలిఁ దారకాచక్రవాళంబు
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చు
భాగీరథీమహాపగలోని సికతంబు
          నెన్నవచ్చిననేని యెన్నవచ్చుఁ
గలశపాథోరాశికల్లోలమాలిక
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చుఁ


గీ.

గాని నరునకు నెన్నశక్యంబుగావు
పాయకీతండు చేసిన పాతకములు
భర్గ యేమని విన్నపింపంగ నేర్తు
నిట్టి పాపాత్ముఁ బొడఁగాన [43]మెన్నఁడేని.

32


గీ.

ఎన్ని శాస్త్రంబు లీక్షించియేని నేరఁ-
డెట్టి విద్వాంసుఁడైన నర్ధేందుమౌళి
యితఁడు చేసిన పాతకం బింతటిదియ

[44]యనఁగ దానికి నిష్కృతి యాచరింప.

33


గీ.

[45]అపరతంత్రుండవని చెప్ప నాగమములు
నిగమములు నీక చెప్పుదు నీలకంఠ
యీ దురాత్ముని కతన నీ కెఱుకపడితి
[46]నపరతంత్రుండవైతి మా కందఱకును.

34


వ.

అని దండప్రణామంబు చేసి కరకమలంబులు మొగిడ్చి నిలిచియున్నఁ గనుంగొని మందస్మితసుందరవదనారవిందుండై యిందుధరుం డిట్లనియె.

35


సీ.

మకరరాశిస్థుఁడై మార్తాండు డుండంగ
          సమకొన్న మాఘమాసంబునందు
సితచతుర్దశినిశి శివరాత్రి యను పేరం
          బ్రఖ్యాతిగనిన యా రాత్రియందు
[47]నట్టి నాల్జాలును నవధానపరత[48]మై
          జాగరవ్రతచర్య జరుపవలయు
నా జాగరవ్రతం బనఘప్రాజాపత్య
          సత్ఫలం బీనోపు సాధకునకు


గీ.

నవనిసురుఁడాది చండాలుఁ డాదిగాఁగ
నీ వ్రతము సేయఁగా నర్హు లెల్లవారు
నన్ని చందాల నీ వ్రతం బలఘుఘోర-
పాతకంబుల నెల్లఁ గాల్పంగఁ జాలు.

36


శా.

జ్ఞానాజ్ఞానకృతంబులయ్యుఁ బశుహింసాబ్రహ్మహత్యాసురా-
పానస్తేయము లాదిగాఁ గలుగు పాపంబుల్ దహించున్ నిమే-
షానన్ శంభునిశావ్రతంబు ప్రబలజ్వాలావృతం బగ్ని [49]యె-
ట్లేనిం గాలుచు నార్ద్రశుష్కముల నొక్కిం తిధ్మభారంబులన్.

37


వ.

ఈ సుకుమారుండు.

38


గీ.

మకరరాశిస్థుఁడై (యంశుమాలి) యుండ
మాఘ(కృష్ణ)చతుర్దశి (మధ్య)రాత్రి
నన్నుఁ (బూజింప) [50]వీక్షించినాఁడు జను(లు)
(నట్టి)(కతమున) (పు)(ణ్యాత్ముఁ)డయ్యె నితఁడు.

39


వ.

అదియును.

40


గీ.

కూతుఁ జండాలి నాలిఁగాఁ గోరి రాత్రి
పుష్పములు గోయ నేతెంచి పువ్వుఁదోఁట
పార్శ్వమున నుండఁ గాంచె నా భక్తజనులు
నన్నుఁ బూజించి జాగరణ(ంబు) సేయ.

41


సీ.

తీర్థమాడింపంగ దివ్యాంబరము గట్టి
          చందనం బలఁదఁ బుష్పములు పూన్ప

ధూపంబు లర్పింప దీపంబు ముట్టింప
          ఘంట వాయింప శంఖంబు లూఁద
నైవేద్య మొసగంగ నాగవల్లీపూగ-
          మునఁ [51]కప్పురంబు దాంబూల మిడఁగ
నద్దంబు సూపంగ నాలవట్టము ద్రిప్ప
          సురటి వట్టంగఁ జామరము వీవ


గీ.

బహువిధ[52]స్తుతులు పఠియింపంగ వినియుఁ
గోయతనమునఁ బువ్వులు గోయవచ్చి
చూచి శివయామినీవ్రతస్థులను నన్నుఁ
దత్ఫలంబున గణపతిత్వంబు నొందె.

42


వ.

వేదసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి (బ్రహ్మ) బ్రహ్మత్వంబు నొందె. విద్యాసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి వసురుద్రాదిత్యులు దేవత్వంబు గైకొనిరి. రాజసూయసహస్రంబును నశ్వమేధాయుతంబును గపిలధేనుకోటిదానంబును బుణ్యక్షేత్రనివాసంబును దీర్థావగాహంబును నొనర్చిన ఫలంబు కోటిగుణితంబై సుకుమారునకు సిద్ధించె. ఇతండు సర్వతపస్వులకును నిఖిలపుణ్యవంతులకును సకలభాగ్యాధికుండు. వణిక్పథంబునఁ గల్పాంతపర్యంతం బనేకభోగం(బు ల)నుభవించి కాలాంతరంబున దధీచుండనం (బరఁగు) మాహేశ్వ[రుండై] భూమియందు జన్మింపఁగలఁడు. ఇట్టిది శివ[రాత్రి]పుణ్యవ్రత మాహాత్మ్యంబు.

43


గీ.

అనిన విని యంతకుండు పురాంతకునకు
భక్తిఁ బ్రణమిల్లి పరమతాత్పర్య మొప్ప
దేవదేవునిచే నుపదేశమంది
యభవురాత్రి యముండు సేయంగఁ బూని.

44


వ.

పుణ్యశివరాత్రివ్రతంబు చేయఁబూని యభవుతో “దేవా నీ భక్తులు మాననీయులు; వారి లక్షణంబులు నాకుఁ దెలియవలయు నానతి” మ్మనుటయుఁ బ్రసన్నహృదయుండై పరమేశ్వరుండు.

45


సీ.

అఖిలాంగకముల భస్మాలేప మొనరించు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
భసితత్రిపుండ్రంబు భాలపట్టికఁ దీర్చు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
రుద్రాక్షమాలికల్ రూఢిగా ధరియించు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
లింగపూజాసక్తిలీనమానసుఁడైన
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు


గీ.

(ప్రణవశతరుద్ర్య)మును [53]నధర్వంబు శిఖియుఁ
[54]బవనగీతియుఁ ద్వరితంబుఁ బౌరుషంబు
నీలరుద్ర్యంబుఁ బఠియించు నియతి నెవ్వఁ
డతని నా కూర్మిభక్తుఁగా నాత్మఁ దలఁపు.

46


వ.

అనిన విని ప్రీతిచేతస్కుఁడై యముఁడు మాహేశ్వరుండును, దక్షిణామూర్తియు, మృగాంకధరుండును, నీలకంఠుఁడును నగు

 పరమేశ్వరునకు నభివాదనంబు చేసి “దేవ! సుకుమారుని నిమిత్తంబున దేవరచేతఁ బుణ్యశివరాత్రీవ్రతమాహాత్మ్యంబును, భస్మోద్ధూళనత్రిపుండ్రమాహాత్మ్యంబును, రుద్రాక్షమాహాత్మ్యంబును నెఱింగితిఁ గృతార్థుండనైతి” నని పలికి పునఃప్రణామం బాచరించి సముచితప్రకారంబున వీడ్కొని యముండు నిజపురంబునకుం జని సభామధ్యంబునం ధర్మాసనాసీనుండై [యౌలుం]బరాదుల తనదూతల రావించి యందఱం [గలయం] గనుఁగొని యిట్లనియె.

47


గీ.

వినుఁడు భటులార యవధానవృత్తి మీరు
శంభుభాషిత ముడుగుఁడు సంశయంబు
ధరణి నెచ్చోటనై[న]నుఁ దిరుగునప్పు-
డిందుశేఖరు భక్తుల నెఱుఁగుకొనుఁడు.

48


వ.

వారి లక్షణంబు లెటువంటివనిన.

49


సీ.

కమియ భస్మోద్ధూళనము శరీరంబున
          భసితత్రిపుండ్రంబు భాలమునను
బ్రణవమంత్రజపంబు రసనాంచలంబున
          సావిత్రి హృదయాంబుజంబునందు
శతరుద్రశివసూత్ర జ[ప] మహాదేవాది
          నామావళీకీర్తనము గళమున
శివపురాణాగమశివకథాశివకీర్తి
          శివమహత్వంబులు శ్రవణములను


గీ.

నలవరించినవారు పురారిభక్తు
లట్టివారల దౌల నందంద కాంచి
భక్తి నంజలిచేసి తాత్పర్యమొప్ప
దొలఁగిపొం డెల్లకాలంబు దూతలార.

50


సీ.

మృగటంకధరుఁడైన మీనాంకదమనుని
          రక్తవర్ణంబైన రాజమౌళి
పంచాననుండైన పరమేశ్వరుని దక్షి-
          ణామూర్తియైన పినాకపాణి
నర్తకుండైన పన్నగపతిగ్రైవేయు
          నర్ధనారీశ్వరుండైన శివుని
దివిజవంద్యుండైన త్రిపురాసురాంతకు
          (బహుమూర్తియుతుఁడైన ఫాల)నయను


గీ.

నాత్మ నెవ్వఁడు చింతించు (ననవరతము)
నతని శివభక్తుఁగాఁ దెలియంగవలయు
వందనం బాచరింపంగవలయు నతని
కర్థి(ని) బ్రదక్షిణంబు సేయంగవలయు.

51


సీ.

కడు నేకకాలద్వికాలత్రికాలంబు
          నంగంబులందు భూ తలఁదిరేని

యజ్ఞానమునఁ బ్రమత్తాలస్యముననైన
          ధవళాంధుకోటీరుఁ దలఁచిరేని
మృడునకునై యష్టమీచతుర్దశులందు
          నుపవాసముండంగ నోపిరేని
షట్కాలములయందు సర్వలోకేశ్వరు
          శ్రీమహాదేవుఁ బూజించిరేని


గీ.

వారు మాన్యులు పార్వతీవల్లభునకు
వారె వంద్యులు మముఁబోఁటివారికెల్ల
నట్టివారల మన్నింపరైతిరేని
ద్రోహమగు మీకు నాకు నద్రోహులార.

52


క.

శివునెడ భక్తియు నెప్పుడు
శివభక్తుల జూచినపుడు శివుఁడను తలఁపున్
శివశివ కలిగినవారల
[55]శివసాదృశ్యులను మీరు చేరకుఁ డెపుడున్.

53


క.

అలవోకయుఁ గలలోనను
మలహరుభక్తులను నీశు మన్నించినవా-
రల (భక్తవరుల) శైవులఁ
దలఁపకుఁడీ దూతలార దండింపంగన్.

54


ఆ.

పాపకర్మునైన భాగ్యహీనునినైనఁ
బట్టిచూడ మీకుఁ బాడిగాదు
శైవవరులఁ జేరి సేవించువారలు
పురహరుండ కాఁగ బుద్ధి గనుఁడు.

55


ఆ.

జంతుకోటిలోన శంకరపాదాబ్జ-
సేవ సేయువారిఁ [56]జేర కెపుడు
దూరమందుఁ దొలఁగి దూషింప కెంతయు
భక్తి గొలువవలయు [57]భటులు మీరు.

56


క.

ప్రాసాదము నిర్మాల్యము
వాసితొ పాదోదకంబు వైభవ మలరున్
[58]డాసినఁ గైకొనువారలఁ
దా సేవింపంగవలయుఁ దథ్యము సుండీ.

57


వ.

అని కృతాంతుఁడు తామసాధ్వానంబు(?) నౌలుంబరాదులకుఁ జెప్పి యీ ప్రకారంబులయందు ఘంటాధ్వానంబులతో సర్వజంతువిజ్ఞాపనంబుగాఁ జాటుండని యంతర్ధానంబు గావించె. దూతలు నట్లు కావించిరి. ఈ ప్రకారంబున శౌనకాదులకు రోమహర్షణమునిప్రవరసుతుండు సూతుండు చెప్పెనంత.

58


శా.

రామామన్మథ భోజరాజకవితారమ్యప్రభావో(న్న)తా
సామాగానవిశేషశాస్త్రకలనా సంభావ్యసారోదయా

సోమార్కానలనేత్రతేజ గురుశుశ్రూషాత్మసంవర్ధితా
(హేమాద్రీశ్వర ధైర్య! దానఖచరా) [59]యిద్ధప్రతాపోన్నతా.

59


క.

లింగార్చ(నదే)హా నవ-
సంగత శైవార్థతత్వసముదితమోహా
శృంగారార్థవిశేషా
మంగళసంధానకృత్య మహిమౌన్నత్యా.

60


మాలిని.

పరమపరకలాపా భాసురానంగరూపా
సురుచిరశుభమూర్తీ శో[భితా]నందవర్తీ[60]
...............................................
...............................................

61

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యా
సనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రిమాహాత్మ్యంబునందుఁ
బంచమాశ్వాసము.

  1. తా. వితస్తానాది మధ్యంబున
  2. తా. కన్యకాంత
  3. తా. గారవమున
  4. ము. ను
  5. తా. యందేని
  6. తా. యవని జలము
  7. తా. సుయశోభీధనకాంతా
  8. తా. నిశరవాండనై
  9. తా. నెఱుఁగ
  10. తా. సన్నిధానముకు నేఁగి
  11. తా. కంఠా
  12. ఈపాదములకు సరిపోవునంత స్థలము తాళపత్రమున ఊరక విడువబడినది
  13. తా. మాహిషి
  14. తా. ప్రమథిసేనా
  15. తా. అద్వెతతత్వవేదద్వయరహస్యజ్ఞాన
  16. తా. బర్వతోద్భవాపూర్ణుం బార్శ్వబాగు
  17. తా. పాదాంభోరుహద్వంద్వపీఠికోపాంత
  18. తా. మహమేకయా
  19. తా. రహస్త్యకణాయమాన
  20. తా. నిటల
  21. తా. సంట్టతమస్తసమస్తోపాధిధ్రుమమితి
  22. తా. హలపవిత
  23. తా. కైవయం భవత్తం జ్ఞాతుం
  24. తా. కస్యేకయో వాచా
  25. తా. కతివిధగుణయన్ హలమిహభిరుహే యై రసై
  26. తా. శోలినః
  27. తా. సకలస్థిత్యకారణవరేణ్య
  28. తా. కాద్యత
  29. తా. దక్షిణేశాధిపత్యంబు
  30. తా. పంపితి
  31. తా. లోటు
  32. తా. డనియెడి
  33. తా. ముకుబండ్లు
  34. తా. అయిదొ మొరయో
  35. తా. బని యాక్రోశించుచు
  36. తా. జయవాది
  37. తా. వీఁపులు ప్రహరించుచు వెంటాడించంగను
  38. తా. పెనుంబడుటకై
  39. తా. ముట్టునో
  40. తా. త్రాళ్ళ
  41. తా. తప్పుతండువు
  42. తా. వెనక
  43. తా. మెన్నండూ
  44. తా. యనుని; ము. యగునె
  45. తా. అవిర
  46. వపర
  47. తా. నాటి
  48. తా. యై
  49. తా. య
  50. తా. వీక్షించునాఁడు
  51. తా. గప్పురమునం
  52. తా. స్తోత్రముల్
  53. తా. నధ్వరంబు
  54. తా. బాపనీతియు
  55. తా. శివసాదృశ్యులురు
  56. తా. జేయ
  57. తా. భటుల
  58. తా. దాసిన
  59. తా. యుద్ధ
  60. తాళపత్రమున రెండు పాదములే యున్నవి.