రుక్మిణీపరిణయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము



నగరాజకుమారీ
మానసకాసారవిహరమాణమరాళా
మానితశౌర్యాంధకర
క్షోనాయకమదవిభంగ కుక్కుటలింగా.

1


వ.

అవధరింపుము సూతుం డమ్మునిశ్రేష్ఠుల కెఱింగించినవిధంబున శుకుండు పరీక్షిన్న
రేంద్రున కవ్వలికథ నెఱింగింపందొడంగె.

2


తే.

అవనినాయక యంత నయ్యలరుఁబోఁడి, తోడిచేడెలు బంగారుమేడలోన
నిందుముఖిఁ గాన కెంతయుఁ గుంది మంది, రాంగణాంతరముల నెల్ల నరసి చూచి.

3


ఉ.

అచ్చెరువొంది హా బిసరుహాయతనేత్ర మనోభవార్తిచే
నిచ్చలు గ్రాఁగి శయ్యకడ నిల్వ సహింపక లేచి యొంటిఁ దా
నెచ్చటి కేఁగెనో వెదకరే యని చింతిలుచున్న యంతలో
మచ్చికఁ గీరశారికలు మానినిచంద మెఱుంగఁ బల్కినన్.

4


క.

హరిణీలోచనలెల్లను, సరగునఁ బూఁదోఁట కరిగి చంచలవృత్తిన్
బరికించుచు నొకచో న, ద్ధరణీవరతనయఁ గాంచి తత్తఱ మొదవన్.

5


చ.

మునుకొని మేలిచెంగలువమొగ్గలు సంపెఁగబంతులుం గన
ద్వనరుహనేత్రకుం బడిసిపైచి మెడం గురువేరుఁ గట్టి క
మ్మనికపురంపుభూతి యిడి మానసభూతవికారశాంతికై
సనివడి యుగ్రమంత్రములు బాలికమ్రోలఁ బఠించి యల్లనన్.

6


మ.

అకటా నెచ్చెలులన్ మొఱంగి మకరాంకాభీలబాణావలీ
వికలస్వాంతసరోజవై నయగతుల్ వీక్షింప కీభూమినా
యకదేవేంద్రుఁ దృణీకరించి నిజవంశాచారమార్గంబుఁ గో
రక యీరీతిఁ జరింప నీకుఁ దగునా రాకేందుబించాననా.

7


ఉ.

పుత్తడివంటిమేను వలపుం బలుకాఁకలఁ గ్రాఁగ నీగతిన్
వత్తురటమ్మ ఘోరవనవాటికి మాటికి సాటికన్నియల్

మెత్తురటమ్మ యీగడుసుమేలపుమాటలు విన్నవిన్ననై
చిత్తము దత్తఱింప నృపసింహుఁడు గుందుఁ గదమ్మ జవ్వనీ.

8


క.

నిద్దపుఁగెంజిగురాకులఁ, దద్దయు నిరసించునీపదంబులు నేఁ డో
ముద్దియ వనభూములలో, గద్దఱివై తిరుగ నెట్టుగా నోర్చెనొకో.

9


సీ.

కుజనులఁ జేరి చొక్కుచు సీధుపానంబు సేయుచండాలు రీచెనఁటితేంట్లు
పల్లనచరవృత్తిఁ బాటిల్లు పరపుష్టగుణవికారంబు లీకోకిలములు
వెస ఘనుం జూచి మానసచింతఁ జనెడునిత్యమరాళజాతు లీయంచగములు
విషధరాగమనంబె వేఁడుచుఁ గేకలు వెట్టుశిఖండు లీనట్టుపులుఁగు


తే.

లహహ యీరీతి భీతి యింతైనలేక, నగెడువారల నెఱుఁగక వగలు మిగులఁ
బొగిలి తహతహ నొందుచు దిగులు పూని, తగిలి వనభూములకుఁ జేరఁ దగునటమ్మ.

10


ఉ.

కన్నియ నీకిటుల్ వగవఁ గారణ మేమి జగత్ప్రసిద్ధిగా
నెన్నఁగఁ జూలి సర్వశుభహేతువులై తగునీగుణావళుల్
విన్నపుడే యదూద్వహుఁడు విప్రకుమారుని గారవించి నిన్
గన్నులఁ జూచుకోర్కి నధికంబుగ నువ్విళులూరకుండునే.

11


తే.

శుభనిమిత్తంబు లెన్నైనఁ జూడఁబడుచు, నున్న వబ్జాక్షి సంశయం బుడిగి యిఁకను
సంతసం బాత్మఁ బూని వసంతకేలి, సేయుదము లెమ్మ యుద్యానసీమయందు.

12


ఉ.

కన్నులపండువై ద్విరదగామిని యామని యొప్పె గొజ్జెఁగల్
బొన్నలు గేదఁగుల్ వకుళముల్ విరవాదులు మొల్ల లాదిగాఁ
గ్రొన్ననలెల్లఁ గొల్లలుగఁ గోయుచుఁ గెందలిరుల్ హరించుచుం
దిన్ననికప్పురంపునునుదిన్నెలఁ జిన్నెలఁ గ్రీడ సేయుచున్.

13


తే.

తేఁటులను బాఱఁదోలి పూఁదేనెఁ గ్రోలి, లీలఁ జెలరేఁగి తీఁగెటుయ్యాల లూఁగి
ప్రౌఢిఁ జెట్లెక్కి తియ్యనిపండ్లు మెక్కి, మేలిచెంగల్వబావుల నోలలాడి.

14


క.

వనకేలి సేయు టుచితము, వనరుహదళనేత్ర రమ్ము వైళంబని య
య్యనుఁగుంజెలు లాడిన నొ, య్యన మది నంగీకరించి యతివలుఁ దానున్.

15


ఉ.

గుత్తపుఁగంచెలల్ దొడిగి క్రొమ్ముఁడు లిమ్ముగ దిద్ది నిద్దపుం
బుత్తడిమేలిసొమ్ము లిడి పొందుగ నందెలు గట్టి గందముల్
మె త్తి మణుంగుఁబావడలు లీల ధరించి వసంతకేలిపైఁ
జిత్తము లత్తుకొల్సి మదసింధురయానము లుల్లసిల్లఁగన్.

16


క.

పువుఁదోఁటలోన నపు డభి, నవకౌతూహలము వెలయ నరనాథతనూ
భవ చెలులఁ గూడి మెలఁగుచు, భువనోజ్జ్వలతరవిలాసములు గనుఁగొనుచున్.

17


తే.

బోటి యల్లవె తగ మగతేఁటిమేటి, పువ్వుమొగ్గలపై వ్రాలి పొదలుచున్న
దవు బళా రాజసుత యి ట్లఘారి నీదు, మోవిచివురునఁ బల్గంట్లు ఠీవి నుంచు.

18

క.

పున్నాగముతోఁ బెనఁగుచు, నున్నది లతకూన చూడు ముగ్మలి యౌ నా
పున్నాగముతో నిటువలె, నెన్నఁగ లతకూన పెనఁగె దీవున్ గోర్కిన్.

19


చ.

కనుఁగొను మివ్వనస్థలిని గామిని మాధవసంగతంబునం
దనరునఖాంకురాంకము లనం దని మోదుగుమొగ్గ లొప్పె నా
జనవరపుత్రి యిట్ల సరసం బగుమాధవసంగతంబునం
దనరునఖాంకురాంకములు దట్టము మీఱుచు నీయురస్స్థలిన్.

20


చ.

పలుమఱుఁ జంచరీకతతిపై వితతంబుగ మొల్లక్రొవ్విరుల్
జలజలరాలుచున్నవి విశాలతరేక్షణ చూచితే బళీ
బళి నృపకన్య నీతుఱుముపై సరసీరుహపత్రనేత్రుఁ డి
మ్ములఁ జెలరేఁగి యీక్రియనె ముత్తియపుందలఁబ్రాలు వోసెడిన్.

21


క.

తళతళ మెఱయుచు నవచల, దళపల్లవ మలరెఁ గాంచు తరుణీ యౌ నీ
గళమునఁ గుందనపున్మం, గళసూత్రం బిట్లు చక్రి గట్టుఁ గుమారీ.

22


చ.

శ్రమకణముల్ హరించుచు విశాలతరవ్యజనంబు వీచుచం
దమునఁ జలించుచున్నది యనంటిదళంబు లతాంగి చూడు భూ
రమణకుమారి యౌ నిటులె రాగముతోడ సుర్ణతాలవృం
తము విసరున్ మురారి సురతశ్రమవేళల నీకు నిచ్చలున్.

23


తే.

చానరో మేనఁ బూదేనె సోనవాన, చిలుకుచున్నది లేమావి చిత్తగింపు
మేలు భోజతనూజ నీమేన నిట్లు, వలపు గులుకంగఁ బన్నీరు చిలుకు శౌరి.

24


ఉ.

తోరపుమల్లెపూఁబొదలు దూఱి ముదంబునఁ గీరదంపతుల్
గేరుచు సారెకున్ సరసలీలల నుండెడిఁ జూడు బోటి యా
శౌరిని గూడి ముత్తియపుసౌధములందు మనోజలీలలం
గేరుచు నుందు విట్లు పరికింపఁగ నీవును రాజకన్యకా.

25


తే.

అనుచు సరసోక్తు లాడుచుఁ దనదుమదికి, హర్ష మొదవించుచున్న యయ్యనుఁగుఁజెలుల
గారవించుచు మఱియు శృంగారవనవి, హార మొనరించుచుండె నొయ్యార మొప్ప.

26


ఉ.

అప్పుడు కొప్పు విప్పి జడలల్లి సితోత్పల ముంచి పేరెదం
దప్పక గొప్పమొల్లవిరిదండలు నించి విలాసవైఖరుల్
గుప్పలు గాఁగఁ గెంజివురుఁగొమ్మ కరంబునఁ బట్టి నెమ్మెయిన్
బుప్పొడి పూసి కేరెఁ బువుఁబోణి యొకర్తు గిరీశుపోలికన్.

27


ఉ.

సారసగంధి యోర్తు విరసంబున గేదఁగిమీఁది తేఁటులం
బాఱఁగఁ దోల నయ్యళులు పైకొని డాకొని మోముదమ్మికిం
జేరినఁ గేలినీరజముచే నదలించినఁ బోకయున్న వే
సారుచు దానిపై నలిగి చంపకముల్ వెదచల్లె జల్లునన్.

28

ఉ.

తొయ్యలి యోర్తు మల్లికలు ద్రుంపఁగ మారునితూపు లవ్విరుల్
గొయ్యఁగ రా దటంచును సఖుల్ వచియించిన మానకున్నచోఁ
జయ్యనఁ బూఁబొదన్ వెడలి షట్పద మొక్కఁడు జుమ్మురన్న దా
నయ్యెడఁ బర్వువెట్టె గుసుమాస్త్రధనుర్గుణరావలోలయై.

29


తే.

సుందరి యొకర్తు మోమెత్తి చూడఁ జంప, కంబు పూచిన నది యాసుమంబు లేరు
తఱి నొకతె మాన్పె నివి తేంట్లకురులటంచుఁ, బలికెఁ బగవారిపగవారు బంధులగుట.

30


చ.

కిసలయపాణి యోర్తు మదిఁ గేరుచుఁ జొక్కపుఁగోఁగుఁ జూచి యిం
పెసఁగ నయోక్తు లేమొ వచియింప వెసన్ సుమనోవికాసలా
లస యగుచుం జెలంగి మరలం బ్రియభాషణముల్ వచించెఁ ద
త్ప్రసవమరందపానరతబంభరడింభరవోత్కరంబులన్.

31


తే.

సకియ యొకతె యశోకభూజంబుఁ బూని, తన్న నది పూచి క్రొన్ననల్ తత్పదాబ్జ
ములపయిని రాల్చెఁ దాడనంబులకుఁ జాల, జడిసి యోపదకాంతులసవతుగాకొ.

32


క.

మధురోష్ఠి యొకతె పుక్కిటి, మధు వొసఁగిన నలరి పొగడ మధురసధారల్
పృథుమతిఁ గాంతాళులకుం, బ్రథితముగా విందు లిడియె భక్తిన్ మగుడన్.

33


చ.

నలినదళాక్షి యోర్తు నగినం గని క్రొన్నన లెత్తి పొన్న భా
సిలెడుమరందబిందువులు చిల్కఁగఁ జాఁగె గయాళి యిట్లు దన్
జులుకఁగఁ జూచి నవ్వె ననుచున్ మది నెంతయుఁ గుంది ముగ్ధ చే
ష్టలు వెలయంగ దా నపుడు సాత్వికభావము పూనెనో యనన్.

34


తే.

అంబుజానన యొకతె గానంబు సేయఁ, గడువికాసంబు నొంది ప్రేంకణపుఁదరువు
సుతి యొసంగె నవీనప్రసూనవిసర, లీనసదలీనసంతానతానములను.

35


క.

తరుణి యొకర్తు కవుంగిటఁ, దరుణిం గదియించి దోహదక్రియ దెలుపం
బరితోషబాష్పకణములు, మఱిమఱిఁ జిలికించె సాంద్రమకరందమిషన్.

36


తే.

మానిని యొకర్తు తిలకపుమ్రానిపైని, లీల మీఱ నపాంగమాలికలు నించి
యలరఁజేసిన దానిపై నసమకుసుమ, నికురములు మాలికలు గాఁగ నించె నపుడు.

37


ఆ.

కేల నంటి యోర్తు లాలింపఁ బ్రస్ఫుటా, మోదరసవికాసమున రసాల
పాదపంబు దనరి పలుమాఱు సహకార, మై ప్రియాళులకుఁ బ్రహర్ష మొసఁగె.

38


తే.

రాజముఖి యోర్తు సిందువారంబుపైని, మేలినలితావి యూర్పుఁ దెమ్మెరలు నింప
నలరి యది మేను పులకించినట్లు సాంద్ర, కుసుమవిసరాభిరామపై కొమరుమీరె.

39


క.

మఱియుం గిసలయపాణులు, కర మొప్పఁగ నోళ్లు గట్టి గట్టిగ సుమనో
హరణోన్ముఖులై తమలో, సరసవిలాసానులాపచాతురి మెఱయన్.

40


రగడ.

చెలువ చెలువగు తేఁటిపాటలు చేరి చేరిక నాలకింపకు
వలదు వలదు పవనసమీరము వడల వడలఁగ నిచ్చగింపకు

మేలమేల లతాంగి కడుదుమ్మెదలె మెదలెడుపొదలు దూఱెదు
చాలుచాలుగ నున్నబాలరసాలసాలము లెక్కఁగోరెదు
గుప్పుగుప్పున వాసనలఁ బైకొంచు కొంచును గాక గాత్రము
గప్పు గప్పురపుందుమారము కదలి కదలిచినంతమాత్రము
వామవామకరంబుచే లత వంచి వంచితబుద్ధితో నన
లేమిలేమిటు పసరుమొగ్గలె యేరియేరినిఁ జూడ నీనన
గరముఁ గరమున నలరుతమ్మిమొగడలు గడలుగఁ జాఁపి యేపునఁ
దెఱవ తెరవడి జోపెదవు పూఁదేనెఁదేనెటు లొదవుఁ గోపునఁ
దనరు తనరుచి యంతకంతకుఁ దరము దరమును మదినిఁ గేరుచు
నునుప నునుపగుమొగలివిరి నీకొప్పుకొప్పున వలపు మీఱుచు
మాను మానునుఁ బోఁకబోదెలమరువె మరువేశ్మస్థలం బగుఁ
జాన జానగుననలు గోయఁగఁ జాగి జాగిపుడేఫలం బగుఁ
బొగడ పొగడఁగఁ దగిన దిఁక నీబోఁటిబోటికి దీనిసుమములు
తగవె తగవె మఱొండుపొదలకుఁ దాఱి దాఱి దొలంగుక్రమములు
పూని పూ నిలువెల్ల ననిచినపొన్నపొన్నలచెంత కరుగుట
మాని మానిని మేలె యిచటనే మట్టిమట్టియ లఱుగఁ దిరుగుట
తలరె తలరెడువిరులు దొరకినదాఁక దాకఫలంబు లేఱకె
యలసి యలసికతామయంబులయంద యందఱు నుంటి రూరకె
రమణి రమణీయంబుగాఁ గలరవము రవము చెలంగె మాటికి
ప్రమదప్రమదము మీఱఁ బైకొని బహులబహులలు ద్రుంప నేటికి
సారసారససౌరభము వెదచల్లఁ జల్లనికొలనిచెంతను
మీరి మీ రిపు డలవికెల్ల శమింప మింపను టేమివింతను
ఎన్న నెన్నఁడు నెఱుఁగ మిటు పరువేల వేలతరంపుఁబువ్వులు
కన్నె కన్నెఱసేసి కోపము గ్రమ్మ గ్రమ్మఱఁ జనెదుదవ్వులు
క్రింది క్రిందిగ రాదు యీకంకేలికేలికి విరులు పొందుగ
నందనందమె బడలు టోగజయాన యానగ మెక్కి, ముందుగ
మధుపమధుపవనాదులను బగమాన మానసమున నుతింతమె
మధురమధురసకుసుమములు పలుమాఱు మారున కిడి భజింతమె.

41


తే.

అనుచుఁ బసిగలననలెల్ల నపహరించి, మంచిసరములు గూర్చి ధరించి కొన్ని
యించువిల్కానిఁ బూజింప నెంచి యుంచి, చంచలేక్షణ లానందజలధిఁ దేలి.

42


సీ.

స్థలజలజవ్రజంబులఁ బదంబులకును నవగంధఫలులచే నాసలకును
బొన్నక్రొన్ననలచేఁ బొక్కిళ్ళకును శిరీషమ్ములచేఁ బాహుశాఖలకును

మొగలిఱేకులచేతఁ దగ నఖంబులకును గురువిందగుత్తులఁ గుచములకును
గుందజాలములఁ జెల్వందుదంతములకు నుడుపుష్పముల నధరోష్ఠములకుఁ


తే.

బూని వనలక్ష్మి యాముద్దుపువ్వుఁబోండ్ల, యవయవములకు నోడి యత్యంతభక్తిఁ
దవిలి సేవించె ననఁగ మద్యత్ప్రసూన, భూషణాలంకృతాంగులై పొల్చి రపుడు.

43


ఉ.

అంత వనంబు వెల్వడి సుధాంశుముఖుల్ జలకేలి సేయ న
త్యంతకుతూహలం బొదవి యందఱు నొక్కకొలంకు డాసి యా
చెంత విభూషణంబులును జేలలుఁ బ్రోగులు పెట్టి నిద్దపుం
గాంతులు మీఱుపావడలు గట్టి చలం బెదఁ బుట్టి దిట్టలై.

44


చ.

ప్రకటముఖభ్రమద్భ్రమరపంక్తులు నీలపుఱాలనేలనం
దుకములు మేఖల ల్మొరయఁ దోరపుమందగతుల్ చెలంగ దా
మకకుచకుంభముల్ పొదల మత్తిలి తమ్మికొలంకుఁ జొచ్చునే
నికగములో యనంగఁ దరుణీమణు లుల్లము లుల్లసిల్లఁగన్.

45


క.

గుబ్బలబంటిజలంబుల, గొబ్బునఁ జొరఁజాఱి యాచకోరేక్షణ లా
గుబ్బుగఁ గొలను గలంచుచు, నబ్బురపా టొదవ నోలలాడుచుఁ బేర్మిన్.

46


చ.

ఒకగజరాజగామిని మహోత్పలపత్రవిలీనబంభర
ప్రకరముఁ బాఱఁదోల నవి పైదలనిద్దపుమోముఁదమ్మి ను
త్సుకమునఁ జేరి నాసఁ గని సొంపగుసంపఁగిమొగ్గ యంచు నొం
డొకదరిఁ జేర డెందముల నుబ్బి కనుంగొని రంగనామణుల్.

47


చ.

కిసలయపాణి యోర్తు జలకేళి యొనర్పఁగఁ జన్నుదోయి సా
రసముకుళద్వయం బనుచు రాగముతో నొకచక్రవాకి వె
క్కసముగ ముక్కునం బొడిచి కామినిమోము సుధాంశుఁ డంచు సా
ధ్వసమునఁ బర్వువెట్టి తనవల్లభుఁ జేరెఁ జెలుల్ హసింపఁగన్.

48


చ.

లలన యొకర్తు దోయిట జలంబులు ముంచి యిదేమిబోటి యి
జ్జలము వసంతమై యలరుచంద మటన్న గయాళి యౌనె నీ
లలితకరాబ్జరాగ మిటులం బ్రసరించె నటంచుఁ బల్కి తాఁ
గిలకల నన్వె జవ్వనులు గేలి యొనర్చి రనేకభంగులన్.

49


క.

ప్రకటేందిందిరయుతమై, వికసించిన తెల్లదమ్మివిరిఁ గన్గొని యం
దొకయహిరోమావళి దాఁ, బెకలించె సలాంఛనేందుబింబం బనుచున్.

50


ఉ.

అంబుదవేణి యోర్తు కలహంసములన్ బెదరించె శీతరు
గ్బింబనిభాస్య యోర్తు వెతఁ బెట్టుచు వీడఁగఁ దోలెఁ జక్రవా
కంబుల నున్మ ద్విరదగామిని యోర్తు హరించెఁ బద్మసం
ఘంబులఁ జంపకప్రసవగంధి యొకర్తు మథించెఁ దేఁటులన్.

51

తే.

అతివ లందఱుఁ గమలోత్పలాదికములు, గోయుచుండిన నం దొకకోమలాంగి
మొనసి కెందామరలఁ గేల ముట్టదయ్యె, నుత్పలముల నిరీక్షింప నొల్ల దయ్యె.

52


చ.

పదువు రొకర్తెఁ బట్టుకొని పద్మపరాగము మీఁదఁ జల్లుచుం
బెదరక యోలయోల యని చేతులతాళము లూని కొట్టుచుం
గొదగొని గేలిసేయ నది గొబ్బున నీట మునింగి లోననే
కదిసి యొకర్తె పాదములు గట్టిగఁ బట్టుక యీఁదె మీఁదికిన్.

53


తే.

కోకిలాలాప యోర్తు చీకాకు సేయఁ, బల్లవాధర యొకరామ పజ్జ నీఁగె
మత్తగజయాన యోర్తు చెయ్యెత్తి మొత్త, మరలి రంభోరుహరిమధ్యమరువు చొచ్చె.

54


చ.

నలినదళాక్షి యోర్తు బిసనాళము చిమ్మనఁగ్రోవి చేసి యి
మ్ముల నొకకొమ్ముమీఁద దనపుక్కిటినీరముఁ జల్లి నీటిలో
పల మునిఁ గవ్వలన్ వెడలెఁ బైకొని దానికచం బటంచు శై
వలలత వట్టి లాగి మఱి వంచన నొందె వధూటి విన్న నై.

55


సీ.

కుచచక్రవాకముల్ కచచంచరీకముల్ ప్రపదకచ్ఛపములు బాహుబిసము
జాననపద్మంబు లంఘ్రిహల్లకములు కటిసైకతంబులు గళదరములు
దరహాసఫేనముల్ దంతకేసరములు చారురోమావళి శైవలములు
నాభికావర్తముల్ నయనోత్సలంబులు వరవళివీచికావ్రాతములును


తే.

దనర సరసులు నుతిసేయఁ దగువిలాస, సరసులము మేము మాకు నీసరసి యెట్లు
సాటి యగు నందు నిరసించుచందమునను, గరటియానలు కొల నెల్లఁ గలచి రపుడు.

56


తే.

ఇట్లు జలకేలి యొనరించి యిందుముఖులు, సరసి వెల్వడి మెల్లనే దరికిఁ చేరి
కుండినేంద్రుతనూభవకుంతలముల, నొడలఁ దడియార్చి పెద్దక్రొమ్ముడి ఘటించి.

57


చ.

జిలుఁగుమణుంగుదువ్వలువ చెల్వుగఁ గట్టి పసిండిమేలుసొ
మ్ములు వెసఁ బెట్టి క్రొమ్ముడినిఁ బువ్వులదండలు చుట్టి గుబ్బలన్
గలప మలంది నెన్నుదుటఁ గస్తురినామము దిద్ది ముద్దుగు
మ్మలు సొబ గేర్పరించి సుషమంబుగఁ దారు నలంకృతాంగు లై.

58


క.

భోజతనూజం దోడ్కొని, రాజసమున వనికి నరిగి రాజీవాస్త్రుం
బూజింపఁ బూని యొకచో, రాజితసహకారభూజరాజులనడుమన్.

59


సీ.

బలుకప్పురపుటనంటుల నంటఁ బ్రాఁకినపరువంపుద్రాక్షపందిరులదరుల
మేటిగొజ్జెఁగనీటియేటిజాలునఁ జాలఁ బ్రబలినచెంగల్వబావిక్రేవ
నుడివోనితావు లీనెడుమరందపువాన జానైనసంపెఁగమ్రానిక్రిందఁ
బొదలెడుగురువిందపూఁబొదరింటిలో సొగసుఁజందురురాలజగతిమీఁద


తే.

దళుకుగేదంగిఱేకులదళ్ళు గట్టి, కలువకెందమ్మివిరులమేల్క ట్లమర్చి
కమ్మపూఁదేనె చిల్కి సాంకవము పూసి, లీలఁ బుప్పొడి రంగవల్లికలు దీర్చి.

60

తే.

కెందలిరుసెజ్జ రచియించి యందు నొక్క, మేలిలవలీదళంబుపై మృగమదమున
సుమశరుని వ్రాసి వామభాగమున రతిని, నిలిపి క్రేవలఁ దద్బలంబుల లిఖించి.

61


సీ.

అలరుగొజ్జెఁగనీట నభిషేక మొనరించి చంపకజాలకాక్షతలు నించి
గ్రొన్ననసరముల జన్నిదంబులు వైచి మొగిలిఱేకులచేలములు ఘటించి
గమగమవలచుసాంకవగంధ మర్పించి కుసుమభూషణము లిం పెసఁగ నొసఁగి
కర్పూరధూపంబు నేర్పున నలరించి పద్మరాగంపుదీపములు వెట్టి


తే.

హారిమధురసఫలవిసరాదికోప, హార మిడి వీడె మర్పించి హల్లకంబు
లేర్చి నీరాజన మొనర్చి నేర్చినట్లు, పుష్పబాణాసనునిఁ గూర్చి పూజసేసి.

62


ఉ.

దండము నీకు భూరిభుజదండవిమండనమండితేక్షుకో
దండవిముక్తచండతరదారుణసూనశరాహృతామితా
జాండకరండమండలనిరంతరజంతువితానమానసా
ఖండలధీరతాగుణజగన్నుతకీరశకుంతవాహనా.

63


ఉ.

అంబురుహాంబకాయ చలితామితమౌనికదంబకాయ హే
మాంబరనందనాయ జగదర్పితసంతతవందతాయ నీ
లాంబుధరోపమానసముదగ్రతనుద్యుతిహారిణే నమ
శ్శంబరవైరిణే యనుచు జాఁగిలి మ్రొక్కి నుతించి రందఱున్.

64


సీ.

మిన్నంది యేప్రొద్దు మెలఁగుచుండెడితేరు తియ్యనై రస ముప్పతిల్లు విల్లు
పువ్వుఁదేనియ లాని క్రొవ్వి మ్రోయుగుణంబు సొగసుఁదావులనీటు చూపు తూపు
ఫలవితానము మెక్కి పలుకుచొక్కపుజక్కి యున్నతాగమకూఢి నుండు దండు
వట్టిమ్రాఁకులు చివుర్వెట్టఁజేయుసఖుండు భువనాంతరక్రీడఁ బొడము సిడము


తే.

నలరు జగదభిరామవిహారి వగుచు, మగల మగువల వలపించి మదిఁ గలంచి
కూర్పఁ గలనేర్పు నీకె చేకూరె నౌర, మహితశృంగారసార రమాకుమార.

65


క.

యేరీ నీసరి సరసవి,హారీ శూర్పకమదప్రహారీ హారీ
శారీ శుకపికగణసం, చారీ భువనోపకారి శంబరవైరీ.

66


క.

పంకరుహాసన వాసవ, శంకరులును నీయమోఘసాయకములకున్
శంకాతంకము నొందుదు, రింకెంతని నీప్రతాప మెంతుము మదనా.

67


క.

తోరముగ నిను భజింపఁగ, నేరము నీరేజబాణ నీ విఁకఁ గరుణా
సారముచే నేలు నమ, స్కారము లివె షోడశోపచారంబులకున్.

68


చ.

పలుమఱు దెల్ప నేటికి నృపాలతనూభవ కంసవైరితోఁ
జెలిమి యొనర్చినప్పుడె పసిండిగృహంబున ధూపదీపస
త్ఫలరసగంధపుష్పముల భాసిలుకప్పురపున్ విడెంబులం
జెలఁగుచు మన్మథోత్సవము సేయుఁ జుమీ సరసీరుహాంబకా.

69

తే.

శంబరేక్షణ యని విరోధంబు వలదు, విమలకమలాక్షి యీమహీరమణతనయ
పంచముఖమధ్య యనుచుఁ గ్రోధించవలదు, సమదహరిమధ్య యీబాలజలచరాంక.

70


తే.

అనుచు నతనుని నుతిగొని యతనిసతిని, రతినిఁ బ్రతిదినసౌభాగ్యవతినిఁ బొగడి
తద్బలంబులఁ బ్రార్థించి తలిరుఁబోఁడు, లింపు దళుకొత్త నృపపుత్రి కిట్టు లనిరి.

71


క.

అలివేణీ వలఱేనిం, గొలిచి కడువశునిఁ జేసికొంటిమి మదకో
కిలకీరశారికాదులు, చలమున నిఁకఁ గీ డొనర్పఁజాలవు సుమ్మీ.

72


చ.

అదనునఁ దోఁటలోఁ గలలతాంతములెల్ల హరించి భక్తితో
మదనునిఁ బూజచేసి పలుమాఱుఁ బ్రసన్నతఁ గాంచినార మే
కొదవయు లే దికన్ మదిని గుందక నందకపాణిఁ జెందెదో
మదకలహంసయాన పదమా ముద మాని నివేశసీమకున్.

73


చ.

అని మనుజాధినాథతనయన్ వినయంబుగఁ బల్కి వేగదో
డ్కొని ననితల్ నిశాంతమునకుం జని కంజనిభాస్య కింపునం
దనరుమృదూక్తులన్ శ్రుతిహితం బొనరించుచుఁ జిత్రలీలలన్
మునుకొని చిత్తనృత్తికిఁ బ్రమోదము సేయుచు నుండి రంతటన్.

74


క.

వరుణవధూటీకుచతట, పరిశోభిత మైనకెంపుఁబతకము దీప్తుల్
నెరి నుర్విఁ బర్వె ననఁగాఁ, బరఁగెం జరఠారుణాతపంబులు పేర్మిన్.

75


చ.

అనుపమవైఖరిం గువలయప్రియుఁడై తగురాజుఁ బట్టబ
ద్ధుని నొనరించువేళకును దోయధినీరముఁ దేఁ దలంచి సొం
పున నపరాశయన్ సుదతి ముంచినమేల్మిపసిండిబిందె నా
దినమణిబింబ మస్తగిరిదిగ్వనరాశిని గ్రుంకె నత్తఱిన్.

76


తే.

పాంథతతిమీఁద నలరాజు బలసి దండు, వెడలుచును మున్నె యెత్తింప విజయధాటి
నమరుకెంబట్టుటెక్కెంబుగమి యనంగ, డంబుమీఱుచు సాంధ్యరాగంబు మెఱసె.

77


తే.

అరయఁ దమిఁజేరి రాజకాంతాళిఁ గరఁచు, శ్వేతరుగ్భావితునిరాక చిత్తవీథి
నిలిపి పద్మిని ముకుళించె నెమ్మొగంబు, వెతలఁ గుందుచుఁ జక్రముల్ వీడఁదొణఁగె.

78


ఉ.

తృష్ణ జెలంగ జక్కవలధీరత మింటఁ దలంకుచుండె న
త్యుష్ణమరీచి యంచు నిను నొల్లక వాసరలక్ష్మిశైత్యవ
ర్ధిష్ణునిరాకఁ గోరి తమఱేనిఁ బయోనిధిఁ ద్రోచె నంచు న
వ్విష్ణుపదంబు పట్టుకొని వేమఱునున్ మొఱవెట్టుకైవడిన్.

79


చ.

విరహుల గెల్వఁ బూని సరవిం బికషట్పదకోటి నంతరాం
తరములఁ గాపువెట్టి వితతంబుగ మారుఁడు విశ్వరూప మ
చ్చెరువుగఁ దాల్చెనో యనఁగఁ జీఁకటి లోకములెల్ల నిండెఁ ద
త్కరపరిముక్తకుందవిశిఖంబు లనన్ దివిఁ బర్వెఁ దారకల్.

80

సీ.

మారుండు విరహిణీసారసాక్షుల నేయఁబూనినకెందమ్మిపు వ్వనంగ
యామినీగజరాజగామినిమోమునం బొదలుకుంకుమచుక్కబొ ట్టనంగ
హరిదరుణాధరమరునకు నారతిఁ బట్టినహేమంపుఁబాత్ర యనఁగ
వాసవురాణి విలాసార్థముగఁ గేలఁ దాల్చినశోణరత్నం బనంగ


తే.

సమయకింకరుఁ డుదయాద్రిజగతిపతికి, సరవిఁ బట్టినపగడంపుటరిగ యనఁగ
నఖిలజనులకు లోను నాహ్లాద మగుచు, నిందుబింబంబు ప్రాగ్దిశయందుఁ బొడమె.

1


తే.

అతులశోభావిభాసితం బేగుచు గగన, మహిఁ జిగిర్చినగుజ్జులేమావి యనఁగ
నుడుపబింబంబు వెలుఁగొంద నడుమ నప్పు, డలరె నంకంబు గండుఁగోయిల యనంగ.

2


తే.

సరసమై వసుగంధనిస్తంద్ర మగుచు, నురుతరంబుగ ఘనమార్గయుక్త మగుచుఁ
దోరమై సకలామయహారి యగుచు, నొనరె నెంతయుఁ బూర్ణచంద్రోదయంబు.

83


క.

అంబరతలమున శశభ్ళ, ద్బింబము విలసిల్లె ధవళదీప్తుల నంతం
డంబయి సలాంఛనం బగు, శంబరతారణుని విజయశంఖం బనఁగన్.

84


సీ.

గగనగేహంబు ముక్తాచూర్ణమున నభశ్చరభామినుల్ వెల్లచఱచి రనఁగ
సమయనర్తకుఁ డింద్రజాలంబు చూపుచు వెలిపుట్టముల తెర వేసె ననఁగ
రజనీవధూటి నీరజవైరిఁ గూడి యానందించి పకపక నవ్వె ననఁగ
విబుధు లర్చన సేయువిష్ణుపదంబునఁ దనరుసితాబ్జబృందం బనంగ


తే.

విరహిణుల రేఁచి పాంథుల వెతలఁ ద్రోచి, కోకముల నేఁచి తిమిరంబు గుహల డాఁచి
కమలములఁ గ్రాఁచి మదచకోరముల బ్రోచి, యలరె జగముల సాంద్రచంద్రాతపంబు.

85


చ.

శమనునిదుంతఁ బట్టుకొనె శక్రుఁడు దా వెలియేనుఁ గంచు వే
గమునఁ బురారి వంది యని గాడుపునెచ్చెలి మేఁకపోతుపైఁ
దమకము మీఱ నెక్కె నలధాతకుమారుని నెమ్మిఁ గాంచి హం
సముగఁ దలంచె సాంద్రతరచంద్రిక లోకములెల్లఁ గప్పుటన్.

86


చ.

తమము నితాంతశైవలము తారలు సారసితారవిందముల్
కమలవిరోధిహంసము కలంకము పంకము చంద్రికాకదం
బము నురువున్ హిమంబు శతపత్రమరందముపై నభఃస్థలం
బమరెఁ గొలంకుచందమున నయ్యెడ సత్కవివర్ణనీయమై.

87


క.

అన్ని బిడపువెన్నెలఁ దమ, కన్నులఁ జె న్నమరఁ జూచి కన్నెలు నెలరా
గిన్నెల నాసవ మిడి పలు, చిన్నెలఁ బానంబు సేయఁ జెలఁగిరి వేడ్కన్.

88


క.

మదిరాక్షులార రారే, మదిరాపానంబు చేసి మఱి యందఱమున్
మది రాగిలి క్రీడింపుద, మదిరా యప్రాప్యవస్తు వబ్బెం జెలువై.

89


క.

వాసవముఖసురనికరము, లాసన మొక్కించుకంత యానినమఱి తా
రాసవనాశంబులపై, నాస వహింపుదురె యెఱుఁగ రై రిది యంచున్.

90

ఉ.

కుందనపుంగలంతికలుఁ గోరలు నుంచి యొకర్తొకర్తకున్
విందులు సేయుచున్ సొలసి వీనులు మూయుచు గ్రుడ్లు ద్రిప్పుచున్
గందము లిచ్చగించుచును కందువపల్కులఁ గేరి నవ్వుచుం
జందనగంధు లయ్యెడను సాత్వికభావములన్ మెలంగుచున్.

91


చ.

గరిత యొకర్తు హేమచషకంబునఁ జందురునీడ చూచి హా
వెఱవక గిన్నెలో నిఱికి వీఁడు హరింపఁగఁ జాగె సీధువీ
నెఱవగుదొంగఁ బట్టుకొని నేఁడు మొదల్ పదియాఱువ్రక్కలై
ధరఁ గృశియింపఁజేతు నని దబ్బురలోన మథించెఁ జేతులన్.

92


క.

వలిదెమ్మెర మెల్లనె యొక, చెలిపయ్యెదకొంగు దొలఁగఁజేసిన నది రం
జిలి బయలు గౌఁగిలించెం, జెలఁగి తనహృదీశుఁ డిట్లు చేసె నటంచున్.

93


చ.

కలికి యొకర్తు చంద్రికలు గాయ శశాంకునిఁ జూచి యోయి వె
న్నెలదొర బావ నన్నుఁ గని నీ విపు డేటికి నవ్వె దూరకే
నిలునిలు నేను ని న్నగఁగ నేరనె క్రమ్మఱ నంచుఁ బల్కి తా
నెలమిని మోరయెత్తి యిహిహీ యని నవ్వె మదంబు పెంపునన్.

94


క.

చెలి యొకతె తనదుమదిరా, కలశంబులు గొనఁగ నీకుఁ గారణ మేమే
తులువ యని యొకతె గురుకుచ, కలశంబులు వట్టి లాగె గ్రద్దఱి యగుచున్.

95


సీ.

సఖులార కుమ్మరసారెతీరున భూమి తిరిగె నంచును గేలు ద్రిప్పె నొకతె
చుక్కలన్నియుఁ జేరి సుర యెత్తుగొనిపోయె నంచు నూరక పల్వరించె నొకతె
వలరాచబావ మే న్గిలిగింత గొలుపక తలతల యని పూని పలికె నొకతె
రాజ నాతో సాటి రాదు రంభ యటంచు వేడుకతోఁ బాత్రలాడె నొకతె


తే.

పెక్కుదెఱఁగుల నిటువలెఁ జొక్కుచుండి, రవుడు నృపపుత్రి విరహార్తి నలసి సొలసి
నింగి నంటి వెలింగెడునీరజారిఁ, గాంచి తమకంబు మించి నిందించఁదొణఁగె.

96


చ.

అకట నిశాటపాంథనివహంబుల నేఁచుఖలుండ వౌట నిన్
సకలనిశాచరారి యగుశౌరి యెఱింగియుఁ బూని కాచె నీ
వకలుష మైనయవ్విధుసమాఖ్య ధరించుటఁ జేసి త్రుంపఁజా
లక తనపేరివాఁ డని తలంచియొ లోకులదుష్కృతంబునన్.

97


తే.

కువలయాహ్లాదకరుఁడవై కొమరుమీఱు, రాజ వని నిన్ను ద్విజనికరంబు లెపుడు
ప్రణుతిసేయంగ నహహా యిబ్భంగి నీకు, వలదు చక్రాహితత్వంబు వనజవైరి.

98


క.

సిరితోఁ బుట్టినమాత్రనె, సరసగుణం బేలఁ గల్గు చంద్రా నీ కా
సిరితోఁ బుట్టియ కాదే, సరసుల నేచుచు నలక్ష్మి జగతిం దిరుగున్.

99


ఉ.

రాజ నటంచుఁ జక్రముల రాపులఁ బెట్టుచునుండి రేలు ని
ర్వ్యాజుఁడ నంచు విష్ణుపద మంటినఁ బోవునె దుష్కృతంబు నీ

రేజవిపక్ష నిన్ జిలువఱేఁడు వడిం గబళించుగాఁక నీ
యోజఁ జరింతు వంచుఁ గద యొల్లదు పద్మిని నిన్నుఁ గన్గొనన్.

100


తే.

తుహినకరశూలి నిను గురుద్రోహి వగుటఁ, దనమది నెఱింగియును లింగధారి ననుచు
నెత్తి కెక్కించుకొనుటకు నీకు నల్లుఁ, డని యతనివైరి మరుఁ గూడ నర్హ మగునె.

101


క.

హరికిన్ ముద్దుమరందివి, సిరికిం దమ్ముఁడవు విశాలశీతాంశుఁడవున్
హరునకుఁ దలపువుబంతివి, తరుణుల నలయింప నింకఁ దగదు శశాంకా.

102


క.

తామసిని గూడి యకటా, వేమఱుఁ బద్మినుల జాల వెతఁ బెట్టెదు నీ
వేమిటిరాజవు చెపుమా, శ్యామలపక్షం బొకింత సైపవు చంద్రా.

103


సీ.

జడభావమున రేలు కడువడిఁ దిరుగుచు నొకతఱి నంబరం బొల్లకుండి
చెలఁగి యెప్పుడును రిక్కలతోనె లోకమై శుచిరుచుల్ సగ మెక్కుచో నెఱుఁగక
తమ్ముల కెంతయుఁ దలవంపులుగఁ జేసి కువలయం బెలమిఁ గన్గొని హసింపఁ
గొంకక గురునకుఁ గీ డొనర్చుచు మది మలినలక్షణమున వెలయుచుండి


తే.

వరుసతోఁ బున్నమకు నమవసకు నెల్ల, జగము లెఱుఁగంగ నెక్కుచు దిగుచునుండు
కళ కలుగ నీకు మఱి వివేకంబు గలదె, విరహలోకాపకారి పంకరుహవైరి.

104


మ.

మకరాంకుండు విజృంభమాణుఁ డగుఁ బ్రేమం గృష్ణపక్షంబునం
దకటా యెప్పుడుఁ గృష్ణపక్షమున నీ వార్తిం గృశం బౌదు వే
మొకమాటన్ మఱి మీకుఁ జెల్మి యలరెన్ ముఖ్యానుకూలంబుగా
సకలంబున్ వివరించి చూడుము శశీ సర్వజ్ఞచూడామణీ.

105


శా.

నీవు న్నేమును గ్రీడ సేయుదుము పూన్కిం జాళువామేడపై
భావింప న్మును పిన్ననాఁడు గనకాభాతిన్ హితం బయ్యె మా
త్రోవన్ రాకుము వద్దు వ ద్దిఁకను నీతోఁ జెల్మి పల్మాఱునుం
గావింపం గొఱగాదు నీ కొకనమస్కారంబు తారాప్రియా.

106


క.

అని వనితామణి యిటు ల, వ్వనజారిం దూరి చేరి వైరము మీఱన్
ననతూపు లేయుమరునిం, గినుక మదిం బొడమి యదలకించుచుఁ బల్కెన్.

107


క.

మరుఁడా విచలితసకలా, మరుఁడా గరుడాసనునికొమరుఁడా సుమతో
మరుఁడా విరహులపై వే, మరు డాయఁగ రాకు క్రూరమతి పామరుఁడా.

108


క.

నేర మొకింతయు నెన్నక, కేరుచు వేమాఱు నూరకే తెరువరులన్
భీరువుల నేఁచు టిది యొక, శూరత్వము గాదు సుమ్ము సుమకోదండా.

109


సీ.

పంకసంకరమునఁ బాటిల్లుటెక్కెంబు విషసముద్భవములై వెలయుతూపు
లరయ నెప్పుడుఁ బండ్లు గొఱికెడుగుఱ్ఱంబు కుజనుల నలరింపఁ గోరుసఖుఁడు
ఘనుల దవ్వుగ విడఁగాఁ దోలుసచివుండు మధుపానమదమున మలయుగుణము
ముక్కలై వెండియు మొలచుకన్నులవిల్లు మదిఁ జైత్రలీలలు వెదకుబలము

తే.

గలిగి యతనుఁడవై జగంబులకు నెందు, గానఁగారాక మెలఁగుతస్కరుఁడ వీవు
విరహిణుల నేఁచు టిది యెంతవింత తులఁప, నఖిలలోకైకసంచార హరికుమార.

110


క.

పృథివిఁ బరాశరకులని, ర్మథనునితనయుఁడవు నీవు మఱి గుణి వగుదే
వృథయగునె యథాబీజం, తథాంకుర మటన్నమాట తాపసవైరీ.

111


తే.

తండ్రిపగ మాన్చు టుచితంబు ధరణియందుఁ, దనయులకు నెల్ల నది యబద్ధంబు చేసి
మధువిరోధికి సుతుఁడవై మదన నీవు, మధుసఖుఁడ వౌట యేలాటిమతము చెపుమ.

112


క.

మదమునఁ బొదలుచు నింతయు, నొదుఁగక బ్రహ్మాపరాధ మొనరించిననీ
కదనున సుదతుల నేఁచుట, మది నరయఁగ నింక నెంతమాత్రము మదనా.

113


శా.

లోనం జుట్టమపోలె వర్తిలుచు నిన్ లోకాపకారానుసం
ధానున్ భస్మము చేసినట్టి ప్రమథాధ్యక్షేక్షణోద్యద్భృహ
ద్భానుస్నేహవిహారి యౌ టెఱిఁగియున్ బాటింప కీ వెప్పుడున్
మానం జాలవదేమి గంధవహుదుర్మంత్రాంగ మబ్జాంబకా.

114


తే.

విను మనోజాతసడ్డకుఁ డనుచుఁ దనకుఁ, గన్నుగాఁ జూచి తల నిడుకొన్నహరునిఁ
గూడి నిను బొడిచేసినకుముదమిత్రుఁ, డరయ నీ కెట్టుగాఁ జుట్టమయ్యెఁ జెపుమ.

115


ఆ.

మేనమామ యనుచు మానుము సఖ్యంబు, వరుసగాదు శ్వేతకరునితోడ
నలినబాణసర్వనాశాయమాతుల, యనెడుమాట వినవె జనులవలన.

116


తే.

అనుచుఁ దనుఁ జాల వెతఁ బెట్టునసమశరుని, నింద గావించి మఱియు నయ్యిందునదన
మందగతిఁ జేరి మే నెల్లఁ గందజేయు, గంధవహుఁ గూర్చి పల్కె నాగ్రహముతోడ.

117


చ.

జ్వలనునిచెల్మి చేసి కలుషంబునఁ జిల్వలనిఱేకోఱలం
గలవిసమెల్ల రాసికొని గబ్బితనంబున మిన్ను ముట్టి నీ
విలఁ బలుమాఱుఁ ద్రిమ్మరుట యెల్లను బాంథకదంబకంబులన్
గలఁచఁగఁ బూని కాక యిఁకఁ గారణ మెయ్యది సోఁకుదయ్యమా.

118


చ.

అజపదలీల గాంచి సకలాగమపద్ధతులన్ మెలంగుచుం
గుజనులపండ్లు డుల్చి యధికుం డగుచక్రికిఁ దృప్తి సేయుచుం
బ్రజలకు నెల్లఁ బ్రాణమయి భాసిలుచుండెడి నీకుఁ బాంథులన్
వృజినమతిం గలంచుట వివేకము గాదుగదా సమీరణా.

119


ఆ.

పవనశశియు నీవుఁ గవగూడి రాజన, మొప్ప మిన్ను ముట్టి యూరకున్న
తెరువరుల నలంచెదరు చక్రధరుఁడు మీ, పని యొకింత గొంచెపఱుపకున్నె.

120


చ.

అని వచియించి యామధుకరాలక జాలక మేను మీనకే
తనుఘనవేదనం బొగులఁ దాళఁగఁజాలక లేచి పాన్పుపై
నునిచినక్రొన్ననల్ గని యయో దయ యింతయులేక మీ కిటుల్
వనజదలాక్షులార నవవహ్నికణంబులు నింపఁ జెల్లునే.

121

క.

మార్తాండుఁడు పండ్రెండున్, మూర్తుల నేకీభవించి మునుకొని మింటన్
వర్తించుచున్నవాఁ డీయార్తికి నోర్వంగఁ గలరె యజరుద్రాదుల్.

122


ఉ.

అద్దిర గంధవాహుఁడు దవానలకీలలు గ్రుమ్మరించుచుం
దద్దయు వీవఁగాఁ దొడఁగె దైవసహాయ మొకింత గల్గి వే
సుద్దు లిఁకేల నవ్వులుగఁ జూడక వేడుక నాదరించి యో
ముద్దియలార మీ కిపుడు మ్రొక్కెద నివ్వడగాడ్పు మాన్పరే.

123


తే.

పరభృతంబుల కారామగరిమ చూపి, శుకములకు సాంకసము వేసఱక యొసంగి
భ్రమరవితతికిఁ గనకవర్షంబు నించి, యడుగుకొనరమ్మ రొద మానునట్లు గాను.

124


క.

మధుకరములరొదలకు మ, న్మథుకరములవలను వెడలుమార్గణములకున్
మధుపరభృతమలయానిల, విధుకరముల కోర్వఁగలఁడె విధియైనఁ జెలీ.

125


ఆ.

అనుచుఁ గళవళించునంగనఁ గనుఁగొని, యనుఁగుజెలులు విస్మయంబు నొంది
కమలవదన కిపుడు ఘనమయ్యె విరహార్తి, శిశిరవిధులు వేగ జేయుఁ డనుచు.

126


ఉ.

క్రొన్నన పాన్పుపై నునిచి గొజ్జెఁగనీ ర్మెయిఁ జిల్కి సిబ్బెపుం
జన్నుల చందనం బలఁది చారుమృణాళలతావితానముల్
చెన్నుగ బాహుమూలములఁ జేరిచి కప్పురపున్ రజంబు వా
ల్గన్నుల నూఁది పూవిసనకఱ్ఱల వీచి యనేకభంగులన్.

127


తే.

శిశిరకృత్యంబు లొనరింపఁ జెలియమేన, నింకెఁ బన్నీరు చూత్కార మెసఁగఁ జంద
నంబు వెస బూదియై రాలె ననలుఁ దలిరు, టాకు లెల్లను బొడిపొడియయ్యె నపుడు.

128


ఉ.

అబ్బురపాటు నొంది చెలులందఱుఁ గ్రమ్మఱ శైత్యకృత్యముల్
గొబ్బున నాచరించి మదకోకిలవాణిమెయిం దిటంబుగాఁ
బ్రబ్బినతాప మార్చి మృదుభాషల మెల్లనె యుల్ల మెల్ల పె
ల్లుబ్బఁగఁ జేయుచుం దవిలి యొద్ద మెలంగుచు నుండి రెంతయున్.

129


క.

నరనాథతనూభవ యీ, సరణిం దరుణులును దాను జాగరదశచేఁ
బొరలుచు నుండెడితఱిఁ బు, ష్కరతలమున వేఁగుజుక్క సరవిం దోఁచెన్.

130


తే.

మరుఁడు పగఁ బూని ధారుణివరతనూజ, నేఁచుచున్నాఁడు వేగ రావే యటంచుఁ
దమకముగ నుగ్రమూర్తియౌ దైవమునకు, మొఱయిడినరీతిఁ గృకవాకు లఱవఁదొడఁగె.

131


క.

కులటలు దాఱ ఖగంబులు, కలకలనాదములఁ గేరఁ గలువలఱేఁ డ
వ్వలిదిశకు జాఱ లోకులు, తెలివిం దనరారఁ దూర్పు దెలతెలవాఱెన్.

132


చ.

తిమిర మణంగె జక్కవలు ధీరతఁ బొంగె విటీవిటాళికిం
దమకము చెంగెఁ జుక్కలు యథాయథ లౌచుఁ దొలంగె ఖిన్నతన్
గుముదతతుల్ ముణింగె మదనుండు శ్రమంబున లొంగెఁ బద్మినీ
సమితి చెలంగెఁ దుమ్మెదలు సంతస మూని మెలంగె నయ్యెడల్.

133

చ.

వెలుఁగులఱేఁడు తమ్మిచెలివేడుకకాఁడు తమంబుసూడు చు
క్కలదొరజోడు నిచ్చలును గల్వలరాయిడికాఁడు కోరి మ్రొ
క్కులు గొనువాఁడు జక్కవలఁ గూరుచు నేరుపుకాఁడు భానుఁ డు
జ్జ్వలతరదీప్తుల న్మెఱసె వావిరిఁ దూరుపుఁగొండమీఁదటన్.

134


తే.

చక్రములు వేడ్క నుప్పొంగ సరసు లలర, నఖిలదిశలఁ దమోగుణం బణఁగఁజేసి
కాశ్యపి భజింపఁ బ్రభ మీఱి ఘనపదవినిఁ, జెంది యంతంతకును బ్రకాశించె నినుఁడు.

135


తే.

అపుడు నృపశేఖరుఁడు సమయార్హవిధులు, దీర్చి సచివాప్తబంధుసుధీపురోహి
తాదులను గూడి విమలశుద్ధాంతమున శు, భోత్సవాసక్తుఁడై వేడ్క నొప్పుచుండె.

136


క.

భేరీకాహళనిస్సా, ణారావము లొకట నింగి యదరఁగ మొరసెం
బౌరులు సాలంకృతు లై, భూరితరామోదములను బొంగఁగ నంతన్.

137


చ.

ఘనసమరావనీవిజయకారణవారణఘోటకావలుల్
మునుకొని రాఁగ దుందుభులు ముందర మ్రోయఁ జమూసమూహముల్
వనధితరంగమాలికలవైఖరితో నరుదేరఁ జిత్రకే
తనములు చామరంబులును దద్దయుఁ జెంగటఁ బూని పట్టఁగన్.

138


తే.

కదిసి యిరుగడ వందిమాగధులు పొగడ, పృథులకాహళశంఖముల్ పెల్లు మొరయ
రుచిరకాంచనమయనథారూఢు లగుచుఁ, గేరి ధరఁ గలరాజకుమారులెల్ల.

139


క.

అరుదులుగా మఱిమఱి తమ, బిరుదులు మెఱయించుకొనుచుఁ బృథివి చలింపన్
గురుతరవైభవములతో, వరుసను దన్నగరమునకు వచ్చిరి కడిమిన్.

140


మ.

గజయూధంబులు భర్మనిర్మితశతాంగంబుల్ తురంగంబులున్
వ్యజనంబుల్ మణిచామరంబులు నవీనాందోళికాడోలికా
ధ్వజముక్తారచితాతపత్రములు నుద్యల్లీలఁ దన్ గ్రమ్మఁగా
ధ్వజినీనాథులఁ గూడి చేదిపతి ఠేవన్ వచ్చె నవ్వీటికిన్.

141


చ.

సకలవిధంబులన్ గణఁగి చైద్యున కేము విదర్భరాజక
న్యక నొనఁగూర్గు మంచుఁ జతురంగబలంబులతోడఁ గూడి భీ
ష్మకనరపాలుపోలికి నెసం బఱతెంచిరి యుత్సహించి పౌం
డ్రకుఁడును దంతవక్త్రుఁడు జరాసుతసాల్వవిదూరకాదులున్.

142


తే.

ఇవ్విధంబునఁ దేజంబు నివ్వటిల్ల, నరుగుదించినమేదినీవరులనెల్ల
నెదురుకొని పూజ లొనరించి హృదయశుద్ధి, తోడఁ దనరాజధానికిఁ దోడి తెచ్చె.

143


క.

ఆజనపతులకుఁ గనకపు, భాజనముల షడ్రసానుపానంబులుగా
భోజనము లిడి గజాశ్వస, మాజనవాభరణవసనమణు లొసఁగి వెసన్.

144


తే.

భాసురావాసములు విడిపట్టు లొసఁగి, భూసురాశీర్వచనరూఢిఁ బొదలి మంద

హాసవికసితవదనాబ్జభాసమానుఁ, డగుచు నుప్పొంగెఁ గుండిననగరవిభుఁడు.

145


తే.

అనుచు సూతుఁడు శౌనకుఁడాదియైన, మునుల కెఱిఁగించె నంచు వ్యాసునిసుతుండు
విజయపౌత్రున కెఱిఁగింప విని నరేంద్రుఁ, డవలికథయెల్ల వినఁగోరి యడుగుటయును.

146


శా.

గౌరీచిత్తసరోజభృంగభువనఖ్యాతాహృతానంగక
ర్పూరాబ్జారినిభాంగభాసురకరాంభోజాతసారంగకే
యూరీభూతభుజంగదీనసముదాయోద్యత్కృపాపాంగవి
స్ఫారాంభోధినిషంగమంగళజటాభారాభ్రగంగాపగా.

147


క.

దర్వీకరహారసుప, ర్వోర్వీధరశర్వయుక్షాధిపగం
ధర్వాసర్వగదుర్వహ, గర్వారివిరామ పీఠికాపురధామా.

148


మణిగణనికరము.

సురవరహరినుతసురుచిరచరణా, పురహరశివకరబుధజనశరణా
గరగళశశిధరకరతలహరిణా, చిరతరయశసరసిజశరహరణా.

149


మాలిని.

కరతలధృతశూలా ఖండితారాతిజాలా, పరిచితగిరిబాలా భాసురానందలీలా
నిరుపమగుణకీలా నిత్యవిజ్ఞానమూలా, గురుజననుతలోలా కుంభిచర్మోరుచేలా.

150


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
వ్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మన
నామధేయప్రణితం బైన రుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందుఁ
దృతీయాశ్వాసము.