రుక్మిణీపరిణయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము



మత్పీఠపురానిశ
ధామజగత్ప్రణుతనామదనుజవిరామా
భూమిధరోత్తమకన్యా
కోమలవదనాబ్జభృంగ కుక్కుటలింగా.

1


తే.

అవధరింపుము సూతుఁ డి ట్లఖిలమౌని, వరుల కెఱిఁగించినట్టు లావ్యాసపుత్రుఁ
డవలికథయెల్ల భరతకులాధిపునకుఁ, దెలుపఁగఁ దొడంగి యిట్లని పలికె నపుడు.

2


తే.

అవనివర మున్నె తొలునాఁడు హరిని బిలువ, నవనిపతిపుత్రి యనిచిన యగ్రజన్మ
వర్యుఁ డత్యంతహృదయతాత్పర్య మూని, యాశుగతి ద్వారకాపురి కరుగుచుండి.

3


మ.

చని యవ్విప్రవరుండు గాంచె నెదురం జంబీరమందారచం
దనమాకందకదంబనింబవకుళద్రాక్షాలతాధారమున్
ఘనకంఠీరవఫేరవేభహరిణీగంధర్వసంచారమున్
మునిసందోహవిహారమున్ మధుఝరీపూరంబుఁ గాంతారమున్.

4


సీ.

శుకభరద్వాజకౌశికవరద్విజసభాభవనమై నైమిశాటవివిధమునఁ
చక్రరంభాపారిజాతకైరావతఖ్యాతమై నాకలోకంబుకరణి
భైరవపంచాస్యభద్రేభముఖశివాసేవ్యమై కైలాసశిఖరిపగిది
నబ్దచక్రఖగేంద్రహరిలసత్కమలాకరంబై వికుంఠపురంబుమాడ్కి


తే.

నలరుహిమజలమధుఝరీతలసితాభ్ర, పులిననలినాస్త్రకలనాప్రభూతఘర్మ
సలిలసంసిక్తభిల్లయోషాప్రియాధి, కానుమోదకమారుతం బవ్వనంబు.

5


తే.

పద్మినులఁ గూడి సంభోగపరవశమునఁ దనరుపున్నాగనికరసత్తమములందు
భోగినులఁ గూడి హృదయానురాగమున భు, జంగపతిజాల మచట నుప్పొంగుచుండు.

6


సీ.

కరులు మేఘములు శీకరకదంబము వాన కీచకధ్వనులు భేకీరవములు
చెంచుముద్దియలమేసిరులు మెఱుంగులు మణిఘృణుల్ హరిధనుర్మంజురుచులు
చమరికావాలసంచలనముల్ పవనముల్ మృదులసాంకవమృగీమదము బురద
కపురంబు నురువు సింగపుబొబ్బ లుఱుములు హిమజలపూర మిం పెసఁగువఱద

తే.

హరినఖరదారితోన్మదద్విరదకుంభ, గళితముక్తావళుల్ వడగండ్లగములు
గాఁగ వర్షాగమంబు వైఖరిని దనరు, నవ్వనస్థలి దాఁటి యత్యాశుగతిని.

7


చ.

చనిచని ధారుణీవిబుధచంద్రుఁడు ముందర డెంద ముబ్బఁగాఁ
గనుఁగొనె నక్రకర్కటకకచ్ఛపమత్స్యపదర్దురోద్రమున్
ఘనతరరత్నజాలపరికల్పితభద్రము నిర్మలోర్మిక
నినదకదంబసంతతవినిద్రముఁ బశ్చిమదిక్సముద్రమున్.

8


ఉ.

ధీవరకోటి కెప్పుడు నదీనము చేరి ఘనుల్ వసించినన్
జీఐన మిచ్చుధన్యుఁడు ప్రసిద్ధి వహించిన బాడబాశ్రయుం
డావనరాశి భూసురున కర్ఘ్యముఁ బాద్య మొసంగె నూర్మికా
పావననీరబిందువులు పాదయుగంబునఁ జిల్కరించుచున్.

9


క.

వేలానిలదేలామల, జాలాఖిలసుమసమూహసౌరభలహరీ
లీలాకులబాలానిల, మాలావిలసనము లార్యుమది నలరించెన్.

10


చ.

ఉదధిమహారవంబు లపు దుర్విసురాధిపుఁ డాలకించి తా
మదిఁ దలఁచెన్ యదూద్వహునిమందిరదేశమునందు ముందుగా
సదమలదుందుభిధ్వనులు సాగెఁ గదా శుభసూచకంబు లై
కొదవ యిఁకేమిలేక సమకూరెఁ బ్రయోజన మంచు నుబ్బుచున్.

11


చ.

తటవిటపిప్రసూనకలితభ్రమరారవముల్ సుగీతముల్
పటుతరఘూర్ణితధ్వనులు ధన్యమృదంగనినాదముల్ సము
త్కటజలపక్షిరావములు కాంస్యపుఁదాళములై చెలంగఁగా
నటన మొనర్చుమానిను లనం దగి వీచిక లొప్పె నీరధిన్.

12


తే.

హరిహయునివజ్రధారకు వెఱచి యమిత, వాహినీనాథుఁ డంచు నవ్వారిరాశి
యండఁ జేరుక నిల్చినకొండ లనఁగ, నిసుకతిన్నియగములు సొం పెసఁగె నచట.

13


క.

సందరమున నురు వలరె ము, కుందుని పెండ్లికిని బిలుచుకొఱ కరిగెడుభూ
బృందారకుఁ గన్గొని యా, నందంబున నప్పయోధి నవ్వె ననంగన్.

14


తే.

మీనవృశ్చికకర్కటమిథునమకర, హరివృషాదులు రాసులై యలర నుడుప
తరణు లిందులఁ జరియించు టరుదె యనుచు, నెంచె దైవజ్ఞమణి యామహీసురుండు.

15


ఉ.

వాలికమీలఁ జట్టుచు నవారితకౌతుకలీలఁ దేలుచో
మేలఁగుగుబ్బచన్గవమీఁదిపయంటలు జాఱి యున్న లేఁ
జాలరిముద్దుగుమ్మలకుచంబులు బంగరుచెంబు లన్మదిం
జాలఁగ నిచ్చఁ గన్గొనియె ఛాందసుఁ డజ్జలరాశిచెంగటన్.

16


సీ.

బహుతరవాహినీపరివృతుఁ డయ్యును గడు నబ్బురముగ భంగంబు నొందె
ఘనులకు జీవనం బొనఁగూర్చుచుండియు సంతతంబును గలుషత్వ మూనెఁ

దవిలినమర్యాద దాఁటక యుండియుఁ బరిపరివిధముల భ్రమ వహించె
ద్విజసమూహముల కధీనమై యుండియు బాడబార్తిఁ గృశింపఁ బాలు వడియె


తే.

గటకటా దైవ మెటువంటిఘనులనైనఁ, గట్టిఁడితనంబుచే వెతఁ బెట్టుచుండు
నంచు రత్నాకరునివిధం బెంచె నపుడు, పండితశ్రేష్ఠుఁ డైనయాబ్రాహ్మణుండు.

17


క.

ఇతఁడే కమలావాసుం, డితఁడే తథ్యము సరస్వతీశుఁడు నితఁడే
క్షితి నబ్జాంకుఁ డటంచున్, ధృతి నెంచెఁ ద్రిమూర్తులుగ సుధీవరుఁ డుదధిన్.

18


క.

అని మది నెంచుచు భూసుర, తనయుఁడు వేవేగ నరుగుతఱి మార్గవశం
బున నొకచోఁ గనుఁగొనె శో, భనరైవతకాచలంబుఁ బ్రమదము మీఱన్.

19


సీ.

అభ్రాపగాహాటకాబ్జపరాగసంఛాదితాఖిలరత్నసానుతలము
కిన్నరకన్యకాగీతరావామోదకటకచరద్వౌకశ్చయంబు
మండితోన్మత్తవేదండతుండోద్గీర్ణశీకరధారాభిషిక్తభూమి
హర్యక్షమృగయావిహారలంపటకిరాతాహృతిఘోరగుహాంతరంబు


తే.

ఘనమునీంద్రోత్తమాశ్రమసనరసాల, సాలకిసలయఫలరసాలోలబాల
శారికాకీరకోకిలచక్రవాబ్జ, హారినినదంబు రైవతకాచలంబు.

20


సీ.

ఘనులకెల్లను దావకం బగుధీరుండు ప్రతిదినకల్యాణభాసమానుఁ
డురుఫలంబులు విప్రవరులకు నిడుదాత హరి గజద్వేషుల కాకరంబు
కోరి వంశోద్ధారకుం డగుచతురుండు గోత్రవర్గములోన గురుతరుండు
పరవాహినుల కెందు వెఱవనియచలుండు కలితాగమస్థితి నలరుమేటి


తే.

యాధరాధీశుఁ డవనిసురాగ్రగణ్యుఁ, గాంచి కలరవరుతసూక్తిఁ గదియఁ బిలిచి
పూజ గావించె సరసమహీజకుసుమ, విసరములు మీఁద రాల్చి సంతసము మీఱ.

21


మ.

ప్రకటైరావతపారిజాతతరురంభాశక్రహేమాహృతా
దికసంశోభితమై సమస్తసుమనస్తేజస్సదామోదమై
యకలంకం బగుదేవతానగరిచాయం బొల్చి భూభూమిభృ
త్ప్రకరోత్తంసము విప్రవర్యునకుఁ జేతఃప్రీతి చేసెం గడున్.

22


సీ.

నానాప్రసూనలీనోన్మదాలీనతానమానములు గీతములు గాఁగ
జారుమారుతిపూరితోరుకీచకనినాదములు చొక్కపుటుపాంగములు గాఁగ
ఫలరసకిసలయాస్వాదలోలుపఖగధ్వానముల్ కంచువాద్యములు గాఁగ
ఘనదరీతలఝురీకల్లోలమాలికాధ్వనులు మృదంగనాదములు గాఁగఁ


తే.

గేరి నటియించుసరసమయూరికాక, దంబములు నర్తకులు గాఁగ డంబుమీఱి
కొలువు సేయుధరాధీశుచెలువు చూచి, సంతసం బందె నయ్యగ్రజన్ముఁ డపుడు.

23


చ.

తనులతలు న్నితంబము లుదగ్రపయోధరముల్ ప్రవాళశో
భను గనుపట్టుమోవులును భాసురగండములున్ మణిద్యుతుల్

ఘనగజయానముల్ భ్రమరకంబులు సత్కలకంఠనాదముల్
దనరఁ జెలంగుసానులవిలాసము చూచె బుధేంద్రుఁ డుబ్బుచున్.

24


తే.

వీనులకుఁ బండు వయ్యె నహీనమై న, వీనమధుపానపీనకులీనసూన
లీనసదలీనసంతానతానమాన, మానగంబున ధరణీసురాన్వయునకు.

25


తే.

నాగకదలీకదంబపున్నాగశల్య, రోహితర్క్షశివాదులఁ బ్రోచి మఱియు
నాగకదలీకదంబపున్నాగశల్య, రోహితర్క్షశివాదులఁ బ్రోచు నద్రి.

26


ఉ.

భిల్లసరోజలోచనలు పింఛపటంబులు గట్టి గట్టుపైఁ
బెల్లుగఁ గ్రీడసేయ శశిబింబనిభాస్యలచన్గవల్ విరా
జిల్లెడునిమ్మపం డ్లనుచుఁ జేరి కనెం బ్రభుదర్శనార్థమై
యుల్లమునందు నమ్మహిసురోత్తముఁ డుబ్బి హరింపఁగోరుచున్.

27


సీ.

నీలకంఠాకృతి నెఱిఁ బూని యానందతాండవం బాడుశిఖండితతులు
రామనామం బజస్రముఁ బఠించుచును సత్ఫలవాంఛ నలరెడుచిలుకగములు
సరసాగమస్థితు లరయుచుఁ గృష్ణలీలలఁ గేరుచుండుకోకిలకులములు
సుమనోభిరూఢిచేఁ జొక్కి మన్మథగురుసేవ సేయుమధువ్రతావలులును


తే.

బరమహంసస్వరూపంబు సరవిఁ దాల్చి, బ్రహ్మపదబుద్ధిఁ జెలఁగుమరాళములును
గల్గియుండెడుచో వేఱె తెలుపనేల, యన్నగంబు మునిశ్రేణి కాకరంబు.

28


తే.

సదమలాహీనకటకుఁడు చంద్రధరుఁడు, నీలకంఠోల్లసితుఁడు మానితవృషాంకుఁ
డఖిలసుమనోవినుతపాదుఁ డగునతండు, విశ్రుతముగ గిరీశుఁడై వెలయు టరుదె.

29


ఉ.

ఆవసుధాధరంబున విహారము చేయుచుఁ జూచె నొక్కచో
భూవిబుధాగ్రగణ్యుఁడు విభూషితశేషభుజంగమున్ జగ
త్పావనకారణాంగము నపారకృపారచితాంతరంగమున్
దైవభుజంగముం గపటదైత్యవిభంగము శంభులింగమున్.

30


ఉ.

కాంచి తదీయమూర్తిఁ గుతుకంబున డెందమునందు నిల్పి య
క్కాంచనగర్భవంశమణికాంచనకుందకురంటకాదికా
భ్యంచితసూనబిల్వదళపక్వఫలాగులచేతఁ బూజ గా
వించి దృఢానురాగమున వేడఁదొడంగె ననేకభంగులన్.

31


చ.

జయజయ పార్వతీశ శివశంకర భూరిసమిద్భయంకరా
జయజయ నీలకంఠపురశాసనవంచితనీరజాసనా
జయజయ దేవదేవ హరిసాయక నిత్యశుభప్రదాయకా
జయజయ లోకనాథ సురచారణయక్షమునీంద్రకారణా.

32


దండకము.

శ్రీమద్గిరీశాయ ధీమత్ప్రకాశాయ, కాశాబ్దభేశాశంగాశ్వాధిపాకాశగంగా
సరిల్లోలకల్లోలమల్లీశరన్నీరదాళీమరాళీసుధాపూరకర్పూరపాటీరడిండీర

వాగ్భామినీహారనీహారహీరాభదేహప్రభాశాలినే, శూలినే, శంభవే, దంభవేదండ
దైత్యాజినచ్ఛాదితోద్యత్కటోరస్థలోద్భాసినే, శైలసంవాసినే, వాసవాబ్జాసనో
పేంద్రచంద్రోనగేంద్రాదికామర్త్యహేమావతంసాంచలాబద్ధసుస్నిగ్ధహీరావళీ
ధాళధళ్యప్రభాపూరనీరాజితాంచత్పదే, వారితోగ్రాపదే, తాపసవ్రాతచేతస్సరో
జాతసంకేతసంచారలీలావిలోలప్రమత్తాళయే, రాజరేఖామయూఖోల్లసన్మౌళయే,
శైలకన్యామహోరోజకుంభద్వయీలిప్తసంవ్యాప్తదీప్తాంగరాగాతిసౌరభ్యసంవా
సితస్ఫారదోరంతరాళాయ, సంగ్రామకేళీకరాళాయ, రంగజ్జటాజూటకూటస్థఝాళం
ఝళారావధానద్వియద్వాహినీజాతసఞ్జాతరూపారవిందౌఘమారందపూరామితా
నందలీలాచలద్బంభరీయూధమాధుర్యసంగీతనాదానుమోదాయ, శశ్వత్ప్రసాదా
య, పాదాంగదీభూతవాతాశనాధీశభోగాగ్రభాగోల్లసత్పద్మరాగోపలోద్దామ
భాభాసమానాయ, సంరక్షితాశేషవిద్వద్వితానాయ, నానాపయోజాతగర్భాండ
భాండచ్ఛటాపాటవాశ్రాంతపూర్ణోదరానందినే, కేతనాగ్రస్ఫురన్నందినే, చంద్ర
కందర్సకోట్యర్బుదామందసౌందర్యరేఖాంశసమ్మోహితానేకలోకాయ, సంవీత
శోకాయ, పాకారినీలోపలాస్తోకశోభావిభాస్వద్గళా గ్రస్థితాభీలకాకోలనీలప్రభా
జాలసంవ్యాపినే, విద్వేషత్కోపినే, భూపయఃపావకాకాశయజ్వేందుభాస్వన్మ
రున్మూర్తయే, చారుసన్మూర్తయే, చంద్రచంద్రాతపాదభ్రసంశుభ్రవిభ్రాజితస్మిగ్ధ
భూత్యంగరాగాయ, గాఢానురాగాయ, వీతోగ్రతాపాయ, హేమాద్రిచాపాయ,
సోమాబ్జమిత్రాగ్నినేత్రాయ, సంస్తోత్రపాత్రాయ, సర్వాఘపల్లీలవిత్రాయ, సారార
విందాక్షబాణాయ, వారాశితూణాయ, వేదప్రమాణాయ, నిరూలితారాతిపూ
ర్వామరానేకపూర్వప్రదీప్రప్రతోళీవిటంకావళీదేహళీసాలశాలావిశాలారరాళింద
వేదీ మహాసౌధసౌపానవాతాయనశ్రేణయే, హారిసారంగశాబస్ఫురత్పాణయే, సం
శతోద్యమత్స్వసామర్థ్యలోకత్సమస్తాణవే, స్థాణవే, బాణదైత్యోత్తమప్రాణసంస
క్తచేతోంబుజాతాయ, లోకప్రపూతాయ, శీతోర్విభృద్బంధవే, సత్కృపాసింధవే,
బంధురానందసంధాయినే, దీనగేహాంగణస్థాయినే, శిక్షితాఖర్వగర్వాంధకారప్రసూ
నోజ్జ్వలత్కేతనే, విశ్వవిశ్వంభరాభారధౌరేయతాహేతవే, కైతవస్వాంతయుక్తాం
ధక ద్వీపదైత్యప్రహారాయ, వీరాదివీరాయ, విజ్ఞానమూలాయ, విఖ్యాతిశీలాయ, ద
క్షాధ్వరధ్వంసనాక్షుద్రరౌద్రప్రతాపాయ, సత్యానులాపాయ, దేవాదిదేవాయ,
దివ్యప్రభావాయ, సంగీతసాహిత్యనృత్తావధానప్రవీణాయ, వైవస్వతప్రాణ
సంహరణోజ్జృంభమానాయ, దూరీకృతాంభోజసంభూతగర్వాయ, శర్వాయ, తు
భ్యం నమస్తే నమస్తే నమః

33


క.

పరమేశ నీస్వరూపము, సరసిజగర్భాదులకును సనకాదులకుం
గుఱుతుగఁ దెలియఁగరాదఁట, ధరఁ బ్రాకృతజనుల కెట్లు తర మగు నరయన్.

34

క.

జగములలో నీ వుందువు, జగములు నీయందు నుండు సర్వము నీమూ
ర్తిగ భావించి మెలంగెడు, సుగుణుల కెప్పుడును నీవు సులభుఁడ వీశా.

35


తే.

ఉరిడెపురు గెల్లవేళల బురదలోనె, పొరలుచుండియుఁ బంకంబుఁ బొందనట్లు
జ్ఞాని యగువాఁడు సంసారసంగుఁ డగుచు, నెందు నేనియుఁ బంకంబుఁ జెందఁ డభవ.

36


చ.

కలల సమస్తస్తువులు గాంచినఁ దథ్యము గానికైవడిన్
మెలఁగుప్రపంచ మంతయును మిథ్య యటంచుఁ దలంచి యాత్మయం
దలరఁగ నిన్నుఁ గన్గొనుమహాత్ములు నిత్యవిభూతిఁ జెంది ని
శ్చలసుఖలీలఁ దేలుదురు సారతపోధన లోకకారణా.

37


ఉ.

జ్ఞానవిహీనమానవుఁడు శాస్త్రము లెన్ని యెఱింగినన్ మిముం
గానఁ డొకించుకేనియును గాసర మేక్రియ విద్య నేర్చినన్
మేను మఱెంతదొడ్డయిన మిక్కిలి నేరుపు విస్తరిల్లఁగా
మ్రా నెగఁ బ్రాఁకి పండ్లు దినుమార్గ మెఱుంగునె చీమకైవడిన్.

38


తే.

జలఘటాదులయం దబ్జసారసాప్త, బింబములు పెక్కు లగుచుఁ గాన్పించుభంగి
నిక్కముగ దేహులకునాత్మ యొక్కఁ డయ్యుఁ, బెక్కుదెఱఁగులఁ గనఁబడుఁ బృథివి నీశ.

39


క.

కర్మములఁ దవిలి కొందఱు, నిర్మలపరసౌఖ్య మెఱుఁగనేరక యెపుడున్
దుర్మతిఁ జెడుదురు వారల, కర్మంబుల కేది మేర గలదు మహేశా.

40


తే.

అనుచుఁ దననేర్చుతెఱఁగున నభవుఁ గొల్చి, యచ్చోటు దొలంగి యరుగుచు నందునందు
వింతలెల్లను గనుఁగొని సంతసిలుచు, ద్వారకాపురి వేవేగఁ దఱియఁజేరి.

41


క.

ధరణీసురాగ్రగణ్యుఁడు, పరమానందమునఁ గాంచె బహుతరమణిగో
పురమున్ వైభవజితగో, పురమున్ బావనవిభేదిపురముం జెంతన్.

42


ఉ.

కాంచి పురంబుఁ జేరి మణికల్పితశిల్పకచాతురీకళా
భ్యంచితసౌధయూధరుచిరాకరసారరథాదికంబులుం
గాంచనగోపురంబులు సుఖప్రదవిప్రధరేశగేహముల్
కాంచనగర్భవంశమణి కన్నులపండువు గాఁగఁ జూచుచున్.

43


సీ.

నీలజాలకజాలనిష్క్రాంతకౌశికఘనసారధూపవాసనలచేత
నిరతభరతకళాపరవారయువతీమృదంగసంగీతనాదములచేత
నానాప్రసూనగంధానుసంధానసమాగతగంధవాహములచేత
జంద్రశాలాప్రదేశస్ఫురజ్జలయంత్రపతితశీకరకదంబములచేత


తే.

ద్వారతోరణకుముదకల్హారసార, సారసామోదములచేత ధీరవరుఁడు
మార్గగమనప్రభూతశ్రమంబు దీఱి, యుల్లమున మొల్ల మగువేడ్క లుల్లసిల్ల.

44


సీ.

మఖహోమనిఖిలాగమప్రణాదములచే భాసిల్లుభూసురావాసములును
గరిఘోటకాందోళికాశతాంగములచే వెలుఁగొందుభూభ్ళన్నివేశములును

నవరత్నధనధాన్యవివిధవస్తువులచే బలితంబు లగువైశ్యభవనములును
గోశాక్వరోష్ట్రసంకులములై సిరులచేఁ బొదలుచుండెడుశూద్రసదనములును


తే.

సతతనర్తితనర్తకీజనసరత్న, కనకమంజీరఘంటికాధ్వనులచేత
వలను మీఱెడుబహువేశవాటికలును, జూచి యుప్పొంగె ధారుణీసురవరుండు.

45


తే.

శంఖవరనీలకుందకచ్ఛపముకుంద, మకరపద్మమహాపద్మనికరములను
దనరునీరాజధానితో ధనదునగరి, సరి యగునె యంచు నవ్విప్రవరుఁడు పొగడె.

46


తే.

కేల గిరి యెత్తువరబలశాలి యగుటఁ, జేసి పేరైనపర్వతశ్రేణుల్లెల్ల
లీలఁ బెకలించి తెచ్చి యీప్రోలఁ గోట, యిడెనొ హరియంచు బుధుఁ డెంచె నిభకులముల.

47


క.

బంధురగతి నిచ్చోటున, గంధర్వావళుల నీనఁగాఁ బోలుఁ జుమీ
సింధువుకా కెటు లబ్బెన్, సైంధవనామంబు లంచుఁ జర్చ యొనర్చెన్.

48


తే.

కమలజావాస మెప్పుడు గలిగియుండు, విబుధలోకంబు నిబిడమై వెలయుచుండు
నాగవాసంబు మున్నె యిన్నగరి నలరు, నౌర పౌరుల కిఁక నొండు గోరవలదు.

49


క.

అని తలఁచుచుఁ జని భూసుర, తనయుఁడు వేడుకలు మీఱ దైత్యారినికే
తనభూమిఁ జేరి యొయ్యనఁ, దనరాక యదూద్వహునకుఁ దగ నెఱిఁగించెన్.

50


చ.

విని హరి నీలవర్ణుఁ డరవిందభవాన్వయుఁ దోడితెం డటం
చును దగువారలం బనుప సూరిజనోత్తముఁ జేరి వారు వం
దనము లోనర్చి మి మ్మిపుడు దానవసూదనుఁ డాదరించి గొ
బ్బునఁ బిలుఁ డంచుఁ బంచె నృపపూజిత ర మ్మిఁక నంచుఁ బల్కినన్.

51


తే.

శౌరిఁ గన్గొనుభాగ్యంబు సంభవించె, నంచు నెంతయు సంతసం బాత్మ నలర
వారితోడనె యవ్విప్రవరుఁడు కాంచ, నాంబరునిమందిరముఁ జొచ్చి యరుగునపుడు.

52


సీ.

క్షీరవారాశివీచిక లంచు మది నెంచు హీరసోపానంబు లెక్కుచోటఁ
బ్రావృడ్ఘనాఘనపంక్తు లంచుఁ దలంచు హరినీలభిత్తికల్ దఱియుచోటఁ
గ్రతుభుగ్ధరాధరకటకంబు లని యెంచుఁ గనకవితర్దికల్ గాంచుచోట
నమృతకాసారంబు లని యాత్మ నూహించు విధుశిలాతలములు వెలయుచోట


తే.

నహికులేంద్రఫణాగ్రంబు లంచు నెంచు, నబ్జరాగకవాటంబు లలరుచోట
సాంద్రచంద్రాతపము లంచు సరవి నెంచు, విమలమౌక్తికసౌధంబు లమరుచోట.

53


సీ.

పగడంపుగుండ్రగంబములు బాజుల నిల్పి పన్నినముత్యాలపందిరులును
నవహరిన్మణిమయద్వారతలంబులఁ బాటిల్లుహీరకవాటములును
దతపుష్యరాగనిర్మితవిటంకములచే వెలయుక్రొన్నెలరాలవేదికలును
జకచకద్యుతులఁ గొంచక చెలంగి వెలుంగుమేలినీలపుగుడ్యజాలకములు


తే.

నబ్జరాగశిలావలికాంచలప్ర, లంబనవనవరత్నకదంబరుచిర
కనకసౌధాదికంబులు గడచి మిగుల, మోదమున రాజశుద్ధాంతమునకు నరిగి.

54

చ.

కలకలనాదము ల్సెలఁగఁ గంసవిరోధికథాప్రబంధముల్
పలికెడునూత్నరత్నమయపంజరసంశ్రితకీరశారికా
వలులవినోదవైఖరి యవారితకౌతుకహేతుభూతమై
యలరఁగ నద్ధరామరకులాంబుధిచంద్రుఁడు కోరి చూచుచున్.

55


తే.

పఱపుగలవట్టివేళ్ళచప్పరము లొరసి, మేటిపన్నీటివాఁగులు మించి మంచి
కపురపుటనంటిబోదెలఁ గలయవలచు, చలువచెంగల్వకేదారములును గడచి.

56


సీ.

అభినవపద్మరాగాశ్మకవాటముల్ చారుహరిన్మణిద్వారములును
బటుపుష్యరాగసంఘటితార్గళంబులు లాలితహరినీలజాలకములు
భూరిశోభాపూరహీరసోపానముల్ విపులచంద్రోపలవేదికలును
రుచిరగోమేధికప్రచురవలీకముల్ వికసితవైదూర్యవలభికలును


తే.

సాంద్రముక్తాఫలామలచ్ఛాదనములు, పృథులజాంబూననాబద్ధభిత్తికలును
గలిగి దేదీప్యమానమై వెలుఁగుచున్న, భవ్యతరచంద్రశాలికాభ్యంతరమున.

57


చ.

అపరిమితప్రసూననిఖిలాగరుజాపకసౌరభంబులుం
గపురపుధూపవాసనలుఁ గస్తురిగందములున్ జవాదిని
ద్దపువలపుల్ బుగుల్ కొనెడుదట్టపుదట్టుపునుంగుఁదావులున్
విపులగతిం దిగీశులకు విందు లనింద్యముగా నొనర్పఁగన్.

58


సీ.

సైకపుజరబాజుచందువా నొదవిన మేలిముత్యాలజాలీలు వ్రేల
గొనబైనబంగారుగోడల నంటిన నిలువుటద్దంపుగుంపులు వెలుంగ
బలుమానికపుఁగంబములఁ గదియించిన కాంచనపాంచాలికలు నటింపఁ
దెలిముత్రియంపుఁబందిరు లమర్చిన మంచిగందపుఁబట్టెకంకటులు మెఱయఁ


,ే.

బరిమళద్రవ్యములు నించి వరుస నిడిన, చంద్రకాంతపుగిండులు జానుమీఱ
నడపములు జాలవల్లిక లాదియైన, విమలశృంగారవస్తుజాలములు నమర.

59


తే.

కొలఁది మీఱినచిత్రలీలలఁ జెలంగి, యనుపమం బగునిద్దపుటఱ్ఱలోనఁ
బసిఁడిగొలుసులపసల నిం పెసఁగుచున్న, మానికపుఁదూఁగుటుయ్యాలపైని గదిసి.

60


సీ.

కనకకంకణఝణత్కారం బలర నొక్కమదహంసయాన చామరము విసర
మణిమయముద్రికాఘృణులు పర్వఁగ నొక్కమానిని తెలియాకుమడుపు లొసఁగ
నురుపయోధరకుంభయుగళి యుబ్బఁగ నొక్కపణఁతుక రత్నవిపంచి మీటఁ
జరణమంజీరనిస్వనము లొప్పఁగ నొక్కసరసిజేక్షణ బరాబరు లొనర్పఁ


తే.

గంబుకంఠి యొకర్తు గానంబు సేయ, భామ యొక్కతె బలుదమ్మపడిగఁ బూనఁ
జంపకామోద యోర్తు నిద్దంపుఁజికిలి, నిలువుటద్దంబు ముందర నిలిపి చూప.

61


తే.

తరుణు లిరువురు భోజసుతాస్వరూప, లిఖితనవచిత్రఫలకముల్ వేడ్కఁ బూని
యిరుగడల నిల్చి కొలుని నహీనవిభవ, జితపురందరుఁ డనఁదగి యతులగతిని.

62

సీ.

విరిసరుల్ సుట్టి వావిరి నొయారము మీఱ నొరగ వైచినసికయొఱపు చూప
నొలెవా టోనర్చినజిలుఁగుబంగరుడాలు తగటుదుప్పటి వింతసొగసు లీనఁ
దీరుగాఁ గొనగోట దిద్దిన విడుదకస్తురికేక నొసలఁ గాంతులఁ జెలంగ
మెదిపి గొజ్జఁగినీటఁ బదనిడ్డనిద్దంపుఁగలపంపుమైపూఁత వలపు గులుక


తే.

గొప్పముత్యాలచౌకట్లు కొమరుదేట, బవరిగడ్డంపుజిగితోడఁ దవిలి మెఱయ
హారికేయూరకంకణాద్యమితభూష, ణాంచితవిలాసుఁ డగుశౌరిఁ గాంచి యపుడు.

63


సీ.

జయజయ కమలాక్ష సకలలోకాధ్యక్ష జయజయ నవనీతచౌర్యధుర్య
జయజయ గోవింద సాధితాహితబృంద జయజయ సంతతసదయహృదయ
జయజయ వనమాలి సారయశశ్శాలి జయజయ బుధనుతిజాలలోల
జయజయ వైకుంఠసమరజయాకుంఠ జయజయ పుండ్రేక్షుచాపరూప


తే.

జయ నిరంతరవల్లవీజనకుచాగ్ర, రచితరుచితరపరిమళప్రచురగంధ
సారసారంగమదఘనసారసాంక, వాంకితోరస్స్థలానంద హరి ముకుంద.

64


తే.

అనుచుఁ గైవార మొనరించి యవ్విరించి, కులశిరోమణి విలసితజలదవర్ణు
చెలువునకు మది నానందజలధిఁ దేలి, యెనక మఱియును దీవన లొసఁగుటయును.

65


క.

ఆవిప్రోత్తముఁ గన్గొని, గోవిందుఁడు భర్మడోల గొబ్బున డిగి సం
భావించి మ్రొక్కు లిడి యొక, పావనమణిపీఠి నునిచి భక్తి దలిర్పన్.

66


తే.

సురలు దనుఁబూజ యొనరించుకరణి నతనిఁ, బూజ గావించి కుశలంబు పొసఁగ నడిగి
వెసఁ బ్రసాదంబు పెట్టించి వీడె మొసఁగి, మృదులతల్పంబుపై నుంచి పదము లొత్తి.

67


చ.

వినయవివేకము ల్వెలయ విప్రకుమారునిఁ జూచి వెన్నుఁ డి
ట్లను నవనీసురేంద్ర యనయంబును మీరు వసించుటెంకి యే
జనవరుభూమి యం దతఁడు సాధుజనాదరణుండె యిప్పు డే
పని కిట కేఁగుదెంచితిరి భద్ర మగుం దెలియంగఁ జెప్పరే.

68


క.

అనవుడు హరిఁ గనుఁగొని యో, దినకరనిభ విను విదర్భదేశంబునఁ గుం
డిననగరి యేలు భీష్మక, జననాయకుఁ డొప్పు సకలజనసమ్మతుఁడై.

69


తే.

అతనిపుత్రిక రుక్మిణి యనఁగఁ బరఁగు, కన్యకామణి గల దయ్యగణ్యపుణ్య
శీల నీకును బరిచర్య సేయఁగోరి, యొక్కశుభవార్త పుత్తెంచె నొనర వినుము.

70


క.

మునివల్లభ దుర్లభమై, తనరెడుభవదీయచరణతామరసయుగం
బనిశము సేవింపఁగఁ గో, రినదానఁ జెలంగి నన్నుఁ గృపఁ జూడు హరీ.

71


ఉ.

కన్నియ కీక్రియం బలుకఁగాఁ దగ దంచుఁ దలంచెదేనియున్
మున్ను వరింపదే భువనమోహన యిందిర సుందరీజనుల్
చెన్నగునీవిలాసకులశీలబలామితరూపసంపదల్
కన్నులఁ గన్న విన్నఁ దమకంబునఁ గోరుట ధాత్రిఁ జిత్రమే.

72

చ.

నిరతము తావకాంఘ్రియుగనీరజభక్తిఁ జెలంగునన్ను నో
పురుషవరేణ్య రుక్మి యనుబుద్ధివిహీనుఁడు క్రొవ్వి చేదిభూ
వరుఁ డనుదోసకారికి వివాహము సేయఁ దలంచుచున్నవాఁ
డరయఁగ నక్కపోతునకు సబ్బునె బెబ్బులిసొ మ్మొకింతయున్.

73


క.

ఉడుగనియాసలఁ దము నె,య్యెడ నమ్మినసాధుజనుల నేఁచెడుఖలులన్
దొడరి వధింపక యూరకె, విడువరుగద యెందునైన వీరవరేణ్యుల్.

74


తే.

తడయఁ బనిలేదు వేవేగఁ దరలి వచ్చి, కలన శిశుపాలమాగధాదుల జయించి
రాక్షసవివాహమునఁ బయోజాక్ష నన్నుఁ, గైకొనుము శౌర్య ముంకువగా నొనర్చి.

75


తే.

రాజశుద్ధాంతసౌధాంతరమున మెలఁగు, నిన్ను నేక్రియఁ దేవచ్చు నిఖిలబాంధ
వుల వధింపకకా కని తలఁచెదేని, విను ముపాయంబు చెప్పెద వనజనయన.

76


క.

కులదేవియాత్ర యొనరిచి, వలనుగఁ బురి వెడలి శివునివనితకు మ్రొక్కం
జెలఁగి తమవారు పంపుదు, రెలమిం బెండ్లికిని ముం దహీనచరిత్రా.

77


తే.

అట్లు శివవల్లభకు మ్రొక్క నరుగుతఱిని, సరగఁ బఱతెంచికొనిపొమ్ము కరుణఁ జేసి
కాక నీమది నశ్రద్ధగాఁ దలంచె, దీని నామీఁదిపని నాకె తెలియుఁజుమ్ము.

78


మ.

అని నీచెంగట విన్నవింపు మని యయ్యబ్జాస్య పుత్తెంచె నో
జననాథోత్తమ జాగు వ ల్దిఁకఁ జమూసంఘంబులం గూడి గొ
బ్బున వేంచేయుము కుండినేంద్రసుతి నంభోజాతనేత్రిం జగ
జ్జనసంస్తుత్యచరిత్రిఁ గైకొనుటకున్ సంతోషచిత్తంబునన్.

79


క.

ఆకాంతాజనరత్నము, నీకుఁ దగుం దగుదు నీవు నృపకన్యకకున్
మీ కిరువురకుం గూర్చిన, యాకమలజుప్రోడజాడ లలవియె పొగడన్.

80


క.

ఓచక్రధర నిజంబుగ, భూచక్రమునందుఁ గల్గుపొలఁతులు తులగా
రాచక్రస్తనితో మఱి, యాచక్రియుఁ బొగడఁ జాలఁ డబలగుణంబుల్.

81


క.

వన్నెలనెల వన్నెలఁతుక, వెన్నెలదొర కళ యనన్ భువిన్ విలసిల్లున్
కన్నులు విరిదమ్ములు చెలి, కన్నులు తుల యెందుఁ జెంద రంబుజనాభా.

82


క.

కుందము లాదంతము లర, విందము లాపదము లుదధివిలసద్వీచీ
బృందము లావళు లలరు మి, ళిందము లాకుంతలములు లీలావతికిన్.

83


సీ.

భృంగముల్ సింగముల్ తుంగగంగాసరిద్భంగముల్ మత్తచక్రాంగములును
జిందముల్ కుందముల్ సుందరేందీవరబృందముల్ వికచారవిందములును
క్షీరముల్ కీరముల్ సారసౌరభ్యకల్హారముల్ ఘనఘనసారములును
వ్యాసముల్ శైలముల్ శ్రీల నోలాడుమృణాలముల్ చంపకజాలములును


తే.

దుల యగునె దానికచమధ్యనళిసుయాన, గళరదననేత్రముఖహాసలలితవచన
కరవపుర్గంధరోమాళిగురుకుచభుజ, నాసలను బోల్ప నింతైన నలిననయన.

తే.

అబ్జబింబోపమానంబు లగుచు లోచ, నాధరంబులు వదనంబు నలరుఁ జెలికి
కోకనదవిభ్రమంబు గైకొని యురోజ, నాభికలుఁ బదయుగ మొప్పు నలినముఖికి.

85


సీ.

విశ్వంభరాకృతి వెసఁ బూనె జఘనంబు హరివిలాసస్ఫూర్తి నలరెఁ గౌను
కనకాంశుకఖ్యాతిఁ గర మొప్పె మెయిచాయ విధుమనోహరవృత్తి వెలసె మోము
శ్రీవరాకారంబుఁ జెందెఁ గర్ణయుగంబు కృష్ణశోభారూఢిఁ గేరెఁ దుఱుము
చక్రిలావణ్యంబు సరవిఁ గైకొనె నారు దరభవ్యకరలీలఁ దనరె గళము


తే.

సరసిజాక్షికి సకలాంగసౌష్ఠవంబు, ప్రణుతి యొనరింప నీరీతిఁ బరఁగునపుడు
మానసంబునఁ దుది లేనిమమతమీఱఁ, గుధరధర నిన్ను వరియింపఁ గోరు టరుదె.

6


క.

హరిణీనిభమణివిరచిత, హరిణీప్రభనయనవిజితహరిణీసభ యా
హరినీలవేణిచెలుపము, హరినీరజభవులకైన నలవియె పొగడన్.

87


సీ.

అరుణాధరోష్ఠి యయ్యబలాశిరోమణి చంద్రబింబాస్య యాజలజగంధి
మంగళగాత్రి యామదనవైభవలక్ష్మి సౌమ్యభాషిణి యావిశాలనేత్ర
గురుకుచకుంభ యాపరభృతోజ్జ్వలకంఠి కవివర్ణనీయ యాఘననితంబ
మందగామిని యాసమంచితహరిమధ్య పటుతమోవేణి యాపల్లవాంఘ్రి


తే.

రుచిరకేతుప్రకాశ యారుక్మవర్ణ, గావున నుద్రగ్రశుభసుఖకారణ మగు
ఫలము చేకూరు టరుదె చె ల్వలర దాని, యవిరళానుగ్రహ మొకింత దవిలెనేని.

88


తే.

నదము పొక్కిలి మృదుకోకనదము పదము, దరము కంఠంబు నలినసుందరము కరము
ధరము జఘనంబు నవవారిధరము తుఱుము, తరమె హరిమధ్యఁ బ్రణుతింప ధరణినాథ.

89


ఉ.

డంబుగదే పిఱుందు పగడంబుగదే జిగిమోవి చంద్రఖం
డంబుగదే కపోలము జడంబుగదే నడ మన్మథాగ్రకాం
డంబుగదే కటాక్షము గుడంబుగదే నుడి మేటితేఁటితం
డంబుగదే కచంబు నిబిడంబుగదే మెయికాంతి యింతికిన్.

90


సీ.

కనకాంగిముద్దుమొగంబు పద్మము సేయుఁ గలకంఠిగళము శంఖంబు సేయుఁ
గామినీమణిజిల్గుఁగౌ ననంతము సేయుఁ గొమ్మకన్బొమదోయి కోటి సేయుఁ
జపలలోచనవిలాసం బచింత్యము సేయు శుకవాణికటి మహాక్షోణి సేయు
మధురోష్ఠినాభి నిమ్నతసాగరము సేయుఁ బూఁబోణిమేచాయ భూరి సేయు


తే.

నామధేయంబు రుక్ష్మిణి నాఁగఁ బరఁగుఁ, గావున నధీశ వేనోళ్లు గల్గినట్టి
యహికులాధీశ్వరున కైన నలవి గాదు, చెలువచెలువంబు గణుతించి విలువసేయ.

91


క.

బింబోష్ఠికురులు హరినీ, లంబుల మదపుష్పలిట్కులంబుల ఘనజా
లంబులఁ జమరీమృగవా, లంబులడం బలరు శైవలంబులఁ గేరున్.

92


మ.

జలజాతావళి నేఁచుదుష్కృతముచేఁ జాలం గళాహీనుఁడై
తలరన్ జంద్రుఁ డటంచు లోకు లెపుడుం దన్నాడ రోషించి వె

న్నెలఱేఁ డాచెలీవక్త్రమై వెలసి పూన్కిం దానినేత్రాంబుజం
బులు కాంతిన్ విలసిల్ల సంతతకళాపూర్ణుండు గాఁబో ల్సుమీ.

93


క.

గణుతింపఁగ మధుపానపు, గుణ మెక్కుచు దిగుచు నుండు కుసుమాస్త్రునిసిం
గిణివిండ్లు దగునె తరుణీ, మణికన్బొమలకు భువిన్ సమం బొనరించున్.

94


మ.

క్షయరుక్పీడితుఁడున్ గళంకియు ఘనస్వర్భానుదంష్ట్రాక్షత
ప్రయతాభీలవిషానలుండు శశి చెప్పన్ రోఁత తచ్చంద్రికల్
ప్రియ మె ట్లంచుఁ జకోరముల్ మిగులుకోర్కిన్ హాసచంద్రాతపో
చ్ఛ్రయభామాముఖకైరవాప్తుని భజించం బోలు నేత్రంబు లై.

95


చ.

కమలదళాక్షినాస ననగంధఫలిన్ విరియించుమించుట
ద్దములఁ గరంబు సోఁకుటనె తద్దయు మాయఁగఁ జేయుఁ జెక్కు లా
రమణిశ్రుతిద్వయంబు తలరన్ నవసంఖ్యల నెన్ను నున్మద
భ్రమరశిరోజముద్దునునుఁబల్కులు సారెకుఁ గేరుఁ జిల్కలన్.

96


సీ.

జలజాక్షిపెదవితో సాటి నొందకయేమొ నెఱిబింబఫలము మాధురినిఁ బాసెఁ
బికవాణియధరంబునకు నీడు గాకేమొ విద్రుమంబు క్రయింప విలువఁదేరెఁ
జెలువవాతెఱతోడఁ దుల రాఁ గలుగకేమొ పద్మరాగము శిలాప్రాయ మయ్యె
బొలఁతిరదచ్ఛదంబునకు నోడుటనేమొ బంధుజీవకము నిర్గంధ మయ్యె


తే.

విమలమాధుర్యయుక్తమై విలువ దెగక, దృఢశిలాప్రాయమును గాక దివ్యగంధ
బంధురంబయి సురుచిరప్రభల నమరు, దాని కెమ్మోవి మరునిపూఁదేనెబావి.

97


క.

పలువిరుస మొల్లమొగ్గల, బలువరుసల గెల్వఁజాలుఁ బైదలిలేన
వ్వులు పున్నమవెన్నెలలన్, వెలిగా నొనరించు నెపుడు విశ్వాధీశా.

98


తే.

చెలువకంధరక్రముకంబుఁ బలువిధముల, వ్రక్కలుగఁ జేయుదక్షిణావర్తశంఖ
మింతికంఠంబునకు నోడియేమొ భీతిఁ, గళవళంబున మొఱ సేయఁగాఁ దొడంగె.

99


క.

రతిమనసిజకేళీవన, సతతవిరాజితరసాలశాఖాయుగ మ
య్యతివభుజయుగము తుదలన్, వితతంబుగఁ బల్లవములు వెలఁదుకపాణుల్.

100


సీ.

చంద్రయోగమునకుఁ జాలఁ దల్లడమంది కవ వీడి పాఱుజక్కవలు తులయె
తలరుహిమాంబుధారలు సోఁకి పస దప్పి మెలఁగురాజీవకుటలము లీడె
విమలవజ్రప్రహారముల కెంతయు నెదం దలఁకెడుగిరిశృంగములు సమంబె
కరముసొం పగుభద్ర,గంధవహోద్ధతిఁ జలియించుదాడిమఫలము లెనయె


తే.

నన్నెగాఁ జంద్రహిమజలవజ్రహార, భద్రగంధివహోద్ధతిఁ బరఁగుచుండి
కదిని పస గల్గి తలఁకక కదల కెపుడుఁ, జెన్నుమీఱెడుచెలిగుబ్బచన్నులకును.

101


చ.

వెలయఁగ నాభికాబిలము వెల్వడి సిబ్బెపుగబ్బిగుబ్బలన్
మలయమహీధరాగ్రములమాటున నీటున నిల్చి వాసనల్

గలవలియూర్పుఁదెమ్మెరలు గైకొనులీల బిలేశయంబనం
జిలుకలకొల్కి యారు విలసిల్లు మనోహరకాంతివైఖరిన్.

102


చ.

అనుపమనీలలాలితనిజాలకజాలకజిల్గుఁగౌనుతో
నెనఁ గనఁ గోరి చేరి కడునిచ్చలు నిచ్చలుమీఱఁ బోరి య
య్యనువున నోడి భీతి మది నానఁగ నానఁ గలంగి కాన కేఁ
గెను హరి యట్లు గానియెడఁ గేసరికే సరియో మృగావళుల్.

103


క.

వళు లలరు మత్తదంతా, వళకుంభస్తనయుగళికి వనధితరంగా
వళులఁ జలనంబు గలతమ, నిలువెల్లన్ విష మటంచు నిందించి కడున్.

104


తే.

తరుణియూరుద్వయంబుతోఁ గరికరములు, వాద మొనరింపఁజాలక వంగిపోయె
కమలగర్భంబు లింతిజంఘలకు నోడి, వేగఁ దృణమూని తలవంచె వెన్ను చూపి.

105


తే.

కమలపత్రాక్షశంఖచక్రములు నీకుఁ, గరములం దుండుగాని యాతరుణి కెపుడు
నలరుచుండును పదములం దరసి చూడ, సకలశుభలక్షణాంగి యాచంద్రవదన.

106


శా.

ఆకాంతామణి యాబుధద్విరదకుంభాంచన్మహోరోజ యా
రాకాచంద్రనిభాస్య యారమణి యారాజీవపత్రాక్షి యా
శ్రీకారోపమకర్ణ యాచెలువ యాశృంగారవారాశి యా
లోకస్తుత్యచరిత్ర నీకుఁ దగుఁ బల్కుల్ వేయు నింకేటికిన్.

107


చ.

అనుటయు శౌరి సంతసిలి యౌ నవనీసురవర్య తథ్య మీ
వనినతెఱంగు భీష్మకధరాధిపపుత్రి వయోవిలాసముల్
మును విని డెంద మాభువనమోహనవిగ్రహపైనె యుంచి యే
పనులయెడం దలంతు దృఢభక్తుఁడు నన్నుఁ దలంచుకైవడిన్.

108


ఉ.

కన్నియరూపవైభనము కన్నులఁ గట్టినయట్ల యుండు వి
ద్వన్నుతి రుక్మి సేయునహితక్రియ లన్నియు మున్నె విందు నిం
కెన్నియు నేల భీష్మకనరేంద్రునిప్రోలికి వచ్చి వైరులన్
ఖిన్నులఁ జేసి పోఁ దఱిమి నీలకచన్ వరియింతుఁ గూరిమిన్.

109


సీ.

ఆతటిల్లతదేహ మభినవలీలలఁ గదిసి యుండనిఘనాభ్యుదయ మేల
యాచకోరకనేత్రతో చెల్మి యొదవని చెలువంబు లగురాచచిన్నె లేల
యాపయోధరవేణిదాపున మెలఁగనినిత్యమహీభృదౌన్నత్య మేల
యాసరోజానన యలర భాసిల్లని ప్రచురంబు లగునినప్రభల వేల


తే.

బాల నేవేళ నెద నిడి పరమహర్ష, జలధి నోలాడకుండెడుసకలరాజ్య
వైభనం బేల కరిహయవర్గ మేల, ధరణిసురవర్య యెన్నిచందముల నరయ.

110


క.

అని పల్కి యాక్షణంబునఁ, దనుజకులారాతి దా విదర్భావనికిం

జన నుద్యోగం బొనరిచి, తనపంపున సూతుఁ డైనదారకుఁ డెలమిన్.

111


తే.

సైన్యసుగ్రీవమేఘపుష్పకసలాహ, కంబులను ఘోటకంబులఁ గట్టి గరుడ
కేతనం బెత్తి యాయుధవ్రాత మునిచి, తేరు వేవేగ నలరించి తెచ్చుటయును.

112


క.

ద్విజరాజవంశచంద్రుఁడు, ద్విజకులచంద్రున కనర్ఘదివ్యాభరణ
వ్రజవసనాదులు కడు నిడి, విజయరథం బెక్కి చనియె విప్రుఁడు దానున్.

113


క.

అని మునిజనులకు సూతుఁడు, వినిపించినరీతిఁ బ్రీతి వెలయఁ బరీక్షి
జ్జనపతికి శుకుఁడు దెల్పిన, విని మఱి యటమీఁదికథయు వినఁగోరుటయున్.

114


మ.

శరదిందూపమదేహనిర్జితవిపక్షవ్యూహకైలాసభూ
ధరవిబ్రాజితగేహదీనజనసంత్రాణామితోత్సాహభా
స్వరగోవల్లభవాహపర్వతసుతాంచన్మోహపాపావళీ
శరదాభ్యున్నతగంధవాహసుమనస్సంఘాతనిర్వాహకా.

115


క.

శారదనీరదనారద, పారదఘనసారహారపాటీరసుధా
హీరధరాభవరస్మిత, సారదయాపూరదీనజనమందారా.

116


మాలిని.

జలనిధివరతూణా సత్యవాక్యప్రమాణా
జలజనయనబాణా సంహృతాంభోజబాణా
సలలితగుణసీమా సారసంగ్రామభీమా
బలవదరివిరామా భక్తచిత్తాబ్జధామా.

117


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
న్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మననామ
ధేయప్రణీతం బైనరుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందుఁ జతుర్థా
శ్వాసము.