వరాహపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

క.

శ్రీకర కీర్తివరారో | [1]హాకేళీమందిరాయితాజాండవధూ
లోకవిలోకచకోరని | శాకర! కొలిపాక యెఱ్ఱ సచివ[2]వరేణ్యా!

1


వ.

ఆకర్ణింపుము. రోమశుండు మార్కండేయున కిట్లనియె.

2


ఆదివరాహమూర్తి భీషణవిహారము

ఆ.

ఆమహావరాహ మత్యంతభీషణ | దేహ మమర, దళితదిక్క మగుచు,
జానుదఘ్నసప్త[3]సాగరజలములఁ | గలఁచి, పంకిలములుగా నొనర్చె.

3


సీ.

ఘనతరఘోణాగ్రమున నొక్కచో ధాత్రి | ఘుర్ఘురధ్వనులతోఁ [4]గుద్దలించుఁ,
బాదుగా నిల్చి సంభ్రమమున నొకచోటఁ | గొసవెండ్రుకలు నిక్కఁ గొప్పరించుఁ,
గఠినవాలము బెట్టుగాఁ [5]దీసి యొకచోటఁ | గడిమిమై రొప్పుచు గద్దరించు,
భూరి[6]దంష్ట్రాటంకముల గ్రుచ్చి యొకచోట | నగముల నుడువీథి కెగురఁజిమ్ముఁ,


తే.

చరణఖురఘట్టనంబుల జలధిమధ్య | జంతుజాలంబు నొకచోట సంహరించు,
దుష్టశిక్షణ [7]భక్తివిశిష్టరక్ష | ణాకులంబైన యమ్మేటియేకలంబు.

4


వ.

ఇట్లు బహుప్రకారంబుల విహారంబు సల్పి, జగదాభీలం బగుచున్న యయ్యాది
[8]కోలంబుఁ గనుంగొని, హిరణ్యాక్షుండు రోషకషాయితాక్షుం డగుచు, సింహనాదంబుల దిగ్వే
దండంబుల బెండుపడం జేయుచు డగ్గఱి.

5


హిరణ్యాక్షుఁడు వరాహమూర్తిని దాఁకుట

శా.

కోపోద్రేకకరాళభావమున రక్షోవల్లభుం డార్చి, లీ
లాపోత్రిం గరశాతఖడ్గహతి నుల్కంజేసి, తద్ఘోరదం
ష్ట్రాపాతంబున కోహటించి, నిశితాస్త్రంబుల్ ప్రయోగించి, మా
యాపాండిత్యము చూపినం, గనలి బ్రహ్మాండంబు ఘూర్ణిల్లఁగన్.

6

చ.

ఘన[9]తరఘోషవేగమగు గర్జిత మూర్జితభంగి నింగి దా
ర్కొనఁ గొనగొల్పి, తాపమును గోపము నొక్కట ముంపుచుండ మీఁ
దను దనుజేంద్రుపైఁ జనిన తత్క్షణ మాక్షణదాచరుండు నిం
పునఁ బునరస్త్రవర్షమున ముంచె సుదంచితలీలఁ [10]గోలమున్.

7


క.

వాలమ్మున నాదైత్యుని | వా లమ్ములు దాఁకకుండ వడిఁ జదియుచు నా
కోలమ్ము [11]గవిసె జితకా | కోలమ్మగు రోషవహ్ని గొబ్బున నిగుడన్.

8


చ.

కవిసినఁ, [12]గ్రేళ్ళు దాఁటి మదిఁ గంపము లే కసురేంద్రుఁ డంబికా
ధవవరలబ్ధమైన నిశితంబగు శూలము వైవఁ, దత్కిటి
ప్రవరుని చెక్కు నాటి, కనుపట్టె నిశాచరరాడ్వధార్థమై
చెవికడఁ [13]జేరి, మంతనము చెప్పఁగ నిల్చినభాతి నందమై.

9


వ.

ఇట్లు నక్తంచరప్రయుక్తంబై, నిజకపోలపాలికాసక్తంబైన యాభీలంబగు శూలంబు
నేలంబడ విదిర్చి, కోపాటోపంబున,

10


హిరణ్యాక్షసంహారము

ఉ.

ఆదివరాహ మప్పు డమరాహితుఁ గూలఁగఁ దూఁటి, తీక్షదం
ష్ట్రాదళితాంగుఁ జేసి, నవరక్తకదుష్ణతదాంత్రమాలికా
చ్ఛేదము లంబరమ్మునకుఁ జిమ్ముచుఁ గ్రీడ యొనర్చె, రాక్షసుల్
మోదవిహీనభావమున ముందఱగానక తల్లడిల్లఁగన్.

11


వరాహమూర్తి వసుంధరను దంష్ట్రాగ్రమున నుద్ధరించుట

చ.

దురమున లోకకంటకుని దుర్మదు నిట్లు వధించి, యామినీ
చరనివహంబునెల్ల యమసద్మముఁ జేరఁగఁ [14]బంచి, మేరుభూ
ధరపురదేశకాననవితానధురంధరయైన యావసుం
ధర నురుదంష్ట్రికాగ్రమునఁ దాల్చి, పయోనిధిమీఁది కెత్తినన్.

12


క.

విమలంబై తద్దంష్ట్రా | గ్రమునన్, భూదేవి మృత్తికాతనుఖండ
క్రమమునఁ జాలఁగ నొప్పెను | సుమనస్సంఘంబు లెల్లఁ జోద్యంబందన్.

13

క.

కిరివరదంష్ట్రాదండో | పరిభాగము[15]నందు వాతపత్రముకరణిన్
ధరణీచక్రము తనరెను, | సురశైలము పసిఁడిగుబ్బచొప్పున నొప్పెన్.

14


వ.

ఇవ్విధంబున లీలాకోలదంష్ట్రాగ్రస్థానసమాసీనయగు భూదేవి యాదేవదేవుని
నిట్లని స్తుతియించె.

15


భూదేవికృతవరాహస్తుతి

శా.

శ్రీరాజన్ముఖపద్మ! దేవపటలిసేవ్యాంఘ్రివిభ్రాజితా!
దూరాపాస్తసమస్తదైత్య! సుమనోదుఃఖార్తివిచ్ఛేదనో
దారస్వాంత! జగత్త్రయైకనిలయా! దాక్షిణ్యపాథోనిధీ!
ఘోరాకారహిరణ్యలోచనహర! క్రోడావతారోజ్జ్వలా!

16


క.

హర భాస్కర శేషఫణీ | శ్వర వాణీవరుల కైన వశమే పొగడన్?
నిరుపమ నిర్మల నిశ్చల | నిరవధికము లైనయట్టి నీ[16]సుగుణములన్.

17


క.

సనకాదియోగిమానస | వనజంబులయందు, భాగవతులందు, సుధా
శనకోటియందు నుందువు, | నిను వినుతింపంగఁ దరమె నీరజనాభా!

18


క.

కొందఱు శూన్యం బనియును, | గొందఱు తేజస్స్వరూపగుణనిధి యనియున్,
గొందఱు కాలంబనియును | సందెఱుఁగక తలఁతు రుదితసందేహమునన్.

19


క.

అణువులలోఁ బరమాణువు, | ప్రణుతింప మహత్తులందుఁ బరమమహత్తై,
గణనకు నెక్కు జగత్కా | రణ[17]మగు నీ[18]పెంప యిందిరాహృదయేశా!

20


చ.

నతమతి నీగుణస్తుతి యొనర్చిన యాశ్వపచుండు సర్వపూ
జితుఁ డగుఁ, దావకాంఘ్రిసరసీరుహభక్తివిహీనుఁడై చతుః
శ్రుతిపఠనంబు చేసిన [19]విశుద్ధకులోద్భవుఁడైన నంత్యజ
ప్రతిముఁ డగున్, జగత్త్రితయపావనకీర్తన! పుణ్య[20]వర్తనా!

21


క.

అకృతప్రయత్నుఁడై తను | వికృతిం బ్రాపించునపుడు 'విష్ణో!' యనుచున్
సకృ[21]దుచ్చరణము చేసినఁ | బ్రకృతిగుణవిరహితుఁ డగును బతితుం డైనన్.

22

శా.

వేదార్థంబులు వేఱుగాఁ [22]దెలిసి, దుర్విజ్ఞాను లాత్మేశ్వరా
భేదధ్యానసమేతులై, తుదిభవత్ప్రీత్యర్థమై కర్మముల్
మోదంబొప్పఁగఁ జేయనేరక, మహామోహాంధులై యుందు రం
తాదివ్యాప్తివిహీనసంసృతిసముద్రాంతర్నిమగ్నాత్ములై.

23


సీ.

మాధవ! నీనామమంత్రామృతము జిహ్వ | కుత్తుకబంటిగాఁ గ్రోలువారుఁ,
గమలాక్ష! నీకథాగంగాంబువులఁ దోఁగి | కలుషపంకము వాయఁ గడుగువారుఁ,
బరమేశ! నీ[23]భక్తిభజననిక్షేపంబు | దొరకిన నుబ్బి మైమఱచువారు,
బలిభేది! [24]నీకుఁగా నిలఁ గర్మపృథురత్న | వితతి సంప్రీతి నర్పించువారుఁ,


తే.

త్రిదశవందిత! భవదీయపదసరోజ | సీమ నిజచిత్తభృంగంబుఁ జేర్చువారు
వరుసఁ గ్రీడింతు రానందభరితు లగుచుఁ | బుష్పసాయకజనక! నీపురవరమున.

24


సీ.

శ్రీబీజ భువనేశ్వరీబీజములు రెండు | బిందుయుక్తములుగాఁ బ్రేమ నిలిపి,
నెఱి, మహా[25]దేవాయ పరమాత్మనే వరా | [26]హాయని వేదరూపాయ యనిన,
నేకవింశాక్షరంబై కోలదేవతా | కంబగు మంత్రరాజంబు వొడము,
నిట్టి నీమంత్రంబు నింపుతోఁ బ్రణవాది | కమును, [27]స్వాహాంతంబుగా జపించి,


తే.

భక్తి నశ్వత్థసమిధా[28]జ్యపాయసములఁ | బావకుని దన్పి మంత్ర[29]తర్పణ మొనర్చి,
భూమిసురభోజనము పెట్టి పొలుచునట్టి | మానవుం డేలు, నీమహీమండలంబు.

25


క.

విను మీమంత్రంబునఁ జం | దన [30]మభిమంత్రించి ఫాలతలమునఁ దాల్పన్,
జనవనితాశతయుతభూ | ధనలాభము గలుగు, విమతదర్పము [31]నణఁగున్.

26


క.

ఏతన్మంత్రపరాయణ | తాతిశయంబున మనుష్యుఁ డైహికభోగో
పేతుఁడయి కాంచుఁ బిదప స | నాతనభవదీయపట్టణస్థితిసుఖమున్.

27


క.

అగణితబాహుపరాక్రముఁ | డగు కనకాక్షుని వధించి యఖిలజగంబున్
మగుడంగ నుద్ధరించితి | [32]వగజానుతపుణ్యనామ! యహితవిరామా!

28

మ.

అని విశ్వక్షితికామినీమణి వరాహాకారుఁడైయున్న శ్రీ
వనితానాథుని, వేదవేద్యునిఁ గృపావార్ధిం బ్రశంసించి, త
ద్ఘనదంష్ట్రామయ[33]దివ్యపీఠమున నుత్సాహంబుతో నిల్చెఁ, బు
ణ్యనదీసాగరతీర్థపర్వతవనీనానార్థసంయుక్తయై.

29


ఉ.

అంబుజనాభుఁ డిట్లు కిటియై ధరణీతల ముద్ధరించి, యిం
ద్రుం బరమానురాగమునఁ దొంటి[34]గతిన్ సురలోకరాజ్యపీ
ఠంబున నిల్పెనంచుఁ బ్రకటంబుగఁ జెప్పిన రోమశున్, సమ
గ్రంబగు భక్తిఁ గన్గొని, మృకండుతనూజుఁడు పల్కె వెండియున్.

30


క.

ఏకర్మము శ్రుతి[35]సమ్మత? | మేకర్మము మోక్ష[36]లబ్ధిహేతువు? దురితం
బేకర్మమువలనం దెగు | నాకర్మము నాకుఁ దెల్పు మార్యలలామా!

31


వ.

[37]అని పల్కిన మార్కేండేయమునీశ్వరునకు రోమశుం డిట్లనియె.

32


క.

నీయడిగిన యీయర్థమె | తోయజభవు నడుగ నారదునకును వాణీ
నాయకుఁడు మున్ను కర్ణర | సాయనముగ నొకటి చెప్పె నది విను మనఘా!

33


నలినాసననారదసంవాదము

సీ.

నారదుం డొకనాఁడు నలినాసనుని పాలి | కరిగి, తద్దివ్యసభాంతరమున
నుచితాసనంబున నుండి, కేలుమొగిడ్చి, | మహనీయ మోక్షధర్మంబు లెవ్వి?
యని ప్రశ్న చేసిన, నఖిలార్థతత్త్వజ్ఞుఁ | డైన వాణీశుఁ డి ట్లనుచుఁ, బలికె,
నాదివరాహదం[38]ష్ట్రాగ్రసంస్థాయిని | యైన భూదేవి తో[39]యరుహనాభుఁ


తే.

బ్రస్తుతింపుచు మోక్షధర్మముల నడుగ | నా మహాపోత్రి ధాత్రికి నాదరమునఁ
దెలిపినట్టి తెఱంగు నేఁ దేటపఱతు | నిరవుమీఱంగ విను మది యెట్టిదనిన.

34


మ.

అసురాగ్రేసరుఁడై తనర్చిన హిరణ్యాక్షుండు హేమాద్రితో
వసుధాచక్రము నబ్ధిలో మునుఁగవైవం, జక్రి వారాహగా
త్రసమేతుండయి యుద్ధరించె మును, తద్దంష్ట్రాసమాసీనయై
పొసఁగన్ భూసతి యిట్లనుం బ్రణుతివాక్పూరంబుగా శౌరికిన్.

35

మోక్షప్రదమగు భాగవతధర్మనిరూపణము

ఆ.

వనజనాభ! భాగవత ధర్మ మెయ్యది? | [40]వలయు చిహ్న [41]మెద్ది వైష్ణవులకు?
మనుజుఁ డేమిమూలమున ముక్తిఁ బ్రాపించు? | నానతిమ్ము వీని నాదరమున.

36


వ.

అని పలికిన భూదేవికి భూదారవల్లభుం డిట్లనియె - నని రోమశుండు మార్కండేయుం
గనుంగొని.

37


తే.

[42]కర్మభూమి సమస్తలోకములయందు | వసుధ, యాధాత్రిపై భాగవతవిశిష్ట
ధర్మ మబ్జాక్షచరణపద్మ[43]స్తవంబ, | యది యొనర్చిన నరుఁడు తత్పదము గాంచు.

38


క.

[44]నిర్మలబుద్ధులు, సుజనులు, | ధర్మజ్ఞులు, [45]సత్యరతులు దానాఢ్యులు, స
త్కర్ములు, నరయఁగ వైష్ణవు | లర్మిలిఁ బొందుదురు వీరు హరిమందిరమున్.

39


క.

హరికి సమర్పితములుగాఁ | బురుషుఁడు కర్మము లొనర్చి పునరావృత్తిం
బొరయక, వైకుంఠమహా | పురమున సుఖముండు దివిజపూజ్యుం డగుచున్.

40


కాలస్వరూపము

ఉ.

అక్షయపుణ్యమూర్తి, విభుఁ, [46]డాద్యుఁడు, సర్వ[47]విదుండు, పుండరీ
కాక్షుఁడు విశ్వమింతయుఁ బ్రియంబున మున్ను సృజించి, మీఁదటం
గుక్షిగతంబుగా మెసఁగు గొబ్బున స్వీకృతకాల[48]రూపుఁడై
దక్షత నూర్ణనాభము విధంబునఁ దద్భువనప్రపంచమున్.

41


వ.

కావున సమస్తంబును గాలవశంబుగా నెఱుంగునది యని యాదివరాహంబు భూదే
వికిఁ జెప్పెనని, చతుర్ముఖుండు నారదున కిట్లనియె.

42


ఉ.

వాల [49]వృష ప్రకేతు శుక వజ్ర[50]2గురుండు మహాశ్వకేతు శై
వాల కుశ త్రిలోచన సుపర్ణ రథాశ్వ నృగాది పూర్వభూ
పాలవరేణ్యు లత్యధికబాహుపరాక్రము, లట్టివారుఁ ద
త్కాలముచేతనే తెగిరి గాదె, తలంప మహీసురోత్తమా!

43


ఆ.

వాఁడిసూదిచేత వనజదళంబులు | నూఱు కూడఁబట్టి తూఱఁ బొడుచు
కాల మది క్షణంబు, క్షణములు పది గూడఁ | గాష్ఠ, కాష్ఠ లేడు కళ దలంప.

44

క.

ఆకళ లిరువది గూడ శు | భాకర! యరగడియ యయ్యె నవి రెండు మహీ
లోకమున ఘటిక యనుచు వి | వేకించిరి గణితశాస్త్రవిద్యా[51]చరితుల్.

45


సీ.

అవి రెండు గూడిన నగు ముహూర్తము, ముహూ | ర్తములు ముప్పది దివారాత్ర మయ్యెఁ,
బదియేను దినములు పక్షంబు, పక్షద్వ | యంబు మాసం, బది యాఱుఁ గూడ
నయనమై పరఁగు, నాయయనయుగ్మముఁ గూర్ప | వత్సరంబగు, నట్టి వర్షశతము
లురవడిఁ బది గూడ నొక సహస్రంబగుఁ, | జర్చింప శతసహస్రములు లక్ష


తే.

యరయ లక్షలు పదిపదు - లైనఁ గోటి, | యట్టి కోటులు ధర నేఁబదైన నాకు
నర్ధయామము, విను [52]మంతనంత నృపతు | లస్తమింతురు [53]కాలసంగ్రస్తు లగుచు.

46


క.

రవి గమనాగమనంబులఁ | బ్రవిమలమానసులు కాలపరిణామంబున్
వివరింతురు, తద్విరహిత | మవునేనియుఁ దెలియ దస్మదాదులకైనన్.

47


క.

నాళీకాసన దివిష | త్పాలక నృపముఖులు కాలపరిభూతులు, త
త్కాలమును గెలువ నోపఁడు | కాలాత్మకుఁడైనయట్టి కమలాధవుఁడున్.

48


వ.

ఇట్టికాలంబు కృతత్రేతాద్వాపరకలియుగాదిభేదంబులం బ్రవర్తించు.ఆయుగం
బులయందు జనులు స్వకులాచారసంయుక్తులై బహ్మక్షత్రియవైశ్యశూద్ర రూపంబులఁ
జతుర్విధంబులై యుందురు. అందు నగ్రగణ్యులైన భూసురులు [54]బ్రహ్మచారిగృహస్థవాన
ప్రస్థయతిభేదంబుల నాలుగుతెఱంగులైరి. ఇంక బ్రాహ్మణజాతీయధర్మంబు లెట్టివనిన.

48


చాతుర్వర్ణ్యధర్మములు

సీ.

స్నానంబు వేద మార్జవ [55]మమాత్సర్యంబు | దానం బహింస నిస్తంద్రభావ
మతిథిసత్కారంబు లగ్నిహోత్రంబులు | సంధ్యాదికృత్యముల్ [56]సర్వసమత
హరిచింతనము సంతతాచార మక్రోధ | మాస్తిక్య మమృతవాక్యప్రచార
మాదిత్య[57]సేవ యోగారూఢభావంబు | పైతృకాచరణంబు భావశుద్ధి


తే.

భాగవతభక్తి కామాదిభంజనంబు | దయయు దాక్షిణ్య మఖిలశాస్త్రార్థదృష్టి
ప్రాజ్ఞసంగతి సాధువర్తన ముముక్ష | యనఁగ, నివి విప్రధర్మంబు లనఘచరిత!

50


చ.

హరిపదభక్తియున్, దయయు, నాహవమున్, రిపుభేదనంబు, సు
స్థిరహృదయత్వమున్, [58]విబుధసేవయు, దానము, రాజ్యపాలనా
భిరతియు, సింధురాశ్వరథభృత్యసముద్ధరణంబు, నీతిసం
చరణము, మంత్రగోపన విచారము నా నివి రాజధర్మముల్.

51

ఆ.

క్రయము, విక్రయంబు, ద్రవ్యార్జనము, విప్ర | భక్తి, కరుణ, లాభపాటవంబు,
స్నానదాననియమభూనుతాచారంబు | లరయ వైశ్య[59]జాతి కర్హవిధులు.

52


క.

నలినోదర భూసుర నిశ్చలభక్తియు, స్వామిహితము శౌర్యము, రిపురా
డ్బలభేదనచాతుర్యము, |దలపోయఁగ శూద్ర[60]విహితధర్మము లనఘా!

53


విప్రుల విశిష్టధర్మములు

తే.

ఇట్టివర్ణంబులందు మహీసురుండు | సర్వకర్మసమాచారచతురుఁ డగుచుఁ
బావనము సేయు నిజపాదపద్మరేణు | ఖండసంయోగమున ధరా[61]మండలంబు.

54


క.

పదపంకజస్థలంబున | నదులును, గరములను వహ్ని, నగవుల సిరియున్,
హృదయంబునఁ బరమాత్మయు | విదితంబుగఁ బాయకుండు విప్రులకెల్లన్.

55


క.

జననంబున శూద్రునిక్రియ | జనియించి, విశిష్టకర్మసంస్కారవశం
బున గళితకల్మషుండై | మనుజుఁడు విప్రత్వ మొందు మౌనివరేణ్యా!

56


సీ.

పూర్వజన్మార్జితపుణ్యాతిశయమున | విప్రవంశమున నావిర్భవించి,
జాతకర్మాదిసంస్కారసంయుక్తుఁడై | యనుపమయోగవిఖ్యాతుఁ డగుచు,
దేశికోత్తమసమాదిష్టమార్గమున భి | క్షాభోజియై జటాచ్ఛటలు దాల్చి,
దండాజినంబులు ధరియించి మేఖలా | కౌపీనసహితుఁడై [62]కోపముడిగి,


తే.

విమలచేతస్కుఁడై వేదవేది యగుచు, | బ్రహచర్యంబు [63]2చరియించి పరమనియతి
నావ్రతాంతంబునను గృహస్థాశ్రమంబు | స్వీకరింపంగవలయు, నుర్వీసురేంద్ర!

57


క.

సమవంశజాతకన్యక | నమితగుణాదారఁ బెండ్లియై, గేహస్థా
శ్రమమున నుండిన విప్రుఁడు | సముచితకృత్యముల నిత్యసంతుష్టుండై.

58


మ.

కమలాక్షార్చనశాలియై, యతిథిసత్కారంబు గావించి, యు
త్తమసాద్వీమణియందు [64]నందనుల నుత్పాదించి, వర్గత్రయ
క్రమసౌఖ్యంబులు చెంది, యా వెనుక మోక్షప్రాప్తికి న్మూలకం
ద మనన్మించిన యోగముం దెలిసి, వానప్రస్థసన్మార్గమున్.

59


క.

కూరిమిఁ గైకొని, ధనసుత | దారాదులయందు నిర్గతస్పృహుఁడై, కాం
తార[65]మునఁ గందమూలా | హారంబులచేతఁ దృప్తుఁడై యటమీఁదన్.

60

తే.

సర్వసంగపరిత్యాగచతురుఁ డగుచు | భిక్షువేషము దాల్చి, పద్మాక్షుచరణ
వనజనిర్మలభక్తిసాధనము గాఁగఁ | జెందునది సజ్జనుఁడు హరిమందిరంబు.

61


కర్మయోగరహస్యము

ఉ.

జ్ఞానము కర్మమార్గమున సంజనితం బగుచుండుఁ, దన్మహా
జ్ఞానవిశేషపూర్వముగ సజ్జనవర్యులు కర్మలాభమున్
నూనక చేసి, తత్ఫలము మాధవమూర్తికి నర్పితంబుగాఁ
బూనియొనర్చి, విష్ణుపదభోగము గాంతురు భక్తియుక్తులై.

62


వ.

అట్టి కర్మంబులు నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధంబు లన నాల్గుతెఱంగులయ్యె. అందు
సంధ్యాకృత్యంబులు నిత్యకర్మంబులు. సోమసూర్యగ్రహణాదికాలకర్తవ్యంబులు నైమిత్తి
కంబులు. ఫలవాంఛాసమేతంబులు కామ్యకర్మంబులు. రజస్వలాసంభాషణంబులు
నిషిద్ధంబులు. వీనిలోనం గామ్యనిషిద్ధకర్మంబులు పరిత్యజించి, నిత్యనైమిత్తికంబులు
భగవత్ప్రీతిగా నాచరింపవలయు.

63


క.

ఫలవాంఛ చేసి నిత్యా | దులు భూసురుఁ డాచరించి, దుఃఖాకరుఁడై
యిలఁ బలుమరు జనియింపుచు, | బలవత్సంసారవార్ధిఁ బడును మునీంద్రా!

64


క.

హరినామకీర్తనంబును | హరిపూజాకరణ[66]రతియు హరిభక్తజనా
దరణంబును గావించిన | నరుఁ [67]డేఁగును విష్ణుపదమునకు మునినాథా!

65


విష్ణుపూజాక్రమము

క.

ఆలేఖ్యలోహలేపిత | శైలమనోరత్న[68]దారుసైకతకృతల
క్ష్మీలలనేశప్రతిమా | జాలములో నొకటిఁ బూన్పఁ జను మనుజునకున్.

66


వ.

తత్పూజాప్రకారం బెట్టిదనిన.

67


సీ.

స్నానపూర్వకముగా సంధ్యాదు లొనరించి, | గోమయపరిలిప్తభూమియందు
రంగవల్లీక్రియారమ్యమండపమున | భాసురపీఠంబుఁ బాదుకొల్పి.
పద్మాలయాధవప్రతిమ నచ్చట నిల్పి, | తన్ముఖాసీనుఁడై తలఁపు గలిగి
యందు లక్ష్మీనాథు నావాహనము చేసి, | క్రమమున నర్ష్యపాద్యము లొసంగి,


తే.

సరసచందన మలఁది పుష్పముల నించి | భక్తి మెఱయంగ ధూపదీపము లొసంగి,
బహువిధాన్నంబు లర్పించి ప్రస్తుతించి, | తగు నొనర్పఁ బ్రణామప్రదక్షిణములు.

68

క.

పావనసాలగ్రామశి | లావిధిఁ దాఁ బాయకుండు లక్ష్మీరమణుం
డావిమలోపలమున హరి | కావాహనవిధి యొనర్చు [69]టనుచిత మనఘా!

69


వ.

అనిన యాశారదాభర్తకు నారదుం డిట్లనియె.

70


క.

సాలగ్రామవిశిష్టశి | లాలక్షణ మెద్ది? యందు లక్ష్మీరమణుం
డేలీలఁ బాయకుండును? | బోలఁగ నా కానతిమ్ము భువనస్తుత్యా!

71


ఉ.

నావుడు పద్మసంభవుఁడు నారదసంయమి కిట్లనున్, మహీ
దేవికిఁ [70]గోలమూర్తి యగు దేవుఁడు మున్నెఱిఁగించెఁ, [71]దచ్ఛిలా
పావనలక్షణక్రమము భక్తి దలిర్పఁగ నీకు నాతెఱం
గే వివ[72]రింతు, విన్ము భవదీరితపృచ్ఛకు నుత్తరంబగున్.

72


పావనసాలగ్రామమాహాత్మ్యము

క.

హిమశైలగండకీమ | ధ్యమభాగము[73]నందు యోజనాయతవిస్తా
రమనోజ్ఞంబై కలదొక | యమలక్షేత్రంబు హరికి [74]నాశ్రయ మగుచున్.

73


క.

అన్నెలవునఁ బొడమినశిల | లన్ని యుఁ జక్రాంకితంబులై శుభదములై
సన్నుతి కెక్కుచునుండుఁ బ్ర | సన్నరుచిస్ఫురణ గలిగి సంయమివర్యా!

74


చ.

అనుపమపుణ్య[75]శీల! విను మద్భుత మచ్చటఁ బెద్దనిద్రకున్
గనుగవమూసెనేని కృతకల్మషుఁడైనను, శంఖచక్రసా
ధనములు బాహుదండములఁ దాల్చి జగజ్జనవందనీయుఁడై
తనరుచు, శ్రీహరిం గలయుఁ దత్క్షణమంద, యమందవైఖరిన్.

75


క.

శ్రీమత్పుణ్యాకర నిజ | నామంబై, ముక్తికారణంబై, తద్ధా
త్రీమండలంబు సాల | గ్రామక్షేత్రం బనాఁగ గణనకు నెక్కున్.

76


క.

అచ్చో నుదయించినశిల | నచ్చుగఁ బూజించునట్టి యనఘాత్ముఁడు పా
పోచ్చయ[76]విరహితుఁడై తుద | [77]విచ్చలవిడి విష్ణులోకవిభవముఁ జెందున్.

77

శా.

సాలగ్రామశిలార్పితప్రసవమున్ సద్భక్తిసంపన్నుఁడై
మౌళిం దాలుచు నెవ్వఁడేని యతఁ డస్మల్లోకముం [78]దాఁటి, జం
ఘాలుండై చని, విష్ణు[79]లోకమున సౌఖ్యంబందుఁ, బద్మాలయా
కేళీసౌధసమీపకాంచనమయక్రీడానివాసంబునన్.

78


క.

ప్రేమదలిర్పఁగ సాల | గ్రామశిలామధ్యమమునఁ [80]గదలక యుండుం
దామరసాక్షుఁడు, గావున | నామణి పూజార్హమయ్యె నమరమునీంద్రా!

79


మ.

లలితజ్ఞానధురీణ! యెచ్చటను సాలగ్రామరత్నంబు శో
భిలు, నచ్చో దివిజాపగాముఖనదీబృందంబు వర్తించు, ను
జ్జ్వలతం దచ్ఛిల [81]యున్ననల్గడఁ జతుశ్చాపప్రమాణావనీ
తల మత్యంతపవిత్రమై, సకలతీర్థశ్రేష్ఠమై పొల్పగున్.

80


క.

[82]విలసితసాలగ్రామో | పలనికటమునందుఁ జక్రపాణిని భక్తిన్
నెలకొలిపి, [83]కుముదకమలం | బులఁ బూజ యొనర్చునతఁడు ముక్తిం జెందున్.

81


సీ.

విప్రహంతయు, దేవవిత్తాపహరణుండు, | సతతపరాంగనాసంగరతుఁడు,
ద్యూతపానక్రియాదురితానురక్తుండు, | పతితుండు, స్వసృమాతృపాతకుండు,
గురునింద యొనరించుకుజనుండు, మూర్ఖుండు, | చండాలభామానుషంగ[84]పరుఁడు,
కులఘ్నుండు, పితృద్రోహి, | నాస్తికుం, డాచారనయవిదూరు


తే.

డైన, నుపవాసనియతుఁడై హరిదినమునఁ | బొసఁగ శ్రీమూర్తి విప్రున కొసఁగెనేని
పుష్పకారూఢుఁడై సర్వపూజ్యుఁ డగుచు | విష్ణుసాయుజ్య[85]మును బొందు విమలచరిత!

82


శా. సాలగ్రామము దానమిచ్చి నరుఁ డీసంసారదావానల
జ్వాలాంతఃపతితుండు గాక, వసుధాసౌఖ్యంబులం బొంది, ది
వ్యాలంకారసమేతుఁడై, నిజశరీరాంతంబున న్విష్ణుతే
జోలీనత్వము నొందుఁ, దూఱఁ డతఁ డిచ్చో మాతృగర్భాటవిన్.

83


చ.

హరికి సమర్పితంబగు వరాన్నమ యొండె, ఫలంబ యొండె, భా
సుర[86]సలిలంబ యొండె, చవి చూచిన, నెట్టిదురాత్ముఁడైనఁ ద
త్పరమపదంబు నొందు; విను పంకజనాభున కర్పితంబులై
పరఁగని వస్తువుల్, శునక[87]పాచకమాంససమంబు లారయన్.

84

క.

కావున భక్తిసమేతుం | డై, విప్రుఁడు నిజకులోచితాచారపరుం
డై, వరసాలగ్రామ | శ్రీవల్లభమూర్తిఁబూజ సేయఁగవలయున్.

85


క.

ప్రతిదినమును శ్రీమూర్తి | స్థితతీర్థము గ్రోలునట్టి ధీరుఁడు, పితృసం
యుతుఁడై హరిభవనంబున | వితతానందంబు ననుభవింపుచు నుండున్.

86


వ.

అట్టి సాలగ్రామంబులయందు గుణసమేతంబులగు కొన్ని మూర్తిభేదంబుల నాది
వరాహంబు భూదేవి కెఱింగించె. తత్క్రమంబు వినుము. వాసుదేవానిరుద్ధ నారాయణ
పరమేష్ఠి కపిల నారసింహ వరాహ కూర్మానంత హయగ్రీవ వైకుంఠ శ్రీధర వామన
ప్రద్యుమ్న సంకర్షణ చక్రనాభి మత్స్యో గ్రనారసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ జనార్దన
లక్ష్మీనారాయణ దధివామనంబులు పూజాయోగ్యంబులు. వీనియందు సంకర్షణమూర్తి
క్షత్రియులకుఁ, బ్రద్యుమ్నమూర్తి వైశ్యులకు, ననిరుద్ధమూర్తి శూద్రులకును గరస్పర్శన
పూర్వకంబుగాఁ బూజనీయంబులు. మఱియుం బూర్వోక్తమూర్తిభేదంబులయం [88]దతిశ్యామ
లంబు రోగకరంబును, గృష్ణవర్ణంబు కీర్తికరంబును, బీతవర్ణంబు ధనకరంబును, నీలవర్ణంబు
లక్ష్మీప్రాప్తికరంబును, బాండువర్ణంబు సంపన్నాశకరంబును, రక్తవర్ణంబు రాజ్యకరంబును,
గపిలవర్ణంబు పత్నీహానికరంబును నగు. వీని లక్షణంబులు వివరించెద. ఆకర్ణింపుము.

87


క.

ద్వారంబున సమచక్రము | లారయఁ గనుపట్టి ధవళమై [89]శుభదంబై
మీఱునది వాసుదేవ మ | నో[90]రమమూర్తి యన వెలయు నుతగుణనిలయా!

88


ఆ.

వెనుకవంకఁ బద్మమును, వక్త్రసీమరే | ఖాత్రయంబు పీతకాంతి[91]భరము
గలిగి, వృత్తమగుచుఁ గనుపట్టునది యని | రుద్ధమూర్తిగా నెఱుంగవలయు.

89


ఉ.

ఆయత[92]కాంతిపుంజసముదంచితమై, ఘననీలనీరద
చ్చాయఁ దనర్చి, వామగతచక్రయుగంబును, దక్షిణాంగరే
ఖాయుతమున్ శుభప్రదముఖంబునునై చెలువొందెనేని, నా
రాయణమూర్తిగా నెఱుఁగు, రాజితభక్తిపురస్సరంబుగన్.

90


క.

అతిశోభనమై, రేఖా | యతనంబై , పద్మచిహ్నమై, వృత్తనిజా
కృతియై చూపట్టిన, నా | యతమతి పరమేష్ఠిమూర్తి యని తెలియఁదగున్.

91


క.

[93]స్థూలతరచక్రయుగళము | నీలఘనద్యుతియుఁ గలిగి [94]నిరతగదారే
ఖాలంకృతమధ్యమ [95]మనఁ | జాలినయది కపిలమూర్తి సన్మునివర్యా!

92

క.

పృథు[96]వక్త్రమై, సుచక్ర | ప్రథితంబగు నృహరిమూర్తి, పరులకుఁ బూజా
గ్రథన మొనరింపరా, ద | శ్లథమానసుఁడైన బ్రహ్మచారికిఁ [97]దక్కన్.

93


తే.

పంచబిందుకకపిలంబు, భాసురత్రి | బిందుయుతనారసింహంబు పృథుతరప్ర
యత్నమునఁ బూజ యొనరించు నర్చకులకు | నపునరావృత్తి ముక్తిదాయకము లనఘ!

94


తే.

శక్తిలింగక మనఁగ దంష్ట్రాఖురాది | కములు గైకొని, విషమచక్రములు దాల్చి
సేవకాభీష్టదానప్రసిద్ధ మగుచుఁ | దనరునది [98]కోలమూర్తి సజ్జనవరేణ్య!

95


క.

స్థూలంబై, [99]వాసవమణి | నీలంబై, విబుధవర్ణనీయంబై, రే
ఖాలాంఛనత్రయంబై | క్రాలెడునది కూర్మమూర్తి గౌరవనిలయా!

96


తే.

హరితవర్ణాంకితము కౌస్తుభాభిశోభి | తంబునై మించి, [100]చరమభాగంబునందు
వర్తులంబైనయట్టి యావర్త మొకటి | యమరఁ గైకొన్న యదియ యనంతమూర్తి.

97


క.

ఎంచఁగ నంకుశరేఖా | పంచకమునఁ గలితమగుచు బహుబిందుకమై
మించి, నలుపైనయది వివ | రించ హయగ్రీవమూర్తి ఋషికులతిలకా!

98


క.

ఏకసు[101]చక్రము మణి[102]రే | ఖైకము, నంబుజయుతంబు ఘంటారేఖా
శ్రీకలితద్వారమునై, | ప్రాకటవైకుంఠమూర్తి భాసిలు ననఘా!

99


చ.

లలితకదంబపుష్పరుచిలక్షితమై, వనమాలికాసము
జ్జ్వలమయి, రేఖ లైదు చెలువంబుగఁ గైకొని, రాజ్యసంపదం
జెలఁగి యొసంగఁజాలునది శ్రీధరమూర్తి యనంగ నొప్పు; వ
ర్తులతయు, హ్రస్వభావమును రూఢిగ వామనమూర్తి చిహ్నముల్.

100


క.

అతసీనూతనకుసుమ | ద్యుతియును, విస్పష్టబిందుయోగము, రమ్యా
కృతియుఁ, ద్రివిక్రమమూర్తికి | శ్రుతిభాషితచిహ్నములు యశోధనవర్యా!

101


తే.

చక్రములు రెండు వామపార్శ్వమునఁ గలిగి, | దక్షిణంబున నొకరేఖ తనరఁ బూని,
వర్ణములు రేఖలును బెక్కువరుస మేన | నమరఁ గైకొన్న యదియు ననంతమూర్తి.

102


క.

నీరదవర్ణము, దీర్ఘా | కారంబును, సూక్ష్మచక్రకము, బహురంధ్రా
ధారమునై చూపట్టిన | నారయఁ బ్రద్యుమ్నమూర్తి యన విలసిల్లున్.

103


తే.

తాళలాంగూలచిహ్నముల్ దాల్చినట్టి | యదియుఁ బ్రద్యుమ్నమూర్తియ యనఁగఁ బరఁగు
రక్తవర్ణము దీర్ఘచక్రములు నంక | ములుగ సంకర్షణా[103]ఖ్యానమూర్తి తనరు.

104

సీ.

చక్ర మొక్కటి శిరస్స్థలమున ధరియించి | శోభిల్లునది చక్రనాభిమూర్తి,
యుభయపార్శ్వములందు నొగి మత్స్యరేఖలు | మహిమఁ దాల్చినయది మత్స్యమూర్తి,
భూరివక్త్రమును దంష్ట్రారేఖయును యతి | [104]నికరపూజ్యము నుగ్ర[105]నృహరిమూర్తి,
[106]డాపల గండ్రగొడ్డలి దక్షిణమునఁ జ | క్రము [107]గల్గ భార్గవరామమూర్తి,


తే.

చాపసాయకరేఖలు నవ్యసీమ | రమణఁ గైకొన్నయది రఘురామమూర్తి,
పీతమును గూర్చ సన్నిభపృథులచక్ర | కీర్తనీయంబు నగునది కృష్ణమూర్తి.

105


క.

విను, నాలుగుచక్రంబులఁ | గనుపట్టుచు, [108]సేవ్యమానకామ్యార్థదమై
వినుతికి నెక్కు జనార్దన | మను మూర్తి, సమస్తపూజ్య [109]మనఘచరిత్రా!

106


క.

చారుసమచక్రయుతము శి | రోరూఢసువర్ణబిందురుచిరము, వనమా
లారమ్యమునై లక్ష్మీ | నారాయణమూర్తి తనరు నతసౌఖ్యదమై.

107


తే.

[110]వామచక్రసమేతంబు వర్తులంబుఁ | జరేఖాయుతంబును, జారుధవళ
వర్ణకలితంబునై, దధివామనాఖ్య | మూర్తి శోభిల్లుఁ బశులాభమోదకరము.

108


వ.

ఇట్టి మూర్తిభేదంబులయందుఁ గపిలంబుసు, [111]దర్దురంబును, భగ్నంబు, నతిరూక్షం
బును, బహుచ్ఛిద్రంబును, బహుళాంకంబును, నిస్తలంబును, స్థూలంబును, నూర్ధ్వ
వక్త్రంబును, నధోవక్త్రంబును, బహువక్త్రంబు, నేకవక్త్రంబును, విశాలవక్త్రంబును, బార్శ్వ
వక్త్రంబును; వృత్తమాత్రాష్టమబాగాదికవక్త్రంబును, లగ్నచక్రంబును, దగ్ధంబును, నతి
రక్తంబును, భీషణంబు నగు సాలగ్రామంబు సత్పుత్రాదినాశకరంబు గావునఁ బరిత్యజించి,
దోషరహితంబులుసు, లక్షణసహితంబులు నగు సాలగ్రామంబులు పూజాదానయోగ్యంబు
లుగా నెఱింగి, యంగీకరింపవలయు.

109


తే.

ద్వారకాపురి, గండకీతటిని, చక్ర | తీర్థనారాయణక్షేత్రదేశయుగము
సంభవస్థానములు మునిసార్వభౌమ! | జగతి హరిమూర్తివరశిలాసంఘమునకు.

110


తే.

ద్వారకాసంభవం బాయతంబు, వర్తు | లంబు గండకీశిలయున్నతంబు చూడ
భవ్యనారాయణక్షేత్రసంభవంబు, చక్ర | తీర్థజాతంబు చక్తవిస్తృతయుతంబు.

111

క.

ఈలక్షణములు గలిగిన | సాలగ్రామోత్తమములు సంసారులకున్,
మేలొసఁగుఁ బూజితములై | భూలోకమునందు, విష్ణు[112]భువనమునందున్.

112


క.

వేమఱు సాలగ్రామశి | లామాత్రము బ్రహ్మచర్యలక్షణయుక్తుం
డై, ముక్తి గోరు[113]యతికిని | సామర్థ్యము[114]నం భజింపఁ జను ననఘాత్మా!

113


ఉ.

కావున విష్ణుభక్తి మదిఁ గల్గి, నరోత్తముఁ డంబుసంభవం
బై విలసిల్లు పద్మదళ మంబులిప్తము గానిరీతి, దో
[115]షావిలఘోరసంసరణసంగతుఁ డయ్యు, సుతాదిమోహవ
ల్లీవితతిం దగుల్వడి చలింపక, సజ్జనసన్నుతాత్ముఁడై.

114


ఉ.

ఉత్తమమధ్యమాధమకులోద్భవుఁ డయ్యును, సత్యవాక్య[116]సం
గత్తరుఁడై, నిషిద్ధములు కామ్యములు న్విడనాడి, నిత్యనై
మిత్తికకర్మముల్ హరికి మెచ్చుగఁ జేయుచు, నన్వయోచితో
దాత్తచరిత్రుఁడై, పరమధార్మికుఁడై, భగవత్ప్ర[117]పన్నుఁడై.

115


శా.

సాలగ్రామశిలాస్వరూపహరిఁ బూజం దన్పి, తత్పాదతీ
ర్థాళిం గ్రోలి, తదర్పితాన్నముల నాహారించి, తద్భక్తర
క్షాలోలుం డగుచు న్మెలంగి, జగదాశ్చర్యంబుగాఁ జెందుఁ, ద
న్నాళీకాక్షవిహారహారజనితానందైకభోగంబులన్.

116


వ.

ఇంక నొక్కయితిహాసంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

117


చోరోపాఖ్యానము

సీ.

పాటలీపురవరప్రాంతదక్షిణసీమ | శేఖరాహ్వయ మగు శిఖరి గలదు,
తద్గిరీంద్రమున బుత్రస్త్రీసమేతుఁడై | శూరాస్యుఁ డను నొక్కచోరకుండు
నిలయంబు కల్పించి, నిల్చి త్రోవలు గట్టి, | నరులఁ జంపుచుఁ దద్ధనంబులెల్ల
సంగ్రహింపుచుఁ బాపసంయుక్తుఁడై, ధేను | మాంసముల్ భుజియించి మత్తుఁ డగుచుఁ,


తే.

బ్రతిదినంబును సుతదారబంధువితతి | నరసి పోషింపుచును [118]శస్త్రహస్తుఁ డగుచుఁ
జౌర్యవిద్యాప్రవీణుఁడై, సాహసమున | నుక్కుమిగిలి విజృంభించి యొక్కనాఁడు.

118

ఉ.

కాలము చేరువయ్యె నని కానక, యాతఁడు తత్పురంబులో
వేలకుఁ గల్గి, మోటుగల విప్రునిగేహముఁ గన్నపెట్టి, తృ
ష్ణాలులితాత్ముఁడై, బలముచాయ యెఱుంగక సంచరించి, యు
న్మూలితచేష్టితుం డగుడు మూర్చిలి, తోడనె లబ్ధసంజ్ఞుఁడై.

119


క.

ఆలో ధనసంగ్రహమున | కై లేచి భయంబు లేక యాద్విజుగృహముం
[119]గేల వెరంజుచుఁ జోరుఁడు | సాలగ్రామాభిషిక్తజలములు గనియెన్.

120


వ.

ఇట్లు గనుంగొని, యమందానందంబు నొంది.

121


క.

అవి దప్పిదీరఁ గ్రోలిన | యవసరమున, యమునిదూత లాశూరాస్యున్
జవమున డగ్గఱి, [120]పాశ | ప్రవిబద్ధుని జేసి, యాత్మపట్టణమునకున్.

122


చ.

కొని చనునంతలోనన, ముకుందునికింకరు లడ్డగించి, త
ర్జన నినదోగ్రలీల సమరం బొనరించి, కృతాంతదూతలం
[121]గనుకనిఁ బాఱఁద్రోలి, భుజగర్వము దివ్యులు గాంచి మేలుమే
లని కొనియాడఁ, జోరుఁ గొని యప్పుడ యేఁగిరి చక్రిపాలికిన్.

123


వ.

ఇవ్విధంబున సాలగ్రామతీర్థపానవిలీనకల్మషభాసురుండగు చోరుని విడిపించు
కొని, వైకుంఠనగరంబునకుం బంకజోదరుకింకరు లరిగినఁ, గాలదూతలు పరాజయఖేద
సమేతులై, సమవర్తికడకుం జని యిట్లనిరి.

124


ఉ.

దేవరయాజ్ఞ మోచి, జగతీస్థలి కేఁగి, సమస్తదోషపుం
జావిలమానసుండగు దురాత్ముని, జోరుని బట్టి తేరఁగాఁ
జేవిడిపించి, యాఖలుని జేకొని రంబురుహాక్షదాసు లి
చ్ఛావిధి, [122]మున్నువోలె నిఁకఁ జాగవు తావకభృత్యకృత్యముల్.

125


సీ.

అని యిట్లు విన్నవించినఁ, గృతాంతుఁడు రోష | కలితుఁడై త్యక్తాధికారుఁ డగుచుఁ,
ద్రిదివంబునకు నేఁగి దేవతాభర్తకు | నీకథావృత్తాంత మెఱుఁగఁజెప్పి,
యతనితోఁ గూడి దుగ్గాబ్దిమధ్యమునకుఁ | జని, శేషశయనుని జలజనయను
దర్శించి, బహువిధస్తవములఁ గొనియాడి, | కరములు నిటలభాగమునఁ జేర్చి,

తే.

తస్కరునిచొప్పు, విష్ణుదూతలవిధంబు, | నాత్మభృత్యులు కుంఠితులైన తెఱఁగు
విన్నవించిన, నిందిరావిభుఁడు నవ్వి, | యాదరంబున యముని కిట్లనుచుఁ బలికె.

126


శా.

సాలగ్రామశిలాభిషిక్తసలిలాస్వాదక్రియాభీలం దం
భోళిధ్వస్తసమస్తదోషగిరియై, పుణ్యాగ్రగణ్యాత్ముఁడై
కేళి న్మత్పురి కేగుదెంచె దివిజుల్ గీర్తింప జోరుండు, నీ
వేలా దీనికి నుమ్మలించెద[123]వు నేఁ డీరీతి వైవస్వతా!

127


వ.

ఇంక నొక్కరహస్యంబు చెప్పెద నాకర్ణింపుము.

128


సీ.

మత్పాదపూజాసమాహితులగువారి, | మత్తీర్థములు గ్రోలి మసలువారి,
మదభీష్టకైంకర్యముదితాత్ములగువారి | మదుద్ధ్యానమున మేను మఱచువారి,
మద్భక్తజనదత్తమమకారులగువారి, | మత్కర్మనిరతులై మనెడువారి,
మన్మారసౌఖ్యంబు మరిగి పాయనివారి, | మత్క్రతుక్రియల నేమఱనివారి,


తే.

శౌర్యమునకైనఁ, గృతవిశేషమునకైనఁ, | దవిలి మచ్చిహ్నములు మేనఁ దాల్చువారిఁ
గరుణఁ జేపట్టి వైకుంఠపురికిఁ జేర్చి, | ప్రాణతుల్యులుగాఁ జూతు భానుతనయ!

129


ఉ.

కావున నీకు నొక్కహితకార్యముఁ జెప్పెద నింతనుండి మ
త్సేవకమందిరంబులకుఁ జేరితివేనియుఁ గాఁక వచ్చుజు
మ్మీ! వలదంచు [124]సౌరి నియమించి తిరోహతమూర్తి యయ్యె ల
క్ష్మీవరుఁ, డంతకుండు నరిగెన్ బలభేదియుఁ దాను గ్రమ్మఱన్.

130


వ.

అది కావున, బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రాదివర్ణజాతులును, [125]బ్రహ్మచర్యగృహస్థ
వానప్రస్థయత్యాశ్రమసమేతులును, నిజపూజాయోగ్యస్ఫూర్తులకు సాలగ్రామశ్రీమూర్తుల
నిత్యసన్నిహితుండగు రమాసహితుని నారాధింపవలయును.

131


హరినామసంకీర్తనప్రాశస్త్యము

క.

యుగములు నాల్గిటిలోఁ గలి | యుగమునఁ గల దొక్కసుగుణ [126]మోహో! మనుజుం
డగణితపాతకుఁ డయ్యును | సుగతికిఁ జను విష్ణుకథలు [127]సొంపుగ వినినన్.

132

సీ.

కృతయుగంబున భాగవతులకు మారుత | పూరణక్రియల నేపుణ్య మబ్బుఁ,
ద్రేతాయుగంబున శ్రీవధూవిభుఁ గూర్చి | తప మాచరింప నేధర్మ మొదవు,
ద్వాపరంబున యాగతంత్రాదికర్మముల్ | జరుప నేసుకృతంబు సంభవించు,
[128][129]మహితమౌ చతురాశ్రమస్వీక్రియావశ | మ్మున నేఫలంబు విస్ఫూర్తి నొందు


తే.

నట్టి పుణ్యాదికము, పంకజాక్షుమధుర | నామకీర్తనమాత్రంబునం జనించుఁ
గాన, యుగములయందెల్లఁ గలియుగంబు | భక్తకోటి కనాయాసముక్తిదం[130]బు.

133


వ.

మఱియుఁ గర్మయోగంబును, ధ్యానయోగంబును, భక్తియోగంబు నన, ముక్తిప్రాప్తి
కారణంబులు మూఁడు గలవు. అందుఁ గామ్యనిషిద్ధంబులు వర్జించి, నిత్యనైమిత్తిక
కర్మంబులు భగవత్ప్రీతిగా నాచరించుట కర్మయోగంబు. యమనియమాసనప్రాణాయామ
ప్రత్యాహారధ్యానధారణసమాధ్యష్టాంగమ్ములచేత హృదయాంభోరుహకర్ణికామధ్య
మంబునం బరమాత్ముదర్శనం బొనర్చుట ధ్యానయోగంబు. హరిస్థిరబుద్ధి భక్తియోగంబు.
ఈ త్రివిధంబునందు, ధ్యానయోగంబు విస్తరించెద నాకర్ణింపుము.

134


ధ్యానయోగప్రకారము

సీ.

విజనస్థలంబున విమలపద్మాసనా | సీనుఁడై యుండి [131]నిశ్చింతుఁ డగుచు,
వాయువు వశముగా ద్వారముల్ బంధించి | సమ[132]కాయుఁడై మనోజలరుహంబు
ప్రణవంబు [133]చెవిని సాంద్రంబుగా బోధించి, | తద్భవ్యకర్ణికాంతరమునందు
సోమసూర్యాగ్నులసొరిది దొంతరగాఁగ | నిలిపి, యావహ్నిమండలములోన


తే.

భావనాకల్పిత[134]స్వర్ణభద్రపీఠి | కాంతరాళంబునం దిష్టమైన విష్ణు
మూర్తి [135]నిలుపుచుఁ బుత్రాదిమోహ ముడిగి, | సంతతధ్యాన మీరీతిఁ జలుపవలయు.

135


క.

ఏరూపముఁ దనచిత్తాం | భోరుహమునఁ దలఁచు నరుఁడు పుణ్యాకరుఁడై,
యారూపముఁ బొంది యతం | డారూఢుం డగును వైష్ణవాంచిత[136]పదవిన్.

136

క.

హరిమూర్తులలో నెయ్యది | పరిచితమగు, నట్టిమూర్తి భావింపఁదగున్,
బరమూర్తిఁ దలఁచెనేనియుఁ | బురుషుఁడు విఘ్నములఁ బొందు, బుద్ధి చలింపన్.

137


క.

హరి[137]కీర్తనమాత్రమునం | బరమపదం [138]బొదవు ననుచు బలభిన్ముఖ్యా
మరులు మదిఁ గోరుచుందురు | ధరపైఁ గలియుగమునందుఁ దారు జనింపన్.

138


ఉ.

దారకుమారమిత్రజనతాఫణిసంకుల, మవ్యయస్పృహా
భూరితరాంధకారమధుపుంజతృణావరణంబునైన సం
సారపురాణకూపమున జాఱినమర్త్యుఁడు, విష్ణుకీర్తనో
దారసురజ్జుమార్గమునఁ దా వెడలం దగు బుద్ధిమంతుఁడై.

139


సీ.

నిజ[139]పూర్వభవకర్మనియత[140]యోనిసహస్ర | జాతుఁడై జీవుండు భూతధాత్రి
గ్రమమున మానవాకారుఁడై యుదయించి, | పరమవైష్ణవమార్గ మెఱుఁగలేక,
పరసతీవ్యసనుఁడై పరవిత్తహరణంబు | సేయుచు, విద్యావిశిష్టులైన
బుధుల నిందింపుచుఁ బుణ్యంబు దిగనాడి, | దానం బొనర్పక ధర్మ ముడిగి,


తే.

గురుకృపాదృష్టిదూరుఁడై కుమతి యగుచు | నర్థకాంతాసుతాదిమోహంబుకతనఁ
జాల గర్వించి, యవసానకాలమునను ! యాతనాదేహియై పోయి యమపురమున.

140


సీ.

తప్యమానానలతప్తుఁడై, యసిపత్ర | వనఖండితాంగుఁడై శునకవక్త్ర
కబళితుండై , గృధ్రకాకసందష్టుఁడై, | లోహానంబులలోనఁ గూలి,
యతితప్తతైలమధ్యమునఁ ద్రోవఁగఁబడి | బహుకాలపాశనిబద్ధుఁ డగుచు
[141]నధికదుఃఖకరంబు లైన నారకములఁ | దద్గతజంతుబృందములచేతఁ


తే.

బీడితుండయి, యత్యంతభీతిఁ బొంది, | దండధరభటగదశతధావిభిన్న
[142]మూర్ధుఁడై శోకజలధిలో మునిఁగి మునిగి, | [143]యనదయై దిక్కుగానక పనవి పనవి.

141


క.

ఈరీతి సకలభయదమ | హారౌరవరౌరవాదికానేకోద్య
న్నారకకూపాంతరముల | దారుణబాధా[144]విశీర్ణతరవిగ్రహుఁడై.

142


క.

[145]అంతట నిజకర్ణానుభ | వాంతంబునఁ దత్ప్రతిష్ఠమగు గర్భగుహా
భ్యంతరముఁ జొచ్చి జననీ | సంతతవిణ్మూత్రవిహిత[146]సర్వాంగుండై.

143

శా.

[147]యాదృగ్జంతువు గర్భకోటరము మున్నర్థిం బ్రవేశించి, తాఁ
దాదృగ్గాత్రభరంబు దాల్చి వెడలుం దద్యోనిమార్గంబునన్,
బ్రాదుర్భావనిదానభూరిజవశుంభత్సూతివాతచ్చటా
భేదోత్పాదితవేదనాభరమహాభీతిం బ్రకంపించుచున్.

144


ఉ.

ఈగతి జీవుఁ డెంతయును హేయతరంబగు మాతృగర్భకా
రాగృహవీథి వెల్వడి, నిరంతరబాహ్యసమీరణాహతిం
బ్రాగవబోధము న్మఱచి, బాలకుఁడై చరియించి, యౌవనా
భోగముఁ జెంది, రూపబలభోగధనాదులచేత మత్తుఁడై.

145


క.

గురుదేవద్విజనిందా | పరుఁడై, నిమిషమును విష్ణుపాదాంభోజ
స్మరణ మొనర్పఁగ నేరక | తిరుగం జనుచుండు దుర్గతికి జడమతియై.

146


సీ.

ఈరీతి నరులు దేహేంద్రియసంజాత | కామాదిగుణములఁ గట్టువడుచు,
బహువిధజన్మసంభావితకర్మాను | రూపసంపన్మదారూఢు లగుచు,
నర్థదారాదిమోహవ్యాప్తి నస్థిరం | బగు జీవనంబు నిత్యమని నమ్మి,
విపులలోభమ్మున విత్త ముపార్జించి | సత్పాత్రదానంబు జరుపలేక,


తే.

ముక్తిసంప్రాప్తికరధర్మమోదశూన్యు | లగుచు, నటమీఁద బహువేదనాతినిబిడ
యాతనాదేహములు దాల్చి, యమితదుఃఖ | మనుభవింతురు నరకకూపాంతరముల.

147


వ.

అది గావున.

148


సీ.

త్వఙ్మాంససంధిబంధముల పట్టువదల్చి, | దంతకోరకముల ధరణిఁ గూల్చి,
నేత్రవీక్షణశక్తి నిశ్శేషముగఁ ద్రించి, | శ్రవణప్రభావంబు సంహరించి,
జిహ్వావచోవృత్తి శిథిలత నొందించి, | ఘ్రాణగంధజ్ఞానగరి[148]మ డించి,
హృదయసామర్థ్యంబు మొదలికిఁ బోకార్చి, | తనువుఁగంపమునకు దాపొనర్చి,


తే.

పలితరోగాదివికృతిసంవలితుఁ జేసి | ఘనజరాకాళరాత్రి మ్రింగకయమున్న,
నరుఁడు హరి[149]నామజపకళానిరతుఁ డగుచుఁ | బరమపదసౌఖ్య మనుభవింపంగవలయు.

149


వ.

అని చెప్పి, వెండియుం బుండరీకభవుండు నారదున కిట్లనియె.

150

తే.

వినుము [150]మోక్షార్థియైనట్టి విమలమతికి | భాగవతభక్తి మదిలోనఁ బాదుకొల్పి,
కమలనాభార్పితాఖిలకర్ముఁ డగుచు నుంట యుచితంబు, వెండియు నొకటి వినుము.

151


క.

నర[151]కాంతవర్తులకు, భా | సురలోకవిహార[152]శుభకీర్తులకుం
[153]రిణామంబునఁ గాలము | సరిగా వర్తించుచుండు సన్మునివర్యా!

152


క.

ఆకాలమె ఘనదుఃఖ[154]సు | ఖాకరమై నిడుపు గుఱుచ లై తోఁచును, దే
హాకీర్ణభావగుణ మది | ప్రాకట్య[155]మ మెఱయఁ దెలియఁబడ దెవ్వరికిన్.

153


క.

సముదితదుఃఖాన్వితులకు, | సముదంచితభోగసౌఖ్య[156]సంపన్నులకున్
గ్రమమునఁ [157]దోఁచుచునుండును | నిముసం బేఁడగుచు, నేఁడు నిముసం బగుచున్.

154


తే.

పక్షమాసర్తువర్షానుభవ[158]వినాశ్య | పాపపుణ్యఫలంబు సంప్రాప్తమగుచు
ననుభవింపంగఁబడుచుండు, నధికసూక్ష్మ | కాలమునఁ జేసి జీవసంఘంబుచేత.

155


ఆ.

పాపపుణ్యకర్మఫలము జీవుఁ డనుభ | వించి పిదప సంభవించు, విశ్వ
ధరణిమండలమునఁ దనకుఁ బ్రాప్తవ్యమై | నట్టి యుచితవిగ్రహమును దాల్చి.

156


వ.

ఇ ట్లనుభూయమానంబులగు [159]కర్మంబులు సంచితంబులు, ప్రారబ్ధంబులు నన రెండు
తెఱంగులు. అందుఁ బూర్వజన్మార్జితంబులై రాశిభూతంబులగు కర్మంబులు సంచితంబులు.
భవిష్యజ్జన్మంబులక్రమంబున ఫలోన్ముఖంబులైన కర్మంబులు ప్రారబ్దంబులు.అట్టి
కర్మంబులు పుణ్యపాపభేదంబున ద్వివిధంబులై యుండు. నందు స్వర్గభోగ్యంబులు
పుణ్యకర్మంబులును, నిరయభోగ్యంబులు పాపకర్మంబులునై సుఖదుఃఖజనకంబు లగుచుఁ
బ్రవరిల్లుచుండు. కావున.

157


చ.

పురుషుఁడు దేహియై ధరణిఁ బుట్టి, ప్రబోధము గల్గి, తత్త్వముం
గురు[160]వదనంబున న్విని, ముకుందుఁడ కర్మ[161]వినాశకుండుగా
నెఱుఁగి, యధర్మమార్గమున నేఁగక, వైష్ణవభక్తుఁడై, మనో
హరసుచరిత్రుఁడై, భగవదర్పితనిర్మలకర్మజాలుఁడై.

158

తే.

కర్మబహువల్లికాసమాక్రాంతుఁ డగుచు | దారుణంబైన సంసారభూరుహంబు
భూరిసుజ్ఞాననిశితకుఠారధార | నెలమి ఖండించి, హరిపురి కేఁగవలయు.

159


ఉ.

అచ్చెరు వంద నేల? విను, మద్భుతకర్ముఁడు చక్రి, యాత్మ నా
మోచ్చరణైకమాత్రము సముత్సుకుఁడై యొనరించువానికి
న్మెచ్చి యొసంగు ముక్తి, నిది నిక్క, మెఱింగియు దేహధారియై
చచ్చుచుఁ బుట్టుచుం దిరుగు జంతువుఁ గన్గొని నవ్వువచ్చెడిన్.

160


చ.

తనువు ధరించి జీవుఁడు సుతప్రమదాముఖవస్తుమోహవ
ర్ధనమునఁ గన్నుగానక, విరాజితసాత్త్వికదానదూరుఁడై,
యనుపమవేదమార్గజడుఁడై, భవనాశనమోక్షలాభసా
ధన హరిధర్మము న్విడిచి, తత్త్వ మెఱుంగక యుండు మూఢుఁడై.

161


వ.

ఇంక నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

162


విష్ణువర్ధనోపాఖ్యానము

సీ.

బలభేదనం బనుపట్టణంబునఁ దొల్లి | విష్ణువర్ధనుఁ డను విప్రవరుఁడు
ధర్మసత్యజ్ఞానదాక్షిణ్య[162]యుక్తుఁడై | యఖిలశాస్త్రంబుల నభ్యసించి,
సంతతానుష్ఠానసంపన్నుఁడై , శత్రు | షడ్వర్గజయమునఁ జాల వెలసి,
యనుకూలభార్యాసహాయుఁడై , సాత్త్విక | దానంబు సేయుచుఁ దత్ఫలంబు


తే.

హరికి నర్పించి, వైష్ణవధ్యానయోగ | చతురుఁడై, యన్నదానంబు జరుపుచుండి,
యచలితశ్రీసమేతగృహంబునందు | మండలాధీశమాన్యుఁడై యుండి యతఁడు.

163


మ.

సురకల్లోలినిఁ దీర్థమాడఁ[163]గ మనస్తోషంబుతో నొక్కనాఁ
డరుగన్, భూసురముఖ్యుఁ డొక్కరుఁడు తృష్ణానల్పదాహక్షుధా
తురుఁడై, యింటికి వచ్చి యన్న మడుగన్, దుర్వారసంపన్మదా
కరతన్, [164]బెట్టద విష్ణువర్ధన3సుధీకంజాక్షి దుష్టాకృతిన్.

164


ఆ.

అంతఁ, గొంతకాల మరిగినతుద విష్ణు | వర్ధనుండు కాలవశగుఁ డగుచు
దేహయష్టి వదలి, దేవేంద్రపురమున | కరిగె నమరసంఘ మభినుతింప.

165

పుణ్యపాపానుభవప్రకారవైచిత్రి

వ.

ఇట్లు పాంచభౌతికదేహంబు విసర్జించి, దివ్యశరీరంబు పరిగ్రహించి, రత్నవిమానా
రూఢుండై, యప్సరోగణపరివృతుండగుచుఁ ద్రిదివంబున కరుగుటయుఁ, బురందరుండు
రంభాదిసురకామినీసహస్రంబులతో నమ్మహాత్ముని నెదుర్కొని, నిజసింహాసనార్ధంబున
నుపవిష్టుంజేసి, యర్ఘ్యపాద్యాదికృత్యంబుల నుపచరించి యిట్లనియె.

166


ఉ.

కాలవశుండవై చనక, కర్మమయాఖిలపాశబంధముల్
శ్రీలలనావరస్తుతివిశేషమహానిశితాసిధారచేఁ
[165]గీలుకు [166]ద్రెంచి, యత్యధికకీర్తి వహించి, వసుంధరాస్థలిన్
గాలము మోసపుచ్చితివి కారణజన్ముఁడవై మహీసురా!

167


ఉ.

తొంటిదినమ్ముల న్మహిమతో హరిభక్తులు వేనవేలు మా
యింటికి వచ్చి, విష్ణుపురి కేఁగుచు నుందురు, వారియందు నీ
వంటి మహానుభావుఁ, గులవర్ధను, నేకవధూవ్రతాన్వితున్,
గంటకశత్రుషట్కహరుఁ గానము వైష్ణవధర్మభూషణా!

168


శా.

రంభాదిప్రమదావిహారకలితప్రాసాదమధ్యంబులన్
శుంభద్భోగసుఖంబులం గొనుచు, నిచ్చోఁ బెద్ద కాలంబు సం
రంభంబేర్పడ నుండి, పూజ్యగరిమం బ్రాపించు యోగీంద్రసే
వ్యాంభోజాసనలోకమందు దశకోట్యబ్దంబు లుర్వీశ్వరా!

169


తే.

మఱియు నటమీఁద వైకుంఠపురికి నరిగి | శంఖచక్రాబ్జనందకశార్జ్ఞసహిత
కరచతుష్టయకలితవిగ్రహుఁడ వగుచు | విష్ణుకైంకర్యపరుఁడవై వెలయఁగలవు.

170


వ.

అని యిట్లు పురందరుండు విష్ణువర్ధను నభినందించి, వైవస్వతునివదనం బవలో
కించిన, నతండు తద్విప్రోత్తమున కిట్లనియె.

171


సీ.

భూసురోత్తమ! నీవు భూమండలంబందు | నార్జించితివి పుణ్య మభినుతముగఁ,
బరమపాతివ్రత్యనిరతయై భాసిల్లు | భవదీయకాంత సంపన్మదమున
నొకనాఁడు విప్రముఖ్యుఁడొకఁడు తృష్ణాక్షు | ధాతురుండై వచ్చి యన్న మడుగ,
బహుభక్ష్యభోజ్యసంభారంబు లింటిలోఁ | గలిగియుఁ బెట్టక కడపినట్టి

తే.

పాప మున్నది, యందు సాఁబాలు నిన్నుఁ | దగులుఁ, గావున నిరయ సద్మంబులోన
యాతనాదేహగతుఁడవై యబ్దమాత్ర | మనుభవింపంగఁ నగు నీకు నాఫలంబు.

172


ఉ.

రౌరవముఖ్యనారకపరంపరలం దనుభూతపాపసం
భారుఁడవై , సురేంద్రపురిఁ బ్రాహీనపుణ్యఫలంబు గాంచి, యా
ధారుణిఁ గొన్నియజ్ఞములు దర్పితజంబుకమూ ర్తివై, తదా
కారము నుజ్జగించి, మరి కాంతువు విష్ణుపురీవిహారమున్.

173


చ.

తరుణి యొనర్చునట్టి దురితంబుల నర్ధము భర్తఁజేరుఁ ద
త్పురుషుఁడు సేయునట్టి ఘనపుణ్యములోన సగంబు భామినిం
బొరయుచునుండు, నీద్వివిధమున్ శ్రుతిమూలముగా నెఱుంగు భూ
సురవర! యంచుఁ బల్కు రవిసూనున కిట్లనుఁ గంపితాత్ముఁడై.

174


ఆ.

ప్రాప్తయాతనుండ నై యేను దుఃఖాను | భవముచేతఁ గుంది భానుతనయ!
[167]మీఁద నెట్లు నిర్గమింతు భయంకరా | కారనిరయశోకకాననంబు?

175


వ.

అని పలికిన విప్రవరునకు దండధరుం డిట్లనియె.

176


ఉ.

భూసురుఁ డొక్కరుండు, కృతపుణ్యుఁడు, తొల్లి మహేంద్రకీలశై
లాసమసానుదేశమున నంబుజనాభునిగూర్చి మారుతా
భ్యాసపురస్సరంబుగ భయంకరతీవ్రతపం బొనర్చెఁ, బ
ద్మాసనముఖ్యదేవతలు నద్భుత మందుచునుండ నత్తఱిన్.

177


సీ.

జనని యెవ్వని నాభివనజాతకర్ణిక | భూతభవద్భావిధాతృతతికి?
సూచకం బెవ్వని లోచనద్వయ మహో | రాత్రాదికాలసంరంభమునకు?
మామ యెవ్వని పాదతామరసాగ్రంబు | [168]వరరత్నసంపన్నవార్ధిపతికి?
నాధార మెవ్వని యసమానతల్పంబు | చక్రవాళాంతభూచక్రమునకు?


తే.

నుద్భవస్థాన మెవ్వని యుదరశుక్తి | పద్మగర్భాండమౌక్తికపటలమునకు?
నమ్మహాత్ముఁడు లక్ష్మీసహాయుఁ డగుచు | ధరణిసురశేఖరునకుఁ బ్రత్యక్షమయ్యె.

178


వ.

ఇవ్విధంబున సాక్షాతరించిన లక్ష్మీకాంతుం డతని కిట్లనియె.

179

క.

మెచ్చితిఁ దావకతపమున | కిచ్చెద ధరణీసురేంద్ర! యిష్టార్థములన్
విచ్చలవిడి నడుగుము యు | ష్మచ్చతురవచో[169]విశేషసంపద మెఱయన్.

180


చ.

అని హరి యానతిచ్చిన, [170]ధరామరముఖ్యుఁడు [171]సంతసించి, వం
దన మొనరించి, హస్తనళినంబులు మౌళి నమర్చి యిట్లనున్;
వనరుహనేత్ర! సర్వజనవర్ణిత! మాధవ! చక్రి! నాకు నీ
యనుపమలోక మిమ్ము కరుణాన్వితవీక్షణ! భక్తరక్షణా!

181


సీ.

నావుడు, మేదినీదేవపుంగవునకు | నిందిరాధవుఁ డరవిందనాభుఁ
డతిభక్తితోడ నిట్లనియె, విప్రోత్తమ! | నీకు నేనూఱేండ్లు నిరయమందు
బహుదుఃఖములు పొందఁ బ్రాప్తంబు గల, దవా | ర్యంబులు కర్మఫలంబు లరయ,
మద్భక్తుఁడవు గాన, మాసమాత్రము రౌర | వాదిమహాదుఃఖ మనుభవించి,


తే.

భోగనాశ్యంబులైనట్టి [172]పూర్వ[173]కర్మ | జాలములఁ [174]3ద్రెంప వైష్ణవజన్మ మంది,
ధరణి సంసారభయదూర తరుఁడ వగుచు; | దత్పరతఁ [175]జేరెదవు మీఁద మత్పురంబు.

182


వ.

అని దేవదేవుం డానతిచ్చిన, భూదేవవరుండు తదాజ్ఞానియుక్తుండై, యొక్కమాసంబు
మదీయలోకంబున ననూనశోకం బనుభవించి, భూతలంబున వైష్ణవజాతుండై, యనంత
రంబున వైకుంఠనగరప్రాప్తుం డయ్యె. కావున, నీవును యాతనాతనుసమేతుండవై, యొక్క
వత్సరంబు కుత్సితనిరయంబుల దురితఫలం బనుభవించి, యటమీఁద సుకృతపరిపాకాతి
రేకంబున నాకలోకంబున సహస్రవర్షంబులు హత్కర్షంబు నొంది, క్రమ్మఱం బుడమిం
బొడమి, యల్పకాలంబునన శేషతల్పుపదంబున ముదంబు నొందెదవని పల్కిన యుష్ణాంశు
నందనునకు విష్ణువర్ధనుం డిట్లనియె.

183


సీ.

సమవర్తివై మున్ను సకలజీవులకును | గర్మమూలమున సంక్రాంతమైన
పాపపుణ్యచయంబు భాగించి యధికాల్ప | రూపతత్త్వమ్ములఁ జూపి వరుస
ననుభవింపఁగ బంచి, యంత భూతలమున | నెట్టి[176]కర్మంబుల కెద్ది జన్మ
మది నిర్ణయించి, మర్యాదతో జీవన | కర్మమోహాదులఁ - గలుగఁజేసి,


తే.

నీవు నియమింపఁ, బ్రాణు లాత్రోవ నడచి | జన్మమరణాంధకారసంఛన్ను లగుచుఁ
దలఁపనెఱుఁగరు హరి నాత్మ దండధారి! | [177]కలుషనిచయనీరస్త! లోకప్రశస్త!

184

వ.

అనిన విష్ణువర్ధనునకుఁ గృతాంతుం డిట్లనియె.

185


సీ.

వసుధామరేంద్ర! నీ వలనఁ బాపంబులు | లేవు, నీ వాజన్మపావనుఁడవు,
హరిపదధ్యానతత్పరుఁడవు, దేవతా | పూజితుండవు, నిత్యపుణ్యమతివి,
వనితమూలమ్మున వచ్చిన పాతకం | బనుభావ్యమగుఁ బతి కర్ధభాగ,
మట్లు గావున నేరికైన దుష్కర్మంబు | లనుభవంబునఁ గాని యణఁగిపోవు,


తే.

హరికి సత్కర్మ మర్పితం [178]బయ్యుఁగాని, | కలుషసంఘంబు చెడిపోక నిలిచియుండు,
[179]నందు సత్పాత్రదానాదులైన సుకృత | కర్మములు సేయ నణఁగు భాగత్రయంబు.

186


ఆ.

అనుభవైకనాశ్య మాచతుర్థాంశంబు | పద్మజాదిదివిజపటలికైన,
గాన ననుభవింపు కాంతాకృతాఘంబు | నందుఁ బాదభాగ మనఘ! యనుచు.

187


క.

అంతకుఁ డి ట్లమరసభా | భ్యంతరమునఁ బలికె, నంత నావిప్రుఁడు దు
ర్దాంతఘనశోకసంభవ | చింతాభారమున [180]నుబ్బసిల్లుచుఁ బలికెన్.

188


ఆ.

పుణ్య మనుభవించి, భూలోకమునఁ బుట్టఁ | జనెడునపుడు పాపచరమభాగ
మనుభవింతుఁ గాని, యాదిన నరకాను | భవ మొనర్పఁజాల దివిజముఖ్య!

189


సురలోకసుఖానుభూతి

వ.

అనిన విని యనిమిషాధ్యక్షుం డనుకంపాసంపన్నాక్షుం డగుచు, రంభాముఖ బర్హిర్ముఖ
జంద్రముఖులం గనుంగొని యిట్లనియె.

190


చ.

ఇతఁడు మహానుభావుఁడు, మహీసుర[181]1వర్యుఁడు, విష్ణుభక్తిసం
యుతుఁ, డదిగావున న్మరకతోపలనిర్మితభర్మహర్మ్యశో
భితమృదుశయ్యలందు, రతిభేదములం గరఁగించి, [182]తావకా
ద్భుతచరితంబుచే నుబుసుపుచ్చుఁడు మీరు సహస్రవర్షముల్.

190


క.

అని పలికిన దేవేంద్రుని | పనుపు శిరోవీథిమాల్యభావంబునఁ గై
కొని, యాయమరాంగన లా | ఘనుఁ దోడ్కొని యరిగి రాత్మఁగౌతుక మొదవన్.

191


వ.

ఇట్లరిగి.

192

సీ.

నవరత్నకాంచనోన్నతసౌధవీథులఁ, | గృతకచింతామణిగిరితటములఁ,
గలితమందాకినీపులినభాగంబుల, | నతులధారాగృహాభ్యంతరముల,
నందచారామమందారకచ్ఛాయల, | సంచితకుసుమశయ్యాతలముల,
వారిజోత్పలసముజ్జ్వలసరోవరముల, | ననుపమస్వర్ణడోలాంతరముల


తే.

వరుసఁ గ్రీడింపుచుండె భూసురవరుండు | దివిజకాంతలు చతు[183]రశీతిప్రభేద
సురతబంధవిశేషవిస్ఫురణఁ దనుప | నిరుపమానందభరితుఁడై, మఱియు నతఁడు.

193


మ.

ప్రమదం బందుచుఁ జూచు నొక్కపుడు రంభానర్తకీరూపిత
భ్రమరీనృత్యవిసార్యమాణవిలసద్బాహాద్వయీమూలభా
గమనోహారిసువర్ణరేణునిభరంగత్కాంతిసందోహవి
భ్రమణోత్పన్నతటిల్లతావలయసౌభాగ్యంబుల న్నిచ్చలున్.

194


సీ.

అంగనాధరసుధాహారసంతృప్తుఁడై | యమృతాంధసుం డౌట నభి[184]నయించు,
రామావిలోకనప్రస్తనిమేషవి | తానుఁడై యనిమిషత్వము భజించు,
వ్రీడావతీరతిక్రీడా[185]వినిద్రుఁడై | యస్వప్నభావంబు నర్థిఁ దాల్చుఁ,
దరుణీపయోధరోత్సంగ[186]విహారియై | ఖేచరత్వంబు నంగీకరించు,


తే.

దివ్యభోగానుభవములఁ దేజరిలుచు | నతులితానందముల సుపర్వత వహించు,
మదనభూతంబు సోఁకినమత్తుఁ డగుచుఁ, | బరిహృతాన్యవిచారుఁడై బ్రాహ్మణుండు.

195


ఉ.

భూవిబుధోత్తముం డిటుల పూర్వమనోభవకేళితత్పరుం
డై విహరింప, నేకదివసాకృతి దివ్యసహస్రవర్షముల్
పోవుటయున్, బరేతపతి బుద్ధి నెఱింగి, భయంకరాత్మభృ
త్యావళిఁ బంచె, బ్రాహ్మణకులాగ్రణిపాలికి నాక్షణంబునన్.

196


దుస్తరనరకయాతనానుభవము

వ.

ఇట్లు పనిచినఁ గాలకింకరులు భయంకరులై సురపురికి నరిగి, త్రిదశసుదతీమధ్య
మంబున మదనకదన[187]క్రియాపరవశుఁడై కాలంబుపోక కడగానకయున్న విష్ణువర్ధనుని
బలాత్కారంబునఁ బట్టుకొని వచ్చి, సమవర్తి కట్టెదురం బెట్టిన, నావిప్రవరు నాలోకించి దండ
ధరుం డిట్లనియె.

197

మ.

సురలోకంబున భూసురోత్తమ! బుధస్తుత్యుండవై, నిర్జరీ
సురతక్రీడలఁ గాలముం జరుపఁగాఁ జోద్యంబు నీ కొక్కవా
సరమై తోఁచి, సహస్రవర్షము లవిజ్ఞాతంబులై పోయె, దు
స్తరశోకంబునఁ బొందు మింకొకఋతుద్వంద్వంబు దీనాకృతిన్.

198


చ.

అని సమవర్తి పల్కిన, మహాద్భుత మంది సబాష్పనేత్రుఁడై
తనమదిఁ [188]దాప ముప్పతిల, దైవము దూఱుచు, ఘోరకింకరా
సనములు గాంచి బెగ్గిలుచు, నాకనివాసులు చూచుచుండఁగాఁ
జనియె నతండు రౌరవనిశాంతముఁ జేరఁగ నెట్టకేలకున్.

199


వ.

ఇట్లు కాలకింకరానీతుండై, యమలోకంబున కరిగిన విష్ణువర్ధనుం గదిసి, తత్కింకరులు
కాలసూత్రంబున ముంచియుఁ, గాలానలజ్వాలాజాల[189]నఖంబులును, లోహముఖంబులునగు
ఖగంబులచేతఁ గఱపించియు, నిర్వాతజ్వలనకీలా[190]సంరంభంబులగు సంతప్తాయసస్తంభంబుల
నంటఁగట్టియు భంగద లగు గదలం గొట్టియు, నిశితాసిపత్రవనమధ్యంబులం ద్రోసియు,
శూలంబుల వ్రేసియుఁ, దప్తతైలంబులం ద్రోచియు, సంఘాతాదినారకంబుల [191]వ్రేఁచియు
నొప్పించిన, యాతనాదేహసంశ్రితుండై [192]నిమేషపరిమితంబగు కాలంబు వత్సరశతంబుగాఁ
దలంచి, పాపపరిపాకంబగు శోకం బనుభవింపుచు, నొక్కనాఁడు భయంకరులగు కింకరుల
నాక్షేపించి, నిరయక్షేత్రంబు బలాత్కారంబున నిర్గమించి, దండధరుపాలి కుద్దండతం జని
యిట్లనియె.

200


ఆ.

సర్వసమతఁ బొంది సమవర్తివై నీవు | జీవకోట్ల కెల్లఁ జేసినట్టి
పాప[193]ఫలముఁ గుడుపఁ బాల్పడి, నాయెడ | నసమవర్తి వైతి వనఘచరిత!

201


క.

ఋతుయుగళభోగ్య[194]దురితా | స్వతు నన్ను, సహస్రవర్షనిష్ఠురదుఃఖ
ప్రతిహతుని జేయఁదగునే? ! ప్రతిపక్షుఁడ వగుచు నిట్లు పద్మాప్తసుతా!

202


క.

కరుణించి నన్నకారణ | విరసత్వము మాని కావవే! యని పలుకన్,
దరహాసవికచవదనాం | బురుహుండై , యముఁడు విప్రముఖ్యున కనియెన్.

208

సీ.

సర్వజంతు[195]వులందు సముఁడనై వర్తింతు, | వైరంబుఁ దాల్ప నెవ్వారియెడల,
హెచ్చుగుందులు సేయ కిత్తుఁ [196]గర్మమునకుఁ | దుల్యంబుగా సుఖదుఃఖఫలము,
నల్పకాలంబైన నతి[197]దీర్ఘమై తోఁచు | దారుణశోకసంతప్తమతుల
కట్లు గావున, భూసురాన్వయవర! నీవు | నిరయంబునకు నేఁగి, - నేఁటి కేడు


తే.

దినము లయ్యెను, గర్మంబు తీవ్రపడిన | ననుభవింపకపోవునే? యరుగు మింక,
మూఁడునెలలును నిరువదిమూఁడు దినము | లుగ్రనరకాంతరంబుల నుండవలయు.

204


ఆ.

అనిన దండధరుని యాజ్ఞాక్రమంబున | నిరయ మనుభవించి, ధరణియందు
జంబుకత్వ మంది, సంత్యక్తగాత్రుఁడై, | హరిపురమున కేఁగి హర్ష మొందె.

205


వ.

అది గావున, జీవుండు బహు[198]జన్మవాసనంబునఁ బూర్వపుణ్యపరిపాకసారంబగు
మానవాకారంబు ధరియించి, సమ్యగ్జ్ఞానసమేతుండై, స్వప్నజాగ్రదవస్థలయందు హరి
నామస్మరణంబు వదలక, పుత్ర[199]దారవిత్తాదిసంగప్రచారంబు దూరంబు గావించి, యోగ
మార్గంబున నపవర్గంబుఁ జెందవలయు నని, నారదునకు శారదారమణుండు మోక్షధర్మోప
దేశంబు చేసిన క్రమంబు రోమశుండు చెప్పిన, విని సంతసించి, మార్కండేయుం
డిట్లనియె.

206


క.

జయవిజయు లిరువురందును | జయుఁడు హిరణ్యాక్షుఁ డగుచు సమసెను; విజయుం
[200]డయమహీత! యెచటి కరిగెను? | బ్రియమగు తత్క్రమము విస్తరింపుము తెలియన్.

207


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

208


హిరణ్యకశిపుని వృత్తాంతము

క.

విజయాహ్వయుండు దితిగ | ర్భజుఁడై, ఘనబాహుదర్పభాసురుఁ డగుచున్
ద్రిజగద్భయంకరాకృతి | నజితుండై , కనకకశిపు డనఁగా వెలసెన్.

209


శా.

ఆరక్షోరమణుండు లోకభయదవ్యాపారుఁడై, బాల్యకౌ
మారంబుల్ గడచన్న యౌవనవయోమత్తాత్ముఁడై, రాజ్య మిం
పారం జేయుచు, నొక్కనాఁడు సచివన్యస్తాత్మసామ్రాజ్యసం
భారుండై, జగదాధిపత్యమహిమం బ్రాపించు చిత్తంబునన్.

210

నీలగళునిగూర్చి నిశాచరేంద్రుని నిర్నిరోధతపము

ఆ.

వీరసేననగరి వెడలి మాల్యవదద్రి | కందరమున నీలగళుని గూర్చి
నిరుసమానధైర్యనిస్తంద్రుఁడై, విని | శ్చలత మెఱయఁ దపము సలుపునంత.

211


సీ.

రవి వేయుఁగరముల నవనీరసముఁ గ్రోలెఁ, | దీవ్రాతపంబున దిశలు [201]వ్రీలె,
నతిదీర్ఘతరములై యహములు ప్రసరించెఁ, | గమలినీలతలు పొంకము ధరించెఁ,
జాతకంబులకుఁ దృష్ణాతురత్వము మించె, | జక్రవాయువు లుర్వి నాక్రమించెఁ,
గల్లోలినీదీర్ఘికాశ్రేణి నెఱి దప్పె, | ఘనధూళిపటల మాకసము గప్పెఁ,


తే.

గాననంబుల [202]దవపావకంబు లెదిగె, | నధ్వరావళి ధారాగృహముల నొదిగె,
భానుకాంతోపలంబులు ప్రజ్వరిల్లెఁ | జండఘర్మాగమం బిట్లు సంఘటిల్లె.

212


చ.

హరికి సుధాంబురాశి, నిటలాక్షునకుం దుహినాద్రి, భారతీ
శ్వరునకు నాభి[203]పద్మమును సద్మములై విహరింపఁగల్గఁగా,
కరయ తదుష్ణకాలనిబిడాతప[204]తాపము నిస్తరింపఁగాఁ
దరమగునే త్రిమూర్తులకుఁ?, దక్కినవారల నెన్న నేటికిన్.

213


శా.

రక్షోనాయకుఁ డిట్టివేసవిని సంరంభంబు రెట్టింపఁగాఁ
జక్షుర్వీక్షణజాలము[205]౦ దపనుపై సంధించి, ఘోరాగ్నిమ
ధ్యక్షేత్రంబునఁ బాదపల్లవనఖాంతం బూఁతగా నిల్పి, ఫా
లాక్షున్ గూర్చి తపంబు [206]సల్బె భయదవ్యాపార మేపారఁగన్.

214


వ.

అంత.

215


సీ.

జలధరంబులు [207]కులాచలము నారోహించె, | నలర విద్యుల్లత లంకురించెఁ,
బురుహూతుచాపంబు వరుణదిక్కునఁ దోఁచెఁ, | బ్రథమదిశాసమీరములు వీచెఁ,
జాతకంబుల [208]తపశ్చర్యలు ఫలియించె, | జాతీలతలు పుష్పసమితి నించె,
నీలకంఠంబులు నృత్యంబు ప్రకటించెఁ, | దాళంబు లన గర్జితములు మించె,


తే.

నీపములు పూచెఁ, దటినీకలాప మేచె, |సస్యములు హెచ్చె, రాజహంసములు నొచ్చెఁ,
[209]గమలములు వనరె, నింద్రగోపములు దనరె | లతలు చెలువారె, వానకాలంబు మీఱె.

216

మ.

దనుజాధీశ్వరుఁ డిట్టి వర్షదినముల్ ధారాధరశ్రేణి [210]జో
రని వర్షింపుచునుండ నూర్ధ్వవదనుం డై, నిర్నిమేషావలో
కనుఁడై, యున్నతగండశైలశిఖరాగ్రంబందుఁ గౌపీనమా
త్రనిరూఢాంబరుఁడై, యొనర్చెఁ దపమున్ ధారాళయత్నంబునన్.

217


వ.

[211]తదనంతరంబ,

218


సీ.

అహముల దీర్ఘత్వ మంతయు నుడివోయె, | నమృతాంశురుచిజాల మవచమాయె,
నీహారములు లోకనికర మాచ్ఛాదించెఁ, | జలి పేదజనముల సంహరించి,
ధనదదిశామారుతంబులు చెలరేఁగె, | [212]దక్షిణాయనమునఁ దపనుఁ డేఁగె,
నుష్ణంబు భామాపయోధరంబులఁ జేరె, | నెండపై జనులకు నింపుమీఱె,


తే.

గర్భగృహవాసముల భోగిగణము లణఁగెఁ, | గణఁకఁదాంబూలములు చవి గాఁగఁ
దొణఁగెఁ,
బట్టుచేలంబు లొకకొంత భయముఁ బాపె, | శీతకాలంబు నిజగుణఖ్యాతిఁ జూపె.

219


క.

తరుణీజన[213]వక్షోజ | స్థిరగిరిదుర్గముల దండఁ జేరకయున్నన్
దరమె చలిచేత బ్రదుకఁగ | హరిహరపంకేరుహాసనాదుల కైనన్.

220


చ.

అనఁగ భయంకరంబగు హిమాగమకాలమునందు, ఫాలలో
చనుఁ దనబుద్ధిఁ గీల్కొలిపి, చల్లనికుత్తుకబంటినీటిలో
[214]న నశనుఁడై, నిమేషరహితాక్షిసమీక్షితనాసికాగ్రుఁడై
దనుజుఁడు బాహ్యము న్మఱచి, తన్మయుఁడై తప మాచరింవఁగన్.

221


క.

వత్సరసహస్ర మరిగినఁ | దత్సమయమునందు నతని తపమున నుత్ప
న్నోత్సాహుఁ డగుచు గిరిజా | వత్సలుఁ డేతెంచి, దనుజవర్యుని మ్రోలన్.

222


పరమశివానుగ్రహము - వరప్రదానము

వ.

లోచనగోచరుండై, 'నిశాచరవల్లభ! భవదాచరితతపశ్చర్యాపరితుష్టుండనైతి. తావకా
భీష్టంబు లొసంగెద వేఁడు' మనిన యష్టమూర్తికిం బ్రణుతివిశేషంబుల సంతోషం బొనర్చి,
శేషభూషణువలన సమేళితవివిధభోగకృత్యంబగు త్రైలోక్యాధిపత్యంబును, దేవగంధర్వ

ప్రముఖాసహ్యచర్యంబగు శౌర్యంబును, స్థావరజంగమజనితభయనివారణధురీణంబగు
తనుత్రాణంబును, గరాళంబగు శూలంబును, జండంబులగు బాణకోదండంబులును వరంబు
లుగాఁ గొని, తత్కరుణాసుధాస్నపితసర్వాంగుం డగుచు, నిజపురంబున కరిగి, బలీముఖ
సుషేణ సూచీముఖ జ్వాలాముఖ [215]కంక నిషధ కుశ వజ్ర దందశూక క్రూరాక్ష కీట చిత్ర దమ
ఘోషాది ఘోరరాక్షసవీరులం గూడుకొని, చతురంగబలసమేతుండై, పరాక్రమస్పీతుం డగుచు,
సకలదేశాధిపతులం బరాజితులను జేసి, దిగీశులం గళితప్రకాశులం గావించి, గీర్వాణుల
నిస్త్రాణుల నొనర్చి, రాజ్యసంపదవలేపంబును భుజప్రతాపంబును జూపట్టఁ ద్రిభువన
పట్టాభిషిక్తుండై, రాజ్యంబు సేయుచుండఁ దదనంతరంబున.

223


ప్రహ్లాదచరిత్ర

క.

నారాయణభక్తి[216]కళా | పారాయణుఁ డగుచుఁ [217]బుట్టెఁ బ్రహ్లాదుం డా
వీరాగ్రగణ్యునకు నం | గారకపాలంబులోనఁ గమలము వోలెన్.

224


తే.

సకలకల్యాణలక్షణసంయుతుండు | సుతుఁడు జనియింపఁ [218]బుత్రవత్సుఖము గాంచె,
దర్శనాలింగనాలాపతతులవలనఁ | జారుతరమూర్తి, దానవచక్రవర్తి.

225


ఉ.

ఆదనుజేంద్రుఁ డిట్లు ప్రమదాతిశయంబును బొంది, జాతక
ర్మాదు లొనర్చి, నందనుఁ బ్రయత్నమునం బెనుపంగ, వాఁడు ని
త్యోదయవర్ధితుం డగుచునుండె, సురారియు నొక్కనాఁడు శు
క్రోదితకార్యుఁడై, నిజపురోహితులం బిలిపించి [219]యిట్లనున్.

226


ప్రహ్లాదుని విద్యాభ్యాసము

ఉ.

భూదివిజేంద్రులార! కులభూషణుఁడైన మదీయపుత్రుఁ, బ్ర
హ్లాదుని వీనిఁ బట్టి, యుపలాలనపూర్వము గాఁగ నీతిశా
స్త్రాదిరహస్యముల్ దెలియ, యత్నమునం జదివించి, దైత్యమ
ర్యాద లుపన్యసించి, చరితార్థుని జేయుఁడు సత్వరంబునన్.

227


ఆ.

అని, హిరణ్యకశిపుఁ డాత్మకుమారుని | నాపురోహితులకు నప్పగించి
యనుప, విప్రవరులు నసురేంద్రనందనుఁ | గొనుచు నిజనివాసమునకు నరిగి.

228

ఉ.

వేదకళారసజ్ఞుని వివేకనిధుల్ చదివించి, రాప్తల
క్ష్మీదయితప్రసాదు, మతికీలితభాగవతప్రశస్తమ
ర్యాదు, నఖండబోధసలిలాపహృతాఖిలపాపశాదు, ప్ర
హ్లాదు, గతప్రమాదు, దనుజాంతకభక్తికృతప్రమోదునిన్.

229


ఉ.

అత్తఱి నొక్కనాఁడు దనుజాన్వయవర్యుఁడు, మంత్రిబంధుమి
త్రోత్తమసేవకుల్ గొలువ నోలగముండి, కుమారు శాస్త్రసం
పత్తిపరీక్షణార్థము కృపాయుతుఁడై పిలువంగఁ బంచినం,
దత్తనుజాతుఁ దోడ్కొని ముదంబున వచ్చిరి విప్రపుంగవుల్.

230


వ.

ఇట్లు చనుదెంచి, మహీసురులు దనుజాగ్రేసరు నాశీర్వదించి, జితమనోభవుండగు
తనూభవుని బురోభాగంబున నిలిపిన.

231


ఉ.

దానవచక్రవర్తి సుతు దగ్గఱఁదీసి, నిజాంకపీఠికా
సీనుని జేసి, మై నిమిరి, చెక్కిలి నొక్కి, యురంబు మేనితో
నాని, శిరంబు మూర్కొని, ప్రియంబున నిట్లనుఁ, బుత్ర! నీవు వి
ద్యానిధివైతి వంచుఁ గొనియాడుదు రార్యులు ప్రస్తవంబునన్.

232


క.

నీనేర్చినట్టి నీతివి | తానములో నొకసుభాషితము చదువుము, నా
కానందంబుగ, మధురవ | చోనిపుణత కెల్లవారు చోద్యంబందన్.

233


వ.

అనిన దనుజసునాసీరునకుఁ బ్రహ్లాదుం డిట్లనియె.

234


ప్రహ్లాదుని హరిభక్తి

చ.

పురుషవరేణ్య! నిత్యపరిపూర్ణముదంబున నిర్మలుండనై
గురుచరణారవిందములకుం బరిచర్య యొనర్చి, శాస్త్రవి
స్తరముఁ బఠించి, యందు పదసత్త్వవివేకము నిర్ణయించి, యే
నెఱిఁగినవాఁడఁ, దత్త్వ మది యెట్టిదనా, విను మేర్పరించెదన్.

235

లయగ్రాహి.

నీరజభవాదినుతు, ఘోరరిపుసంహరుఁ, బ
        యోరుహవిలోచను, నపారగుణరాశిన్,
హారచయభూషితుఁ, గృపారససమన్వితు, సు
        రారి[220]వనపావకుని, భూరమణనాథున్,
దారుణసుదర్శనవిభారుచిరహస్తు, నవ
        నీరదసమానరుచిపూరితనిజాంగున్,
మేరునగధీరుని, రమారమణు, భక్తసుర
        భూరుహముఁ గొల్చెద ననారతము భక్తిన్.

236


చ.

అనవుడుఁ, గర్ణరంధ్రముల నగ్నిశిఖాపరితప్తశూలముల్
చొనిపినయట్లు మిట్టిపడి, చూపుల నిప్పులు రాల, హుంకృతి
ధ్వనుల నభంబు వ్రీల, భయదంబగు రౌద్రము మూర్తిదాల్చెనో
యనఁ, గడునుగ్రుఁడై, దితిసుతాగ్రణి విప్రులఁ గాంచి యిట్లనెన్.

237


హిరణ్యకశిపుని యాగ్రహోదగ్రత

ఉ.

బాలుఁడు వీఁడు, బుద్ధిపరిపాకవిదూరుఁడు, విష్ణువర్ణనా
మూలములైన పద్యములు మూర్ఖత మీ రెఱిఁగింపకున్న, నే
పోలిక నేర్చు? నాపగతుఁ బూని నుతించునె మత్సుతుండు? శా
ర్దూలకిశోరకంబు మృగధూర్తపరాక్రమమున్ గణించునే?

238


క.

పౌరోహిత్యమిషంబున | నారాయణుపనుపుఁ బూని, నను వంచింపన్
గోరి, యిట కరుగుదెంచిన | వైరులు గా కిట్టి విప్రవరులుం గలరే?

239


ఉ.

నావుడు, దైత్యనాథువచనంబుల వేఁడిమి కోర్వలేక, భూ
దేవ[221]కులాఢ్యు లిట్లనిరి, దేవ! భవత్సుతుఁ డేడ నేర్చెనో
శ్రీవిభువర్ణనం, బిది విచిత్రము, మాసములోన నీతి వి
ద్యా[222]విదుఁ జేసి, నీమదికి హర్ష మొనర్చెద, మంపు క్రమ్మఱన్.

240


ఆ.

అని ప్రతిజ్ఞ పలికి, [223]దనుజేంద్రనందను | వెంటఁ దోడుకొనుచు విప్రు లరిగి,
సంతతంబు నీతిశాస్త్రంబుఁ జదివింపు | చుండి, రంతలోన నొక్కనాఁడు.

241

రాక్షసకుమారులకుఁ బ్రహ్లాదుని విష్ణుభక్తిప్రబోధము

క.

శ్రీరమణీవల్లభుపద | సారససుజ్ఞానమధుర[224]సస్థిరభృంగా
కారుండగు ప్రహ్లాదకు | మారుఁడు, వైష్ణవరహస్యమతములు [225]దెలుపన్.

242


చ.

మదిఁ దలపోసి, కొందఱు సమానవయస్కుల దైత్యబాలురం
గదియఁగఁ బిల్చి, మీకు హితకార్యము చెప్పెద, రండు, దుర్జనుల్
మెదలని[226]చోటి కంచు, నొకమేరకుఁ దోకొనిపోయి, వారితో
సదయవచోవిశేషములు, సాత్త్వికభావము మీఱ నిట్లనున్.

243


ఉ.

దానవపుత్రులార! సుఖదంబగు నెయ్యది మీకు, నేమిటం
గాని శరీరమోహమయగాఢతమంబు నణంపఁజాలు సు
జ్ఞానమహాప్రదీపము ప్రసన్నత [227]గైకొన, దట్టితత్త్వము
న్బూనుతలీలఁ దెల్పెద, వినుండు [228]మనంబున సావధానులై.

244


సీ.

క్షీరవారాశిలో శేషతల్పంబునఁ | బద్మాలయాభర్త పవ్వళించు,
నా సర్వమయు[229]ని నాభీసరోవరమునఁ | జతురాస్యుఁడై ధాత సంభవించె,
నతనిచే నిర్మితం బయ్యె బ్రహ్మాండంబు | పాతాళభూస్వర్గభరిత మగుచుఁ,
దత్త్రిలోకములమధ్యమలోక మైనట్టి | భూమి, సప్తద్వీపములఁ దనర్చె,


తే.

నట్టిదీవులలోన విఖ్యాతి గాంచె | జాంబవద్వీప, మంబుధిశైలగహన
మనుజగోవిప్రముఖవర్ణమానవేంద్ర | పుర[230]వనగ్రామవాహినీపూర్వ మగుచు.

245


మ.

భువన[231]స్తుత్యగుణానురూపమగు జంభూభూద్వీపమం దాత్మక
ర్మవితానానుగుణంబుగా వివిధగర్భప్రాప్తుఁడై, జీవుఁ డు
ద్భవకాలంబున సూతిమారుతము నొంపన్, యోనిమార్గంబునన్
భువికి న్వెల్వడి, మోహపాశనికరంబుల్ దన్ను బంధించినన్.

246


క.

ఎఱుక చెడి, సతతతృష్ణా | పరవశుఁడై పెరిగి, పుత్ర[232]భార్యాదులపై
మరులుగొని, విత్తకాంక్షా | [233]పరిపీడితుఁ డగుచు, [234]దీనభావాన్వితుఁడై.

247

చ.

చలదళపల్ల[235]వాంచలనిషక్తపయఃకణభాతిఁ, జాలఁజం
చలమగు మేను నమ్మి, కలుషంబు లనేకము లాచరించి, [236]లో
తలఁపువిహీనుఁడై, పిదపఁ దత్తనువున్ బెడఁబాసి, యాతనా
కలితశరీరుఁడై, నిరయకల్పితబాధల దుఃఖ మందుచున్.

248


క.

అనుభూతపాపఫలుఁడై | పునరుద్భవ మంది, విష్ణుఁ బూజింప, మనం
బున భక్తి నిలుపనేరక | ధనదారసుతేషణములఁ దగిలి నశించున్.

249


ఉ.

ఇట్టు, సరోజనాభు భజి[237]యింప నెఱుంగక, తామసాత్ముఁడై
పుట్టుచు గిట్టుచున్, జముని పోకలఁ గీడ్పడుఁ, గాన భవ్యమై
నట్టి మనుష్యగాత్రముఁ బ్రియంబునఁ [238]గైకొని, బోధయుక్తుఁడై,
చుట్టిన ఘోరమోహదృఢసూత్రములం దెగఁగోసి, ధీరుఁడై.

250


ఉ.

చిత్తము శౌరిపాదములఁ జేర్చి, తదర్పణబుద్ధి నిత్యనై
మిత్తికకర్మముల్ నడపి, మిన్నక కామ్యని|షిద్ధదుష్క్రియా
వృత్తికిఁ బోక, సంతతము విష్ణుపరాయణుఁ డైనయట్టి వి
ద్వత్తిలకుండు, గాంచు నపవర్గము నిర్గళితాంతరాయుఁడై.

251


ఆ.

ఇది మహారహస్య, మీచందమున మీరు | బాహ్యవస్తువాంఛఁ బరిభవించి,
విశ్వమయుని, శాశ్వతైశ్వర్యుఁ గొలువుఁడీ! | దనుజతనయులార! దినదినంబు.

252


క.

అని, యివ్విధమున దానవ | తనయులకును [239]భుక్తిముక్తిదాయకమగు పా
వనవిష్ణుభక్తియోగము | నొనరఁగఁ బ్రహ్లాదవర్యుఁ డుపదేశించెన్.

253


కుమారవిద్యావైదుష్యపరీక్ష

వ.

అంత, నొక్కనాఁడు హిరణ్యకశిపుదానవేంద్రుండు మణిభూషణాంబరగంధ
మాల్యాలంకృతుండై, శూలహస్తుం డగుచు, సభాభవనంబున కేతెంచి, సింహాసనసమాసీనుండై,
రంభాద్యప్సరోనృత్యం బవలోకింపుచు, వందిమాగధసంస్తూయమాననిజబిరుదగద్యపద్య
శ్రవణజాతకౌతూహలుం డగుచు, సభాభవనంబునఁ బేరోలగంబుండి, గురుగృహంబున
నున్న ప్రహ్లాదకుమారు రావించి, నిజవామాంకపీఠంబున నునిచి, సాంత్వనపూర్వకంబుగా
నిట్లనియె.

254

చ.

గురువులు సంతసింప, ననుకూలుఁడవై, పఠియించితే మనో
[240]హరముగ నీతిశాస్త్రము సమస్తము నన్న! కుమార! నిన్నుఁ బా
మరులగు దైత్య[241]నందనులు మందుఁ డటందురు, వారిమాట బో
ల్పఱచుటకై పఠింపు మొకపద్యము, నర్థవిశేషహృద్యమున్.

255


వ.

అనినఁ బ్రహ్లాదుఁ డిట్లనియె.

256


ప్రహ్లాదుని విష్ణుతత్త్వవినిర్ణయము

క.

చదివితి [242]హరిగుణగణములు, | చదివితిఁ దత్పాదభక్తిసాధనములు, నేఁ
జదివితి [243]నతని మహత్త్వముఁ | జదువులలో నింతకంటెఁ జదువులు గలవే?

257


క.

జననస్థితివిలయములకు | వనజోదరుఁ డతఁడు కర్త వర్ణింపఁగ నీ
కనుభవకారణ మగు నీ | ఘనరాజ్యప్రాప్తి యతని కరుణన కాదే?

258


సీ.

ఆద్యంతశూన్యుఁ, డవ్యయుఁ, డజేయుఁడు, లోక | నాథుండు దుర్జననాశకరుఁడు,
బహుకోటిభాస్కరప్రతిమానతేజుండు | సజ్జనహృత్పద్మసదనవర్తి,
యాశ్రితసురభూజ, మఖిలభూతాంతర | స్థైర్యక్రియావేది, సర్వసముఁడు,
సనకాదియోగీంద్రసంతతధ్యేయుండు, | త్రిగుణవ్యతీతుండు, దివిజవంద్యుఁ


తే.

డమల[244]చరితుఁడు, భాగవతానురాగి, | [245]విశ్వమయమూర్తి, వేదాంతవేద్యకీర్తి,
శేషపర్యంకశయనుండు శ్రీయుతుండు, | పొలుచు నన్నింటిలోఁ బరిపూర్ణుఁ డగుచు.

259


క.

హరముఖ్యు లేమహాత్ముని | చరితము సర్వంబుఁ దెలియఁజాలరు, నే నా
[246]పురుషోత్తమునిమహత్త్వము | నెఱయఁగ వర్ణింపనేర్తునే? దనుజేంద్రా!

260


ఆ.

నామనోవిహారి, నాపాలిదైవంబు, | శ్రీమహీధవుండు, శేషశాయి,
యతని నెఱుకపఱచునవి గాక చదువులు, | చక్రిఁ దెలుపలేనిచదువు చదువె?

261


క.

అని పలికిన ప్రహ్లాదుని | సునిశితవాక్యాళి కర్ణశూలములైనం
[247]గనలిపడి, యంకగతుఁడగు | తనయుని బడఁద్రోచి, భృత్యతతి కిట్లనియెన్.

262

సుకుమారకుమారుని రూపుమాపఁ గుపితపిత యానతి

శా.

లోకానీకము సంచలింప, దనుజు ల్భూషింప శూరుండనై
నాకౌకఃపతిముఖ్యదిక్పతుల సన్నాహంబుతో గెల్చి, యి
ట్లేకచ్ఛత్రముగా, నజాండభవనం బే నేలఁగా, వీఁడు ల
క్ష్మీకాంతుండు జగద్విభుం డనుచు నాక్షేపోక్తులం బల్కెడిన్.

263


ఉ.

న్యాయ[248]పథంబు దప్పి, కులనాశకుఁడై జనియించె వీఁడు, దే
వాయతనంబుఁ గూల్చుటకునై యుదయించిన రావి వోలె, నా
రాయణుఁ డెన్న మద్విమతుఁ, డాకుటిలాత్ముని [249]గొండచేసి, మే
ధాయుతుఁడై నుతించె వస ద్రావిన[250]యట్లు నిరర్థకోక్తులన్.

264


ఆ.

ప్రకృతి [251]బంధుఁ డయ్యు బగవానిఁ గూడిన | వాఁడు పగతునట్ల వధ్యుం డండ్రు
కాన, వీనిఁ బట్టి మీ నేర్చుతెఱఁగులఁ | దునుముఁ [252]డిపుడు రాజతనయుఁ డనక.

265


వ.

అని యానతిచ్చిన దానవరాజు నాజ్ఞం దలమోచి, తత్కింకరులు రోషభయంకరు
లగుచుఁ బ్రహ్లాదుని బురబహిరంగణమునకుం దిగుచుకొని, వధ్యశిలామధ్యంబున
నుపవిష్టుం జేసి.

266


క.

కలుషించి దైత్యనాథుఁడు | నిలుపోపక మమ్ముఁ బిలిచి నినుఁ దునుముటకై
సెలవులు మూఁడు నొసంగెను | దలఁపుము నీయిష్టదైవతంబుఁ గుమారా!

267


వ.

అనినఁ, బ్రహ్లాదుండు దైత్యుల కిట్లనియె.

268


విష్ణుభక్తి మహిమ

శా.

గోవిందుండన నొప్పు నెవ్వఁడు, జగత్కూటస్థుఁ డెవ్వాఁడు, వి
శ్వావిర్భావవివర్ధనక్షయకరవ్యాపారుఁ డెవ్వాడు, నా
నావేదస్తవనీయుఁ డెవ్వఁడు, చిదానందాత్ముఁ డెవ్వాడు, నా
దైవం బాజలజోదరుం, డతనిఁ జిత్తంబందు భావించెదన్.

289

మ.

అని, ప్రహ్లాద[253]కుమారుఁ డట్టు లభయుండై, వార్ధికన్యాధవున్,
వనజాక్షున్, దనుజాంతకున్, మురహరు న్వర్ణింప, నాకింకరుల్
ఘనరోషానల[254]దీపితాస్యు లగుచున్ గర్జించి, యాపుణ్యవ
ర్తనుపై వేసిరి, ఖడ్గశూలశితకుంతక్రూరబాణాదులన్.

270


చ.

అసురభటప్రయుక్తమగు నాశితశస్త్రచయంబు దైత్యరా
జసుతుని వజ్రసారమగు చారుశరీరము దాఁకి, చూర్ణమై
వసుమతి రాలెఁ గాని, యొకవంకయు [255]నొంపఁగలేకపోయె, నా
బిసరుహబాంధవుం దిమిరబృందము లోపునె యాక్రమింపఁగన్?

271


ఉ.

ఆయుధసంప్రయోగము నిరర్థక మౌట [256]నెఱింగి, క్రవ్యభు
ఙ్నాయకకింకరుల్ సమదనాగనికాయము లాకుమారుపై
నాయతశక్తి దీకొలుప, నాద్విరదంబులు నొక్కపెట్టఁ [257]
త్కాయము దూఁటి, యాక్షణమ ఖండితదంతము లయ్యె నన్నియున్.

272


తే.

దంతములు విర్గి యపుడ దంతావళంబు | లాఁడుపోఁడిమిఁ గైకొని చూడ నొప్పెఁ,
బురుషకుంజరుఁ డనుచు నాపరమపుణ్యు | డాయవచ్చిన కరిణినికాయ మనఁగ.

273


చ.

క్రమమున నంతఁ బోక యసురప్రభుకింకరు లుగ్రకృష్ణస
ర్పములఁ బ్రచండతం గఱవఁబంచిన, దానవరాట్కుమారు గా
త్రముఁ గబళించి, తత్ఫణులు రక్తము గ్రక్కుచుఁ బాఱె, నట్ల, సం
భ్రమమునఁ దార్క్ష్యవాహనుని భక్తులఁ బాములు [258]నొంపఁజాలునే?

274


ఉ.

పాయక దైత్యు లిట్లు బహుభంగుల బాధలొనర్ప “విష్ణుదే
వాయ నమో, [259]నిరంతవిభవాయ నమో, జలజాలయాకళ
త్రాయ నమో, నిశాచరహరాయ నమో" యనుఁ గాని, క్రవ్యభు
గ్నాయకనందనుండు చలనంబునఁ బొందఁ డొకించుకేనియున్.

275


క.

స్మరణ మొనర్చిన నంతః | కరణములో నెగులు దీర్చు కమలాక్షశ్రీ
చరణము; తన్నామస్తుతి | కరణము వెలివంత మాన్పఁగలుగుట యరుదే?

276

పుండరీకాక్షుఁడు ప్రహ్లాదుని బరీక్షించుట

ఉ.

వెండియు, దైత్యు లగ్నివిషవేదనకృత్యము లాచరించియున్
జండతఁ జూపియుం దునుమఁజాలక, బాలకు నుగ్రపాశబం
ధుండుగఁ జేసి, యంబునిధిఁ ద్రోచినఁ, దత్సలిలంబులోపలన్
గొండొకమగ్నుఁడై, మది ముకుందుని బేర్కొనుచుండు నత్తఱిన్.

277


ఉ.

పంకరుహాక్షుఁ, డార్తజనపాలనదక్షుఁడు, శేషభోగిప
ర్యంకుఁడు, శంఖచక్రకలితాంకుఁడు డగ్గఱు వచ్చి, యాత్మ వా
మాంకమునందు దైత్యతనయాగ్రణి నుంచి, శిరంబు దువ్వి, క్షే
మంకర వాగ్విశేషమున మచ్చిగఁ దేల్పుచుఁ గూర్మి నిట్లనున్.

278


చ.

జనకునియాజ్ఞ నిల్పక, నిశాచరకోటి కసమ్మతుండవై,
ఘనతరచక్రకుంతశరఖడ్గగజోరగవహ్నిముఖ్యవే
దనముల నొంది, యిట్లు సతతంబు కృశింపుచు, బాల్యచాపలం
బున మృతిపొందె దేమిటికి బుద్ధివిహీనుఁడవై కుమారకా?

279


సీ.

అఖిలలోకస్వామియైన నీజనకుఁ డే | కాతపత్రంబుగా నసురరాజ్య
మంతయుఁ బాలింప, నతని యాజ్ఞాస్థితిఁ | ద్రోయక బుద్ధిమంతుండ వగుచు
నీతిశాస్త్రాభ్యాసనిపుణమానసుఁడవై | యువ[260]రాజపట్టవైభవము దాల్చి,
యంబరాభరణమాల్యాలేపనాదుల | నర్థిఁ గైకొని రత్నహర్మ్యములను,


తే.

మృదులశయ్యాతలంబున మదనపరవ | శాంగనాజన[261]ప్రియసమాలింగనాది
సురతసౌఖ్యంబు లనుభవించుటకుఁ బాసి, యాపదలఁ బొందఁ దగునె ప్రహ్లాద! నీకు?

280


క.

నావుడుఁ, దత్తనుసంగో | ద్భావితసుజ్ఞానమహిమఁ బరమేశునిగా
భావించి, దనుజపతిసుతుఁ | డావనజాక్షునకు వినతుఁడై యిట్లనియెన్.

281


ప్రహ్లాదుని ప్రార్థనము

క.

తల్లివి తండ్రివి జీవిత | వల్లభుఁడవు నీవ కాక వసుమతి [262]నాకుం
దల్లి యనఁ దండ్రి యనగా | వల్లభుఁ డన నొరులు గలరె వనజదళాక్షా?

282

తే.

నలిననిలయావరేణ్య! నీనామపఠన | వజ్రపంజరమధ్యమవర్తియైన
నాశరీరంబునకు నేల నాశ మొదవు? | దానవాధముఘోరకృత్యములవలన.

284


చ.

కమలభవాదిదైవతనికాయములున్, సనకాదియోగిబృం
దములును, నారదాదిమునినాయక వర్గములున్, విశిష్టక
ర్మము లొనరించియైన, సుకరంబుగఁ గానఁగలేని, నీస్వరూ
పము గనుఁగొంటిఁ, దొల్లిటితపంబులు నాకు ఫలించె నన్నియున్.

285


తే.

జన్మసాఫల్య మయ్యె నీచరణకమల | దర్శనంబునఁ బ్రాగ్దురితంబు లణఁగెఁ,
గనకకశిపుని దండించి కమలనాభ! | ధర్మసంస్థాపనము సేయు [263]దయ దలిర్ప.

285


మ.

అని ప్రహ్లాదుఁడు విన్నవించిన, సరోజాక్షుండు మందస్మితా
ననుఁడై, యిట్లను, విన్ము దైత్యసుత! నిం దానైపుణిన్ [264]మించు నీ
జనకుం దున్ముదు, ధర్మ మేర్పఱతు, దుష్టశ్రేణి ఖండింతు, వ
ర్ధన మొందం బ్రకటింతు వేదతతులన్, దండింతుఁ బాషండులన్.

286


మ.

అభిషేకింతుఁ బురందరుం ద్రిదశరాజ్యంబందు, బూర్వాకృతిన్,
విభవోపేతులఁ జేసి సాత్త్వికులఁ గావింతు న్మహీమర్త్యులన్,
శుభసంపన్నుఁడవై సహస్రభువనస్తుత్యుండవై యుండు, నీ
కభయంబిచ్చితి, నేఁగు నీపురికిఁ బుత్రా! వైష్ణవాగ్రేసరా!

287


క.

అని పలికినఁ, బ్రహ్లాదుం | [265]డనుముదితస్వాంతుఁ డగుచు నబ్జాక్షునకున్
వినతు లొనరించి, సంశయ | మను [266]2లత ఖండించి, [267]మగుడి యరిగెం బురికిన్.

288


దనుజకింకరులు దానవపతికిఁ జోద్యమును విన్నవించుట

వ.

ఇట్లు ప్రహ్లాదుండు పురంబున కరుగునట మున్న, యతని వనథిం ద్రోచి చనిన కింకరులు
హిరణ్యకశిపుసమ్ముఖంబునం గరకమలంబులు [268]మొగిచి నిలిచి, వధ్యశిలారోపణంబు
మొదలను సముద్ర[269]నిపాతనంబు తుదయు నగు కుమారునివృత్తాంతంబు సర్వంబును
విన్నవించి, వెండియు నిట్లనిరి.

289

ఉ.

[270]చూచితె యొక్కచోద్యము యశోధన! నీసుతు నంబురాశిలో
వైచినవేళ నొక్కఫణివర్యుఁడు వచ్చి, తదీయబంధని
ర్మోచన మాచరించి, [271]యనుమోదమునం గొనిపోయి, వార్ధిరా
ద్వీచిపరంపరావిమలవేశ్మము సొచ్చెఁ బ్రసన్నమూర్తియై.

290


క.

ఊహింపఁగఁ బ్రహ్లాదుని | మాహాత్మ్యము ఘనము, నీకుమారుఁడె? దైత్య
శ్రీ హరియింపఁగ వచ్చిన | శ్రీహరి గాకెందు నిట్టిచిత్రము గలదే?

291


క.

[272]అని విన్నవింపుచుండం | దనుజేంద్రుఁడు చారముఖము[273]నం దాప్రహ్లా
దునిరాక విని సముద్య | ద్ఘనరోషదవాగ్నిశిఖలు గగనము ముట్టన్.

292


హిరణ్యకశిపుఁడు పుత్రవధార్ధము ససైన్యము వెడలుట

క.

[274][275]కులము చెడఁ గుఱ్ఱసుతునిం | బొలియించెద నేనె యనుచు, భూరికృపాణా
జ్జ్వలహస్తుఁడై చతుర్విధ | బలములతోఁ బురము వెడలె భయరహితుండై.

293


చ.

అమరవిరోధిసైన్యచరణాహతిజాతములై ధరాపరా
గములు దిశావకాశములు గప్పి, కనుంగొన [276]నొప్పె, నిందిరా
రమణుఁడు చంపునంతకును రాక్షసుఁ డొండెడ కేఁగె నేనిఁ గా
ర్యము చెడునంచు నప్పుడ రయంబునఁ గండ్లరికట్టెనో యనన్.

294


క.

కడు వడి దానవసేనలు | నడచునెడం దద్భరంబున ధరణి వణఁకెన్,
బొడిమన్ను రాలె శేషుని | పడగలు వెయ్యింటిమీఁదఁ బాతాళమునన్.

295


ఉ.

వాసవుఁ డాత్మపక్షములు వజ్రహతిం దునుమాడఁ గొండ లా
యీసునఁ దద్విరోధి దనుజేంద్రుని జేరెననంగ, దాన[277]ధా
రాసముదగ్రనిర్ఝరపరంపరతోఁ గనుపట్టె దైత్యసే
నాసమదద్విపంబు [278]లవి నమ్రరిపువ్రజనిష్కృపంబులై.

296


చ.

జలరుహబాంధవుం డమరశైలముచుట్టును నెక్కి యాడుచో
వలపలివాగె కాని గరువంబున దాపలివాగె ద్రిప్పినన్
మలఁగవు, నీరథాశ్వములు మా కెనగావని, హేషితారవ
చ్ఛలమున నార్చి నవ్వు, సురశాత్రవసైన్యతురంగమావళుల్.

297

తే.

కండ్లపస చూపి కామినీగణము వోలెఁ | బరుషవిషమాస్త్రవేదన పాలుపఱుపఁ
గల మనోగతి బెడిదంబుగా [279]వెలుంగు | దైత్యనాయకుసేనారథప్రజంబు.

298


తే.

నీలలోహితమూర్తులు, శూలధరులు | నుగ్రవేషులు నగుచు దైత్యాగ్రగణ్యు
వీరయోధులు మూర్తీభవించినట్టి | రౌద్ర[280]రసమనఁ బొల్తు రున్నిద్రమహిమ.

299


వ.

ఇ ట్లనన్యసామాన్యంబగు సైన్యంబుతో హిరణ్యకశిపుయాతుధానప్రముఖుండు [281]కుమా
రాభిముఖుండయి చనునెడ ముందట.

300


నరసింహావిర్భావము

క.

[282]ప్రళయానల[283]సన్నిభమై | [284]జలజాధిపకోటికోటిసంకాశంబై
యిల నొకతేజఃపుంజము | కలయఁగ దిశలెల్లఁ గప్పి కనుఁగొనఁబడియెన్.

301


మ.

మెఱుఁగుంగోబిల నిప్పుకల్ దొరుఁగ, నామ్రేడీకృతారావ[285]ని
ష్ఠురయై జిహ్వ నటింప, నూర్పుల గిరిస్తోమంబు లూఁటాడఁ, గ్రో
ధరసావేశము నేత్రము ల్దెలుప, నాదైత్యేంద్రు ఖండింపఁగా
నరసింహాకృతి దాల్చి, యందు వెడలె న్నారాయణుం [286]డుగ్రుఁడై.

302


ఉ.

ఇ ట్టతిఘోరమూర్తి నుదయించి, సురాసురదుర్నిరీక్షుఁడై
నట్టి నృసింహదేవుని భయంకరలోచననిర్యదగ్నిసం
ఘట్టనమాత్ర [287]నద్భుతముగాఁ బరిదగ్ధములయ్యె దైత్య రా
ట్పట్టణహర్మ్యగోపురసభాగృహకోశ[288]గృహాదు లన్నియున్.

303


ఉ.

ఆతెఱఁగెల్లఁ గాంచి, దనుజాగ్రణి [289]కోపకషాయి[290]తాస్యుఁడై
యీతఁడువో! మదీయరిపుఁ, - డీతఁడువో! జలజాలయామనో
నేత, నృసింహుఁడైన యితనిన్ బలిచేసెదఁ జుట్టుముట్టి, నా
హేతి[291]కరాళకాళికకు నిప్పుడ నందనువెఱ్ఱి మానఁగన్.

304

కనకకశిపువిదళనము

చ.

ఎదురెదురేఁగి దైత్యవరుఁ డేచినకోపముతోడ మిక్కిలిం
గదిసి, భయంబు లేక, నిజఖడ్గము పూని, నృసింహమూర్తిపై
నదటున వేయఁజూచుటయు, నంతకుమున్న రమావిభుండు త
త్పదములుఁ జేతులుం బెనఁచి పట్టి, చలింపఁగనీక యుగ్రతన్.

305


క.

[292]తొడ లను వధ్యశిలాస్థలిఁ | బడవైచి, నఖంబు లను కృపాణంబులచే
వడివడిని [293]వ్రచ్చి ప్రేవులు | తొడిమలుకూడంగఁ ద్రెంచి దుర్వారుండై.

306


మ.

కరపాదప్రముఖాఖిలాంగకములన్ ఖండించి, దైత్యేశ్వరుం
బరలోకంబున కన్పి, తద్రుధిరకుంభత్సేచనప్రాప్తి బం
ధురకోపాగ్ని శమించినం, ద్రిదశ[294]నాథుం గాంచి, కారుణ్యని
ర్భరవీక్షానికరంబునం దనుపుచుం, బ్రహ్లాదు నగ్గింపుచున్.

307


ప్రహ్లాదరాజ్యపట్టాభిషేకము

క.

[295]రారమ్మని, నిజచరణాం | భోరుహభక్తాగ్రగణ్యుఁ బుణ్యు నతని ర
క్షరాజ్యభద్రపీఠస | మారూఢుని జేసె దివిజు లానందింపన్.

308


క.

కావున సంఖ్యాతీతము | లై వెలసిన హరిగుణముల నభినుతి సేయం
గా, వాణీవల్లభముఖ | దేవావళికైన నరిది ధీమద్వినుతా!

309


రామకృష్ణావతారకథ

సీ.

అంత, రెండవజన్మమందు రావణకుంభ | కర్ణులై భుజపరాక్రమము మెఱసి,
లంకాపురంబు నిశ్శంకఁ బాలింపుచు, | బలవన్నిలింపుల భంగపఱచి,
తుద రఘురామచంద్రుని చాపభవసాయ | కాగ్నికి శలభంబు లైరి, మఱియు,
మూఁడవ సంభవంబున శిశుపాలుండు | దంతవక్త్రుం [296]డనఁ దనరి, వాసు


తే.

దేవశితచక్రధారలఁ ద్రెంపఁబడిరి, | పిదప నిజ[297]శాపముక్తులై విదితమహిమ
జయుఁడు విజయుండు వైకుంఠసదనమునకుఁ | బూర్వమూర్తులు గైకొని పోయి రనఘ!

310


వ.

[298]అని పలికి.

311

ఆశ్వాసాంత పద్య గద్యములు

చ.

[299]వర[300]నుతశౌరిపాద[301]రత! నవ్య[302]సుధోత్తమసత్యభాషణా!
పరహితభూరిమోద[303]యుత! భవ్య[304]బుధోత్తమనిత్యపోషణా!
స్మరనిభదేహ! పుణ్యగణమాన్య[305]నృపాలయశోభివర్తనా!
[306]వరశుభగేహ! గణ్యగుణ[307]వైన్యనృపాలయశోభి[308]కీర్తనా!

312


క.

వాణీమరాళగంగా | వేణీనీహార[309]హీరవిధుమణిముక్తా
శ్రేణీనిర్మలదీధితి | పాణింధమకీర్తిధామ భాగ్యోద్దామా!

313


మాలిని.

సువిభవపురుహూతా! శుద్ధవంశాభిజాతా!
నవరసికవరేణ్యా! నమ్రవిద్విట్ఛరణ్యా!
భువనహితచరిత్రా! భూసురస్తోత్రపాత్రా!
సవితృసదృశతేజా! సర్వధీమత్తసుజా!

314

గద్యము

ఇది శ్రీహనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణీతనూజాత, అష్టఘంటావధానపరమేశ్వర బిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. ఈ పా. తి,ర.ప్ర. లో లుప్తము; హాకృతనిరతపరిరంభయాశ్రితకవిరాళ్ళోకవిలోక - తీ
  2. కుమారా - క
  3. సాగరీ - మ, మా
  4. గుండలించు - మా,త
  5. వీచి - మా,హ,ర
  6. దంష్ట్రోదగ్ర - తి
  7. శిష్ట - తీ
  8. క్రోడంబు - క
  9. ఘనరోషవేష - మ,మా
  10. గ్రోడ - క
  11. గదిసె - మ,త,తా,తి,తీ,హ,ర,క
  12. గెల్లుదాటి - అన్ని ప్ర.
  13. నిల్చి - ర
  14. బుచ్చి - ర
  15. నంటి - తి,తీ,హ,ర,క
  16. నామములన్ - త
  17. మునుదీపింపదిందిరా - తీ
  18. పెంపుయిందిరా - తీ. కంటె భిన్న ప్ర.
  19. విశిష్ట (యతి?) - తీ
  20. కీర్తనా - మ,మా,త, తా, తి తీ,హ,ర
  21. దుత్స్మరణ - తి తీ,హ,ర
  22. దలఁచి - తి,తీ
  23. భక్త - మా,త
  24. నీకుఁగప్పంబుగా నిజకర్మ పృథురత్నవితతి నర్పించువారు - మా,త,తా
  25. దేహాయ - మ,మా,త,హ,ర,క
  26. హాయయని(?) - క
  27. స్వాహాస్వధాంతమునుగాఁగభక్తి - తా
  28. ద్యుపాయనముల - తి,తీ,హ,ర,క
  29. రక్షణ (యతి?) - మ,మా,తి,తీ
  30. మునుమంత్రించి - త
  31. మహేశా - తీ; నాగున్ - తి,హ
  32. నగజాసుత (యతి?) - మా
  33. రత్న - మ,త,తీ,హ,ర,క
  34. మతిన్ - మా
  35. సమ్మతియే - మ,మా,త
  36. లబ్ధ - అన్ని ప్ర.
  37. ఈ వ. తీ. ప్ర. లో లుప్తము
  38. ష్ట్రాసనస్థాయినియైన భూదేవి యంబురుహనాభు (యతి?) - మ,త,క,తీ
  39. వనజనాభు (యతి?) - తా
  40. పరమ - తీ; వెలయు (యతి?) - మ,తా,తి,హ,ర,క
  41. లెవ్వి - మా
  42. ధర్మ (యతి?) - మ,మా,త,తి,హ,ర,క
  43. స్తవంబు యది - అన్ని ప్ర.
  44. నిర్మలబుధులున్ - తి,తీ
  45. సుజనరతులు - తి,తీ
  46. డాఢ్యుఁడు - త; డార్యుఁడు - తా
  47. విభుండు - తా,తి,తీ,ర
  48. కూటుఁడై - త
  49. వృషాఖ్య - మ; వృషాభి - తా; వృషావ - తి,తీ,హ,ర
  50. సురుండు - త
  51. చతురుల్ (?)
  52. మందనంత - మ,మా,తా,తి,ర,క; ముపైనంత - తీ; మరిదనంత - హ
  53. రోగ - తీ
  54. బ్రహ్మచర్య - త
  55. మహత్సత్యంబు - తీ
  56. సరవి - తా
  57. శివయోగ మారూఢ - త
  58. విజన - తీ
  59. వరుల - తీ
  60. జాతి - క
  61. మండలమున - మ,మా,త,తా,తి,క
  62. కోపముడిగి విమలచేతస్కుఁడై - ఈభాగము మ, త, తి,హ,ర ప్ర. లో లుప్తము; ఘనత మెఱయ నాదరం బొప్పఁగా - మా
  63. భజియించి - తీ; నియమించి - ర: ధరియించి - తి
  64. నుత్తముల - మా
  65. భవకంద - మా,త; ఫలకంద - తీ
  66. గతియు - మ
  67. డరుగును - తీ
  68. ధాతు - తా,తీ
  69. టర్హంబనఘా - తీ
  70. గ్రోడ - క
  71. దాశిలా - తి,తీ
  72. రించెదన్విను త్వదీయపుఁబ్రశ్నకు - తీ
  73. నంటి - త
  74. నాశ్రమ - తి,తీ
  75. కర్మ - మ,తా,తి,తీ,హ,ర,క
  76. భయవిరహితుఁడయి - త,మ,హ; మున విరహి - తీ; విరహితుఁ డగుచును - తా
  77. విచ్చనవిడి - అన్ని ప్ర.
  78. జెంది - మా
  79. గేహమున - మ,మా,త,తా,హ,ర
  80. గడయక - మా
  81. యందు - తీ
  82. ఈ ప. తీ. ప్ర. లో లుప్తము
  83. నీలకమలం - మా,త
  84. రతుఁడు - తి,తీ; చరుఁడు - హ,ర
  85. మందును - తీ
  86. పరవస్తువొండె - తీ
  87. పాదజ - ఘ,మా,త,తా; పాచిక - తి,తీ,హ,ర,క
  88. శ్యామంబు - మా,త,క
  89. సుభగంబై - త
  90. హర (ప్రాస?) - మా
  91. రసము - మ,మా; తరము - తా
  92. నీలకాంతిసము - తీ
  93. తి, తీ ప్ర. లో ఈ ప, తరువాతి (93) ప. అసమగ్రము.
  94. నిరతముగదరే - త
  95. మున - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  96. చక్రమై - మా
  97. గణకన్ - క
  98. క్రోడ - క
  99. వామన - మ,మా,త,తి,తీ,హ,ర,క
  100. చతుర - మ,తి,హ,ర,క
  101. రేఖము - క
  102. రేఖాంకము (ప్రాస?) - అన్ని ప్ర.
  103. ణ ధ్యాన - మ,తా,తి,తీ,హా,ర,క
  104. గణపూజ గలది యుగ్రహరిమూర్తి - తీ
  105. హారిమూర్తి (యతి?) - మ,తా,తి,హ,ర,క
  106. దాపల (ద - త యతి) - అన్ని ప్ర. ర. ప్ర; శో చాపల రఘురామమూర్తి, లుప్తము.
  107. గల్గినది భృగురామమూర్తి - తీ
  108. సేవమాన - అన్ని ప్ర.
  109. మఖిల - తీ
  110. ఈ ప. మ,తి,తీ,హ,ర,క ప్ర. లో లుప్తము
  111. దుర్ధరంబు - మ,మా,త,తా
  112. లోకమునందున్ (యతి?) - మా
  113. నతనికి - ర
  114. సంభవింప - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  115. షావలి - తీ; షానల (ప్రాస?) - తి; షాఖిల (ప్రాస?) - మా
  116. రంగత్తరుఁడై - తి,తీ; తంగత్తరుఁడై - మ,మా,త,తా,హ,క
  117. సన్నుఁడై - మ,తా
  118. చక్ర - మ,తి,తీ,హ,ర,క
  119. బోలగ వెదకుచు - తీ
  120. బహుపాశవిబద్ధుని జేసి యాత్మసదనంబునకున్ - తి,తీ,హ,ర
  121. గనుగొని - మా,తీ,హ
  122. మున్నవోలె - త
  123. విటెంతే భీతి - తీ
  124. శౌరి - అన్ని ప్ర.
  125. బ్రహ్మచర్యాద్యాశ్రమ - తా
  126. మొప్పుగ మనుజుం - త; యుత్తమమనుజుం డగణిత - హ; మూహింప నరుం - క
  127. నొప్పుగ (యతి?) - మ,ర
  128. మహిత - జనించు తి.ప్ర. లో లుప్తము
  129. కలియుగంబున భక్తికలితులై కీర్తన లొనరించినంతనే యొదవు ముక్తి గాన యుగముల - తీ
  130. బు జపతపాద్యాయసత్క్రియా చరణనిపుణ సన్మునివరేణ్యులకుఁ బారిజాతకంబు - తీ
  131. నిశ్చిత్తు - మ,మా,హ,ర,క
  132. రాయు - మ; వాయు - తీ; దాయు - క
  133. చే వినిద్రంబుగా - త,తి
  134. స్వర్గ - తి,తీ
  135. దలఁపుచు - మా,త,తా,తి,తీ,క
  136. పదమున్ - అన్ని ప్ర.
  137. చింతన - తీ
  138. బబ్బు - మా,త
  139. యోగ - తీ
  140. యోగ - మ,తి,తీ,హ,ర,క
  141. నధిక - నారకముల తి,హ,ర, ప్ర. లో లుప్తము; రక్తమేదోమాంససిక్తకూపంబున దుర్గంధమగ్నుఁడై దొర్లి దొర్లి తద్గతంబగుజంతు - తీ
  142. మూర్ఖుఁడై - అన్ని ప్ర.
  143. ఈ పాదము తా.ప్ర.లో మాత్రమున్నది.
  144. వికీర్ణ - త; వితీర్ణ - క
  145. ఈ ప. ఆ.ప్ర. లో లుప్తము
  146. సర్వాంగకుఁడై - మా
  147. ఈ ప. మ,తి,తీ,హ,ర,క ప్ర.లో లుప్తము
  148. మడంచి - తి,హ,ర
  149. జపసత్కళా - మ,తా,హ,ర,క; జపసత్కథా - తి
  150. వరభూషణార్తియౌ - క; భూషణార్తియై - మా
  151. కాంతావర్తులకును సుర - మ,మా,త,తి,హ,ర,క
  152. సుర - మ,మా,తి,హ,ర,క
  153. బరమాణం - మ,మా,త,తా
  154. శుభాకర - తి,హ
  155. ముమేర - మా
  156. సన్మానులకున్ - మా
  157. వర్తిలు - క
  158. వినాశ - మ,తి,హ,ర,క
  159. కర్మంబు-జనకంబు మా.ప్ర.లో లుప్తము
  160. వచనం- మ,త,తా,తి,హ,ర
  161. సునాశకుం - మ,మా
  162. వంతుఁడై - త
  163. గడుసంతోషంబు - తా
  164. బెట్టక - మ,మా,తి,తీ,హ,ర,క
  165. గేలు - తా
  166. దేల్చి - మా; దెంచి - ఇతర ప్ర.
  167. యెట్లుమీఁద నిర్గమింతు - త
  168. నవరత్న (యతి?) - మా
  169. విలాస - తా
  170. ధరావర - మ,త,తా,తి,తీ,హ,ర,క
  171. వేడ్కనంత-మ,తి, తీ,హ,ర,క; సమ్మతించి - మా
  172. పుణ్య - త
  173. జన్మకర్మములు ద్రెవ్వ (యతి?) - మా
  174. ద్రిప్ప - మ,హ,ర,క
  175. జెందెదవు - క
  176. జన్మంబున నెట్టికర్మ - తీ
  177. ఇది తీ. ప్ర. పాఠము; ఇతర ప్ర. లో లుప్తము.
  178. బయ్యెఁగాని - మ,త,తా,తి,తీ,హ,ర,క
  179. నందుసత్పాత్ర - పటలికైన తి. ప.లో లుప్తము.
  180. నుల్లసిల్లుచు - క
  181. ముఖ్యుఁడు - క
  182. వీనికద్భుత - మ,మా,త,తీ,హ,ర,క
  183. ర చౌసీతి (యతి?) - మ,మా
  184. నుతించు-మా
  185. వినీంద్రుఁడై - మ,మా,తా,తి,తీ,హ,రక
  186. విహారుఁడై - తా,క
  187. క్రీడా - క
  188. బాప ము - మా
  189. సంఘంబు - మ,మా,తి,హ,ర,క
  190. సంభవంబులను - మా
  191. నుంచియు - త
  192. నిమిషపరీతం - తా
  193. భయము - మా
  194. వనితా - మ,తి,హ,ర,క
  195. వులకు - తా
  196. గర్ములకును - తా
  197. దుఃఖమై - మా,క
  198. జన్మావసానంబున - మా,త
  199. దారా - మ,హ,ర
  200. డైయమ - మ,త,క
  201. వీగె - క; వీచె - తా; మించె - త
  202. వనపావకంబు దిరిగె -మ,తి,తీ,హ,ర,క
  203. పంకజము స్థానము - మ,తా,తి,తీ,హ,ర,క
  204. ముగ్రత - మా
  205. మున్నినునిపై - క, మా
  206. చేసె - మా
  207. శైలచయము - మా; మహాబిలము - త; నభమందు (యతి?) - తా
  208. తపశ్చరియలు - మ,త,తి,హ,ర,క
  209. కమలములు - అన్ని ప్ర. వర్ణాధిక్యముచే గణభంగము.
  210. భోరున (యతి?) - త,తా,క; బోరన - మా
  211. ఈ వ.తి,ర, ప్ర.లో లుప్తము
  212. దక్షిణా - చవిగాఁగఁదొణఁగె హ.ప్ర.లో లుప్తము
  213. వక్షోజద్వయ (ప్రాస?) - త
  214. న,నచలుఁడై (యతి?) - మ,తి,తీ,హ,ర,క
  215. శంఖ - మ,తా,తి,హ,ర,క
  216. సదా - మా,త
  217. నుండె - మ,మా,తి,హ,ర,క
  218. బుత్రకోత్సవము (యతి?) - మ,తా; బుత్రఉత్సవము - తి,హ,ర
  219. యిట్లనెన్ - మా,త
  220. దవపావకుని - మ,మా,త,తి,తీ,హ,ర,క
  221. కుమారు - తీ
  222. నిధి (ప్రాస?) - తా
  223. యసురేంద్ర - క
  224. సంస్థిర - క; సుస్థిర (యతి?) - మ,మా,తి,తీ,హ,ర,క
  225. పెలుచన్ - తీ
  226. యిక్క - తీ
  227. గైకొనుఁ డట్టి - తీ
  228. ముదంబున - క
  229. నిజనాభిసరోరుహమునఁ జతుర్ముఖుఁడు దామును జనించె - తి; స్వీయమగు నాభిపంకేజమునఁ జతుర్ముఖుడు దామును జనించె - తీ
  230. వర - తా
  231. వ్యక్త - తీ
  232. దారాదులకై (యతి?) - మా
  233. పర - మ,మా,తి,తీ,హ,ర,క
  234. విత్త - తి,తీ,హ,ర
  235. వాంచిత - తీ
  236. బోదలప - అన్ని ప్ర.
  237. యించు టెఱుంగక - తీ
  238. గన్గొని - మ,మా,క
  239. భక్తి - తి,తీ
  240. హరమగు - త
  241. బాలకులు - తీ
  242. నేహరిగుణములు - మ,తా,తి,తీ,హ,ర,క
  243. దన్మాహాత్మ్యము - మా,త; నిదన్మహత్త్వము - తా
  244. భాగవతానుగ్రహానురాగి - తా; భాగవతాజనతానురాగి - మా
  245. విబుధగణనీయవేదాంతవేద్యమూర్తి - తీ
  246. పురుషోత్తముమాహాత్మ్యము - త
  247. గని పర్యంకగతుండగు- తా; ఘనపర్యంకగతుండగు - మ; తనపర్యంకగతుండగు - తి,హ,ర; దనుజేంద్రుఁ డంకగతుఁడగు - తీ
  248. పదంబు - త,తా
  249. గొప్ప - త
  250. చిల్క - క
  251. బంధుఁడైన - మా,తా,హ,ర; బద్ధుఁడైన-క
  252. డితఁడు - ర
  253. కుమారధీరుఁడ - మ; కుమారకుం డభయుఁడై యా - తి,తీ,హ,ర,క; డప్పు డభయుండై - మా
  254. పీడితాస్యు - క
  255. నొవ్వఁగ - మ,హ,ర,క; నోర్వఁగ - త; నెవ్వగ - తి,తీ
  256. యు నల్గి - మా,త
  257. నాకాయము - మ,తా,తి,తీ,హ,ర,క
  258. నొవ్వ - తీ
  259. యనంత - తీ
  260. రాజ్య - అన్ని ప్ర.
  261. కుచ - మా,త
  262. లోనం - మ,క
  263. నిర్మలాత్మ - క
  264. మించె నీజనకుం డున్మదదర్పమేర్పరతు - అన్ని ప్ర.
  265. డునుముదితస్వాంతుఁ డగుచు నుతులను బంకే | జనయనునికడ సంశయ - తీ
  266. తల - మ,తి,హ,ర,క
  267. మగుడనరిగెం - మ,తా,తి,తీ,హ,ర,క
  268. ముకుళించి - తీ
  269. నిర్హేతనము - మ,తి,హ,ర
  270. చూచితి మొక్క - మ,మా,తా,హ,ర,క
  271. యును - తీ
  272. ఈ ప. తీ. ప్ర.లో లుప్తము.
  273. నందం - తా
  274. ప. 293, 294 మా. ప్ర.లో లుప్తము.
  275. కులము పాడగుట - తీ; కులము చెడగుట - తి,ర
  276. నొచ్చి - అన్ని ప్ర
  277. వారాసముదగ్ర - అన్ని ప్ర.
  278. లు వినమ్ర - తీ
  279. మెలంగు - త
  280. రసమున - అన్ని ప్ర.
  281. విహారాభి - మా; పరాభి - మ; వారాభి - తి,ర
  282. ప్రళయానిల - అన్ని ప్ర.
  283. సంభవమై - మ,మా,త,తి,తీ,హ,ర; సంభ్రమమై-క
  284. జలజాహిత - అన్ని ప్ర.
  285. నిష్ఠురమై - తీ
  286. డుద్దతిన్ - తీ
  287. నుద్ధతము - తా; దుత్తుఱుము-మ,తి,తీ,హ,ర,క
  288. భువనాదు - క
  289. రోష-తీ
  290. తాక్షుడై - తీ; తాత్ముఁడై - హ
  291. కరాళికాశిఖికి - తి,తీ
  292. ఒడలను - మ,మా,తి,హ,రక
  293. గ్రుచ్చి - తా
  294. సుస్తోమంబు - మా
  295. ఈ ప. మా. ప్ర లో లుప్తము
  296. డనా - తీ
  297. చాప - తి
  298. ఈ వ. తి, తీ, ప్ర.లో లుప్తము
  299. ఇది గోమూత్రికాబంధము
  300. నత - తీ; సుత - తి,ర; నుతి - త
  301. నత - ర; రస - క
  302. సురద్రుమ - తా; సుధారమ - మా; సురాసుర - మ
  303. హిత - తి,తీ
  304. వరాదర - తీ
  305. కృపాల-మా
  306. పర - మ,మా,హ,క
  307. దైన్య (యతి?) - మ,క
  308. కీర్తితా - త
  309. హార - తీ