భాస్కరరామాయణము/సుందరకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

సుందరకాండము



రమణీహృదయేశ్వర
కారుణ్యసుధాంబురాశికల్లోలభవ
శ్రీరంజితవరవైభవ
సారయశశ్శ్రీవిహార సాహిణిమారా.

1


క.

అంతం గపివీరులతో, సంతస మందంగఁ జండసమరజయశ్రీ
మంతుం డగుహనుమంతం, డెంతయు బలగర్వ మెసఁగ ని ట్లని పలికెన్.

2


చ.

ఉరవడి నుప్పరం బెగయ సూఁకుమదీయపదోగ్రఘట్టన
స్ఫురణము సైఁపలేక వడి భూమి దిగంబడుఁ గాన యిమ్మహీ
ధరదృఢభూరిశృంగములు దాఁపలుగా లఘులీల దాఁటి స
త్వరగతితోడ యోజనశతంబును గూడ నతిక్రమించెదన్.

3

హనుమదాదివానరులు మహేంద్రగిరిం జేరుట

చ.

అన విని సంతసంబున సమస్తకపీంద్రులుఁ జేరి యాసురేం
ద్రున కనురక్తి దేవతలు మ్రొక్కువిధంబున మ్రొక్కి వాయునం
దను నవపుష్పమాలిక నుదంచితకాంచనకుండలంబులం
గనకమయాంగదంబులఁ దగంగ నలంకృతుఁ జేసి రత్తఱిన్.

4


చ.

అనుపమవిక్రమక్రమసమగ్రభుజార్గళుఁ డైనవాయునం
దనుఁడు నిజాప్తవానరులుఁ దానును నెక్కె మరుత్సురాంగనా
జనకృతసంగశృంగచయసంగతతారకసూర్యచంద్రమున్
[1]ఘనవనమంద్రమున్ సుజనగమ్యనగేంద్రము నమ్మహేంద్రమున్.

5


వ.

ఇవ్విధంబున నెక్కి బహుఫలకిసలయకుసుమవిలసితలతాతరువిసరభాసురంబును
ఘోరతరరవశరభసైరిభభైరవకంఠీరవచండమదోద్దండవేదండపుండరీకభల్లూక
విపులవిషాభీలకాలవ్యాళకోలస్థూలగోలాంగూలప్రముఖప్రాణికులంబును గాక
మూకానేకపక్షికులవ్యాకులంబును నభ్రంకషోత్తుంగశృంగంబును సురాసురయ

క్షగంధర్వసిద్ధవిద్యాధరసేవితంబును గనత్కనకమణిసానుసంతానభాసమానం
బును నానావర్ణద్యుతిరాజివిరాజితంబును నానాసత్త్వమందిరకందరంబును
గామరూపాభిరామంబును మహౌషధీదీపప్రదీపితంబును నగు నన్నగోపరిభా
గంబున.

6


క.

మరకతనిర్మలజలభా, సురశాద్వలతలమునందుఁ జూడఁగ నొప్పెం
దరుచరవీరుఁడు గమలా, కరమున విహరించుమత్తకరిచందమునన్.

7


క.

మృగపతిపగిదిన్ మృగముల, బెగడం దోలుచు మహీజబృందంబుల పై
ఖగముల నెగయం జోపుచు, నగచరవీరుండు ప్రియవిహారము సల్పెన్.

8


మారుతసూనుం డక్కజ, మారెడు తేజంబుతోడ నతిధీరుం డై
భూరితరశైలశృంగము, పై రెండవతరణికరణి భాసురుఁ డయ్యెన్.

9


క.

విక్రమవిభవము మెఱయఁ ద్రి, విక్రమములు విస్తరించి వెలయంగఁ ద్రిలో
కక్రమణశాలి యైనత్రి, విక్రమదేవుగతిఁ బ్లవగవీరుం డొప్పెన్.

10


వ.

ఆసమయంబునం బావనిపాదఘాతంబులం గంఠీరవపాదఘాతంబుల నొఱలుమత్త
ద్విరదంబులకరణి నొఱలుచుం బవనతనయుపదతలహతి శిల లురుల శిఖరం
బులు విఱిగి పడఁ గుప్పించుననిలసుతునిచరణప్రహరణంబుల శిలాంతరాశీవి
షంబులు సధూమస్తోమజ్వాలాభీలజ్వలనంబుల నుమియుచు నర్ధవినిస్స్రుతంబు లై
నెగయించుఫణావళులచేత నుద్దీపితనూతనకేతనావృతుండునుంబోలెఁ దేజరిల్లు
చు సమీరకుమారాక్రాంతసకలస్థలనిర్గళితపాండురజలధారలు ముక్తాహారంబు
లుంబోలె నలంకరింప నయ్యది నెఱయ మెఱసె నంత ననతిదూరంబున.

11


శా.

భూరిధ్వానభయప్రకారము సదాభూయిష్ఠగంభీరతా
కారం బుత్థితతుంగభంగచయ[2]రంగత్సారడిండీరవి
స్తారం బవ్యయవారిపూర మురుమత్స్యక్రూరనక్రానిలా
హారగ్రాహవిహారఘోరతరపారావార మేపారుచున్.

12


చ.

తొడరి సురాసురుల్ గడఁకతో మును ద్రచ్చి రగస్త్యుఁ డల్గినం
బుడిసిటిలోనఁ బెంపు చెడిపోయితి వారిమహత్త్వ మారయం
గడు నది నాకు నీచదశ గా దని యుండితిఁ గాక క్రోతి యే
వడి నను దాఁటు నన్నగతి వారక నింగి చెలంగ మ్రోయుచున్.

13


చ.

పరిచితచక్రవాకకుచభారము నుత్పలదృష్టులున్ దళ
త్సరసిరుహాస్యముఁ బులినచారునితంబముఁ జూచి వార్ధి ని
ర్జరనదిఁ గౌఁగిటం బొదువఁ జాఁచిన చేతు లనంగ నూర్ము లం
బరతల మప్పళింపఁ గని పావని చిత్తములోన ని ట్లనున్.

14


క.

సాగరము పెంపు చూచిన, నేగతిఁ గడవంగఁ బాఱ నెవ్వఁడ నే ని

ట్లాగుణనిధికృప గగనా, భోగంబున కెగసి కడచి పోయెదఁ బ్రీతిన్.

15


ఉ.

ఇంక విచార మేల జవ మింకక యీజలరాశి దాఁటెదన్
లంకకుఁ బోయెదం గడిమి లావులు సూపినరాక్షసావలిం
బొంక మడంచెదన్ జనకపుత్రినిజస్థితిఁ జూచి వచ్చెదం
గింకరధర్మవృత్తి పరికింపఁగ వంచన కీర్తిహేతువే.

16


చ.

పొరిఁబొరి లంకలో వెదకి భూసుతఁ గాంచెదఁ గానకుండినం
గర మమరావతిన్ వెదకి కాంచెద నందును గానకున్న ని
ర్జరరిపుఁ బట్టి కట్టి పెలుచం గొనివచ్చెద నొండె వానితో
నురవడి లంక వే పెఱికి యుద్ధతిఁ దెచ్చెద రామునొద్దకున్.

17


క.

జానకి వెదకెద నని యా, భూనాయకునెదుర భానుపుత్రుం డలరన్
వానరవీరులు మెచ్చఁగఁ, బూనితి నే రిత్త మగిడి పోయిన నగరే.

18


వ.

అనుచు మహోత్సాహంబున.

19


క.

ఇనపవనశక్రచతురా, ననసాగరములకు వందనము చేసి మనం
బున రామలక్ష్మణులకు, వినయంబున మ్రొక్కి బంధువితతిం బ్రీతిన్.

20


క.

వలగొని యాలింగనముల, నలరించుచు వారిచేత నాశీర్వాదం
బులు గైకొనుచును జలనిధి, బలువిడి లంఘింపఁ బూని ప్రాఙ్ముఖుఁ డగుచున్.

21


మ.

సరిపాదంబులు పొందుగా నిలిపి దోస్స్తంభంబు లంకించి ని
ర్భరదర్పంబునఁ బొంగి యున్నమితశుంభద్వాల మభ్రంకష
స్ఫురణోగ్రంబుగ లంకదిక్కు గనుఁగొంచుం గ్రోధరక్తాస్యుఁ డై
గిరి గ్రుంగంబడఁ దాఁచి దాఁటెఁ జటులక్రీడాగతిన్ మింటికిన్.

22


క.

అగచరుఁ డరిగెడుజవమున, గగనాపగదాఁక నెగసి క్రమ్మఱి వచ్చెన్
మొగిఁ దరులు గిరులు దూరా, ధ్వరుఁ డగుప్రియు ననిచి మగిడి వచ్చినభంగిన్.

23


క.

ఆలోఁ గెలఁకుల లఘుతర, తూలికలతెఱంగు దోఁపఁ దోడన జలముల్
జ్వాలికలు దెరలి చన ను, త్తాలగతిన్ నింగిఁ బవనతనయుం డరుగన్.

24

సముద్రము దాఁటుహనుమంతునకు మైనాకం బెదురగుట

వ.

జలనిధి తనచే రక్షితం బైనమైనాకంబుఁ గనుంగొని.

25


చ.

అడవిఁ జరింప రాక్షసవధార్థము వచ్చినరాముపంపునం
గడఁగి మహీసుతన్ వెదకఁగా నిదె పావని వోవుచున్నవా
డుడుగణవీథి లంకవల నొక్కఁడు నొక్కనిమేష మాశ్రమం
బుడుగ హిరణ్యనాభ తగ నూకువ గ మ్మని నెమ్మిఁ బల్కినన్.

26


క.

పారావారముపంపున, మారుతి కొక్కింతదడవు మైనాకం బా
ధారం బగుతలఁపున జల, పూరము కడ లడర వెడలి పొడవుగ నెగయన్.

27


ఉ.

వీఁ డొకరక్కసుం డెడరు వేచి వియత్తలవీథి నడ్డ ము

న్నాఁడు మదాతిరేకమున నా కవరోధము సేయ వేఁడి య
వ్వాఁడిమి మొక్కపుత్తు నని వక్షమునం బఱతెంచి తాఁకినన్
వేఁడిమి విస్ఫులింగములు వెల్వడఁగా ధరణీధరేంద్రమున్.

28


క.

కడిమిం దాఁకినయురవడిఁ, బిడు గడిచినభంగి యైన బిమ్మిటితోడన్
సుడిపడుచు నుండి కొండొక, దడవునకుం దెలిసి నిలిచి తాలిమికలిమిన్.

29


శా.

ఆకాశంబున నొక్కదివ్యపురుషుం డై యాత్మశృంగస్థలిన్
వే కానంబడి పల్కెఁ బేరెలుఁగునన్ వీరోత్తమా యేను మై
నాకంబం బ్రియబంధుకృత్యమునకు న్వారాశి పుత్తేరఁగా
నీ కడ్డం బిటు లైతిఁ గాక కలరే నీ కడ్డ మెవ్వీరులున్.

30


క.

సగరుం డినకులదీపకుఁ, డగు రామునితాత యనఁగ నవనిఁ బ్రసిద్ధుం
డు గుణాంబుధి యంబుధి యా, జగతీపతిపేరఁ గాదె సాగర మయ్యెన్.

31


చ.

అదియును గాక లోకహితుఁ డై యుదయించిన రామచంద్రుపం
పిది శతయోజనం బుదధి యిక్కడఁ గావున నీవు నాపయిం
బదయుగళంబు మోపి పరిపక్వఫలాదులఁ దృప్తిఁ బొంది నె
మ్మదిఁ జను పూజనీయుఁడవు మారుతనందన యెన్నిభంగులన్.

32


క.

మఱియును నొక్కవిశేషం, బెఱిఁగించెదఁ గృతయుగాది నెఱకలతోడం
బఱతెంచి జనపదంబులు, నఱుముగఁ బడుచుండు నెల్లనగములు ధరణిన్.

33


ఆ.

అది యెఱింగి యింద్రుఁ డలుకఁ గొండలఱెక్క, లశనిధారఁ దునుమ నప్పు డేను
భీతిఁ గలఁగి పాఱ మీతండ్రి పవనుండు, జవముతోడ నన్ను జలధిఁ జేర్చె.

34


క.

జలధియు నోడకు మని నను, నెలమిం దనలోన దాఁచె నే నది మొద లా
జలధికిఁ బ్రియ మై యుండుదు, జలధి శరణ్యుండు వృక్షచరవర నాకున్.

35


చ.

అనవుడు నంజనాతనయుఁ డగ్గిరిపుంగవుఁ జూచి నాకుఁ బెం
పొనరఁగ నీ వొనర్చుసమయోచితకృత్యము వచ్చెఁ జూచితే
వనరుహబంధుమండలమువాఁడిమి పొన్పడఁ జొచ్చెఁ బ్రొద్దు లే
దనిమిషవైరివీటికి రయంబున నేఁగుట కార్య మారయన్.

36


క.

ఈమకరాలయ మిట నూ, ఱామడకై దీని కేటి కలయఁగ నద్రి
గ్రామణి యారాజన్యశి, ఖామణిపనికై చనంగఁ గాంచితి ననుచున్.

37


క.

వానరవీరుం డగ్గిరి, పై నటు గే లూఁది గగనభాగంబునకున్
వే నెగసి చనియె నటఁ జనఁ, గా నిట కింద్రుండు వచ్చి గారవ మారన్.

38


క.

గిరివర రఘుపతిదూతకుఁ, బరమాప్తుఁడ వగుట నాకు బంధుఁడ వింకన్
ధర కనురాగం బొసఁగుచు, నురుపక్షద్వయముతోడ నుండుము నెమ్మిన్.

39


క.

అని పల్కి పాకశాసనుఁ, డనిమిషనగరమున కరుగ నమరప్రభృతుల్
చని సురసాఖ్యం బన్నగ, జననం గని యిట్టు లనిరి సమ్మద మారన్.

40

మ.

కడుఁ దెంపార సమీరసూనుఁడు మహోగ్రగ్రాహసంచార మై
నడుమన్ వారిధి యుండఁగా నరుగుచున్నాఁ డభ్రమార్గంబునం
గడఁకన్ లంకకు జానకిన్ వెదక నింకం కార్య మె ట్లౌనొ యి
క్కడ నివ్వీరవరేణ్యుఁ డొక్కరుఁడు పెక్కం డ్రక్కడన్ రక్కసుల్.

41


తే.

అని విచారించి సుర లెల్ల ననిలసుతుఁడు
సాగి యిదె వచ్చె నితఁడు దుర్జయుఁడొ కాఁడొ
నీవు నని వేగ మవ్వీరులావుకొలఁది
యరయఁ దగు నన్న నగుఁ గాక యనుచు సురస.

42

సురసాసింహికలనిరాకరణము

ఉ.

దారుణ మైనమే నమరఁ దా నొకరక్కసి యై చెలంగుచున్
మారుతవీథి నంబునిధిమధ్యమునం బఱతెంచి పల్కె నో
రోరి వెడంగువానర మదోద్ధతి నెక్కడఁ బోయె దింక నా
హారము గమ్ము నా కని గుహాసదృశం బగునోరు విచ్చినన్.

43


క.

ఆరక్కసిఘోరాకృతి, మారుతతనయుండు సూచి మానిని విను మే
నారాముబంట రావణుఁ, డారఘువరుదేవి దండకారణ్యమునన్.

44


క.

మాయం జెఱగొని పోయెం, బోయినయాచొప్పు వెదకఁ బోయెద నాభూ
నాయకుసతిఁ గని వచ్చెద నీయాఁకలి దీర్చికొనుము నెఱి నటమీఁదన్.

45


ఉ.

అ ట్టనుమాటకుం గెరలి యారజనీచరి భీకరాకృతిన్
నెట్టన దృష్టిజాలముల నిప్పులు రాల మహాట్టహాససం
ఘట్టన నాకసం బద్రువఁగా వివృతానన యయ్యె నైన నే
నెట్టును జిక్క దీని కిటు లేటికి నంకిలి నాకు నిక్కడన్.

46


మ.

అని యూహించుసమీరపుత్రుని రయం బారన్ భుజంగాంబ గ్ర
మ్మన మ్రింగన్ దశయోజనాయతముగా నాస్యంబు వే పెంచినం
గని తానున్ దశయోజనాయతమహాకాయుండు గా నింతి గ
న్గొని తా వింశతియోజనాయతముగాఁ గ్రూరాస్యమున్ విచ్చినన్.

47


సీ.

అతఁడు త్రింశద్యోజనాయతతనుఁడు గా, నురగాంబ నలువదియోజనముల
యంతనో రెత్తిన నాతఁ డేఁబదియోజ, నములంతవాఁ డైన నాగజనని
వెస షష్టియోజనవిసృతాస్య గాఁగ వా, నరుఁడు డెబ్బదియోజనములయంత
ఘనుఁడైన సురసాఖ్య యెనుబదియోజన, ములయంత వివృతాస్యబిలముఁ బెంప
మారుతి నవతియోజనమానుఁ డగుచు, నమర నాకాంత శతయోజనములయంత
వివృతవక్త్రంబు సూప నవ్వీరవరుఁడు, మఱి పయోదముగతి మేను కుఱుచపఱిచి.

48

తే.

చిత్రతరభంగి నంగుష్ఠమాత్రుఁ డగుచు, దానిజఠరాంతరము సొచ్చి తాన మరలి
వదనమార్గంబు వెలువడి వచ్చి నగుచు, నోనిశాటి నీయాఁకలి యుడిగెనోటు.

49


చ.

అరుగుట సెప్పి రాకతల నాఁకలి దీర్చెద నన్నఁ జాల వే
గిరపడుచున్కి నీయుదరగేహము సొచ్చితిఁ జక్క వచ్చితిన్
నరపతికార్య మేఁగెద ననం దనరూపముతోడ నిల్చి యా
సురసయు ని ట్లనుం బవనసూనుఁ గనుంగొని సమ్మదంబునన్.

50


క.

అతిబలులు నిశాచరు లని, హితమతి నీలావు సూడ నేఁ గపివర వ
చ్చితి దివిజులపంపున నూ, ర్జితశక్తివి గాన నీకు సేమం బెందున్.

51


ఆ.

అనుచు నురగజనని తనలోకమున కేఁగె, నంత నింగి వెలుఁగ ననిలసుతుఁడు
రఘుకులేంద్రుఁ డలిగి రాక్షసపురముపైఁ, బఱుపుచిచ్చఱమ్ముపగిది నిగిడె.

52


క.

ఘనవీథిం జనుహనుమం, తునికాయచ్ఛాయ చూడ దోఁచెను దశయో
జనవృత్తముఁ ద్రింశద్యో, జనదీర్ఘము నగుచుఁ జాఁగి జలనిధినడుమన్.

53


శా.

ఛాయాగ్రాహిణి యైనసింహిక మహాసంరంభ మేపారఁగా
వాయుక్షిప్రతరోగ్రఘట్టనపటుధ్వానంబు దుర్వార మై
మ్రోయం దుంగతరంగభంగ మగునమ్మున్నీటిపెన్నీటిపైఁ
గాయచ్ఛాయ సనంగఁ జూచి చులుకం కి గట్టల్క దీపింపఁగన్.

54


క.

ఉడువీథి కెగసి యార్చుచు, నొడిసి వడిం బట్టి మ్రింగ నురవడి నతఁడుం
గడుపు విదళించి నెత్తుటఁ, దడిసినమే నొప్ప వెడలెఁ దగుణార్కుగతిన్.

55


క.

జలజహితుఁ డప్పు డస్తా, చలమునకుం జనఁగ వృక్షచరవీరుఁడు నా
జలనిధి గడచి సువేలా, చలమునకుం జనియె నధికజవసత్త్వములన్.

56


వ.

ఇట్లు శతయోజనాయతం బగువారాశి ననాయాసంబున దాఁటి యన్నగోపరి
తలంబున నిలువంబడునెడ.

57


క.

తరుచరవీరునిపదహతి, నురవడి గిరి గదలఁ దరువు లూఁగఁగఁ బుష్పో
త్కరములు రాలెన్ ఖచరులు, గురుతరమతిఁ బుష్పవృష్టి గురిసినభంగిన్.

58

హనుమానుఁడు లంకం బ్రవేశించుట

వ.

అంత నయ్యద్రిప్రాంతంబునం గొంత విశ్రమించి సమీరనందనుండు గట్టెదుర.

59


ఉ.

సాలకదంబనింబకుటజవ్రజకింశుకనారికేళత
క్కోలజటాజటాలవటకుంజవిశాలరసాలతాలహిం
తాలతమాలలోలదళదాడిమమంజులవంజులార్జునో
త్తాలమధూకతిందుకవితానవికాసితకాననంబులన్.

60


క.

వికసితనుతకేతకిచం, పకతిలకక్రముకపారిభద్రకకరవీ

రకరంజకురంటకకుర, వకవకుళకపిత్థబిల్వవనవాటికలన్.

61


మ.

దళదిందీవరకైరవోత్కరలసత్కల్హారబంధూకని
ర్మలరాజీవముఖప్రసూనరసధారాస్ఫారకల్లోలచం
చలలోలాంతరకేళిలోలకలహంసక్రౌంచచక్రవ్రజా
కులకారండవభృంగభాసురసరిత్కూలంబులం జూచుచున్.

62


మ.

పరిఘాభీలము వప్రదుర్గము ఘనప్రాకారఘోరంబు గో
పురనానాద్భుతయంత్రభీకరము సంపూర్ణాస్త్రశస్త్రధ్వజ
స్ఫురదట్టాలకజాలభీషణము రక్షోవీరదుస్సాధముం
దురగస్యందనమత్తసింధురభటస్తోమాతిభూయిష్ఠమున్.

63


వ.

అయి నెఱయ మెఱయుచు మఱియును గగనోల్లేఖరజతిశిఖరిశిఖరంబునుంబోలె
నభ్రంకషం బై తనరుచుఁ గ్రూరోరగసంకీర్ణం బగుభోగవతీపురంబునుంబోలె దం
ష్ట్రాకరాళముఖులు నాభీలశూలపట్టిసహస్తులు నైనరక్షోవీరులచేత వెలుంగుచు
నానాధనవిరాజితం బై యలకాపురంబునుంబోలె వెలయుచున్న లంకాపురంబు
గనుంగొని యరుదందుచు నుత్తరద్వారంబు సేరి.

64


తే.

అరసి చూడ సురాసురదురధిగమము, చతురుపాయప్రయోగదుస్సాధతరము
గాన కపు లెంతవార లిక్కడిఁదిపురము, సేరి యారాఘవుఁడు నేమి సేయఁగలఁడు.

65


క.

రావణుఁడు లోకభయదుఁడు, గావున వాఁ డెఱుఁగకుండఁ గనుమొఱఁగి పురం
బేవిధిఁ జొచ్చెదనో మఱి, యే విధమున నేను సీత నీక్షించెదనో.

66


క.

జనకజ నేకాంతంబునఁ, గనుఁగొనియెద నేన యొరులు గానకయుండం
దనుమధ్యకలిమి యెట్లొకొ, చని చూచెదఁ గాక యిచట సందియ మేలా.

67


క.

రక్కసులు వెక్కసంబుగ, దిక్కుల నన్నింటఁ గడిమిఁ ద్రిమ్మరుదురు న
న్నిక్కడఁ గనుఁగొనఁ కార్యము, చిక్కును నా కిచట నింత చెల్లదు నిలువన్.

68


తే.

ఏను యాతుధానుఁడ నైన నితరజనుఁడ, నైన నెఱిఁగి నివారింతు రపుడ నన్ను
గాలి కైన రక్కసులకుఁఁ గానఁబడక, సురిఁగి యీపురద్వారము సొరఁగరాదు.

69


వ.

అనుచు నొక్కముహూర్తమాత్రంబు చింతించి ధీమంతుం డగుహనుమంతుండు
తనయద్భుతప్రకారం బగునాకారం బవలోకించి.

70


ఉ.

ఈయురుమూర్తితోడఁ బుర మేను జొరన్ వెఱఁ గంది చూచుచుం
బోయి నిశాటు లాగ్రహము పుట్టఁగ రావణుతోడఁ జెప్ప నాఁ
డాయతశక్తి నన్ను నిట నంకిలిపెట్టిన నప్డు రామభూ
నాయకునాజ్ఞ గైకొనిన నాపని చెల్లక గాలివోవదే.

71


ఉ.

కావున రామచంద్రుపని గైకొని చేయఁగ నేభయంబు నా
కేవిధి గాకయుండ నను నెవ్వరుఁ గానక యుండ నాత్మర
క్షావిధ మొప్ప సూక్ష్మతరగాత్రము దాలిచి రాత్రివేళ లం

కావరణంబు సొచ్చి కడఁకన్ సతి నంతటఁ జూచి కాంచెదన్.

72


వ.

అనుచు సూర్యాస్తమయసమయం బవలోకించునెడ.

73


క.

నా కెంతయుఁ బ్రియశిష్యుం, డీకపివరుఁ డితనిపనికి నెడగా కుండం
బోక యుచిత మనుకరణి వి, భాకరుఁ డపు డపరశిఖరిపై కరుగుటయున్.

74


క.

భానుఁడు నాపగవాఁ డా, భానుకులునిసతిని వెదకుపని వచ్చిన ని
న్నే నేల మహిసుతం బొడ, గానఁగ నిత్తు ననుకరణి ఘనతమ మడరన్.

75


వ.

కనుంగొని యమ్మహీధరసన్నిభం బగుతనగాత్రంబు సంకోచించి యణుమాత్ర
దేహుం డగుచుఁ దత్పురగోపురప్రాసాదాధిరోహణంబు సేసి సమంచితకాంచన
ప్రాకారంబులు నీలప్రవాళముక్తాఫలవైదూర్యరజతకనత్కనకశోభితంబు లగు
గృహంబులుం గలలంకాపురంబు గలయం గనుంగొనుచు నమ్ముందట రుచిరవై
దూర్యవజ్రోపలతలంబులు నిర్మలస్ఫటికపద్మరాగాంతరసికతాపూరంబులు ముక్తా
మణిదామాభిరామంబు లైనహాటకస్తంభంబులు మణిప్రభాభాసమానజాంబూ
నదసమున్నతవేదికలు నానారత్నసౌపానసంతానంబుల భర్మనిర్మితసాలభంజికలు
నింద్రచాపానురూపవివిధమణివిచిత్రచిత్రితతోరణంబులుఁ జారుచామీకరమం
డితనూతనకేతనంబులు నుద్దామాభిరామక్రీడాద్రిహేమశృంగంబులు నభినవ
రత్నఖచితసువర్ణపూర్ణానల్పశిల్పాభిశోభితద్వారంబులు వీరభటవారణతురగ
స్యందనసంచారరణన్మిణిగణకింకిణీశింజితమంజుమంజీరాదిభూషణఘోషణంబులు
నిరంతరావార్యతూర్యఘోషంబులు నాసన్నజలధిప్రతిఘోషంబులుం గలిగి
హంసక్రౌంచమయూరపారావతసేవితంబులు సాంద్రచంద్రికాధౌతమయంబులుఁ
బ్రచురలసదిందిరంబులు నగు శుభమందిరంబులుం గలిగి విచిత్రమాణిక్యమయ
వస్త్రయు గోష్ఠాగారావతంసయు శాతకుంభకుంభస్తనయును రత్నదీపికానిర
స్తసదనాంధకారయు నగుచు విలాసినియనుంబోలె వెలయుచున్న రావణునగ
రంబు గనుంగొని విస్మితాంతరంగుండును సీతాదర్శనోత్సుకుండు నగుచు నాసౌ
ధంబు డిగ్గె.

76

హనుమంతుండు లంక యనునిశాటిని నిగ్రహించుట

క.

అటు చూచి డిగ్గి తగ ముం, దటఁ జనునెడ లంక పవనతనయునిఁ గని యు
త్కటపటునిటలతోటోగ్ర, త్కుటిలతరభ్రుకుటివికటఘోరాకృతి యై.

77


ఉ.

ఎక్కడిమర్కటాధముఁడ వెవ్వఁడ వేటికి నోట లేక నీ
విక్కడ వచ్చినాఁడవు సురేంద్రభయంకరుఁ డైనరావణుం
డెక్కుడుచేవ నేలుపుర మేరికిఁ జేరఁగ వచ్చు నిమ్మెయిన్
నిక్కము చెప్పు మే నెఱుఁగ నీతెఱఁ గంతయు విన్నమీఁదటన్.

78


శా.

కింకన్ నిన్ను వధించి పుచ్చెద ననం గీశప్రభుం డప్పు డా
లంకన్ నీవు నిశాటి వేమి ధృతి నేలా నన్ను భర్జించె దా

తంకం బొందక యున్నదానవు పురద్వారంబునం దింక ని
శ్శంకన్ బొంకక చెప్పు మన్న నది యాసామీరితో ని ట్లనున్.

79


క.

లంక యనుపేరఁ బరఁగుదు, లంకాపురచోరవర్తులం గడతేర్తున్
లంకాపతియానతి నీ, లంకాపురిఁ గాతు నేను లంకామూర్తిన్.

80


వ.

ఇంక నీవు వచ్చినపని యెఱింగింపు మనిన నతం డి ట్లనియె.

81


క.

ఈపురిఁ గలగృహతోరణ, గోపురఘనసాలసౌధకూటప్రాసా
దాపణవనోపవనజన, వాపీకూపములు చూడ వచ్చితి వేడ్కన్.

82


చ.

అనవుడు నన్నిశాచరి భయంకరహుంకృతితోడ నార్చి యి
ట్లనియె వెడంగువానర రక్తయంబున నెక్కడి కేల పోయె దే
పున నిట నన్ను మీఱి మఱి పోదటె నావుడుఁ బోయి వచ్చి నీ
పని మఱి చక్కఁ జేసెద నెపంబు సహింపుము వేగ మేటికిన్.

83


క.

అని యతఁడు పలుకఁ బరుష, ధ్వని నాతనియురము హస్తతలమున వ్రేయం
గనలి నిశాచరికే లు, క్కునఁ గమియఁగఁ బట్టి భీతి గొనఁ దిగిచి వడిన్.

84


క.

పిడుగుగతిన్ బెడిదం బగు, పిడికిట వక్షంబుఁ బొడువ బిమ్మిటితోడం
బుడమిఁ బడి నోరు దెఱవఁగఁ, గడతేర్పఁడు దానిఁ గరుణఁ గామినియనుచున్.

85


సీ.

అంత గద్గదికతో నాలంక హనుమంతుఁ గనుఁగొని ననుఁ గావు కపివరేణ్య
వినుము చెప్పెద మున్ను విన్నవృత్తాంతంబు, వనచరుఁడొక్కఁడుఁ జనకతనయ
వెదక నెప్పుడు వచ్చి వే నిన్ను భంజించు, నది యాదిగా లంక యడఁగఁగలదు
రావణుండును సర్వరాక్షసోపేతుఁ డై, సీతనిమిత్తంబు చేటు నొందు
ననుచు నజుఁడు నాతోఁ జెప్పె నమ్మహాత్ము, పలు కమోఘంబు గావునఁ బలికినట్ల
యగు సమస్తంబు నీ వింక నతులబలుఁడ, వెందు వలసిన నేఁగు నీ కెదురు గలదె.

86


వ.

అనిన విని యంత నాలంక నతిక్రమించి హనుమంతుండు తద్ద్వారంబు సొరక
లంకాప్రాకారంబు దాఁటి మాతంగమదసౌరభవాసితంబును బుష్పమౌక్తికవిరా
జితంబును వివిధసౌధాభిశోభితంబును నానాగృహవిలసితంబును నగు రాజమా
ర్గంబున మంజులమంజీరసమంచితకాంచీనినాదంబులుఁ బంచమహాశబ్దంబులును
మదభరాలస లైనసుదతులమధురగీతంబులును రక్కసులయట్టహాససింహనా
దాదినాదంబులును వినుచు నెడనెడ గృహంబులు గలయం గనుంగొనుచు మం
తనంబు లాడువారివలను సేరి యరయుచు రావణస్తుతిపరాయణు లగురక్షో
వీరుల నాలోకించుచు వచ్చి మధ్యమగుల్మంబున జటిలకేశులు నజినాంబరధా
రులు స్వాధ్యాయనిరతులు నైనవారలం బరికించుచు మాల్యభూషితుల నేక
కర్ణుల నేకాక్షుల నేకపాదుల నేకహస్తుల లంబోదరపయోధరులం గరాళుల
భుగ్నవక్త్రుల వికటుల నుత్కటుల వికృతోరఃస్కంధశిరస్కుల నతికుబ్జుల నతి
దీర్ఘుల నతిస్థూలుల నతికృశుల విరూపుల సురూపులఁ బరిఘపట్టిసపరశుప్రా

సాసిదండభిండివాలతోమరశూలచక్రగదాముసలముద్గరచాపబాణఖడ్గశతఘ్నీ
హస్తులను జిత్రవర్మధారులను జూచుచు నర్కసంకాశహేమప్రకాశంబును బద్మ
కైరవకల్హారాదిపుష్పవిలసితపరిఖావలయితంబును నగునగరంబు వీక్షించుచు
హేషాఘోషంబుల బృంహితస్వనంబులఁ గలధౌతనగోన్నతచతుర్దంతదంతా
వళంబులఁ జారుతురంగంబుల గజదానధారాపంకిలప్రదేశంబుల వీరభటసంకు
లాలాపంబుల సేవాగతాంగనాశింజితంబుల ద్వార పాలకు లదలించుచండహుం
కృతులఁ జెలఁగురావణునగరద్వారంబుఁ జేరునట్టియెడ.

87


క.

చేకొని చూడఁగ నొప్పెం, బ్రాకటముగ లంకమీఁద బహుతారాపూ
ర్ణాకాశం బెత్తినము, క్తాకీలితనీలపటవితానముభంగిన్.

88


క.

పావనికి సీతి వెదకం, గా విశ్వము గానిపింప ఘనతమ మడఁపన్
దేవత లెత్తినదీపము, కైవడిఁ జందురుఁడు వెలిఁగె గగనతలమునన్.

89


వ.

ఇట్లు వెలుంగుచందురుం గనుంగొని హనుమంతుం డలరి యానగరద్వారంబు
సొచ్చి యరయుచుం జని ముందట.

90

హనుమంతుండు లంకాపురంబున సీతను వెదకుట

సీ.

వరవజ్రగర్భితవైదూర్యతలముల, భాసురస్ఫటికసౌపానరాజి
మణిహారచారుహేమస్తంభపంక్తులఁ, జిత్రకాంచనరత్నశిఖరవితతి
విలసితనవరత్నవేదిరంగంబుల, ద్వారచిత్రితరత్నతోరణముల
మహితముక్తాదామమయవితానంబుల, బహుచిత్రశోభితభద్రవలభిఁ
దనరి వీరరాక్షసరక్షితంబు వార, యువతిసేవితమును మంత్రియుతము వివిధ
చిత్రమృగచర్మవర్మరాజితము నగుచు, వెలయునాస్థానసదనంబు గలయ వెదకి.

91


చ.

పరువడి నాపణంబులఁ బ్రభామయభూముల మండపంబులన్
ద్విరదరథాశ్వసద్మముల , వీథుల రచ్చల వేశపంక్తులన్
గిరికటకంబులన్ గుహలఁ గేళిగృహంబుల గుళ్ల వప్రగో
పురముల హర్మ్యసౌధముల భూసురశాలలఁ జిత్రశాలలన్.

92


క.

నారులసదనంబుల నధి, కారులగేహముల యక్షగరుడోరగబృం
దారకకిన్నరనారీ, కారాగారోపకారికాభవనములన్.

93


వ.

మఱియుం గుంభకర్ణవిభీషణమహోదరమహాపార్శ్వప్రహస్తవిద్యుజ్జిహ్వవిద్యు
త్కర్ణవిద్యున్మాలిజంబుమాలిసుమాలిశుకసారణవజ్రదంష్ట్రవజ్రగ్రీవవజ్రకాయ
కటవికటఘనప్రఘనహస్తిముఖనాగేంద్రజిహ్వాకరాళవిశాలాంత్రాగ్నికేతురశ్మి
కేతుసూర్యశత్రుసంపాతివిరూపాక్షధూమ్రాక్షభీమాశోణితాక్షౌష్టమస్తకమ
త్తోన్మత్తకుంభనికుంభదేవాంతకనరాంతకాతికాయమహాకాయకంపనాకంపనమ
కరాక్షమేఘనాదాక్షాగ్నివర్ణత్రిశిరఃప్రముఖయాతుధానగృహంబుల లీలోద్యా
నంబుల వెదకి యచటం గానక చనిచని పురోభాగంబున నయనాభిరామం బగు

నొక్కమహాహేమధామంబుఁ బొడగని చొచ్చి యచ్చట నొరు లొరులం గౌఁగి
లించుకొని తమతమవదనంబులు నుదరంబు లూరులు నారులు నాభిమూలం
బులుం గక్షమూలంబులుఁ జన్నులు వెన్నులు బయల్పడం దనువులు మఱచి
నిద్రించువనితాజనంబుల నవలోకించి పరదారమర్మనిరీక్షణభయంబునం గలంగి.

94


ఉ.

అక్కట బ్రహ్మచారి నిటు లన్యపురంధ్రులగాత్రమర్మముల్
దక్కక చూచితిం గదిసి ధర్మవిహీనుఁడ నైతి నాకు నిం
కెక్కడిపుణ్యలోక మని యెంతయుఁ జింతిలి యాత్మలోపలన్
నిక్కము గాఁగ ధర్మపథనిర్ణయనిర్మలబుద్ధి దోఁచినన్.

95


క.

మన సేమిటిపైఁ దగులమిఁ, దనరం గామించునట్లు తగ మేలును గీ
డును నగు నే నీయింతుల, మనమునఁ గామించి చూడ మన్మథవశతన్.

96


క.

సుదతిని సుదతులలోపల, వెదకక మృగకులములోన వెదకుదురే యీ
సదనంబులలో నృపుసతి, వెదకక యొండెడల నాకు వెదకఁగ నగునే.

97


వ.

అట్లు గాన యే నిక్కాంతల మదనవికృతమానసుండ నై చూడ నింతియ కాదు
పుణ్యశ్లోకుం డగురామునిపంపున వచ్చిన నాకు నెందును శుభంబె యగు నని య
చట నచట వెదకుచు నగ్రభాగంబున నొక్కదివ్యవిమానంబు పొడగని.

98


తే.

వెలయ విమానంబు దా విశ్వకర్మ, యర్ధయోజనవృత్తంబు సార్ధయోజ
నాయతము గాఁగ నజునకు యమకుబేర, వరుణమందిరములకంటె వఱలఁజేసె.

99


క.

వారిజగర్భునకుం దప, మారఁగఁ గావించి కాంచె యక్షేశుఁడు దు
ర్వారగతి నతని గెలిచి యు, దారుఁడు రావణుఁడు గొనియె దత్పుష్పకమున్.

100


చ.

ఉరుతరభర్మనిర్మితము నుజ్జ్వలరత్నమయంబుఁ బ్రస్ఫుట
స్మరణసమాగతంబు గృహమధ్యగృహప్రకరంబు లోకసుం
దరమును విశ్వకర్మరచితంబును బుష్పసుగంధిదీపస
త్పరిమళితంబుఁ గామగమభద్రవితానవిమానరాజమున్.

101


సీ.

వరవజ్రవైదూర్యమరకతవేదియుఁ, చారుమౌక్తికనీలజాలకంబుఁ
దపనీయమణిమయస్తంభవిభ్రమమును, బహుమణిస్ఫటికసౌపానయుతము
మాణిక్యకుట్టిమమహితకుడ్యంబును. జిత్రకాంచనరత్నపుత్రికంబుఁ
బ్రథితవజ్రోపలప్రాకారరుచిరంబు, భానునిభప్రభాభాసురంబు
మేరుమందరసదృశఁబు మేఘమార్గ, చరము నగునవ్విమానంబు సరగ నెక్కి
యందు వేవురుకాంతల నారఁ గాంచె, నధికనిద్రాపరాయణ లైనవారి.

102


వ.

అక్కాంతలు మధుపానమదవ్యాయామంబుల నలసి నిద్రాపరవశ లై కొందఱు
తిలకంబులు దుడిచియుఁ గొంద ఱందియ లూడిచియుఁ గొండఱు వలువలు
విడిచియుఁ గొందఱు పుష్పమాలికలు దలం జుట్టుకొనియుఁ గొందఱు గెలంకుల
హారంబులు వ్రాలం గొందఱు మేఖలలు మెలికలువడం గొందఱు పర

స్పరావయవంబు లాలింగనంబు సేసి పతుల కా నలరుచుం గొందఱు భూషణం
బు లూడి నెఱయఁ గొందఱు తమతమవదనంబులు కమలంబు లని తావులకుం
దేంట్లు ముసర వివృతవదనలు నిమీలితనయనలు వికీర్ణకేశపాశలు నగుచు
మఱియును.

103


చ.

అలఘునితంబసైకతచయంబుల నాభిసరోవరంబులన్
విలసదురోజచక్రముల వేణిభరాళులఁ జారులోచనో
త్పలముల భూతరంగముల బాహుబిసంబుల వక్త్రపంకజం
బులఁ దగి సుప్తవాహీనులకపొల్పున నొప్పెడువారిఁ జూచుచున్.

104


వ.

చని కాంచవచతుస్స్తంభదీపంబులు దశకిరీటమణిదీపంబులు వెలుంగ దుకూ
లాస్తరణశోభితతల్పంబు కైలాసకల్పం బగుచు నమరం గనుంగొని యరుదందు
చుఁ జప్పుడు కాకుండ నల్లనల్లనఁ జేర నరిగి.

105


సీ.

కనకాంబరము తటిత్కల్ప మై విలసిల్ల, మేచకాభ్రముభంగి మేను మెఱయ
రమణీయతరలిప్తరక్తచందనచర్చ, కలితసంధ్యారాగకాంతిఁ దనర
భ్రుకుటిరేఖాభీలభూరిఫాలము లొప్ప, దంష్ట్రాకరాళాస్యదశక మెసఁగఁ
గుండలమణిరుచుల్ గండభిత్తుల నిండ, మణిముద్రికలు వేళ్ల ఘృణుల నీన
నభ్రగజగంతకులిశవ్రణాంకములను, దనరుబాహుల రత్నాంగదంబు లమర
వారికడ నిద్రవోవురావణునిఁ గాంచె, నమరలోకవిద్రావణు ననిలసుతుఁడు.

106


మ.

అమరేంద్రధ్వజదిక్కరీద్రకరపంచాస్యోరగశ్రేణిచం
దమునం జేతులు శయ్యపై నమరఁగాఁ ద న్పొప్ప మంథాచలే
న్ద్రముభంగిన్ మదశోణితాక్షుఁ డగుచున్ నాగేంద్రపూత్కారఘో
రముగా నూర్పులు పుచ్చురావణునిపకర్యంకప్రదేశంబునన్.

107


వ.

కొందఱు కాంతలు నయనాభిరామంబులుగా విచిత్రగతుల నాడియుఁ గర్ణామృ
తంబులుగాఁ బాడియు శ్రుతిసుఖంబులుగా వాయించియు నలసి విపంచివీణా
దులు మురజమృదంగపణవడిండిమాదులు కౌఁగిలించుకొని పరవశ లై యుండ
వారలం జేర నరిగి.

108


ఉ.

మేదురనీలనీరదసమేతతటిల్లతమాడ్కిఁ బంక్తికం
ఠోదితగాత్రసన్నిధి సముజ్జ్వలకాంచనకాంతి నొప్పుమం
దోదరిఁ గాంచి సీత యని యుబ్బుచు నాడుచుఁ గంటి నింక స
మ్మోదము గంటి నంచుఁ గపిముఖ్యుఁడు గ్రమ్మఱఁ జూచి తజ్ఞుఁ డై.

109


మ.

అరయంగా నిది నిర్మలాంబరసుగంధాకల్పయుక్తాంగి యా
దరణీయానవవాసితాస్య రుచికృత్తాంబూలరాగాంచితా
ధర యుత్ఫుల్లనవప్రసూనవిలసద్ధమిల్ల కేళీకృత

స్మరముద్రాంకితకంఠగాఢసురతశ్రాంతప్రసుప్తాక్షియున్.

110


క.

కానీ యిది పంక్తికంఠుని, మానిని గానోపు నకట మతిహీనుఁడ
యే నొండుగాఁ దలంచితి, భూనాయకుపుణ్యసాధ్విఁ బూతచరిత్రన్.

111


చ.

ధరణిజ పుణ్యసాధ్వి వినుతవ్రత పావని సీత లోకసుం
దరి త్రిదశేంద్రవంద్య గుణధాముని రామునిఁ బాసి యన్యకా
పురుషుల శయ్యపై నిదుర వోవునె పుష్పసుగంధభూషణో
త్కరములు దాల్చునే మధువు ద్రావునె భోగము లిచ్చగించునే.

112


వ.

కాన యిది జానకి గా దనుచు నచ్చోటు వాసి పానశాల కరిగి యందు నొక్కెడ
నిర్మలహర్మ్యప్రదేశంబునఁ జందనమృగమదపంకంబులం గలయ నలికి ఘనసార
రేణువులు సల్లి వివిధకుసుమవిసరంబులు నెఱపి నలుదిక్కుల ముక్తాఫలంబుల
రంగవల్లికలు దీర్చి నడుమ నజమృగవరాహిమహిషకుక్కుటమయూరప్రముఖ
ప్రాణిపలలంబులు రాసులుగాఁ బోసి పుష్పమాలికాక్షతవేష్టితంబు లైనయిక్షు
రసాసవమధ్వాసవపుష్పాసవపూర్ణంబు లగుస్ఫటికమణిమయకలధౌతశాతకుంభ
కుంభంబులు దిరిగిరా నిడి వాసనాపూర్ణసుగంధకుసుమంబులు నామ్లలవణాది
షడ్రసంబులు ఘృతార్ద్రకాదిమిశ్రితంబు లైనమృగసూకరచ్ఛాగమహిషకు
క్కుటమయూరాదులకఱకుట్లు నుప్పుఁగండలుఁ బందివాళ్లు నించినకనకరజతస్ఫ
టికచషకంబు లెల్లెడల నిలిపి వివిధలేహ్యపేయఖాద్యాదివస్తువుల నానాఫలం
బుల మహోపహారంబులు సేసినపాసప్రదేశంబులు సూచి వెఱఁగందుచు బహు
ప్రకారంబులఁ బాసక్రియలు సలిపి మదావేశంబున సొలసి యొండొరులం
గౌఁగిలించుకొనియు నితరేతరవస్త్రంబులు పైకిఁ దిగిచికొనియు విగతవసన లై
నిద్రించువనితాసహస్రంబులఁ గలయం గనుంగొనుచుఁ గస్తూరికాగంధసార
ఘనసారాంగరాగకుసుమవిలసితాసవపరిమళమిళితపవనాఘ్రాణంబు సేసి యరు
దందుచు నవ్విమానాధిరాజంబు డిగ్గి యొక్కెడ నిల్చి యంతర్గతంబున.

113

హనుమంతుఁడు సీత కానరామికిఁ జింతించుట

చ.

కొలఁకుల నిష్కుటావళులఁ గుంజతలంబులఁ గేళిమందిరం
బుల నదులం దటాకములఁ బుష్పగృహంబుల సెజ్జపట్లఁ బ
ల్వలముల భూగృహంబుల బిలంబుల రచ్చల దుర్గమస్థలం
బుల గిరులన్ వనోపవనభూముల గొందులఁ బానశాలలన్.

114


క.

సొలవక నిలువక మఱియును, గలదిక్కుల నెల్ల లంకఁ గలగుం డిడి యె
వ్వలనను నెల్లెడ నెడపక, కలయఁగ వెదకితి మహీజఁ గానన యెచటన్.

115


వ.

అని వెండియు.

116


క.

సురగరుడోరగరజనీ, చరఖేచరసిద్ధసాధ్యచారణవిద్యా
ధరనరకిన్నరయక్షా, సురకాంతలఁ గంటి రాముసుదతిం గానన్.

117

క.

వనధిఁ గని హృదయ మవిసెనొ, తనుఁ గైకొనకున్నఁ గనలి దశకంఠుఁడు మ్రిం
గెనొ వికృతఘోరరాక్షస, జనఘనరూపములు సూచి సమసెనొ భీతిన్.

118


మ.

సతి నా కెక్కడఁ గానరా దలిగి రక్షస్స్త్రీలు భక్షించిరో
పతి భావించుచుఁ బ్రాణముల్ విడిచెనో పౌలస్త్యుచేఁ దప్పి యు
ద్ధతి నంభోనిధిఁ గూలెనో దశముఖోద్యద్భాహుసంపీడనా
న్విత యై స్రగ్గెనొ పంక్తికంఠుఁ డెడగా వే ఱొండుచో డాఁచెనో.

119


సీ.

జానకిఁ బొడగాన కేను బోయినఁ జూచి, మనుజేంద్రుఁ డప్పుడ మరణ మొందు
నన్నకు శోకించి యనుజుండు మృతిఁ బొందు, వార లిద్దఱు లేని వార్త యెఱిఁగి
భరతశత్రుఘ్నులుఁ బ్రాణముల్ విడుతురు, జనను లద్దశ సూచి చత్తు రోలిఁ
గాకుత్స్థకుల మంతఁ గడతేఱు రాఘవుల్, దెగఁ జూచి రవిజుఁడుఁ దీఱు నతఁడు
దీఱఁ దత్పత్ని రుమ దీఱు దినపసుతుని, వాలిఁ దలఁచి తార నశించు వారి కడలి
యంగదుఁడుఁ జచ్చుఁ గపు లెల్ల నంతఁ బొగిలి, వివిధగతుల జీవంబులు విడువఁగలరు.

120


ఆ.

కాన రాముకులముఁ గపికులంబును ద్రుంప, నేను బోవఁ జాల నెదుర నన్నుఁ
గాంచి గారవమునఁ గంటె జానకి నన్న, వెరవు మాలి రామవిభునితోడ.

121


క.

భూమిజఁ గానన యే నని, భీమానలతప్తసూచిభేదనబాధో
ద్దామం బగుదుర్వాక్యము, లే మని వినిపింతు నెదుటి కే మని పోదున్.

122


క.

జానకిఁ బొడగని రాఁ గల, నే నని నా కెదురుచూచుహితవానరసం
తానము నే మని చేరుదు, భానుజుముందఱికి నేమిపని యై పోదున్.

123


క.

జానకిఁ గానక యుండిన, వానప్రస్థుండ నగుదు వనధిం బడుదున్
మేను ఖగావలి కిత్తు మ, హానలముఖశిఖలు సొత్తు హితవిధిఁ జత్తున్.

124


క.

నిశితబలదర్పితుం డగు, దశముఖు విదళించి రామధరణీశునకుం
బిశితోపహార మిచ్చెదఁ, బశుపతికిం బశువుఁ జంపి బలి యిచ్చుక్రియన్.

125


క.

మ్రుచ్చిలి రఘుభూపతిసతిఁ, దెచ్చినదుర్వృత్తికిం బ్రతీకారముగా
మచ్చటులముష్టిహతుల వి, యచ్చరకంటకుని దర్ప మడఁచి వధింతున్.

126


మ.

అటు గా కుర్వి సమస్తముం బెఱికికొం చారాముఁ డీక్షింప నం
తట శోధించెద సీతఁ జూపు మని వేధం బట్టి బాధించెదం
బటురోషమ్మునఁ బాఱ మీటెద వడిన్ బ్రహ్మాండముల్ వీఁక నొ
క్కట లంకాదినిశాటకోటి నుదధిన్ గాలించి [3]కాఱించెదన్.

127


వ.

అని యి ట్లనేకప్రకారంబులఁ దలపోసి నా కిపుడు వేగిరపడ నేల జనకరాజనం
దనం గనుంగొనునందాఁక నిశ్శంక నీలంక నుండి వెదకెద ముందట నొక్కయు

ద్దామారామంబు నయనాభిరామం బగుచు నొప్పారెడు నింతకుము న్నావనం
బుం బరికింపఁ బవనుండును దదీయప్రాంతంబున నురవడి మెలంగ వెఱచి
మెలుపునం బొలయుచున్నవాఁ డందు జనకనందన యుండ నోపుఁ బరికించెదం
గాక యనుచు నిశ్చయించి నిర్మలభావంబున.

128


ఉ.

వాయుతనూజుఁ డప్పుడు శివాయ రమారమణాయ భారతీం
ద్రాయ సురేశ్వరాయ ప్రవర్తనాయ పయోరుహబాంధవాయ చ
న్ద్రాయ వినాయకాయ శమనాయ సమీరసఖాయ పాశహ
స్తాయ నమో నమో యనుచు దక్షత వారికి మ్రొక్కి వెండియున్.

129


క.

వసురుద్రాదిత్యమరు, ద్విసరములకు నశ్వులకును ! విలసిల్లుదివౌ
కసులకు రఘునందనులకు, వసుధాసుత కినజునకును వరమునితతికిన్.

130

హనుమంతుఁ డశోకవనంబుఁ బ్రవేశించుట

వ.

అతినిష్ఠ నభివందనంబులు సేసి మదీయాభిమతంబు సిద్దింపం జేయుం డని వేఁడు
చు నెప్పు డాజగదేకమాత సీతం బొడగాంచెదనో యనుచుం జూపులు తీపు
లుగొనం జని విశాలసాలచంపకాశోకామ్లవనవేష్టితం బైనతదుపకంఠంబు సేరి
కీరమయూరకాకోలూకకోకిలాలికులసంకులకలరవకోలాహలంబు లాకర్ణించుచు
ధైర్యం బవలంబించి యశ్రులు దుడిచికొని యం దుత్తుంగాగారప్రాకారమండల
మండితంబును మఱియు శారదనీరదావృతంబును నీలజలదమాలికాపరివేష్టితం
బును నైనగతి నవధవళసౌధవలయితంబును దమాలపరివృతంబును నగుచు మెఱ
యునశోకవనంబు గదిసి గదాహస్తు లగుకాలకింకరక్రూరరాక్షసరక్షితద్వారం
బగునాయుపవనంబు సొచ్చి యందు నిద్రాముద్రితాక్షంబు లగుపక్షుల నెగయం
జోపి తత్పక్షవిక్షేపణజాతవాతవిధూతవృక్షవ్రాతకీర్ణకుసుమవిసరసంకీర్ణుండై పు
ష్పగిరియుంబోలె మెఱయుచుం దనుం గనుంగొనినభూతంబులు వసంతుం డన
సకలదిక్కులం జరియించుచుఁ గంపితతరుపతితకుసుమాలంకృతయై విలాసినియుం
బోలె వెలయువసుధ నవలోకించుచు నిజశాఖాలంఘనోత్కంపితపతితఫలకుసుమ
పలాశంబు లగుమహీరుహంబు లొరులచేత వస్త్రాభరణంబు లొలువంబడినకితవు
లుంబోలె ఱిచ్చపడి యుండం గనుంగొనుచు మఱియును దనపాదదంతనఖహతు
లం గంపించి ఫలదళకుసుమంబులు రాలి కొమ్మలు చిక్కి యున్నమహీజంబులు
విలేపనాదివిలాసంబు లెడలి నఖదంతరేఖలం గానంబడువేశ్యాయువతులపగిది
నుండ వీక్షించుచు లలితశ్యామలతమాలంబులు నీలజలదంబులుఁ గుసుమవిసరం
బులు తారకాగణంబులు నరుణపల్లవవృక్షభాగంబు సంధ్యారాగంబునుగా
రెండవగగనం బనం జని తనరం జూచుచుఁ గెంజిగురాకులజొంపంబులు మం
టలు తేఁటిమొత్తంబు లెగయుట పొగ లెగయుటయు ఖద్యోతంబులు విస్ఫు
లింగంబులునుగా జనకతనయకోపాస్తోకశోకాగ్నులవలనం బురి దరికొని మం

డెడువిధంబునను దా నికమీఁద లంకాపురమందిరంబులమీఁదఁ జిచ్చు లి
డుట సూచించుచందంబునను నుండ నరుదందుచు సాలరసాలతాలహింతాల
నారికేళఘనసారఖర్జూరకోవిదారమందారజంబీరతిలకకురవకక్రముకతిందుక
చంపకకేతకీపారిభద్రవకుళనిచుళపాటలలవంగలుంగమాతులుంగనారంగనింబ
కదంబనికురుంబంబుల నరుణసితాసితహరితవర్ణద్రుమంబులఁ గనకకలధౌతపాద
పంబుల మణిప్రవాళస్ఫటికనీలసోపానవితానంబులు ముక్తాసికతాతలంబులుఁ
గమలకువలయకల్హారాదికుసుమంబులుఁ జక్రవాకసారసహంసక్రౌంచకారండవ
ప్రముఖజలవిహంగంబులు మత్తభృంగంబులుం గలకొలంకుల నదులం దటా
కంబుల నీక్షించుచు మృగమహిషవరాహభల్లూకపుండరీకవేదండకంఠీరవప్రము
ఖమృగంబులుఁ గృతకవననదీతటాకంబులుఁ గనత్కనకమణిరజతస్తంభంబులుం
గలిగి యనేకశిఖరంబుల శిలాగృహంబుల నొప్పుచు మేఘసంకాశం బగునొక్కన
గోత్తమంబు గని యన్నగశృంగంబుల కెగసి పరుషధ్వని నురవడిం బాఱి ముం
దట నడ్డపడినవృక్షాగ్రంబులవలన మరలం దొట్టిన నది కోపంబునఁ బ్రియుం
బాసి యలిగి చనం జుట్టలు మరలుప మగిడి ప్రసన్నత బ్రియునొద్దకు వచ్చుప్రి
యకాంతగతి నలరం గనుంగొనుచు నయ్యచలంబు దాఁటి ముందట.

131


చ.

ఫలితసువర్ణపాదపవిభాసితకృత్రిమతీరకాననం
బులు సికతీకృతస్ఫటికభూరిసుమాక్తికవిద్రుమంబులున్
లలితసమగ్రశీతలజలంబులు హేమమయాంబుజోత్పలం
బులు గలవిశ్వకర్మకృతపుణ్యతరంగిణిఁ జేరఁబోవుచున్.

132


క.

అంచితశిఖిదీప్తులు గల, కాంచనతరురుచులు పొదువఁ గపివర్యుఁడు నేఁ
గాంచనమ యైతి నంచుం, గాంచనగిరికరణి నొప్పి ఘనతేజమునన్.

133


వ.

మెఱయుచున్న సమయంబున.

134


క.

తెలువులు దిక్కుల నెఱయఁగ, మలయానిల మల్లఁ బొలయ మధుపము లొలయన్
జలజంబులు నగఁ గుముదం, బులు మోములు వంప వేగుఁబ్రొ ద్దేతెంచెన్.

135


క.

అంత ఖగంబులు మేల్కని, యెంతయు నెలుఁగింపఁ దొడఁగె నింపార రతి
శ్రాంతిని నిద్రించినతమ, కాంతలఁ గాముకులు మేలు [4]కనిపెడుభంగిన్.

136


క.

ఇదె జానకి యిక్కడ ను, న్నది ర మ్మని పిలుచువిధమునన్ వీతెంచెన్
మదకోకిలశిఖికులష, ట్పదకారండవమరాళబకశుకరవముల్.

137


ఉ.

వించుఁ గడంక నేఁగి పరివేష్టితహాటక[5]వేదివిస్ఫుర
త్కాంచనశింశుపాతరువుఁ గాంచె రణచ్ఛతకింకిణీకమున్
సంచితపర్ణపుష్పఫలసాంద్రలతాకము నంతికాశ్రితో
దంచితహేమవృక్షము నుదగ్రశిఖాకలితాంతరిక్షమున్.

138

వ.

ఇట్లు కాంచి వడి దాఁటి యక్కాంచనశింశుపావృక్షాధిరోహణంబు సేసి నలుదె
సలు పరికించి కనత్కనకకమలకువలయకలితజలజాకరంబులును సకలర్తుసమయ
సముదితఫలదళకుసుమలసితారుణసితాసితహరితతరునికరంబులు నుదయరాగసం
కాశపుష్పితాశోకకింశుకషండంబులుం గల్పకసంతానపారిజాతాదినిఖిలవృక్షం
బులుం గలిగి నందనచైత్రరథంబుల కెన యనం దగి నానాప్రసూనరత్నరత్నా
కరం బగుచు బహుగంధబంధురం బగురెండవగంధమాదనం బన నెఱయ మెఱ
యుచున్న యశోకవనమధ్యంబున వివిధప్రాకారసౌధావృతంబును భద్రవిద్రుమ
సోపానభాసమానంబును దప్తజాంబూనదసముదితవేదికావిరాజితంబును ననేక
మణిమయభాసురాసనగృహాలంకృతంబును శాతకుంభస్తంభసహస్రశోభితంబును
నగుచైత్యప్రాసాదంబు గని వెఱఁగందుచు నయనానందకరలసదిందిరమంది
రంబున.

139

హనుమంతుఁడు సీతం గాంచి దుఃఖించుట

తే.

బాలచంద్రనూతనరేఖకపగిది డస్సి, పంకదిగ్ధమృణాళికకభంగి మాసి
వాన లేనివల్లికగతి మేను వాడి, నిగుడు చింతాపరంపర నిండ నలమి.

140


సీ.

కెంగేలు చెక్కునఁ గీలించి యందంద, కనుఁగొనలను బాష్పకణము లొలుక
వెండ్రుకల్ జడగట్టి వేఁడినిట్టూర్పుతో, విన్న నై వదనంబు వెల్లఁ బాఱ
[6]నుపనాసములఁ గ్రుస్సి విపులపీడల వాడి, యురుపంకమున బ్రుంగి యొడలు నలఁగ
దిక్కెవ్వరును లేక దీనతఁ గడుఁ దూలి, వలవంతలోఁ దాఱి 3 వగలఁ బొగిలి
యుగ్రకోపతర్జనముల నుల్ల మవియ, ఘనభయంకరాకారరాక్షసులనడుమఁ
బరుషతరవృకావృత యైనహరిణికరణి, భయముఁ [7]బొంది యలంతమైఁ బరఁగుదాని.

141


వ.

మఱియును.

142


మ.

అతినిందాన్వితకీర్తికైవడి విహీనార్థోక్తిచందంబునం
దతధూమావృతవహ్నిసంగతిని నబ్దచ్ఛన్నచంద్రప్రభా
కృతిఁ బంకావిలగంగభంగి శిశిరక్లిష్టాబ్జినీరీతి మృ
ద్గతమాణిక్యశలాకమాడ్కి మలినాంగచ్చాయతోఁ దూలుచున్.

143


ఆ.

చందురుండు లేనిశర్వరిగతిఁ జక్ర, వాకవిరహచక్రవాకికరణి
దినకరుండు లేనిదినలక్ష్మికైవడి, నొప్పు దూలి యొంటి యున్నదాని.

144


మ.

గళదశ్రూదకసిక్తవక్త్రఁ గుటిలక్రవ్యాదసంతర్జనా
కులచిత్తన్ విరహాగ్నితప్తఁ గృపణం గ్రూరవ్యధాసంశ్రితన్

మలినాంగిన్ సతతోపవాసకృశ రామప్రేమచింతాసమా
కలితన్ శోకసమేత సీతఁ గనియెం గార్యంబు ధుర్యంబుగన్.

145


వ.

ఇట్లు గని యెంతయు సంతసిల్లి యంతర్గతంబున.

146


క.

ఏమేమితొడవు లున్నవి, భూమిజ కని మున్ను చెప్పె భూపతి నాతో
నీమెయి నాతొడవుల యీ, రామకు నున్నవి మహాభిరామము లగుచున్.

147


క.

గగనగతి నరుగునప్పుడు, నగచరు లీక్షింప నాఁడు నగశృంగమునం
దగిలినపైచేలయు నీ, మగువ ధరించినదియును సమానాంబరముల్.

148


క.

ధారుణిపై దిగవిడిచిన, యారాజోత్తమునిదేవియాభరణము లీ
నీరేజాస్యాభరణము, లారయఁగా నొక్కమేనియాభరణంబుల్.

149


క.

పతి మును చెప్పినగతి నీ, సతి కున్నవి హేమపట్టసమవస్త్రము నం
చితరత్నకంకణంబులుఁ, దతకాంచనకర్ణవేష్టితములుం దనరన్.

150


వ.

కావున నిక్కారణంబు లన్నియుఁ గల్గుటం జేసి యిద్దేవియ రాఘవేంద్రుదేవి
యని కృతనిశ్చయుం డై మఱియును బోలం గనుంగొనుచుఁ దనమనంబున.

151


క.

నరపతి సెప్పినగతి నీ, యురుకుచ కొప్పారు నూరుయుగము మొగము భా
సురతరపదములు రదములుఁ, గరము లురముఁ గౌను మేనుఁ గన్నులుఁ జన్నుల్.

152


సీ.

సరసిజసౌందర్యసదనంబు వదనంబు, చారుసుధారసస్రావి మోవి
పరిభూతబిసపద్మభాతులు చేతులు, కదళికాయుగళంబు గడలు దొడలు
ముహురుదంచితకాంతిముచములు గుచములు, భూరిసువర్ణవిస్ఫూర్తి మూర్తి
చతురవిలోకనాసాధ్యంబు మధ్యంబు, తీ పారుకందర్పుతూపు చూపు
లోలభావసూచనములు లోచనములు, ధర్మవతిమతియభిమానధనము మనము
కాని యీసతి కెన యగు మానవతులు, సొరిది మూఁడుజగంబులఁ జూడఁ గలరె.

153


క.

ఆరామున కీసతి దగు, నీరామకు నానరేంద్రుఁ డెనగాఁ దగు నీ
చారిత్రం బీసుగుణం, బీరూపము నీసతీత్వ మెంతయు నొప్పున్.

154


సీ.

ఈసాధ్వికై రాఘవేంద్రుఁడు కృత్రిమ, కాకంబు శిక్షించె ఘను విరాధుఁ
జంపె శూర్పణఖనాసాకర్ణములు గోసె, ఖరదూషణాదిరాక్షసులఁ ద్రుంచె
మారీచుఁ బరిమార్చె వీరు వాలి వధించె, నినజుఁ బట్టము గట్టె నెల్లకపుల
నఖిలదిక్కులయందు నరసి రం డని పంచె, నే వచ్చి యీలంక నెల్ల వెదకి
భూమితనయ నిచటఁ గంటి భుజగిఁబోలె, నిగుడునిట్టూర్పు పుచ్చుచు వగలఁ బొగిలి
భీకరాంగారకగ్రహపీడ నొంది, యున్నరోహిణికైవడి నున్నదాని.

155

తే.

రామలక్ష్మణసతతాభిరక్షచేతఁ, బరఁగునీసాధ్వి యక్కటా భయదరాక్ష
సీసురక్షిత యై భీతిఁ జెంది వగలఁ, దాఱుచున్నది యే మందు దైవగతికి.

156


చ.

ధనమదసంపదల్ విడిచి దారుణభూములఁ గందమూలము
ల్గొనుచు విచిత్రహర్మ్యములలోపల నుండెడునట్లు ఘోరకా
ననములలోనఁ దాను దననాథునిఁ గూడి సుఖించుచుండు నీ
వనిత నిజేశుఁ బాసి వలవంతలఁ గూరెడు నిప్పు డక్కటా.

157


క.

ఈ రామమనం బెప్పుడు, నారామునియంద యుండు నారాముమనం
బీరామయంద యుండును, ఘోరవ్యననము లిరువురకు సమానంబుల్.

158


క.

ఇరువురుఁ జిత్తంబుల నొం, డొరువులఁ బెడఁ బాసి యునికి నొక్కెడఁ దా రొం
డొరులఁ గనఁ దివురునాశా, భరముల నున్నారు తెగక ప్రాణంబులతోన్.

159


క.

అతివకుఁ బతియ విభూషణ, మితరంబులు లేక యున్న నీసతి యతిభా
స్వతి యయ్యును నె ట్లున్నది, పతిఁ బాసినకతన మలినభావముతోడన్.

160


క.

తనుఁ బాసితి ననువగపున, ననుచరి వోయె నని కరుణ నంగనఁ బొడగా
నన యని దీనతఁ బ్రియ లే, దని కామవ్యథ నరేంద్రుఁ డతితప్తుఁ డగున్.

161


క.

ఈకోమలి కీదుర్దశ, యేకరణి విధించె భారతీశుఁ డకట యీ
శోకమునకు మూలం బగు, కైకకు నే మందు దైవఁగతి కే మందున్.

162


క.

అని యిట్లు పెక్కువిధముల, మనమునఁ దలపోసి వేగుమానం బయ్యెన్
జనకజకావలిరాక్షస, వనితలు మేల్కన్నకతన వసుధాసుతతోన్.

163


తే.

వెలసి భాషింప నిప్పుడు వేళగాదు, తపనుఁ డుదయించి క్రుంకునందాఁక సైఁచి
రాత్రి వచ్చినకార్యంబు రామునతికి, విన్నవించెదఁ గాక నే వెరవుతోడ.

164


వ.

అనుచు నల్పగాత్రుం డై యాతరుశాఖపర్ణంబుల నొదిఁగి చూచుచుండె నప్పుడు
ప్రభాతభేరు లులియ రాత్రించరసత్త్వంబులు నిద్రింప దివాచరులు మేల్కని
తమతమవిహారంబులకు నేఁగుచు నొండొరులం జీరునాహ్వానస్వనంబులు రావణు
నగరివాకిట నెసంగించు ఘంటాకాహళశంఖదుందుభిప్రభృతిస్వనంబులు జయ
జయగీతవేణువీణాస్వనంబులు నభ్రస్వనంబులుంబోలె నింగిఁ జెలంగ మారుతో
ద్దూతగంధబంధురహోమధూమంబుల నప్పురవరంబు యజనభూమియుంబోలె
నుండె నాసమయంబున.

165


మ.

లలిఁ గస్తూరి దొఱంగి చందనము లీలం దాల్చి సొంపారున
ట్లలఘుధ్వాంతముఁ బాసి శుభ్రతరరమ్యస్ఫూర్తి నొప్పారుచుం
[8]జెలు వొందంగను దూర్పు చెన్నెసఁగఁగాఁ సిందూరికాకౢప్తవృ
త్తలలామం బనఁ దోఁచె భానునిసముద్యద్బింబ మేపారుచున్.

166


వ.

ఇ ట్లుదయించి చండకిరణంబుల భూమండలం బెల్లఁ దపింపఁజేసి పదంపడి.

167

క.

ఘనతనుతాపము లోఁబడ, నెనసినరాగంబుతోడ నినుఁ డపరదిశాం
గనఁ జేర నరిగెఁ దనప్రియ, వనితం జేరంగ నరుగువల్లభుకరణిన్.

168


వ.

తదనంతరంబ.

169


చ.

కువలయపర్వ మబ్జములగొంగ చకోరమనోరథంబు జ
క్కవకవపాయుత్రోవ కఱకంఠునియౌదలపువ్వు చిత్తసం
భవుదళవాయి దేవతలపారణ మంబుధియుబ్బు లోచనో
త్సవము దమోవ్యపాయము నిశామణి తూర్పునఁ దోఁచె నయ్యెడన్.

170


తే.

గగన మొప్పారె నీలోదకంబుకరణి, దారకప్రకరంబులు కైరవముల
పగిది విలసిల్లెఁ జంద్రుండు భాసమానుఁ, డగుచు హంసవిధంబున నమరె నడుమ.

171


వ.

ఇ ట్లుదయించి యమృతకిరణుండు వెలుంగుచుఁ దనశిశిరకిరణంబులం దనువునకుఁ
దనుపుసేయ ననిలనందనుం డుండె నంత నర్ధరాత్రిసమయంబున ననేకబ్రహ్మరా
క్షసులు చదువునధ్యయనబ్రహ్మఘోషంబులు సెలంగం బంచమహాశబ్దంబులు
మంగళగీతస్వనంబులుఁ దెలుప మేల్కని కందర్పదర్పాతిరేకంబునం దమకం బొద
వ జనకరాజనందనం దలంచి శయ్యావతీర్ణుం డై చంద్రికాధవళదుకూలంబులు
గట్టి మృగమదమిళితమలయజాదిగంధంబు లలంది వివిధకుసుమవిసరంబులు
ముడిచి మణిమయభూషణాలంకృతుఁ డై నీలమేఘంబునుంబోలె దేదీప్య
మానుఁ డగుచుఁ దనవెనుకం బ్రియవిలాసినులు సనుదేర నగరు వెలువడి
యగ్రభాగంబున.

172

రావణుఁ డశోకవనమునకు వచ్చి సీతతో దుర్భాష లాడుట

ఉ.

మంగళతూర్యముల్ మొరయ మానుగ ముందట ధూళి వాయఁ ద
న్వంగులు వారిపూర మొలయంగను జల్లుచు రాఁగ నంతఁ దా
నందన యోర్తు రత్నకలికతాసవపూరితపాత్రహస్త యై
ముంగల నేఁగుదేర నొకముద్దియ గే లిడి త్రోవ వెట్టఁగన్.

173


సీ.

ఘనకుచంబులు నిక్క గంధర్వకామినుల్, ధవళాతపత్రముల్ దాల్చి నడువఁ
గంకణకింకిణీఝంకృతుల్ సెలఁగంగ, సురవిలాసినులు వీచోపు లిడఁగ
నెలమిఁ గిన్నరసతుల్ మలయానిలము చల్ల, రమణమై నాలవట్టములు పట్ట
గంధతైలము నించి గరుడకాంతలు సేరి, కెలఁకుల దీపముల్ చెలఁగి పూన
బలసి ఖడ్గాదిసాధనపాణు లగుచు, దనుజకాంతలు దనుఁ గొల్వ దశకిరీట
రుచులు మణిరుచిదీపికారుచుల గెల్వఁ, బొలిచి వెస నశోకారామభూమి సొరఁగ.

174


మ.

కరిణీమధ్యగతద్విపేంద్రముగతిం గాంతాసమోపేతుఁ డై
యరుదేరం బొడగాంచె ముందట నరణ్యాటుండు కైలాసదు
ర్భర భారక్షమబాహు నిర్జితనిలింపవ్యూహునిం బంక్తికం
ధరు దోర్గర్వధురంధరున్ దివిజరక్తస్రావణున్ రావణున్.

175

వ.

కని వీఁడు రావణుం డిద్దురాత్ముండు మనసిజగోచరుం డై వచ్చుచున్నవాఁ డిక్కడ
వచ్చి యేమేమిదురుక్తు లాడెడినో చూచెదం గాక యనుచు నొక్కశాఖకు గంతు
గొని తఱు చగువిటపపర్ణంబుల నొదిఁగియుండె నిట దశగ్రీవుండు కదియ నేతేర
సీతకుఁ గావలియున్న రాక్షసభామినులు సంభ్రమంబున మ్రొక్కుచు నోసరిల జ
నకతనయయుం గని ప్రవాతవేగంబునం గదలుకదళిచందంబున వడవడవడంకు
చుం జన్నులు చేతులం గప్పికొని వీడిన కచభరంబున వెన్నును జఘనంబును
మాటువడ నూరుల నుదరం బడంచుకొని యశ్రువు లురుల నున్న నమ్మానినీరత్నం
బుఁ జేరి రావణుం డి ట్లనియె.

176


ఉ.

మానిని నన్నుఁ జూచి తనుమధ్యము దాఁపఁగ నేల యేరికిం
గానఁగ వచ్చు నీబయలుగౌ నిది యేటికి నన్నుఁ జూడ వ
బ్జానన నీవిలోకనము లచ్చెరు వారఁగ నెన్నఁడేని నా
[9]మాసస మాడియున్నయవి మన్మథమోహనసాయకంబు లై.

177


సీ.

విమలదుకూలముల్ వెలయంగఁ గలుగంగ, గడుమైల యీచీర గట్టనేల
కస్తూరికాముఖ్యగంధంబు లవి గల్గ, భూరిపంకంబున బ్రుంగ నేల
సారాన్నపానముల్ చవులారఁ గలుగంగ, నుపవాసముల డస్సి యుండ నేల
[10]మెత్తనిపాన్పుల మెఱయుశయ్యలు గల్గఁ, గఠినోర్వి శయనించి కంద నేల
విజయలబ్ధత్రివిష్టపకవిభవుఁ డైన, ఘనుఁడ నే గల్గ నొకపేదమనుజుఁ గూడి
కాయగస రేఱికొని తించుఁ గానలోన, ఘోరదుఃఖముల్ గుడువంగఁ గోర నేల.

178


మ.

జగతీనాథునిఁ జేసి నీజనకుని సంతోష మొందించెదం
దగురత్నంబులు భూషణంబులు సుగంధద్రవ్యవస్త్రాదులుం
బొగడొందం గల వెల్లలక్ష్ములు వెసన్ భోగింపు ని న్నర్థి ము
జ్జగముల్ గొల్వఁగఁ బంచి నీకడ నభీష్టక్రీడలం దేలెదన్.

179


క.

పరసతి యొడఁబడకుండిన, నరభోజను లాక్రమించి నలిఁ బొందుట బం
ధురధర్మ మైన నీయను, చరణము లేక నినుఁ బొంద సమ్మదలీలన్.

180


క.

ఎల్లసుఖంబులఁ జేకొనఁ, జెల్లుట యౌవనమునంద చిక్కిన మఱి పా
టిల్లునె వెన్నెలదినముల, నల్లోనేరేళ్లు గాక యావలఁ గలవే.

181


క.

కావున యౌవన మాఱడిఁ, బోవఁగ నీ కేల రతులఁ బ్రోవుము నన్నున్
నావనితలు నీదాసులు, నీ వేలుము లంక యింక నెమ్మదిఁ దరుణీ.

182


చ.

కామిని నీకటాక్షములు కాయజుమోహనబాణముల్ బొమల్
కామునిచాపముల్ మొగము కంతునిమామ మృదూక్తు లంగజో
ద్దామశరాభిమంత్రము లుదంచితబాహులు మారుపాశముల్
కాముకచిత్తముల్ మరునిగాఢశరవ్యము లట్లు గావునన్.

183

క.

మారుఁడు నిన్నుం జూచిన, వారలమానములఁ గిన్క వాలమ్ములచేఁ
బారింపక తూలింపక, కారింపక యున్నె యతివ గైకొనకున్నన్.

184


సీ.

వృత్తోరుకుచములు వీఁక వక్షము గాఁడ, నను వేడ్క నాలింగనంబు సేయు
కుంభికుంభస్థలగురునితంబంబున, రణితమేఖల యొప్ప రతులఁ దేల్పు
పున్నమచందురుఁ బోలునెమ్మొగమునఁ, గొమరారునమృతంబు గ్రోలనిమ్ము
మర్మముల్ నాటిన మరుబాణముల గెల్వ, నీదృష్టి నామీఁద నిగుడనిమ్ము
సరసకోకిలస్వరయుక్తచతురకీర, సురుచిరోక్తులు నాచెవుల్ సొగియఁ బల్కు
కాముకేళిఁ గైకొని నన్నుఁ గావు మింకఁ, గడచి చన్న యాతపసిపైఁ గాంక్ష విడువు.

185


చ.

వనముల నాకలంబుఁ దిని వంతలఁ గుందుచు నింత కెన్నఁడే
ననుజుఁడుఁ దాను జచ్చు నడియాస లిఁకేటికిఁ జాక తక్కినన్
వననిధి దాఁటి రాఁగలఁడె, వాడిమి వచ్చిన నన్ను నేగతిం
జెనకి జయించు నాజి ననుఁ, జేరఁగ నోపునె ముజ్జగంబులున్.

186


క.

హరిహరకమలభవామర, వరు లురుబలకలితు లగుచు వచ్చిన నైనం
బొరిగొందు నేను దశకం, ధరు ననిమొనఁ జెనకువారె నరులుం గిరులున్.

187


క.

బలమునఁ దపమున రూపునఁ, గులమునఁ దేజమునఁ గలిమి గుణముల నాతోఁ
దులఁదూఁగఁగలఁడె రాముఁడు, చలమునఁ గైకోవుగాక సమ్మతి నన్నున్.

188


క.

వారక వంతలఁ గుందియు, భూరేణువుచేతఁ జాల బ్రుంగియు నాహా
నీరూ పి ట్లున్నది శృం, గారించిన నిన్నుఁ జూడఁ గన్నులు గలవే.

189

సీత రావణు నిరాకరించి పలుకుట

వ.

అనుచుఁ గర్ణకఠోరంబులుగాఁ బలుక దీనవదనయు నార్తస్వనయుఁ దామ్రాక్షి
యు నాకంపితాంగియు శోకతప్తచిత్తయు నగుచు నద్దేవి కోపంబునఁ దృణఖండం
బతని కడ్డంబుగాఁ బట్టికొని పరాఙ్ముఖ యగుచు ని ట్లనియె.

190


క.

జనకునితనయను దశరథ, జనపతికోడలు నరేంద్రచంద్రుం డగురా
మునిభార్య నన్నుఁ గవిసెద, ననుచిత్తము విడువు నీ కనర్హం బగుటన్.

191


ఉ.

కందినయన్యకాంతయెడఁ గ్రామము దక్కుము నన్నుఁ జేరరా
దందనిమ్రానిపండులకు నఱ్ఱులు సాఁతురె నీదుకోర్కి నీ
సుందరులందుఁ దీర్చికొనుచొప్పునఁ బోక ఖలుండ పాపముం
బొందెడుత్రోవఁ బోయి తుదిఁ బోదు మదం బఱి కాలుప్రోలికిన్.

192


మ.

నాపతి డాఁగురించి కుహనాగతి న న్నిటఁ దెచ్చి బంట వై
పాపము లేల యాడెదు నృపాలుఁడు సన్నిధి నున్న నానమ
చ్చాపవిముక్తశాతశరజాలములన్ నిను నీకులంబు ను

ద్దీపితశక్తితోఁ దలలు ద్రెంపక చంపక పోవ నిచ్చునే.

193


క.

సిరిఁ జూపి నన్ను లోఁబడ, మరిపెద నని చూచె దేల మనుజేశునిపైఁ
దిర మగునామది వాయదు, తరణిం బాయనితదంచితప్రభభంగిన్.

194


శా.

ప్రాణంబుల్ వలతేని రామునకు నే ర్పారంగ న న్నిచ్చి స
త్రాణుం డై మను మట్లు గాక మదిలో దర్పించినం దద్రణ
క్షోణీయుక్తఖరాస్రసిక్తపటుదోస్స్థూణోగ్రబాణాసనా
క్షీణస్ఫారకఠోరఘోరశరముల్ చెండాడు నీకంఠముల్.

195


చ.

వినయముతోడ నన్ను రఘువీరున కిచ్చి వినమ్రుఁ డైన నొం
డనియెడువాఁడు గాఁడు శరణాగతవత్సలుఁ డాదయాళుతో
ననువుగ సంధి సేసికొని యాదటమై బ్రదుకుండు నీవు నీ
జనములుఁ గ్రొవ్వి చచ్చుట విచారము గా దటు గాక తక్కినన్.

196


శా.

పంకేజాసనుఁ జొచ్చినన్ జవమునం బాతాళమున్ దూఱినన్
లంకారాక్షసవంశవారిధిఁ గరాకళజ్వాలజిహ్వాల మై
సంకీర్ణస్ఫుటవిస్ఫులింగపటలీసంచార మై ఘోర మై
కింకన్ రాఘవబాణబాడబముఖాక్షీణాగ్ని గ్రోలుం జుమీ.

197


వ.

అనవుడు రావణుం డి ట్లనియె.

198


క.

లలనలు పురుషుల దూఱఁగఁ, బలుకుట ప్రియవతుల యగుటఁ బైఁ బడి వారిం
గలఁచుటకొఱ కీ విట్టులు, పలికిన సైరించి మనసు పట్టెదఁ దరుణీ.

199


క.

అతివలకును దాక్షిణ్యము, వితతవిభూషణము నీకు వెదకిన నది లే
దతినిష్ఠుర వేవిధమునఁ, బతికిం బ్రియురాలు వైతి పరుషప్రవచా.

200


ఆ.

అతివఁ జంపఁ బాప మని యూరకుండిన, నోరికొలఁదు లాడె దౌర నన్ను
వనిత కింతవాతివాఁడితనం బేల, ప్రభుల నోట లేక పలుకు టేల.

201


క.

న న్నెంత మిగిలి పలికిన, ని న్నిప్పుడు చంప బ్రదుకు నెమ్మదితోడన్
రెన్నెల్లదాఁక మీఁదట, న న్నొల్లక యున్నఁ గిన్క నఱకుదు నిన్నున్.

202


క.

అని పలికి సీతకావలి, వనితల నీక్షించి మీరు వసుధాతనయం
జన బుజ్జగించియైనను, ననువుగ బోధించియైన నదలిచియైనన్.

203


క.

రెన్నెల్లలోన నాకుం, జె న్నొంద నధీనఁ గాఁగఁ జేయుఁడు మఱి కా
కున్న నిశాచరు లందఱుఁ, గ్రన్ననఁ జక్కాడి తినుఁడు ఘనపలలంబున్.

204


వ.

అని యిట్లు బంకింప నతిభీత యగుసీతం జూచి యచ్చట నున్న గీర్వాణగంధర్వ
కాంతలు విషాదించుచు నయనభూక్రుటిసంజ్ఞల నూరార్ప నద్దేవి కోపంబున
రావణుం గనుంగొని.

205


క.

ఇనకులనాథుం డనిమొన, ఘనసర్పముఁబోలె నిన్ను ఖండించి జవం
బున విహగేంద్రుఁడు భుజగిం, గొనిపోయెడుభంగి నన్నుఁ గొనిపోవుఁ దగన్.

206

ఉ.

నావిభునాజ్ఞ లే కునికి నాతప మంతయు రిత్త యై చెడుం
గావున నిన్ను భస్మముగ గాఢతరోక్తి శపింప నిఫ్టు యు
ద్ధావని గిట్టి నిష్ఠురశరావలులం బరదారచోరు ని
న్నావసుధేశ్వరుండు పరిమార్పఁగ ని మ్మని పల్కెఁ బల్కినన్.

207


మ.

కుటిలభ్రూకుటిధూమరేఖ లొదవం గోపాగ్నిసందీఫ్తుఁ డై
చటులాక్షిస్ఫుటవిస్ఫులింగచయసంచారంబు ఘోరంబుగాఁ
బటుబాహాకరవాలకీల లడరం బ్రస్ఫారహుంకారసం
కటసంతర్జనభీకరుం డగుచు లంకకానాథుఁ డజ్జానకిన్.

208


క.

కదియు నెడ ధాన్యమాలిని, కదిపి వెసం బట్టి పంక్తికంధర నీ కీ
సుదతియెడఁ గిన్క యేటికి, సదయుఁడ నగు మాఁడుదానిఁ జంపం జనునే.

209


క.

అనుకూల గాక పెనఁగెడు, వనితయెడం గలదె సుఖము వలతే నాతోఁ
దనియఁగ రతులం దేలుము, చన నెందఱు లేరు నీకుఁ జక్కనికాంతల్.

210


క.

అన విని యల్లన నవ్వుచు, మనసిజసాయకవిభిన్నమానసుఁ డై యా
వనితయుఁ దానును మగుడం, జనె దశకంఠుండు గేళిసదనంబునకున్.

211


వ.

అంత నద్దశకంఠుచేత నియుక్తలైననక్తంచరభామిను లందఱు జనకనందనపాలి
కేతెంచి మొగంబులఁ గోపంబు ముడివడం బరుషంబు లాడుచుండ నం దేక
జట యనునది యి ట్లనియె.

212

రాక్షసాంగనలు సీతకు దుర్బుద్ధులు గఱపుచు బెదరించుట

క.

చతురాస్యునకున్ మానస, సుతుఁడు పులస్త్యుండు పుట్టె సుతుఁ డతనికి స
న్మతి వొడమెను విశ్రవసుం, డతనికి రావణుఁడు పుట్టె నతివిక్రముఁ డై.

213


క.

నాలవబ్రహ్మ దలంపఁగఁ, బౌలస్త్యుం డితఁడు నీకుఁ బతిగాఁ దగఁడే
పోలఁగ నామాటలు విని, పౌలస్త్యు వరింపు [11]భోగభాగిని వగుచున్.

214


వ.

అనినఁ గుటిలభ్రూకుటిదుర్నిరీక్ష యగుచు హవిర్జట యనునది యి ట్లనియె.

215


క.

మందోదరితో వేవురు, సుందరు లతిరూపవతులు శోభిల్లుచుఁ దన్
మందిరమున నుండఁగ న, య్యందఱ నొల్లండు నీక యతిమోహితుఁ డై.

216


సీ.

కింక నెవ్వఁడు సర్వగీర్వాణయుతుఁ డైన, యమరేంద్రునంతకు నాజి గెల్చె
నని నోడి యెవ్వని ననిమిషగంధర్వ, దానవోరగపతుల్ దనరఁ గొలుతు
రెవ్వనిదెస భీతి నినుఁ డెండ గాయఁడు, వీఁకతో వాయువు వీవ వెఱచు
జలదంబు లెవ్వని కులికి యింపారంగ, సురుచిరతోయముల్ గురియుచుండు
నెవ్వనికి బెగ్గలం బంది యెల్లతరులు, సురభిపుష్పవర్షంబులు సొరిదిఁ గురియు
నిట్టిరావణు వరియింప నేల యొల్ల, వేము నీకుఁ జెప్పిన బుద్ధు లేల వినవు.

217


వ.

అనియె నంత నఖిలరాక్షసభామలుఁ గోపాటోపంబున నిట్లనిరి.

218

క.

బాల జగత్పాలకభూ, పాలకదిక్పాలకాళిఁ బఱపి తదీయో
త్తాలశ్రీలన్ వ్రాలెడు, పౌలస్త్యునిపత్ని వగుట భాగ్యము గాదే.

219


క.

మానముతో మన నీకును, మానము గా కొక్కహీనమానవుఁ గోరం
గా నేల రాక్షసేంద్రుని, మానిని వై మనుము నీవు మన్ననతోడన్.

220


వ.

అనిన విని బాష్పాకులలోచన యగుచు వైదేహి వారల కి ట్లనియె.

221


క.

మనుజు వరింపక మనుజాం, గన మనుజాశను వరించి కాఱియపడునే
వినఁగానిమాట లే విన, నను మ్రింగిన మ్రింగుఁ డింక నరభుగ్వనితల్.

222


సీ.

సగరుఁ గేశినివోలె సౌదాసు మదయంతి, గతి వసిష్ఠుని నరుంధతి విభాతి
నిను సువర్చలభంగి నింద్రుని శచిమాడ్కిఁ, జంద్రురోహిణియోజ సత్యవంతు
సావిత్రివిధమునఁ జ్యవను సుకన్యక, యట్టులు నలు దమయంతిపోల్కిఁ
గువలు శ్రీమతిలీలఁ గుంభసంభవుని లో, పాముద్రకైవడి భక్తితోడ
రఘుకులాబ్ధిరాకాచంద్రు రామచంద్రుఁ, గొలిచి యేను సమ్మతి నుండి వెలయుదాన
నానిజేశుఁడు రాజ్యవిహీనుఁ డైన, నెట్టివాఁ డైనఁగాని నా కెట్టు లెస్స.

223


వ.

అని పలుక నఖిలరాక్షసులు నధికక్రోధతామ్రాక్ష లగుచు నౌడు గఱచుచుఁ గ
టము లదర రాక్షసేశ్వరుం డగురావణు నేల యొల్ల వని పరుషవాక్యంబుల భ
ర్జించుచు ఖడ్గపట్టిసప్రాసాదు లంకించుచు శింశుపామూలంబుఁ జేరం జనుదెం
చి విటపవర్ణంబుల నొదిఁగిన హనుమంతుం డూరక చూచుచుండ నుగ్రాకార
లయి కదియ సజ్జనకతనయ భయకంపితాంగి యగుచుఁ గన్నుల బాష్పాంబువులు
దొరఁగ శోకించుచుండ నందఱుం దిరిగివచ్చి గర్జించుచు భర్ణించుచుండ నప్పు
డు దీనానన యగుచున్న జానకిం జూచి యతికుపిత యగుచు వినత యనునది యి
ట్లనియె.

224


క.

వనమున జీవము విడిచిన, మనుజునిపైఁ గూర్మి యేల మాకుం జూడన్
ఘనబలుఁడుఁ బ్రియంవదుఁడును, ననుకూలుఁడు భోగభాగి యధికుఁడు నగుటన్.

225


క.

కాలము గడపఁగ నేటికిఁ బౌలస్త్యుఁడు నీకు నెల్లపదవు లొసంగున్
లీలం బ్రసూనమాలా, చేలాభరణాంగరాగశృంగారిణి వై.

226


క.

సరసిజభవునకు శారద, హరికిని సిరి రవికి సంధ్య హరునకు నుమ ని
ర్జరపతికిని శచి వైశ్వా, నరునకు స్వాహ శిశిరాంశునకు దాక్షిగతిన్.

227


క.

రక్షోవిభునకు నీ వతి, దక్షతఁ బత్ని వగు కాక తక్కిన నిన్నున్
రాక్షసభామిను లందఱు, భక్షించెద రీక్షణంబ పటుకోపమునన్.

228


వ.

అనియె నంత నిటలతటగ్రంథిలకుటిలభ్రూకుటి యగుచు విశంకట యి ట్లనియె.

229


క.

అనునయమున నతిపరుషత, నిను నొడఁ బఱుపంగ లేము నీకై దుఃఖం
బునఁ బడఁజాలము రావణుఁ, జనఁ గామించెదవో లేక క చచ్చెదొ చెపుమా.

230


వ.

అనుడు నతిఘోరప్రేక్షణదుర్ముఖి యగుచు హాయముఖి యి ట్లనియె.

231

క.

వనితాసప్తసహస్రము, లొనరఁగ నినుఁ గొల్వఁ బావనోద్యానములం
దనుపమభోగము లందుచు, దనుజేశునిఁ [12]జేరికొనుము ధన్యత వెలయన్.

232


క.

వననిధి దాఁటుట వచ్చుట, యనిసేయుట చాక మనుట యది సమకొనునే
మనుజుఁడు నినుఁ గొనిపోయెడి, ఘనుఁ డెవ్వం డేము నీకుఁ గావలియుండన్.

233


మ.

అని దేవారి జయించి నిన్ను నరుఁ డేయాసక్తిఁ గొం చేఁగెడిన్
దనుజాగారముఁ జొచ్చి పోదు ననుచిత్తం బేల వంటిల్లు సొ
చ్చినకుందేటికి నీకుఁ బోక గలదే చింతించి నావాక్యముల్
విను మింకన్ వినకున్న నీరుధిరముల్ వే గ్రోలి నిన్ మ్రింగెదన్.

234


వ.

అనునంత నయోముఖ యి ట్లనియె.

235


క.

మనమాటలు విన దింకన్, మన విూవనితను వధించి మాంసము దించుం
దనియఁగఁ గ్రోలఁగవలయును, మనకుం గొనిరండు మంచిమద్యము లీలన్.

236


వ.

అనిన శూర్పణఖ యి ట్లనియె.

237


క.

పరఁగ నయోముఖ చెప్పిన, కరణిన్ ఖండించి దీనిక్రవ్యము దించున్
సుర ద్రావి నికుంభిల కే, నరిగెద వెసఁ గ్రీడతోడ నాడెద నెలమిన్.

238


వ.

అనినం జండోదరి గేల శూలంబు దిప్పుచు విదుర్చుచు ని ట్లనియె.

239


క.

త్రాసోత్కంపితకుచ యగు, నీసతిరుధిరంబు ద్రావి హృదయము వ్రత్తున్
గాసిల గ్రసింతు నసిఁ దలఁ, గోసి వెసం గండపిండు గుండెలుఁ దిందున్.

240


వ.

అనినఁ బ్రతపన యి ట్లనియె.

241


క.

జడమతి యై మనమాటల, కొడఁబడ దిది యేల మనకు నుద్ధతి దీనిన్
మెడ దునిమివైచి నెత్తురు, గడు పారఁగఁ ద్రావి మాంసఖండముఁ దిందున్.

242


వ.

అని యి ట్లనేకప్రకారంబుల భయంకరాకార లైనరక్కెసలు తర్జనభర్జనంబులఁ
బరుషవచనంబుల [13]బెగ్గడిల్లం జేయఁ గుందియు వందియు ధరిత్రీపుత్రి కంపంబు
నొఁది నీలవేణి కృష్ణభుజంగియుంబోలెఁ దూల బాష్పధారులు గుచంబులఁ దొ
రఁగ నేడ్చుచు నేలం బడి పొరలుచు ధూళిధూసరితాంగి యగుచు లేచి పుష్పి
తాశోకశాఖాలంబనంబు చేసి గద్గదవాక్యంబుల ని ట్లనియె.

243


క.

నోసినడెందము వగులఁగ, నాసతి హారామచంద్ర హాలక్ష్మణ హా
కౌసల్య హాసుమిత్రా, పాసితి మి మ్మెల్ల దుఃఖభాజన నైతిన్.

244


క.

ఖలుఁ డగురక్కసుచేఁ బడి, నిలుచుట జను లాడుసడికి నిలయమ యైతిం
జెలువునిఁ బాసినయప్పుడ, బలువిడిఁ బ్రాణములు వోక బ్రదికెద నకటా.

245


క.

వలసినయప్పుడ మరణము, కలిగింపఁడు పాపజాతికాలుఁడు గరళా
దులవెంటఁ జావు దొరకదు, బలుగావలి యై నిశాటభామిను లునికిన్.

246


క.

తిరముగ మును నాచేసిన, దురితం బెట్టిదియొ నాకు దుష్టనిశాటీ

పరివృత నై యిట్లతిదు, ర్భరదుఃఖము లందవలసెఁ బరదేశమునన్.

247


క.

మాణిక్యభూషణధన, శ్రేణులు ప్రియహీన కేటి ప్రియములు నాకుం
బ్రాణేశ్వరుఁ బాసిననా, ప్రాణము లేమిటికి నాదు బ్రదు కేమిటికిన్.

248


క.

నాకై పతి మును కృత్రిమ, కాకంబు విరాధు ఖరముఖక్రవ్యాదా
నీకంబుల శిక్షింపఁడె, వే కైకొని కనకమృగమువెంటం బోఁడే.

249


తే.

కాన రాఘవుల్ విడుతురె కలయ వెదకి, నన్నుఁ గానక వగల సన్న్యస్త్రశస్త్రు
లగుచుఁ దరుమూలముల నిరాహారనిష్ఠఁ, దెగిరొ రావణుమాయల నెగులుపడిరొ.

250


క.

అ ట్టేటికి నగుఁ గావఁగ, గట్టిగ నేఁ డెల్లి వచ్చి గారవమున వా
రెట్టుల గొనిపోవంగల, రిట్టల మగుబాహుశౌర్య మెంతయు నొప్పన్.

251


సీ.

నాజాడ వెదకుచు నరనాయకుఁడు వచ్చి, విహగపుంగవుచేత విని కడంక
జలనిధి లంఘించి చన లంక భేదించి, దశకంఠుఁ జక్కాడి తలలు దునిమి
యని వానిపలలంబులను భూతబలి యిచ్చి, లంక నీఱుగఁ జేసి లంకఁ గలుగు
దుష్టాసురశ్రేణిఁ దునియలు గావించు, విధవ లై యింటింట వివిధగతుల
నెల్లరాక్షసభామలు నేడ్వఁగలరు, లంక యేడ్పుల శవధూమసంకరములఁ
బృథులభస్మరాసులతోడఁ బ్రేతభూమి, యోజఁ గడునమంగళ మయి యుండఁగలదు.

252

త్రిజటాస్వప్నవృత్తాంతము

వ.

అని యి ట్లనేకప్రకారంబులం జింతించుచుండ సీతం గదిసి కటము లదరఁ బండ్లు
గీటుచు రక్షోభామ లీపాపజాతి క్రూరనిశ్చయ దీని భక్షింపుఁ డనుచు మిడుఁ
గుఱులు సెదరం గైదువు లంకించుచు జంకించుచున్నెడఁ జేరువ నిద్రవోయిన త్రి
జట మేల్కని సంభ్రమంబున నోహో వేగిరపడ కుండుఁడు రాక్షసవినాశకరం
బును రామునకు విజయకరంబును నగునొక్కస్వప్నంబు గంటి వినుం డని పలుక
నారక్కెసలు బెగ డందుచుఁ దిరిగి వచ్చి యది యెట్టికల వినిపింపు మనిన
నాత్రిజట యి ట్లనియె.

253


క.

సామజసహస్రశోభితుఁ, డై మి న్నందుచు ఘనశిబికారూఢుం డై
రాముఁడు రుధిరము ద్రావుచు, భూమండల మెల్ల మ్రింగఁ బొడగంటిఁ గలన్.

254


క.

శ్వేతాంబరములు దాలిచి, సీత నిజేశుండుఁ దాను సేమంబులతో
నాతతజలధిపరిక్షి, ప్తాతులితాచలముమీఁద నమరం గంటిన్.

255


క.

ఇనశశుల సీత పరిమా, ర్జనమును గావింపఁ గంటి రాఘవుఁ డనుజుం
డును దాను వచ్చి భూనం, దనతోఁ బుష్పకము నెక్కి తనరం గంటిన్.

256


సీ.

ధవళవుష్పాంబరతారహారము లోలి, ధరియించి సితచతుర్దంతదంతి
నడుమ రా రాముఁడు నలువార నవ్విభు, నంకోపరిస్థల మారఁ జేరి

జానకి ముందట సౌమిత్రి దమయన్న, వెనుకభాగంబున వెలయ నెక్క
వడి నగ్గజేంద్రంబు వారి నందఱఁ గొంచు, సొంపార నీలంక సొరఁగఁ గంటి
మఱియు శుభ్రపుష్పాంబరమహితుఁ డగుచు, రాఘవుం డష్టవృషభోఢకరథము నెక్కి
యవనిజాలక్ష్మణులతోడ నధికమహిమ, నరుగుదేరంగఁ బొడగంటి నంతమీఁద.

257


వ.

రావణుం డొక్కయుగ్మలి తిగువఁ బుష్పకంబుననుండి దిగువంబడను మఱియు
ముండితశిరుండును గృష్ణాంబరధరుండును రక్తమాల్యానులేపనుండును ఖరయుక్త
రథుండును నై దక్షిణపథంబున నరిగి గోమయహ్రదప్రవేశంబు సేయం గలఁ గంటి
మఱియుఁ గర్దమలిప్తాంగియుఁ గాళియు నగునొక్కవనిత రక్తవస్త్రంబు మెడఁగట్టి
తిగువ రావణుండు యామ్యదిగ్భాగంబున కరుగం బొడగంటి వెండియు రావ
ణుండు వరాహంబును నింద్రజిత్తు శింశుమారంబును గుంభకర్ణుం డుష్ట్రంబు
నెక్కి యంతకదిగ్భాగంబున కరుగ రాక్షసులు రక్తమాల్యాంబరధారు లై యా
డుచుం బాడుచుం బ్రశంసించుచుఁ దైలంబు ద్రావుచు దక్షిణంబు వోవను లంక
గరితురగసమాకులయును భగ్నప్రాకారతోరణయునై సముద్రంబునం బడను గం
టి రాక్షసాంగనలు తైలపానంబులు సేయుచు భస్మీభూత యైనలంకలో మహాస్వ
నంబుల నగుచు నాడుచుం బాడుచు నికుంభకుంభకర్ణాదులతోడ రక్తవస్త్ర లై
పోయి గోమయహ్రదంబులోనం గ్రీడింపం బొడగంటి విభీషణుండు మంత్రి సమే
తుండై యొక్కరుండును శ్వేతపర్వతసమారూఢుండై యుండం గలఁ గంటి నాకల
నిక్కల రాముండు వచ్చి సకలరాక్షససమేతంబుగా రావణుం బరిమార్పఁగలండు
గావున నానరేంద్రపత్నికి వెఱచి యుండుద మనుడు నారక్కెస లద్దేవికిఁ బ్రణ
మిల్లి ప్రియవాదిను లై యుండి రంత సీతయు రావణుండు మాసద్వయంబునం ద
న్ను హింసించెద నన్న పలుకులు దలపోసి భయం బందుచు ని ట్లనియె.

258


సీ.

అభిలబంధులఁ బాసి యన్యదేశమునఁ గ్ర, వ్యాదు చేఁ జావఁ బా లైతి నకట
హరిణాధమమువెంట నది పైఁడిమృగ మంచుఁ, బ్రాణేశు నేల పొ మ్మంటి నకట
మముఁ బాపఁ గాలుండు మాయాకురంగమై, పరుషాటవులఁ గాడుపఱిచె నకట
తపముఁ బాతివ్రత్యదమశీలసత్యశౌ, చాదులు విఫలంబు లయ్యె నకట
ఘోరదుఃఖంబు లిబ్భంగిఁ గుడువకుండ, వేయివ్రయ్య లై హృదయంబు విరియ దకట
సకలమునులును నుత్తమసతులు నాకుఁ, దనర నిచ్చుదీవన లెల్లఁ దప్పె నకట.

259


వ.

అని పలుకుసమయంబున నాసతికిం దనువున నానందపులక లెసఁగ రామచం
ద్రుండు ముందటఁ దోఁచిన ట్లయ్యె మఱియును.

260

తే.

సీత కప్పుడు మంగళ్ళచిహ్న లొదవె, నెడమదెసఁ జన్నుఁ గన్నును దొడయు భుజము
మొగి నదరఁ జొచ్చె రాహువిముక్తుఁ డైన, చంద్రగతి వెల్గుచును ముఖచంద్రుఁ డొప్పె.

261


వ.

ఆసమయంబున వైదేహివృత్తాంతంబును ద్రిజటవాక్యంబులును మఱియు సర్వం
బును నెఱింగిన హనుమతుం డిప్పు డందఱు రాక్షసస్త్రీ లెఱింగియుండుట మెఱసి
సీతతో భాషించుట కర్జంబు గా దొకవెరపున రామలక్ష్మణులను దద్బంధు
జనంబులను బేర్కొని యీసతీరత్నంబునకు శ్రవణోత్సవంబుగాఁ దగినవాక్యం
బులు పలికి ప్రసన్నఁ జేసి నావచ్చిన కార్యం బెఱింగించెనఁ గా కని విచారించి
కొండొకదడవున కవసరం బైన ని ట్లనియె.

262

మారుతి సీతకు రామాదులవృత్తాంతంబు వినిపించుచుం ద న్నెఱింగించుట

మ.

హరకోదండవిఖండనుండు జనకక్ష్మాధీశుజామాత భా
స్కరవంశాగ్రణి జానకీప్రియుఁడు విశ్వామిత్రయాగాహితా
సురసంహారి విరాధకాలుఁడు ఖరాసుధ్వంసి మారీచసం
హరుఁ డన్యప్రమదాపరాఙ్ముఖుఁ డయోధ్యానాయకుం డాదటన్.

263


క.

కాకుత్స్థకులగ్రామణి, లోకైకత్రాణకేళిలోలుఁడు పుణ్య
శ్లోకుఁడు సీతాశోకవి, మోకత్వరితహృదయుండు ముదమున నన్నున్.

264


క.

సీతన్ వెదకం బంచిన, నేతెంచితి నబ్ధి దాఁటి యేను హనూమ
ఖ్యాతుఁడ రాఘవుదూతను, భూతలపతిదేవి నిచటఁ బొడగాంచెదనో.

265


వ.

అని పల్కి మఱియు సవిశేషంబుగా నెఱింగించువాఁ డై యి ట్లనియె.

266


సీ.

దశరథుం డనుపేరిధరణీశుఁ డొకఁ డాజ్ఞ, నెల్లభూచక్రంబు నేలె వెలయ
నలఘు లాతనికిఁ బుత్రులు రామలక్ష్మణ, భరతశత్రుఘ్నులు పరఁగఁ గలరు
వారి కగ్రజుఁ డైనయారాముఁ డనురక్తి, జానకీలక్ష్మణసహితుఁ డగుచుఁ
గైకవరంబునఁ గాంతారమున కేఁగి, మాయామృగమువెంట మసల కరుగ
రావణుఁడు సీతఁ గొనిపోవ రయము మెఱయ, మగిడి పర్ణశాలకు వచ్చి మగువ నచటఁ
గాన కడలుచు నిరువురుఁ [14]గానలోనఁ, గలయ వెదకుచు ఋశ్యమూకంబుఁ జేరి.

267


క.

సుగ్రీవునితో సఖ్య ము, దగ్రగతిం జేసి యతని కభిమతముగ న
త్యుగ్రుని వాలిం దునిమి నృ, పాగ్రణి కిష్కింధఁ బట్ట మర్కజుఁ గట్టెన్.

268


వ.

ఇట్లు సుగ్రీవునకు సమ్మదం బాచరించి తత్పురస్సరంబుగా ననేకవానరకోట్ల సక
లదిక్కులకు వెదకం బనిచె నేను సంపాతివచనంబున భవత్సందర్శనోత్సుకత్వం

బున సముద్రం బవలీల దాఁటి యీలంక నిశ్శంకఁ జొచ్చి యెల్ల చోట్ల వెదకి నా
భాగ్యవశంబున నిన్నుఁ బొడగంటిఁ గృతార్థుండ నైతి వినుము.

269


క.

సౌమిత్రియుఁ దానును నా, రాముఁడు నీసేమ మడిగె రవిజుండును నీ
సేమ మడిగె వా రందఱు, సేమంబున నున్నవారు సేమమె నీకున్.

270


క.

అనిన విని యాశ్చర్యం, బును బ్రియముం బెనఁగొనంగ మో మెత్తి మహీ
తనయ కనియె నంతికమున, ఘనతరుశాఖపయి నున్నకపికులవర్యున్.

271


వ.

కని యుల్లంబు జల్లన నొల్లంబోయి యల్లన దేఱి కలలోన వానరుఁ బొడగంటి
నిది దుస్స్వప్నం బని శాస్త్రంబుల వినంబడు నీచెడుగుకల నగుకీడు జనకరామసౌ
మిత్రులకును నాకుం గాక యుండుం గాక యని దీవించి దుస్స్వప్నదోషపరిహారం
బుగా వజ్రివాచస్పతిస్వయంభూహుతాశనులం బేర్కొని నమస్కరించి మగుడం
దెలివి నొంది యి ట్లనియె.

272


క.

వేమఱుఁ దలఁచినతలఁపు, న్వేమఱుఁ బేర్కొన్నయదియు నిద్రం గల యౌ
వేమఱు రామున తలఁతును, రామునిఁ బేర్కొందు రామ రామా యనుచున్.

273


క.

అనఘుని మత్ప్రియుఁ బాసిన, ఘనతరవిరహాగ్ని నెరయుకతనను రక్షో
వనితలదారుణబాధల, నెనసిన పెనుభీతి నిద్ర యెన్నఁడుఁ గావన్.

274


వ.

కాన యిది కల గాదు నాకన్న రామస్తుతిపరాయణుం డగువానరేంద్రుడు రాము
దూతయ నిజంబ కా ని మ్మనుచుం బలికి నంతం దరుశాఖావతరణంబు సేసి
విద్రుమసమాననుం డగుహనుమంతుం డతిభ క్తి నంతంతఁ బ్రణమిల్లుచు శిరం
బునం జేతులు మొగిచికొని వినయవినమితశరీరుం డై జానకి నాలోకించి ప్రియం
బార ని ట్లనియె.

275


క.

చిరపుణ్య నీవు మలినాం, బర మిట్టులు గట్టి చాలఁబరితాపముతోఁ
దరుశాఖాలంబిని వై, పొరిఁబొరిఁ గన్నీరు దొరఁగఁ బొగిలెద వేలా.

276


క.

సురకామినివో విద్యా, ధరవరవర్ణినివొ రుద్రతరుణివొ వసుసుం
దరివో మరున్నారివొ కి, న్నరకాంతవొ యక్షసతివొ నాగాంగనవో.

277


క.

దివిఁ జంద్రుఁ బాసి వసుమతి, కవిరళమతి వచ్చి యున్నయారోహిణివో
యవమాన మొంది రోషము, న వసిష్ఠుం బాసి వచ్చినయరుంధతివో.

278


క.

వినుతశుభలక్షణంబులు, గనుఁగొన నృపమహిషి వీపు గా నోపుదు వం
చన దశకంఠుఁడు గొనివ, చ్చిన రాఘవుపత్ని యైన సీతవొ చెపుమా.

279


క.

అన విని జానకి పావనిఁ, గనుఁగొని నాపేరు సీత ఘనపుణ్యుం డౌ
జనకునికూఁతుర దశరథ, జనపతికోడలను రామచంద్రునిభార్యన్.

280


వ.

అని పల్కి తా నయోధ్యను బండ్రెండేం డ్లనుపమభోగంబులు భోగించుటయుఁ
బదుమూఁడవయేఁడు దశరథుఁడు రామచంద్రుఁ బట్టంబు గట్ట నుద్యోగించు
టయుఁ గైక విఘ్నంబు సేయుటయు రామసౌమిత్రులతో వనవాసంబునకు

వచ్చుటయుఁ దన్ను రావణుం డపహరించి తెచ్చుటయుఁ దనపడుబన్నంబులును
రెన్నెల్లమీఁద రావణుండు తన్నుం దునుమాడెద నన్నక్రూరభాషణంబులుం
జెప్పిన హనుమంతుండు దుఃఖితాత్ముం డగుచు నిట్లనియె.

281


సీ.

కళ్యాణి నీ వేల కడుదుఃఖ మందెదు, నీనాథుఁ డగురామనృపతి నిన్ను
వెస సర్వదిక్కుల వెదకంగఁ గడఁకమైఁ, బ్లవగవీరుల నెల్లఁ బనిచినాఁడు
కాకుత్స్థకులవిభుల్ కపికులనాయకుల్, నీవ ప్రాణములుగా నిలిచినారు
నీయున్నతెఱఁ గేను బోయి చెప్పినయప్డు, వడి లంక పై వచ్చి విడిసి కిన్క
స్వజనపుత్రభ్రాతృసచివయుతము, గాఁగ రావణుఁ జక్కాడి కడిమి మెఱయ
ని న్నయోధ్యకుఁ గొనిపోవు నెయ్య మెసఁగ, సకలసుఖముల నొందెదు సమ్మదమున.

282


క.

అని మ్రొక్కి భక్తిఁ జేరినఁ, గని బెగడుచు వీఁడు పంక్తికంఠుఁడు మాయా
వనచరు డై న న్నలఁపఁగఁ, జనుదేరఁగ నోపు ననుచు సంశయమతితోన్.

283


క.

అనద నుపవాసకృశ నిట, నను నేటికి దుఃఖపఱుప నక్తంచర వ
చ్చినవాఁడ వీవు నిక్కపు, వనచరుఁ డైతేని యిపుడవంచనమతి వై.

284


ఉ.

ఎట్టిఁడు నానిజేశుఁడు శుభేక్షణ మెట్టిది సద్గుణోత్కరం
బెట్టిది రూపురేఖ లవి యెట్టివి యంగవిశేషసౌష్ఠవం
బెట్టిది వర్ణలక్షణము లెట్టివి లక్ష్మణుఁ డెట్టివాఁడు నా
కి ట్టని పోలఁ జెప్పినఁ గపీశ్వర యుండెద నమ్మి నెమ్మదిన్.

285


వ.

నావుడు నద్దేవి మనస్సంశయంబు వాప నాససీలలామకు విశ్వాసప్రత్యయసం
తోషంబులు పుట్టింపం దలంచి హనుమంతుం డి ట్లనియె.

286


క.

రాఘవుఁడు చారుమేచక, మేఘశ్యాముఁడు గృపాసమేతుఁడు విబుధ
శ్లాఘాకలితుఁడు సమరా, మోఘాస్త్రుఁడు వికచపద్మముఖుఁడును మఱియున్.

287


మ.

రవిరోచిష్ణుఁడు భూసహిష్ణుఁడు రణప్రస్ఫారనానాజయో
త్సవవర్ధిష్ణుఁడు సచ్చరిత్రుఁడు సురక్షాకేళివిష్ణుండు నా
హవవీరారినిరాకరిష్ణుఁడును సత్యాలంకరిష్ణుండుఁ బ్రా
భవలక్షీప్రభవిష్ణుఁడు గుణగణభ్రాజిష్ణుఁడు జిష్ణుఁడున్.

288


క.

బ్రహ్మప్రార్థితజన్ముఁడు, బ్రహ్మాస్త్రప్రముఖదివ్యబాణచయుండున్
బ్రాహ్మణభక్తిప్రవణుఁడు, బ్రహ్మవిదుఁడు బ్రహ్మచర్యపరమవ్రతుఁడున్.

289


వ.

జానకి విను నీదేవుం డగు రామదేవుండు ధాతయు జగత్త్రాతయు లోకనేతయుఁ
గర్తయు భర్తయుఁ గామక్రోధప్రహర్తయు సర్వభూతహితుండును రాజవిద్యా
విశారదుండును వర్ణాశ్రమసీమాప్రవర్తకుండును వేదవేదాంగధనుర్వేదకోవి

దుండును సత్యసంధుండును బంధుప్రియుండు నాశ్రితవత్సలుండును బితృభక్తి
తత్పరుండును శీలదాక్షిణ్యసంపన్నుండును బహుశ్రుతుండు ననంతప్రతాపుండు
నతిగంభీరుండును మహాజవసత్త్వసంపన్నుండును మహేంద్రప్రతిమానదుర్జయుం
డును జంద్రసమాననితాంతకాంతుండును మారాకారుండును మహారథుండును
బృహస్పతిసమానబుద్ధియు యక్షేశసంకాశసర్వలోకరాజ్యధురంధరుండును సకల
గుణాకరుండును శత్రుభీకరుండును బరసుందరీపరాఙ్ముఖుండును దుందుభిస్వ
నుండును విపులాంసుండును మహాహనుండును మహాబాహుండును మహోర
స్కుండును గంబుగ్రీవుండును గూఢజత్రుండును సుతామ్రాక్షుండును స్నిగ్ధవ
ర్ణుండును సముండును సమవిభక్తాంగుండును సువిక్రముండును సులలాటుండును
ద్రిశీర్షుండును బీనవక్షుండును జతుష్కిష్కుండును జతుర్దంష్ట్రుండును జతుర్గతి
యుఁ జతుర్లేఖుండును జతుష్కళుండును జతుర్దశసమద్వంద్వుండును ద్రిస్థిరుం
డును ద్రివ్యాప్తుండును ద్రివళీయుతుండును ద్రికాలజ్ఞుండును ద్రితామ్రుండును
ద్రిస్నిగ్ధుండును ద్విశుక్లుండును దశపద్మవంతుండును దశవిశాలుండును షడున్న
తుండును బంచస్నిగ్ధుండును నష్టవంశవంతుండు ననునివి మొదలుగా ననేకశుభ
లక్షణంబులు గలవు నాకన్నయవి నీకు విన్నపంబు సేసితి మఱియు సువర్ణవ
ర్ణుండు గాని సౌమిత్రియు నన్నిగుణంబులం దమయన్నచందంబువాఁడు నా
రాక కెదురుసూచుచు సముద్రతీరంబున నంగదాదు లనేకవానరులతోడ నున్న
వా రింక నీసేమంబు వేగంబ యెఱింగింప రామచంద్రునొద్దకుం బోవవలయు
ని న్నట్లు జనస్థానంబునం గోల్పడి నీపోయినమార్గంబు వెదకుచు వచ్చి ఋశ్య
మూకంబు చేరి యచట సుగ్రీవునితో సఖ్యం బాచరించి నీప్రసంగంబు దడ
వుడు నతండు నీవు రావణుచేతం బట్టువడిపోవుచు లజ్జ నింకేటికిఁ దొడవు లనుచు
నీపైచేలకొంగున ముడియఁ గట్టి భూనిక్షేపంబు సేయుచుం బోయినతొడవు లేఁ
గొనివచ్చి యిచ్చిన నందికొని భౌమునందునుండు రఘునందనులముందటం బెట్టిన
రామచంద్రుం డౌతొడవు లంకోపరిస్థలంబునం బెట్టికొని బాష్పధారామగ్నుం డ
గుచు నక్కునం జేర్చికొని చూచి యాలింగనంబు సేసి తమ్ముఁడుం దానును బహు
ప్రకారంబుల విలపింప నేనును భానుజుండును నెట్టకేలకు చేర్చి ప్రసన్నులం
చేసి తన్నియోగంబున నిన్ను నన్వేషింప వచ్చిన రాఘవేంద్రునిదూతను సుగ్రీ
వునిసచివుండఁ బవనతనయుండ హనుమంతుం డనువాఁడ భవద్దర్శనోత్సాహం
బున సముద్రంబు దాఁటి లంక సొచ్చి సర్వంబును బరికించితి రావణుం
డిట వచ్చుట యెఱుంగుదు నిక్కంబు నీదాసుండ నమ్ము మనుచుం బాదం
బుల కెరఁగి లేచి వినయంబున నింక నేచింత వలదు నీనిజేశుండు సకలగుణాభి
రాముం డగురాముండు నీ కానవా లిచ్చినభద్రముద్రిక యవధరింపు మని
చేతి కిచ్చిన.

290

హనుమంతుఁ డానవా లిచ్చినయుంగరమును బుచ్చుకొని సీత చింతించుట

క.

తనువునఁ బులకము లెగయఁగఁ, గనుఁగవ నానందబాష్పకణములు గ్రమ్మం
గనుఁగొని లజ్జావనతా, నన యై తగ మఱియుఁ జూచి నాథుఁడపోలెన్.

291


ఉ.

అక్కునఁ జిక్కఁ జేర్చి ముద మారఁగ ము ద్దిడి యింతగాల మే
నిక్కడ నిట్ల యుండఁగ నిజేశుఁడు నీవును నన్నుఁ బాసి మీ
రక్కడ నుండ నెట్లు మనసాడె విభుం డట నన్ దలంచునా
నిక్కము చెప్పు నావలని నెయ్యము భూపతి కెట్టిచందమో.

292


క.

బాఁతిగ నిడ గ్రైవేయక, మై తోఁచెదు నాకు నాదుప్రాణేశునకుం
జేతం బెట్టఁగఁ గంకణ, మైతో కేయూర మైతొ యచ్చటఁ జెపుమా.

293


క.

నరపతికి నాకుఁ బరిణయ, మిరవారఁగ నాఁడు చేసి తిప్పుడు దేశాం
తరమునఁ జిక్కిననన్నును, వరునిం గూర్పంగ నీవ వచ్చితి కరుణన్.

294


వ.

అని పలికి హనుమంతుం గనుంగొని.

295


క.

శౌర్యఘనుండవు నానా, కార్యసమర్థుఁడవుఁ బ్రజ్ఞ గలవాఁడవు నీ
వర్యమకులు లగురఘునృప, వర్యులసేమంబుఁ జెప్ప వచ్చితి నాకున్.

296


క.

నలు వొందితి బ్రదికితి నీ, వలనన్ రాఘవులకుశలవార్తలు వింటిం
దెలియఁగ రఘుకులరక్షణ, మెలమిం గావింపఁ బుట్టి తీవు కపీంద్రా.

297


క.

అసహాయశూరుఁడవు నీ, వసమప్రజ్ఞుఁడ వుదాత్తయశము బలముఁ బెం
పెసఁగఁగ ని మ్మెందును రా, క్షసభయములు నీకు లేవు కపికులవర్యా.

298


క.

కొంకక గోష్పదలీల వి, శంకటజలరాశి దాటి సత్వరగతి నీ
లంకాపుర మంతయు ని, శ్శంకం ద్రిమ్మరితి వీవు సామాన్యుఁడవే.

299


క.

ఎన్నఁడు రాముఁడు రాఁ గలఁ, డెన్నఁడు గొనిపోవు నన్ను నెన్నఁడు దుఃఖా
పన్నత లే కుండుదు నే, నెన్నఁడు సాకేతపురికి నేఁగుదుఁ బతితోన్.

300


క.

అన విని పావని సీతం, గనుఁగొని యి ట్లనియెఁ దల్లి ఘనచింతన్ వే
దనఁబడియెదు నీవిభుఁ డగు, జనపతి నీవలనఁ బ్రియుఁడు సదయుఁడు నగుటన్.

301


సీ.

నిన్నుఁ బాసినగోలె నియతితో నంచిత, స్థండిలశయనుఁ డై యుండు నపుడు
మధుసేవ సేయఁడు మాంసంబు ముట్టఁడు, నిద్ర యెన్నఁడుఁ బోఁడు నిద్ర గన్నఁ
గల నిన్నుఁ బేర్కొనుఁ గమనీయఫలపుష్ప, కాంతాదివస్తువుల్ గన్నయపుడు
హాసీత హాసీత యనుచు మానము దూల, వలవంత లోఁ గుందు వగలఁ బొగులు
వేఁడియూర్పులు నిగిడించు విరహవహ్ని, వేఁగు నీపోకఁ దలపోయు విన్నఁబోవు
వినుతవిక్రమకథలందు వేడ్క లేదు, పత్ని చెఱపోయె నని లజ్జఁ బలవరించు.

302


క.

అనుచరి యగుమత్ప్రియతో, నెన వాసిననాదుజన్మ మేటికి నాకుం
దను వేటికి మను వేటికి, ధను వేటికి దివ్యబాణతతు లేమిటికిన్.

303


వ.

అనుచుఁ బ్రలాపించుచు మఱియు నెప్పుడు నీయంద చింతాక్రాంతుండై యుం

డు నాచేత నీవృత్తాంతంబు విన్నయప్పుడ నాకంటెఁ బ్రబలు లైనయనేక
వానరవీరులతోడ దండెత్తి వచ్చి పుత్రమిత్రభ్రాతలతోడ రావణుం బరిమా
ర్చి నెయ్యం బార ని న్నయోధ్యకుం గొనిపోయెడు నంతదాఁక సైరింప లేకున్న
వినుము.

304


క.

వీఁ పెక్కి రమ్ము లంకా, ద్వీపముతోఁ గూడ నైన దేవీ నిను నే
నేపునఁ గొనిపో నోపుదు, నీపతికడ కబ్ధి గడచి నిమిషములోనన్.

305


క.

ఈపనికి సంశయించిన, భూపక్షిమృగాదిరూపములు పూనెద నే
రూపమున నైన నినుఁ గొని, భూపతిసన్నిధికి వేగ పోయెద జననీ.

306


ఉ.

నావుడు సీత యెంతయు మనంబున సంతస మంది యి ట్లనున్
నీ వతిసూక్ష్మగాత్రుఁడవు నిక్కువ మారఁగ నన్ను నేగతిన్
భూవరునొద్ద కెత్తికొని పోవఁగఁ జాలుదు వన్న నవ్వుచుం
బావని నాదురూప మిదె భామిని గన్గొను మంచు నేపునన్.

307


క.

జలనిధులు జానుదఘ్నం, బులుగాఁ గులగిరులు గజ్జపొడవులుగాఁ దా
రలు దలపువ్వులుగా దిక్కులు కడవం బెరిఁగెఁ గనకకుధరముభంగిన్.

308


వ.

ఇ ట్లేచి ప్రళయకుపితభైరవాకారప్రకారం బగుతనయాకారంబు సీతకుం జూపి
వజ్రదంష్ట్రాకరాళుండును దీప్తవహ్నిసన్నిభుండును బాలార్కతామ్రవక్త్రుండును
మేరుమందరాకారుండును నై హనుమంతుండు సచరాచరాధిష్ఠితం బగులంకా
ద్వీపంబుతోడం గూడ నైన ని న్నెత్తికొని సురాసురాదు లడ్డపడిననైన మీఱి
రామదేవుకడకుం గొనిపోయెద ర మ్మనుడు నద్దేవి పావనిం జూచి నీ వెంతకైన
సమర్థుండ వగు టెఱుంగుదు ననుచు ని ట్లనియె.

309


మ.

మరుదుద్యద్గతి నన్ను నెత్తికొని భీమవ్యోమమార్గంబునం
దరుగన్ బ్రాణము లంతరిక్షమున నిర్యాతంబు లౌ నొండె ని
ర్భరవాతోద్ధతపాదఘాతముల నభ్రవ్రాతముల్ దూల సా
గరమధ్యంబునఁ గూలి గ్రాహతిమినక్రగ్రాస మై పోవుదున్.

310


వ.

అట్లు గాక న న్నె త్తికొని నీవు సన దశముఖుం డెఱింగి పనుపఁ గ్రూరాకారు
లైనరాక్షసులు శరశరాసనకరవాలశూలపరశుపట్టిసముసలముద్గరతోమరకుంత
చక్రప్రముఖప్రహరణంబులఁ గీలాభీలంబుగాఁ గవిసి నొప్పింప నీవు నిరాయు
ధుండ వద్దురాత్ముల నె ట్లోర్చెదవు న న్నెట్లు సముద్ధరించెద నాతుములసమరం
బున నీకుం బ్రమాదంబు పుట్టెనేని సకలయత్నంబులు విఫలంబు లగు నీచే
దప్పి పడిననన్ను విశసించి రాక్షసులు భక్షింతురు కాన యత్తెఱం గలవడదు
మఱియు నొక్కవిశేషంబు చెప్పెద నాకర్ణింపుము.

311


క.

పరపురుషులతను వంటని, పరమపతివ్రతను నాఁడు పంక్తిగ్రీవుం
డురవడిఁ బెనంగి నన్నుం, బరవశ నై యుండఁ బట్టి బలిమిం దెచ్చెన్.

312

తే.

అనుడు హనుమంతుఁ డమ్మాట కాత్మ మెచ్చి, తల్లి నీపుణ్యశీలంబుఁ దగవుఁ దపముఁ
జారుగుణములుఁ జెయ్వులుఁ జాల లెస్స, విభున కిన్నియు వినిపింతు వేడ్క నెరయ.

313


తే.

తడయరాదింక నిచ్చట ధరణిపతికిఁ, బోల నీయున్కి సెప్పంగఁ బోవవలయు
విభుఁడు నమ్మెడు తెఱఁగున విన్నవింతు, నెఱుక కేమైన నానవా లిమ్ము లెమ్ము.

314

సీత హనుమంతునితోఁ గాకాసురుని వృత్తాంతము చెప్పుట

వ.

అని పలుక సీత హనుమంతుఁ గనుంగొని చిత్రకూటాచలపూర్వోత్తరపార్శ్వం
బున ఫలదళకుసుమసమృద్ధం బైన తాపసాశ్రమం బొప్పు నాచేరువ సిద్ధాశ్రమం
బు గలదు తత్సవిూపంబున మందాకినీతీరంబున నొక్కయుద్దామారామం బభిరా
మం బగుచుండు నందు విహరించి జలకేళిం దేలి పరిశ్రాంతనై మదీశునంకశయ్య
శయనించితిఁ బరువడి నతండు మదంకశయ్య శయనించి యుండ నొక్కకాకంబు
వచ్చి న న్నాసక్తిం జూచి నాపయ్యెదకొంగు చండతుండాగ్రంబున వెడలించి కు
చాంతరంబు నఖాగ్రంబున విదారించిన నే నొక్కయిషీకంబు వైచిన నది వోక
చేరువన మేపు గొనుచుండఁ దత్క్షతవ్యథ కే నేడ్చిన మేల్కని నగుచు నాకన్నీరు
దుడిచి విభుం డుపలాలించి కొంతవడికి రక్తసిక్తం బగుకుచాంతరకాకనఖరేఖ
నవలోకించి నిటలతటకుటిలభ్రుకుటి యగుచు నాశీవిషభీషణరోషోగ్రనిశ్శ్వా
సంబులు నిగిడించుచు ని ట్లనియె.

315


క.

నాకినుక గోరి యెవ్వం, డీకృత్రిమ మాచరించె నెవ్వఁడు కుప్య
ద్భీకరతరవిషధరద, ర్వీకరసహకేళి సలుప వేడుక సేసెన్.

316


వ.

అనుచుఁ గెలంకులు పరికించుచున్న సమయంబున.

317


క.

నా కభిముఖమై క్రమ్మఱఁ, గాక మ్మొడియంగ రాక గనుఁగొని కిన్కం
గాకుత్స్థాన్వయనాథుఁ డి, షీకము మంత్రించి వైచెఁ జెన్నఁటికాకిన్.

318


వ.

ఇట్లు మంత్రించి వైచిన నది బ్రహ్మాస్త్రం బగుచు.

319


చ.

విడువక నీడవోలెఁ దనవెంటనె మంటలు మింట నంటఁగాఁ
బిడుగులు పెల్లుగాఁ బడఁగ భీమగతిం బఱతేర భీతితో
వడిఁ గరటంబు లోకములు వారక త్రిమ్మరి నిల్చి చూడ వె
న్నడి నది రాఁగఁ జూచి నరనాథునియొద్దకు వచ్చి మ్రొక్కుచున్.

320


క.

అపరాధి నన్నుఁ గావుము, నృప నీశరణంబు గంటి నిందితపాప
వ్యపగతుఁడ నైతి నావుడుఁ, గృపణపువిహగంబుఁ జూచి కృప ని ట్లనియెన్.

321


క.

విను నాబాణ మవంధ్యము, సన నీయంగ మొకఁ డిచ్చి చను మన నగుఁ గా
కనుచుం దనలోచన మా, ఘనసాయకమునకు నిచ్చి కాకము సనియెన్.

322


వ.

ఇత్తెఱంగునం బూర్వచిహ్నితం బైనకుచాంతరక్షతంబును జెప్పి తనగండ
స్థలంబున రాముండు లిఖియించినమనశ్శిలాపత్రరేఖయు నెఱింగించి యంత
మీఁద.

323

సీత హనుమంతునికి శిరోమణి యానవాలిచ్చుట

క.

చనఁ దనకొంగున ముడిచిన, సునిశితరుచి గలయనర్ఘచూడామణి యి
చ్చిన మ్రొక్కుచు నారత్నము, ననురక్తిం బుచ్చుకొని ధరాత్మజ కెలమిన్.

324


వ.

ప్రదక్షిణపూర్వకంబుగా దండప్రణామం బాచరించి లేచి శిరంబునం జేతులు
మొగిడ్చి యభివందనంబు సేసి దశస్యందననందనపదారవిందంబులు దనడెందం
బున నిడికొని పవననందనుండు ప్రయాణోన్ముఖుం డగుటయు నవలోకించి యద్దేవి
యిట్లనియె.

325


క.

రాముని కట నామ్రొక్కు గఁ, బ్రేమంబున నీవు మ్రొక్కు భీమనిశాటీ
స్తోమమ్ముచేత నాపడు, బాములు సకలంబుఁ జెప్పు బాగుగ మఱియున్.

326


క.

తనసతి ఖలుఁ డొకఁ డుద్దతిఁ, గొనిపోయిన నూరకునికి గుణమే పతికిన్
వినఁగ నపకీర్తి గాదే, జను లాడరె ధర్మ మగునె క్షాత్రము వలదే.

327


వ.

అని పలుకు మని వెండియు.

328


క.

జననిగతి నన్నుఁ జూచును, జనకునిచందమున రామచంద్రునిఁ జూచున్
జననీజనకులపంపునఁ, బెనుఁగానల మమ్ముఁ గొల్చి ప్రీతిన్ వచ్చెన్.

329


వ.

అట్టినాముద్దుమఱందితోడం గుశలం బడిగితి నని మఱియు నగ్గుణనిధితో
ని ట్లనుము.

330


క.

కూడని పరుసంబులు దను, నాడినయాఫలము గంటి నను మింకను నా
కీడు డలంపకు మను మీ, కాడిక రాకుండ మెలఁగు మను కృప పుట్టన్.

331


వ.

రామలక్ష్మణసుగ్రీవాదులఁ గుశలం బడిగితి నను మింక నేచందంబున నైన నొక్క
మాసంబుదాఁకఁ బ్రాణంబులు చిక్కంబట్టి యుండెద నను మెల్లతెఱంగులుఁ
జెప్పితి నివ్విధంబు లన్నియుం జెప్పు వేవేగ సకలసైన్యంబులతోడ రామదేవునిం
దోడి తెమ్ము కపికులచంద్రా నీ విట రాకకుం బ్రమోదంబు నొందితి గుణనిధివైన
నీ వటఁ బోకకు భేదం బగుచున్నయది యనుచు బాష్పాకులలోచనయును దీన
వదనయు నై యున్న జానకి నూరార్చి పవమానసూనుండు పునఃపునఃప్రణామం
బులు సేసి వీడ్కొని యటఁ జనిచని మనంబున నూరక పోనేల కొంతపౌరు
షంబు సూపెదం గాక యనుచు విక్రమక్రమోత్సాహం బెసంగ నవ్వనంబు
నకుం గవిసి.

332

హనుమంతుఁ డశోకవనభంగంబు చేయుట

చ.

ఫలములు డుల్లిపోఁ జఱిచి పర్ణము లన్నియుఁ ద్రుంచి వైచి కొ
మ్మలు నుఱుమాడి కుంజము లమందగతిన్ వెసఁ ద్రెంచి పాదపం
బుల వెస వేళ్లతోఁ బెఱికి పువ్వులు రాలిచి డొల్లఁ దాఁచి పెం
దలిరులు నేలఁ గూలఁగ లతావితతుల్ విదలించి వెండియున్.

333


వ.

ప్రలయకాలాభీలవాతూలంబులీల వృక్షంబులు విఱుగఁ దాఁచుచు శుంభత్సం

రంభదంభోళియుంబోలెఁ బర్వతశృంగంబులఁ బగుల వ్రేయుచుఁ జండమదోద్దండ
శుండాలంబుచందంబునఁ గమలాకరంబులు గలఁచియాడుచుఁ గ్రూరావిర్భావదా
వపావకుండునుంబోలెఁ బ్రమదావనంబులు భస్మీకరించుచు నివ్విధంబున దారుణ
విహారంబు సల్పుచుండ నందుఁ బొడమిన కాకోలకేకిశుకపికఘూకబకకులసంకు
లస్వనకోలాహలంబును భీకరదర్వీకరపుండరీకభల్లూకకంఠీరవభైరవకలకలంబు
ను నాకర్ణించి లంకానివాసు లందఱుఁ గొందలపడి వెగడుపడి పఱవ వారి నంద
ఱం గనుంగొని లయకాలభైరవభీకరాకారుం డై దెస లద్రువ నార్చుచుఁ దోరణ
స్తంభంబు సేరె నిట సీతాసమీపంబున నిద్రించి యున్న రాక్షసవనితలు.

334


క.

అప్పుడు దరువులు విఱిగెడు, చప్పుడు వడి నేలఁ గూలుచప్పుడుఁ బై పై
నుప్పర మెగసెడుపక్షుల, చప్పుడు నారవము లెసఁగు చప్పుడుఁ జెలఁగన్.

335


క.

 మిట్టిపడి లేచి వన మొగి, బట్టబయలు గాఁగఁ బెఱుకు పవనతనూజుం
గట్టలుకఁ జూచి రక్కసు, లి ట్టట్టుగఁ బాఱ సీత కి ట్లని రలుకన్.

336


క.

ఎక్కడిమర్కటుఁ డిటకును, మొక్కలముగ వచ్చి నీదుముందట మాటల్
పెక్కులు ప్రేలి వెసం జని, స్రుక్కక వన మెల్లఁ బెఱుకఁ జొచ్చెం గడిమిన్.

337


వ.

అని పలుక వారలకు సీత యి ట్లనియె.

338


క.

మాయావులు రాక్షసు లే, మాయలు పన్నుదురొ నాదుమానము గలఁగం
జేయఁగ నాకుహకులయ, మ్మాయలు నా కెఱుఁగ వశమె మాయాప్రౌఢల్.

339


వ.

మీ రెఱుంగుదురు గాక మీరాక్షసమాయలు పా మెఱుంగుఁ బాముకా ళ్లిత
రుల కెఱుంగవచ్చునే యేనును మనంబునం గలంగుచున్నదాన నిది రాక్షన
మాయ గానోపు ననవుడు నతివిస్మయభ్రాంత లగుచుఁ గొంద ఱత్తన్వియొద్దన
యుండిరి కొందఱు భయంబునం బఱచిరి కొందఱు సంభ్రమంబునం బాఱి
కంపంబు వొడమ రావణున కి ట్లనిరి.

340


చ.

సురపతిదూతయో ధనదచోదితదూతయొ సీత రామభూ
వరుఁ డరయంగఁ బంప నిట వచ్చినదూతయొ వానరుం డొకం
డరుదుగ వచ్చి సీతకుఁ బ్రియంబులు పల్కి మహోగ్రమూర్తి యై
తరుతతు లన్నియుం బెఱికెఁ దత్ప్రమదావన మెల్ల రిత్తగన్.

341


తే.

ధరణిసుత యున్న శింశుపాతరువు నైనఁ, బెఱుకఁ డెపుడును జూడఁడు ప్రియముతోడ
వసుమతీసుత కుండ నివాస మగుట, నీడతో నామహీజంబు నిలుప వలసి.

342


క.

సీతకడ కేము వెసఁ జని, నీతో భాషించి చనిన నీచుం డెవ్వం
డాతనిఁ జెప్పుము నావుడు, మాతోఁ దా నెఱుఁగ ననుచు మాయన్ మొఱఁగెన్.

343


చ.

ఘనతరఫాలపట్టికలఘర్మకణంబులు గ్రమ్మ భీకరా

ననములు జేవుఱింపఁగ ఘనభ్రుకుటిస్ఫుటకోపదీప్తుఁ డై
కనదురువిస్ఫులింగములు కన్నుల రాలఁగ [15]నౌడు దీటికొం
చెనుబదివేలరక్కసుల నెక్కుడుశౌర్యము గల్గువారలన్.

344


వ.

పనిచిన వారు నాటోపంబున శూలముద్గరతోమరపరిఘగదాముసలభిండివాలచ
క్రాదిసాధనంబులు కీలాభీలంబులుగా నడచి ముందట హనుమంతుం గనుంగొని.

345


క.

మిడుతలు దావానలమునఁ, బడ వడిఁ బఱతెంచుకరణిఁ బైపైఁ దనపైఁ
బుడమి వడఁక మేఘంబులు, సుడివడఁ గైదువులు ద్రిప్పుచుం బఱతేరన్.

346


శా.

కాలవ్యాళకరాళవాల మొగిఁ జుక్కల్ రాల నభ్రావలుల్
దూలం ద్రిప్పుచు లోకభీకరతరస్థూలాత్ముఁ డై యుద్ధలీ
లాలోలాగ్రహవృత్తి నార్చెఁ బెలుచన్ లంకాగుహాగేహది
క్కూలానేకపకర్ణకోటరజగద్ఘూర్ణప్రఘూర్ణంబుగన్.

347


క.

బెగడిరి రక్కసు లప్పుడు, ఖగములు సుడివడుచుఁ బడియెఁ గర్ణపుటంబుల్
పగులం దారలు రాలెను, దిగిభంబులు పోలి వ్రాలె దిక్కులు వ్రీలెన్.

348


వ.

ఇ ట్లద్భుతంబుగా నార్చి యి ట్లనియె.

349


ఉ.

రాముఁడు లక్ష్మణుండుఁ గపిరాజును బంపఁగ వచ్చినాఁడ నే
రామునిదూత మారుతి నరాతికులఘ్నుఁడ మీర లెంత సం
గ్రామములోన నా కెదిరి రావణకోటులు వచ్చినన్ శిలా
భూమిజవృష్టి ముంచి పొరివుచ్చి బలోద్ధతిఁ బేర్చి వెండియున్.

350


సురవైరిపురము గాలిచి, యరుదందుచు యాతుధాను లందఱుఁ జూడన్
ధరణిజకు మ్రొక్కి పోయెద, శరనిధి లంఘించి రామచంద్రునికడకున్.

351


క.

అనిన విని యతనిపరుష, ధ్వనికి బెగడుచును యాతుధానులు సంధ్యా
ఘననిభు మారుతిఁ గనుఁగొని, ఘనసాధనకీల లడరఁ గవిసిరి కడిమిన్.

352


క.

వారిం గని హనుమంతుఁడు, తోరణనిక్షిప్తమైన దుర్భరభార
క్రూరాయనపరిఘము గొని, ఘోరనిశాచరబలంబుఁ గూలఁగ మోఁదెన్.

353


వ.

ఇ ట్లవక్రవిక్రమంబు సలిపి గరుడహస్తగృహీతం బైనపన్నగంబుకరణిఁ దన
కేలఁ బరిఘంబు గ్రాల గముల కెగయుచు గగనప్రచారుం డై యుండఁ గొందఱు
బెగ్గలం బంది చూడఁ గొండఱు నింగికి లంఘించి శూలముద్గరప్రాసపరశ్వధం
బుల వ్రేయుచుఁ బొడుచుచుం దన్నుఁ బరివేష్టింపం గనలి యింద్రుం డసురుల
వజ్రప్రహితులం జేయుభంగి నారాక్షసులఁ బరిఘంబుపాలు సేసి విజృంభించి
యి ట్లనియె.

354


ఉ.

ఎక్కుడుచేవ గల్గినయనేకవలీముఖు లోలిఁ గొల్వఁగా
నిక్కడి కుగ్ర్రసేనఁ గొని యేపున భానుసుతుండు వచ్చు నిం

కెక్కడిలంక మీకుఁ గల దెక్కడ రావణుఁ డుండువాఁడు మీ
రెక్కడివార లిందఱకు నేర్పడఁ గాలము చేరె నావుడున్.

355

ఆంజనేయుఁడు జంబుమాలిని మంత్రిసుతసప్తకంబుం జంపుట

వ.

కొందఱు దిగ్భ్రమ నొకరొకరికిం జెప్పక దిక్కులకుఁ బాఱిరి కొండఱు బెగ్గలం
బునం గొందలపడుచుఁ జేష్టలు దక్కి కూర్చుండి కనుంగొనుచుండిరి కొండ ఱుర
వడి మేనులు చెమర్పఁ దలలు వీడం బాఱి రావణున కత్తెఱం గెఱింగింపం గోపం
బున బొమలు గీలించుచుఁ బ్రహస్తపుత్రుం డైనజంబుమాలిం జూచి నీవు
వోయి వనచరునిం బరిమార్చి రమ్మని నియోగించిన.

356


ఉ.

మండితకుండలుండును సమంచితవాసవచాపతుల్యకో
దండుఁడు రక్తమాల్యపరిధానధరుండును భూరిఘోరదం
ష్ట్రుండు ఖరప్రదీప్తరథుఁడుం బటురోషనిరీక్షణుండు ను
ద్దండరణప్రచండభుజదండశరుండును నై బలోద్ధతిన్.

357


క.

దిక్కరిశుండాదండస, దృక్కోదండగుణటంకృతిధ్వానంబుల్
ధిక్కృతవనధిధ్వను లై, దిక్కులఁ బిక్కటిలి చెలఁగఁ దెంపున నడిచెన్.

358


వ.

ఇ ట్లరుగుదెంచి శరాసారఘోరంబుగా సమీరకుమారుపైఁ గవిసి.

359


క.

వదన మొకయర్ధచంద్ర, ప్రదరంబున నొంచి శిరము పటుతరకర్ణిన్
విదళించి రెండుబాహులు, పదినారాచముల నేసెఁ బవమానసుతున్.

360


క.

ఉరుతరశరహతి నప్పుడు, తరుచరవీరునిమొగంబు తామ్రం బై వా
సరకరకరవిద్ధం బగు, శరదరవిందంబుపగిదిఁ జాలఁగ నొప్పెన్.

361


క.

కనలుచు హనుమంతుం డొక, ఘనశిల వడిఁ బెఱికి వైచెఁ గ్రవ్యాదుని వై
చిన నారక్కసుఁ డాశిల, సునిశితవిశిఖదశకమునఁ జూర్ణము సేసెన్.

362


క.

ఆలోఁ గ్రమ్మఱ నొకఘన, సాలము కపివరుఁడు ఫెఱికి జవమున వైవన్
లీల నిశాటుఁడు దానిన్, నాలుగుబాణములఁ ద్రుంచి నగచరవీరున్.

363


క.

శిర మొకశరమున వక్షోం, తర మిషుదశకమున భుజము దాఁకన్ శితని
ష్ఠురబాణపంచకంబున, నురవడి వాఁ డేసె విక్రమోద్ధతి మెఱయన్.

364


మ.

భ్రుకుటిప్రస్ఫుటకోపనుం డగుచు నాస్ఫోటించి నక్తంచర
ప్రకరం బాతతభీతిఁ బాఱ వడి నభ్రవ్రాతముల్ దూల నం
తకుభంగిం బరిఘంబు ద్రిప్పి యరుదందన్ వ్రేసెఁ గ్రవ్యాదుమ
స్తకబాహార్గళజానుకార్ముకరథాశ్వశ్రేణి చూర్ణంబుగన్.

365


వ.

ఇట్లు మహోగ్రంబుగా వైచి సకలరాక్షసుల నతిక్రమించి మారుతి తోరణ
స్తంభంబు చేరె సమరవిముఖు లైనవారలచేత జంబుమాలిపాటు విని రావణుం
డు రోషావిష్టుం డగుచు మరుత్సూనుమీఁదికి మంత్రిసుతసప్తకంబుం బనిచిన.

366


చ.

అనలసమానతేజులు మహాహవశూరులుఁ గేతనోల్లస

త్కనకరథాధిరూఢులును గాంచనభూషణభూషితాంగులున్
ఘనధనురస్త్రధారులును గాఢబలాఢ్యులు నైనమంత్రినం
దను లొగి నేడ్వు రుద్ధతి మదంబులతో నరు డంద నార్చుచున్.

367


సీ.

కమనీయమణిచిత్రకాంచనచాపముల్, శక్రచాపంబులచాడ్పు గాఁగ
సారెసారెకు లీల సారించుమౌర్వులు, పటుతటిల్లతికలపగిది గాఁగ
భీషణతరవాజిహేషోగ్రఘోషంబు, లురుగర్జితంబులకరణి గాఁగ
మేనుల నిగిడెడు మేచకరోచులు, దిక్కులఁ జీఁకట్లతెఱఁగు గాఁగ
భూనభోంతర మద్రువంగ సేనతోడ, మేఘసన్నిభాకారముల్ మెఱయఁ దఱిమి
విపులగిరికల్పుఁ డగుకపివీరుమీఁదఁ, బరుషసాయకవర్షముల్ గురిసి రపుడు.

368


క.

రక్షోభటపరివృతుఁ డై, వృక్షచరప్రవరుఁ డభ్రవిసరావృతుఁ డై
నక్షత్రపథమున సహ, స్రాక్షుఁడు గొమరారుకరణి నమరుచుఁ గడిమిన్.

369


వ.

వారలశరవేగంబులు వారించి యమ్మహాసైన్యంబు దిరుగుడువడ బడలువడం
జేసి కొందఱ నిర్ఘాతసమముష్టినిహతులం బొలియించియుఁ గొండఱం గరతలం
బులం దలలు పఱియలుగాఁ జఱిచి మడియించియుఁ గొండఱఁ గాలదండోద్దండ
భుజదండంబులం బడమోఁది పరిమార్చియుఁ గొందఱ నశనిసమస్పర్శనంబు
లైనపాదంబులం బడఁ దాఁచి వధియించియుఁ గొందఱఁ దీవ్రనఖంబుల వ్రచ్చి
తెగటార్చియుఁ గొందఱ శిలాకఠినం బైనయురంబునం జరియ నదిమి చంపియుఁ
గొందఱ నూరుప్రహారంబులం బ్రాణసంహారంబు గావించియుఁ గొందఱ మహా
భైరవారావంబున గతాసులం జేసియు రథధ్వజనాజిరాజివివిధాయుధభూషణ
ప్రకరంబు లాజిక్షోణి గ్రిక్కిఱియ బహుభంగుల రూపడంచియు నివ్విధంబున
దారుణరణవిహారంబు సల్పి విజృంభించిన హతశేషదోషాచరులు నలుగడలం
బాఱి రావణున కెఱింగింపఁ గనలి యతండు యూపాక్షవిరూపాక్షదుర్ధరప్రఘన
భాసకర్ణు లనుసేనానాయకులం జూచి యి ట్లనియె.

370

హనుమంతునితోఁ బోరి సేనానాయకపంచకంబు మడియుట

క.

ఏలోకంబునఁ గ్రోఁతుల, కీలావులు గలవె తొల్లి యే నెఱుఁగుదు నా
వాలిని జాంబవదినసుత, నీలద్వివిదాదు లగువనేచరపతులన్.

371


క.

వారల కీమతియును ని, చ్ఛారూపము విక్రమంబు జవము నభస్సం
చారమును బలోత్సాహము, నారయఁగాఁ గలవె యీవనాటుం డరయన్.

372


తే.

అలుక నాకుఁ గీ డొనరింప నాత్మఁ గోరి, తపము ఘనముగఁ జేసి యత్తపమువలన
నాకవిభుఁడు గల్పించిన లోకభయద, భూరిసత్త్వవిగ్రహమహాభూత మొక్కొ.

373


వ.

అట్లు గాక.

374


క.

సురమునిగంధర్వాదులు, కర మలుకన్ నన్నుఁ జెఱుపఁ గల్పించినభీ
కరకృత్య మహాఘనవన, చరరూపముఁ బూనె రజనిచరుల నడంపన్.

375

వ.

అదియునుం గాక.

376


క.

అని నాకు నోడి యింద్రా, ద్యనిమిషు లొనరించినట్టి యపకారం బే
యనుమానము లే దింకను, వనచరునిం బట్టి తేరవలయును మీరల్.

377


వ.

కావున రథకరితురంగపదాతిబలంబులతోడం గూడి వివిధాయుధసంపన్నుల రై
యరుగుండు మీ కెదిరి యింద్రప్రముఖసురు లైన నిలువంగలరె య ట్లయినను
గేవలవానరుంగాఁ జూడక యతిప్రయత్నంబునఁ గదనంబు సేసి వానిం బట్టి తెం
డనవుడుఁ బతియాజ్ఞ శిరంబున ధరియించి హుతాశనప్రదీప్తమూర్తులును జతు
రంగబలపరివృతులును వివిధాయుధకలితులు నగుచు నరిగి మకరతోరణంబు
మీఁద నుదయాచలస్థుం డైనతపనునికరణి దేదీప్యమానం బగుచున్న పవమాన
సూనుం గనుంగొని యఖిలదిశలు నస్త్రమయంబులుగాఁ బొదివి రాసమయంబున
దుర్ధరుండు దలకడచి.

378


క.

మారుతసుతు నయి దాయత, నారాచంబులు శిరంబు నాటించిన ది
క్పూరితముగ నార్చుచుఁ గపి, వీరుఁడు గగనమున కెగయ వెస దుర్ధరుఁడున్.

379


క.

తో నెగసి బాణవర్షము, వానరుపైఁ గురియ దాని వారించి మరు
త్సూనుఁడు నింగి సెలంగ మ, హానిల మంబుదముఁ దోలునగ్గతిఁ దోలెన్.

380


వ.

ఇట్లు దోలినం బోక వెండియు వాఁ డనికిం దఱిమిన.

381


క.

కడుఁబొడవు కెగసి యెక్కుడు, వడి దుర్ధరుతేరిమీఁది వనచరుఁ డుఱికెం
బిడు గురవడి గిరిపైఁ బడు, వడువున రథసహితుఁ డగుచు వాఁ డిలఁ గూలెన్.

382


వ.

ఇట్లు నేలం గూలి గతాసుం డైనదుర్ధరుం జూచి యూపాక్ష విరూపారులు లుగ్ర
కోపంబున.

383


చ.

ఇరువురు నింగికిన్ నెగసి యెక్కుడుదర్పము లార భూరిము
ద్గరములు ద్రిప్పి వైచిన నుదగ్రత నుర్వికి డిగ్గి వాయుజుం
దురుతరసాలముం బెఱికి యుగ్రతఁ ద్రిప్పుచుఁ బాఱుతెంరెంచి య
య్యిరువురఁ గూలనేసి పొలియించినఁ గన్గొని యాగ్రహంబునన్.

384


తే.

ప్రఘసుఁ [16]డుగ్రంపుఁబ్రాసంబుఁ బట్టిసంబు, భాసకర్ణుఁడు శూలంబుఁ బరఁగఁబూని
యలుక నొప్పింప రక్తసిక్తాంగుఁ డగుచుఁ, బవనజుఁడు బాలసూర్యునిపగిది నొప్పి.

385


క.

తరుపన్నగమృగయుత మగు, గిరిశిఖరం బొకటి వెఱికి కిను కడరఁగ న
య్యిరువుర రజనీచరులను, ధరపైఁ బడి నుగ్గుగా నుదగ్రత వైచెన్.

386


వ.

అ ట్లిరువురం బరిమార్చి శేషించినసైన్యంబునకుం గవిసి.

387


క.

కరిహరిరథయోధులతోఁ, గరిహరిరథయోధతతులు క్రమమున నుగ్గై
ధరఁ బడఁ బొరిఁబొరి వ్రేయుచుఁ, దరుచరవీరుండు దఱిమెఁ దత్సైన్యంబున్.

388

క.

విఱిగినరథముల ధరఁ గ్రి, క్కిఱియఁ బడినకరటిఘటల నెమ్ములు నుగ్గై
యొఱగినహయములఁ బఱియలు, పఱియలుగాఁ ద్రెళ్లియున్న భటసంఘములన్.

389

అక్షకుమారుఁ డాంజనేయునితోఁ బోరి చచ్చుట

వ.

అమ్మహాహవం బద్భుతరసావహం బగుచు రుద్ధమార్గం బయి యుండం గనుం
గొని యార్చుచు హనుమంతుండు తోరణాధిరూఢుం డయ్యె న ట్లయ్యేవురు
సేనానాయకులు బలంబులతోడఁ బొలియుట హతశేషులవలన విని సామర్షుండై
రావణుం డక్షకుమారు నీక్షించినఁ గనుసన్న యెఱింగి కాంచనకార్ముక
ధరుం డై హుతప్రదీప్తానలుండునుంబోలె నేపారి సభామధ్యంబు వెడలి
తండ్రికి దండప్రణామం బాచరించి ముకుళితకరుండై నిల్చిన నీవు వోయి యా
మర్కటాధముం బొలియించి ర మ్మనిన నతండును యుద్ధసన్నద్ధుండై తప్తకాం
చనమయంబును బాలసూర్యప్రభాశోభితంబును సమస్తాస్త్రశస్త్రపరివృతంబును
రత్నమయధ్వజపతాకాభిరామంబు నతిమనోజవసత్వాతురంగాష్టకయుక్తంబును
వ్యోమగామియు నగునొక్కదివ్యస్యందనం బెక్కి మణిమయకుండలాంగదంబులు
వెలుంగం దురంగశతాంగమాతంగవీరభటపరివేష్టితుండై హయహేషాకరిబృం
హితరథనేమిస్వనవీరభటసింహనాదంబులు శంఖకాహళభేరీపణవాదివాద్యం
బులతోడం గూడి రోదసీకుహరాంతరపూర్ణంబుగా నార్చుచు వచ్చి మకర
తోరణంబునఁ గల్పాంతకాలాగ్నియుంబోలెఁ బ్రజ్వరిల్లు హనుమంతుం గనుం
గొని విస్మయసంభ్రమాకులచేష్టుం డగుచుఁ గదిసి యతనివేగపరాక్రమంబులు
వారించుచు మహీమధ్యదివాకరుండునుంబోలె వర్తించి సమరంబునకుం గంపిం
పక దుర్నివారుండై యున్నమారుతిం గని మూఁడువాఁడితూపులు ఫాలంబు నా
టనేసి వెండియు నాటోపంబునఁ జాపంబు సారించుచు నొక్కయమోఘబాణం
బు ద్రిప్పుచుం జనుదెంచిన.

390


మ.

ధర గంపించెఁ బయోనిధుల్ గలఁగె వీతం బయ్యె వాతంబు భా
స్కరతేజం బడఁగె గిరుల్ వడఁకెఁ జుక్కల్ రాలె నుల్కాసము
త్కరముల్ గూలె నభంబు మ్రోసె వడి భూతవ్రాతముల్ భీతిలెన్
నెరసెం జీఁకటి దిక్కులందుఁ బడియెన్ నిర్ఘాతసంఘాతముల్.

391


వ.

అయ్యవసరంబున.

392


క.

విషమబలుం డనిమిషవి, ద్విషుఁ డంచితహేమపుంఖవిషకలితాశీ
విషభీషణంబు లగుమూఁ, డిషువులు మస్తకము గాట నేసెఁ గపీంద్రున్.

393


తే.

అవుడు నెత్తుటఁ దోఁగినయక్షు లమర, మస్తకాలీఢబాణాంశుమంతుఁ డగుచు
నంచితాంశులచేత నొప్పారునంశు, మంతుకైవడి నాహనుమంతుఁ డెసఁగె.

394


మ.

సరిఁ జాపంబు సురేంద్రచాపము ధనుష్టంకారముల్ గర్జ లు

ద్ధురనానాయుధకీలజాలములు విద్యుత్పంక్తులుం గారణాం
భారయుక్తాక్షకవారివాహము హనూమత్పర్వతేంద్రంబుపై
శరవర్షంబులు పెల్లుగాఁ గురిసె నాశాకుడ్యముల్ దూలఁగన్.

395


క.

అంత హనుమంతుఁ డెంతయు, నంతకురోషంబుతోడ నక్షునిఁ గని క
ల్పాంతఘనధ్వని నఖిలది, గంతరపూర్ణంబు గాఁగనార్చుడుఁ బెలుచన్.

396


క.

పరుషతరక్రోధంబున, నరుణాక్షుం డగుచు మారుతాత్మజు నక్షుం
దురుతృణసంవృతకూపముఁ, గర ముద్దతిఁ గరటి చేరుకకరణిం జేరన్.

397


శా.

ఆకీశప్రభుఁ డాగ్రహంబున మహోద్యద్వాయుసంరంభుఁ డై
యాకాశంబున కుద్ధతిన్ నెగయఁ గ్రవ్యాదుండుఁ దో నేఁగి నా
నాకాండావలు లేయ వానిఁ గడిమి న్వారింప వాఁ డాతతా
నేకాస్త్రంబుల నంతరిక్షము దురుత్ప్రేక్షంబుగా నేయుచున్.

398


వ.

తదీయాశుగభిన్నభుజుం డగుచు హనుమంతుం డంత సన్నద్ధశరాసనుండును
సమరోన్ముఖుండును మహారథశ్రేష్ఠుండును బలపరాక్రమదక్షుండును నగునక్షునిం
జూచి బాలుం డని తలంప రా దితనిబలపరాక్రమంబులు సురాసురులకు మనో
భయంబులు గావున వీని వేగంబ పరిమార్పవలయు నని యవక్రవిక్రమో
త్సాహంబున.

399


క.

పరుషతరహస్తతలమున, నురవడిఁ జఱవఁ దురగాక్షయుగసాయకకూ
బరములతోడను నుఱు మై, యరదము గగనమున నుండి యవనిం ద్రెళ్లెన్.

400


తే.

రక్కసుం డట్లు నుగ్గైన రథము విడిచి, ఖడ్గకోదండపాణి యై గగనమునకు
నెగసె యోగపథంబున నియతితోడ, నొడలు దిగఁద్రావి దివి కేఁగుయోగిపగిది.

401


సీ.

ఇ ట్లుగ్రుఁ డై మింటి కెగసినయక్షునిఁ, బక్షీంద్రుఁ డురగంబుఁ బట్టినట్లు
కడకాళ్లు వడిఁ బట్టి పుడమికి నేతెంచి, తొడవులు సెదరంగఁ దొడలు విఱుగ
నంగసంధులు వీడ నస్థులు నఱుముగా, భుజములు చదియంగ భూరిశిరము
పుఱియలుగా రక్తపూరముల్ గ్రక్కఁగ, వేమాఱు నేలతో వ్రేసి వ్రేసి
యంపపొదితోన నుఱుమాడి చంపి తన్ను, గరుడయక్షభూతములు నాఖండలాది
సురలు మౌనులు వెఱఁ గంది చూడ విజయ, మంది తోరణమున కేఁగె ననిలసుతుఁడు.

402


వ.

ఇ ట్లక్షుండు పొలియుట విని రావణుండు దనయంతరంగంబున దుఃఖాక్రాంతుం
డై యెంతయుం జింతించి కొంతవడికి ధైర్యం బవలంబించి కోపసంఘటితభ్రు
కుటినిటలుం డగుచు నింద్రజిత్తుం గనుంగొని.

403


క.

అస్త్రధరశ్రేష్ఠుండవు, నిస్త్రాసుఁడ వఖిలనీతినిపుణుండవు ర

క్షస్త్రాతవు నిర్జితసుమ, నస్త్రిదశేంద్రుఁడవు రిపువినాశనమూర్తీ.

404


చ.

తనయ విరించిదత్తశరధన్యుఁడవున్ రణకోవిదుండవున్
ఘనభుజవీర్యవంతుఁడవు గాఢతపఃపరిరక్షితుండవున్
వినుతతరప్రతాపుఁడవు విక్రమశాలివి నేను నీబలం
బనిమిషసేనఁ దోలి దివిజాధిపుఁ బట్టిననాఁ డెఱుంగుదున్.

405


క.

ననుఁ బోలుదు బాహుబలం, బున నస్త్రబలంబునను దపోబలమునఁ గా
వున నిను లోకత్రితయం, బున నోర్వఁగ నెవ్వఁ డోపు భుజశౌర్యనిధీ.

406


వ.

అని పలికి మఱియు ని ట్లనియె జంబుమాలిప్రముఖు లైన రాక్షసవీరు లనేకానీకం
బులతోడం బోయి పొలిసి రిం కెవ్వరు పోయిన నవ్వనచరవీరునిచేత బొలియు
టయ కాని వానిం బొలియింప సమర్థులు లేరు నీ వసమానబలుండవు నీ కసా
ధ్యం బెద్దియు లే దైనను రాజధర్మంబు సెప్పెద నస్త్రశస్త్రబలంబులు దక్క
దక్కినబలంబులఁ బని లేదు గావున వజ్రి వజ్రంబున మారుతం బాశుగమనంబున
నగ్ని తీవ్రశిఖల జగద్విజయంబు నొందుపగిది నీవు నమ్మహావీరుఁ డగువానరుని
బలపరాక్రమంబు లెఱింగి ని న్నేమఱక దివ్యాస్త్రప్రభావంబు సూపుచుఁ దగిన
వెరవున వానిం జిక్కుపఱిచి లోకంబులు మెచ్చ విజయంబు నొందు మనవుడు
నయ్యింద్రజిత్తు ప్రదక్షిణపూర్వకంబుగాఁ దండ్రికి దండప్రణామంబు లాచరించిన
నతండును గాఢాలింగనంబు సేసి విజయశ్రీ గైకొను మని దీవించి యనుప వీ
డ్కొని తీవ్రదంష్ట్రాముఖంబులు గరుడవేగంబులుఁ గలయాభీలతురంగంబులం
బూన్చినయాదిత్యనిభం బగునొక్కరథం బెక్కి బధిరీకృతదిగ్వారణశ్రవణపుటం
బుగా శుంభద్ధనుర్నిర్ఘోషంబు సెలంగించుచు నరుగఁ దద్భూరిఘోషం బాలించి
హనుమంతుండు సమరోత్సాహంబున మహానాదంబుగా సింహనాదంబు సేయ
నతం డమ్మహానాదంబు విని కోపాటోపంబునం గదియ నడచె నాసమయంబున.

407


క.

ఉరగులు సిద్ధులు యక్షులుఁ, బరమర్షులు నటకుఁ జూడఁ బ్రముదితు లై వ
చ్చిరి మృగములు వాపోయెం, దిరిగి విహంగములు మ్రోసె దిక్కులు గలఁగెన్.

408


క.

ఉరుతరవేగోద్ధతులును, నిరుపమబలయుతులు సమరనిశ్శంకులు ని
ష్ఠురబద్ధవైరులును నై, యిరువురుఁ జేరిరి సురాసురేంద్రులభంగిన్.

409


క.

చేరి వడి [17]నింద్రజి త్తతి, దారుణబాణంబు లేయఁ దచ్ఛరవేగం
బారాముదూత వేగ ని, వారించుచు మింటి కెగయ వాఁ డొగి మఱియున్.

410


ఉ.

ఆతతరత్నపుంఖసముదంచితరోచుల నేమిఘట్టనో
ద్ధూతరజోంధకారము విధూతముగా విసరద్గరుత్సము
ద్భూతసమీరఘాతములఁ దోయదమాలిక లోలిఁ దూల ని
ర్ఘాతనిపాతవేగపటుకాండపరంపర లేసె నేసినన్.

411

క.

శరముల కెదురై నడచును, శరమండలిలోన నాడు శరలక్ష్యము గా
కురుతరజవమునఁ దిరుగును, [18]శరవేగ మడంచు గగనచరుఁ డై మలయున్.

412


వ.

ఇ ట్లిరువుకు నొండొరులయంతస్సారం బెఱుంగక మత్సరంబునం బోరుసమయం
బున నారావణి తనబాణంబు లమోఘంబు లయ్యును దనయేటున కగపడక
లక్ష్యగోచరుండు గాక యద్భుతవిక్రమంబున మెఱయునప్పవమానసూనుం
జూచి యతనిబలవేగంబుల కరు దందుచు నితం డవధ్యుం డజయ్యుం డని విచా
రించి యింక నూరక పోవుట కర్తవ్యంబు గా దనుచు నేకాగ్రచిత్తుం డై సమం
త్రకంబుగా బ్రహ్మాస్త్రంబు వింట సంధించి బలుదెగ గొని మింటం బెనుమంట
లడర బె ట్టేసిన.

413


క.

అమరులు బెగడఁగ గగనాం, తమునను బఱతెంచి వాయుతనయుని నయ్య
స్త్రము బంధింపఁగ జవస, త్త్వము లెడలి విచేష్టుఁ డగుచు ధరణిం గూలెన్.

414


సీ.

అటు గూలి తెప్పిఱి హనుమంతుఁ డట్లైన, బంధంబు బ్రహ్మాస్త్రబంధ మగుటఁ
దనలో నెఱిఁగి మున్ను దన కబ్జగర్భుండు, వలఁతియై యిచ్చినవరము దలఁచి
బ్రహ్మేంద్రమారుతపాలితుం డగునాకు, నీయస్త్రబంధంబు పాయు టెంత
యని యాత్మనియతి బ్రహ్మాస్త్రమంత్రధ్యాన, ము నొనర్చి బంధవిముక్తుఁ డగుచు
నజునియానతియును గొంత యనుసరించి, రాక్షసులు పట్టికొనిపోవ రాక్షసేంద్రు
నొద్ద కేఁగి యతనితోడ నొనర మాట,లాడి చూచెదఁ గాక యం చలరుచుండ.

415


క.

అలుకను రాక్షసు లందఱు, బలువిడిఁ బఱతెంచి చూచి భర్జించుచు మ్రో
కులఁ బావనిఘనసంధులు, బలువుగ బంధించి పట్టి పైపైఁ దివియన్.

416


వ.

పావనియు రావణదర్శనకుతూహలుం డగుచు.

417


క.

తనబంధ మూడు టెఱిఁగియుఁ, గనుకని రక్కసులచేతఁ గట్టుల నంత
ర్జనముల [19]నాటులఁ బోటులఁ, బెనుభర్త్సన వడుచు నధికభీతుఁడపోలెన్.

418


వ.

ఉన్న హనుమంతుం గనుంగొని యితం డప్పుడ బ్రహ్మాస్త్రబంధవిముక్తుం డైన
వాఁ డనుచు నింద్రజితుం డాశ్చర్యవిషాదంబులు పెనంగొన నంతరంగంబున.

419


ఉ.

అక్కట యిట్టిలోకభయదాస్త్రముచేతను జిక్కఁడయ్యె
డిక్కపి కన్యసాయకము లెంత దలంపఁగ నంచు లజ్జ నా
రక్కసుఁ డాసమీరసుతు రావణునొద్దకు మున్ను రక్కసుల్
గ్రక్కునఁ గట్టినట్టిపెడకకట్టులతోడన తెచ్చి పెట్టినన్.

420


వ.

అప్పు డుగ్రాకారుం డయి దశముఖుండు పదిముఖంబులఁ గోపంబు ముడివడ
హనుమంతుం గనుంగొని.

421


ఉ.

ఎక్కడిమర్కటుండొ తను నెవ్వఁడు పంచెనొ యేమి సేయఁగా

నిక్కడ వచ్చినాఁడొ వధియింతము కాల్తము మొత్తిపుత్త మం
చెక్కుడుగిన్క రాత్రిచరు లిందును నందును బట్టి యీడ్చుచున్
స్రుక్కక వ్రేయుచుం బొడుచుచున్ నిరసించుచు నుండ నయ్యెడన్.

422


క.

రక్షోనాయకుఁ డుద్ధతి, వృక్షచరప్రవరు రోషవిస్ఫారితతా
మ్రాక్షులఁ బావనిఁ గిన్కన్, వీక్షించె నతండు నాత్మ విస్మితుఁ డగుచున్.

423


సీ.

తపనీయభూషణోదంచితరోచులు, సౌదామినులమాడ్కి జాల మిగుల
రమణీయతనులిప్తకరక్తచందనచర్చ, కలితసంధ్యారాగకాంతి మెఱయ
మకుటనానారత్నమణిగణదీధితుల్, పర్జన్యకార్ముకప్రభల నీన
భూరివక్షంబునఁ బొల్చుహారశ్రేణి, లలితబలాకాళిచెలువు నొలయ
భయదహుంకృతి గర్జలపగిదిఁ జెలఁగ, మేచకాభ్రంబుకైవడి మేను వెలుఁగ
దృష్టి కక్కజమారెడు తేజ మెసఁగ, వాఁడిమగఁటిమితోఁ గడువాలుమహిమ.

424


మ.

పటువిస్ఫూర్జితపంక్తిమస్తకఫణిప్రస్ఫారబాహోగ్రుఁడుం
గుటిలభ్రూకుటిభీమధూమచటులక్రూరస్ఫులింగచ్ఛటో
ద్భటరోషాగ్నిశిఖాకులేక్షణుఁడుఁ బ్రోద్దష్టప్రలంబోష్ఠవి
స్ఫుటదంష్ట్రాళికరాళవక్త్రుఁడును జక్షుర్భీకరాకారుఁడున్.

425


ఉ.

హాటకశైలశృంగసముదంచితజూటుఁడు రత్నచిత్రిత
స్ఫాటికభాసురాసనుఁడుఁ జారుదుకూలసమావృతుండు నై
జోటులు కంకణక్వణనశోభితపాణులు చేరి చామర
ల్పాటిగ వీవఁ బ్రాభవవిలాససమున్నతు లొప్ప నొప్పుచున్.

426


వ.

నానారత్నవిచిత్రితంబును గాంచనమయంబును నైనయాస్థానమండపంబునఁ
బ్రహస్తప్రముఖు లైనమంత్రులు పరివేష్టింప నమరసేవితుం డైనదేవేంద్రుని
మాడ్కి దేదీప్యమానుం డై మెఱసి యున్నలోకవిద్రావణు రావణుం జూచి
జగత్ప్రాణతనూభవుం డచ్చెరు వందుచు నంతరంగంబున.

427


క.

ఈరూపము నీఘనభుజ, సారము నీధృతియు నిట్టిసౌందర్యము వి
స్ఫారోదారగుణంబులు, నీరాక్షసవిభుని కౌర యి ట్లొప్పెడునే.

428


క.

పాతకవర్తియు రాక్షస, జాతుఁడుఁ గాకుండెనేని శక్రాదిసుర
వ్రాతంబున కధిపతి యై, యీతఁడు లోకంబు లెల్ల నేలం దగఁడే.

429


వ.

అని విచారించువృక్షచరుని రోషతామ్రాక్షుం డగుచు నిరీక్షించి రాక్షసచక్ర
వర్తి ప్రహస్తున కి ట్లనియె.

430


క.

నిను నెవ్వఁడు పుత్తెంచెను, వన మేటికిఁ బెఱికి తీవు వడి రాక్షసభం
జన మేల సేసి తెవ్వఁడ, వని యడుగుము నావుడుం బృహస్తుం డతనిన్.

431


క.

కనుఁగొని తేజము చూడఁగ, వనచరమాత్రుఁడవు గావు వచ్చినపని వం
చన సేయక భయ మందక, వినిపించిన నిన్ను వేగ విడిపింతుఁ దగన్.

432

క.

సురవరుఁడొ దండధరుఁడో, వరుణుఁడొ ధనదుండొ దైత్యవరుఁడో ని న్నీ
పురి సొర దూతగఁ బంచిన, యురుబలుఁ డెవ్వండు నాకు నొప్పుగఁ జెవుమా.

433


వ.

అనినం బ్రహస్తున కనిలజుం డి ట్లనియె.

434

హనుమంతుఁడు తనవృత్తాంతంబును రామునిప్రభావంబును రావణుతోఁ జెప్పుట

క.

హనుమన్నాముఁడ మారుత, తనయుఁడ రఘురాముదూతఁ దపనప్రియనం
దనునకు సచివుఁడ నిక్కపు, వనచరుఁడన్ సీత వెదక వచ్చితి నిటకున్.

435


క.

దివిజారిదర్శనం బ, న్యవిధముల నాకు దొరక దని వనభంగం
బు వడిం జేసితిఁ జేసితి, బవరము నారక్షకొఱకు బలములతోడన్.

436


చ.

కరము విరించిచే వరము గాంచిననన్ను శరంబులన్ సురా
సురులకుఁ గట్టరా దవుటఁ జూ శరముక్తుఁడ నైతి లోకభీ
కరు దశకంఠు నొండుగతిఁ గాన నశక్యము గాన రాక్షసో
త్కరములచేతఁ గట్టువడి కన్గొనువేడుకతోడ వచ్చితిన్.

437


వ.

అని పలికి రావణుం గనుంగొని.

438


క.

ఇనజుఁడు నీతోఁబుట్టువు, నినుఁ గుశలం బడుగు మనియె నృపతియు రవినం
దనుఁడును నీకును బుద్దులు, దనరంగాఁ జెప్పు మనిరి తగవున నీవున్.

439


వ.

వినుము దశరథుం డనురాజేంద్రునితనయుండు రామచంద్రుండు సీతాలక్ష్మణ
సమేతుం డై తండ్రియానతి వనవాసంబున కేతెంచి దండకావనంబున దర్పితు
లైనఖరదూషణాదులం దునిమి యచటం దనపత్నిఁ గోల్పోయి యనుజుండును
దాను నెల్లదిక్కులు వెదకుచు ఋశ్యమూకంబు చేరి యచ్చట సుగ్రీవుతోడ
సఖ్యంబు సేసి యతనికిఁ బ్రియంబుగా వాలిం దునిమి తద్రాజ్యంబున కధిపుం
గా సుగ్రీవుం బట్టంబు గట్టి సీతాన్వేషణంబు సేయింపు మనిన సుగ్రీవుండును
గరుడానిలవేగులును మహాసత్త్వసంపన్నులు నగుననేకవలీముఖకోట్ల సర్వలో
కంబులు వెదకి సీత నరసి రండని పనిచె నేనును రాఘవసుగ్రీవులయానతి సము
ద్రం బవలీల దాఁటి లంకాపురి సొత్తెంచి యంతట వెదకి యయ్యశోకవనికామ
ధ్యంబున నున్నజనకరాజనందనం గాంచితి ధర్మవిరుద్ధంబును గులనాశకంబు న
గుపరదారాపహరణంబు నీయట్టిబుద్ధిమంతులు గావింతురె ధర్మశీలుఁ డగువాఁ
డనపాయసుఖంబులం బొందుఁ బాపశీలుండు వివిధాపాయదుఃఖంబు లనుభవించు
నీవు పరకాంతం దెచ్చి పాపంబున కొడిగట్టి చెడ నున్నాఁడ వని పలికి మఱియును.

440


సీ.

చరణాగ్రమున నీభుజాదర్ప మడఁచిన, ధూర్జటివిలు లీలఁ ద్రుంచి వైచె
వాలపాశంబున వడి నిన్నుఁ గట్టిన, వాలి నొక్కమ్మునఁ గూలనేసె
నని నిన్నుఁ జెఱగొన్నయర్జునుఁ బొరిగొన్న, పరశురాముని నాజి భంగపఱిచెఁ
గడిమిమై నొక్కఁడ ఖరదూషణాదులఁ, బదునాల్గువేపుర బారి సమరె
నమ్మహాధనుర్ధరున కె గ్గాచరించి, హరిహరబ్రహ్మశక్రాదు లైన నతని

భయద నిర్ఘాతసంఘాతపాతశాత, బాణఘాతహతులు గాక బ్రదుకఁగలరె.

441


ఉ.

ఉరవడి రాఘవాస్త్రతతు లుగ్రతరార్చుల మింట నంట నీ
కరము లురంబు నంగములుఁ గంఠము లాస్యము లంఘ్రు లూరులున్
శిరములు మర్మముల్ బరులుఁ జించుచుఁ ద్రుంచుచు నుచ్చిపాఱుచున్
మురియలు సేయుచున్ నిగుడ మూఁడుజగంబులు నాఁప నోపునే.

442


శా.

శ్రేణీభూతము లై దిగంతముల విక్షేపించు సౌమిత్రిదో
త్స్థూణాగ్రోజ్ఝితరుక్మపుంఖకషణోద్భూతస్ఫులింగచ్ఛటా
క్షీణజ్వాలధురీణబాణములు వర్షింపంగ నీ వేల స
ప్రాణత్రాణశరీరు లై నిలుతురే బ్రహ్మాదులున్ ముందటన్.

443


మ.

తురగస్యందనమత్తవారణభటస్తోమంబుతోఁ గూడ నీ
పురి భస్మంబుగఁ గాల్చి సైనికసుహృత్పుత్రానుజశ్రేణి నె
త్తురు గ్రక్కం బడ గ్రుద్ది చంపి మఱి మృత్యుక్రూరతం బట్టి నీ
శిరముల్ ద్రుంపఁగ నేన చాలుదు జయశ్రీలబ్ధి వర్ధిల్లఁగన్.

444


క.

సుగ్రీవాదులయెదుట ను, దగ్రగతిన్ నిన్నుఁ ద్రుంతు ననురఘుకులవీ
రాగ్రణిప్రతిజ్ఞకతన ద, శగ్రీవుఁడ బ్రతికి తీవు చావక నాచేన్.

445


ఆ.

అజునివరము నీకు నమరగంధర్వాసు, రాహియక్షరాక్షసాలిచేత
మడియ కుండఁ గాని మనుజవానరులచేఁ, గలనఁ జావకుండఁ గాదు వినుము.

446


క.

ఘనుఁ డగు రాముఁడు మనుజుం, డినజుఁడు వానరుఁడు గాన యీయిరువురచే
ననిఁ జావంగలవాఁడవు, మనమున నామాట నమ్మి మతకరి వగుచున్.

447


శా.

నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబు లం
[20]కౌకస్సంచయకాళరాత్రి గళబద్ధోదగ్రకాలాహి క
న్యాకారాగతమృత్యువు జనకకన్యన్ వేగ యొప్పించి లో
కైకప్రాణుని రామునిం గనుము నీ కీబుద్ధి గాకుండినన్.

448


క.

సీతారాములకోప, స్ఫీతానలశిఖలు గలయఁ బేర్చుచు లంకా
భూతవ్రాతము భస్మీ, భూతముగాఁ జేయు ననుడుఁ బొడమినకిన్కన్.

449


మ.

కుటిలభ్రూకుటిభీమఫాలదశకక్రూరోరునాసాపుటో
ద్భటలంబోష్ఠహనుప్రకంపననటద్దంష్ట్రాతిఘోరాస్యుఁ డై
పటుదృష్టిస్ఫుటవిస్ఫులింగములు పైపైఁ గ్రమ్మ నీకష్టమ
ర్కటునిం జంపుఁడు నా విభీషణుఁడు ధఃర్మం బొప్ప లంకేశుతోన్.

450


శా.

ఈకోపంబున కగ్నియో వరుణుఁడో యీశానుఁడో వాయువో
నాకాధీశుఁడొ యక్షనాయకుఁడొ కీనాశుండ కోణేశుఁడో
యీకీశాధముఁ డెంతవాఁ డరయ వీఁ డి ట్లెగ్లు లే మాడినన్

నీకు వధ్యుఁడు గాఁడు సైఁపు మదిలో నీ వింక లంకేశ్వరా.

451


క.

దూతకు వధకంటెఁ గశా, ఘాతము ముండనము నంగకర్తన మంకం
బాతతదండము లెందును, దూత యవధ్యుఁ డని చెప్పుదురు ధర్మవిదుల్.

452


వ.

అని పల్క రావణుండు విభీషణునిపల్కు లాదరించి.

453


క.

తరుచరునకు నాలము ప్రియ, కర మగుటను వీనితోఁకఁ గాలిచి నక్తం
చరు లందఱుఁ జూడఁగ నీ, పుర మంతయుఁ గలయఁ ద్రిప్పి పుచ్చుం డనినన్.

454


వ.

ఉద్ధతి రణకర్కశు లగురక్కసు లక్కపీంద్రుం గవిసి.

455

రక్కసులు రావణునాజ్ఞచే హనుమంతునితోఁకఁ గాల్చుట

క.

హనుమనివాలము పెరుఁగఁగ, ఘనతరకార్పాసపట్టికాశ్రేణులఁ గ
న్కనిఁ జుట్టి నూనె నానిచి, యనలం బిడి మండ నూఁది రర్చులు నెగయన్.

456


ఉ.

అప్పుడు శుష్కకాష్ఠనిచయజ్వలితాగ్నిసమప్రదీప్తుఁ డై
యొప్పుచుఁ గీలజాలకలితోన్నతవాలము రాక్షసాలిపై
నిప్పులు రాలఁ ద్రిప్పుచును నిండినసందడి వాయఁ జూఁడుచుం
దప్పక పౌరు లోలిఁ దనుఁ దద్దయు విస్మయ మంది చూడఁగన్.

457


క.

రోమాంచావృతవపు వు, ద్దామాభ్రముభంగి మెఱయఁ దత్కీలోద్య
ద్భీమతరవాల మురుసౌ, దామనిగతిఁ దనరఁ దనరి తరుచరుఁ డాత్మన్.

458


క.

ఈకట్లు ద్రెంచికొని యీ, నాకారులఁ జంపునపుడు నానారక్షో
నీకంబులు గల వేగతిఁ, జేకొని కడలేనిరణము సేయుదు నింకన్.

459


వ.

కొంతదడ వేమైనఁ జేయ నిమ్ము సైరించెద మున్ను రాత్రి గానంబడనియీలంకా
పురంబునం గలయశేషవిశేషంబులు దివాసమయంబున నీరక్కసులు ద్రిప్పి
కొనిపోవం బోయి చూచెదం గాక యనుచుండ నంతలోఁ గాలకింకరభయం
కరాకారు లగునారాక్షసకింకరులు బలువిడిం గవిసి.

460


ఉ.

ఉరవడి శంఖకాహళము లూఁదుచు దిక్కులు వ్రయ్య నార్చుచున్
బెరసి మృదంగనిస్సహణభేరులు ఘోషిల వ్రేయుచున్ భుజో
ద్ధురబలుఁ డైనవాయుసుతుఁ దోరపుమ్రోకుల బల్వుగా మద
ద్విరదముఁబోలెఁ గట్టికొని వీథులఁ ద్రిప్పఁగఁ జూచి రక్కసుల్.

461


క.

చని నీతో భాషించిన, వనచరునిం బట్టి తోఁక వడిఁ గాలిచి యం
గన పురిఁ ద్రిప్పుచు నున్నా, రనవుడు నాపల్కు శస్త్రృహతిగతిఁ దాఁకన్.

462


వ.

సీత యత్యంతదుఃఖాక్రాంత యై యాత్మ నతినిష్ఠ నగ్నిదేవు నుద్దేశించి.

463


సీ.

నాజీవితేశుఁడు నావగ లుడుపంగ, వడి సముద్రము దాఁటి వచ్చునేని
పతి కృతజ్ఞుఁడు సత్యభాషావిశేషుండు, నతిపుణ్యచరితుఁడు నయ్యెనేని
గురుల కే శుశ్రూష కోరి చేయుదునేని, నఖిలసన్నుతసాధ్వి నైతినేని
తపము చేయుదునేని దమశమాన్వితనేని, నిరతశీలవ్రతనియతనేని

వెలయ భాగ్యవిశేషముల్ గలుగునేని, నీవు నాపయి సత్కృపాన్వితుఁడ వేని
పరఁగ నగ్నిదేవుఁడ రామభక్తుఁడై న, మారుతాత్మజునకు శైత్యకారి వగుము.

464


క.

అని జనకజ యనలప్రా, ర్థన చేయఁగ నంతటం బ్రదక్షిణశిఖ లే
పున నెగయఁ బ్రజ్వలించుచు, ననలుఁడు హనుమంతునకు హిమాంశుండయ్యెన్,

465


క.

[21]ఆయెడ వాలాగ్రంబున, నాయతగతి మండుచున్న యయ్యనలము ప్రా
లేయముగతి నతిశీతల, మై యుండుట కరుదు నొంది యనిలజుఁ డాత్మన్.

466


క.

రామునిసామర్థ్యముననొ, భూమిజకారుణ్యముననొ పొందుగఁ బవనో
ద్దామసహాయంబుననో, నామేను దహింప వీయనలతీవ్రశిఖల్.

467


వ.

అనుచు సంతోషించి మహోత్సాహంబున.

468


చ.

బలువుగ రక్కసుల్ దిగిచి పట్టిన పాశము లెల్లఁ ద్రించికొం
చలఘురయంబుతో నెగసి యార్చుచు గోపుర మెక్కి యచ్చటన్
బలువిడి సూక్షగాత్రుఁ డయి బంధము లన్నియు నూడ్చి యున్నతా
చలనిభదేహ మెప్పటి విశాలముగా ధరియించి యేపునన్.

469


క.

మును తోరణమునఁ బెట్టిన, ఘనతరపరిఘంబు లీలఁ
గొని తనుఁ బట్టినదనుజుల, మునుకొని వడి నేలఁ గూల మోఁది వధించెన్.

470


వాలి యిటు విక్రమించి వి, శాలారుణవదనవారిజం బలరఁగ లాం
గూలాభీలజ్వాలా, మాలి యగుచు మెఱసె నంశుమాలియుఁబోలెన్.

471


వ.

ఇట్లు మెఱసి

472


క.

నావాలంబున వెలిఁగెడు, పావకునకుఁ దృప్తి గాఁగఁ బైపైఁ గ్రవ్యా
దావాసము లాహుతులుగఁ, గావించెద నింక ననుచుఁ గపిపతి కిన్కన్.

473

హనుమంతుఁడు లంకఁ గాల్చుట

ఉ.

మింటఁ జటచ్ఛటధ్వనులు మేఘఘనధ్వను లై చెలంగ నిం
టింటికి దాఁటి వాలమున నేచినచిచ్చు దగిల్చి దిక్కు ల
న్నింటను విస్ఫులింగములు నిండఁగఁ జల్లుచు మంట లాకసం
బంటఁగ నుబ్బి యుగ్రత సమస్తగృహంబులు గాల్చుచున్నెడన్.

474


చ.

అవె యివె పెన్బొగల్ నెగసె నక్కడ మండఁ దొడంగె నల్లచో
నవె ఘనవిస్ఫులింగతతు లాకస మంటెడుఁ బేర్చు నర్చు ల
ల్లవె హయశాలలన్ రథగజాయుధశాలల ధాన్యశాలలన్
ద్రవిణతనుత్రశాలలను రావణుపట్టపుసర్వశాలలన్.

475


వ.

అనుచుం గళవళంబునఁ బౌరు లిట్టట్టును బఱవం జొచ్చి రట్టియెడ.

476


మ.

అమరేంద్రాయుధసన్నిభంబు లయి ఫుల్లాశోకకాలాయసా
భము లై కింశుకలోహితప్రకరరౌవ్యస్ఫూర్తు లై హేమవి

భ్రమధూమప్రతిమంబు లై వివిధవర్ణశ్రేణు లై .......
మములై యొక్కొకయింటిపై నెగసెఁ బెన......హోగ్రధ్వనిన్.

477


క.

భాసురధవళాభ్రనిభ, ప్రాసాదచయంబు లోలి.........
లాసక్తము లై మండుచు, భాసిల్లెం గనకశైల..........గిన్.

478


క.

సముదనలకీల సర్వ, క్రమముల మండుచు మ........పల్లవిత
ద్రుమతతులు కింశుకాశో, కమహీజావలులుఁ స్వామి.....చు నుండెన్.

479


క.

గాలితనూజుఁడు మూర్త, జ్వాలియుఁబోలెన్ ........ల
జ్వాలాజాలావృతుఁ డై, పౌలస్త్యువిమానప........ఱికెన్.

480


చ.

సురుచిరహేమవజ్రమణికశుక్తిజకుట్టిమచా........
స్ఫురితవిమానరాజములు భూరితరార్చుల.........నుం
బొరిఁబొరి నేలఁగూలెఁ గృతపుణ్యఫలానుభ.........
చ్చెర దివినుండి భూమిఁ బడుసిద్ధవిమానచయంబుకైవడిన్.

481


వ.

ఇ ట్లార్చి పేర్చి వాతూలనందనుండు నిజవాలవ్యజనసంజాతమారుతసహాయుం
డును దత్పవనప్రవృద్ధానలప్రదీప్తుండు నగుచు మఱియు.

482


శా.

కాలాభీలతరాగ్నికీలచయనిర్ఘాతంబు లింటింటిపైఁ
గూలన్ వాలము ద్రిప్పుచుం దిరిగె దిక్కూలంకషోగ్రస్ఫులి
గాలోలచ్ఛట లుధ్ధతిన్ నెగయ నుద్యద్భీమధూమంబు వా
తూలవ్యాప్తనభోంతరాళముగ మృత్యుక్రూరసంరంభుఁ డై.

483


క.

రక్షోనాయకుఁ డప్పుడు, రాక్షసులుం దాను శోకరభసంబులతో
నక్షీణము లగుమంటలు, వీక్షించుచు నగరు వెడలి వెలుపట నుండెన్.

484


క.

కొందఱు ఘనధూమంబుల, సందడి వేదిక్కు వోవఁ జాలక మంటల్
క్రందుగఁ గ్రమ్మెడువీథుల, యందు భయార్తు లయి బ్రమసి రంగము లెరియన్.

485


చ.

కవిసినధూమజాలములఁ గన్నుల నీళ్లులు గ్రమ్మ నేడ్చుచున్
యువతులు బాలవృద్ధులును నొండొరు చెట్టలు పట్టికొంచు నా
రవముగఁ జీరుచున్ గృహపరంపర వెల్వడి త్రోవ గాన కా
భవనగణాంగణంబులను బైపయి మ్రందిరి తీవ్రకీలలన్.

486


చ.

పదములు పట్టుచుం దొడలు ప్రాకుచు నేచి కుచంబు లంటుచుం
బెదవులు చీఁకుచుం గరము పేర్చి కచగ్రహణంబు సేయుచున్
సుదతులయందు రాగములు సూపుచుఁ బావకుఁ డొప్పె నెంతయున్
మదనసుఖోచితక్రియలు మక్కువఁ జల్పెడుకామికైవడిన్.

487


మఱియు నప్పుడు పానమదావేశంబున గేహంబులు వెలువడ నెఱుంగక తీవ్ర
కీలలం గాలి మ్రందువారును బ్రియకాంతలుఁ దారును రతిశ్రాంతు లై నిద్రించి
యుగ్రజ్వాలలు పొదివిన నట్ల పెనఁచికొని చచ్చువారును దమతమసొమ్ములు దేర

గృహంబులు ............నాభీలార్చులు పేర్చిన నచ్చట గతాసు లైనవా
రును నతిస్ఫీతపే..........లు పట్ట దిగఁ దాఁచి దిగంబరు లగుచుఁ బాఱువా
రును విస్ఫులింగ.........శ్రుకేశంబులు పట్ట వెతకుడిచి దులుపుకొనువారును
శాలలు వెలువడి ........ బఱచి నలుగడల ననలశిఖలు పొదువఁ దిరుగుడువడి
పుడమిం బడుతు.........దొమడంబులుఁ గొమ్ములుఁ దోఁకలు గురుసులు దా
కఁ గాలి శైలా...............లిన శుండాలంబులును బక్షంబులు కమలిన సుడివ
డుచు ముడింగి............సపారావతంబులును నఁగారంబు లైనతేరులును
బెనుమంట మ.............డినయట్టాలకచిత్రయంత్రవాతంబులును దునిసి
పడిన కైదువుల్ ........... లెగయ మండెడు ధాన్యరాసులును జూర్ణంబు
లైనవజ్రవైదు...............క్తికపద్మరాగాదినానారత్నంబులును జిటిలిపడి
పొడిపొడి యై .............రసౌధహర్మ్యాదులును బెనుముద్దలుగాఁ గరగి
కూలినరజతకాంచనమయప్రాకారతోరణంబులును భస్మంబు లైనధ్వజాతపత్రం
బులును గలయఁ గాలినబొక్కసంబులును గారాకులు దరికొని మండి ఛట
చ్ఛటధ్వనుల మొదలంటఁ గాలి చాఁపకట్టుగాఁ బడినయుద్యానవనంబులును నై
సర్వవస్తుశూన్యంబును గరళజ్వాలాజాలావృతంబును నుద్ధూతభీమధూమస్తో
మాలక్షితాంతరాళంబు నగుచు నశోభితం బై లంకాపురం బుండ నప్పు డుగ్ర
కీలల మేనులు గాలఁ గనలి క్రూరాకారులు నుద్దీపితప్రతాపులు నగురక్షోవీరు
లు కోపాటోపంబునం జేరి.

488


తే.

[22]ప్రాసశూలపరిశ్వధపట్టిసాసి, ముసలముద్గరపాణు లై మునుఁగ ముసరి
రభసమునఁ దన్ను నొంపంగఁ బ్రబలశక్తి, వారినందఱ వధియించె వాయుసుతుఁడు.

489


వ.

ఇట్లు వనభంగంబును లంకాదహనంబు నొనర్చి తొడరిన రాక్షసానీకంబునం
బరిమార్చి తన్ను గోపురశిఖరతోరణహర్మ్యగవాక్షంబుల నిలిచి రక్షోవీరు
లాశ్చర్యభయంబులతోడం జూడ దేవగంధర్వసిద్ధవిద్యాధరకిన్నరకింపురుషముని
గణంబులును సర్వభూతంబులును బరమసంప్రీతు లై ప్రశంసింపం జని సముద్రం
బునం దనవాలానలం బార్చుచుండె నంత నిక్కడ సీతం గదిసి వీనుల కింపు
సంపాదింప సరమ యి ట్లనియె.

490


చ.

జనకజ నీవు తద్దయు విషాదము నొందుచు వాయుపుత్రుకై
మనమున నేల చింతిలెదు మారుతపుత్రుఁడు కట్టు లెల్లఁ దు
త్తునియలు గాఁగఁ ద్రెంచికొని దుష్టనిశాచరకోటిఁ గ్రొ వ్వఱం
దునిమి సమస్తదిక్కులను దోర్బలసంపదఁ బేర్చి వెండియున్.

491


క.

ఆభీలవాలకీలల, భూభృచ్చరపుంగవుండు పొరిఁబొరి నీలం
కాభవనము లన్నియు భ, స్మీభూతమ్ములుగఁ జేసి చేవ యెలర్పన్.

492

క.

సేమమున నున్నవాఁ డని, యామానిని పల్క నుద్యదమృతోపమ మై
యామాట చెవులు సోకిన, నామోదము నొందుచుండె నవనిజ యంతన్.

493


క.

తరుచరవరుఁ డప్పుడు భీ, కరశిఖి భస్మంబు గాఁగఁ గాలినలంకా
పుర మెల్లఁ గలయఁ జూచుచు, ధరణీసుత నాత్మఁ దలఁచి తల్లడపడుచున్.

494


క.

కోపమున నకట యీలం, కాపుర మంతయు మగ్నిఁ గాల్చితిఁ బురిలో
భూపుత్రి యునికి దలఁపక, కాపేయము సేసి స్వామిఘాతుఁడ నైతిన్.

495


క.

కోపులు గురువధ కోడరు, కోపులు పరనింద సేయఁ గొంకరు కోపం
బాపదల కెల్ల మూలము, కోపము పాపంబుపొత్తు కోపానలమున్.

496


క.

విపులక్షమాజలంబుల, నుపశమ మొందింతు రార్యు లుత్తమబుద్ధిన్
వ్యపగతమతి నై నే నీ, విపరీతక్రమముఁ జేసి వెంగలి నైతిన్.

497


ఉ.

భీమము గాఁగ నెల్లెడలఁ బేర్చినయాఘనవహ్నికీలలన్
భూమితనూజ కే మెడరు పుట్టెనొ యింక నృపాలుపాలి కే
నే మని పోదు భానుజున కే మని చెప్పుదుఁ జావు దక్క నొం
డేమియు లేదు నాకు మనుజేంద్రమనోరథకార్యఘాతికిన్.

498


వ.

అనుచుఁ గొంతవడి చింతాక్రాంతుం డై మగుడఁ తెలివి నొంది.

499


క.

భూసుతకు రామవిభునకు, దాసుఁడ నగునాదుమేను దరికొని శిఖలన్
గాసిల్లఁగ మును గాల్పం, డాసతి జగదంబ నేల యనలుఁడు గాల్చున్.

500


చ.

అదియును గాక జానకిసమగ్రసతీత్వతపఃప్రభావసం
పద రఘురాముపుణ్యగుణపావనశీలపరాక్రమంబులం
గదియఁగ నెట్లు వచ్చు విభుకామిని నగ్నికి నాఁగ నంతలో
ముద మొదవంగ నింగి నట ముందట నేఁగెడు సిద్ధచారణుల్.

501


చ.

అనిలతనూజునంత సముదగ్రబలుండు గలండె సర్వభూ
జనములు మెచ్చ భీకరనిశాచరకోటులఁ ద్రుంచి వైచి య
త్యనుపమశక్తి లంకఁ గలయంతయుఁ గాల్చె నొకండ సీతమై
యనలము సోఁక దించుకయు నాసతిభాగ్యవిశేష మెట్టిదో.

502


క.

అనుడుం బావని యెంతయు, మనమున సంతోష మంది మఱి నే విభుమ
న్నన గంటి ననుచు నే చని, జనకజపాదముల కెరఁగి సమ్మతి నిలువన్.

503


క.

వైదేహి చిత్తమునఁ గడు, మోదించుచు విభునిమీఁది మోహంబున నా
భూదయితుప్రియునిఁ బావని, నాదటఁ బలుమాఱుఁ జూచి యనురాగమునన్.

504


క.

అనిలుఁడు గరుడుఁడు నీవును, వననిధి దాఁటంగఁ జాలువారలు వేగం
బునఁ గడిమి నీవు దక్కఁగ, ననిమిషరిపుపురముఁ గాల్ప నన్యులవశమే.

505


క.

భూమీశునిపోరామికి, నీమెయిఁ దక్కొరులు గలరె నీయురుబంధ
స్తోమము నేగతిఁ బాసితి, సేమము నొందితె మహాగ్నిఁ జిక్కక యనఘా.

506

క.

కడుఁ గ్రూరనిశాటుల నే, వడువున నిర్జించి యిటకు వచ్చితి నా కీ
యడ లుడుపఁగ నిం కేగతిఁ, గడిది సముద్రంబు నీవు గడచెదు కడిమిన్.

507


క.

నీయున్నయంతదడవును, బాయనిదుఃఖముల నెల్లఁ బాసితి నింకన్
వాయుసుత నీవు వోయిన, నాయతదుఃఖములు నాకు నయ్యెడిఁ దండ్రీ.

508


క.

నేఁ డుండి యెల్లి పోదఁట, పోఁడిగ నొకచోట దప్పి పో నుండు తగన్
నేఁ డైన శోకవహ్నిన్, మాఁడక యుండెద సహించి మారుతపుత్రా.

509


క.

అనవుడుఁ దల్లీ వగవకు, ఘనతరసైన్యములతోడఁ గపిపతి సుగ్రీ
వుని రామలక్ష్మణుల వే, కొనివచ్చెద నిటకు నీదుకోరిక లారన్.

510


వ.

వచ్చి యవ్వీరవరుండు కింక నీలంకపై విడిసి యుద్దండకోదండపాండిత్య మమర.

511


ఉ.

మండితవిస్ఫులింగవిషమజ్వలితానలకీల లబ్జగ
ర్భాండము నిండ రామవసుధాధిపుఁ డేసెడు వజ్రసాధనా
ఖండితపంక్తికంఠఘనకంఠపురాంతకశైలచాలనో
ద్దండబలప్రచండభుజదండవిఖండనచండకాండముల్.

512


వ.

ఇ ట్లేసి యవక్రవిక్రమంబున.

513


ఉ.

రావణుఁ ద్రుంచి లోకములు ప్రస్తుతి సేయఁగ ని న్నయోధ్యకున్
భూవరపుంగవుండు గొనిపోయి మనోరథభోగసౌఖ్యముల్
వావిరిఁ బొందుచున్ నృపతివంద్యపదాబ్జము లొప్ప సర్వధా
త్రీవలయంబు నేలెడి మదిం దలఁ కొందకు మింకఁ బోయెదన్.

514


వ.

[23]అని కందలితహృదయారవిందుండై పవననందనుండు దశస్యందవనందనసుందర
పదారవిందంబుల కందంద వందనంబులు సేసి యద్దేవి వీడ్కోని గమనోన్ముఖుం
డగుచు సాలతాలహింతాలతమాలనీలోపవనంబుల బహులమంజులమంజరీరం
జితలతాకుంజపుంజంబుల నాభీలసింహశార్దూలశుండాలస్థూలకోలవృకప్రముఖ
మృగంబులు నానామునియక్షగంధర్వసిద్ధవిద్యాధరకిన్నరోరగసేవితకందరంబుల
విచిత్రవర్ణంబులఁ జెలఁగునొక్కశైలం బెక్కి యుత్తరాభిముఖుం డై.

515

హనుమంతుఁడు మరలి సముద్రంబు దాఁటివచ్చుట

మహాస్రగ్ధర.

కనియెం గీశేశుఁ డంతన్ గగనగతతరంగచ్ఛటోత్సేధిశశ్వ
ద్ఘనవేలాభీలకూలంకషమకరముఖగ్రాహసంబాధిభూరి
ధ్వనిసంరంభప్రబోధిన్ వరమణినికరవ్యాప్తసర్వాపగాత
త్యనురోధిన్ బాడబోష్ణాతతచటులశిఖాంతర్నిరోధిం బయోధిన్.

516


వ.

కని మహోత్సాహంబున.

517


సీ.

బిట్టూని కుప్పించుపృథుపాదములవడి, శేషాహిఫణములు సెదరి పాఱ
వివులోరుజవమున విఱిగి తో నెగసిన, తరులు తారకముల విరియ నడువ

మెయిగాలిఁ గడలెత్తి మిన్నేఱు గలఁగంగ, నురుమేఘమాలిక లోలిఁ దూల
ఘనఘోషణం బన ఘనసింహనాదంబు, బ్రహ్మాండభాండంబుఁ బగులఁజేయ
బెదరి సింహతతులు బిలముల ఘోషింప, వితతశిఖరవితతి విఱిగి పడఁగ
సానుకందరములసంధులు వ్రీలంగఁ, బవనసరణి కెగసెఁ బవనజుండు.

518


సీ.

అప్పుడు గంధర్వయక్షకిన్నరనాగ, విద్యాధరస్త్రీలు వెగడు నొంది
యంబరంబులు వీడ నాకల్పములు రాల, విభులతో నిలయముల్ విడిచి చనఁగ
శిరములు చదియంగ జిహ్వలు వెడలించి, విపులసర్పంబులు విషము లుమియ
జలధాతుచయములు సెలయేఱులై పాఱఁ, బెలుచ నాడెడుభంగిఁ జలన మొంది
యొగి శిల ల్రాల ముప్పదియోజనముల, పొడవుఁ బదియోజనమ్ముల నడిమివలముఁ
గలుగునగ్గిరి తరుమృగావళులతోడ, ధరణితలసమానంబుగా ధరణిఁ గ్రుంగె.

519


వ.

ఇ ట్లద్భుతమహాకారుం డగుచుఁ బక్షంబులతోడిశైలంబునుంబోలె నాకాశ
మార్గంబున నభ్రభీషణఘోషంబుగా నార్చుచు మనోజవంబునం బఱతెంచు
సమయంబున.

520


చ.

అనిలజుసింహనాదరవ మచ్చుగ నంగదముఖ్యవానరుల్
విని పరమప్రియంబునను వృక్షము లెక్కియుఁ గొండ లెక్కియుం
గనుఁగొనఁ జాపముక్తపటుకాండసమత్వరఁ బాఱుతేరఁగా
ఘనుఁ డగుజాంబవంతుఁడు దగం గపివీరులతోడ ని ట్లనున్.

521


క.

జనకజఁ బొడగన నోపును, హనుమంతుఁడు గానకున్న నతిగంభీర
ధ్వని యేల గల్గు మోదం, బున వచ్చుచునున్నవాఁడు భూరిధ్వనితోన్.

522


క.

అనునెడఁ [24]దన కూఱటగా, ఘనమైనాకంబు నిల్వఁ గని యగ్గిరి న
ల్లన కేల నంటుచున్ వడి, హనుమంతుం డబ్ధి దాఁటి యచ్చెరువారన్.

523


ఉ.

అంగదముఖ్యవానరులు హర్షసముద్గతరోమహర్షు లై
యంగము లెల్లఁ బొంగ హృదయం బలరంగఁ జెలంగి చూడఁగా
నింగిఁ బతంగుభంగిఁ బ్రభ నిండి వెలుంగ మహేంద్రభూమిభృ
చ్ఛృంగము గ్రుంగఁ బె ట్టుఱికెఁ జేవ మహాశనిభీకరంబుగన్.

524


వ.

ఇ ట్లుఱికి యమ్మహేంద్రాద్రిపై నిలిచి తనరాకకు సంతోషించునంగదజాంబవం
తులకు నమస్కరించి మధుమధురఫలాదివివిధోపాయనంబులు గొనుచుఁ బరి
వేష్టించి యాలింగనంబుల నభివందనంబుల నతిప్రశంసల నందఱు వనచరులు
నయ్యైవిధంబులం బూజింపఁ బూజితుం డయి కంటి నగ్గుణాభిరాముం డగు
రాముదేవిం బుణ్యసమేత సీత ననవుడు నాపలు కమృతోపమానం బగుచు వీను
ల కింపార మేనులు పొంగ వాలంబు లెత్తికొని గంతులు వైచుచు నార్చుచు
బహుప్రకారంబుల వానరులు చెలంగ నప్పు డంగదుం గౌఁగిలించుకొని హను

మంతుండు కరం బవలంబించి చని దుర్దరంబు ప్రవేశించి యొక్కవిపులశిలాత
లంబున జాంబవత్పనసగజగవయగవాక్షులనడుమ నఖిలవనచరపరివృతుం డ
గుచు నాసీనుం డై యుండ నంగదుండు హనుమంతున కి ట్లనియె.

525


ఉ.

క్షోణిఁ బయోధి దాఁటి యిటు చూడఁగ నెవ్వఁడు వచ్చు నీకు గీ
ర్వాణులు సాటి గారు రఘురాముఁడు రాగిల సీతఁ గంటి మా
ప్రాణము లెల్లఁ గాచితి నృపాలశిఖామణిపాలికి జగ
త్ప్రాణతనూజ నీదుతగుప్రాపునఁ బోయెద మిప్డు నెమ్మదిన్.

526


వ.

అని పల్కె నంత జాంబవంతుండు హనుమంతున కి ట్లనియె.

527


ఉ.

శరనిధి నెట్లు దాఁటితి నిశశాచరుపట్టణ మెట్లు చొచ్చి తే
వెరవున సీతఁ గంటి పృథివీసుత యే మనెఁ గ్రూరరాక్షసో
త్కరముల నేగతిన్ మొఱఁగి క్రమ్మఱి వచ్చితి పోలఁ జెప్పుమా
తరుచరవీర నావుడు ముదంబున వారల కాతఁ డింపుగన్.

528


సీ.

జడనిధి దాఁటుచో నడుమ మైనాకంబుఁ, గనుటయు సురస వచ్చినవిధంబు
సింహికాహింసయు సింధునిస్తరణంబు, లంకాభిముఖతయు లంక సాచ్చి
సీతఁ గాంచుటయును సీతతో భాషించు, టయు వనక్షతి సేయుటయు నిశాట
భటులఁ ద్రుంచుటయును బంధక్రమంబును, బంక్తికంధరుదూఱఁ బల్కుటయును
లీల బంధవిముక్తుఁడై వాలవహ్ని, లంకఁ గాల్చుటయును నకలంకచరిత
సీతఁ గ్రమ్మఱఁ గాంచి భాషించుటయును, జెప్ప నందఱు ముద మంది చెలఁగి రపుడు.

529


క.

అంగద నిజసేనాజయ, సంగదుఁ డుద్దండసమరచండాహితవీ
రాంగదుఁ డురుమణిమయకన, కాంగదుఁ డంగదుఁడు గపుల నందఱఁ బల్కెన్.

530


క.

జానకిఁ గొనపోవక రఘు, భూనాయకుకడకు రిత్త పోవుట మెచ్చే
పూనిక మన మాసతిఁ గొని, రా నేఁగుద మబ్ధి దాఁటి రావణుపురికిన్.

531


క.

మీ రేటికి మీపనుపున, వారిధి లంఘించి లంక వడిఁ జొచ్చెద నా
కారులఁ బొరిపుచ్చెద ధా, త్రీరమణునిదేవి నేన తెచ్చెదఁ గడిమిన్.

532


చ.

ప్రకటబలోద్ధతిం గడఁగి రావణి నాపయిఁ గిన్క బావకాం
బకమును మారుతాస్త్రమును బాశుపతప్రదరంబు బ్రహ్మసా
యకమును నైంద్రబాణమును యామ్యకరంబును నేయ లెక్క సే
యర్ర దశకంఠముఖ్యదివిజారుల నెల్ల వధించి వచ్చెదన్.

533


చ.

పవనతనూజుఁ డొక్కరుఁడ బాహుబలంబున సర్వరాక్షస
ప్రవరుల ద్రుంప నోపు ఋషభద్వివిదుల్ గజుఁడున్ గవాక్షుఁడున్
గవయుఁడు మైందుఁడున్ నలుఁడు గాఢబలుల్ పనసుండు మేటి యా
హవమున జాంబవంతుఁ జెనయం గలవీరులు లేరు గావునన్.

534


వ.

మన మిందఱముఁ బోయి జనకనందనం గొనివత్తమొ కాక యేన పోయి తెత్తు

నో యనవుడు నంగదు వారించి జాంబవంతుం డతని కి ట్లను మనల సుగ్రీవుండు
సీతాన్వేషణంబు సేయం బనిచె మనవచ్చినపని పావనికతన సఫలం బయ్యె
లోకవిద్రావణుం డగు రావణుని వధియించెద నని రణవిజయుం డగు రాముండు
ప్రతిన పట్టినవాఁ డమ్మహాబలుం డక్కార్యం బనుష్ఠింపంగలవాఁడు మనము
పోవుదము రం డనవుడు నౌఁ గాక యని హనుమత్పురస్సరంబుగా సమస్తవాన
రులు మేరుమందరమహీధరంబులుంబోలె మహోన్నతాకారంబున వెలుం
గుచు మత్తశుండాలంబులుంబో లెఁ జండోద్దండగతి మించుచు నంబుదంబులుం
బోలె నంబరంబు నాచ్ఛాదించుచు నేతెంచి ఫలదళకుసుమసమృద్ధం బగుచు
నందనారామంబునుంబోలె నయనాభిరామం బగుచు సుగ్రీవమాతులుం డగు
దధిముఖపాలితం బైనమధువనంబు ప్రవేశించి యంగదానుమతి నయ్యు
ద్యానతరుసంతానంబునకుం గవిసి.

535

హనుమత్ప్రముఖవానరులు మధువనఫలాదులం దృప్తినొంది శ్రీరాముకడకు వచ్చుట

ఉ.

పండులు పొట్టనిండఁ దిని పం డ్లవి మిక్కుట మైనఁ గ్రొవ్వునం
బండుల వాటు లాడుచును బైపయిఁ దేనియ లోలిఁ గుత్తుకల్
నిండఁగఁ గ్రోలి సోలుచును నిద్దుర వోవుచు లేచి కొంద ఱు
ద్దండతఁ గిట్టి తేనియవసంతము లాడుచుఁ బొంగి వెండియున్.

536


చ.

కనుకనిఁ దోఁక లెత్తుకొని గంతులు వైచుచు వీఁక నార్చుచున్
గునియుచుఁ బాఱుచున్ నెగసి కొమ్మల వ్రేలుచు నేలఁ గూలుచున్
ఘనతరు లెక్కుచున్ దిగుచుఁ గ్రమ్మఱఁ బ్రాకుఁచుఁ జెట్టు చెట్టుపై
కనువుగ దాఁటుచుం జెలఁగి యాడుచుఁ బాడుచు నోలవెట్టుచున్.

537


చ.

పండినభూజ మెక్కి పరికపక్వఫలంబులు దించు నొక్కరుం
డుండఁగ వానిఁ ద్రోచి మఱియొక్కఁడు చేకొన వాఁడు వోయి తా
నొండొరుపంటి నెత్తికొని యుద్ధతిఁ బాఱఁగ వానిఁ దాఁకి యా
పం డొకరుండు పుచ్చుకొనఁ బైపడి యొక్కఁడు దాని మ్రింగుచున్.

538


ఉ.

ఒక్కనివీఁపుపై కుఱికి యొక్కరుఁ డుండఁగ వానిమూఁపుపై
నొక్కరుఁ డెక్క వానితల నొక్కరుఁ డెక్కఁగ నోలి దొంతు లై
దిక్కుల నాడఁగా నొకఁడు తీవ్రత వారలఁ గూలఁ దన్నఁగా
నొక్కఁడు వానిమూఁపులు మహోన్నతి నెక్కు చుఁ జీరుచుం దగన్.

539


చ.

ఫలములు దించుఁ దేనియలు పైపయిఁ ద్రావుచుఁ బుష్పగుచ్ఛముల్
డులుచుచుఁ గాయ లెల్ల వడి డొల్లఁగ వ్రేయుచు లేఁజిగుళ్లు నా
కులు వెరఁ జాడి త్రుంచుచును గొమ్మలు దక్క సమస్తభూజముల్
బలువిడి గాసి చేసి బహుభంగుల నిట్టులు ద్రుళ్లు చున్నెడన్.

540


వ.

వరపాలకు లత్యంతకోపాటోపంబునం బఱతెంచి వనచరేంద్రుం డగుసుగ్రీ

వునివన మంతయు నుఱుమాడుచున్నవా రనుచు నదలించి తోలుటయును హను
మంతుండు ముందఱికిఁ బఱతెంచి వెఱవకుఁడు వలసినట్లు మధురసఫలాదు లనుభ
వింపుఁ డన నంగదుం డట్ల సమ్మతింపఁ గ్రమ్మఱ నవ్వానరులు వనంబు సొచ్చి వనపా
లకుల నఖంబులు వ్రచ్చియుఁ దన్నియుం బొడిచియుం గఱచియు బహువిధంబుల
నొప్పింప వారలు భయంబునం బఱచి దధిముఖున కత్తెఱం గెఱింగింపం గనలి
యుద్ధతిం బొరిగొందు ననుచుఁ గెరలి సాలతాలశిలాయుధు లగువనపాలకులుం
దానును వడిం బఱతెంచి కటంబులు నోష్ఠంబులు నదరఁ గొందఱ జంకించియుఁ
గొందఱ మోఁదియు నాక్రమింపం గినిసి హనుమత్ప్రముఖవానరు లరుగుదేర
నంగదుఁ డుద్దతిఁ గోపోద్దీపితముఖుం డగుచు దధిముఖుం బట్టి మొగంబును
మోఁకాళ్లును గూడ నేలం బ్రామిన విసంజ్ఞుం డై తేలిసి తనయనుచరులం గూడు
కొని యతివేగంబున రామలక్ష్మణసహితుం డయి యున్నసుగ్రీవుకడకుం బోయి
దీనాననుండును ముకుళితాంజలియు నగుచు నమ్మువ్వురకు దండప్రణామంబులు
సేసినం జూచి సుగ్రీవుం డి ట్లనియె.

541


క.

వెఱవకు లె మ్మెవ్వఁడు ని, న్నెఱుఁగక యిటు నొవ్వఁజేసె నీ వది నాతో
నెఱిఁగింపుము నావుడు న, త్తఱి దధిముఖుఁ డల్ల లేచి తరణిజుతోడన్.

542


క.

బలువిడి నంగదహనుమం, తులు మొదలగువృక్షచరులు దుర్వారితు లై
ఫలదళమధుశూన్యముగాఁ, [25]గలమధువన మెల్లఁ జొచ్చి గాసిలఁ జేయన్.

543


చ.

చని ఫలమూలపుష్పమధుసంపద లొప్పఁగ వాలినాఁడు త
జ్జనకునినాఁడు నెన్నఁడును సంచల మొందనియీవనంబు మీ
రనుచితభంగి నేల నుఱుమాడెద రం చట నానవెట్టఁగా
నను నిటు మోఁది రన్న రవినందనుఁ డాత్మ నెఱింగి యి ట్లనున్.

544


క.

ధరణిజఁ బొడఁగన నోపును, ధరణీంద్రనిభుండు వాయుతతనయుఁడు లోకో
త్తరుఁ డాతఁడు దక్కఁగ న, య్యరుదుంబని చేసి రాఁగ నన్యులవశమే.

545


క.

జనకజఁ గానక యుండిన, ననుపమతరబుద్ధిమంతు లంగదముఖ్యుల్
మును దేవాసురులును గది, యనినావన మేల చొత్తు రంతటిమీఁదన్.

546


క.

వన మెల్లఁ బెఱికి దధిముఖ, వనపాలుర నిట్లు సేయ వచ్చునె భూనం
దనఁ గనుఁగొని ముదమున వ, చ్చిన కతనన్ వార లేమి చేసినఁ జెల్లెన్.

547


క.

అనవుడు లక్ష్మణుఁ డత్తెఱఁ, గినజు నడిగి తెలిసి నిక్క మిట్టిద యంచున్
జననాయకుండుఁ దానును, ననురాగాంబుధిని నోలలాడఁగ నంతన్.

548


వ.

సుగ్రీవుండు దధిముఖుం గనుంగొని యింక నీ వేమియు వగవకు మంగదాదులు
రామకార్యనిర్వాహకులు గాన మనకు మాననీయులు నీ వింక.

549


చ.

జవమున నేఁగి రామవిభుసన్నిధి కంగదముఖ్యవానర

ప్రవరులఁ దోడి తెమ్ము వనపాలన విూవ యొనర్పు నా మహీ
ధవునకు నర్కపుత్రునకుఁ దద్దయు భక్తి నమస్కరించి యు
త్సవమున నేఁగి కేల్మొగిచి సర్వవనాటుల నాదరంబునన్.

550


క.

ఇనజుఁడు మిముఁ దోడ్కొని ర, మ్మని ముదమునఁ బనిచెఁ గుమతినయి యే మిమ్ముం
గినిసితి ననుగ్రహింపుఁడు, చనుఁ డంచుం బలుక వారు సంతోషమునన్.

551


వ.

ఆంజనేయపురస్సరంబుగా రామలక్ష్మణసుగ్రీవదర్శనకుతూహలచిత్తు లగుచు.

552


చ.

కమియఁగ నింగికిన్ నెగసి కన్కని మ్రాఁకులఁ గూలఁద్రోచుచున్
బ్రమరులు వాఱుచున్ దెసలు వ్రయ్యఁగ నార్చుచు శైలశృంగముల్
దుముఱుగ వీఁకఁ దన్నుచును దోయదమాలిక లోలిఁ దూల వా
లము లొగిఁ ద్రిప్పుచుం గిలకికలధ్వను లిచ్చుచు వచ్చుచున్నెడన్.

553


చ.

జనవర చింత వోవిడిచి సమ్మద మందుము వారె వానరుల్
జనకజఁ గన్నవా రగుట సంతస మందుచు వచ్చుచున్నవా
రని యినజుండు వల్క నపు డంగదముఖ్యులు వచ్చి రుత్సవం
బెనయఁగ రామలక్ష్మణకపీంద్రులకన్నులు చల్ల సేయుచున్.

554


వ.

ఇట్లు వచ్చి రామలక్ష్మణసుగ్రీవులకు నమస్కరించి హనుమంతుం బురస్కరించి
కొని యుండ నఖిలవనచరానుమతి నాంజనేయుం డి ట్లనియె.

555


క.

కనుగొంటి సీత సేమం, బున నున్నది మిమ్ము భావమున నిడికొని వా
కున రామ రామ నృప యం, చును వెస మీరాక కెదురుచూచుచు నెపుడున్.

556


ఆ.

వఱపు దాఁకి యున్నవల్లికైవడి వాడి, బాలచంద్రరేఖకపగిది డస్సి
మధుపకలితపుష్పకమాలికగతి మాసి, వసుమతీతనూజ వగలఁ బొగులు.

557


క.

మనమున మీపైఁ గూర్మియుఁ, గనుఁగవ బాష్పములు మేనఁ గార్శ్యంబును జె
క్కునఁ గెంగేలును వదనం, బున దైన్యముఁ బాయ దెపుడు భూమిజ కధిపా.

558


క.

ధరణిసుత యేకవేణీ, ధరయును నుపవాసకృశయుఁ దతఘోరతపో
నిరతయు భూశయనయు నై, పరితాపముఁ బొందు దైత్యభామలనడుమన్.

559


వ.

అని విన్నవించి దేవా మీరు సుగ్రీవుతో సఖ్యంబు సేయుటయు మీగుణచరిత్రం
బులు శుభలక్షణంబులు నెల్లవిశేషంబులు వినిపింప నెట్టకేలకు నమ్మిన
యజ్జనకతనయకు మీ రొనంగిన భద్రముద్రిక యిచ్చిన నక్కునం జేర్చి శోకింప
మెల్లనఁ గొంతదడవున కేను బోధింపం దెలివి నొంది తనకుచాంతరగతకాకనఖ
రేఖలును సరసత మీరు నించినగండస్థలమనశ్శిలాపత్రరేఖలును దలఁపింపు మ
నియె మఱియు లక్ష్మణసుగ్రీవాదులకుశలం బడిగె మూఁడవమాసంబునఁ బ్రాణం
బులు నిలుప లే ననుచు మిమ్ము వేగం గొని ర మ్మని పలికె నని పలికి.

560


క.

ప్రేమం గొంగునఁ బదిలము, గా ముడిచిన దివ్యరత్నగణఖచితం బౌ
భూమినుత యిచ్చినచూ, డామణి యిదె యనుచు రుచు లడర నిచ్చుటయున్.

561

హనుమంతుఁడు సీత యిచ్చినశిరోరత్నము రామున కిచ్చుట

క.

భూరిప్రభ నొప్పారెడు, నారత్నము నల్లఁ గేల నక్కున నిడికొం
చారాముం డనుజుండు మ, హారోదనము లొగిఁ జేసి రధికాతురతన్.

562


వ.

అప్పుడు సుగ్రీవాదులు బోధింప నెట్టకేలకు శోకం బుడిగి రామచంద్రుం డిట్లనియె.

563


క.

ఏదెసఁ జూచిన నాదెస, నాదృష్టికిఁ దాన యగుచు నామది నెపుడున్
వైదేహి పాయ దొండెడ, వైదేహిం గంటి మనుట వాదో నిజమో.

564


క.

మును నిమిషాంతరమును సైఁ, పనిమత్ప్రియ జలధిశైలబహుళాంతర యై
నను నెట్టు పాసి యున్నది, ఘనతరవిరహాగ్నిచేతఁ గ్రాఁగుచు నకటా.

565


క.

జనకసుతఁ బాసి నిలువవు, దనువునఁ బ్రాణములు నాకుఁ దడయక యింకన్
జనకసుత యున్నచోటికి, ననుఁ గొని చని వగలు మాన్పు నగచరవర్యా.

566


వ.

అనుచుఁ బ్రలాపించురామచంద్రు నూరార్చి హనుమంతుం డి ట్లనియె.

567


క.

అర్ణవము దాఁటి బహుభుజ, పూర్ణుం డగుపంక్తికంఠుఁ బొరిగొని జగముల్
వర్ణన సేయఁగ నీవర, వర్ణిని గొని తేరఁ బోవవలయు నరేంద్రా.

568


క.

అని పలికి జలధి దాఁటిన, తనవిక్రమ మాది గాఁగఁ దగువృత్తాంతం
బును సీతావృత్తాంతము, విన సర్వముఁ జెప్పె రామకవిభుతో వెలయన్.

569


క.

సురతరుణీకోమలతర, కరసరసిజపీడ్యమానకమనీయభవ
చ్చరణసరోరుహసేవా, కరణచణప్రమథనాథ గౌరీనాథా.

570


మాలి.

సవనభుగభినంద్యా సర్వలోకైకవంద్యా
రవిశశిశిఖినేత్రా రమ్యరామార్ధగాత్రా
భువననివహనేతా భుక్తిముక్తిప్రదాతా
ప్రవిమలగుణసంగా భవ్యకోటీరగంగా.

571


గద్యము.

ఇది శ్రీమదష్టభాషాకవిమిత్ర కులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికా
ర్జునభట్టప్రణీతం బైన శ్రీమద్రామాయణమహాకావ్యంబునందు సుందరకాండ
ము సర్వంబు నేకాశ్వాసము.

572
  1. ఘనవరరుంద్రమున్
  2. రంగద్వీచికావిస్ఫుర, త్స్ఫారం
  3. కూలించెదన్.
  4. కలిపినభంగిన్
  5. జాలవిస్ఫుర
  6. ఉపవాసముల వాడి యురుపంకమున బ్రుంగి, యొలయిక నంతయు నొడలు డస్సి
  7. బొందినమృగశాబనయనఁ గనియె.
  8. చెలువొందం గడ లింపుఁ జె న్నొసఁగఁగన్ సిందూరకాంతిన్ సువృ, త్తలలామం బన
  9. మానము నాటియున్న
  10. మెత్తనిపువ్వుల మెఱయు. అ. ప్ర.
  11. ‘భోగభామిని వగుచున్.' అ. ప్ర.
  12. జేసికొనుము
  13. బెగ్గలం బందియుఁ గుందియు
  14. గలయ వెదకి, కడఁగి తిరుగుచు ఋశ్యమూకంబు
  15. నౌండ్లు దీటికొo
  16. డుగ్రక్షురప్రాసపట్టిసంబు
  17. నింద్రజితుండును
  18. శరవేగము లోర్చు
  19. గాట్లం బోట్లం
  20. కౌకస్సంచరకాళరాత్రి
  21. ఆయెడను మహోగ్రంబుగ, నాయతశిఖ లడరుచున్న యయ్యగ్నియుఁ బ్రాలేయ
  22. ప్రాసశూలాయుధాయసపట్టిసాసి
  23. ‘అనుచుం బ్రణమిల్లి యద్దేవి వీడ్కొని గమనోన్ముఖుం డగుచుఁ బవవజుండు సాలతాల' వ్రా. ప్ర.
  24. బొడవుగ ముందట
  25. గలచి మధువనంబు సొచ్చి