భాస్కరరామాయణము/యుద్ధకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

యుద్ధకాండము



కర కరుణారుచిరవి
లోకనలీలావికాసలోల విపశ్చి
ల్లోకవివేకకలాశి
క్షాకుశలా మేరుధీర సాహిణిమారా.

1


వ.

ఇట్లు హనుమంతుండు సీతావృత్తాంతం బెఱింగించుటకు హర్షవిషాదంబులు మనం
బునం బెనంగొనుచుండ రఘువరుం డి ట్లనియె.

2


క.

వినతాసుతునకుఁ బవనున, కును నితనికిఁ దక్క నొరులకుం జెల్లునె మున్
వననిధిని దాఁటి యవ్వలి, పని మఱి యెవ్వాఁడు దీర్చెఁ బావని దక్కన్.

3


ఉ.

ఉత్తముఁ డేలుఱేనిపని యొక్కరుఁ డయ్యును జేయు మధ్యముం
డత్తి యొనర్చుఁ దోడు గలయప్పుడు చాలియు నీచుఁ డెప్పుడుం
జిత్తము సేయఁ డత్తెఱుఁగు సేయుటకై యసహాయశూరుఁ డ
త్యుత్తమభృత్యుఁ డీకపికుకలోత్తముఁ బోలుదు రెట్టు లెవ్వరున్.

4


వ.

అని మఱియు రఘువరుం డాంజనేయుం గనుంగొని.

5


క.

తమ్ముఁడ విను మేనును నా,తమ్ముఁడు లక్ష్మణుఁడు నీకతమ్మునఁ గాదే
క్రమ్మఱఁ గలుగుట రఘువం, శ మ్మిట రక్షింప నీక చనియె మహాత్మా.

6


క.

ఉపకృతమతి నీకుం బ్ర, త్యుపకారము సేయ నెద్దియుం గల్గమి నీ
యుపగూహనంబు గైకొను, కపికుంజర యనుచుఁ దిగిచి కౌఁగిటఁ జేర్చెన్.

7


వ.

ఇట్లు గారవించి సమీరకుమారా నీవు సీతావృత్తాంతం బెఱింగించుటకు సంతో
షంబును గడలిఁ గడచు తెఱం గెట్లు చెప్పెదో యనువిచారంబును బొడము
చున్న దనుచుఁ గొండొకసేవు డోలాయమానమానసుం డగుటయుం జూచి
సుగ్రీవుం డి ట్లనియె.

8


శా.

మాత్సర్యంబున నిమ్మహాకపివరున మా ఱెందు లే కున్నవా
రుత్సాహంబున సేతుబంధమున కుద్యోగింతు గా కింక భూ
భృత్సింహుం డగునీకుఁ జింత దగునే పెల్లీవు వి ల్లంది శుం
భత్సంరంభము సూపినన్ నిలుతురే బ్రహ్మాదులుం బోరులన్.

9


క.

క్షత్రియుఁడు మందుఁ డైన ధ, రిత్రీప్రజ లోట చెడి చరింతురు జగదే

కత్రాణపరాయణ విను, శత్రులు భీతిల్ల నలుక సమకొల్పు మదిన్.

10


క.

చిచ్చు చొరుఁ డన్న నురవడిఁ, జొచ్చెద మమరారిపురము సొచ్చెద మరులం
దెచ్చెదము దీనదశ కిటఁ, దెచ్చెద మవలీల దేవ దేవరదేవిన్.

11


క.

ఓలిం దోఁచుచు నున్నవి, మేలుగ నెల్లెడల బహునిమిత్తంబులు భూ
పాల జయ మవశ్యము నీ, పాలిద నిక్కంబు లంకపై విడియు మిఁకన్.

12


వ.

అనిన విని నరేశ్వరుం డవ్వానరేశ్వరువాక్యంబుల కలరుచుఁ బవనతనయు
నుపలక్షించి.

13


ఆ.

వరము వడసి యైన శరము ప్రయోగించి, వట్టఁ జేసి యైనఁ గట్టి యైన
వనధి దాఁట నెట్లు వచ్చుఁబో దుర్గంబు, తెఱఁగు చెప్పు నాకుఁ దెలియ ననుడు.

14


శా.

ప్రాకారంబు లగడ్త లట్టడులు యంత్రవ్రాతముల్ వప్రముల్
వాకి ళ్లాయుధసంపదల్ గజము లశ్వంబుల్ రథంబుల్ భటా
నీకంబుల్ బహుకేతనాదులు మదిన్ నిర్మించినట్లుండు భూ
నాకం బప్పుర మేకొఱంతయును గానంబట్ట దెప్పట్టునన్.

15


ఉ.

ఎక్కడఁ జూచినం బుడమి యీనెనొకో యన వేలు లక్షలుం
బెక్కులు కోటులుం గలిగి భీకరభంగులఁ గ్రొవ్వు లారఁగా
నుక్కునఁ దీరిన ట్లమరు నుగ్రపుమేనులయాతుధాను లొ
క్కొక్కని మెచ్చనట్టిభటు లుండుదు రొక్కొకవానివాకిటన్.

16


వ.

మఱియు నన్నగరంబు పడమటివాకిటఁ గరాళశూలహస్తు లైన పౌలస్త్యులు పది
వేవురును దక్షిణోత్తరద్వారంబులఁ జతురంగబలసమేతు లై యొక్కొక్కలక్ష
యుం దూర్పుగవనిఁ జర్మకృపాణపాణులు పదిలక్షలును మధ్యమస్కంధంబున
సింధురబంధురం బగుసైన్యంబుతో ననేకసహస్రంబులు నుండుదు ర ట్లున్న నేమి
మనయంగదమైందద్వివిదపనసనలనీలజాంబవంతులు కడంకం గడంగి లంకఁ ద్రికూ
టాచలంబుతోన పెఱికి పేటాడం జాలుదురు దేవరసామర్థ్యంబు దలంప నది
యేమిదుర్గమంబు తగినముహూర్తంబునఁ బ్రయాణంబు సేయుదు గాక యని
హనుమంతుండు విన్నవించిన నన్నరేంద్రుం డినతనయుం గనుంగొని.

17


తే.

నేఁడు రెండవఫల్గుని నిండురిక్క, గగనమణి నభోమధ్యంబు గదిసినాఁడు
నామనంబును నలరెడు నీముహూర్త, మొప్పు నిప్పుడు కదలిన నొడుతు రిపుల.

18


క.

నలులక్షకపులతో ని, బ్బలములకును దెరువు పెట్టఁ బనువుము నానా
ఫలమూలమధూదకములు, గలకందువ లరసి గమనకౌతుక మొప్పన్.

19

రాముఁడు వానరబలంబుతోడ లంకకుఁ బ్రయాణ మగుట

వ.

మఱియుం దగువారి వలయునెడల నడవ సేనానాయకుల నియోగింపు మనిన
నట్ల చేసి యతండు ప్రార్థించినం బార్థివనందనులు పవననందనవాలినందనుల
నెక్కి యైరావణసార్వభౌమాధిరోహణంబులు సేసిన త్రిదశేంద్రకిన్నరేంద్రులతె

ఱంగున మెఱసి రప్పుడు తమతమ సైన్యంబులతో గజగవయగవాక్షు లబ్బలంబు
ముందటను వృషభుండు వలపటను గంధమాదనుండు దాపట ననేకభల్లూక
యూథంబులతో సుషేణవేగదర్శిజాంబవంతులు సుగ్రీవపురస్సరంబుగా నడుమను
ముందట మైందద్వివిదాదులును బలసి కొలువ రఘువీరునగ్రభాగంబున వలీము
ఖులు పదికోట్లతో శతవలియును బిఱుంద నూఱేసికోట్లతో నతిబలార్కపవన
కేసరు లొక్కొక్కచెంగటను బొలిచిరి భరతదరీముఖజంఘప్రజంఘులు బరవ
సంబు సేయునెలుంగులఁ జెలంగుచు నీలప్రయత్నంబునం గడంగి నడవం దొడంగి
రాసమయంబున.

20


చ.

దిగిభము లోలిఁ దూల జగతీతల మల్లలవాడ నాదిప
న్నగ మద్రువంగఁ దద్బహుఫణామణిఘట్టనఁ గూర్మరాజు వె
న్నగల మహాట్టహాసముల నార్పుల దిక్కులు వ్రయ్య నొక్కపె
ట్టుగ నడవం దొడంగిరి కఠోరతరోద్ధతు లొప్ప నయ్యెడన్.

21


ఆ.

అడవి చాఁపకట్టు వడి నుగ్గునూచ మై, బయలుగాఁగ ధూళి [1]బయలమ్రేఁగ
నడరి మన్ను మిన్ను నగచరు లిట్టట్టు, తిరుగవైచినట్టితెఱఁగు దోఁచె.

22


ఆ.

సేతుబంధనంబు సేయునంతకుమున్న, జలధిపట్టు నవనితలము సేయ
నెగసె ననఁగ మఱియు నిగుడుచు ముంగలి, బలసముత్థరేణుపటలి యడరె.

23


ఆ.

సీత న ట్లుపేక్ష సేసి మిన్నక యున్కి, నఖిలభూతములకు నధిపునల్కఁ
బట్టపగలు నింగి పడియె నా సేనార, జాంధకార మడర నపుడు కపులు.

24


చ.

మదమునఁ దూఱి పాఱి పెనుమ్రాఁకులఁ బ్రాఁకుదు రిట్టు నట్టు దాఁ
టుదురు లతాంతగుచ్ఛములు డుల్తురు ముందటిగండశైలముల్
పదములఁ బాఱఁ జిమ్ముదురు ప్రాంతమహీరుహశాఖలం బెనం
గుదు రొగి నుప్పరం బెగసి కూలఁగ దాఁతురు శైలశృంగముల్.

25


క.

ఒక రొకరిమూఁపు లెక్కుదు, రొకనిపయిం ద్రోతు రొకని నొక్కఁడు దినుపం
డొకఁ డొడిసికొనఁగ నడుమన, యొకఁ డది పడ నడువ నదియు నొక్కఁడ మ్రింగున్.

26


ఉ.

పండినభూజముల్ పెఱికి పట్టి ఫలంబులు దించు నన్యుఁ డ
ప్పండులు వేఁడినం దనదుపం డ్లిగిలించు నొకం డొకండు చే
పం డటు చూప వాఁడు కరపల్లవ మల్లనఁ జాఁప మ్రింగి బ్ర
హ్మాండముఁబోలె నున్నతనయంగిలిఁ జూపుచుఁ బోయెఁ బొ మ్మనున్.

27


వ.

ఇత్తెఱంగునం దమజాతిచేష్టితంబుల దాశరథుల కిం పొదవింప నెడ నెడ మధుర
ఫలాదు లుపయోగించుచు నడచి సహ్యమలయాచలంబులు గడచి మహేంద్ర
మహీధరాధిరోహణంబు సేసి యనతిదూరంబున.

28


మహాస్రగ్ధర.

కని రారాజన్యు లభ్రంకషబహులహరీఘట్టనోద్ధూతఫేనం

బును గంభీరాతిఘోరాద్భుతరవబధిరీభూతరోదోంతరంబున్
ఘననక్రగ్రాహదర్వీకరమకరమహాకచ్ఛపానేకమీనం
బును జూడారంగరంగద్భువనపవనభుగ్భూనభోంతర్ధి వార్ధిన్.

29


కని తదీయం బైనమహామహిమంబు గొనియాడుచుం జేర నరిగి నానాతరులతా
కుంజపుంజంబులం బొల్చు వేలావనంబున విడిసి రప్పుడు.

30


సీ.

పృథులహాసంబులు పెన్నురువులభంగి, వఱల వాలములు ప్రవాళలతల
కైవడిఁ జెలువార ఘనబాహుశాఖలు, బహుళవీచీపరంపరలకరణి
విలసిల్ల నుద్భటవీరసంచారముల్, కుటిలతరగ్రాహకఘోరగతుల
చాడ్పున నొప్పారు సందడి [2]పలుకుల, యులి వఖండధ్వనియోజ నిగుడ
వివిధవాహినీసంగతి వెలయ నినజు, నాజ్ఞ చెలియలికట్ట యై యడర రామ
చంద్రునుదయ ముదంచితోత్సవముఁ జేయ, నొప్పెఁ [3]గపిబలోదధి వార్ధి కుద్ది యగుచు.

31


వ.

తదనంతరంబ.

32


ఆ.

జానకీవియోగసాగరమగ్నుఁ డై, రామచంద్రుఁ డుండఁగా మనోజ్ఞ
భంగి నింకఁ దగునె పద్మినీభోగ మ, న్నట్లు గ్రుంకె నర్కుఁ డపరజలధి.

33


తే.

ఇనతురంగరింఖాహతి నెసఁగునస్త, శైలధాతుశిలోద్ధూతధూళిపటల
మనఁగ నపరదిశాభాగమునకు వింత, చెలువు సేయుచు నెఱసంజపొలుపు మిగిలె.

34


క.

భూపాలకపరమేశ్వరు, కోపానలకీల లంటికొని కమలినలం
కాపతికీర్తియొకో యని, రూపింపఁగఁ [4]జీకువాలు రోదసి నిండెన్.

35


క.

వనచరనాయకసంఖ్యకు, వనజభవుఁడు బొట్టు లిడుచు వచ్చె నొకో నాఁ
గనదురుదీప్తుల గగనం, బున నొక్కఁడొకండ తోఁచెఁ బొరిఁ దారకముల్.

36


శా.

గంగాతుంగతరంగపాండురమయూఖశ్రేణినిశ్రేణికా
భంగిన్ నింగికి నబ్ధికిన్ నడుమఁ బైపై నొప్పఁ బ్రాగ్భూమిభృ
చ్ఛృంగాగ్రంబు నలంకరించె సితరోచిర్మండలం బభ్రమా
తంగోదంచితకుందకందుకముచందం బొంది రమ్యాకృతిన్.

37


క.

వెడవిలుతుకీర్తిజాలము, వడువునఁ జంద్రాతపంబు వాలుటయును ము
న్నుడు కెత్తినడెందముతో, వడఁకాడెడుధైర్య మెడల వగలఁ బొగులుచున్.

38


వ.

కౌసల్యానందనుండు సుమిత్రానందనున కి ట్లనియె.

39


ఉ.

రక్కసుచేతఁ బట్టువడి రాజనిభానన యేఁగునప్పు డే
దిక్కున నానలేమి నలుదిక్కులుఁ జూచుచు భీతి నాథ నీ
వెక్కడఁ జిక్కి తంచు నెలుఁగెత్తి పొరింబొరి నన్నుఁ జీరుచుం

బెక్కుదెఱంగులన్ వగల పెల్లునఁ దూలుచు నెట్టు లుండెనో.

40


ఉ.

ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్యఁ జుం
డోజనులార యడ్డపడ రోసురలార సురారి కంచు నం
భోజదళాక్షి శైలవనభూములు దాఁటుచు భీతి నేఁగుచో
నీజలరాశిఁ జూచి మది నెంత దలంకెనొ యేమి సేయుదున్.

41


సీ.

వననిధి బంధించి చని లంక భేదించి, రాక్షసాధము పెన్నురంబు రయము
మెఱయ నందంద క్రొమ్మెఱుఁగునారసముల, గ్రుచ్చి యచ్చెరువారఁ గులిశఘోర
భల్లపరంపరల్ పరఁగించి ధనురాది, సాధనప్రకరంబు చక్కు చేసి
చేతులు ఖండించి శిరములు దునుమాడి, వెస నానిశోణితవృష్టిచేతఁ
బుత్రిదెసకుఁ బొగులు భూదేవియుడు కార్చి, తీవఁబోఁడి నెపుడు దెత్తునొక్కొ
చంద్రవదనవదనచంద్రిక నెన్నఁడు, దృక్ఛకోరతృష్ణఁ దీర్తునొక్కొ.

42


క.

తోయధివీచులకు నిశా, నాయకరోచులకు నడుమ నాతను వున్నం
గాయజతాపం బాఱుఁ జు, మీ యటఁ గొనిపొమ్ము నను సుమిత్రాపుత్రా.

43


వ.

అని పల్కి పురోభాగంబున.

44


క.

వలరాజు ఖడ్గపుత్రిక, జళిపించినతెఱఁగు దోఁపఁ జారులతాకో
మలపల్లవములు పొరిఁబొరిఁ, జలియించుటఁ జేసి విరహచకితుం డగుచున్.

45


క.

మంచానిలంబ నాపైఁ, బొందుగ సతిమీఁదఁ బొలసి పొలయుము నీచే
నొందుదుఁ దత్తనుసంగతి, చందురునం దెట్లు దృష్టిసంగతి గలుగున్.

46


క.

అని [5]కమ్మగాలి పొలపం, బునఁ దాలిమి దూలి పోవఁ బొవులుచు నున్నం
గని యవ్విభు నుచితోక్తుల, ననుజుఁడు బోధించె నంత నక్కడ లంకన్.

47

రావణుండు మంత్రులతో మంత్రాలోచనము సేయుట

తే.

వాసఐరాతి వేగులవారివలన, దాశరథులవృత్తాంత మంతయు నెఱింగి
పవనసుతుచేత నట్లైనపరిభవంబు, దలఁచికొనుచు నాస్థానంబు కలయఁ జూచి.

48


చ.

ఒకకపి సాగరంబు కడునుగ్రరయంబున దాఁటి వచ్చి స్రు
క్కక వన ముద్ధతిం బెఱికి కావలి యున్నిశాటకోటి న
క్షకుఁ బరిమార్చి మత్పురముఁ గాలిచి క్రమ్మఱ నేఁగె లెక్క సే
యక హరిసేనతో విడిసి రంబుధి దాఁటఁగ నిఫ్డు రాఘవుల్.

49


ఉ.

ఆవసుధేశు లింక మకరాలయ మేగతి నైన దాఁటి సు
గ్రీవపురస్సరంబుగ నొగిన్ నడతెంతురు తప్ప దాహవం
బేవెర వాచరించిన జయింతుము చెప్పుఁడు మీరు నీతివి
ద్యావిదులుం దలంపఁ బరమాప్తులు నా కని పల్కి వెండియున్.

50

తే.

అఖిలసమ్మతిఁ గావించునదియు బహువి
చారములు దోఁప నం దొక్కసరణి నడపు
నదియు నౌఁ గాదు నాఁ జేయునదియు నివ్వి
ధంబు లుత్తమమధ్యమాధమము లండ్రు.

51


ఆ.

కాన మంత్రు లొక్కకార్య మందఱుఁ గూడి, నిశ్చయింపుఁ డంబునిధి గడాళ
మున్న రిపులు గెలిచి మూఁడులోకంబుల, కళుకు పుట్టఁజేయవలయు ననిన.

52


చ.

కొలువున నున్నరక్కసులు ఘోరతరోద్ధతు లొప్ప ఖడ్గరో
చులు నిగిడించుచుం గనలుచూడ్కుల నొక్కట విస్ఫులింగవముల్
వెలువడ భీకరభ్రుకుటివీచులు వీరరసాబ్ధికట్టపైఁ
బొలసినభంగి ఫాలములఁ బొల్పుగ ని ట్లని రాసురారితోన్.

53


శా.

లీలం గొంటి కుబేరుపుష్పకము బల్మిన్ గిట్టి [6]మువ్వెట్టులం
దూలం దోలితి వాసవాదిసురులన్ దోర్దండకండూతికై
కైలాసాచల మెత్తి తివ్విధమునన్ గర్వంబు సర్వంకషం
బై లోకంబులఁ జెల్ల నీ కొకఁ డసాధ్యం బెద్ది లంకేశ్వరా.

54


వ.

అదియునుం గాక.

55


సీ.

మయుఁడు బాహావిక్రమము చూచి తనకూఁతుఁ దెచ్చి నీపట్టంపుదేవిఁ జేసె
జతురంగసహితు లై సరిఁ బోరి వరుణాదు, లే పఱి నీవెట్టి కియ్యకొనిరి
పాతాళలోకంబుపైఁ జన్న వచ్చి ప, న్నగరాజు నీశరణంబు గనియె
నడరి కౌంభీనసేయాదిదానవు లాహ, వక్రీడ కోడి నీవార లైరి
కాలదండభయంకరగతి నడంచు,నపుడు మృత్యువు నీయట్టహాసమునకు
బెగడె మఱియు నీచేఁ బడ్డ బిరుదుమగల, లోనఁ గడిమి నెవ్వీరుఁ బోలుదురు వీరు.

56


వ.

అని పల్కి సభామధ్యంబునం గుటిలభ్రూకుటిదుర్నిరీక్ష్యుం డగుచుఁ గనలు నింద్ర
జిత్తుం గనుంగొని.

57


మ.

జగదాభీలుఁడు మేఘనాదుఁడు మహాసామగ్రి మాహేశ్వరం
బగుయాగం బొనరించి లబ్ధవరుఁ డై యస్వప్నసేనార్ణవం
బొగి బాహాద్రి మధించి యెల్ల సిరిచే నొప్పారు జంభారిఁ జం
డగతిం బట్టినవాఁడు గాఁడె యితఁ డుండం జింత నీ కేటికిన్.

58


వ.

అని వెండియు.

59


చ.

పెఱుకుదుమే ఫణీంద్రువిభీషణదంష్ట్రలు నేలఁ గ్రుంగఁ జే
సఱుతుమె నింగి మ్రింగుదుమె చండదిశాగజదంతకాండము
ల్విఱుతుమె వారిధుల్ పుడిసిలింతుమె మందర మంగుటంబునం
జిఱుముదుమే జగంబు లఱచేతికిఁ దెత్తుమె రాక్షసేశ్వరా.

60

క.

నరు లిరువురు గొందఱు వా, నరులం గూడికొని వచ్చి నరభోజనులన్
దురమునఁ జెనకుదురటె యీ, యరుదులు వినఁబడియె నిప్పు డమరారాతీ.

61


వ.

అని విజృంభించుసమయంబునఁ బ్రృహస్తుం డనుసేనానాయకుం డి ట్లనియె.

62


చ.

తురగసమాకులంబు రథదుర్గమముం గరిభీకరంబుఁ దో
మరధనురాదిసాధనసమంచితవీరభటోద్భటంబు సొం
పరుదుగ నీయనీకము నిరాయుధ మైనపదాతిమాత్ర మా
హరిబల మెట్లు హ స్తిమశకాంతర మారసి చూడ రెంటికిన్.

63


వ.

అదియునుం గాక.

64


చ.

అనిమిషదానవాదులకు నాజుల నీదెసఁ దేఱి చూడ రా
దనిన మనుష్యు లెవ్వరు దశానన నీ కది యట్టు లుండె నే
మనఁ గల దిఫ్డు నీచుఁ డగుమర్కటుఁ డొక్కఁడు వచ్చి లంకఁ గా
ల్చెనఁట జగం బవానరముఁ జేసికదా పదివేలు నైజముల్.

65


వ.

ఏము ము న్నేమఱి యున్నతప్పు గల దనిన దుర్ముఖుం డనువాఁ డి ట్లనియె.

66


క.

తారాపథమున కెగసినఁ, బారావారమునఁ బడినఁ బాతాళము [7]దు
ర్వారగతిఁ బాఱి తూఱిన, బారిసమరి పుత్తుఁ గపులఁ బంపుము నన్నున్.

67


వ.

అనిన వజ్రదంష్ట్రు డనువాఁ డి ట్లనియె.

68


మ.

పురజిత్కైటభజిద్విరించియుతు లై భూపాలు రేతెంచినం
బురదాహం బొనరించి పోయిన మరుత్పుత్రుండు తొల్ముద్దగాఁ
బరిఘావర్తనజాతవాతహతి నభ్రశ్రేణిఁ దూలించుచుం
బరిమార్తుం బరిపంథికోటి నిది నాపంతంబు లంకేశ్వరా.

69


తే.

మఱియుఁ జెప్పెద విను మొక్కమతము భరతుఁ
డనికి నిటఁ దోడుపుత్తెంచె ననుచుఁ గపట
నరులు మై పోయి బహుసాధనముల వారిఁ
జంపి వచ్చెద మమరారి పంపు మమ్ము.

70


వ.

అనినఁ గుంభకర్ణునికొడుకు నికుంభుం డనువాఁ డి ట్లనియె.

71


క.

సురకంటక విను రణమున, సురగణములతోడఁ గూడ సురపతి నైనం
బొరిగొనియెద నెక్కడివా, నరులు గీనరులు నేటి నరులున్ గిరులున్.

72


వ.

అనిన విని మహాపార్శ్వుండును మహోదరుండును ధూమ్రాక్షుండు నతికాయుం
డును మహాకాయుండు నగ్నికేతుండును రశ్మికేతుండును వజ్రదంష్ట్రుండును సు
ప్తఘ్నుండును సూర్యశత్రుండును నింద్రజిత్తు ననుమహావీరు లైనమేటిరక్కసు
లొక్కట రేసి క్రొమ్మఱుంగు లెగయఁ గైదువు లంకించుచు రావణుం జూచి
యిదె చని యన్నరుల వానరులం దునుముదుము పొడుతుము చెక్కుదుము ప్ర

క్కలుసేయుదు మనునివి మొదలగురోషపరుషభీషణభాషణంబులు గ్రందుకొన
సవష్టంభంబునం బలుకుచున్న నెట్టకేనియు వారి వారించి విభీషణుం డిట్లనియె.

73

విభీషణుండు రావణునకు నీతి చెప్పుట

క.

వినుఁడు నిశాచరు లిందఱు, మనరా జారాజుదేవి మాయోపాయం
బునఁ దెచ్చె నింత సేయం, జనునే యీతప్పు రామచంద్రునితప్పే.

74


శా.

ఆదుశ్చారిణి యైనశూర్పణఖ ఘోరాకారదుర్దర్శ యై
వైదేహిం గని మ్రింగఁ బోక మొదలన్ వా రల్గిరే దానికై
కాదే పూని ఖరుండు పోయి మడిసెన్ గర్వంబునన్ రామునం
దేదీ పేర్కొనఁ దప్పు తప్పు మనయందే పో విచారించినన్.

75


క.

తగవును ధర్మముఁ బలికిన, మగతన మది సెడునె వారు మనపంతములం
దెగిరే లేరే మీ ర, య్యగచరుఁ డటు సేయునప్పు డది య ట్లుండెన్.

76


తే.

తొలుత మూఁ డుపాయంబులు గొలుపకున్నఁ
దుదిఁ గదా విక్రమోద్యోగ మదియు రిపుఁడు
మత్తుఁ డై యున్న నొరుచేత నొత్తఁబడిన
వీతబలుఁ డైనఁ జను నండ్రు నీతివిదులు.

77


వ.

కావున రఘువరుం డప్రమత్తుండును విజిగీషుండు నధికబలసమేతుండు నగుట
నెవ్వరికి నజయ్యుం డంతియ కాదు ధర్మం బెచట వర్తించు నచటికి జయం బవశ్యం
బు సగు నొక్కహనుమంతుండు మనల నెంతలు సేసె నిప్పు డమ్మహాత్మునిం గొ
ల్చి యపారసత్వసంపన్ను లైనమేటివనచరవీరు లనేకు లనేకానీకంబులతో న
రుగుదెంచినవా రింకను నిత్తెఱంగున వృథావైరంబు దగ దని పెక్కుహేతువులు
సూపి చెప్పుచు ముకుళితకరకమలుం డై దశముఖుం గనుంగొని.

78


శా.

రక్షోనాయక నిన్ను మమ్ము సచివవ్రాతంబు నీసేనల
న్రక్షింపన్ వలతేని పుచ్చు మరల న్వైదేహి న ట్లేచి యా
జిక్షోణిం దృణకల్పుఁ డై ఖరుఁడు ప్రస్ఫీతోగ్రకీలాదురు
త్ప్రేక్షం బైనరఘుక్షితీశుశరవహ్నిం బాటు గంటేకదా.

79


వ.

అనిన విని నిశాచరేశ్వరుం డతనినయనిష్ఠురోక్తులు చెవుల కింపుగామి దిగ్గన నా
స్థానంబు వెడలి నిజనివాసంబున కరిగె నంత నందఱుం దమతమమందిరంబులకుం
జనిరి విభీషణుండు మఱునాఁడు ప్రభాతసమయంబున.

80


ఉ.

మంగళతూర్యనాదములు మానుగ మాగధసూతవందివా
క్సంగతమేదురంబు లయి క్రందుకొనం బెనుమంది గల్గి మా
తంగఘటాసముత్కటమదద్రవనిర్ఝరపాతపంకిల
ప్రాంగణ మొప్ప నొప్పునమరారిగృహంబున కేఁగి మోసలన్.

81


క.

అరదము డిగి చని యభ్యం, తరమునఁ దగుమంత్రివరులు దనుఁ గొల్వ మణి

స్ఫురదురుసింహాసనమున, గరిమంబున నున్నయన్నఁ గని మ్రొక్కి తగన్.

82


వ.

తన్నియోగంబున నొక్కపసిండిపీఠంబున నుండి కొండొకసేపునకుఁ బ్రసంగంబు
దిగిచి యిట్లనియె.

83


సీ.

[8]సీత నీ విటకుఁ దెచ్చినయది మొదలుగా, హోమాగ్ను లపసవ్యధూమ మడర
విస్ఫులింగంబులు వెలువడు చునికిని, నొప్పక హవ్యము లుప్పతిల్లుఁ
బొరి సరీసృపములు పొడముఁ గుండంబుల, నిభములు మదధార లింక వనరుఁ
దురగముల్ గన్నీరు దొరఁగ డిల్లంబు లై, యుండును వికిరరోమోద్గమంబు
లశ్వకరికలభాదుల యందుఁ గానఁ, బడు గవంకుల వాపోవుఁ బట్టపగలు
మొగి వఱ ళ్లీమహోత్పాతకములకు శాంతి, చూడ నద్దేవి మరలఁ బుచ్చుటయ లెస్స.

84


క.

ఇత్తెఱఁగు మంత్రు లంత, ర్వృత్తములం గనియుఁ జెప్ప వెఱతురు నీచేఁ
జత్తురు నొత్తురుగాక వి, పత్తియెడం దగదె హితము పలుకం దమకున్.

85


క.

అనవుడుఁ గోపంబున ని, ట్లను నాతని కతఁడు వార లమరగణములం
గొనివచ్చిన నేఁ బుత్తునె, జనకజఁ బొ మ్మీవు వలదు చక్కటి చెప్పన్.

86


క.

రాముఁడునా నెవ్వఁడు సు, త్రాముఁడొ వరుణుండొ జముఁడొ ధనదుఁడొ పటుసం
గ్రామక్రీడకు నాతో, నీమాటలు విడువు విడువ నేను మహీజన్.

87


వ.

అని పల్కి మందిరద్వారంబు వెలువడి కనకరథాధిరూఢుం డై ధవళచ్ఛత్రచా
మరంబులు మెఱయ నరదంబుచుట్టును జర్మకృపాణపాణులును ముందటఁ బి
ఱుందఁ గెలంకులం బరిఘగదాముద్గరభిండివాలశూలాదిసాధనంబులు కీలాభీలం
బులుగా రక్షోవీరు లనేకులు బలసి కొలువ మాతంగతురంగాదుల నెక్కి సేనా
నాయకులును మంత్రులును జనుదేర నానారుచిరరత్నచిత్రితంబును విశ్వకర్మ
నిర్మితంబును బహుపిశాచరక్షితంబు నగునాస్థానమండపంబున కేతెంచి మణి
ఖచితసింహాసనాసీనుం డై మఱియుం దగువారిఁ గోలలవారిం బంచి రప్పించి
నిజనియోగంబున నందఱు నర్హపీఠంబుల నుల్లసిల్లఁ గొండొకసేపునకు నక్కొ
లువు గలయం గనుంగొని.

88


తే.

నేఁడు మేల్కని చనుదెంచినాఁడు కుంభ, కర్ణుఁ డింతకు మున్నెఱుఁగండు సీత
నేను దెచ్చినయవ్విధ మితని కింకఁ, దెలియనంతయు వినిపింపవలయు ననుచు.

89


క.

శూర్పణఖముక్కు పోవుట, దర్పితుఁ డౌ ఖరుఁడు వడుట ధరణిజఁ దా నా
నేర్పునఁ దెచ్చుట పుర మన, లార్పిత మగుటయును వరుస నంతయుఁ జెప్పెన్.

90


వ.

చెప్పి సభాసదులం గలయం గనుంగొని.

91


క.

బృందారకు లింద్రునకును, నిందునకును దారకంబు లె ట్టట్టుల నా

కుం దలఁప నీనిశాచరు, లందఱు నని పల్కి మఱియః నందఱతోడన్.

92


క.

నరులకు వానరులకు సాగర మెట్లొకొ దాఁటవచ్చుఁ గార్యస్థితు
వెరవులొ కా దనఁగా రా, దరుదుగ నొకక్రోతి గాదె యంతలు సేసెన్.

93


క.

కాన విచారింపుఁడు మన, మేరీతిఁ జరింపవలయు నెన్నివిధముల
జానకి నటఁ బుచ్చక య, మ్మానవుల జయించుతెఱఁగు మంత్రప్రౌఢిన్.

94


వ.

అని పలికి విజృంభించి.

95


మ.

నరులే నన్ను జయించువారు మొదలన్ నాలావు మీ రాసురా
సురయుద్ధంబులఁ జూడరే రఘుకులాస్తోకప్రతాపాగ్ని నా
శరవృష్టిం జెడ నాఱిపోవుట మదిన్ సందేహమే చూడుఁడీ
యరుదుం జూపెద నెల్లి నేఁడ ధనురభ్రాడంబరం బొప్పగన్.

96


వ.

అనిన విని కుంభకర్ణుం డి ట్లనియె.

97


శా.

సీతం దెచ్చితి కార్యవేది వయి నీచే మున్ను సర్వంబు ని
ర్ణీతం బైనది యింక నేల చెపుమా నీ కేవిచారంబు నీ
నీతిజ్ఞుల్ మును గాఁగ రాఘవధనుర్నిర్ముక్తనిర్ఘాతసం
ఘాతక్రూరశిలీముఖాగ్నిఁ బడి మగ్గం బోదు గా కే మనన్.

98


తే.

నీతిపథమునఁ గార్యంబు నిశ్చయించి, తగువు దప్పక సేయునతండు మీఁద
నిడుమ పొందఁడు ధర్మంబు విడిచి చొప్పు, దప్పి కావించునతఁడు సంతాప మొందు.

99


క.

మొదలు విచారింపక చే, యుదు రది తుది నొప్పకున్న ను క్కడఁగి ముడుం
గుదురు విను తులువ లప్పను, లొదవక చెడు [9]బూడ్డ నిడిన హుతములకరణిన్.

100


ఆ.

ఎఱుక లేక చపలుఁ 6డేవంకఁ దిగిచిన, నల్పమతులు వాని ననుసరింతు
రొక్కకొంగ పాఱ క నున్నకొంగలు గూడ, నెగసి పాఱు చునికి తగవు గాదె.

101


వ.

అదియునుం గాక.

102


తే.

[10](ఆదిమధ్యాంతరహితుఁ డై నట్టివిష్ణుఁ, డనురకులవధార్థం బిట్టు లవతరించె
రవికులాంబుధిసోముఁ డై రామచంద్రుఁ, డురుబలుఁడు గాని సామాన్యతనరుఁడు గాఁడు.

103


క.

ఈవిధమున మును నారదు, చే వింటిం బంక్తికంఠ సీతను మరలన్
భూవిభునకు నర్పింపు శు, భావహ మయ్యెడిని మనకు నమరారాతీ.

104


వ.

అనిన విని పది మొగంబులు జేవుఱింప నున్నదశగ్రీవుకోపరసభావం బెఱింగి
మఱి యొక్కింతసేవునకుఁ గుంభకర్ణుం డి ట్లనియె).

105


శా.

ఇం కీమాటలకుం బ్రయోజనము లే దీజీవనం బేటికిన్
లంకాదాహము విన్ననాయలుక యెన్నం డాఱు నట్లుండె నా

హుంకారంబు సహింప నెవ్వఁడు గలం డుగ్రాహవక్రీడలం
గింకన్ గిట్టి వధింతు రాఘవుల సుగ్రీవాదులన్ మ్రింగుదున్.

106


ఆ.

దాశరథులు సమరతలమునఁ జంద్రార్కు, లైన ననలవరుణు లైన ధనద
పవను లైన నాదు పరిఘంబుపాలు గాఁ, గలరు గాక గెలువఁ గలరె నన్ను.

107


వ.

అనిన నతనిపార్శ్వంబున నున్నమహాపార్శ్వుం డన్నిశాచరేశ్వరున కిట్లనియె.

108


ఆ.

కాన జున్ను రేఁచి తేనియ సమకొన్నఁ, గ్రోలకున్నవాఁడు బేల గాఁడె
యువిదఁ దెచ్చి యూరకుండుదురే తామ్ర, చూడకేళి కింకఁ జొత్తుగాక.

109


ఉ.

నిండిన నీమనోరథము నేఁడు ఫలించినఁ జాలు మీఁద నె
వ్వం డని నిన్ను నోర్వఁగలవాఁడు బలాధికుఁ డైనకుంభక
ర్ణుండును మేఘనాదుఁడుఁ గనుంగొన వజ్రము కేలఁ గ్రాల నా
ఖండలుఁ డెత్తివచ్చిన నఖండమదోద్ధతు లేన చూపెదన్.

110


క.

కార్యం బిప్పుడు మనకు, దుర్యోపాయంబ యున్నత్రోవలు బాహా
వీర్యవిరుద్ధము లవి జయ, ధుర్యులు గైకొనరు గాన దొడరుద మనికిన్.

111


వ.

అనిన నతనిపలుకులకు సంతోషించి దశకంధరుం డిట్లనియె.

112


చ.

కల దొకగోప్య మంబురుహగర్భునిఁ గొల్వఁ జనంగఁ బుంజిక
స్థల యనునచ్చరం దగవు దప్పి రమించితి నొల్ల నాఁగ న
న్నలువయు నంత నంతయు మనంబునఁ గాంచి శపించె నన్ను న
న్యలలన బల్మిఁ బట్టికొనినప్డ శిరంబులు వ్రయ్య లై పడన్.

113


వ.

అది కారణంబుగా నత్తెఱం గలవడదు రాఘవులం జంపినవెనుక నొకవిధంబునఁ
గోర్కి సఫలం బయ్యెడుఁ గాక నాకొలంది వా రెఱుంగరు గుహాంతరంబున
నిద్రించుకంఠీరవంబు మేలుకనుపం జనుదెంచు(చున్నభద్రదంతావళంబులుం
బోలె వచ్చు)చున్నా రని పలికి వెండియు.

114


ఉ.

మింటికి మంటికిన్ నడుమ మిక్కుట మై దెస లెల్ల నొక్కపె
ట్టంటికొనం బ్లవంగశలభావలి మున్నుగ నాశరాగ్నిక్రొ
మ్మంటలచేత రాముఁ డనుమత్తగజేంద్రము నేర్చి పుచ్చి ని
ష్కంటకలీల నత్తరుణిఁ గైకొని యేలెద ముజ్జగంబులన్.

115


వ.

అనినం గుపితమానసుం డగుచు విభీషణుం డిట్లనియె.

116


మ.

తగవే రజ్జులు నేఁడు నీదగుమహాస్థానంబులో నింతటం
బగవా రక్కడ స్రుక్కిరే మనమహాపార్శ్వాదివీరోత్తము
ల్మిగులం బంతము లాడి తప్పెదరె నిల్చెం బొమ్ము రారామునా
శుగవేగంబును వాలితమ్ముఁ డగునాసుగ్రీవుదోర్గర్వమున్.

117


వ.

అనినఁ బ్రహస్తుం డతనిం గనుంగొని.

118


ఆ.

వీరధర్మ మిట్లు విడిచి విభీషణ, రాజునెదుట దాశరథులఁ బొగడఁ

బాడి యగునె క్రోఁతి బ్రహ్మరాక్షసుఁ జేయ, వచ్చినాఁడ వెంతవారు వారు.

119


మ.

అవనీనాథులరక్తపూరములు ము న్నాపోశనం బెత్తి జాం
బవదాదిత్యతనూభవప్రభృతులం బ్రాణాహుతుల్ చేసి యు
న్నవనౌకంబుల వ్రేఁచి మ్రింగి పిదపన్ బ్రహ్మాండభాండంబు బి
ట్టవియం ద్రేఁపక కుంభకర్ణుఁడు సనం డాకొన్నవాఁ డెంతయున్.

120


ఆ.

ఇతనియంతదాఁక నెవ్వాఁడు రానిచ్చు, నొక్కఁ డొకఁడ వారి నుక్కడంపఁ
జాలియున్నవారు సమరార్ధు లై యాతు, ధాను లొక్కనీవు దక్క వినుము.

121


వ.

అనినఁ గుంభకర్ణానుజుండు కోపరక్తాననుం డగుచు నతనిం గనుంగొని.

122


మ.

మగమాటల్ మన కేల నాఁ డలహనూమంతుండు లంకాపురం
బెగువం గాల్పఁగ నెందుఁ బోయితిమి నేఁ డెవ్వండు లజ్జింపఁ డే
తగవుం జెప్పఁడు సీతఁ బుచ్చు మనఁ డాధాత్రీశునుల్కాసమా
శుగవేగంబు దలంపఁ డింక నిదియుం జూడంగ నౌ నాజులన్.

123


వ.

అనిన నింద్రజిత్తు గర్ణశూలంబు లగునప్పలుకులకుం గనలి యిట్లనియె.

124


క.

పిఱికితన మెచట నలవడఁ, గఱచితొకో పగఱ నింతగాఁ జేసి మమున్
వెఱపించె దిచటఁ గొందఱు, వెఱతురె నినుబోఁటివారె వీ రెవ్వారున్.

125


క.

నాకముపై నేఁగి సురా, నీకంబులఁ దోలి యింద్రునిం జెఱదేనే
లోక మెఱుంగఁగఁ బ్రార్థన, వే కైకొని బ్రహ్మకొఱకు విడువనె పిదపన్.

126


చ.

అనిమొన దేవదానవసహస్రము లొక్కటఁ గూడి వచ్చినం
దునుమఁగఁ జాలు నావిపులదోర్బలలీలల కెవ్వఁ డోపు న
ప్పను లటు లుండనిమ్ము శలభంబులకైవడి మద్వరూధినీ
వనశిఖిపాలుగా రిపులు వత్తురు గా కిటు జంకె లేటికిన్.

127


తే

బలిమి మూఁడులోకంబులు గెలిచి దివిజ, సిద్ధయక్షాదికాంతలఁ జెఱలుగొన్న
యట్టిదశకంఠుతమ్ముఁడ వైననీకు, నీయధీరోక్తు లిటు నోరి కెట్లు వచ్చె.

128


సీ.

నావుడు నమ్మేఘనాదున కతఁ డిట్టు, లను నీతికోవిదు లల్పు మూర్ఖు
బహుభాషి నుత్సుకు బాలు రహస్యంపుఁ, గార్యంబునప్పుడు గదియ నీక
నిరసింతు రెప్పుడు నీబుద్ధి యెంతయు, నవగుణంబుల కెల్ల నాలయంబు
గావున నీ వున్నకడ మంత్ర మూహించు, నీరాజునేర్పున కేమికొఱఁత
పుత్రరూపంబు గైకొని పుట్టినట్టి, పగతుఁడవు గాక హితుఁడవే పతికి నిట్లు
తగవు వినఁజాల కేల మీతండ్రి యట్ల, చిటిలిపడుచున్నవాఁడవు చెడఁ దలంచి.

129


తే.

సురవరుఁడు గాఁడు కిన్నరేశ్వరుఁడుఁ గాఁడు, పావకుఁడు గాఁడు పితృలోకపతియుఁ గాఁడు
ఆహవక్రీడ నీ కోడ నాదివిష్ణుఁ, డైన రాముని గెల్వ నీ కలవి యగునె.

130

వ.

అని పల్కి మఱియు నతండు పల్కుతుచ్ఛోక్తులు లెక్క చేయక దశానను
నవలోకించి.

131


ఉ.

ఏచినతాటకం దునిమె నెక్కుడువీరు విరాధు ఘోరనా
రాచముపాలు చేసె ఖరు గ్రక్కున నుక్కడఁగించె నట్టిమా
రీచు వధించె నారఘువరేణ్యు నెఱింగియుఁ జక్కగావు లం
కాచరయామినీచరులఁ గాలము చేరిన నీకు శక్యమే.

132


క.

వారితమకొలఁదు లెఱుఁగురు, బీరము లాడెదరు నీకుఁ
బ్రియములుగా నీ
వీరుల నీవ యెఱుంగుదు, వీరలపంతములు వినక విను నామాటల్.

133


ఉ.

(తాత పులస్త్యుఁడుం గనినతండ్రియొ విశ్రవసుండు వైదికో
పేతము నిర్మలాచరణ మీవును బ్రహ్మవు చెప్పవచ్చినన్
నీతివివేకముల్ దొఱఁగి నిందకు నోర్చితి వేల దేవ ము
న్నీతెఱఁ గెల్ల నొప్ప దని యీవ యెఱుంగుడు చెప్ప నేటికిన్.

134


వ.

అని మఱియు నిట్లనియె

135


మ.

జగతీనాథుఁడు నీనెపంబునఁ బుల, స్త్యబ్రహ్మవంశంబుపైఁ
దెగ నంభోధి గడాకమున్న కపు లుద్వృత్తిం ద్రికూటాద్రి పె
ల్లగిలం ద్రోవకమున్న లక్ష్మణుఁడు కీలాఘోరనారాచముల్
నిగుడం జేయకమున్న పుచ్చు మరలన్ వేవేగ పృథ్వీసుతన్.

136


సీ.

అనుడు నద్దశకంఠుఁ డతని కి ట్లను విను, రోషంబుతో బిట్టు రోఁజుచున్న
చుటులోర ముతోడి [11]సహనివాసమ్మున, కంటె నీతో నిట్లు గలసి యునికి
కడుఁ గీడు హితునట్ల కదియుచు శాత్రవ, మొకదెస జరుపుచు నోట లేక
పగవానిపక్షంబు పలికెదు నీకంటె, నిక్కంపుఁ బగవాఁడు నెరయ మేలు
ధనము విద్య కీర్తి దమలోన నొకనికిఁ, గలుగుటకు నసూయఁ గ్రాలువారు
నెడరు వేచువారు నెందు దాయాదుల, కారె కాన నమ్మఁ గాదు నిన్ను.

137


క.

ఉదకము నళినీపత్రము, గదిసియు నెరవైనయట్లు కలయవు నీమా
హృదయములు గజస్నానము, తుది మఱి నీతోడిపొందు దుష్టచరిత్రా.

138


క.

నాపెంపున కిట్టు లసూ, యాపరతం జూడఁ జాల కాడు టెఱుఁగనే
పోపో కులపాఁసన యిం, కీపలుకులు పలికితేని యేను సహింపన్.

139


వ.

అని యిత్తెఱంగున దైత్యభర్త కర్ణకఠోరంబులుగాఁ దనపిన్నతమ్ముని దూఱఁ
(బల్కుసమయంబునఁ గుంభకర్ణుం డంభోజసంభవుశాపవశంబున నిద్రాసక్తుండై
ధర్మవిరుద్ధంబు లగుదశకంధరువాక్యంబులును నీతికార్యప్రరుచిరంబు లగు
తమ్మునివచనంబులును మనంబునం దలపోసి యొం డననేరక దిగ్గున లేచి యన్న
కుఁ బ్రణమిల్లి యాస్థానంబు వెడలి నిజమందిరంబున కరిగెఁ దదనంతరంబ యా

రాక్షసేశ్వరుం గనుంగొని కర్ణభీషణంబులుగా విభీషణుం డి ట్లనియె.

140


ఉ.

అన్నవు తండ్రియట్ల విను మంతియ కా దటమీఁద రాజ వే
మన్నను జెల్లుఁగాక మణిమండనముఖ్యము లైనకానిక
ల్మున్నుగ సీత నిచ్చి జనంలోకపతిం గని మమ్ముఁ బ్రోవు మీ
సన్నపుఁగార్యముల్ వలదు సంధియ మే లటు గాక తక్కినన్.

141


శా.

జ్యాఘోషంబు నిరంతరం బగుచు మ్రోయం బెల్లు దంభోళిధా
రాఘోరాస్త్రపరంపరల్ దరఁగ లై రాజిల్ల వాపూరితా
మోఘావృత్తిఁ దనర్చురామధనురంభోరాశి దోర్విక్రమ
శ్లాఘాగాధము నేఁడు ముంచుఁ బెలుచన్ లంకాపురీద్వీపమున్.

142


తే.

వలదు చాటితి నతఁడు నీకొలఁది గాఁడు, చేటుతఱి గాన నీ కిట్లు చెడ్డబుద్ధి
పొడముచున్నది నాశంబుఁ బొందనున్న, మేఘమునకు వికీర్ణంపుమెఱుఁగునట్లు.

143


ఉ.

నీచెవిక్రిందఁ జేరి రజకనీచరనాయక తుచ్ఛవాక్యముల్
నీచులు గన్కనిం బలుక నీ కవి పథ్యము లయ్యె నేగతిం
జూచిన హితోక్తులకుఁ జొన్పదు నీమది గాన [12]దుర్మదుం
డై చెడువానిపొంతఁ జన దండ్రు వసింపఁగ నీతికోవిదుల్.

144


వ.

అదియునుం గాక.

145


సీ.

నీ వెత్తఁ జాలని నీలకంఠునివిల్లు, పుడుకకైవడిఁ దున్మి ప్రోగు వెట్టె
నిలఁ గార్తవీర్యుబాహులు వేయుఁ ద్రుంచిన, పరశురాముని నాజి భంగపఱిచెఁ
గైలాస మెత్తినఘను నిన్నుఁ గట్టిన, వాలి నొక్కమ్మునఁ గూల నేసె
నీపుత్రు వధియించి నీలంకఁ గాల్చిన, హనుమంతు నేలినయతని నేలె
నట్టిరాముతోడ నసమానవైరంబు, పట్టి గెల్తు ననుట పడుచుబుద్ధి
చనదు సీత నిచ్చి శర ణని రఘురాముఁ, గనుట మేలు చెడక మనుట మేలు.

146


వ.

అనిన విని వికటభ్రూకుటిదుర్నిరీక్ష్యుం డగుచు రాక్షసేశ్వరుండు.

147

రావణుఁడు విభీషణుఁ బరిభవించుట

చ.

మెఱుఁగును గర్జితంబుఁ గల మేచకమేఘము పర్విన ట్లొఱం
బెఱికినవాలు కేల జళిపించుచు హుంకృతిభీకరంబుగా
నుఱికి యురంబు దాఁపఁ బిడు గుక్కఱఁ దాఁకినకొండభంగి బి
ట్టొఱగె నతండు మూర్ఛఁ దను నొందిన గద్దియనుండి భూస్థలిన్.

148


వ.

ఇట్లు విభీషణుం దాఁచి భీషణరోషభాషణంబులు చెలంగఁ గేలం గరాళకరవా
లం బంకించునెడ నెడ సొచ్చి దేవ మన్నింపు మనుచుఁ బ్రహస్తప్రముఖు లగు
వారు వారించి గద్దియకుం దెచ్చి రంతఁ గొంతదడవునకుఁ దెలిసి విభీషణుండు.

149


క.

కామక్రోధమదంబులు, నీమనమున నిండియుండ నిర్మలధర్మం

బేమూల నుండు రావణ, నామాటలు సెవులఁ జొచ్చునా నీ కింకన్.

150


వ.

అనిన విని సైరింపక నిలింపారాతి ప్రహస్తునిం జూచి వీనిం గొలువు వెడలఁ
ద్రోవు మని పనిచిన నతండునుం గదిసి.

151


క.

రక్కసులరాజు నీతో, మిక్కిలి కోపించినాఁడు మిన్నక నీవుం
దక్కవు వెడనీతులు పొ, మ్మిక్కడ నీయునికి పొసఁగ దింతటిమీఁదన్.

152


వ.

అనిన నవ్విభీషణుండు సభామధ్యంబున నిల్చి రావణుం గనుంగొని.

153


చ.

చనదు మహద్విరోధ మని చక్కటి చెప్పిన నింతతప్పునం
గనలితి నీతిశూన్యులకుఁ గార్యము లేటికిఁ దోఁచు నిప్డు వే
యును బని లేదు నీవలన నొప్పనినావచనంబు లెల్ల నీ
వనిమొన రాముచేఁ బడినయప్పు డెఱింగెదు గాక పోయెదన్.

154


వ.

అని పలికి వినతుం డై తనమంత్రులు నలనీలహితసంపాతు లనువారలు నలు
వురుఁ దానును గదాపాణు లగుచు నాస్థానంబు వెడలి యేకదండిత్రిదండు లగు
ననేకవృద్ధబ్రహ్మరాక్షసులు ధర్మకథ లుపన్యసింప వినుచు ధవళాంబరశోభినియై
చిత్రాసనంబున నున్నతల్లిపాలికిం జని నమస్కరించిన నక్కైకేశియు నతని
నవలోకించి.

155


ఆ.

అన్న నీవు తగవు లన్నకుఁ చెప్పుచు, నున్నమాట లేను విన్నగోలె
బెగడుచున్నదాన మొగ మొప్పకున్నది, యేమి తెఱఁగు చెప్పవే తనూజ.

156


చ.

అనవుడు నాతఁ డిట్లను దశాసనుఁ డారఘునాథుదేవి వం
చనఁ గొనివచ్చి లోక మనిశాచరలోకము సేయఁ బూనినన్
జనని కడంగి యే నతనిఁ జక్కటిమాటలఁ దేర్పువాఁడ నై
జనపతివిక్రమంబు ఖరునిచావును బేర్కొని పెక్కుభంగులన్.

157


శా.

మే లూహించుట సీతఁ బుచ్చుటయ చుమ్మీ యన్న నమ్మాటకుం
గాలం దాఁచి శిరంబు ద్రుంతు ననుచుం గౌక్షేయకం బుత్కట
జ్వాలాభీలము గాఁగ నెత్త సచివుల్ వారించి రుల్కాతతుల్
దూలం గ్రమ్మఱఁ జూచి కొల్వు వెడలం ద్రోపించినన్ వచ్చితిన్.

158


క.

జననీ రఘుపతిఁ గొల్వం, బనివినియెద నీవు తాల్మి పదిలించి మనం
బున దీనికి శోకింపకు, మనవుడు మూర్చిల్లి తెలిసి యాసతి సుతుతోన్.

159


చ.

వినుము తనూజ నాకు మును విశ్రవసుం డెఱిఁగించినాఁడు మీ
జననమునప్డ మీఁద నగుసర్వము రావణకుంభకర్ణు లే
పున నొనరించుబాధ లొగిఁ బోయి నిలింపులు విన్నవింప న
ద్దనుజవిరోధి వీరలవధంబునకై జనియించె రాముఁ డై.

160


క.

దోషాచరవంశము ని, శ్శేషము గా కొంట రెంటఁ జిక్కినవారిం
బోషింప నీవ నిలుతు వి, భీషణ రఘురాముకరుణఁ బెంపు దలిర్పన్.

161

వ.

కావున నీ వింక నాశరణాగతవత్సలు నాశ్రయింపం జనుము తండ్రీ మీ తండ్రి
తపోమహత్త్వంబున హరిహరహిరణ్యగర్భులు లోకపాలురు గ్రహతారకంబులు
గులపర్వతంబులు సముద్రంబులు మహానదులు నుభయసంధ్యలును వేదంబులు
వేదాంగంబులు నహోరాత్రంబులు నిన్ను రక్షింపనిమ్ము నెమ్మదిం బోయి
ర మ్మని దీవించిన నతండు నభివందనపూర్వకంబుగా జనయిత్రి వీడ్కొని మంత్రి
సమేతుం డై గగనమార్గంబునం జన నక్కడ సుగ్రీవుం డనతిదూరంబునం గనుఁ
గొని కపులతో నిట్లనియె.

162


మ.

ఒకనక్తంచరపంచకం బదె కరాళోదగ్రహేతిద్యుతి
ప్రకరం బీక్షణభీకరంబుగఁ గటిద్భాభాసురం బైనమే
చకమేఘౌఘము పెంపు నొంది మనపై సంగ్రామగర్వంబునం
బ్రకటం బై చనుదెంచుచున్నది నభోభాగంబునం గంటిరే.

163


క.

అని పలుకఁ దరులు గిరులుం, గొని యారక్కసుల నేలఁ గూల్చెద మనుచున్
వనచరులు సంభ్రమింపఁగఁ, గని యట నెలుఁగెత్తి కుంభకకర్ణానుజుఁడున్.

164


ఉ.

 ఓకపివీరులార కరుణోదధి నీరఘురాము సర్వలో
కైకశరణ్యునిం గొలువఁగా నిట వచ్చితి నొండు గాదు నా
రాక మహాపరాధి యగురావణుతమ్ముఁడ నే విభీషణా
ఖ్యాకుఁడ వీరు నాసచివు లర్కకులాగ్రణితోడఁ జెప్పరే.

165


ఉ.

వంచన సీత నేల కొనివచ్చితి రావణ మిన్నకుండి రా
త్రించరవంశ మేల కడతేర్చెదు భూసుత నింక వేగ మొ
ప్పించుట మేలు నా నతఁడు పెం పఱ న న్నొక నీచుఁబోలె భ
ర్త్సించుచుఁ గాలఁ దాఁచి నిరసింపఁగఁ బంచె సభాంతరంబునన్.

166


వ.

అనిన విని వానరేంద్రుం డన్నరేంద్రున కిట్లను ని ట్లేతెంచినవీరు రావణువేగులవా
రు గాఁబోలు మనమర్మంబు లారయ వచ్చినారు రాక్షసులు మహాసాహసికులు
గామరూపంబులు గైకొని వర్తింప నేర్తురు గాన నమ్మి వీరలఁ జొరనిచ్చు టుచి
తంబు గా దట్లుం గాక పగతుతమ్ముం డితని నెవ్విధంబునను వధియించుటయ
కార్యం బనవుడు నారఘువరుండు ప్లవంగపుంగవులం గనుంగొని.

167


ఆ.

రవితనూజుపలుకు లవినీతియుక్తంబు, లగున యైన నీతఁ డన్నతోడ
నలిగి వచ్చినాఁడొ యటుగాక సంధి కే, తెంచినాఁడొ మనకుఁ దెలియవలయు.

168


క.

అనవుడు నినసుతుఁ డిట్లను, మనుజేశ్వర కరుణ మమ్ము మన్నించుతలం
వున నడిగెదు గా కీ వెఱుఁ, గని కార్యస్థితులు ముజ్జగంబులఁ గలవే.

169


వ.

దేవా నీ వవధరించినయట్టిద కార్యం బనపుడు నప్పు డంగదుఁ డిట్లను గుణ
దోషంబులు విచారించి కదా కార్యనిశ్చయం బితండు శత్రుండు మిత్రత్వంబు
భావింపం జన దనిన జాంబవంతుం డి ట్లనియె.

170

తే.

ఎట్టివాఁ డైనఁ బగఱపై నెత్తినపుడు, విడిచిపోవునె చుట్టంబు నెడరు వేచి
యీతఁ డీవేళఁ దమవారి నెల్లఁ బాసి, వచ్చినపుడు విచారింపవలయు ననిన.

171


క.

మొదల నొకవేగువానిం, గద లరయఁగఁ బనిచి పిదపఁ గార్యము సేయం
బదిల మని పలికె శరభుఁడు, పదపడి మైందుండు నట్ల పలికెఁ బలుకుడున్.

172


సీ.

హనుమంతుఁ డిట్లను నధిప పంచినచారు, లేఁగియు నింగితం బెఱుఁగ రితఁడు
దుష్టాత్ము నమ్మూర్ఖుఁ దొఱఁగియ రాబోలు, నేఁ బట్టువడ్డప్పు డితఁడు దూత
దండింపఁదగ దని దశకంఠునకుఁ జెప్పి, నను నాఁడు విడిపించినాఁడు గాన
దోషాచరాకృతి దోఁప దీతనియందు, నయమార్గవర్తియ నాకుఁ జూడ
వాలిఁ జంపి మీరు వనచరేశ్వర పట్ట, మినతనూభవునకు నిచ్చు పెఱిఁగి
యన్నఁ బాసి రాజ్య మర్థించి నినుఁ గొల్వ, వచ్చినాఁడు గానవచ్చుఁగాక.

173


మ.

అటు గా కొండు దలంచి వచ్చిన తెఱం గైనం గపిశ్రేణిముం
దటఁ జక్కం జనఁ బోల దెవ్వరికి నీతం డెంతవాఁ డన్న న
వ్వటుచూడామణిఁ జూచి రాముఁ డను నీవాక్యంబు లొప్పుం గడుం
గుటిలుం డైన భయాతురుం డితనిఁ గైకొందుం బ్లవంగోత్తమా.

174


ఉ.

నావుడు లక్ష్మణుండు నరనాథున కి ట్లను దేవ మీరు సు
గ్రీవునివిన్నపం బవధరింతురు గా కపరాధి యైనమీ
రావణుతమ్ముఁ డీతఁ డఁట రాక్షసమాయలు పెక్కుత్రోవ లే
త్రోవఁ దలంచి వత్తురొ విరోధులతో సహవాస మేటికిన్.

175


క.

శరణార్థి నన్నమాటకు, ధరణీశ్వర యొండుమాట దలఁపక యున్నం
బరిపంథి గాన యెట్లును, బరిహరణీయుండు నీతిపథ మూహింపన్.

176


వ.

అనిన నమ్మహీనాథుండు సుమిత్రాపుత్రు నవలోకించి.

177


క.

మృగయుం డాఁకొని వచ్చినఁ, బగవాఁ డనుతలఁపు విడిచి పరహితబుద్ధిం
దగిలి కపోతం బ చ్చెరు, వుగ నాహుతి యయ్యె మానవుం డీఁ దగఁడే.

178


క.

దీనుఁ గృతాంజలి నడిగెడు, వానిన్ శరణార్థిఁ జంపవలవదు శత్రుం
డైన ననుకణ్వవచనము, మానసమునఁ [13]దలఁచి నీవు మఱవకు మెపుడున్.

179


ఉ.

అంతియ కాదు చాలి శరణాగతుఁ జేకొన కున్నవాఁడు ద
త్సంతతసంచితోగ్రదురితంబులు గైకొని వానికిన్ నిజా
త్యంతవిశుద్ధపుణ్యనిచరయంబులు గోల్పడి నాకలోకవి
శ్రాంతివిదూరుఁ డై చను ధరం గలనాఁ డపకీర్తిపా లగున్.

180


ఆ.

అభయదానమునకు నశ్వమేధాదులు, వేయు నీడు గావు విశదకీర్తు
లఖిలదిశల నెసఁగు నార్తు రక్షించిన, నట్లు గాన సందియంబు వలదు.

181


క.

ఇతఁ డనఁగ నెంత శరణా, గతుఁ డయిన దశాస్యు నైనఁ గాతున్ నాకుం

బ్రతిన యిదె వేగ దోడ్తెం, డితనిం గైకొంటి నభయ మిచ్చితి నెమ్మిన్.

182


వ.

అనినం గపినాయకుండు రఘునాయకుం గనుంగొని దేవా దేవరగుణంబులు వి
చారింప నిది యెంత మీ రనుగ్రహించినప్పుడు సర్వగుణసమగ్రుం డితండు మా
కుం బ్రియసఖుండు నిష్టబంధుండును గా నర్హుండు మీయడుగులు గొల్వఁ దో
డ్కొని వచ్చెదముగాక యనుచుం దగినవానరవీరులతోడ నంబరంబున కెగసి
తమరాక కెదురువచ్చునవ్విభీషణు నాలింగనంబు చేసి సముచితాలాపంబుల ము
దం బొదవించుచు రామచంద్రుండు నీ కభయం బిచ్చె వత్తు గాక యనిన మంత్రిస
మేతుం డై యతం డిలకు నేతెంచి యారాజపరమేశ్వరుపురోభాగంబున దండ
ప్రణామంబు సేసి నిలిచి కృతాంజలి యగుచు ని ట్లనియె.

183

విభీషణుఁడు రాముని శరణుచొచ్చుట

ఉ.

అర్కకులాధినాథ శరణాగతవత్సల దేవ యాజగ
త్కర్కశుఁ డైనరావణునితమ్ముఁడ నయ్యు భవత్కటాక్షసం
పర్కమునం గలంకమును బాసితి ధన్యుఁడ నైతి నింక నీ
యర్కసుతాదులం దొకఁడ నైతిఁ గృతార్థుఁడ నైతి నావుడున్.

184


మ.

కరుణం జల్లెడుచల్లచూపు నిగుడన్ గంభీరవాక్యంబులం
బరమప్రీతి జనింపఁగా విభుఁడు సంభావించి నక్తంచరో
త్తర లంకం గలయాతుధానులభుజాదర్పంబు నీ వేర్పడం
బొరి నా కంతయుఁ జెప్పు మన్న నతఁ డాభూపాలుతో ని ట్లనున్.

185


వ.

దేవా దేవకంటకుం డగుదశకంఠుండు బ్రహ్మవరంబున సురాసురాదుల కజయ్యం
డతనియనుజుండు నా కగ్రజుండు నగుకుంభకర్ణుండు లావున రావణుకంటె నె
క్కు డనందగినశూరుండు దశగ్రీవున కగ్రతనయుం డింద్రజిత్తనువాఁ డభేద్యకవ
చుం డవార్యశరాసారుం డలక్ష్యగాత్రుండు నగుచుఁ జిత్రయుద్ధంబులు సేయం బ్ర
వీణుండు ప్రహస్తుం డనుసేనానాయకుండు విక్రమావష్టంభవిజృంభి యగు మా
ణిభద్రుం డనుగంధర్వుం దోలినవాలుమగండు జగత్కంపనుం డగునకంపనుండుఁ
గుంభుండును నికుంభుండును మహోదరుండును మహాపార్శ్వుండు నతికాయుం
డును మహాకాయుండును నరాంతకుండును దేవాంతకుండు నగ్నికేతుండును రశ్మి
కేతుండును ననువారలు మహావీరులు దుర్వారబలగర్వంబుల నెవ్వరిం గైకొ
ననివారు మఱియు నపారసత్త్వసంపన్ను లగుదోషాచరభటులు పదివేలకోట్లు
లంకానగరనివాసు లైనవా రనిన విని రఘువరుండు వీరరసావేశంబున.

186


లోకాలోకము గడచిన, నాకసమున కెగసి చనిన నబ్ధిం బడి ద
ర్వీకరలోకము సొచ్చినఁ, బోకార్తు దశాస్యు నతనిపురి నీ కిత్తున్.

187


తే.

వేయునేల బ్రహ్మాదులు వెనుకఁ బెట్టి, కొన్ననిఖిలరాక్షసులతోఁ గూడ నతనిఁ

జంపి కా కే నయోధ్యకుఁ జనితినేని, [14]దశరథేశునడుగులకుఁ దప్పినాఁడ.

188


క.

అనుడు ముద మంది వినయం, బున మోడ్పుంగేలు మౌళి మోపి యతం డి
ట్లను నోపినయ ట్లేనును, జనవర సమయింతు నన్నిశాచరుసేనన్.

189


వ.

అనిన సంతోషించి రామచంద్రుండు లక్ష్మణుం గనుంగొని నీవు సముద్రోదకం
బులు దెచ్చి లంకారాజ్యంబునకు విభీషణు నభిషేకంబు సేయు మని నియోగించె
నానమయంబున సుగ్రీవుం డి ట్లనియె.

190


చ.

అనఘచరిత్ర మీకు శరణాగతరక్ష కులవ్రతంబు మీ
సునిశిత బాణజాలముల చోఁకున కోర్వక వచ్చి తా దశా
ననుఁ డభయంబు వేఁడికొనినం దగ వె ట్లగు నన్న నవ్విభుం
డినసుతుఁ జూచి య ట్లయిన నిచ్చెద వాని కయోధ్య నావుడున్.

191


తే.

అఖిలవానరవీరులు నయ్యనుగ్రహంబు గొనియాడి రంత నయ్యధిపునాజ్ఞ
నట్లు సౌమిత్రియును రాక్షసాధిపత్య, మునకు నభిషిక్తుఁ జేసె నిం పెనయ నతని.

192


వ.

ఆసమయంబున సుగ్రీవహనుమంతు లవ్విభీషణుం జూచి సేనాసహితంబుగా ని
న్నరేంద్రున కంబుధి గడచుతెఱం గెత్తెఱంగునం గల్గు నీమతం బెఱింగింపు మ
నిన నతం డి ట్లను రామచంద్రుండు సముద్రప్రార్థనంబు సేసి లంకపై నరుగునది
కార్యంబు నావుడు వార లవ్వాక్యంబులు విన్నవించిన రఘువరుండును లక్ష్మణా
నుమతంబున నొక్కరమ్యప్రదేశంబున నుదధిం గూర్చి నియతుం డై యుండె నం
త శార్దూలుం డను వేగులవాఁ డింతయుం జూచి పోయి రావణున కి ట్లనియె.

193


క.

దేవ విభీషణుఁ గడు సం, భావించి నిశాచరాధిపత్యమునకు నా
భూవల్లభుఁ డభిషిక్తుం, గావించెం బయోధి దాఁటఁ గలఁ డిటమీఁదన్.

194


క.

వనచరసేనయు శతయో, జనవిస్తారంబు గలిగె జలనిధి కీ డై
పెనుపొందుచు నేదెసఁ జూ, చిన నరుదు భయంబుఁ జేయుఁ జిత్తంబునకున్.

195


క.

రాఘవులును రణవిజయ, శ్లాఘాయుతు లసమసత్త్వసంపన్ను లురు
జ్యాఘాతకఠినబాహు ల, మోఘశిలీముఖులు సమరముఖవికచముఖుల్.

196


వ.

కావున సామభేదదానంబులలో నొక్కతెఱంగు సేయునది కార్యం బనిన నద్దశ
ముఖుండు శుకుం డనువానిం గనుంగొని.

197

రావణుఁడు శుకుం డనుదూతను బంపుట

శా.

సుగ్రీవుం డనువాఁడు మర్కటభటస్తోమంబుతో దుర్మదో
దగ్రక్రోధముఁ బూని రామునకుఁ దో డై వచ్చుచున్నాఁడు గ
ర్వగ్రస్తుం డతఁ డీవు వే చని వృథావైరంబు నీ కేల పం
క్తిగ్రీవుం [15]డురునో నరుం డురునొ బుద్దిం జూడుమా యేర్పడన్.

198


వ.

అని పల్కి నావచనంబులుగా వెండియు ని ట్లనుము.

199

మ.

కపినాథుండవు నీవు రాఘవుఁ డనంగాఁ దాపసుం డాసురా
ధిపు మువ్వెట్టియుఁ గొన్న రాక్షసకులాధీశుండ నే నిన్ను ని
క్కపుఁదోఁబుట్టువు గా మదిం దలఁతు సఖ్యం బైన నాతోన పొం
దుపడుం గావున నేఁగు మీ వెడఁగు మర్త్యుం బాసి కిష్కింధకున్.

200


క.

అటు గాకున్న సురాసుర, భటులకు రారానిలంకపై నరులకు మ
ర్కటులకు రావచ్చునె యను, మటమీఁదం జూచికొంద మంతతెఱంగున్.

201


నావుడు నతఁ డొకకీరం, బై వెసఁ జని నింగి నిలిచి యగచరపతితో
రావణుసందేశము గడు, [16]సావరమునఁ జెప్పి మరలి చనఁ దోన కపుల్.

202


క.

వడి నెగసి వాలములఁ గొని, వెడచఱువం జఱిచి దొంగ వీఁడు మనకు లోఁ
బడియె ననుచుఁ బిడికిళ్లం, బడఁ బొడిచిరి పట్టి తెచ్చి భానుజు నెదుటన్.

203


క.

అత్తెఱఁగున నొప్పింపఁగఁ, దత్తఱపడి రాముఁ జూచి ధరణీశ్వర వీ
రె త్తెత్తి గ్రుద్దుచున్నా, రిత్తఱిఁ గృపఁ జూడవే శుభేక్షణ నన్నున్.

204


క.

(అధిపతిపంపున వెఱవక, యధికంబుగ నిష్ఠురోక్తు లాడిన నిచ్ఛా
విధిఁ బలికిన వార్తావహు, వధియించుట కర్జమే వివస్వద్వంశా.)

205


వ.

అనిన విని రామచంద్రుండు విడిపించి పుచ్చుటయు వాఁడు నంతరిక్షంబున కెగసి
సుగ్రీవా దశగ్రీవుతో నేమి చెప్పుదుం జెప్పు మనిన నతం డలుక నచ్చిలుకం గనుం
గొని.

206


సీ.

తలపోసి చూచినఁ దా నాకు నవ్వాలిఁ, బోలిన యట్టితోఁ బుట్టు వనుము
వసుమతీసుత నట్లు వంచించి తెచ్చుట, మగటిమి గా దది మఱవకు మను
లోక మరాక్షసకలోకంబుగాఁ జేయఁ, గపిసేనతో వారి గడతు మనుము
లంకఁ ద్రికూటాచలముతోన మున్నీటఁ, బెఱికి పేటాడి పై తపింతు మనుము
యాతుధానరాజ్యంబున కర్హుఁ డైన, మావిభీషణుఁ డలర లక్ష్మణుఁడు గడఁగి
భీకరాశుగసప్తార్చిఁ బేర్చునర్చు, లెసఁగ నింద్రజిచ్ఛలభంబు నేర్చు ననుము.

207


విలు యూపంబు శరాళి దర్భతతి మౌర్వీటంకృతుల్ మంత్రముల్
[17]గలితాసృక్ఛట లాజ్యధారలు నిషంగద్రోణికల్ స్రుక్స్రువం
బులు గా రాముఁడు యాజకుం డయి సమిద్భూవేదిఁ గోపానలా
ర్చులతో నద్దశకంఠుఁ డన్పశువు వేల్చున్ నిర్జరప్రీతిగన్.

208


క.

దిక్కు గలదేని చను మను, మెక్కుడు దర్పమున జగము లేచుట లింకం
జిక్కె నను పొమ్ము నీ వని, యక్కపిపతి పలుక నప్పు డంగదుఁ డలుకన్.

209


తే.

కపటచారుండు వీఁడు నిక్కంపుదూత, గాఁడు వీనిఁ బో నీకుఁడు కపులు వేగ
మగుడఁబట్టి తెం డనవుడు నెగిచి తెచ్చి, [18]పెలుచ నొప్పించుటయు వాఁడు భీతుఁ డగుచు.

210


చ.

ఇదె ననుఁ బట్టి తెచ్చి కపు లేపునఁ గాలను గేల బిట్టు నొం

చెదరు మొగంబు రాచెదరు చెట్టుప లూడ్చెద రిట్లు దూతలం
జదుపఁగఁ జూతురే నయవిశారద నావుడు రామునాజ్ఞకున్
వదలిరి వారు వానిఁ జని వాఁడును జెప్పె సురారి కంతయున్.

211


వ.

తదనంతరంబ.

212

శ్రీరాముఁడు దర్భశయనము చేయుట

సీ.

ఎయ్యది బహురత్నహేమకేయూరాదిభూషణలక్ష్మికిఁ బొలుపు నొసఁగె
నెయ్యది మిథిలేశు నింట నిల్లడ యున్న, ధూర్జటివిలు లీలఁ ద్రుంచి వైచె
నెయ్యది సోయగం బెలరార వైదేహి, నేపథ్యరచనల నేర్పు మెఱసె
నెయ్యది సన్నుతు లెసఁగ నిచ్చలు గోస, హస్రప్రదాతృకం బగుచు వెలసె
నట్టిచే దలయంపిగా నవ్విభుండు, దర్భశయనుఁ డై వాసరత్రయము నియతి
నుండ నిజమూర్తితోడఁ బయోధి వచ్చి, తనకుఁ బొడసూపకున్నఁ జిత్తమున నలిగి.

213


శా.

కంటే లక్ష్మణ నన్నుఁ గైకొనక రంగత్తుంగభంగంబు లొం
డొంటిం దాఁకుచుఁ బైపయిన్ నెగయఁగా నుద్వేల మై వార్ధి మి
న్నంటం బొంగెడు నంతకంత కిటు లియ్యాటోప మింకింతు నా
వింటం బుట్టినబాణబాడబముచే వేవేగ వి ల్లీవనా.

214


క.

క్షమయును బ్రియవాదిత్వము, శమమును నార్జవము దుర్విచారులు గడుఁ జా
లమిగా నూహింతురు లో, కము వెఱచుట బెట్టిదంబు గలుగుటఁ జుమ్మీ.

215


క.

గుణహీను లైనవారల, గుణహీనులు మెత్తు రట్టికుత్సితుఁ డగురా
వణునిపొరుగువాఁడట యే, గుణములు గల విందు వెదక గుణరత్ననిధీ.

216


తే.

అనుచు ధను వందికొని యుగాంతాగ్నికరణి
దురవలోకుఁ డై లోకముల్ దిరుగఁబడఁగఁ
జటిలి పడుపిడుగులతోడి చిచ్చఱమ్ము
లమ్మహాంబుధిమీఁద నందంద పఱపె.

217


వ.

అప్పు డాశరపరంపరలు వారిపూరంబుపై నడరిన.

218


మ.

విచలద్వీచులఁ గ్రొంబొగల్ నెగయఁగా వెన్వెంట బాణాగ్ని నం
బుచరవ్రాతము లిట్టు నట్టుఁ బఱవన్ భోగీంద్రలోకంబువా
రచటం గచ్ఛపరాజుక్రిందు సొర నుద్యద్ఘూర్ణనాభీలకీ
లచయోద్ఘట్టనరోచులన్ జలధి గాలం జొచ్చె నచ్చిచ్చునన్.

219


తే.

అపుడు సౌమిత్రి కడుభయ మంది దేవ
వలవ దిట్టులు సైరింపవలయు ననిన
నన్నరేంద్రుఁడు మఱియుఁ గెంపారుచూడ్కి
నిగుడ బ్రహ్మాస్త్ర మరిఁ బోసి తెగ గొనంగ.

220

శా.

ఆకంపించె ధరిత్రి బి ట్టవిసిన ట్లై మ్రోసె బ్రహ్మాండ మ
స్తోకధ్వాంతము గప్పె దప్పిరి గతుల్ సోమార్కు లుల్కాదురా
లోకం బయ్యె నభంబు దిగ్వివరము ల్దూలెన్ యుగాంతాభ్రముల్
వే కూలెం బొడలేక భూతములు ఱోలెం గూలె నిర్ఘాతముల్.

221


వ.

ఆసమయంబున.

222

సముద్రుఁడు రామునకుఁ బ్రత్యక్ష మగుట

సీ.

అరుణసితాసితహరితవర్ణంబులఁ, జటులఘోరానలచ్ఛటలు దెగడ
[19]జిహ్వల నెగడెడుశిరములు గలమహా, ఫణులు ఫణామణిఘృణులతోడఁ
జుట్టును విలసిల్ల సురసరిన్ముఖనదుల్, తమతమదివ్యరూపములు దాల్చి
సూరెలఁ జెలువొంద సురుచిరబహుభూష, ణంబులు రక్తమాల్యాంబర ములు
మెఱయఁ గాంచననిభ మైన మేను పూని, సలిలమధ్యంబువలన నజ్జలధి వెడలి
యభయపుష్పమాలిక మౌళి నమర నానృ, పాలుపాలికి నేతెంచి కేలు మొగిచి.

223


చ.

నృపవర మున్ను లోకములు నిల్పినవాఁడవు నీవ కావె యా
దిపురుషుఁ డైనవిష్ణుఁడవు దేవహితం బొనరింప నిప్పు డీ
వపువు ధరించినాఁడవు భవన్మహిమంబున భూతకోటి ని
క్కపు[20]గతి నుండఁ గావుము జగం బెఱుఁగం గడసూప నేటికిన్.

224


క.

సగరుఁడు మీకులవిభుఁ డ, జ్జగతీపతి పేర నేను సాగర మనఁగా
నెగడుదుఁ గావున నిట్టులుఁ, దెగఁ దగునె నరేంద్రచంద్ర తెగ యుడుపఁగదే.

225


క.

నామీఁద నేమి వైచిన, నే మునుఁగఁగ నీక యెగయ నెత్తుచు రా మీ
రామార్గంబున రం డని, సామోక్తులు పలుక నద్దశరథాత్మజుఁడున్.

226


క.

కరుణం గనుఁగొని తటినీ, శ్వర విను నాబాణ మెచట వంధ్యము గా దీ
వరసాధన మే నిం కె, వ్వరిపై నడరింతు ననిన వారిధి మఱియున్.

227


క.

జననాథ [21]దృశ్యగుల్మం, బను పేరం బరఁగు నొకమహాగర్తము నా
కెనయఁగ నుత్తరభాగం, బున నుండు నగాధసలిలపూరం బగుచున్.

228


వ.

అం దాభీలముఖంబులు గలుగురాక్షసు లుండి దుర్వారగర్వంబునం బల్మఱుం
జనుదెంచి మదీయాంబుపూరంబు ననేకగ్రాహకులంబుతోడ బలువిడిఁ గ్రోలు
చుండుదు రాదురాత్ములసమ్మర్ధంబు నాకు సహింపరా కుండు నీ వీఘనకాండం
బింక నయ్యవటంబుపై నడరింతుగాక యనుడు నాదుర్ధరధనుర్ధరుం డట్ల చేసిన.

229


చ.

మిడుఁగుఱుమొత్తముల్ సెదర మింటఁ బొరింబొరి మంట లంట నె
క్కుడువడిఁ దచ్ఛరం బశనిఘోరగతిం బడి యన్నిశాచరుల్

సుడివడి మ్రంద నమ్మడువు శోషిలఁజేయుచు నేలఁ గాఁడి య
క్కడ నహిలోకముం గడచి క్రమ్మఱఁ దూణికి వచ్చెఁ జెచ్చెరన్.

230


క.

అంతటను దత్ప్రదేశం, బంతయు మరుదేశ మయ్యె నచటికి నబ్భూ
కాంతుఁడు సరసఫలాం చిత, [22]కాంతార మ్మఖిలహితముగా వర మిచ్చెన్.

231


క.

జల మయ్యిషురంధ్రంబున, నిలకు రసాతలమువలన నెగయుట నాదు
స్స్థలి నది యిషు వనుపేరన్, [23]ఖలకూపం బయ్యె నధ్వగహితం బగుచున్.

232


వ.

తదనంతరంబ సంతుష్టహృదయుం డగుచు నయ్యాపగావల్లభుండు భూవిభుం
గనుంగొని రఘువర మీతండ్రి దశరథుండు దేవాసురయుద్ధంబున నింద్రునకుం
దోడు వచ్చి సుర లసురులకుం గాక యోహటించినప్పుడు తరుగిరివర్షంబు గురి
యుచుఁ గడంగునాకుం దోడ్పడి కోదండపాండిత్యంబు మెఱయుచు గుదులు
గ్రుచ్చిన ట్లుండఁ బలువుర నొక్కొక్కకోలం గూల నేయుచు నాగ్నేయాస్త్రం బేసి
పేర్చుబలంబుల నేర్చి హతశేషు లైనబృందారకారాతులం దోలి విజయంబు
గైకొని యున్నసమయంబున నాశతమఖప్రముఖు లైనదివిజులు పుత్రకాముం
డైనయన్నరేంద్రునకు రామభరతలక్ష్మణశత్రుఘ్ను లనునామంబుల వెలయుచు
మహాతేజు లగుతనూజులు నలువురు గలుగుదు రని వరం బొసంగి దివ్యరథంబు
నమృతసంభవం బైనచూడామణియు ననేకరత్నసహస్రంబులు నిచ్చి వీడుకొల్పు
టయు నమరసఖుండ నైననావలనం జెలిమి నాటించి న న్నయోధ్యకుం దోడ్కొని
చని యన్నగరంబున నొక్కమాసంబు నిల్పి వివిధప్రకారంబుల సంభావించె నమ్మ
హాత్మునియందు నాకుం జేయవలయు నెయ్యంబు నీయందుఁ జరితార్థం బైన నేఁ
గృతార్థుండ నగుదు విశ్వకర్మపుత్రుం డగునలునిచేత సేతుబంధనం బొనరింపం
జేయు మని యుపాయం బెఱింగించె నయ్యవసరంబున.

233


ఆ.

నలుఁడు కేలు మొగిచి నరనాథ మాతండ్రి, విశ్వకర్మ మత్సవిత్రి కొసఁగి
నాఁడు కరుణఁ గర్మనైపుణ్యమునఁ దన, యట్టికొడుకు గలుగునట్టివరము.

234


ఉ.

కావున నిమ్మహాంబునిధిఁ గట్టెద దేవరయాజ్ఞ వానరేం
ద్రావళి తోడుగా ననుడు నవ్వసుధేశుఁడు సంతసిల్లి సు
గ్రీవునిఁ జూచి సేతు వొనరింపఁగఁ బంపు నలుండు మున్నుగా
నీవు వలీముఖోత్తముల నెల్ల సరిత్పతివాక్యపద్ధతిన్.

235


చ.

అనవుడు నాప్లవంగవిభుఁ డప్డు దరీముఖమైందజాంబవ
త్పనససుషేణనీలనలతారగజార్కగవాక్షగంధమా
దనగవయాంజనేయకుముదద్వివిదాంగదముఖ్యవీరులం
గనుఁగొని యిమ్మహార్ణవము గట్టుద మంచుఁ జనంగ నిమ్ములన్.

236


ఉ.

మేటివలీముఖుల్ గడఁగి మేదిని యల్లలనాడ నుద్భటా

స్ఫోటన దాఁటుచుం జెలఁగుచుం బొరి నూఱులు వేలు లక్షలుం
గోటులు దాఁటు లై వడి నొకొండొకనిం [24]గడవంగ భూమిభృ
త్కూటములుం దరుల్ గిరులుఁ గొంచు రయమ్మున వచ్చి వారిధిన్.

237


క.

వడి వైచుడు నంబుచ్ఛట, లుడుమార్గము గడవ నెగయ నుగ్రధ్వనితోఁ
బడుచు నవి మగుడఁ బొడమక, యడఁగెడుచందంబు చూచి యక్కపివీరుల్.

238


తే.

మరలి జననాథుపాలికి నరుగుదెంచి, దేవ నిమ్నగావిభుఁ డన్నతెఱుఁగు గాక
యేము వైచినతరులు మహీధరములు, మునుఁగుచున్నవి తోడ్తోడ వనధియందు.

239


క.

అని విన్నవించుసమయం, బున నవ్విభుతో నదీవిభుం డి ట్లను నీ
వనచరులు తరులు గిరులుం, గొనిరా నీనలుఁడు వైవఁ గ్రుంకక తేలున్.

240


ఆ.

మొదట నొక్కతరువు మునిఁగిపోవక యుండ, నితఁడు వైవఁ బిదప నెల్లవారుఁ
దరులు గిరులు దెచ్చి దళముగాఁ దమతము, వలసినట్లు గట్ట వైచు టొప్పు.

241


క.

ఇంతకు మును వైచినయని, యంతర్గ్రాహములు మ్రింగె ననవుడు నబ్భూ
కాంతుండును నరు దందుచు, నెంతలు జలచరము లుండు నీగతి ననుడున్.

242


క.

తిమి యన శతయోజనమా, త్రము గల దొకమీను దాని రఘువర యొకమీ
నము మ్రింగు మ్రింగు నమ్మ, త్స్యము నొకఝష మిట్లు గలవు దత్తద్గిలముల్.

243


క.

[25]అయినను నంతంతకు న, మ్మెయి నుగ్రగ్రాహకులము మెలఁగఁగ నీపై
పయి నెగయువిచలవీచులు, వయిచినయని తూలజడియ వడిఁ దెరయెత్తున్.

244


వ.

అనిన నవ్యాక్యంబులకు సంతోషించుచుఁ బ్లవంగపుంగవు లార్పులు నింగిఁ జెలంగ
దిశాముఖంబులకు బహుముఖంబులం జని పర్వతపాదపాదులం దెచ్చి రాసమ
యంబున నంబుధిచేత ననుజ్ఞాతుం డై రామచంద్రునాజ్ఞ శిరంబున ధరియించి
విశ్వకర్మం దలంచి.

245

వానరులు సేతువు గట్టుట

శా.

విఘ్నేశాయ నమోనమో భగవతే శ్రీ వేదండతుండాయ ని
ర్విఘ్నక్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో యంచుఁ గ్రౌం
చఘ్నజ్యేష్ఠుఁ బ్రసన్నుఁ జేసి నలుఁ డుత్సాహంబుతో నద్భుతో
పఘ్నధ్వానము గాఁగ నొక్కనగ మొప్పన్ వైచె నంభోనిధిన్.

246


ఉ.

వైచిన నాకలోకమున వారికి వారిధిపంపు పూని దో
షాచరనాథుచేటు వినఁ జాట జలచ్ఛట లేగఁ దాను వే
వే చని చెప్పి వచ్చె నహివీరుల కన్నటు లూర్ము లొక్కపె
ల్లై చెదరన్ మునింగి వెస నగ్గిరి దేలెఁ గపీంద్రు లార్వఁగన్.

247

తే.

అప్పు డచలపాతంబున నబ్ధివలన
నెగయుసలిలచ్ఛటలతోన తగిలి పోయి
మణులు నక్షత్రపథ మంటి మగిడి పాయఁ
బంక్తిముఖుచేటునుల్కలపగిది వెలిఁగె.

248


చ.

ఇలఁ గలకొండ లెల్లఁ గపు లేవున వేకొనివచ్చి పైపయిన్
నలువున నీ నలుండు బహునక్రమహామకరాదిసత్త్వముల్
పెలు కుఱి క్రిందికిం జన గుభిల్లు గుభిల్లున వైచి సందునం
దులఁ దరుసంఘముల్ గదియఁ ద్రొక్కుచు సేతు వొనర్ప నమ్మెయిన్.

249


క.

అందఱు నన్నిముఖంబుల, నందంద గిరిద్రుమాదు లచ్చలమున నీ
నందుకొనునలునియరుదుం, జందము గని మఱియు వృక్షకచరులు గడంకన్.

250


క.

శిరముల బాహాసంధులఁ, గరముల వాలముల భుజశిఖరములఁ గక్షాం
తరముల నయ్యైవెరవులఁ, దరులు గిరులుఁ దెచ్చి రధికదర్ప మెలర్పన్.

251


తే.

అవియు నవలీల నందంద యందికొనుచు, నడవ గావించుచున్న యన్నలునిసేతు
కర్మకౌశల మీక్షించు గగనచరుల, కనిమిషత్వంబు చరితార్థ మయ్యె నపుడు.

252


ఉ.

వీచులతాకునం బొడమి వెల్లువ లై నవఫేనమాలిక
ల్రాచినరాముకీర్తు లొగి లంకకళంకముఁ బుచ్చి పైపయిం
ద్రోచినలీలఁ గూలములు దొట్టి నిలింపులఁ దొప్పఁ దోఁచె నా
నాచలపాతజాతమకరాకరభీకరశీకరావళుల్.

253


వ.

ఇవ్విధంబున.

254


క.

అగచరులు నాఁడు పదునా, లుగు యోజనములనిడుపు బలువుగా నానా
నగశృంగపాదపాదుల, గగనచరుల్ పొగడ నడవఁ గావించునెడన్.

255


క.

నానగముఁ బెఱికి కట్టకు, వానరు లంభోధిలోన వైవక యుండం
దా నుండెదఁ గా పనుగతి, భానుం డస్తాచలంబుపై కేఁగుటయున్.

256


క.

పని నేఁటి కింత చాలును, వనజాప్తుఁడు గ్రుంకె నెల్లి వలసినయట్టుల్
వనచరులు మెల్లఁ దొడఁగుద, మని సుగ్రీవుండు పలుక నగుఁ గా కనుచున్.

257


ఉ.

కట్టకుఁ గాపుగా నిదుర గావఁగఁ జాలెడివారిఁ గొందఱం
బెట్టుచు వచ్చి వేలములఁ బ్రీతి ఫలాదులఁ దృప్తిఁ బొంది రే
పెట్టు పయోధిఁ గట్టుదుమొ యెప్డు ప్రభాతమొ యంచుఁ గోర్కికిం
బ ట్టగువేడ్క లుల్లములఁ బట్టుకోనన్ వెడ గూర్కి వేగినన్.

258


క.

అగచరు లంబర మార్పులఁ, బగిలించుచు దిక్కు లెల్లఁ బరిగొని వగతో
నగములు ద్రుమములు నొండొరు, మిగులం గొనివచ్చి రుబ్బుమెయి నాలోనన్.

259


క.

పెనుగాలి మహామేఘము, గొనివచ్చువిధంబు దోఁప ఘోరత్వరతో
నివజుఁ డొకశిఖరిశిఖరము, ఘనమార్గం బద్రువ గగనగతిఁ గొని వచ్చెన్.

260

సీ.

గవ్యూతిమాత్రంబు గగనంబు గైకొన్న, వింధ్యాద్రిశిఖరంబు విఱిచి యొక్క
చే సుషేణుం డొక్కచేతన యిరువది, యోజనంబులకొండ నొనర వాయు
తనయుండు చుక్కలఁ దాఁకినపొడవునఁ, గల [26]దుర్ధరాచలాగ్రము సురేంద్రు
మనుమండుఁ దృణలీల మలయశృంగంబును, నీలుండు తద్ధరణీధరంబు
తిరిగి వచ్చి యున్న గిరులు మైందద్వివి, దులు మహేంద్రకూటములు పెకల్చి
గజగవాక్షగవయగంధమాదనశర, భులుఁ గడంకఁ దెచ్చి రలఘుభుజులు.

261


వ.

మఱియు ననేకు లనేకపాదపాదులు దెచ్చుచుం గడంకలు మెఱయ నాఁ డిరువదా
ఱుయోజనంబులు గట్టి యథోచితప్రకారంబున నారాత్రియుం బుచ్చి మఱునాఁడు.

262


సీ.

పశ్చిమోత్తరపూర్వపాథోధిపర్యంత, మఖిలదిక్కులు నీవ లవలఁ జేసి
కొండలు మాఁకులుఁ గోటానఁగోటులు, పృథివి బీఁటలు వాఱఁ బెఱుకువారుఁ
దలల దొంతులు గాఁగ ధరియించి మురువుతో, విడివడి చేతుల విద్దె మనుచుఁ
దెచ్చువారును వీఁకఁ దే నేఁగువారును, వడిఁ దెచ్చి కట్టపై వైచువారుఁ
దెచ్చి తెచ్చి నడుమ నిచ్చిపోయెడువారు, మూఁపుమూఁపు దాఁక మ్రొగ్గువారుఁ
గులిశనిహతి లేని కలగిరు లన మింట, నరుగుదెంచువారు నైరి కపులు.

264


ఉ.

కొందఱు పన్నిదంబులకుఁ గొండలు చేతులు రెంట మింటితు
ట్టందుదదాఁక వైచి మగుడం బడ నొక్కొకకేలఁ బట్టుచుం
గందుకకేళి సల్పుదురు కల్గిన వచ్చి విమానపంక్తులం
గ్రందుగ నున్ననిర్జరపరంపర లోరసిలంగ నంతటన్.

265


తే.

పూని తమతమకొనివచ్చుభూరుహముల, కాయగస రెల్ల వెరఁజాడి ఱాయిఱప్ప
దెచ్చువారికి నోరూరఁ దించు వత్తు, రెవ్వ రడిగినఁ బుడుకక నవ్వు లెసఁగ.


ఉ.

ఒక్కఁడు దెచ్చుకొండ తల నుండఁగఁ మీఁదన యెత్తికొంచు నొం
డొక్కఁడు నింగికిన్ నెగసి యుర్వి చలింపఁగ దాఁటి క్రందునం
ద్రిక్కులు వెట్ట నొల్లఁ జనరే యని క్రమ్మఱఁ బాఱి వాఁడు వే
ఱొక్కనగంబు పూని యరు దొందఁగ ముందట వచ్చువానికిన్.

266


ఆ.

చేతికొండ యొకనిచే నిచ్చి తల నున్న, కొండదొంతి కుదురుకొన నమర్చి
మగుడ నడుగ వాఁడు నగచరుల్ నగ వానిఁ, గిక్కురించి పోయి వెక్కిరించు.

267


వ.

ఇత్తెఱంగున మఱియుం బరిహాసప్రకారంబులు చెల్ల వానరులు గడంగి సేతువు
కట్టం దొడంగి రప్పుడు.

268


చ.

వనచరసింహనాదములు వారనిపాదపశైలపాతని
స్వనముల మందరభ్రమణసంక్షుభితార్ణవలోకభీకర
ధ్వని దలఁపించుచున్ దెసలు వ్రయ్యలు వాఱఁ జెలంగ నందు నిం
దును దిరుగంబడం దొడఁగెఁ దూలి తిమింగిలముఖ్యజంతువుల్.

269

ఆ.

మలయమారుతంబు మర్కటాంగముల కిం, పారఁ బొలసి చెమట లార్చుచుండ
భానుదీప్తు లడర బయ లీక మేఘముల్, నీడ సేయుచుండ నిలిచి నిలిచి.

270


ఉ.

చెందిననేదలం దృణము నేయుచు సేతువు గట్టి కట్టి మ
ధ్యందినవేళ నూఱటల కాసలు సేయుచు వాడుమోములుం
బొందుపడంగ సాంద్రతరభూరుహపంక్తులచల్లనీడలం
గందఫలాదిఖాద్యములు గైకొని కొండొక నిల్చి వెండియున్.

271


ఉ.

దట్టముగా ధరాధరవితానము లొడ్డుచు మీఁద మ్రాఁకులున్
మట్టలు వైచి కప్పుచు సమస్థలి సేయుచు సూత్ర మోజకుం
బట్టుచుఁ దెట్టియ ల్దరులు బల్పుగఁ జేర్చుచుఁ గట్ట రాపడన్
మట్టుచు యోజనార్ధశతమాత్రము గట్టిరి నాఁడు వానరుల్.

272


ఉ.

అంతఁ బయోజబంధుఁ డపరాబ్ధికి దక్షిణసింధుబంధవృ
త్తాంతము సెప్ప నేఁగినక్రియం జనఁగాఁ గపిరాజునాజ్ఞ
పంతయుఁ గట్టివైతము సురారులదర్పము దీర్త మంచు వి
శ్రాంతు లొనర్ప నాత్మశిబిరంబులకుం జనుదెంచి రయ్యెడన్.

273


ఉ.

కంటికిఁ గూర్కు లేక దశకంఠునిచేఁ బడులోక మింక ని
ష్కంటక మయ్యె నా నుదధిఁ గట్టఁగఁ దా నటఁ బంచె రాముఁ డి
[27]ట్లొంటక కాదు బెగ్గిలకుఁడో యని వేల్పులు పాట నెత్తుజే
గంటతెఱంగునం బొలిచెఁ గైరవబంధుఁడు బంధురద్యుతిన్.

274


ఉ.

ఆసమయంబునం గువలయప్రియుఁ డల్లనఁ జల్లగాలికిన్
బాసట యై శరీరములపై నటు లూనిన సేతుబంధనా
యానపరిశ్రమంబు నిబిడామలచంద్రికఁ బాయఁజేయ ని
ద్రాసుఖసక్తు లౌచుఁ బ్రమదం బలరార బలీముఖోత్తముల్.

275


సీ.

కలలోనఁ గొఱఁతకుఁ గులపర్వతంబులు, దెచ్చి [28]కట్టితి మని మెచ్చువారు
లంక సొచ్చితి మంచు హుంకారములు సెల్ల, గలవరించుచు బిట్టు తెలియువారు
వీచులతాఁకున నేచునర్ణవరవ, మడఁగి పోవఁగ గుఱు పొడుచువారు
నిద్రమైఁ బెకలించు నద్రులగతిఁ దోఁపఁ, జూచి చేతులు బయ లూఁచువారు
గాల రాచువారు వేలంబుచుట్టును, దిరుగువారు గట్ట యరయువారు
నిదుర లుడిగి తరణి కెదురుసూచుచు నుండు, వారు నగుచు రజని [29]పూరగింప.

276


ఉ.

తమ్ములలోన నీవు నొకతమ్ముఁడ వంచు విరోధితమ్మునిం
దమ్ముని నింద్రనందనునిదమ్మునిఁ జూచినచూపుఁ జూచెఁ గ్రొ
త్తమ్ములతమ్ము లైనకనుదమ్ముల నవ్విభు మేలు సూచుచుం
దమ్ములఁ జూతు నన్కరణిఁ దమ్ములవిం దుదయాద్రి దోఁచినన్.

277

వ.

అంతఁ గపులు.

278


క.

వనముల వనములభంగిన, కొనివత్తుము కొండ లెల్లఁ గుంభిని వ్రయ్యన్
మునుముకొని పెఱికి తెత్తుము, వనరాశికి మిగిలెనేని వైతుము లంకన్.

279


ఉ.

ప్రాకుదుమా త్రికూటశిఖరంబులమీఁదికి నెల్లవారు నొ
క్కూఁకున నంచు నున్నదశయోజనమాత్రము గట్లు గుండులున్
మ్రాఁకులుఁ దెచ్చి తెచ్చి యెడమం గుడి నిచ్చుచుఁ జుట్టుఁ బైపయిం
బ్రోకలు వెట్టుచుండ నటు పూర్ణము సేసె నలుండు సేతువున్.

280


వ.

ఇట్లు దశయోజనవిస్తారంబును శతయోజనాయతంబును గా సేతువు గట్టి సిద్ధవి
ద్యాధరగంధర్వాదు లంబరంబునం గ్రందుకొనునెలుంగులు సెలంగఁ బ్లవంగపుం
గవుల నగ్గించుచు రఘుపుంగవుసామర్థ్యంబున కచ్చెరు వందుచు నీసేతువుం జూ
చినజను లపేతకల్మషులు నాయుష్మంతులుఁ బుత్రవంతులు నగుచు నుత్తమకీ
ర్తుల నుల్లసిల్లుచుండుదు రని పలికి రంత నలుండు జలధిబంధనంబుతెఱంగు
విన్నవించుటయు రామచంద్రుండు ముదితహృదయుం డగుచు సేనానాయకుం డ
గునీలునిం గనుంగొని సేనలఁ బయోధి దాఁటింపు మని నియోగించి సుగ్రీవుం
డును నంగదస్కంధాధిరూఢుండగులక్ష్మణుండును గొలిచి చనుదేరఁ బవనతనయు
నెక్కి చనుసమయంబున.

281


క.

వేయోఘంబులు నానర, నాయకులం గొని గదాకనద్భాహాసా
హాయక మమర విభీషణుఁ, డాయితమై మున్న దాఁటి యద్దరి నుండెన్.

282


చ.

పెఱుకుదు మింక లంక నని పేర్చి కపీంద్రులు దిక్కు లార్పులం
బఱియలు సేయుచున్ బ్రమరి పాఱుచుఁ గేరుచుఁ గ్రేళ్లు దాఁటుచున్
మెఱములు వైచుచున్ నెగసి మేఘము లంటుచు నబ్ధిలోనఁ బె
ల్లుఱుకుచు నీఁదుచున్ మునిఁగి యొండెడఁ దోఁచుచుఁ గట్ట చేరుచున్.

283


ఆ.

ఎన్నఁ బెక్కు లగుచు నెక్కడఁ జూచిన, నడచువారు నడవఁ గడఁగువారు
విడియువారు మఱియు వీడెత్తువారు నై, నేల యీనినట్లు నిండఁబడిరి.

284


వ.

ఇత్తెఱంగున దాఁటి దక్షిణతీరంబునం గలయ విడియ నాపగావల్లభుండు నిజ
నికేతనంబునకుం జని వలయునుపాయనంబులు గొనుచు నేతెంచి రఘువరుం
గనుంగొని.

285


క.

ఆజులకు నరుగునప్పుడు, రాజులు తొడి పూసి కట్టి రమణీయశ్రీ
రాజిల్ల వలయుఁ గావున, రాజోత్తమ తాల్ప నవసరము భూషాదుల్.

286


తే.

అనుచు దివ్యంబులై చెలువారునంబ, రములు భూషణములుఁ గవచములు నాయు
ధములు నెలమిమై నిచ్చిన దాశరథులు, వరుసఁ గైకొని ధరియింప వార్ధి మఱియు.

287


క.

వరుణుఁడు పూజార్థము దన, పురికిని మిముఁ బిల్వ నన్నుఁ బుత్తెంచె నరే
శ్వర విచ్చేయం దగు వ, త్తురు గా కని పలుక నతికుతూహలలీలన్.

288

వ.

వరుణలోకంబునకుం జని సముచితప్రకారంబున నాప్రచేతనుచేతం బూజితు
లగుచు మగిడి యేతెంచి రంత నక్కడ దశకంధరుండు.

289

రాముఁడు సేతువు దాఁటి వచ్చుట విని రావణుఁడు మంత్రులతో నాలోచించుట

క.

అర్ణవము గట్టి దిక్కులు, ఘూర్ణిల్లఁగ రిపులు లెక్కగొనక సువేలా
భ్యర్ణమున వచ్చి విడియుట, కర్ణాకర్ణిగ నెఱింగి కలఁగినమదితోన్.

290


సీ.

కొలువున కేతెంచి కలయ మంత్రులఁ జూచి, వారితో నిట్లను మీరు నాకుఁ
బనులకుఁ గలవార లని చూతుఁ బ్రెగ్గడ, లగుచున్నమీనేర్పుఁ దగవు లెస్స
జడనిధి బంధించి కడచి వచ్చిరి మార్తు, రీవార్త లరయంగ వేవు లేద
రాజు లేమఱియున్న రాజనీతిస్థితి, సచివు లేమఱి యుండు టుచిత మగునె
నేర కున్నారె కొంద ఱెవ్వారొ మమ్ము, నొల్లకున్నారు గాక నాఁ దల్లడిల్లి
[30]వారలందఱుఁ దల లటు వ్రాల వైవ, నింద్రజితుఁ డంతఁ దండ్రితో నిట్టు లనియె.

291


ఉ.

రాచగుణంబు పోవిడిచి రాజ్యము గోల్పడి వీడు వెల్వడం
ద్రోచినఁ జక్క వచ్చిన నరుండును గ్రోఁతులు నాఁగ నెంత దో
షాచరనాథ దీనికి విచారము మేలె యి టైన నట్లు భ
ర్గాచలపాటనక్షమము లైనభుజంబులపెంపు దూలదే.

292


సీ.

దిగ్విజయార్థి నై దివిజసేనల గిట్టి, జంభారి నాగపాశములఁ గట్టి
తెచ్చితి జముక్రొవ్వు దీర్చితి వరుణు నో, డించితి ధనదు నొడిచితిఁ గాల
కేయాదిదనుజుల గెలిచితిఁ గాద్రవే,యుల నదల్చితి సోము నుష్ణధాముఁ
బఱపితి వసువులఁ బరిభవించితి మరు, ద్గణములఁ దోలితిఁ గడఁక మఱియు
నవనిపైఁ గలనాజుల నాజులందుఁ, గాందిశీకులఁ జేసితిఁ గడిమి నన్నుఁ
జెనయ నెవ్వఁడు గలఁ డేల చింత నీకు, నాశరార్చుల కెదురె వానరులు నరులు.

293


చ.

గజుఁడును జాంబవంతుఁడును గాలితనూజుఁడు నంగదుఁడు న
ర్కజుఁడు సుషేణుఁడున్ మొదలు గాఁ గపికోటులు రామలక్ష్మణుల్
రజనిచరాధినాథ సమరంబున నీసుతుఁ డింద్రజిత్తుపె
న్భుజముల నుగ్గునూచ మయి పోయినవారలు గాఁ దలంపుమీ.

294


వ.

అనినం బ్రహస్తుండు హస్తం బెత్తి వియత్తలంబున నదరులు సెదర ముసలంబుఁ
ద్రిప్పుచు ని ట్లనియె.

295


చ.

అనిమొన మేఘనాథుఁ జెనయం గలవీరుల మున్ను గంటిమే
యనిమిషదానవోరగభటాదులయందును నిమ్మహాశరా
సనుకథ లెల్ల నేల పెలుచన్ విలసన్ముసలంబు గ్రాలఁ బే
ర్చినననుఁ దేఱిచూడఁ గలరే కపులుం గడుఁబేదమర్త్యులున్.

296


వ.

అనిన ధూమ్రాక్షుం డి ట్లనియె.

297

ఉ.

ఏమఱిపాటు వేచి మన మిందఱుఁ బైపడి రాత్రివేళ శా
ఖామృగసేనఁ జొచ్చినమొగంబునఁ జేతులతీఁట వో ధను
స్తోమరభిండివాలపరశుక్షురికాపరిఘాదిసాధన
స్తోమముపాలు చేసి బలి సూపుదమే ఘనభూతకోటికిన్.

298


వ.

అనిన మహోదరుం డతనిపల్కులకుం గనలి యి ట్లనియె.

299


సీ.

రాఘవసుగ్రీవరక్షితంబును మహా, వీరవానరపరివేష్టితంబు
నగుఁ గాన దురవగాహం బగుఁ దద్బల, మనిన నీవెరవులు వినుఁడు సేతు
వొనరించుచో నొండె నుదధి దాఁటెడుచోట, వీడెత్తుచో నొండె విడియుచోటఁ
జనుగాఁక యప్పుడు శత్రులఁ జెఱుపంగ, నేమఱియున్నవా రెలమి మనల
కంటఁబిడుకఁబ్రామి కడిమిఁ ద్రికూటాద్రి, యాక్రమించి రింక నధికభయము
సేయఁగలరు సకలసేనలతో వారిఁ, దాకి గెలుత మొండుతలఁపు లేల.

300


క.

అనుడు నతికాయుఁ డి ట్లనుఁ, జన దనక నిశాచరేశ జనకతనూజం
గొనివచ్చి తట్లు కేవల, వనితయె రామునకు మనకు వైరము గలదే.

301


క.

దుష్టజననిగ్రహంబును, శిష్టప్రతిపాలనంబుఁ జేయుచు ధర్మా
విష్టుఁ డగురాజు చెడఁడు ని, కృష్టుం డగురా జధర్మకృతిఁ జెడిపోవున్.

302


ఉ.

వంచన నన్యకాంతఁ గొనివచ్చితి వచ్చినకోలెఁ జేటు సూ
చించుమహానిమిత్తములు చెప్ప ననేకము లింక నైన న
క్తంచరనాథ సామమునఁ గల్గెడుమే లది యొంట లేదు రా
త్రించరవంశనాశ మొనరింపక జానకి నిచ్చి పుచ్చవే.

303

రావణుఁడు శుకసారణు లనువేగులవాండ్ర వానరసేనఁ బరీక్షింపఁ బంపుట

వ.

అన నప్పలుకు లాదరింపక నిలింపారాతి శుకసారణులం గనుంగొని మీరు వారి
మర్మంబులు సంగరోద్యోగంబులుఁ గలతెఱంగు లెఱింగి రావలయుఁ గపటరూ
పంబులు ధరియించి వానరవాహినిం బ్రవేశించి.

304


చ.

తరుచరసేన సాగరము దాఁటినచందము వీటిపెంపు వా
నరభటు లున్నసొంపుఁ గపినాయకు లాడెడుపంతముల్ దివా
కరసుతుతెంపు రాఘవులగర్వము నొక్కొకవానిఁ గొల్చు[31]పె
న్నెరవుల సంఖ్యలున్ గలయ నేర్పున నేర్పడఁ జూచి రం డొగిన్.

305


క.

అనవుడు వారలు మాయా, వనచరు లై వీడు సొచ్చి వరుస మహీభృ
ద్ఘనవనశృంగగుహాంతర, వననిధితీరముల నున్నవానరబలమున్.

306


ఉ.

ఇక్కడ నింద ఱింద ఱని యెన్నఁ దలంచియు లెక్క కెక్కు డై
యెక్కడఁ జూచినం బుడమి యీనినకైవడి నిండి చూడ్కికిన్
వెక్కసపా టొనర్చుకపివీరుల నారయఁగా విభీషణుం

డక్కపటక్రమం బెఱిఁగి యారజనీచరచారయుగ్మమున్.

307


వ.

వనచరులచేతం బట్టించి కొనివచ్చి రఘుపతిముందటం బెట్టి యి ట్లనియె.

308


క.

వీరలు శుకసారణు లను, వారలు దశకంఠువేగువారలు కపటా
కారములు పూని మర్మము, లారయుచుండుదురు తిరిగి యఖిలజగములన్.

309


వ.

అని యతండు విన్నవించిన నన్నిశాచరులు భయకంపితాంగు లగుచుం గేలు
మొగిచి.

310


క.

దేవా దూతలము దశ, గ్రీవుఁడు పుత్తేర నిట్లు కృత్రిమభంగిన్
దేవరసైన్యము చూడం, గా వచ్చినరాక తప్పు గల దని పలుకన్.

311


క.

అల్లన నవ్వుచు నజ్జన, వల్లభుఁ డను దూత లయ్యు వధ్యులు మీరల్
ముల్లోకములకు డెందము, ము ల్లగుదశకంఠుతోడిమ్రుచ్చుల రగుటన్.

312


తే.

అయిన నల్పుల మిముఁ జంపినప్పు డేమి, గలుగు నటుగాని వెఱవ కీబలము నొనరఁ
జూడవలయునంతయుఁ జొచ్చి చూచిపోయి, పంక్తికంధరుతోడ నాపలుకు గాఁగ.

33


క.

క్షితిసుత నేలావునఁ దెచ్చితి నీ వాలావు సకలసేనలతో నా
జితఱిం జూపుచు నాశర, తతి కించుక సైఁపు మనుము దర్ప మెలర్పన్.

314


మ.

దిననాథుం డుదయాద్రిశృంగమున కే తే నెల్లి మారీచర
క్తనిషిక్తం బగునాశరంబు మునుగా ధారాళ మై ఘోర మై
ధనురభ్రంబునఁ బుట్టునంపజడిచేతం గూల్తు లంకాపురీ
ఘనసాలాదుల నేలమట్టముగ నాకంపింప నక్తంచరుల్.

315


క.

అని పలికి వీడుకొల్పిన, వినతు లగుచు దేవ నీవు విజయశ్రీ గై
కొను మనుచుఁ జక్క లంకకుఁ, జని చేతులు మొగిచికొని దశగ్రీవునితోన్.

316


వ.

నిశాచరేశ్వరా యేము కపిసైన్యంబు సొచ్చి సర్వంబు నరయునెడ విభీషణుం
డెఱింగి మముఁ బట్టించి వనచరుల కొప్పించి రఘుపతిముందటం బెట్టించిన నమ్మ
హాత్ముండు కరుణించి విడిచి పుత్తెంచిన వచ్చితి మంతయు నంతకుమున్న చూచి
నారము విన్నవించెద మవధరింపుము.

317


ఆ.

బాహుబలము నస్త్రబలము విచారింప, రాముతోడ సంగరమునఁ దొడర
వీరుఁ డెందుఁ గలుగనేరఁ డమ్మహితాత్ము, ననుజుఁ జూచినపుడు నట్ల తోఁచు.

318


ఖరకరసూనుఁ డుగ్రబలగర్వితుఁ డాతనిఁ జెప్పనేల త
డుగ్రజల
త్పరిసరవర్తు లై గిరులతాత లనం గపియూథనాథు లు
ద్ధురగతి నున్నవారు రణతదోహలు లందఱు యామినీచరే
శ్వర మనకం దొకం డొకఁడ చాలు నజయ్యులు వార లారయన్.

319


క.

నాఁడు మనలంకఁ గాల్చిన, వాఁడును నీలుండు నలుఁడు వాలిసుతుండున్
వాఁడిమగలు సమరమునకు, మూఁడవకను లేనిరుద్రమూర్తులు వింటే.

320


వ.

దశయోజనవిస్తృతంబును శతయోజనాయతంబునుగా సేతు వొనర్చి కడలి గడచి

దక్షిణతీరంబున వానరసైన్యంబు విడియుట నిక్కు వం బక్కపిబలంబుల లెక్కింప
నలువకు నలవి గాదు రామలక్ష్మణసుగ్రీవవిభీషణరక్షితం బై సురాసురాదులకు
నభేద్యం బగుచుండు నొండువిచారంబు లుడిగి నీ వింక లంక నిరాతంకంబుగా
నేలం దలంచిన జనకతనయ నారామున కొప్పించుట కార్యం బని సారణుండు
పలికిన రావణుం డతనిం గనుంగొని.

321


క.

సర్వజగంబులు బెదరఁగ, గర్వంబున దివిజదనుజగరుడోరగగం
ధర్వాదు లైన వచ్చిన, నుర్వీసుతఁ బుచ్చఁ బొడుతు నొడుతుం గడిమిన్.

322


చ.

వికృతము లైనమర్కటులవేషము లక్కడ నీవు చూచి బీ
తు కుడిచి వచ్చి నోరికొలఁదుల్ పచరించెదు నానిశాతసా
యకములకుం బురందరుఁడొ యంతకుఁడో వరుణుండొ యక్షనా
యకుఁడొ మనుష్యుఁ డైనయతఁ డాకపిసైన్యము దేవసైన్యమో.

323


వ.

అనుచు బహుతాలోన్నతం బగునొక్కసౌధం బెక్కి చూడ్కులకు నక్కజం బగు
చున్నసైన్యంబు సూచి సారణుం గనుంగొని యివ్వానరవీరులం దెవ్వరు బలా
ధికు లెవ్వరు సమరోత్సాహంబు గలిగియుండుదు రెవ్వ రేకులంబువా రెవ్వ
రెంతబలంబున కధిపతు లెవ్వరు యూథపయూథపు లంతయు నెఱింగింపు
మనిన నతం డి ట్లనియె.

324


చ.

తపనజుసేనముందట నుదగ్రబలోద్ధతు లైనలక్షయూ
థపు లదె చుట్టునుం గొలువఁ దా మనలం గనుఁగొంచు నంజన
ద్విపమొకొ నాఁగ గర్జిలుచుఁ దెంపునఁ గ్రాలెడువాఁడు నీలుఁ డ
క్కపికులనాథు రాత్రిచరకంటకుఁ గంటె నిశాచరేశ్వరా.

325


సీ.

శాఖామృగేంద్రులు శంఖశతంబును, బద్మసహస్రంబు బలసి కొల్వఁ
గమలకేసరరోమకాంతిఁ జె న్నొందుచు, మేరునగోన్నతి మేను మెఱయ
దిగిభశుండాదండదీర్ఘభుజార్గళ, యుగము మీఁదికి నెత్తి యుగ్రభంగి
వాలంబు నేలతో వడి వ్రేయుచును లంక, దృష్టించి యౌడులు దీడికొనుచు
వాఁడిమగఁటిమి నట్లున్నవాఁడు వాఁడు, వాలికొడు కంగదుం డనువాఁడు దేవ
కంటె కడిమి నీతఁడు తండ్రికంటె నెక్కు, డర్బుదాచలమేలు నీయరిదిబిరుదు.

326


క.

యువరాజ్యపట్ట మితనికి, రవితనయుఁడు గట్టినాఁడు రక్షోభటపుం
గవ యిక్కపిపుంగవునకు, బవరంబునఁ దోడు నాఁటిపావని కంటే.

327


ఆ.

సేతుబంధనంబు సేసినజగజెట్టి, విశ్వకర్మకొడుకు విపులభుజుఁడు
నలుఁడు సంగరాంగణమున సేనాసమ, న్వితము గాఁగ నితనివెనుక నిలుచు.

328


క.

వనచరులు వేయికోటులు, నెనిమిదియయుతములుఁ గొలువ నేపున సుతరుం
డనువాఁడు వాఁడె చెలఁగెడు, ననుపమబలయుతుఁడు చందనాద్రిఁ జరించున్.

329


క.

పీతశ్యామలశోణ, శ్వేతజలము పేర్చుచున్నవీరునిఁ గంటే

శ్వేతుం డనువీరునిఁ గల, ధౌతాచలనిభుని యాతుధానకులేంద్రా.

329


చ.

ధరణితలంబు పె ల్లద్రువ దాటుచు దిక్కులు వ్రయ్య నార్చుచున్
హరు లొగి వేయిలక్షలును నన్నియె కోటులుఁ గొల్వ నట్లు భూ
ధరనిభ మైన మే నమరఁ దాల్చి వెలింగెడు వేగవంతుఁ డన్
గిరిచరవీరుఁ డర్కజునికిం జెలి యీతఁడు రాక్షసేశ్వరా.

330


చ.

కొలిచి ప్లవంగయూథములు కోటియు ముప్పదిలక్షలుం గెలం
కులఁ జెలఁగం బిశంగరుచి ఘోరపుమేను వెలుంగఁ జూడ్కి కు
జ్జ్వలుఁ డగువాఁడు రంభుఁ డనువాఁడు నిశాచరలోకనాథ ని
శ్చలమతి యేలు శైలములు సహ్యసుదర్శనకృష్ణవింధ్యముల్.

331


క.

లంకాధిప పదికోటులు, బింకపువానరులు గొలువఁ బె ల్లార్చి భుజం
బంకించునతఁడు కుముదుఁడు, సంకోచనశిఖరి నీప్రచండుం డుండున్.

332


క.

నలువదికోటులు కపివీ, రులతో శరభుఁ డనువాఁడు రోదసి పగులం
బెలుచ నదె మల్ల సఱచుచుఁ, జెలఁగెడుఁ బ్రాలేయనగము చెల్లు నితనికిన్.

333


క.

రక్షోవల్లభ యేఁబది, లక్షలు యూథపులు గొలువ లలిఁ బనసుం డన్
వృక్షచరాగ్రణి కెరలెడు, నీక్షించితె పారియాత్ర మీతం డేలున్.

334


మ.

తను శాఖామృగషష్టిలక్ష గొలువన్ ధారాధరధ్వానమో
యన గర్జిల్లెడు నల్లవాఁడె వినతుం డవ్వీరుశై లంబు మం
థనగం బంతియ సేనతోఁ గనలుచున్నాఁ డట్లు సక్రోధనుం
డనుశూరుండును వీఁడె వీఁ డునికి పర్ణాశాతటోగ్రాటవుల్.

335


ఆ.

హరులు గామరూపధరులు డెబ్బదిలక్ష, లని నజయ్యు లైనయట్టివారు
గొలువ నడుమఁ జాఁదుకొండకైవడి నున్న, కపివరేణ్యుఁ గంటె గవయుఁ డతఁడు.

336


వ.

అని పలికి మఱియు ని ట్లనియె.

337


క.

స్కంధావారము మధ్య, స్కంధంబున నున్న సకలకపినాథులఁ ద
ద్బంధురసైన్యములను దశ, కంధర పరిపాటిఁ జూపఁగం జూడు మొగిన్.

338


తే.

వృక్షపాషాణపాణు లై వేనవేలు, యూథనాథులు దనచుట్టు నుండ వాల
రోమజాలంబు బాలార్కరుచులఁ గడవ, వెలుఁగునాతఁడు హరుఁ డనువీరవరుఁడు.

339


తే.

నీలమేఘజాలంబులలీల మెఱయ
నెలుఁగు బలుమొ త్తములతోడ నెసఁగునతఁడు
ధూమ్రుఁ డిమ్మేటి నర్మదాతోయ మెలమిఁ
గ్రోలుచును ఋక్షవంత మన్కొండ నుండు.

340


ఉ.

కాటుక కొండలట్టిఘనకాయములం గలయూథపోత్తముల్
కోటులు చుట్టునుం గొలువ ఘూర్ణిలునీతఁడు జాంబవంతుఁ డ
న్పోటరి ధూమ్రుతమ్ముఁడు గనుంగొను మితఁడు వజ్రి కాజిఁ దో

డ్పాటొనరించి వేల్పులసభం గనినాఁడు వరమ్ము లిమ్ములన్.

341


క.

మాటికి మనపై నుఱుములు, చాటుచు వేగోటు లద్రిచరులు గొలువ నా
స్ఫోటించి నేల కాలం, దాటించుచు నున్నవాఁడు దంభుఁడు కంటే.

342


ఆ.

ఒడలు యోజనంబు నిడుపును బొడవునై, యుర్విఁ జేతు లూఁదియున్నవాఁడు
వాఁడె ధనుఁడు వాఁడు వాసవు నాజి జ, యించినాఁడు కపుల కెల్లఁ దాత.

343


సీ.

మేటిమర్కటులు వే గోటిపద్మంబులు, గొలువఁ గల్పాంతవిఘూర్ణమాన
జలధరాడంబర మొలయ నజాండంబు, వ్రయ్యఁ బె ల్లార్చుచు వాల మార్చు
వాఁ డింద్రజాలుఁ డన్వాఁడు సురాసుర, సంగరంబున దేవసైన్యమునకుఁ
దో డయి విక్రమక్రీడ సల్పినశూరుఁ, డీశానసఖునకు నిష్టసఖుఁడు
గంధవహునిచెలికి గంధర్వకన్యకుఁ, బుత్రుఁ డితఁడు ద్రోణభూధరేంద్ర
మేలుచుండు నెలమి వాలునవ్వీరకుం, జరునిఁ జూచితే నిరశాచరేంద్ర.

344


క.

శైలాకృతి మే నమరఁగ, వేలక్షలు కపులు గొలువ వీరుఁడు గజుఁ డీ
వాలుమగఁడు హైమవతీ, కూలంబున శిశిరబీజకుధరం బేలున్.

345


క.

వాతోద్ధూతమహాజీ, మూతముగతి దోఁప సేనముందట మనపై
నేతెంచుయూథపాధిపు, నాతనిఁ జూచితె ప్రమాథి యనుకపినాథున్.

346


తే.

ప్రకటబలులు గోలాంగూలకభటులు నియుత
శతము శతకోటియును దన్ను నతులగతులఁ
గొలువఁ బొలుచునితఁడు గవాక్షుండు మేరు
శైల మివ్వీరునెలవు దోషాచరేంద్ర.

347


క.

హనుమంతుతండ్రి కేసరి, యనువాఁ డదె పేర్చి వాల మార్చుచు మనపైఁ
గనలెడుఁ గంటే యవ్వీ, [32]రునకుం బదివేలు వింటె ద్రుమచరు లెలమిన్.

348


సీ.

దంష్ట్రాచతుష్టయదారుణాననముల, నిశితోగ్రనఖముల నిడుద లైన
లాంగూలముల నొప్పి లాఁగలు వెలువడ్డ, కంఠీరవంబులకరణి వెలిఁగి
కనలుదవాగ్నులగతి విషజ్వాలలు, గ్రక్కుమహాపన్నగములపగిది
జంగమాచలములచాడ్పున నొప్పారి, కదలనికాలమేఘములమాడ్కి
నద్భుతావకాశు లైనవానరవీర, భటు లనేకు లట్లు బలసి కొలువ
సమరమునకు వాలి శతవలి యనువాఁడు, వాఁడె తిమురుచున్నవాఁడు కంటె.

349


క.

సూరెల వేగోటులు గపి, వీరులు గర్జిల్ల నట్లు విలసిల్లెడునా
శూరోత్తముఁడు సుషేణుఁడు, తారుకోడుకు గామరూపధరుఁ డితఁ డధిపా.

350


తే.

గందమాదనోల్కాముఖక్రథనతార, పనసజంఘప్రజంఘార్కభరతవృషభు
లనఁగ నేకైకయూథసహస్రలక్ష, వరులు వా రాపదుండ్రు దుర్వారబలులు.

351


వ.

మఱియు వింధ్యాచలవాసు లైనవానరవీరు లనేకానీకంబులతో దుర్వారబలం

బులఁ గడంగి కయ్యంబునకుం గాలు ద్రవ్వుచున్నారు లెక్కింప నలువకు నలవి
గా దని పలికె నప్పుడు శుకుండు రావణుం గనుంగొని.

352


క.

ఒక్కొకటి వేయికోటులు, మొక్కలపుంగవులు గలుగుమొన లవి ముయ్యే
డొక్కటఁ గొలువఁ బొలుచునా, రిక్కలఁ దాఁకినపొడువు దరీముఖుఁ డధిపా.

353


సీ.

శంఖంబు లేకవింశతిసహస్రంబులు, బృందంబు లవి రెండువేలనూర్లు
గలయలపెనుమొన గాసిలి మనమీఁద, మొగ్గెడుసుగ్రీవుమూలబలము
గామరూపులు దేవగంధర్వులకు జనిం, చినయట్టివారు కిష్కింధవారు
వృక్షభూధరఘోరవృష్టి లంకాపుర, గోపురాదులఁ గుప్ప గూల్తు మనుచు
నాకసంబు దెసలు నార్పుల నద్రువ ను, త్తాలతాలహతులఁ దార లురుల
నేపుతోడ నాజి కెదురుసూచుచు నున్న, వారు రాక్షసేంద్ర వారు కంటె.

354


క.

అందఱలో మెఱసెద రదె, మైందద్వివిదు లనుకపికుమారులు వీరల్
బృందారకసము లమృతము, నం దృప్తిం బొందినారు నాఁ డజుదయచేన్.

355


తే.

వారిచేరువఁ గనలెడువారు సుముఖ, విముఖు లీరేడుకోటులు వృక్షచరులు
వారు మృత్యువుకొడుకు లపారబలులు, తండ్రికంటె బెట్టిదులు నక్తంచరేంద్ర.

356


సీ.

అలనాఁడు మనలంక యవలీలఁ జుఱపుచ్చి, వడిఁ జన్నవాఁ డలవాఁడు వాఁడె
కేసరితనయుండు గిరిచరాగ్రేసరుం, డనిలతనూభవుఁ డనఁగఁ బరఁగు
బాల్యంబునప్పుడు బాలార్కబింబంబుఁ, బొడగని ఫల మను బుద్ధి మూఁడు
వేలయోజనములు వినువీథి కెగసి య, ట్లందఁజాలక యుదయాద్రిమీఁద
హనువు నలియఁబడుట హనుమంతుఁ డనుపేరు, గలిగె నితని కితఁడు గామరూపి
జలధు లైనఁ గలఁపఁ జాలు నవ్వీరులా, వజున కైన నెఱుఁగ నలవి గాదు.

357


సీ.

అక్కిలి తెగలోన హరువిల్లు విఱిచిన, యాజానుదీర్ఘబాహార్గళంబు
లమర నిందీవరశ్యామకోమలకాంతి, నఖిలైకమంగళాయతన మైన
యమ్మేను విలసిల్ల నరవిందములచాయ, నచటెల్లఁ బచరించునట్లు దోఁప
నలగుచూపులు భానుజాదుల నెమ్మోము, లలరింప ముకుళితహస్తుఁ డగుచు
మనవిభీషణుండు దనవామభాగంబు, సేరి లంకతెఱఁగు చెప్పఁ గేల
నమ్ము ద్రిప్పు నమ్మహాధనుర్ధరుఁ గంటె, రాముఁ డతఁడు సుమ్ము రాక్షసేంద్ర.

358


క.

ఇతఁడు ధనుర్వేదవిదుం, డతిరథుఁ డిక్ష్వాకువంశ్యులం దెల్ల జగ
త్త్రితయంబున లేఁ డితనికిఁ, బ్రతి బ్రహ్మస్త్రాదిదివ్యబాణప్రౌఢిన్.

359


సీ.

మృగభాతిఁ బొలిచిన మీమంత్రి మారీచు, పసిఁడిచర్మంబుపైఁ బవ్వళించి
నీపేరు విన్నంతఁ గోపించి మండెడు, మిత్రతనూభవుమీఁద వ్రాలి
నిను వాలమునఁ గట్టి వనధుల ముంచిన, వాలినందనునిపైఁ గేలు మోపి
యలనాఁడు మీసుతు నక్షునిఁ జంపిన, గాడుపుఁబట్టిపైఁ గాలు సాచి
మొనసి నీదుసహోదరి ముక్కు సెవులు

మోటుపఱిచినఖడ్గంబె మ్రోలఁ గాల
ఖరునిఁ దునిమినశితసాయకంబు మొక్క
దీర్చుచుచున్నాఁడు కంటె వైదేహివిభుని.

360


చ.

మెఱుఁగుపసిండిచాయ గలమేను వెలుంగు విశాలనేత్రముల్
గిఱిగొన లంకపై యలుక కెంపునఁ గోకనదచ్ఛదద్యుతిం
జెఱగొనుచుండ రామువలచే యనఁగాఁ దగియున్నవాఁడు డ
గ్గఱి కుడిదిక్కునందు రణకర్కశు లక్ష్మణుఁ గంటె రావణా.

361


సీ.

కమనీయశతహేమకనకమాలిక యుర, స్స్థలమునఁ గ్రాల లక్ష్మణునిఁ గదిసి
మొఱపుసొంపునఁ దనమే నొప్ప నట్లున్న, గిరిచరోత్తముని సుగ్రీవుఁ గంటె
యాజుల జయ మిచ్చు నాబిరు దారయ, వానరరాజ్యంబు వాలిఁ జంపి
యితనికి నారాముఁ డిచ్చినాఁ డీతఁడు, నేర్పునఁ గులమున నీతిఁ గీర్తి
బాహుబలమున జవమున సాహసమున, నధికుఁ డగుఁ గొండలందు హిమాద్రికరణి
నెల్ల యూథాధినాథుల నేలుచుండుఁ, బంక్తికంధర కిష్కింధపట్టణమున.

362


క.

విను విూతనిసేనం గల, వనచరభటసంఖ్య వర్గవర్గము లెల్లం
బెనురాశి సేసి కవిలెం, జన వ్రాసిన వెరసుబడి నిశాచరనాథా.

363


చ.

పొరిఁ బదిసున్నలున్ నెలయు బొట్టు మృగాంకుఁడు నేడుమిన్నులున్
ధరణియు మూఁడుబిందులు సుధాకరుఁడుం బదునేనునింగులున్
ధరయుఁ బురత్రయంబు హిమధాముఁడు నంబరసప్తకంబుఁ జం
దురుఁడు నభశ్చతుష్కము విధుండును గాఁ జను నంకమాలికల్.

364


వ.

అది యెట్లంటేనిఁ గోటియు శంఖంబును మహాశంఖంబును బృందంబును మహా
బృందంబును బద్మంబును మహాపద్మంబును ఖర్వంబును మహాఖర్వంబును సము
ద్రంబును నోఘంబును ననం గల్గుమహాసంఖ్యలు నూటినుండి వరుస నొండొం
టికి లక్షగుణంబు లెక్కు డగుచుండు నం దోఘంబును సముద్రంబును నూఱుఖ
ర్వంబులును వేయిమహాపద్మంబులును నూఱుబృందంబులును వేయిమహాశం
ఖంబులు నొక్కశంఖంబును వేయికోట్లు నై గణుతింపం బడు నిట్టిమహాబలంబు
లం గొని నీతో సమరంబు సేయ గర్జిల్లుచున్న వాఁ డవ్వీరుం డింతయు నెఱింగి చే
యం దగినకర్జం బాచరింపు మనిన రావణుండు.

365


ఆ.

ఆనరేంద్రులతేజంబు భానుసూనుఁ, డున్నచందంబు వానరయూథపతుల
తెంపు నయ్యైబలంబులసొంపు మనను, గలఁప శుకసారణులదిక్కు గలయఁజూచి.

366


చ.

అలుగ ననుగ్రహింపఁ బ్రభుఁ డైననిజేశ్వరునొద్ద నాప్తులున్
వలఁతులు నైనవారు పగవారి నుతింతురె దేవదానవా

దులకు నజయ్యుఁ డైననను దుర్బలు లీనరవానరాధము
ల్కలన నెదుర్చువారఁట తలంకక నాకడనా వృథాకథల్.

367


క.

చారులు మంత్రులు నిష్టులు, నేరుపు గలవారు ననుచు నేరక మిము ము
న్నారయ రక్షించినఫల, మారఁగ మీవలన నిప్పు డది యేర్పడియెన్.

368


క.

ప్రతిపక్షపక్షపాతులు, మృతి కర్హులు మంత్రు లైన మిముఁ గార్యబహి
ష్కృతులం జేయుటె చంపుట, హితులరె మీ రింక నాకు నెట్లుఁ దలంపన్.

369

రావణుండు శార్దూలాదిచారులను వానరసేన నరసి రా నంపుట

వ.

అని పలికి మహోదరుం గనుంగొని వేగు పనుపం దగినవారలం బిలువంబంపు
మనిన నతండు శార్దూలుండు మొదలగువార్తావహులం దెచ్చి ముందటం బెట్టుట
యు వారిని రామవృత్తాంతం బరసి రమ్మని నియోగింప వారును బ్రచ్ఛన్నమార్గం
బున సువేలాచలంబున కరిగి వానరస్కంధావారంబు ప్రవేశించి యరయునెడ
విభీషణుం డెఱింగి పట్టించి వనచరులచేత నొప్పించుచు రఘుపతిసన్నిధికిం దెచ్చు
టయు నన్నరేంద్రుం డన్నిశాచరుల కి ట్లనియె.

370


ఉ.

భూమితనూజ నట్లు గొనిపోయినదుర్మద మింకకుండఁ దా
నే మఁట చేయు లావు గల రెవ్వరు దోడఁట చక్కఁ జాఁగి సం
గ్రామసమర్థుఁ డై నడచుఁ గాక సమస్తసు రావరోధబం
దీముదితాత్ముఁ దన్నుఁ గడతేర్పక పోయెద రెట్లు రాఘవుల్.

371


చ.

కనియెద రెల్లి రక్కసులు కన్నులపండువు గాఁగఁ బైపయిం
గనదురురత్నపుంఖకలికారుచిజాలనిరంతరంబు లై
కనలుచు లంకపై నిగుడఁగా దశకంఠకఠోరకంఠఖం
డనచణచండమార్గణగణస్ఫురణస్ఫుటవిస్ఫులింగముల్.

372


వ.

అని పలికి విడిపించుటయు వారు లంకాపురంబున కరిగి రావణునకుం దమపరి
భవంబు మొదలుగాఁ గలతెఱం గెఱింగించి వెండియు.

373


క.

గరుడవ్యూహము గా వా, నరసేన నమర్చికొని రణక్రీడకు నా
ధరణిపతి వచ్చుచున్నాఁ, డురవడి నట సీతఁ బుచ్చు టుచితం బింకన్.

374


మ.

అటు గాకున్న మగంటిమిం గడఁగి బాహాటోప మేపార మ
ర్కటసైన్యంబు నెదిర్చి రాఘవుకనత్కాండప్రచండానల
చ్ఛట లొక్కింత సహింతు గా కనుడు రోషగ్రంథిలభ్రూకుటీ
కుటిలస్ఫూర్తిభయంకరుం డగుచు రక్షోనాయకుం డి ట్లనున్.

375


క.

తరుచరుల యేల వారికి, దురమున నింద్రాదిసురులు)తో డై చనుదెం
తురు గా కే నందఱ జము, పురమునకుం బుత్తుఁ గాక పుత్తునె సీతన్.

376


వ.

అనుచు నిశాచరవీరులం జూచి మీరు మీ బలంబులుఁ గూడుకొని యుద్ధసన్న
ద్ధుల రై యుండుం డని నియోగించుచు నంతఃపురంబున కరిగి విద్యుజ్జిహ్వుం

డనువానిం బిలిచి పరమరహస్యంబుగా నద్దశాననుం డతని కి ట్లనియె.

377


క.

శరములు నొకవిలు మాయా, శిరమును గొనిపోయి చూపి సీతా యిదె నీ
పురుషునిఁ జంపితి మని నీ, వెరవు మెఱయవలయుఁ గపటవిద్యాచతురా.

378


వ.

అని పలికి తాను నశోకవనంబునకుం జని.

379


తే.

పలుచఁ బాఱిననునుఁజెక్కు పాణిపంక, జమునఁ జేర్చి యందంద బాష్పములు దొరఁగఁ
గూరువగలఁ గుందుచు నట్లు ఘోరరాక్ష, సీసురక్షిత యై యున్నసీతఁ జూచి.

380


క.

నీకొఱకై యత్నంబు ల, నేకంబులు సేసి మొదలు నెలనాఁగ నినుం
బైకొని వేఁడఁగ నన్నుం, గైకొన వై తెట్లు నింకఁ గైకొందు గదా.

381


ఉ.

ఎవ్వరు దిక్కు నీకుఁ గల రేమిటి కింతచలంబు లోకముల్
మువ్వరుసం గలంచి తుద ముట్టినన న్నవధీరణంబునం
బువ్వులు దూపు లైనవెడపోటరిబారికిఁ ద్రోచినట్టినీ
క్వ్వఱ నాఖరాంతకుఁడు గూలెఁ జుమీ సమరాంగణంబునన్.

382


క.

ఇట మీఁ దెవ్వరికిం దె, ల్లటిగా నీ విట్టు లునికి లలనా న న్నే
లుట మూఁడుజగంబులు నె, క్కటి యేలుట గాదె రాము కథ [33]మఱు మింకన్.

383


వ.

వినుము తదీయవధప్రకారం బతండు కపులం గూర్చుకొని కడలిఁ గడచి దక్షిణ
కూలంబున విడిసె నని వేగులవారిచేత నెఱింగి యేను బ్రహస్తప్రముఖంబుగా
నిఖిలబలంబును గూర్చి పోటునకుం బనుచుటయు నర్ధరాత్రివేళ నవ్వేలంబు సొచ్చి
పథిపరిశ్రాంతి నిద్రాపరవశు లై యుండఁ బ్రచండగతి రక్కసులు పెక్కుముఖం
బులం గదిసి ముద్గరపరిఘపట్టిసప్రాసఖడ్గచక్రాదుల సుగ్రీవజాంబవదాంజనేయ
మైందద్వివిదముఖ్యు లైనబలీముఖుల వధియించిరి ప్రహస్తుండు మస్తకంబు ద్రుం
చి రామచంద్రు నస్తమితుం జేసె హతశేషు లైనవానరులును లక్ష్మణుండును
రయంబునం బాఱి సముద్రంబునం బడి రదె పురంబునం జెలంగెడు మదీయవిజ
యభేరీధ్వను లాకర్ణింపు మతనితలయుం దెత్తు రింతకు ననునంతలోన విద్యుజ్జి
హ్వుండును సంభ్రమంబునం బఱతెంచి రావణునకు మ్రొక్కి తన్నియోగంబునం
దన తెచ్చినశరశరాసనశిరంబులు సీతముందటం బెట్టి చనియె నంత నంతర్గ
తంబున.

384


చ.

పవనతనూజుచేత వినఁబడ్డ విభాకరసూనుతోడి బాం
ధవము నిజంబు నిక్కమొకొ దైవము యీచెడువార్త యంచు బి
ట్టవిసినయుల్లముం దొరఁగునశ్రులు నై యటు లుండి పోల న
య్యవనిజ చూచి రాముశిర మౌ నని మూర్ఛిలి వ్రాలె భూస్థలిన్.

385

క.

నఱకినకదళీకాండము, తెఱఁగున నటు వ్రాలి తడసి తెప్పిఱి మిను పై
విఱిగి పడినట్లు కడుని, వ్వెఱపడి మఱియు నటు సూచి విహ్వల యగుచున్.

386


తే.

నిష్ఠతోఁ బ్రణమిల్లి వసిష్ఠుచరణ, యుగళసంగతి గన్నయకయ్యుత్తమాంగ
మినకులోత్తమ నేఁ డిట్టు లిద్దురాత్ము, మ్రోల నేల నుండెడి దఁట ధూళి బ్రుంగి.

387


వ.

అనుచు నాతల నిజాంకతలంబునకుం దిగుచుకొని.

388


ఉ.

ఏచినయాఖరాదుల ననేకుల నెక్కటి చంపి సంయమీం
ద్రోచితవాక్యపూజనల నొంది జగంబు నలంకరించునీ
యాచిఱునవ్వుతోడివదనాంబుజమా యిది సప్తతంతుర
క్షాచణ తాటకాహరణ శంసితశైశవ హా నరేశ్వరా.

389


చ.

అకట నరేంద్రచంద్ర హరిణాధమముం గనుఁగొన్నయట్టిచూ
డ్కికి నిది పెద్ద గాదు నృపకేసరి ని న్నిటు చూడ నేమి నో
మొకొ తొలుమేన నోచితి రఘూత్తమ నాకొఱకై కదే కపి
ప్రకరము గూర్చి తే నిటు లభాగ్యఁ గదే తుది ముట్టదే కదే.

390


సీ.

ప్రాణేశ పతికిము న్పరలోక మరిగెడు, చెలువ లేతపములు చేసి రొక్కొ
వల్లభ చూచితే వైధవ్య మొక్కింత, వడి యైనఁ గైకొన వలసె నాకు
నాథ నాతో నల్గినాఁడవే నను డించి, యొంటి నీ కి ట్లేఁగ నుచిత మగునె
జననాథ సహధర్మచారిణిగా నన్ను, మాతండ్రి యిచ్చుట మఱవఁ నగునె
నీడఁ గన్ను మొఱఁగి నృపవర బొందికిఁ, బోక గల్గు టెట్లుఁ బొసఁగ దెందు
నేను నిన్నుఁ గూడ నిదె వేగ వచ్చెద, నిమిషమాత్ర మధిప నిలుతుగాక.

391


చ.

జడధి మునింగి లక్ష్మణుఁడు సావక పోయెనయేని నన్నుఁ గో
ల్పడినతెఱంగు నీమరణరభంగియుఁ జెప్ప నయోధ్య నప్పు డే
వడువున శోకసంభ్రమరవంబులు పుట్టునొ నిన్నుఁ గన్నయా
కడుపునఁ బుట్టుచిచ్చునకుఁ గైకమనంబున సంతసిల్లఁగన్.

392


మ.

ఇటు నాకంబున మామజయ్య మనచే నీవార్త విన్నప్పు డ
క్కట మూర్ఛంబడి తేఱిలోఁ బొగులుచుం గైకేయిదుర్భావ మిం
తటికిం దెచ్చెనె మత్కులంబు దురవస్థం బొందెనే యంచు ను
త్కటశోకంబునఁ దూలు నగ్రమహిషీదైన్యంబు చింతించుచున్.

393


క.

అని పలికి పనవు న ట్లా, ధనువును బాణములుఁ జూచి తల యూఁచు నగుం
దనివి వనితె దైవమ యను, నన నేమియు నింక నేటి కను నని మఱియున్.

394


ఉ.

రావణ నీకుఁ బుణ్య మగు రాముపయిన్ నను వైచి ఖడ్గధా
రావిధిఁ బుచ్చవే యనఁగ రక్కసుఁ డొక్కఁడు పాఱు తెంచి దే
వా వెస నేమొ వాకిటికి వచ్చినవాఁడు ప్రహస్తుఁ డన్న నొం
డై వడి నిప్పు ద్రొక్కినటు లద్దశకంఠుఁడు సంభ్రమంబునన్.

395

వ.

అరిగి రామువృత్తాంతం బంతయుఁ బ్రృహస్తువలనం దెలిసి మంత్రిజనులుం
దానును మంత్రాలోచనంబు సేసి సేనానాయకులం గనుంగొని మీరును మీ
బలంబులతోడ సమరసన్నాహంబు మెఱసి రం డనుచు నియోగించె నక్కడ
నక్కపటశరశరాసనశిరంబు లదృశ్యంబు లయ్యె నత్తెఱంగునకు సీత యాశ్చర్య
భయంబులం బొరయ నంతకుమున్న రావణాగమనంబునకుఁ దొలంగి మఱుఁగు
పడి యున్నసరమ చనుదెంచి సకలవృత్తాంతంబు నెఱుంగుట నద్దేవి కి ట్లనియె.

396


ఉ.

ఓ చెలి యేటికిం దలఁక నోడకు శోకము మాను రావణుం
డీచెడుమాయఁ బన్నె నిది యెంతయు బొం కదె సర్వలోకర
క్షాచతురోద్ధతిం గడలి గట్టి మహాకపిసేనతో సువే
లాచల మాక్రమించెఁ గమలానన రాముఁడు సేమ మారఁగన్.

397


క.

ఆవిలు నమ్ములుఁ దలయును, నేవీ యటు గాక యున్న నిదె కనుఁగొను మా
శావలయంబున నొకపెనుఁ, గావిరి [34]కపిసైన్యధూళి గప్పినకతనన్.

398


చ.

అదె కపివాహినిం గొని నృపాగ్రణి వచ్చుట కిష్టు సంభ్రమిం
చెద రవే దుందుభిధ్వనులు జృంభితఘోటకహేషితంబు లు
న్మదగజబృంహితంబులు రక్షణత్పటునేమిరథస్వనంబులుం
జద లద్రువన్ నిశాచరులసందడిమ్రోఁతలు నయ్యెడుం బురిన్.

399


శా.

క్షోణీపుత్రి విచార మేమిటికిఁ గాకుత్స్థాన్వయగ్రామణిం
బాణేశుం డగురాముఁ జూచెదవు నెయ్యం బార ని ట్లున్న నీ
వేణీబంధము నవ్విభుండు దనచే వీడ్వంగ నత్యంతక
ళ్యాణస్ఫూర్తి వెలుంగునిన్నుఁ గని తెల్లం బేను నిం పొందెదన్.

400


ఉ.

అక్కజపుంబ్రతాపమును నంచితనీతియుఁ గల్గునీవిభుం
డెక్కడ దుర్మదాంధుఁ డగునీఖలుఁ డెక్కడ నెట్లుఁ బోలునే
దిక్కరితుండచండతరదీర్ఘభుజార్గళుఁ డైనరామునా
చిక్కనివింటిమంటలకుఁ జేరిన నింతక వీఁడు మ్రగ్గఁడే.

401


అ.

కాక సందియంబు గల దేని చింతింప, నేల రామచంద్రపాలి కరిగి
వార్త లరసి వేగ వచ్చెదఁ బుచ్చుము, గగనగతి సుపర్ణుఁ గడతు నేను.

402


వ.

అనిన విని సంతోషించి సరమ నీ విద్దురాత్ముం డగు రావణునుద్యోగం బెఱింగి
ర మ్మన నవ్వనిత యట్ల కాక యని చని యచట నంతయుఁ దెలిసి వచ్చి జనక
తనయం గనుంగొని.

403


తే.

వినుము నీరజనన దశాననుఁడు దాను, మంత్రివరులు నూహించినమంత్రవిధము
సమరమున గెల్చుఁ గాదేని చచ్చుఁ గాని, నిన్ను సంధి నీఁ డిది కార్యనిశ్చయంబు.

404


క.

దీనికి మదిఁ దలఁకకుమీ, భూనాయకుఁ డిద్దశాస్యుఁ బొరిగొని తరుణీ

వే నినుఁ గొని పోవు నయో, ధ్యానగరంబునకు బాహుదర్ప మెలర్పన్.

405


క.

అనవుడు నవ్యాక్యంబులు, విని జానకి రామచంద్రువిజయంబు మనం
బునఁ గోరుచు మీఁ దెట్లొకొ, యనుచుం దలపోయుచుండ నక్కడ నంతన్.

406


ఉ.

వానరసింహనాదము లవారితవార్ధిమహోర్మిఘట్టన
ధ్వానము మ్రింగుచున్ దెసలు వ్రయ్యఁ ద్రికూటనగంబుతోన లం
కానగరంబు గ్రక్కదలఁగా నురుగోపురరత్నపాత ము
ల్కానివహంబుపా టనఁ దలంబుగఁ గ్రందుకొనం జెలంగినన్.

407


వ.

అమ్మహాకలకలంబు విని నిఖిలనిశాచరులు నిక్కడక్కడఁ గడవ నప్పుడు సంభ్ర
మాకులలోచనుం డై దశముఖుం డమాత్యుల నవలోకింప నందు వృద్ధమంత్రి
యు మాతామహుండును నైనమాల్యవంతుం డి ట్లనియె.

408

మాల్యవంతుఁడు రావణునకు నీతిమార్గము చెప్పుట

తే.

అఖిలవిద్యల శిక్షితుఁ డై సమస్త, నీతికళలందుఁ దుదముట్ట నేర్పు గలిగి
వలను దప్పక వర్తించువాఁడు పగఱ, గెలుచుఁ బొలుచు నైశ్వర్యంబు గలిగి వెలుఁగు.

409


క.

సంధియు విగ్రహమును దశ, కంధర తఱి యెఱిఁగి చేఁత కార్యం బగు నా
సంధికి నర్హులు సములును, బంధురబలయుతులు వారు పార్ష్ణిగ్రాహుల్.

410


క.

అధముఁ డనవలదు శత్రుం, డధికుఁడు విగ్రహము గొన్నయప్పుడు మన కే
విధమున సందియ మే ల, ధనుర్ధరుతోడిపగ కడింది దలంపన్.

411


క.

సురమునిగంధర్వాదులు, పరికింపఁగ ధర్మపక్షపాతులు వా రా
నరనాథుజయమ చూతురు, ధరణీసుత నిచ్చి పుచ్చఁ దగు మన కింకన్.

412


వ.

మఱియు నొక్కవిశేషంబు సెప్పెద నాకర్ణింపుము.

413


క.

ధర్మంబు సురలకొఱకు న, ధర్మం బసురులకు నై పితామహుఁ డాదిన్
నిర్మించినాఁడు దత్త, త్కర్మము లిరుగడలవారిఁ దగ రక్షించున్.

414


క.

మనుజులు దివిజులపక్షము, మన మసురలదెసయు నగుట మనకు నధర్మం
బును వారికి ధర్మంబును, ననిశము విజయమును జేయు నమరారాతీ.

415


క.

ధర్మంబుచేతఁ బొలియు న, ధర్మము గృతయుగమునం దధర్మమునం దా
ధర్మము దెగుఁ ద్రేతన్ యుగ, ధర్మ మెఱుఁగవలయు నీతితత్త్వజ్ఞు లిలన్.

416


క.

వ్యసనాసక్తుఁడ వై రా, క్షసవల్లభ నీవు మఱపు గైకొనుట దివౌ
కసులకు విచ్చలవిడి నిం, పొసఁగుచు జన్నములు సేయుచున్నారు మునుల్.

417


క.

హోమానలమునఁ బొడమిన, ధూమంబులు దెసలు గప్పి దోషాచర తే
జోమాలిన్య మొనర్చెడి, జీమూతావళులచెలువు సేసెడిఁ గంటే.

418


ఆ.

అధ్వరంబు లిప్పు డఖిలమునీంద్రులుఁ, దఱుచుగా నొనర్పక ధర్మ మెచ్చె
సందియంబు వలదు జయ మవశ్యము గల్గు, ధర్మవర్తి యైనదాశరథికి.

419

తే.

నీరజాసను మెప్పించి నీవు గన్న, వరము లనిమిషాసురయక్షవరులవలన
భయము లేకుండ నంతియ పంక్తివదన, కపుల నృపులచేఁ జాకుండఁగాదుసుమ్ము.

420


క.

నాకుం జూడఁగ విష్ణుఁడు, లోకము రక్షించుకోఱకు లోలత రఘురా
మాకృతి గయికొన్నాఁ డటు, గా కున్న మనుష్యు లబ్ధిఁ గట్టెడువారే.

421


వ.

అట్లుం గాక.

422


సీ.

జంతువు లొం డొండు జాతుల నీనుట, పెల్లు గర్జిల్లుచుఁ బెనుమొయిళ్లు
నెత్తురు గురియుట నిష్ఠురంబుగ శారి, కలు రొదసేయుట గములు గట్టి
నక్కలు నెలవుల నగరవీథులఁ బట్ట, పగలు వాపోవుట బలులఁ గాకు
లంటకుండుట గూబ లంతఃపురంబులు, సొచ్చుట సేనలు సొంపు చెడుట
గలిగియున్నది మఱియు నుగ్మలియొకర్తు, శాతదంష్ట్రలు బభ్రుకేశములుఁ గృష్ణ
దేహమును నట్టహాసప్రదీప్తముఖము, నగుచు లంకలోఁ దిరిగెడు నట్లు దోఁచు.

423


క.

వికటఘనపిశంగాక్షుం, డొకముండితశీర్షదేహుఁ డోడక యింటిం
టికి వచ్చి తొంగి చూచి వె, దకినం బొడలేక యడఁగు దశముఖ వింటే.

424


వ.

ఇట్టిమహోత్పాతంబు లనేకంబులు పుట్టుచున్నవి వృథావిరోధంబు విడిచి
నావచనంబు లవధరింపుము.

425


శా.

లంకారాజ్యము సేయుచున్ జగము లెల్లం దల్లడిల్లన్ నిరా
తంకక్రీడల నుండి యుండి పరకాంతం దెచ్చి తీకార్య మే
వంకం గీ డిది యేల పుచ్చు మరలన్ వైదేహి నీ కుండితే
నింకన్ నీదుకులాబ్ధిపై నిగుడుఁ జుమ్మీ రామునుగ్రాస్త్రముల్.

426


క.

అని పలికి యతనిబొమముడి, గనుఁగొని మఱి యొండుఁ బలుకఁగా నోడి దశా
నన ముదుకఁ గాన మదిఁ దోఁ, చిన చందం బగునొ కాదొ చెప్పితి నీకున్.

427


క.

నావుడు నాఖలుఁ డిట్లను, నావిక్రమ మింద్రుఁ డెఱిఁగినం జాలు బలే
నీ వింక నొండు పలికిన, నావలనన్ మాన్యుఁ డైన నగుము సహింపన్.

428


క.

జడనిధి గట్టుటయును నొక, కడిమియ యని పగఱ నింతగాఁ జెప్పిన నే
విడుతునె సీతఁ దగవు ని, న్నడిగితినే నోరికొలఁదు లాడెద విచటన్.

429


క.

జనకుఁడు వెడలం దోచిన, వనమునకుం గడిమి విడిచి వచ్చినవాఁ డా
మనుజుం డటె రక్షోనా, థు నెదుర్చు సురాసురేంద్రదుర్జయు నన్నున్.

430


వ.

అని పలికిన మాల్యవంతుండు నిరుత్తరుం డై కొండొకసేవునకుం గొలువు వెడలి
మందిరంబునకుం జన రావణుండు నమాత్యసమ్మతిం జతుర్థోపాయంబ కార్యం
బనునిశ్చయంబున ననేకానీకంబులతోఁ బురంబు తూర్పువాకిటికిం బ్రహస్తుండు
దక్షిణద్వారంబునకు మహాపార్శ్వమహోదరులును బడమటిగవనికి నింద్రజిత్తు
నుత్తరగోపురంబున నేను మీరు ననుచు శుకసారణులం బలికి మధ్యమస్కంధం
బునకు విరూపాక్షునిం బనిచి నిజనికేతనంబున కరిగె నంత నక్కడ రఘుపుంగ

వుండు సుగ్రీవప్రభృతులుం దానును మంత్రాలోచనంబు సేయునవసరంబునఁ
బ్రసంగం బగుటయు విభీషణుం డి ట్లనియె.

431


తే.

మూఁడులోకంబులకు నెడ్డముల్లువోలె, నున్నదశకంఠురక్షచే నొప్పు మిగిలి
దివిజదనుజదుస్సాధ మై తేజరిల్లు, చుండు లంకానగర మప్పురోత్తమమున.

432


క.

అఱువదిలక్షలు రావణు, నుఱుబాహుబలంబువీరు లొగి నాలములం
గఱకెక్కినారు వారం, దఱు మూలబలంబుదొరలు ధరణీనాథా.

433


తే.

కరులుఁ దేరులు వాజులుఁ గాల్బలంబు, వేయుఁ బదివేలు నిరువదివేలు లక్ష
వేలు గలలెక్కప్రో వది వినుము సార్ధ, కోటిభటులును గోటానఁగోటు లధిప.

434


క.

తక్కిననాయకబలమును, లెక్కింపఁ బితామహుండు లేఁ డనఁ దగుచుం
గ్రిక్కిఱిసి యుండుఁ బురిలో, దిక్కులఁ దమయంత నుప్పతిల్లినభంగిన్.

435


క.

అం దెంతబలము గలిగిన, నెందఱు రథనీశు లున్న నే మగు నీ చే
నందఱతోఁ జను నాసం, క్రందసరిపుఁ డనుజుఁ డైనఖరునిం గూడన్.

436

విభీషణమంత్రులు రావణువృత్తాంతంబు రామునకుం జెప్పుట

వ.

అని చెప్పి నామంత్రులు లంకకుం జని వే గరసి వచ్చిరి రావణుండు సమరంబు
సేయువాఁ డై దుర్గరక్షణం బొనర్చుకొనియున్నవాఁ డత్తెఱంగు మీకు సమ్ము
ఖంబున నవధరింతురు గా కనుచు నయ్యనలసంపాతిప్రముఖుల నలువురం దెచ్చి
ముందటం బెట్టుటయుఁ బ్రణతు లై కేలు మొగిచి వార లి ట్లనిరి.

437


శా.

దేవా దేవరబంటు వేగు పనుపన్ దేవారివీ డొక్కమా
యావిద్యాగతిఁ బక్షిరూపములు నొయ్యం జొచ్చి యే మాదశ
గ్రీవుం డున్నతెఱంగు నందుఁ గలవారిం దత్పురద్వారర
క్షావిన్యాసముఁ జూచి వచ్చితిమి విస్పష్టంబుగా నంతయున్.

438


వ.

అవ్విధం బవధరింపుము.

439


ఉ.

బుద్ధులు మాల్యవంతుఁ డొగిఁ బోలఁగఁ జెప్పిన మండి నీ వసం
బద్ధపుమాట లాడిన నృపాలతనూభవ నేను బుత్తునే
యుద్ధ మొనర్తుఁ గా కనుచు నుద్ధతుఁ డై యతఁ డున్నవాఁడు స
న్నద్ధపదాతివాజిరథనాగసమాకులసైన్యకోటితోన్.

440


శా.

గర్వస్ఫూర్తులు కాలమేఘములు నా గర్జిల్లుచున్ రాక్షసుల్
దుర్వారోద్ధతిఁ బంతముల్ పలుకఁగాఁ దోరంపుసైన్యంబుతో
నుర్వీచక్రము మ్రింగిపుచ్చు ననున ట్టున్నాఁడు లంకాపురీ
పూర్వద్వారమునం బ్రహస్తుఁడు ముదంబుం జేవయుం జూపుచున్.

441


క.

పురిదక్షిణంపువాకిట, ధరణికి వేఁ గైనయట్టిదారుణదర్ప
స్ఫురణ మహాపార్శ్వమహో, దరు లనువా రున్నవారు దళములతోడన్.

442


చ.

కడిఁదిమగంటిమిం దొడరి కయ్యమునం దనబాహుదర్ప మే

ర్పడ నమరేంద్రుబాడుదల పట్టినరావణి రోషదీప్తుఁ డై
[35]విడిపడి మించు మంచిపటువిక్రమసంపద సొం పెలర్పఁ గాఁ
బడమటిదిక్కువాకిట నపారబలంబులతో వెలింగెడున్.

443


ఆ.

అమితబలసమేతు లయి శుకసారణు, లుత్తరంపుగవని నున్నవారు
దశముఖుండు నంద తా నుండువాఁడుగా, నిశ్చయించినాఁడు నృపవరేణ్య.

444


క.

లక్షలుఁ గోటులు గుము లై, రక్షోనాయకులు గొలువ రభసమున విరూ
పాక్షుఁడు గర్జిల్లెడు రణ, దీక్షితుఁ డై మధ్యమప్రదేశమునఁ బురిన్.

445


వ.

అని పలికి నిశాచరవీరులసమరసన్నాహప్రకారంబు విన్నవించిన.

446


క.

అతనికి నీతఁడు దగువాఁ డితనికి వాఁ డెక్కు డతని కీ డగు నాకు
త్సితునకు నీ డగు నని యా, యతబలు లందఱును నోర్తు మని తలఁచి తగన్.

447


సీ.

నిష్ఠురబలశాలి నీలుఁ డాదుర్మదాం, ధుఁడు ప్రహసుఁడు గాచు తూర్పుగవని
నతివీరభంగదుఁ డంగదుఁ డమ్మహా, పార్శ్వాదు లెసఁగునవాచిగవని
ససహాయశూరుండు హనుమంతుఁ [36]డయ్యింద్ర, జితుఁడు నిలిచెడుపశ్చిమపుగవని
ననుజుండు నేను నకయ్యఖిలలోకద్రోహి, దశకంఠుఁ డుండునుత్తరపుగవని
వనచరేంద్రజాంబవద్విభీషణముఖ్యు, లైనమేటిదొరలు నఖిలబలము
వీటిచుట్టుఁ గలయ విడియుద మంచును, నృపవరేణ్యుఁ డనికి నిశ్చయించె.

448


వ.

ఇట్లు కృతనిశ్చయుం డగుచు సుగ్రీవదశగ్రీవానుజులం జూచి సువేలాధిరోహ
ణంబు చేసి లంకఁ గలయం గనుంగొనవలయు నీరాత్రి దీని నెత్తంబునం
బుత్త మనుచు నధిజ్యశరాసనుండై లక్ష్మణుండును సుగ్రీవవిభీషణజాంబవదాంజ
నేయగజగవయగవాక్షగంధమాదనశరభశతవలిసుషేణదుర్ముఖప్రముఖు లైన
వలీముఖయూథనాథులు దమతమబలంబులతోడను గొలిచిరా నమ్మహీధరోత్త
మం బెక్కె నాసమయంబున.

449


మ.

అట మిన్నందినకొమ్మలుం గలిగి గర్జాడంబరం బంబర
స్ఫుటనాభీలముగాఁ దటిద్భహుళ మై సొం పారునీలాంబుభృ
త్పటలంబో యన వప్రచక్రమునఁ బైపై నార్చుచుం గైదువు
ల్చిటిలం ద్రిప్పుచు నొప్పురక్కసుల నోలిం గాంచి రవ్వానరుల్.

450


వ.

అట్లు గాంచి భూనభోంతరాళం బద్రువ నార్చుచుం గలయ నవలోకించి.

451


తే

రజనిచరదుర్ణయార్జితరాజ్యలక్ష్మి, [37]దొడిమ లేక వ్రేలుచు వెలింగెడు బెడంగొ
కాక ముక్కంటి గెలిచిన కడిఁదిపురము, లొక్కవీడుగ దశకంఠుఁ డెక్కినాఁడొ.

452


శా.

ఈలంకాపురిక్రిందు దారి రవితే రేతేఁ బురచ్ఛాయ దాఁ
బోలం జొప్పడెఁ గాక మింట నొకవేల్పుంబ్రోలు నాఁ బోలునే
సాలం బింతవిశాలముం బొడవునే సౌధావళీగోపుర

వ్యాలోలధ్వజచిత్రతోరణమహాయంత్రాదు లి ట్లొప్పునే.

453


ఉ.

నేఁటికి నొప్పుఁ గాక రజనీచరువీ డెటు లైన నెల్లి పో
దాఁటి కవాటముల్ విఱుగఁ దాఁచుచుఁ జేతులతీఁట వోవ మై
తీఁటలు పుచ్చి రక్కసులఁ దీర్చుట రాముఁ డొనర్పనున్న పె
న్వీఁటకు రావణాదిమృగబృందము దార్చు టటంచు నార్చినన్.

454


క.

వనజభవాండము సంధులు, కనుకని బి ట్టవిసె నపుడు ఖరకరుఁడు నభం
బున నుండ నోడి క్రిందికిఁ, జనుచుండెడుభంగి నపరజలనిధిఁ గ్రుంకెన్.

455


చ.

అవిరళతారకానిబిడహారము లోలి ధరించి చంద్రికా
ధవళవినూతనాంబరము దట్టము గాఁగ ముసుంగు పెట్టి కై
రవమధురస్మితం బమర రాత్రివిలాసిని యొప్పె శీతరు
క్ప్రవిమలరత్నదీపమును గల్గునజాండనికేతనంబునన్.

456


క.

ప్రకటసుధాంశుగ్రహతా, రక మై యొకమిన్ను మింట రాయుచు నున్న
ట్లొకలంకయుఁ బాతాళము, నకుఁ గల్గినమాడ్కి నబ్ధి నడుమం దోఁచెన్.

457


వ.

అంత నంశుమంతుం డుదయాచలంబు నలంకరించుటయు ననుచరు లయినవన
చరులు దమతమయూథంబులం దలకడచి లంకాపురంబునుపవనంబులకుం గవిసి.

458


క.

మిడుతగమి గవియుతఱుచునఁ, బొడనీడలు నెండతునియప్రోవులుఁ గలయం
బుడమిం దిలతండులగతిఁ, బడఁగా నుడువీథినుండి పఱచిరి పెలుచన్.

459


తే.

ఇనకులీనుఁడు వర్ణసమేతుఁ డగుచు, యోజనద్వయవృత్తమై యొప్పునగ్ర
శిఖర మెక్కి వెలిఁగె లంకచేటుతఱికిఁ, గానఁబడునాగ్రహప్రతిభానుఁ డనఁగ.

460


వ.

ఆసమయంబున.

461


చ.

కపులు ఫలోపజీవితులు గావున వారికి నాశ్రయంబు లం
ఘ్రిపముల యంచు రావణుఁ డొగిం బెనుఁజిచ్చులు వైవఁ బంచె నా
నుపవనపాదపావళుల నుత్థితషట్పదరాజితోడ ద
ట్టపుఁజిగురాకు లెల్లెడ నెతడం గనుపట్టెఁ బురంబుచుట్టునున్.

462


క.

వనచరసేనాలోకన, మున కచ్చర లట విమానముల వచ్చిరి నా
ఘనచుంబిసౌధవలభులఁ, గనకరజతసాలభంజికలు పొరిఁ దోఁచెన్.

463


ఆ.

మర్కటధ్వనులకు మాఱు సెలంగుచు, నున్నకొండగుహల నుండ నోడి
పొడవు లెక్కె ననఁగ గుడులపైఁ బసిఁడిసిం, గంపుఁగొదమ లొగిన కానఁబడియె.

464


మ.

పరదారవ్యసనంబునం దలఁపు నాపైఁ బెట్టఁ డీపంక్తికం
ధరుఁ డిం కేటికి నాకు నీతఁడు భయార్తత్రాణకేళీధురం
ధర భూవల్లభ యవ్విభీషణ ననాథం జేయ ర మ్మంచుఁ ద
త్పురి చేసన్నలు సేసిన ట్లమరె నుద్ధూతధ్వజశ్రేణికల్.

465


వ.

అప్పు డప్పురంబునం గలవిశేషంబులు సవిశేషంబుగా నెఱుంగం దలంచి విభీష

ణు నవలోకించిన నన్నరేంద్రున కతం డి ట్లనియె.

466


ఉ.

ఇమ్మెయి నూఱుయోజనము లీనగశృంగమున గ్రభూమియం
దిమ్ముగ విశ్వకర్మ రచియించెఁ గనత్కలధౌతహేమసా
లమ్ములఁ జిత్రగోపురములన్ మణికల్పితమందిరాధిరా
జమ్ముల వింతశిల్పముల జా నగునీనగరీలలామమున్.

467


క.

రమణీయరత్నములరుచి, నమరెడునది పంక్తికంఠునగరు నృపాలో
త్తమ యది దశయోజనవృ, త్తము వింశతియోజనాయతము నై యొప్పున్.

468


సీ.

ఉడురాజబింబంబు నుల్లసమాడెడు, ముక్తాతపత్రముల్ ముసుఁగువడఁగ
వెన్నెలఁ జల్లెడువింజామరంబులుఁ, గంకణఝంకృతుల్ గలయఁ బొలయ
గగనమణిస్ఫూర్తి గని మాఱుమండెడు, కోటీరరత్నముల్ కొమరుమిగుల
మెఱుఁగులదిక్కుల మిఱుమిట్లుగొలిపెడు, కైదువుల్ విస్ఫులింగముల నుమియ
మేచకాంబుద మెఱసంజు మెఱసినట్లు, చెందిరపుఁజాయపట్టులఁ జెలువు మించి
యుత్తరపుగోపురంబున నున్నవాఁడు, వాఁడె దశకంధరుఁడు రఘువంశవర్య.

469


ఉ.

వానరసేనఁ జూడ నదె వచ్చినవాఁ డని చెప్ప నప్డు లో
లోనన గుబ్బతిల్లుశిఖిలోపల నాజ్యము వోసినట్టు లై
భానుసుతుండు మండి గిరిపాఁ తగలన్ వెస దాఁటె మేఘసం
తానము దూల వజ్రపతనక్రియ నాదశకంఠుమీఁదికిన్.

470

సుగ్రీవరావణులమల్లయుద్ధము

ఆ.

దాఁటి యతనియురము దాఁచినమణులు న, ల్గడలఁ జెల్ల చెదరుఁ గాఁగ మకుట
పంక్తి విఱుగఁ జఱిచి పద్మభవాండంబు, సెలఁగునార్పుతోడ నిలకు నుఱికి.

471


ఉ.

లావున దుర్మదంబు వెడలన్ నిను నాఁ డటు వాలబంధనం
భావనఁ జేసి పుచ్చిన సమగ్రభుజాబలు వాలి నాసమి
త్కోవిదు నొక్కతూపునన కూల్చినరామునిబంట నేను సు
గ్రీవుఁడరా దురాత్మ రణకేళికి డిగ్గుదు గాక నావుడున్.

472


క.

కూటము లురునిర్ఘాతము, పాటున భగ్నంబు లైనపర్వతముగతిం
గోటీరరహితుఁ డగుచు ని, శాటుండును నిలకు నుఱికె నలుకం జులుకన్.

473


క.

ఉఱికి భుజాయుద్ధమునకుఁ, దఱిమినఁ గయిదువులు విడిచి దట్టించుచు బి
ట్టఱచేత నెత్తిఁ జఱిచిన, నొఱగి యెఱఁగి యతఁడు నతనియురుమస్తకముల్.

474


లయవిభాతి.

వడిఁ జఱువ నెత్తురులు వెడలి ముఖరంధ్రములఁ 6 గడలుకొన జు మ్మనుచు నొడలు వడఁగాడం
బడ కతఁడు పాదుకొని కడునలుకతో బొమలు ముడివడఁగఁ గన్గవల మిడుఁగుఱులు రాలం

గడఁగి తనచేగమికిఁ దొడిఁబడఁగఁ బట్టుకొని పొడవుగను నెత్తి బలుకవిడిఁ గుదియ వైవం
బడి మఱియు బంతికయివడి నెగసి త న్నురము బెడిదముగఁ దాఁచి చనునెడఁ బొడిచె ముష్టిన్.

475


క.

పొడిచినఁ జిఱ్ఱన దిరిగెడు, వడితోడన యాప్లవంగవరుఁడు పొడిచి వీ
డ్వడఁ దిరిగె వాల మహిపతి, వడువునఁ గవ్వంపుగిరిజవం బొప్పారన్.

476


క.

అప్పుడు పదఘట్టనముల, చప్పుడు బా హప్పళించుచప్పుడుఁ బె ల్లై
నొప్పించుకఠిననిహతుల, చప్పుడుఁ జెవుడుపడఁ జెలఁగె సంరంభముగన్.

477


చ.

బలువడి లాఁగులం బెనంచి $ పట్టుచుఁ బట్టిన నూడిపోవుచున్
మలయుచుఁ దాకుచుం దిరిగి మర్మము లంటఁగ వ్రేయుడున్ మహీ
స్థలిఁ బడఁ దాఁచుచుం గదియ జానువు లూచుచు ముష్టికూర్పరా
దుల వడి నొంచుచుం గడఁకతో నిటు లొండొరు మీఱి వెండియున్.

478


చ.

చిత్రగతిం బెనంగి రిలఁ జెందుచుఁ గ్రిందును మీఁదు నౌచుఁ గ్రొ
న్నెత్రు ధరాపరాగముల నిల్ప ముహుర్లుఠదుత్పతత్పత
ద్గాత్రములందుఁ బెంజెమరు గ్రమ్మఁగ నూర్పులు సందడింప గో
మూత్రకమండలీకరణముల్ మొదలైనవిశేషభంగులన్.

479


వ.

ఇట్లు పెనంగి మఱియు మత్తదంతావళంబులకైవడిఁ గెరలి తాఁకుచు బెబ్బులుల
తెఱంగునం బొంగి మ్రోఁగుచుఁ గసిమసంగినసింగంబులభంగి లంఘించి వ్రే
యుచు నుగ్రశరభంబులపరుసున బెరసి నెత్తురులు రేఁచుచుఁ బ్రచండభేరుండం
బులపగిది నెగసి పోవుచు విలయవలాహకంబులవిధంబున మీఁదఁ గ్రింద వడిం
బడి సుడిపడుచు నాఖండలుం డెఱుంగనికొండలకరణి మగుడ ధరణిం బడుచుఁ
మహానాగంబులలాగునం బెనంగొని రోఁజుచు నతులగతుల మల్లయుద్ధవైద
గ్ధ్యంబు నెఱయ మెఱయుసమయంబున.

480


శా.

శుష్కీభూతము లైనకంఠబిలముల్ జొత్తిల్లఁ బైపై నసృ
ఙ్నిష్కాసంబులు సెల్ల నార్పులు వడి న్భేదింప రాకుండ మ
స్తిష్కోద్గారము వీను లీసికొన నుద్వృత్తిన్ వడిం బోరి రా
కిష్కింధాధిపపంక్తికంధరు లధిక్షేపంబు లే పారఁగన్.

481


వ.

ఇట్లు పోరిపోరి దగలు మిగిలినం బాసి నిలిచి రంత నినసుతుం డతనిం గనుగొని.

482


ఉ.

వంచన రాముదేవిఁ గొని వచ్చినయట్టులు గాదు రోరి న
క్తంచర నన్ను నాహవముఖంబున డాయుట లన్న నయ్యరే
క్రించ సహోదరుం గరముఁ గీడ్పడి మానవుచేతఁ బొంచి యే
యించుట గాదు లే నను జయించుట నీకు నటంచు నవ్వినన్.

483

క.

అగు నింక మావిభీషణు, తగవును నివ్విధమ యంచుఁ దఱిమినఁ బై పై
మగుడఁ దలపాటు వ్రేటును, నగపాటును బోటు నాటు నై యని సెల్లన్.

484


వ.

మున్ను గలంగి తొలంగి యున్నయాతుధాను లందఱుఁ గూడుకొని.

485


శా.

వీఁ డావానరసేనకుం బతి మహావీరుండు సుగ్రీవుఁ డ
న్వాఁ డీయొక్కఁడు పట్టువడ్డ మనపై వా రెవ్వ రేతేర రె
వ్వాఁడుం దక్కక తాఁక రం డనుచు నార్వన్ నవ్వి కార్యంబుమై
వాఁ డై యక్కపిరాజు దాఁటె దివి మోవంగా సువేలాద్రికిన్.

486


మ.

మగుడఁగ దాఁటి నిల్చి తను మర్కటు లచ్చెరువంది చూడఁ గే
ల్మొగిచిన భూవిభుండు ధృతి మున్ను గదల్చినసందియంబు పో
నెగిచి ముదంబుతో నతని నిమ్ములఁ గౌఁగిటఁ జిక్కఁ జేర్చె మె
చ్చుగ రణధూళిసమ్మిళితశోణితపంకము వక్ష మంటఁగన్.

487


ఉ.

ఇట్టులు గారవించి మది నెవ్వరు నీయసహాయసాహసం
బిట్టులు సేయఁగాఁ దలఁతురే యవిచారితకర్మ మందు నీ
కెట్టులు సెల్లెనో యనుచు నేము దలంకఁగ నీవు నాకు నై
యట్టులు సిక్కినం బిదప నయ్యెడుమే లది యేల చెప్పుమా.

488


ఉ.

అక్కడ నీకుఁ గీ డొదవినట్టిద యైన సబాంధవంబుగా
రక్కసుఁ జంపి రాత్రిచరరాజ్యవిభూతి విభీషణుండు పెం
పెక్క నయోధ్య మాభరతుఁ డేలఁగ నే నియమించి దేహముం
దక్కెడువాఁడ నైతి నుచితస్థితి వేగిరపాటు లొప్పునే.

489


క.

నావుడు ని ట్లను నాసు, గ్రీవుఁడు నరనాథ మీరు గినిసిన నా కా
దేవద్రోహిం గని రో, షావేశము రాక యున్నె యె ట్లయినఁ దుదిన్.

490


వ.

అనిన విని సంతోషించి యారఘుపుంగవుం డంత లక్ష్మణుం గనుంగొని యింక
లంకమీఁదఁ దడయక విడియవలయు వివిధప్రకారంబుల సురమునుల కప
కారం బాచరించునక్తంచరులనాశంబునకై మహోత్పాతంబులు వొడముచున్న
యవి కృష్ణరక్తపరివేషభీషణంబును బరిస్ఫురితతారకంబును నగుమార్తాండ
మండలంబువలన మంటలు దెగిపడియెడు ననేకరాక్షసరూపంబులు గయికొని
మేఘంబులు నెత్తురు సిలికెడుఁ బ్రపాతవేగంబున నగశృంగంబులు విఱిగికూలెడు
దీనకరాభిముఖంబు లగుచు సృగాలంబులు వాపోయెడు నిట్టిదుర్నిమిత్తంబులు
గానంబడుటయ కాక నాకు నాంగికంబులు నాస్త్రిక్యంబులు నగుశుభసూచకం
బు లెన్ని గల వన్నియుం గలిగియున్నయని మనకు జయం బవశ్యంబు నగు నను
చు నయ్యచలంబు డిగ్గి సన్నద్ధకవచుండును గాంచనసూత్రనిబద్ధతూణీరుండును న
ధిజ్యధనుర్ధరుండును బాణపాణియు నై తాను ముంగలను సుగ్రీవవిభీషణులు గె
లంకులను సైన్యంబునడుమను సుమిత్రానందనుండు పిఱుందను జాంబవత్ప్రము

ఖయూథాధిపతులు చుట్టునుగా నడిచె నప్పుడు.

491


మహా.

బలపాదోద్ధూతధూళీబహుళపటల మస్పష్టదిగ్భాగ మయ్యున్
వలమానోత్తాలవాలవ్యజనవిరళ మై వంత మి ఱ్ఱేర్పడం జూ
డ్కులకుం బంటించున ట్లై కొని నిగిడి పురీగోపురోత్తుంగసౌధా
లి లలిం గప్పెం దదభ్రోల్లిఖిశిఖరమణు ల్మిన్కుమిన్కంచుఁ దోఁపన్.

492

,

వ.

ఇట్లు ధరాపరాగనిరంతరరోదోంతరంబుగా నడచునన్నరేంద్రుతోడం గూడ
దుర్వారవేగంబున.

493


చ.

ఉరుతరవాలభోగుల భుజోర్ముల నొప్పుచుఁ బొంగి మింటితో
నొరయుచుఁ బెల్లు దిక్తటము లొత్తుచు నద్రుల భూరుహంబులం
బొరిఁబొరిఁ గూలఁ ద్రోచికొని పోవుచు నంతయు ముంచికొంచు న
చ్చెరువుగఁ బోయి వెల్లివిరిసెం గపివాహిని లంకచుట్టునున్.

494


క.

అప్పుడు పదియోజనముల, విప్పున గాడ్పునకు దుష్ప్రవేశం బనఁగా
నప్పురము దిరిగి రాముని, చెప్పినకందువల నట్లు సేకొని విడియన్.

495


వ.

రఘుపతినియోగంబున లక్ష్మణవిభీషణు లయ్యైవాకిళ్లు నిలువ నీలునకు మైంద
ద్వివిదుల నంగదునకు ఋషభగజగవయగవాక్షగంధమాదనులను హనుమంతు
నకుఁ బ్రమాధిప్రజంఘులను గోటికోటిసంఖ్యాకంబు లైనకపిసైన్యంబుల
తోడఁ దోడుగా విడియించి మఱియును దగినయెడల వలయువలీముఖవీరులం
జాలించుచు నింద్రజిద్రావణరక్షితంబు లగుగవంకులకు మధ్యంబున మధ్యగుల్మం
బున సుపర్ణానిలసమానబలసంపన్నులు ముప్పదియాఱుకోట్లు యూథాధిపతులు
బలసి మలయ సుగ్రీవజాంబవంతుల నునిచి తారు ననేకానీకంబులు మెఱయ ను
త్తరద్వారంబున నరేంద్రుకెలంకులఁ గడిమిం బొలిచి నిలిచి రాసమయంబున.

496


సీ.

దుర్వారకల్లోలగర్వితాంబుధితోన, రాక్షసాంగనలగర్భములు గలఁగ
బొరిఁ ద్రికూటాద్రిగహ్వరములతోన న, క్తంచరభటులడెందములు పగుల
[38]నురగేంద్రదుర్భరధరణీభరముతోన, లంకాపురంబుసాలములు వడఁక
నస్తోకతరతారకస్తోమములతోన, గోపురంబులమణుల్ గుప్పగూల
బిట్టురవితేరిహరులు నిట్టట్టుఁ బఱవ, దిగ్గజంబులు బెగడంగ దెసలసంధు
లవియ రోదోంతరాళంబు సెవుడుపడఁగ, వీఁకమై నార్చి రందంద వృక్షచరులు.

497


తే.

ఆర్చి గిరిశిఖరంబులు నంఘ్రిపములుఁ, గొనుచుఁ గదియ రక్కసులును గుంతఖడ్గ
కార్ముకప్రముఖాయుధకలితభుజులుఁ, గవచధారులునయి కోటఁ గలయనలమ.

498

అంగదునిరాయబారము

వ.

అప్పుడు రఘుపుంగవుండు రాజనీతివిద్యావిశారదుఁ డగుట విభీషణానుమతి

నంగదుం బిలిచి నీవు రావణుసమీపంబునకుం బోయి నావచనంబులుగా నతని
తోడం బలుకునప్పలుకులు విను మనుచు ని ట్లనియె.

499


మ.

కడిమిం బోరికి శూరతం గడఁగి రా కాదేని వైదేహి నేఁ
గడవం దెచ్చితిఁ దప్పు గావు మని లంకారాజ్య మొప్పించి వె
ల్వడి ప్రాణంబులు గాచికొంచు దివిజు ల్సంతోషముం బొంద నె
య్యెడ కైనం జను మావిభీషణుఁడు రా జివ్వీటికిన్ రావణా.

500


చ.

కపటము పన్ని జానకి నకల్మషఁ దెచ్చినయట్టిపాపక
[39]ర్మవుఁబొడువం దనూజహితమంత్రిసమేతముగా దశాస్య మ
ద్విపులశిలీముఖజ్వలనదీర్ఘతరార్చుల నేర్తు నిన్ను నీ
తపమున కట్లు [40]మెచ్చినవిధాతృఁడు వచ్చిన నెందుఁ జొచ్చినన్.

501


వ.

అనిన విని తారానందనుండు తారాపథంబున కెగసి రెండవవైశ్వానరుండునుం
బోలె మండుచుం జని నిశాచరు లచ్చెరు వంది చూచుచుండఁ బౌలస్త్యునాస్థాన
మంటపంబున డిగ్గి సాహంకారుం డగుచు నాదశకంధరు నవలోకించి.

502


చ.

చెఱ నిడి నీమదం బడఁగఁ జేసినయర్జునువేయిచేతులు
నఱకి భుజావిజృంభణమునందుఁ బేర్చినజామదగ్న్యువిల్
విఱిచిన రాముబంట వినవే నను నంగదు సర్వగర్వమున్
నెఱి సెడ నాల్గువారిధుల ని న్నటు ముంచినవాలిపుత్రుఁడన్.

503


వ.

అని పలికి రఘువరుండు దనవచనంబులుగా నీతోడ నాడు మన్నవచనంబులు
వినుము.

504


మ.

కడిమిం బోరికి శూరతం గడఁగి రా కాదేని వైదేహి నేఁ
గడవం దెచ్చితిఁ దప్పు గావు మని లంకారాజ్య మొప్పించి వె
ల్వడి ప్రాణంబులు గాచికొంచు దివిజు ల్పంతోషముం బొంద నె
య్యెడ కైనం జను మావిభీషణుఁడు రా జివ్వీటికిన్ రావణా.

505


చ.

కపటము పన్ని జానకి నకల్మషఁ దెచ్చినయట్టిపాపక
ర్మపుఁబొడువం దనూజహితమంత్రిసమేతముగా దశాస్య మ
ద్విపులశిలీముఖజ్వలనదీర్ఘతరార్చుల నేర్తు నిన్ను నీ
తపమున కట్లు మెచ్చినవిధాతృఁడు వచ్చిన నెందుఁ జొచ్చినన్.

506


వ.

అని పలికిన.

507


శా.

భుగ్నభ్రూకుటిభీకరుం డగుచు నాస్ఫోటించి బాహార్గళా
లగ్నక్రూరతరోరుఖడ్గరుచిజాలంబుల్ గదావిస్ఫులిం
గాగ్నిజ్వాలలు గన్ను లీనికొన లంకాధీశుఁడుం గ్రోధని
ర్మగ్నుం డై వడి వీనిఁ బట్టుఁ డనఁగా రాత్రించరుల్ బల్విడిన్.

508

సీ.

నలువురు తనుఁ బట్ట నవ్వుచు నవ్వాలి, సుతుఁడును విక్రమస్ఫురణ మమర
నొక్కనిమెడ [41]వాల మురిపెట్టి యొక్కనిఁ, బెలుకుఱ డాకాలఁ బెనఁచి పట్టి
యిరుగేలఁ దక్కినయిరువురఁ గొని వాయు, వేగంబుమై నుడువీథి కెగసి
యందుండి ప్రాణము లంతరిక్షమునన, పోవునట్లుగ వారిఁ బుడమి వైచి
పరుషలీలఁ గులిశభగ్నహిమాచల, విపులశృంగపాతకవిధము దోఁపఁ
గొలువుమేడ విఱిగి కూలంగఁ దాఁచుచు, నరుగ మఱియు నద్దశాననుండు.

509


చ.

వెసఁ జని పోవ నీ కడరి వీని వధింపుఁ డనంగ రక్కసుల్
ముసలగదాధనుర్విశిఖముద్గరతోమరభిండివాలప
ట్టిసపరిఘాదు లొక్కురవడిం గొని చుట్టును ముట్టి నొంప న
య్యసమబలుండు ముష్టి కఠినాహతులం [42]బదతాడనంబులన్.

510


క.

బలువిడి మెఱయఁగ వక్షం, బులుఁ దలలుం బగలి వారికబొందులు సుడిగొం
చిలఁ గూలఁ జూచి వనచర, నిలు నిలు మని ఖరునికొడుకు నింగి సెలంగన్.

511


క.

సుఖరుం డనువాఁ డార్చుచు, ముఖమునఁ గ్రోధాగ్నిశిఖలు ముడివడఁగ శిలీ
ముఖపంచకమున నుదురు వి, శిఖదశకంబునను నురముఁ జేతులు నొంపన్.

512


ఉ.

వాలము ద్రొక్కఁబడ్డ ఫణివల్లభుకైవడి నల్గి వాని నా
భీలకఠోరముష్టిహతి భిన్నశిరస్కునిఁ జేసి శోకచిం
తాలసమానసుం డయి దశాస్యుఁడు సూడఁగ నేలఁ గూల్చి య
వ్వాలిసుతుండు వచ్చి రఘువంశ్యున కేర్పడఁ జెప్పె నంతయున్.

513


క.

చెప్పిన రాముఁడు కపివర, చెప్పినపనికంటే మిగులఁ జేసితి కార్యం
బిప్పగిదిఁ జేయ నొరులకుఁ, జొప్పడ దని పలికి రక్కసుల గెలుఁ డింకన్.

514


వ.

అనిన విని యుద్ధసన్నద్ధు లగుచుఁ గడంగి రంతఁ గుముదశతబలిసుషేణులు
పదియు నేఁబదియు నఱువదియును గోట్లు మర్కటభటులం గొని పూర్వపశ్చిమ
ద్వారంబులకుఁ ద్రోచి నడచిరి మఱియు బలసమేతుం డై పనసుండు కుముదుపి
ఱుందన తఱిమె సుగ్రీవుం డనేకయూథాధిపతులతో నుత్తరపుగోపురంబునకుఁ
గవిసెఁ గోటిగోలాంగూలవీరభటులు బలయ గవాక్షధూమ్రులును మంత్రి పరివృ
తుం డగువిభీషణుండును రఘువరుకెలంకు లలంకరించిరి గజగవయశరభగంధ
మాదనులు దిరిగివచ్చుచుం బురికొలుపఁ గపులు పాషాణపాదపాదుల నగడ్తలు
పూడ్వం దొడంగి రట్టియెడ రావణుండు సేనానాథులం గనుంగొని మీరును మీ
బలములతోఁ బురంబు వెడలి వానరులఁ బరిమార్చి రండు పొం డనుచు నియో
గించిన.

515


శా.

హేషాబృంహితనేమిదుందుభిముఖానేకధ్వనుల్ గ్రందుగా
భూషారత్నమరీచికానికర మంభోజాప్తదీప్తిచ్ఛటో

న్మేషాడంబరలీలఁ బ్రోవఁ బడగల్ మింటన్ బలద్విట్పురీ
యోషాహ్వానవిడంబనాగతిఁ గరం బొప్పారఁగా నయ్యెడన్.

516


సీ.

పృథులాంకుశంబుల బిగువులు డించినఁ, గొంకక జాడించుకుంజరములు
కింకిణుల్ మొరయ లంకియల కోడక మెండు, కొనుచుఁ గరాళించుకఘోటకములు
హస్తులగదురున కడరి నిల్వక క్రేళ్లు, సనుహయంబులమణిస్యందనములు
తేరికిఁ గరికిఁ బోఁ దెరు వీక హేవాక, కలితు లై కెరలు మొక్కలపుభటులు
నురువు లురువు వెడఁదనోళ్లతోడుత మోర, లెత్తికొనుచు వేఁదు ఱెత్తినట్టు
లుబ్బు రేఁగి యున్నయుష్ట్రములును సేన, కుగ్రలీలఁ జేయుచుండఁ గడఁగి.

517


మ.

బలధూళీపటలాంధకారము దిశాభాగంబునం బైపయిం
గలయం బర్వుచు శర్వరీవిభవముం గావింప నాభీలహే
తులు నానావిధవిస్ఫులింగములు ఖద్యోతాయమానంబు లై
వెలయం బెల్లునిశాచరుల్ వెడలి రుర్వీచక్ర మల్లాడఁగన్.

518


క.

వెడలి గజఘటలు గుఱ్ఱపు, దడములతండంబులును రథంబులగము లే
ర్పడఁగ భయంకరగతితో, నడర నజాండంబు తఱుచుటార్పులఁ బగులన్.

519

మొట్టమొదట వానరులకును రాక్షసులకు నయినసంకులయుద్ధము

సీ

ముసలగదాఖడ్గముద్గరతోమర, పరశుపట్టిసకుంతపరిఘచక్ర
భిండివాలాదులు పెన్నదరుల నీన, నట్టహాసంబులు నౌడుకఱచు
దంష్ట్రాలముఖములు దారుణగతిఁ జేయ, మృత్యుదేవత నైన మ్రింగిపుచ్చఁ
జాలుదు రనఁ జాలి చండభుజాదండ, విస్ఫూర్తు లెసఁగంగ వీఁకఁ దాఁకి
కడిమిఁ దమమీఁద బల్విడిఁ గపులు గురియు, విపులపాషాణపాదపవృష్టి దూల
నర్ధచంద్రభల్లంబు లందంద పఱపి, మిన్ను దెఱపి గావించుచు మెఱసి రపుడు.

520


క.

ఏసియు వైచియుఁ బొడిచియు, వ్రేసియు నిరుదెసలవారు వెస నని లీలం
జేసిరి విజయము గైకొను, నాసాసల సిద్ధచారణాదులు వొగడన్.

521


వ.

ఇట్లు యుగాంతవిఘూర్ణమానమహావర్ణంబుల గ్రేణిసేయుచుం బొంగి నిర్వ
ర్యాదంబుగా నిరువాఁగునుం గలయ బెరయ నందు నింద్రజితుం డంగదునిఁ బ్రజం
ఘుండు సంపాతిని జంబుమాలి హనుమంతుని మిత్రఘ్నుండు విభీషణునిఁ దపనుం
డు నలుని నికుంభుండు నీలునిఁ బ్రహస్తుండు సుగ్రీవుని విరూపాక్షుండు లక్ష్మణుని
నగ్నికేతురశ్మికేతుసుప్తఘ్నయజ్ఞకోపులు నలువురు రాముని వజ్రముష్టి మైందుని
నశనిప్రభుండు ద్వివిదునిఁ బ్రతపనుండు గజుని మహోదరుండు సుషేణుని మక
రాక్షుండు జూంబవంతునిఁ గుంభుండు ధూమ్రుని నరాంతకుండు పనసుని దేవాం
తకుండు గవాక్షునిఁ ద్రిశిరుండు శరభుని నకంపనుండు కుముదుని సారణుండు
ఋషభు నతికాయుండు రంభవినతులను ధూమ్రాక్షుండు కేసరిని శుకుండు వేగ
దర్శిని మహాపార్శ్వుండు గంధమాదనుని విద్యుజ్జిహ్వుండు శతబలినిం దలపడి

రింద్రజిత్తు గద వైవ నంగదుఁ డదియ కైకొని యమ్మేఘనాదురథకూబరంబు
విఱుగను రథ్యంబు లొఱగను సారథి సమయను నంకించి వైచెఁ బ్రజంఘుండు
బాణత్రయంబున నొంప సంపాతియుఁ బెనుమద్ది నాదోషాచరుం దొడిఁబడ
నడిచె జంబుమాలి కలితస్యందనుం డై శక్తి నురంబు రయంబునం దాఁకింప
హనుమంతుం డారథంబుమీఁదికి లంఘించి హస్తం బెత్తి క్రుంగం జఱిచె మిత్ర
ఘ్నుండు శితశరంబు లవయవంబులు గ్రుచ్చిన నొచ్చి విభీషణుండు ముసలంబున
నారాక్షసునివక్షంబు పగిలంచెఁ దపనుండు కులిశఘోరాస్త్రంబుల నంగంబు
జర్జరితంబు గావించిన నలుం డింద్రతరుతాడనంబున నాక్షపాచరుబాహుదండం
బులు చదిపె నికుంభుండు తరణికిరణంబుల విడంబించుసహస్రమార్గణి నడ
రింప నీలుండు నిజపాదహతిం బడినశతాంగచక్రంబు గొని తత్సూతుకంఠనా
ళంబు ద్రెంచెఁ బ్రహస్తుండు భల్లంబునఁ జేతిసాలంబు ఖండింప సుగ్రీవుం డత్త
రుశాఖాఖండంబున నయ్యాతుధానుమస్తకంబున మస్తిష్కంబు సూపె విరూపా
క్షుండు పుంఖానుపుంఖంబుగా నేయుచుం గదియ లక్ష్మణుండును రత్నచిత్రి
తంబు లగుశిలీముఖంబుల నన్నిశీథినీచరు వారించె నగ్నికేతురశ్మికేతుసుప్త
ఘ్నయజ్ఞకోపులు బహుప్రదరంబులు పఱప రామచంద్రుం డర్ధచంద్రాస్త్రం
బులు నాలుగింట నన్నలువురతలలు ద్రుంచె వజ్రముష్టి కరవాలంబున నం
సపీఠంబు విదళింప మైందుండు నయ్యామినీచరుం బిడికిటఁ బడఁబొడిచె నశని
ప్రభుం డురుశరంబులు నిగిడింప రక్తసిక్తశరీరుం డై ద్వివిదుం [43]డచలపాతంబున
నవ్విభావరీచరు సోలించెఁ బ్రతపనుండు శూలంబున బరివొడువ గజుండు
హింతాలంబున నారజనీచరు వెగడుపఱిచె మహోదరుండు నుదుట న
క్కున నారాచంబులు మూఁడునైదు నాటింప సుషేణుండు గండశైలంబున
నాత్రియామాచరుయఃగ్యంబులను రథచోదకునిం జదిపె జాంబవంతుండు
వృక్షక్షేపణంబునం గెరలింప మకరాక్షుండు చండకాండంబుల నాభల్లూక
పతిఫాలభుజామధ్యంబులు భేదించి యతనిచేత విరథుం డై తొలంగఁ గుంభుం
డు జముతెఱంగునం గసిమసంగి వనచరుల మ్రింగ ధూమ్రుం డద్రిశృంగ
ద్రుమంబుల నన్నిశాచరువిజృంభణం బడంచె నరాంతకుం డంపవాన గా
వింపఁ బనసుండు శమీతరువర్షంబున నన్నక్తంచరు ముంచె దేవాంతకుండు
బలుదెగ గొని కంకపత్రపంచకం బొక్కట దేహాంతరంబునం జొనిపి తన్ను
వీక్షించి వైచినమధూకంబు నెడ నేడుదుపులఁ దునిమి తొమ్మిదింట మర్మం
బు లంట నేయఁ [44]బంటింపక గవాక్షుండు శిఖరిశిఖరంబున నారక్కసు స్రుక్కిం
చెఁ ద్రిశిరుండు దోమరంబున శిరంబు నొప్పింప శరభుండు కనలి సప్తపర్ణం
బున నారాత్రించరుం డెక్కినకుంభికుంభస్థలం బవియించె నకంపనుండు పరిఘ

ప్రహారంబున నొప్పింప మోఁకాళ్లు నేల మోపం బడి రక్తలోచనుం డగుచుఁ
దోన యెగసి కుముదుండు కఠినముష్టి నాక్షపాచరు నిశ్చేష్టితుం జేసి చెలంగె స
మరసమాహూతుం డై భూరిభూరుహంబున ఋషభుండు వ్రేయం జేయునది లేక
సారణుండు నారిదెగినవింటితోడన పిఱిందికి నోసరించె నతికాయుండు సాయ
కపరంపరలు గప్ప రంభవినతులు పాషాణపాదపంబుల నమ్మహాబలుబలంబు
లం గూల్చిరి ధూమ్రాక్షుండు శింజిని మ్రోయించుచు బలుగోల లెసఁగింపఁ
గేసరి శిలాదారుపాతంబులు నాతని మూర్ఛపుచ్చె శుకుండు మెఱుంగుములుకు
లు నెఱకులు నాటింప వేగదర్శి యతులవేగంబునం దదీయశతాంగవరూథంబు
నుగ్గునూచంబుగా గుప్పించి నొప్పించి యుఱికె మహాపార్శ్వుం డుభయపార్శ్వం
బుల నమ్ము లెమ్ములఁ గీలింప గంధమాదనుం డుత్తాలతాలంబున నమ్మేటినిశాటునా
టోపంబు దూలించె విద్యుజ్జిహ్వుం డనలజిహ్వాభీలాంబకంబులం బొదువ శతబలి
యొక్కవిశంకటం బగునశ్వకర్ణంబున నారాత్రించరుం దెరల్చె మఱియుఁ దక్కిన
వలీముఖులును సర్వశర్వరీచరులు నచ్చలంబునం బెనంగి రాసమయంబున.

522


మ.

వరుసం దేరుల శూరు లై పెనఁగియున్ వైరథ్యముం బొందుచుం
గరటిస్కంధము లెక్కి [45]ఢీకొలిపియుం గ్రం దై కరుల్ దూలఁగాఁ
దురగారోహకు లై కడంగియు హరుల్ దోడ్తోఁ బడం గాల్వు రై
సరిఁ బోరాడియుఁ గైదువుల్ సమయ ముష్టాముష్టికిం జొచ్చియున్.

523


ఉ.

నొచ్చియుఁ బోక వానరుల నొంచియు మా ఱొనరింప మూర్ఛకున్
వచ్చియుఁ గ్రమ్మఱం దెలిసి వచ్చి కడంగియు దిక్కు లార్పులన్
వచ్చియు మూఁకలం జమరి వైచియుఁ దత్తరుతాడనాదులం
జచ్చిరి మేటిరక్కసులు చండమదోద్ధతి నప్డు వెండియున్.

524


సీ.

ఇరువాఁగు బెరయంగు నెగయు పెంధూళుల, తఱుచు మేఘంపుమొత్తములతెఱఁగు
సారథు లిలఁ గూల సరిఁ [46]బాఱుతేరుల, మ్రోఁతలు పెన్నుఱుములవిధంబు
నమ్ము లేదినరథు లంకించి వడి వైచు, చక్రాదు లుజ్జ్వలాశనులపొలుపు
శుండాలములనుండి జోదులు తొరఁగించు, వాలంపజాలంబు వానవడువు
ఖడ్గరోచులు మెఱుఁగులగతియుఁ గుంభ, కలితమౌక్తికములు వడగండ్లచాడ్పు
నెత్రువఱద లేర్లపగిది నెఱయమెఱయ, నని పయోధరసమయంబు ననుకరించె.

525


వ.

మఱియు వివిధప్రకారంబుల నమ్మహాహవం బద్భుతరసావహం బై నిరంతరం
బగుటయు.

526


క.

ఇరుదెసలవారు నితరే, తరజయకాంక్షలఁ బెనంగఁ దనబింబము ప
ల్దెరువులుగ విరియు నిఁక నని, యరుగుకరణిఁ దరణి గ్రుంకె నాసమయమునన్.

527


ఉ.

వేల నతిక్రమించి లయవేళ మహాబ్ధివిలోలమీనక

ల్లోలకరాళ మై జగములోఁ గొన వచ్చినమాడ్కి ఖడ్గజి
హ్వాలభుజాభుజంగవలనాకులముం బటహాదినిస్వనా
భీలము గాఁ గడుం గడఁగి పేర్చి నిశాచరసేన త్రోచినన్.

528


క.

సంజ వొడతెంచె నిఁకమీఁ, దం జీఁకటి లావు యాతుధానుల కనుచున్
శింజిని మ్రోయించుచు రఘు, కుంజరుఁడు వెసం గడంగి ఘోరాస్త్రములన్.

529


ఉ.

వాహనసూతయోధరరథవర్గము లొక్కటఁ గుప్పఁగూర నా
రోహకపాతముల్ బెరయ మ్రోయుచు దంతులు మ్రొగ్గ వాహసం
దోహము లాశ్వికాంగములతోడఁ బొరింబొరిఁ గూలఁ గైదువుల్
బాహులు మున్నుగాఁ దునిసి బల్విడిఁ గాల్వురు'ద్రెళ్ల నేయుచున్.

530


చ.

అడరి వధింప నప్పుడు దదాశుగవేగము సైఁప కందఱున్
వడి సెడి యొక్కదిక్కునకు వచ్చుచుఁ గూడి తగంగ వెండియు
న్మిడుతలు సిచ్చువాతఁ బడి నీ ఱగుకైవడి నప్డు మంటలం
దొడిఁబడి మ్రందఁగా సమరదోహలు లై కపులం దెరల్చుచున్.

531


వ.

శుకసారణవజ్రదంష్ట్రమహాకాయమహాపార్శ్వమహోదరులు గాలమేఘంబులుం
బోలె గర్జిల్లుచు శరాసారఘోరంబుగా నొక్కటం దనపయిం గవియ నవ్వీర
శేఖరుండు దదవసరసంధ్యారాగరక్తంబు లగునుత్సలంబులుంబోలెఁ గ్రోధారు
ణితలోచనంబు లలర నయ్యార్వుర నాఱుబాణంబుల నొప్పించి తొలఁగించి
మఱియు లీలావిక్రమంబులు సలుపం దోన వానరులుం గడంగి.

532


క.

ఆఁకరముతోడ నప్పెను, మూఁకలపై కుఱికి కఠినముష్టినిహతులన్
మ్రాఁకుల శిలలను బీనుఁగు, ప్రోకలు గావించి [47]రపుడు పొడవడక వడిన్.

533


క.

అంగదుఁ డొక్కమహాగిరి, శృంగముఁ గొని పెలుచ [48]నింద్రజితుపై నంతన్
నింగి సెలఁగ నార్చుచుఁ గది, యంగ నదృశ్యుఁడయి చనియె నాతఁడు నంతన్.

534


ఉ.

దిక్కులు మూయుచుం గలయఁ దెల్పులు మాపుచు మిన్ను గప్పుచుం
బెక్కు లొకండుగా ముసుఁగుఁ బెట్టుచుఁ జూడ్కుల కందకుండ నే
యిక్కలుఁ దోఁపకుండఁ దల మెక్కుచు ము న్నగుసైన్యధూళితోఁ
గ్రిక్కిఱియం దమం బడర రెండుదెఱంగులవారు నొండొరున్.

535


శా.

ఓరీ శాత్రవుఁ డెవ్వఁ డెవ్వఁ డనుచున్ హుంకారఘోరంబుగా
రారా యంచు మిమున్ హరించుహరి నేరా యంచు నేరా నిశా
చారిం గీశకులాశి నంచు వెసఁ గేశాకేశి వర్తింపఁ దెం
పారం బోయి రెలుంగునిక్కలకు నయ్యాశ్చర్యపుంజీఁకటిన్.

536


తే.

తొడినమణికంకణాదుల వెడలుదీప్తు
లోషధులు గాఁగఁ దెఱచునో ళ్లుగ్రగుహల

దొరయ జంగమాద్రులభంగిఁ ద్రోచి రాత్రి
చరులు మ్రింగఁ జొచ్చిరి వనచరుల నపుడు.

537


శా.

ఖద్యోతంబులభంగిఁ బుంఖమణు లాకాశంబునం దోఁపఁగా
విద్యుద్వేగమహాశిలీముఖముఖావిర్భూతదీప్తుల్ భయా
పాద్యుల్కా గతిఁ జూపఁ జూపె ధరణీపాలుండు నాలో ధను
ర్విద్యానై పుణిఁ జిచ్చుటంపఱఁ దమోవిధ్వంసముం జేయుచున్.

538


సీ.

మురిసినమణిమయముకుటపంక్తులు ప్రభా, లీఢదిగ్దీపమాలికలు గాఁగఁ
గూలినదళితేభతకుంభమౌక్తికతతు, లిచ్చినపువ్వుదోయిళ్లు గాఁగఁ
బడి ప్రోవు లై యున్నబహుగాత్రఖండముల్, రచితమహోపహారములు గాఁగఁ
గలయంగ మడువులు గట్టిన గజఘోట, కాదిరక్తములు మద్యములు గాఁగ
నట్లు పూజ నొందియుఁ దనియక మహాసి, దంష్ట్రయును నటద్భూతబేతాళయుతయు
నగుచు నంతకంతకు నేచె నతులగతులఁ, గాళరాత్రియుఁబోలె నక్క డిఁదిరాత్రి.

539


వ.

అంత నంతకుమున్న కయ్యంబున వంచించి చని లంక సొచ్చి యింద్రజితుం
డంతర్గతంబున.

540


శా.

దంభోళిద్యుతి దుర్నిరీక్ష్యుఁ డగుచున్ దర్పంబునం బేర్చునా
జంభారిం జెఱగొన్నయేఁ గలుగఁగా శాఖామృగశ్రేణిచే
నంభోరాశికి లంకకుం గలిగె దైన్యం బింక మద్భాహుసం
రంభం బేటికిఁ జెల్లుఁ గాక రఘువీరఖ్యాతి లోకంబునన్.

541


వ.

అనుచు జయోపాయంబుఁ జింతించి దారుణంబైనయొక్కమారణకర్మం బాచరిం
చువాఁడై రక్తమాల్యాంబరోష్ణీషాదులు ధరియించి హోమశాలకుం జని
హితప్రకారంబున దానవగురూపదిష్టం బగునాధర్వణతంత్రం బనుష్ఠింపఁ గుండ
మధ్యంబునం బ్రదక్షిణార్చులఁ బేర్చు ననలంబున దివ్యభూషణభూషితం బయి
యవధ్యం బగునశ్వచతుష్టయంబుతోడ వివిధాయుధభరితం బగునొక్కపసిండి
రథం బెగసినం గైకొని సమరసన్నాహంబున మెఱసి రథారోహణంబు సేసి
రాక్షసులం గనుంగొని.

542

ఇంద్రజిత్తు మాయాయుద్ధం బొనర్చుట

చ.

రణమున నుగ్రసాయకపరంపర భానుకులం బరామల
క్ష్మణము జగం బవానరము గా విలునేర్పును మద్భుజావిజృం
భణమును జూపి తండ్రిమదిఁ బట్టినచింతఁ దొలంగఁబెట్టి శూ
ర్పణఖకు నట్లు పాటిలినబన్నము నీఁగుదు నేఁ డవశ్యమున్.

543


క.

అనుచు నలక్షితరథుఁ డై, ఘనమార్గంబునకు నెగసి కార్ముకధరుఁ డై

మును మిడి రజనీచరవా, హినిఁ గూల్చుచు నున్యన్నరేంద్రులఁ గనియెన్.

544


క.

కని మాయావిద్యాబల, మున నీరంధ్రముగ మేఘములు నీహారం
బు నొనర్చి మున్ను గవిసిన, పెనుఁజీఁకటి దళము సేసి భీకరలీలన్.

545


స్రగ్ధర.

కల్పాంతామోఘమేఘాక్రమణ మలవడన్ గాఢనిర్ఘాతభీతిం
గల్పింపం జాలుకీలోద్గమబహుళకనత్కాండముల్ భూరిభూభృ
త్కల్పాకారంబు లారం గడఁగుకపివరుల్ క్రందుగాఁ గూల శౌర్యా
కల్పుల్ సుగ్రీవముఖ్యుల్ కరవిగతభుజాగర్వు లై యుండ నేసెన్.

546


క.

ఏసి నిశాతశరంబులఁ, గౌసల్యాతనయు నొంచి కవచం బఱువుల్
సేసి గవాక్షితవక్షుం, జేసెఁ దదనుజుం బ్లవంగసేన దలంకన్.

547


తే.

అప్పు డారాఘవులు ననేకాశుగములు, వింట నందంద పెనుమంట లంట నిండు
తెగలు గావించి నిగిడింప నిగిడి మగిడె, నమ్మహాబలుఁ డున్నచో టందలేక.

548


ఉ.

వెండియుఁ జండకాండములు వే కొని రావణి బాహుదండకో
దండవినిర్గతాస్త్రము లుదగ్రగతిం బఱతేరఁ దద్గరు
న్మండలజాతమారుతనినాదము నిక్కకు వేసి వానిచే
ఖండము లై కరం బరుదు గా నవియుం బడ రోషదీప్తుఁ డై.

549


శా.

ఆస్ఫోటించి తటిల్లతోల్లసదురుజ్యావల్లితో విల్లు ర
త్నస్ఫూర్తిన్ వెదచల్లఁ బెల్లు వరబాణశ్రేణు లేసెన్ వతం
సస్ఫూర్జన్నవభూరిపుంఖమణు లోఁజం జేయ రాముం డవా
ర్యస్ఫీతస్ఫుటవిస్ఫులింగవిసరవ్యాపారఘోరంబుగాన్.

550


సీ.

అమ్మహాశరములు నందంద పఱతెంచు, కాండముల్ నఱకుచు [49]గఱులు గాలి
యుల్క లై రాలఁగ నుడుమండలము దాఁకి, వంచనఁ దొలఁగురావణికిఁ దప్పి
చని మింటిమీఁదికి సకలభూతములును, భయ మందఁ దిరుగుడు వడి నిశాట
సైన్యంబుపైఁ బడి చతురంగములఁ గూల్ప, వెస హతశేషులు విఱిగి పాఱి
లంక సొచ్చిరి దానికిఁ గింక వొడమి, తఱిమి యమ్మేఘనాదుండు తఱుచుటంప
సోన గావించి వానరసేన నెల్ల, ముంచి మాయాబలంబున మించి మఱియు.

551


చ.

ఒకదెస నార్చు నవ్వుఁ జను నొక్కదెసం దనుఁ జెప్పు నప్డ యొం
డొకదెస శింజినీధ్వని మహోగ్రముగా నెసఁగించు మించు సా
యకతకు లింతలోపలన యంతల నింతలు నొక్కపెల్లుగా
నొకదెస నేయు ఘోరకులిశోద్ధతపాతము దోఁపఁ బైపయిన్.

552


వ.

అప్పుడు కవులు గల్పావసానసమయసంభూతజీమూతనిరంతరవారిధారాడంబరం
బున నంబరంబు మ్రోయం దొరఁగుశరంబులఁ గుప్పలు గొనం గూలువారును మార్గ
ణమార్గం బలక్షితం బైనఁ జేయునది లేక యొండొరుమఱుఁగున నొదుఁగువారును

ననర్గళనిర్ఘాతవేగంబునం బడునాయతసాయకంబుల నొక్కొక్కటఁ బలువురు గు
దులు గ్రుచ్చిన ట్లుండ నిల నొఱగువారును గీలాకరాళంబు లై కవియుకంకపత్రం
బులకుఁ గాక మాతంగతురంగకళేబరంబులు ముసుంగుకోసం దిగుచువారును
నిశితనారాచంబులు శిరోమధ్యంబునం బడి యఱకాల వెడలి నేలఁ గీలుకొన్న
నిలువునన గతాసు లగువారును మొదలం గదనంబునకుం దెచ్చుకొన్న మహాచ
లశృంగాదులు బలువిడిం బడు బాణజాలంబులకు మఱువుగా నొడ్డువారును వివిధ
విశిఖాసారంబు ఘోరంబుగా నంతకంతకుం దఱిమిన వెఱచఱిచి విఱిగి పడినయ
రదంబులక్రిందు లీఁగువారును నమోఘపాతంబు లగునాశుగంబులు నిగుడ ము
న్నెఱుంగునిక్కలకుం గాలికొలందులఁ జని గిరిగహ్వరంబులు సొచ్చువారును నా
భీలవాలవిక్షేపంబులం బుంఖానుపుంఖంబు లై కూలుకోలలఁ దూలంజదియువారు
ను ముఖకమలంబులు ముంపకుండ నఖండకాండప్రవాహంబులకుం గాలదండ
ప్రచండంబు లగునుద్దండభుజదండంబులు సేతువులుగా నమర్చువారును నిత్తఱిఁ
ధరణి పొడసూపిన బిసనాళనాళీకంబు లుపాయనం బిత్తు మనుటకుం దగి శిలీము
భోన్ముఖంబు లగుపాణితలంబు లాపుంఖస్యూతంబులై మెఱయ మెఱయువారును
దరువులు మస్తకోపరిభాగంబునం ద్రిప్పుచుం గరకాపరంపరలతఱుచునం బడు
నిషువుల పెల్లడంచువారును నంపజడి కోర్చి ధైర్యం బవలంబించి నిశ్చలులై యుం
డువారును నింగికి లంఘించి నడుమన మెఱుంగుములుకు లవయవంబు లం
దుఁగొన్న సుడివడుచు మగుడం బుడమిం బడువారును మఱియు ననేకప్రకా
రంబులం జిచ్చు లుమియుచు వచ్చునంపపరంపరలకుం గాక తిరుగుడువడువారును
నై రయ్యవసరంబున.

553


తే.

దాశరథులు భల్లార్ధచంద్రాశుగములు, పఱపిపఱపి రక్కసుఁ డేయుబాణతతులు
నఱికి వైచుచుఁ దారు వానరబలంబు, నోపినట్లు రక్షించుచు నుండి రపుడు.

554


వ.

ఆసమయంబున సుమిత్రాపుత్రుండు.

555


సీ.

ముందట వనచరు లందంద ప్రోవు లై, పడుచున్న దారుణభంగి సూచి
తీఱనికోపాగ్ని యాఱక పొగులుచి, త్తమునందుఁ బృథువిషాదంబు వొడమ
మనుజేంద్ర చూచితే మనకొఱకై వచ్చి, వీ రిట్లు జడిగొన్న విశిఖవృష్టి
శోణితంబున రణక్షోణిఁ దెప్పలుగట్టి, యూరక కూలుచు నున్నవారు
మహితచాపదండసహితుఁ డై యీగతి, నెసఁగునితని నిప్పు డెవ్విధమున
గెలుచువెరవు మనకుఁ గలుగ దిమ్మాయకుఁ, బ్రతివిధాన మెఱుఁగఁ బడదుగాన.

556


శా.

బ్రహ్మంబే యని చూడ వీఁడు కుహనాపారీణుఁ డేదిక్కునన్
బ్రహ్మాండంబున డాఁగినాఁడొ తెలియరా దింక నీలంక కై
బ్రహ్మాస్త్రం బడరించి పించ మడఁతున్ రాత్రించరశ్రేణి నా
బహ్మాదుల్ వెనుకైన నే నని సుమిత్రానందనుం డన్నతోన్.

557

చ.

పలికిన నానరేంద్రుఁ డనుఁ బార్థివపుత్ర యొకండు సేసినం
బలువురమీఁద నింత దలఁపం దగ దట్టులు గాక నిద్రమై
నొలసియుఁ దమ్ము నేమఱియు నున్నెడ వధ్యులె శస్త్రపాణు లై
నిలువనివారిఁ జంపఁ దగునే రణధర్మము నీ వెఱుంగవే.

558


క.

సమయము గా దిది బ్రహ్మా, స్త్రమునకు మన మిప్పు డన్నిశాచరు మాయా
తిమిరతిరోహితు నారసి, సమయింపం జాలు నద్రిచరయూథపులన్.

559


వ.

పనుచునది కార్యం బనుచు నతని వారించి ఋషభశరభాంజనేయగజగవయ
గవాక్షద్వివిదనీలాంగదసానుప్రస్థు లనువారిం జూచి మీరు వీని వధియించి రం
డని నియోగించిన.

560


ఉ.

వారును దిక్కు లొక్కమొగి వ్రయ్యఁగ నార్చుచు మీఁది కేఁగి వీఁ
డారయఁ దారకాగ్రహసమాకృతిఁ గైకొనినాఁడొ సర్వసం
హారము సేయ వీఁ డొకరుఁ డయ్యెనొ కా కనునంతలోనఁ ద
ద్ఘోరశరాళిచేత ధరఁ గూలి రతండుఁ జెలంగి వెండియున్.

561

ఇంద్రజిత్తు నాగపాశములచేత రామలక్ష్మణుల బంధించుట

క.

నాలుకలు గ్రోయునుగ్ర, వ్యాళశిలీముఖము లొక్కవరుస నభోభూ
గోళాంతరాళము విష, జ్వాలాభీలముగ నేయ జవమున నవియున్.

562


మ.

కలయం బూచినకింశుకంబులగతిన్ గాత్రంబు లస్త్రక్షతం
బులఁ జెన్నారుచు నున్నదాశరథులన్ ఫూత్కారఘోరంబుగా
గళబాహార్గళమధ్యమోరుయుగజంఘాకాండకాండాసనం
బుల నంటం బెనఁగొంచు దుస్సహదశం బొందించి బంధించినన్.

563


క.

బెగ డందిరి సుర లప్పుడు, జగతీస్థలి మేను వైచి సౌమిత్రి యెటుం
దెగనిరణశ్రాంతిం గను, మొగిచెనొకో నాఁగ బెట్టు మూర్ఛం జెందెన్.

564


ఉ.

ము న్నురగాస్త్రనిగ్రహము ముట్టియుఁ గొండొకధైర్య మూఁతగా
నున్ననరేంద్రుఁడు మఱపు నొందినతమ్మునిఁ జూచి యేగతిం
బన్నగబంధమోక్షమునుపాయ మెఱుంగక వెచ్చ నూర్చుచుం
గన్నుల బాష్పగుచ్ఛములుఁ గ్రమ్మఁగఁ గ్రమ్మఱ మూర్ఛవచ్చినన్.

565


క.

ఇల నొఱగె నట్లు భుజగం, బులు పెనఁగొన రాముఁ డాదిపురుషుం డయ్యున్
బలి మును బంధించినయా, ఫల మొకమైఁ గుడువ కేల పాయు ననంగన్.

566


వ.

అంత సుగ్రీవసుషేణహనుమద్ద్వివిదనీలాంగదసుముఖప్రముఖు లధికసంభ్రమం
బులం బఱతెంచి వారిం జూచి శోకింప విభీషణుండు బోధించుచుండె నింద్రజితుం
డును రాఘవులు దనచేతం దెగినవారకా నిశ్చయించి గర్జిల్లుచు లంకకుం జని
రావణుం గనుంగొని.

567


మ.

రణరంగంబున నేఁడు నాదుభుజదర్పం బొప్ప నుద్యద్ధను

ర్గుణనిర్ఘోషజడీకృతశ్రవణమున్ రోదోంతరాకీర్ణమా
ర్గణవర్షంబుఁ బత్ప్లవంగబలముం గా నేచి యారామల
క్ష్మణులం జంపితి నాగపాశములఁ జిక్కం గట్టి లంకేశ్వరా.

568


క.

అనవుడు సంతోషంబున, విని నందను గారవించి వీడ్కొల్పుటయుం
దనమందిరమునకు జయ, ధ్వను లులియఁగ నేఁగె సమ్మదంబున నతఁడున్.

569


శా.

అంతం బంక్తిముఖుండు నున్మదమనోజావస్థచేఁ దూలుచుం
జింతింపం దొడఁగెన్ మహీసుత పతిస్నేహార్తయై చచ్చునో
కాంతాచేష్టిత మింద్రజాలము ననుం గైకొన్నొ భోగేచ్ఛమై
నంతర్వృత్త మెఱుంగరా దనుచు నూహాపోహలోలాత్ముఁ డై.

570


వ.

ఇట్లు చింతించి.

571


సీ.

త్రిజట రప్పించి యత్తెఱవతో నిట్లను, నీల్గిరి రాఘవు లింద్రజిత్తు
చేత నేఁ డీవార్త చెప్పి తోడ్కొనిపోయి, వసుమతీతనయకు వారిఁ జూపి
చిరకాలపరిచితస్నేహంబు మోహంబు, సేసెనేనియుఁ దేర్చి చెలిమిఁ గలసి
నిక్కంబులై తోఁచు నెయ్యంపుఁజెయ్వులు, నుపచారములుఁ బతు లున్నయపుడ
కాని వెనుకఁ జేత కాంతారచంద్రిక, భోగములకె కాదె పుట్టినారు
నెలఁత లట్లు గాన నీ వింక నీలంక, యేలు రాక్షసేంద్రు నేలు మనుము.

572


వ.

అని పలుక నన్నిశాచరియు నశోకవనంబునకుం జని వైదేహి కత్తెఱం గెఱిం
గించిన.

573


క.

[50]దిగులుపడి బిట్టు డెందము, పగులం బడి మూర్ఛ నొంది ప్రాణము లొడలం
దెగినట్లు నేలఁ బడి య, మ్మగువయు నొకవడికి మూర్ఛ మగుడం దెలిసెన్.

574


ఆ.

ఉప్పరంబు గదిరి డెందము శోకాగ్ని, సుట్టుముట్టి తాల్మి సుడివడంగ
నశ్రువారి వెలి వెలార్చుచందమున నం, దంద యడలుచున్నయతివఁ జూచి.

575


శా.

విద్యుజ్ఙిహ్వుఁడు మాయ పన్ని తలయున్ విల్లుం గదా చూపె నీ
యుద్యోగంబును నట్ల కా వలయుఁ గాక కొం డేల యౌ రాముఁ డా
పద్యుక్తుం డగునా విషాద ముచితం బా చూతుగా కాధను
ర్విద్యాపారగు సాయకాగ్నికణవద్విక్రాంతిపాథోనిధిన్.

576


వ.

అని మఱియు ననేకవిధంబుల బోధించి దేవీ నీవు రామలక్ష్మణులం బ్రచ్ఛన్నప్ర
కారంబునఁ దదీయక్షేమం బరసివత్తుగాక పోదము రమ్మనుచుం బుష్పకం బెక్కిం
చుకొని యెగసి మనోజవంబునం జని విగతమాయాజలధరజలాదికంబును దార
కాగణప్రభాభాసితంబును జంద్రరేఖాతిలకితప్రథమదిశాముఖంబును నటత్క
బంధబంధురంబును నగునభోభాగంబున నిలిచి కపిసైన్యంబునడుమ సుగ్రీవాం
గదజాంబవదాంజనేయవిభీషణప్రముఖపరివేష్టితులును విశిఖవికీర్ణవీతకవచులు

ను బతితతూణబాణాసనులును రక్తధారధౌతధూళిధూసరితాంగులును నాగ
పాశబద్ధులును విచేష్టితులు నై యున్నయన్నరేంద్రనందనులం జూపినం జూచి
నిమీలితలోచన యగుచు.

577


సీ.

ఉల్లంబు జల్లన నొదవుతల్లడమున, నొకమూర్ఛ గవిసిన నొయ్యఁ దెలిసి
నివ్వెఱపడి తెంపు [51]నిశ్చయమున సాధ్వి, తలయూఁచి దైవంబు తగవు మెచ్చి
చిత్తంబు నాటినచెయ్వులు దలపోసి, కనుఁగొనలను నశ్రుకణము లొలుక
నొగి దృష్టి కాసయు నోటయుఁ బాటిలఁ, బరిణతస్నేహానుబంధ మొందఁ
దెగువ మోమునఁ జేట్పాటు మిగుల మఱియుఁ, జూచి పాణిపంకజమును శోకశుష్క
కంఠనాళాంతరమున గద్గదిక నెగులు, కొనునెలుంగును నెత్తి యజ్జనకతనయ.

578

నాగపాశబద్ధు లగురాఘవులం జూచి వగచు సీతను ద్రిజట యూఱడించుట

ఉ.

ఓరఘునాథ పుణ్యచరికతోజ్జ్వల చాపకళాకలాపశి
క్షారమణీయ దివ్యశరజాలపరిశ్రమశస్తహస్త నీ
వీరణశయ్యఁ గన్మొగుచు టేర్పడఁ జూచియు నున్నదాన నా
కూరిమి సూచి తిట్లు నృపకుంజర దీనికి నన్ను నే మనన్.

579


ఉ.

వల్లభుపేర ని ట్లయినవార్త సెవిం బడునంతలోన బి
ట్టుల్లము వ్రయ్య లై యెడల నుండక ప్రాణము లేఁగెనేని భూ
వల్లభ కూర్మిగాక విధవాత్వము సైఁపఁగలేక చిచ్చులోఁ
[52]ద్రెళ్లుటయే యటే తగవు దీర్పక తక్కుదురే కులాంగనల్.

580


ఉ.

అక్కట పత్నికోర్కికొఱకై వనభూమికిఁ బుత్రుఁ బుచ్చితిం
దెక్కలిసత్య మింతటికిఁ దెచ్చెఁ గదే నను నంచుఁ దండ్రి నీ
దిక్కున మక్కువం దనదుదేహము దక్కెను గాక తాల్మిమైఁ
జిక్కను రాతిడెంద మగు సీతయటే యిఁకఁ జెప్ప నేటికిన్.

581


వ.

అని శోకించి సౌమిత్రిం గనుంగొని.

582


శా.

అన్నా లక్ష్మణ భ్రాతృవత్సల దురంతాయాసఖిన్నుండ వ
య్యు న్నిద్రారహితుండ వై యకట ము న్నుగ్రాటవీభూములం
దన్నం గొల్తు గదన్న నేఁడు రణశయ్యన్ భూవిభుం డుండఁగాఁ
గన్నాఁగం దగునయ్య నీనిదురకుం గాలం బయోధ్యం గదా.

583


చ.

అనుచు విషాద మంది హృదయం బగలం బతిదిక్కు గ్రమ్మఱం
గనుఁగొని నాకునై కడలిఁ గట్టితి నాథ మహాత్మ నిగ్రహం
బనుచిత మెందు నుత్తములు కట్టిది గా దయినం బ్లవంగవా
హినులు గలంగఁ గట్టుపడితే రిపుచే గుణరత్నసాగరా.

584

చ.

ఇది యొకబ్రహ్మకల్ప మిటు లెన్నఁడొకో పదునాలుగేఁడులుం
దుది గను నెల్లసేమములతోఁ గొడు కెప్డొకొ వచ్చు నంచు నీ
కెదురులు సూచుచున్ దినము లెన్నుచు నాసల నున్నతల్లికిన్
హృదయకుకూలవహ్ని యగు నీదెసశోకము దీఱదే కదే.

585


సీ.

నాఁడు లాక్షణికులు న న్నుపలక్షించి, యంఘ్రితలముల రేఖాంబుజంబు
లుజ్జ్వలకాంతి ని ట్లుల్లసిల్లుచు నున్కి, బట్టాభిషేకంబు భర్తతోడఁ
చెలువుగా నీయింతి సేయించుకోను నిఖి, లాంగకంబులు లక్షణాంచితములు
గావున సౌభాగ్యకలితయు నైదువ, యుం బుత్రిణియు నయి యొప్పు ననిరి
మద్గురులు వసిష్ఠాదులు మహితకీర్తి, యుతు లరుంధతి మొద లైనసతులు నాకు
నిచ్చుదీవనలును నట యెల్లవారి, వాక్యములుఁ దప్పెఁ జూచితే వసుమతీశ.

586


వ.

అనుచు విలపింపందగువాక్యంబుల శోకంబు వారింపఁ దలంచి త్రిజట యద్దేవి
నవలోకించి.

587


చ.

చెలువ కనుంగొనంగ శవచిహ్నము లేమియు లేవు ప్రాణము
ల్దొలఁగిన నంగకాంతు లిటు దోఁప వనాయక మైనసైన్యము
ల్నిలువవు వారె సూరెల బలీముఖవీరులు గంటె కంటె దా
పలిదెసఁ గంటఁ జంటను శుభస్ఫురణం బదె నీకు నొప్పెడున్.

588


క.

అంతియ కా దీపుష్పక, మింతీ విధవ లగువార లెక్కినఁ జన దొ
క్కింతయుఁ గావున నెమ్మెయి, సంతోషమ నీకు నా కసత్యము లేలా.

589


క.

తేఱుదురు రిపుల నిప్పుడ, మీఱుదురును గడిఁది మూర్ఛమెయి ని ట్లున్నా
రాఱనితేజంబులతో, నీఱు పయిం గవిసి యున్ననిప్పులుఁబోలెన్.

590


వ.

అనుచుఁ దగువాక్యంబుల శోకంబు వారించి మరలి యశోకారామంబునకుం
దోకొని చనియె నంత నిక్కడ రఘువీరుండు.

591


క.

సోలినచిత్తము దనలో, మేలుకనం దోన తెలివి మెయికొనున ట్లు
న్మీలితనయనసరోరుహుఁ, డై లక్ష్మణుఁ జూచి దుఃఖితాత్ముం డగుచున్.

592


సీ.

అకట యీయుత్తముఁ డనుదినంబును నాకుఁ, బరిచర్య లొనరింపఁ బరమభక్తి
వనభూములకు జటావల్కలంబులు పూని, యేతెంచి యం దెన్నక నెక్కుడైన
దుఃఖంబులకు నోర్చి తుది వచ్చి రిపులచే, బాహుబల మ్మస్త్రబలము నెడలి
విశిఖక్షతంబుల వెడలు పెన్నెత్తుటఁ, దొప్పఁదోఁగినమేను ధూళి బ్రుంగి
తూలి విన్నఁబాఱి యీలంకపఱగడ, నున్నవాఁడు సూచుచున్నవాఁడ
నేను నిట్టిదైన్య మింక న న్నేమందు, నాలికొఱకు ననుజుఁ గోలుపడితి.

593


క.

ప్రాణసఖుఁ డైనలక్ష్మణు, ప్రాణంబులు లేమి సీత పని యేటికి నా
ప్రాణము లేటికి నేటికి, బాణాసనదివ్యబాణభారము నాకున్.

594


చ.

అకట విరోధిసన్నిధిఁ బ్రియానుజు నిట్టులు డించి యే నయో

ధ్యకు నెటు లేఁగువాఁడ నటఁ దల్లులుఁ దమ్ములు నన్నుఁ జూచి యే
మొకొ ముఖచేష్ట యొండుగతి నున్నది లక్ష్మణుఁ డేల రాఁడు నీ
వొకఁడవు వచ్చు టే మనిన నుత్తర మే మని యిత్తు వారికిన్.

595


ఆ.

ఇనుఁడు వడిన నబ్ధు లింకిన మేరువు, పెల్లగిలిన నగ్ని చల్లనయిన
నేమఱదు సుమిత్ర నామీఁదివాత్సల్య, మట్టితల్లి వగలఁ బెట్టవలసె.

596


వ.

అని పలికి సుగ్రీవాదులం గనుంగొని.

597


శా

ఏనూ ఱొక్కటఁ జాపముల్ మెఱయఁగా నేపారునయ్యర్జునుం
డేనూఱస్త్రము లేయునంతవడిలో నిర్వీరుఁ డాధానసం
ధానాకర్షణమోక్షణక్రమ మనిర్ధార్యంబుగా నేయుఁ దో
డ్తో నేనూ ఱొకవింట నిట్టివిలుకాఁడుం జిక్కె నిం కే మనన్.

598


ఉ.

అంధున కైనచంద్రునుదయంబుతెఱంగు సుమీ మదీయహృ
ద్బంధుఁ డితండు లేనివసుధాసుత నా కది యేల బంధని
ర్బంధము వాసినం దనువుఁ బాయుదు భానుజ సేనఁ గొంచుఁ గి
ష్కింధకు నేఁగు నాపలుకు సెల్లదు నీవును బో విభీషణా.

599


క.

ఈసకలయూథనాథులు, సేసినలావునకు సంతసించితి మీరుం
బాసి చనుఁడు మము నిటుగాఁ, జేసినదైవంబు గడవఁ జెల్లునె నాకున్.

600


తే.

అనుచు విలపింప నిఖిలయూథాధిపతుల, యాననంబులు బాష్పధారాకులంబు
లగుచుఁ బరిభవవ్రీడ మై నల్ల వ్రాలె, మంచు దొరఁగఁ గైవ్రాలుపద్మములకరణి.

601


వ.

అప్పుడు విభీషణుండు గదాపాణియై సేనామధ్యంబునం దదీయరక్షణంబుకొఱకుఁ
జరియించుచుం దన్నుఁ జూచినదూరస్థు లింద్రజితుం డనుతలంపునం బఱవ నె
లుంగెత్తి వెఱవకుం డనుచు వారి వారించుచు నయ్యైగముల నచట నచటం గ
లంగి తొలంగకుండ నుదారోక్తుల ధైర్యంబు దలకొల్పుచు రామచంద్రుసమీ
పంబునకుం జనుదెంచి సుగ్రీవుం గనుంగొని.

602


క.

దొర లుత్సాహము విడుచుట, వెరవే భయశోకములకు వేళ యగునె మీ
రు రణంబున కుద్యోగిం, తురుగా కని పలుక నంగదుం డి ట్లనియెన్.

603


సీ.

ఇది కార్య మగు నైన నిప్పుడు రాఘవు, లురగాస్త్రబద్ధు లై యున్నవారు
మార్తురసన్నిధి మన కింక నేగతి, యో వీరి నేమఱకుండవలయు
నీరాత్రి వేగిన నేన మీనుపున, వెసఁ గోటతలుపులు విఱుగఁ ద్రోచి
యెవ్వరిఁ బోనీక యింద్రజిద్రావణ, సహితంబుగా నిశాచరుల నెల్లఁ
బ్రలయపవనంబు నీలాభ్రపటలిఁ దోలు, నట్లు తోలుచుఁ బీఁచంబు లడఁచిపుత్తు
మత్తసామబాదులరక్తమాంసతతులు, భూతబలి యిత్తు వసుమతీపుత్రిఁ దెత్తు.

604


మ.

అని పల్కం గపినాథుఁ డి ట్లనియెఁ దా నవ్వీరుతో వీరలం
గొని కిష్కంధకు నేఁగు నే నశమితక్రోధాగ్నిచే రావణా

దినిశాటాటవి నేర్చి రాముజయకీర్తిస్తంభ మై యుండ నం
దన యీలంక విభీషణు నిలిపెదన్ ధాత్రీసుతం దెచ్చెదన్.

605


వ.

అనిన విని సుషేణుండు సుగ్రీవాదులం గనుంగొని మున్ను నేను సురాసురుల
తెఱం గెఱుంగుదు సమరంబున ధనుర్విద్యావిశారదు లగునసురులు సురల నిట్ల
బాణపాఠంబుల బంధించినయప్పుడు నొచ్చినవారి సురగురుండు దివ్యౌషధమం
త్రంబుల రక్షించుచుండు మనకుఁ దదాచరణంబ శరణంబు దుగ్ధనముద్రంబు
నుత్తరభాగంబునం జంద్రద్రోణపర్వతంబులు గల వందు విశల్యసావర్ణ్యసంధాన
సంజీవకరణులు గల వయ్యౌషధంబులు దేర హనుమంతుండు సమర్థుం డితని
నప్పనికిం బనుచునది కార్యం బనుచు నందఱు విచారించుసమయంబున నంత
వృత్తాంతంబు నంతర్గతంబునం దెలిసి పరమహితోపదేశంబు సేయువాఁ డై మం
చాకినీతీరంబున నుండి దేవర్షిపుంగవుండు.

606

నారదమహాముని రామచంద్రునొద్దకు వచ్చుట

సీ.

మహనీయకాంచనమౌంజీసమేత మై, జిగిఁ జెల్వ మగుమృగాజినముతోడఁ
బరిలిప్తపాండురభసితరజోధూళి, తము లైన బ్రహ్మసూత్రములు వెలయఁ
గరనఖచంద్రికాకలిత మై నిర్మల, స్ఫటికాక్షమాలిక ప్రజ్వరిల్లఁ
బుణ్యతీర్థోదకపూర్ణమై దీప్తిమం, డలిఁ బొల్చు మణికమండలువు వెలుఁగఁ
బల్లజడలకెంపు బాలార్కరుచిపెంపుఁ, గడవ రామచంద్రుకకడకు వచ్చె
రమ్యకాంతిజితశరన్నీరదుండు వీ, ణావిశారదుండు నారదుండు.

607


క.

వచ్చిన తనుఁ గవిపుంగవు, లచ్చెరుపడి చూడ నమ్మహాపదకు మదిన్
నొచ్చుచుఁ బ్రదక్షిణముగా, వచ్చి నిలిచి యన్నరేంద్రవర్యునితోడన్.

608


శా.

దేవా దేవహితంబుగా నజుఁడు ప్రార్థింపం గృపాశాలి వై
యావిష్ణుండవు పొందినాఁడవు మనుష్యత్వంబు సామాన్యున
ట్లీ వీదుర్దశఁ దూలు టేమి మహిమం బిట్లుండ సర్వాత్మునిన్
భావింపం దగుఁ గాక నీకుఁ దగునే బంధవ్యథం జేడ్పడన్.

609


వ.

అని మఱియుఁ దదీయం బైనమహామహిమం బెఱింగించువాఁ డై యి ట్లనియె.

610


సీ.

ఎవ్వనిపొక్కిట నీరేడుజగములు, పన్నినవిధుఁ గన్న పద్మ మలరు
నెవ్వనియురమున నిందిరసవతి యై, చిరలీలఁ గౌస్తుభశ్రీ వెలుంగు
నెవ్వనిచేతుల హేతు లారఁగ గదా, కరవాలశంఖచక్రములు మెఱయు
నెవ్వనియంఘ్రి ము న్మిడిపాపములఁ బాపు, గంగ పుట్టినపుణ్యకథలఁ బొల్చు
నట్టిపరమపురుషుఁ డైననారాయణుఁ, బుండరీకనయను భుజగశయనుఁ
జిన్మయాత్ము హరి హృషీకేశుఁ గేశవు, నిను భజింతు రఖిలమునులు సురలు.

611


క.

నీకంటెఁ బరముఁ డెవ్వఁడు, లోకంబుల లేఁడు రామ లోకత్రయర
క్షాకరణనిపుణ శాశ్వత, వైకుంఠ సమస్తవేదవాదాతీతా.

612

క.

మధుకైటభసూదన ధర, ణి ధరింప ననంతమూర్తి నెగడుదు దుగ్ధాం
బుధిఁ బవ్వళింతు వసియిం, తధికతపోనిష్ఠ బదరికాశ్రమభూమిన్.

613


క.

మచ్చెమయి సోమకుఁడు మును, మ్రుచ్చిలి వేదములు గొనుచు మున్నీరు సొరం
జొచ్చి పరిమార్చి మగుడఁగ, నచ్చదువులు దెచ్చినాఁడ వచ్యుత లీలన్.

614


తే.

విశ్వవిశ్వంభరాచక్రవిపులభరము, గిరులుఁ గురులు శేషుండును క్రింద నిలిచి
తాల్ప నీవు సర్వమున కాధారమగుచుఁ, గమఠ మై యున్నవాఁడవు గమలనాభ.

615


క.

అనుపమవరాహమూర్తిం, దనరి హిరణ్యాక్షుఁ దునిమి దంష్ట్రాశిఖరం
బున ధరణీచక్రము నె, త్తినవాఁడవు నీవ కావె దివ్యచరిత్రా.

616


సీ.

దీర్ఘకరాళోగ్రతీవ్రదంష్ట్రారుచుల్, దిగ్దంతిదంతదీధితులఁ గ్రమ్మ
వివృతఘోరాననవివరంబు రోదసీ, కుహరాంతరాళంబు కొలఁది సూప
జండాట్టహాసంపుఁజప్పుడు సాగర, మేదురధ్వానంబు మ్రింగికొనఁగ
నిప్పులు వడి రాలు నిష్ఠురాలోకన, మినమండలస్ఫూర్తి నినుమడింప
ఘనసటోద్ధూతవాతూలఘట్టనమునఁ, బర్వతావళి దూలఁ గంబమున వెడలి
రభసగతి గిట్టి పట్టి హిరణ్యకశిపు, మున్ను చీరిన నరసింహరమూర్తి వీవ.

617


క.

జనవర వామనరూపము, గొని యదితికిఁ బుట్టి యింద్రుకొఱకై బలిబం
ధన మొనరించి త్రివిక్రముఁ, డనఁగా నుతి కెక్కినాఁడ వాదియుగమునన్.

618


తే.

కరసహస్రంబు దునుమాడి కార్తవీర్యుఁ, జంపి ముయ్యేడువరుసల సకలనృపులఁ
జమరి మఖవేళ నేల కశ్యపున కిచ్చి, ముదము నొందినపరశురాముఁడవు నీవ.

619


క.

సగరతనూజుల భస్మం, బుగ నఱువదివేవురం దపోధనముఖ్యుం
డగుకపిలుఁడ వై పలికిన, ఖగరాజధ్వజుఁడ వీవ కావే దేవా.

620


ఉ.

మూఁడుగుణంబులన్ వరుస మూర్తులు మూఁడు ధరించి లోకముల్
మూఁడు రచింపఁ బెంప లయముం బొరయింపఁగఁ జాలు దేవుఁ డ
న్వాఁడవు నీవ నీవ సురవర్గముఁ బ్రోవఁ బురందరుండ వై
నాఁడవు నీవ ధర్ముఁడ వనం బితృవర్గము నేలువాఁడవున్.

621


సీ.

గగనంబు శిరమును గాయత్రి శిఖఁ జంద్ర, దివసేంద్రు లక్షుల దిశలు చెవుల
నజుఁడు ఫాలంబును నగ్ని మోమునుఁ దొలి, చదువు లూర్పుల సరస్వతిరసజ్ఞఁ
ద్రిదివంబు గళమును దివిజులు భుజములఁ, బ్రణవ మక్కును సరిత్పతులు గుక్షి
నశ్వులు జంఘల నవని యంఘ్రుల మునుల్, రోమాళి మిత్రావరుణులు దొడల
ధర్ముఁ డుల్లమును నదాగతి బలమును, నాశ్రయించి యుండ నఖిలమయుఁడ
వై వెలుంగు దీవు నీవు గానిది లేదు, భూతసృష్టియందు భువనభరిత.

622


చ.

అనుపమ మిట్లు నీమహిమ మంతయు నిం కటు గాన నీదువా
హన మగువైనతేయుని మహాబలశాలిఁ దలంపు మెందు న
య్యనఘుఁడు దుర్నివారగతి యై విలసిల్లు నతండు దక్క న

న్యునకు నశక్య మీఘనతరోరగబంధము మాన్ప రాఘవా.

623


వ.

అని యిట్లు బంధమోచనోపాయం బుపదేశించి యాశీర్వదించుచు నమ్మహాను
భావుం డంతర్హితుం డయ్యె నంత రఘువరుండును దనదివ్యజ్ఞానంబున భావించి
సుపర్ణుం గలంచిన దుగ్ధసముద్రంబునుత్తరంబుననుండి.

624

గరుత్మంతుఁడు రామునిసన్నిధికి వచ్చుట

సీ.

కుప్పించునురవడిఁ గుంభిని వడిఁ గ్రుంగి, సర్పాధిపతితలల్ సదియ నదుమఁ
నెగయునూఁకున మీఁది కెత్తి పాఱినతరు, శ్రేణులు చుక్కలఁ జెదర నడువ
నెఱకలు జాడించునేపునఁ గడలెత్తి, యేడువారాసులు నెడము లొత్తఁ
బఱచుబల్వడి నభ్రపంక్తులు సుడిగొంచు, వలయంపుఁగొండ యవ్వలికిఁ దూలఁ
బర్వతములు వడఁక బ్రహ్మాండకోటర, మద్రువ గగనవీథి నరుగుదెంచె
రఘుకులేంద్రబంధవిఘటనత్వరితాంత, రంగుఁ డగుచు నవ్విహంగవిభుఁడు.

625


క.

అప్పుడు గరుడునిఱెక్కలచప్పుడు దూరమున నెఱిఁగి సైరింపఁగ లే
కప్పెనలు విడిచి రాఘవు, లొప్పఁగ భుజగంబు లొక్కయురవడిఁ బఱచెన్.

626


వ.

ఇట్లు బంధమోచనంబు సేయుచు నతండు దన్నుఁ బ్లవంగపుంగవు లచ్చెరువంది
కనుంగొనఁ బ్రభాభాసురం బగునంగఁబు వెలుంగ నవనీతలంబున కవతరించి
యన్నరేంద్రనందనుల నభివందనపూర్వకంబుగాఁ గదిసి గరుదంచలంబున నంగ
సమ్మార్జనంబు సేయుచు గారవించిన.

627


క.

అప్పుడు బాణక్షతములు, గప్పి శరీరములు తొంటికంటెను గాంతిం
జెప్ప బలోత్సాహముతో, నొప్పారుచు నవ్విహంగమోత్తముతోడన్.

628


క.

భూవల్లభుఁ డిట్లను మము, నీ వీయాపదకుఁ బాపి నేర్పార సుహృ
ద్భావం బిటు గావించితి, గావున దశరథుని రఘువుఁ గా నినుఁ దలఁతున్.

629


ఉ.

నావుడు వైనతేయుఁడు మనంబున సంతస మంది దేవ యే
దేవరబంట రావణు వధించెదు నీవు సమస్తదేవభూ
దేవహితార్థ మి ట్లరుగుదెంచితి గాన జయం బవశ్యముం
గావుత మంచు నెయ్య మెసఁరగం దగ వీడ్కొని యేఁగె నయ్యెడన్.

630


సీ.

తరుశీలాపాణు లై తరుచరవీరులు, సింహనాదంబులు సెలఁగ సమర
కేళికి లంకవాకిళ్లకు వడిఁ బాఱ, రావణుఁ డమ్మహారావమునకు
మది విస్మయం బంది మంత్రుల రప్పించి, యదె వింటిరే దిక్కు లద్రువ నచటఁ
గపు లార్చుచున్నారు గ్రమ్మఱ నిది యేమి, చిత్రమొ వా రింద్రజిత్తుచేతఁ
దెగినవార్త మనము తెల్లంబుగా విన్న, వార మనుచు నికటకవర్తు లయిన
వారి నంతదెఱఁగు నారసి రాఁ బంచె, నుదయశిఖరి నినుఁడు నొప్పె నపుడు.

631


క.

వెసఁ జని వారును బురవ, ప్రసమారోహణము సేసి రాఘవులసము
ల్లసితస్థితియును సుగ్రీ, వసురక్షిత మగుచు నొప్పువనచరబలమున్.

632

క.

చూచి చనుదెంచి యారజ, నీచరపతితోడఁ జెప్ప నివ్వెఱపడి లో
నేచినవంతం బొరలుచు, నీచందము దాశరథుల కెట్లొకొ కలిగెన్.

633


క.

కడిమిమెయి మేఘనాదుఁడు, కడిఁది భుజంగాశుగములఁ గట్టినకట్టుల్
వడి వైనతేయుకైవడి, వెడలించిన యట్టివీరుఁ డెవ్వీరుండో.

634

ధూమ్రాక్షునియుద్ధము

వ.

అనుచు నతండు కుపితమానసుండై ధూమ్రాక్షుం గనుంగొని నీవు సమస్తసేనా
సహితంబుగా సమరంబున కరుగు మనిన నన్నిశాచరుండు మ్రొక్కుచు నాస్థా
నంబు వెడలి నిజనియోగంబున బలాధ్యక్షులు మత్తమాతంగతురంగాదులం
గైకొని వచ్చి కెలంకు లలంకరింప నప్పుడు తోమరపరశుపట్టిసప్రాసాయసదండ
భిండివాలశూలభల్లప్రముఖప్రహరణంబులు గీలాభీలంబు లగుచుండఁ బ్రళయ
మేఘాడంబరంబుగతి గర్జిల్లుచు రక్షోనాయకులు నడవ వృకసింహముఖంబు
లయిన వేసడంబులం బూన్చినయొక్కపసిండితేరిపైఁ బొలిచి హేషితబృంహిత
ప్రభృతిశబ్దసంకులంబును భూషణమణికిరణపరిభూతబాలాతపంబును భూసము
ద్ధూతధూళిధూసరితదిశాముఖంబును గరికలభదానఫేనిలవేలాపంకిలప్రదేశం
బును నాతపత్రచ్ఛన్ననభోభాగంబు నగుచు నుండం బ్రచండగతిం జనునప్పు డెడ
నెడఁ గంకకాకగృధ్రంబు లుపరితలంబునం దిరుగ నులూకంబులు సిడంబుల
నూఁకువలు గొన గొడుగులమీఁదఁ బెనుమొయిళ్లు నెత్తురు సినుక మింటనుండి
యొక్కకబంధంబు పురోభూమిం బడ నిట్లు దుర్నిమిత్తంబు లనేకంబులు గని
యుం దలంకక లంకాపురగోపురంబు వెడలి నడిచె నప్పుడు.

635


క.

ఉభయబలంబులు నాశ్చ, ర్యభయంబులు చేయ నార్పు లడర యుగాంత
క్షుభితార్ణవములవిధమున, రభసంబుగఁ దాఁకి రపుడు రాత్రించరులున్.

636


ఆ.

వృక్షచరులు [53]వారివివిధాయుధంబుల, చేతఁ జాల నొచ్చి శిలలఁ దరుల
సంగరాంగణంబు సమతలంబై యుండ, నలుకఁ గూల్చి రందునందు మఱియు.

637


చ.

రథములు నేమిమ్రోఁతల ధరావలయం బద్రువంగఁ దోలుసా
రథులతలంపు లె ట్లటుల రథ్యము లోజకు వచ్చి మెచ్చఁగా
రథులు గడంగ వానరులు మ్రందియు వానరు లేపు చూప నా
రథములు సారథుల్ రథులు రథ్యములున్ రణవీథి మ్రగ్గియున్.

638


ఉ.

మావఁతు లోలి డీకొలుప మత్తగజంబులు పోవుత్రోవలం
బ్రోవులు గట్టుచుం గపులబొందులు గ్రందుగ జోదు లేయున
స్త్రావళిఁ దూలియుం గపు లుదగ్రబలద్ధతి విక్రమింప నా
మావఁతులున్ గజంబులును మందఁగ జోదులు తోన కూలియున్.

639


చ.

తురగారోహకు లెక్కుడుంగడఁకమై దోస్స్తంభశుంభద్గదా

కరవాలాదులక్రోమ్మెఱుంగు లెగయంగా వీఁకఁ బెన్మూఁకలం
దెరలం జేయఁగ మర్కటాంగములు పృథ్విం బెల్లుగాఁ ద్రెళ్లియున్
వరుసన్ మర్కటు లోలిఁ దోలఁ దురగవ్రాతంబుతో దొర్లియున్.

640


చ.

తమతమపేళ్లు సెప్పుచు నదల్పులతో నిరువాఁగువారు దు
ర్దమగతి నిట్లు పెన్గదల తండము లాయుధశైలశృంగసం
ఘములు పరస్పరాహతులఁ గ్రందుగ మేనులు త్రెస్సి వ్రస్సి తు
త్తుము రయి రక్తపూరములఁ దోఁగి ధరం బడఁ బోరుచున్నెడన్.

641


క.

తనబలము విఱిగి పాఱుటఁ, గనుఁగొని ధూమ్రాక్షుఁ డలుక గంభీరఘన
ధ్వని దట్టించుచు రెట్టిం, చినతెం పారం బ్లవంగసేనలఁ దాఁకెన్.

642


క.

తాఁకి వివిధాయుధంబుల, మూఁకల పెల్లడఁచి ధనువు మోయించుచు బ
ల్వీఁకం బటుశరజాలం, బాఁకగొనక పఱపె భూనభోంతర మద్రువన్.

643


చ.

వడి నవి మేను లొక్కమొగి వ్రచ్చుచుఁ ద్రుంచుచు నుచ్చి పాఱుచుం
దొడలు మెడల్ దలల్ బరులుఁ దోఁకలు బాహులు బాహుమధ్యము
ల్నడుములు జంఘ లంఘ్రులు లలాటము లంసము లాననంబు లే
ర్పడక పడం బ్లవంగభటపంక్తులఁ గూల్చి తెరల్పఁ జొచ్చినన్.

644


శా.

ఆమ్రం బొక్కటి పూని మారుతసుతుం డంకించి వీఁకన్ సమి
త్సామ్రాజ్యోచితజైత్రఘోష మమరం జండాట్టహాసంబుతో
ధూమ్రాక్షుం గని వైచె వైచుటయు నద్దోషాచరుం డల్క నా
తామ్రాక్షుం డయి దానిఁ ద్రుంచె నడుమం దౌదౌల భల్లంబులన్.

645


ఉ.

అక్కపిపుంగవుం [54]డొకమహాగిరిశృంగము వైచె వైవఁగా
నొక్కటఁ దేరు సూతుఁడును యుగ్యములం బడి నుగ్గు గాఁగ న
ట్లుక్కఱి విల్లు వైచి యతఁ డుర్వికి దాఁటఁగ వృక్షపాణి యై
రక్కసులన్ వడిం దలలు వ్రక్కలు నాఱఁగ వ్రేసి చంపుచున్.

646


సీ.

దారుణగతిఁ బొల్చి తనచేత ము న్నట్లు, విపులశిలాహతి విరథుఁ డయ్యుఁ
గడిమిమైఁ దనభద్రకటకంబు లొప్పుచేఁ, బెనుగద మణిమయస్ఫీతవలయ
దీప్తులు సుడివడఁ ద్రిప్పుచుఁ బఱతెంచి, యార్చుచు వైచిన నది ప్రకోష్ఠ
నిష్ఠురహతిఁ బోక నెత్తిపైఁ బడి తుము, రై పోవ శిర మొగ్గి యట్టు లలుక
భుజయుగోత్పాటితాచలభూరిశిఖర, పాతమున వాని నిర్గతప్రాణుఁ జేసి
సింహనాదంబు చేసె దిక్సింధురముల, చెవులు పగుల నవ్వానరసింహుఁ డపుడు.

647


వ.

అ ట్లక్షాంతకుచేత ధూమ్రాక్షుండు పడిన హతశేషు లయినదోషాచరులు గపు
లు వెనుదగులఁ గనుకనిం బాఱి లంక సొచ్చి రంత నంతవృత్తాంతంబు విని రావ
ణుండు క్రోధమూర్ఛితుం డగుచుఁ గొండొకసేవునకుం బ్రహస్తుం గనుంగొని

నీ వకంపను సేనానాయకుం చేసి పనుపు మతండు సమరప్రియుండు నస్త్రవిద్యా
విశారదుండు నతిధీరుండు దళంబుల నడపింపను మోహరంబు దీర్పను బొడువ
నొడువంగ డువెరపు గలవాఁడు నదియ కాదు మదీయజయంబు గోరుచుండు
వానరబలంబులం బరిమార్చి రామలక్ష్మణసుగ్రీవుల గెలుచు నవశ్యంబు నని
పలికిన నతండు నట్లు పనుపఁ గై సేసికొని వివిధాయుధభరితంబును బతాకాభిశోభి
తంబును నగునొక్కమహారథం బెక్కి చతురంగబలసమేతుండై దుర్నిమిత్తంబులు
పెక్కులు గనియును జలింపక గడిమిం గడంగి.

648

అకంపనునియుద్ధము

సీ.

అందంద మొరయుతూర్యాదిశబ్దములకు, సంభ్రమద్గ్రాహమై జలధి గలఁగ
మెఱయు కైదువులక్రొమ్మెఱుఁగులతాఁకున, నుష్టదీధితిదీప్తు లోహటింప
బలభరంబునఁ గ్రుంగఁబడునుర్విమ్రోఁతకు, ఫణు లాదికూర్మంబు పడఁకుఁ దూఱ
నెరయు పెంధూళికి నింగి నిండిన వేల్పు, తెఱవలు ముసుఁగులు దిగిచి కొనఁగఁ
దొడిన కంకటములఁ దొడవుల విలసిల్లు, మణుల ఘృణుల దెసల మాఁగు విఱియఁ
గెరలి నడచె నిట్లు కృతనిలింపాధిప, కంపనుండు నగు నకంపనుండు.

649


క.

నడచి మొనచేయ నాయిత, పడి విడువిడు మనుచు నున్న ప్లవగబలంబున్
వడిఁ గదియ రెండుమొనలకుఁ, గడునచ్చెరు వయిన క్రందు కయ్యం బయ్యెన్.

650


ఉ.

అప్పుడు దిక్కు లొక్కమొగి నార్పుల వ్రయ్య ధరాపరాగము
ల్గప్పుట నైనచీఁకటి దళం బయి చూడ్కులు గప్పఁ గందువ
ల్దప్పుచు శాతహేతిరుచులన్ వెడ ద్రోచిన డాసి వ్రేసి తన్
జెప్పుచు నేను దా ననక చేరిన నెవ్వరి నైనఁ జంపుచున్.

651


ఉ.

రోదసి వెల్తిగా శరగరుత్పతనాహతిఁ దూలి నెత్తుట
న్మేదిని దోఁగి మట్టువడి నెట్టన ధూళి యడంగఁగా శిలా
పాదపపాతముల్ బెరయ బాణముఖాయుధఘోరదృష్టిఁ గ్ర
వ్యాదబలీముఖుల్ గురిసి రాజితలంబు సమస్థలంబుగన్.

652


వ.

ఇ ట్లుభయబలంబులవారును భుజాసంరంభవిజృంభణంబు లంతకంతకు నద్భుతా
వకాశంబు లగుచుండం బ్రచండగతిం బోరుచున్నసమయంబున.

653


క.

కుముదాంజనేయమైందులు, ద్రుమములు గొని గముల కుఱికి దోషాచరసై
న్యము పీనుఁగుఁబెంటలుగా, సమయింపఁగఁ జొచ్చి రసమసమరక్రీడన్.

654


క.

వారికిఁ దోడ్పడి తక్కిన, వారుం దరుచరులుఁ గూడి వారక పోరన్
వారణరథహయపంక్తుల, వారము తనమ్రోలఁ బెల్లు వసుధం ద్రెళ్లన్.

655


ఉ.

చూచి యకంపనుం డలుకసొంపునఁ గన్నులఁ గెంపు దోఁపఁగా
నేచి ధనుర్గుణంబు మొరయించుచు సూతునితోడ ని ట్లనుం
ద్రోచిరీ వీఁక వానరులు దూలిరి రక్కసు లింక నీవు వే

వే చన నిమ్ము తేట శరవృష్టిని ముంచెద శత్రుసేనలన్.

656


సీ.

అన విని కొలఁదికి నతఁడు యుగ్యంబుల, పగ్గముల్ సడలించి పట్టి నేమి
ఘట్టనంబున భూమి గంపింప వానర, బలముపై నరదంబుఁ బఱపి పెలుచ
నిగుడుచో మగుడుచో నేర్పులు మనసున, కరుదును మెచ్చుగా నతులగతుల
సారథ్య మొసరింపఁ జండకాండంబులు, గగనంబు గప్పుచుఁ గపుల విపుల
గాత్రఖండము లోలిమైఁ గలన నిండు, నట్లు గావించి కడిమిమై నతిశయిల్లెఁ
[55]దనధనుఃకలాకౌశలమునకు రజని, చరులు సంతసిల్లఁగ నన్నిశాచరుండు.

657


వ.

ఇట్లు విజృంభించిన.

658


శా.

వానిం జూచి బలీముఖుల్ పఱవఁగా వారించుచుం బోక తాఁ
బై నమ్ముల్ [56]పడుచుండఁ గొండకపగిదిం బాటింప కాలో మరు
త్సూనుం డున్నతశై లశృంగమున నాస్ఫోటించి వే వైచుడున్
దానిం జూర్ణము సేసె వాఁడు నరు దందం బెక్కుభల్లంబులన్.

659


లయవిభాతి.

మఱియు నొకమద్ది వెసఁ బెఱికికొని మేనివడి విఱిగి తరు లభ్రములఁ జఱిచి యటు పాఱం
బఱచి హనుమంతుఁ డెడఁ దఱుముబలుమొత్తముల కుఱికి యరదంబు లఱిముఱి ధరణిఁ ద్రెళ్లం
దఱుచు రుధిరచ్ఛటలు వఱదగొనఁ గుంభములు పఱియలయి కుంజరము లొఱలుచుఁ బడం బె
ల్లఱి హరులు డొల్ల భటు లొఱగ రథముల్ సెదర మఱువు లఱువు ళ్లగుచుఁ బఱిపఱిగ మోఁదెన్.

660


తే.

ఇట్లు చతురంగబలములు నేపడంగ, నయ్యకంపనుఁ డందంద యలుక వొడమి
ఘోరబాణంబు లీరేడు కొని యురంబు, గాఁడి పాఱఁగ నేసె నక్కపివరేణ్యు.

661


ఉ.

ఏయుడు నొచ్చి యైనఁ జలియింపక యేటుల భగ్నశాఖ మై
పోయినమద్ది వైచి యొకభూరిమహీధర మెత్తి యార్పుతోఁ
దోయదమాలికల్ దెసలఁ దూలఁగఁ ద్రిప్పుచుఁ బాఱు తెంచి య
వ్వాయుసుతుండు వేసెఁ దల వ్రక్కలు వాఱి పడంగ రక్కసున్.

662


ఆ.

అపుడు కాందిశీకు లయి నిశాచరులు వా, నరులు దోల లంకతెరువు పట్టి
తలలు వీడఁ బఱచి రిలయెల్లఁ గంపింప, నొక్కమ్రోఁత యగుచు దిక్కు లద్రువ.

663

మహాకాయుండు యుద్ధమునకు వచ్చుట

వ.

ఇట్లు ధూమ్రాక్షాంతకుచేత నకంపనుండు దెగుట విని రావణుండు గనలి మహాకా
యుం జూచి నీవు సైన్యసమేతుండ వై చని వనచరవధం బొనర్పు మని పనుప

నతండు నాస్థానంబు వెడలి జవసత్వంబులు నెఱయం బూనినపిశాచముఖంబు
లగుతురంగంబులు వేయి మెఱయం గనత్కనకదండమండితం బగుమయూరకే
తనంబు గ్రాలఁ గఠోరకార్ముకప్రముఖాయుధంబులు వెలుంగ మహాబలులు చక్ర
రక్షకులై రక్షోవీరు లేవురు బలసి రా రత్నరచితకింకిణీమాలికలు మొరయ నే
మిరవభైరవంబుగాఁ దేరు సారథి తెచ్చిన నెక్కి పుడమి నెడము లేకుండ నిండి కరి
తురగరథపదాతులు పరివేష్టింప నలరుచుం గవచధారణాదిసన్నాహంబునం
బొదలి దక్షిణద్వారంబున.

664


శా.

ఘంటాకాహళశంఖదుందుభిమృదంగధ్వానముల్ దిక్కుల
న్మింటన్ నిండి యుగాంతవాతకలనానిస్సీమభీమోర్ము లొం
డొంటిం దాఁకఁ దనర్చునర్ణవము నత్యుగ్రంపుమ్రోఁతం గడు
న్మింటం బర్విన సైన్యధూళి నినరకశ్మిం గప్పుచున్ వెల్వడన్.

665


సీ.

నీరదంబులు వన్ని నెత్తురు గురిసె న, క్కలు సేనలోపలఁ గలసి నడచెఁ
బొరిఁబొరి వాహనంబులు మొగె సికతాస, మేతమై మారుత మెదురువీచెఁ
బఱతెంచి గ్రద్దలు పడగలపై వ్రాలె, నెడనెడఁ గైదువు లెడలి పడియె
వడి లులాయంబులు వలపలిదెస దాఁటె, బృథివీబిలంబులఁ బిల్లు లఱచె
నిట్లు మఱియు నెన్నియేనియు దుర్నిమి, త్తములు గనియు వినియు సమరకాంక్ష
వాఁడు లెక్క గొనక వానరసేనల, నంపవాన ముంతు ననుచుఁ దఱిమి.

666


చ.

నడచి రణక్షితిం బొలిచినం గపిసైన్యము నార్చి త్రోచె న
ప్పు డుభయసైనికుల్ బెరసి పోరఁ దొడంగిరి దోర్బలంబు లే
ర్పడఁ దమపేరుఁ బంతమును వాడి యదల్చుచు సర్వభూతము
ల్వడఁక శరాదిసాధనశిలాతరుపాతము లార నయ్యెడన్.

667


ఉ.

త్రెస్సినజంఘలుం దొడలు దీర్ఘభుజార్గళముల్ గళంబులు
వ్రస్సినమూఁపులుం దలలు వక్షములున్ బరులున్ మహాస్త్రము
ల్డుస్సినకర్ణముల్ నడుములున్ నిటలంబులుఁ బ్రక్కలున్ శిరో
నిస్సరదస్రపూరములు నిండ రణస్థలిఁ గూలుచుండఁగన్.

668


క.

కరి కరితోడం దురగము, దురగముతో రథము రథములతోడను నక్తం
చరు నక్తంచరుతో వన, చరవీరులు వ్రేసి వ్రేసి సమయించునెడన్.

669


ఉ.

దుర్జయు లై నిశాచరులు దోర్బలసంభ్రమలీల లొప్పఁగా
గర్జితఘోరమేఘములకైవడి నందఱు నొక్కలావునం
దర్జనముల్ చెలంగ నిపతచ్చటులాశనినిష్ఠురాశుగ
స్ఫూర్జితవిస్ఫులింగములు చూడ్కుల కోట యొనర్ప నేయుచున్.

670


క.

మఱియు గదాఖడ్గాదుల, మెఱుఁగు లడర విక్రమించి మించి తెరల్పం
బఱచిరి కపు లంగదుఁ డ, త్తఱి నిలునిలుఁ డనుచు నిలిపి తరుచరబలమున్.

671

క.

తలకొలుప ఋషభగజశత, వలిపనసగవాక్షపృథు లవారితబాహా
బలము నిగుడంగ మగుడం, దలకొన నత్తారకొడుకు తలకడచి వడిన్.

672


చ.

వరుసఁ దరుప్రహారముల వాజుల నొంచుచుఁ బడ్డ తత్కళే
బరములు నుగ్గు గాఁగ రథరపంక్తుల వ్రేయుచు గుండు లెత్తి స
త్వరగతిఁ గుంభముల్ పగుల దంతుల వైచుచు దంతకాండముల్
గురుసులఁ గూడి రాఁ దిగిచి ఘోరనిశాచరకోటి మోఁదుచున్.

673


క.

తక్కినవానరవీరులు, నొక్కుమ్మడిఁ గడఁగి [57]సంగరోత్సాహము పెం
పక్కజము గాఁగఁ దొడఁగిరి, రక్కసులుం బోక మత్సరంబునఁ బెనఁగన్.

674


ఉ.

అంగదుఁ డంత నంతకసమాకృతిఁ బేర్చి శతాంగమత్తమా
తంగతురంగసంఘము లుదగ్రతరాంఘ్రిపతాడనంబులం
దుంగనగాగ్రపాతములఁ దోరపుమ్రోఁతలు సెల్లఁ ద్రెళ్ల మొ
గ్గం గడుఁ బెల్లు డొల్ల భుజగర్వము సూపె విశృంఖలక్రియన్.

675


సీ.

దంతావళోత్క్షిప్తతరులీలఁ గడ కాళ్లు, వడిఁ గేలఁ గొని వీచి వైచి వైచి
పక్వపతత్తాళఫలభంగిఁ గ్రుంగ మ, స్తకములు దలములఁ జఱిచి చఱిచి
గాజులపేర్లు రోఁకలి దాఁకుగతి దోఁప, ముంజేత నంగముల్ మోఁది మోఁది
బొందు లద్రులమాడ్కి బ్రోవు లై పడఁ బవి, స్పర్శనిష్ఠురముష్టిఁ జదిపి చదిపి
కాలపాశసంకాశోగ్రవాలవల్లి, మెడల నురివెట్టి నేలతో నడిచి యడిచి
సానుదృఢజానుహతుల వక్షములు నలిపి, నలిపి చెలఁగునవ్వాలినందనునిఁ జూచి.

676


క.

కైదువులు విడిచి పదహతి, మేదిని గంపింప భీతిమెయిఁ బఱచిరి క్ర
వ్యాదులు వనచరు లార్వ మ, హోదధిఁ బడ లంక సొరఁగ నొక్కయురవడిన్.

677


వ.

అంత మహాకాయునిమంత్రులు వజ్రనాభరుధిరాశకాలదంష్ట్రకాలకల్పవపాశ
శతమాయధూమ్రదుర్ధరు లనువారు ననుజుం డగుమహానాదుం డనువాఁడునుం
బేరెలుంగులు సెలంగ నిశాచరుల మగుడం బురికొల్పికొని కీలాకరాళశూలం
బులు మెఱయం దఱిమినం బృథుండు వజ్రనాభుని గవాక్షుండు రుధిరాక్షుని
ఋషభుండు గాలదంష్ట్రునిఁ బనసుండు కాలకల్పుని గజుండు వపాశుని శతబలి
శతమాయునిఁ గ్రోధనుండు ధూమ్రుని మేఘపుష్పుండు దుర్ధరు నంగదుండు మ
హానాదమహాకాయులను మఱియు మహావీరు లయినవానరులు దక్కినరక్కసు
లను దలపడ నుభయబలంబులుఁ బరస్పరహతులం గుసుమితకింశుకవనంబుల
విడంబించుచు ఘోరప్రకారంబులఁ బోరుచుండునయ్యవసరంబున.

678


సీ.

వజ్రనాభుఁడు పృథు వడి నేడుగోలల, నుదు రేసి నెఱఁకుఱు నూట నించి
తత్కరోత్క్షిప్తభూధరశృంగముల నెడఁ, బదివ్రక్క లై పడ భల్లనిహతి
నఱకినఁ జూచి యన్నగచరవీరుండు, నరదంబు నుగ్గుగా నలుక నుఱికి

భుజదండహతి సూతుఁ బొరిగొని హయముల, మర్దించి విలు ద్రుంచి మఱియు వాని
కడిఁదిశూలఘాతమునకుఁ గలఁక లేక, శిరము దాటించి యన్నిశాచరుని నొడిసి
కాలు పట్టి మీఁదికి నెత్తి నేలతోడ, నొడలు గుల్లలతిత్తిగా నుదికి చంపె.

679


క.

మగఁటిమి రుధిరాశుఁడు బలు, దెగ గొంచును వింటిమ్రోఁత దెస లంట భుజా
యుగళము నోనేసి గవా, క్షు గవాక్షితవక్షుఁ జేసె ఘోరాస్త్రములన్.

680


సీ.

ఏచి వెండియుఁ దరుల్ వైచిన వాఁ డవి, యమ్ములఁ దునుమాడి యతని మూర్ఛ
వో నేసి యాతఁడు భూరిసాలము వైవ, నదియు ఖండించి ఘోరాశుగములు
పదిటను నవ్వీరుఁ బరవశుఁ గావించి, యగచరావళిఁ ద్రుంప నంతలోన
వార లిర్వురుఁ చేఱి వడి నార్చి రెందు గ, వాక్షుఁడు గిరిశృంగహతి రథంబు
విఱిచి తనపాటునకుఁ దప్ప నుఱికి వాఁడు, ఖడ్గపాణియై యేతెంచి కదిసి తన్ను
వ్రేయ నంకింప వక్షంబు వ్రేసి చంపెఁ, బడిన పరిఘమొక్కటి గొని కడిమి మెఱయ.

680అ


క.

ఐరావతకులజం బగు, వారణతిలకంబు నెక్కి వడి ఋషభునిపై
ఘోరగతిఁ గాలదంష్ట్రుఁడు, ధీరాటోపంబుతోడ దీకొలువుటయున్.

681


ఉ.

పట్టక మున్న పై కుఱికి పాణితలంబునఁ బూన్చి కుంభముల్
బిట్టవియంగ వ్రేసి యది బిమ్మిటితో నొకవింటిపట్టు గీ
పెట్టుచు వెన్క కేఁగఁ గెడపెం గరలుంఠితతద్విషాణసం
ఘట్టనఁ జేసి దాని మదగర్వ మడంగఁ బ్లవంగసింహుఁడున్.

682


చ.

అరుదుగఁ గాలకల్పుఁడు మహాశనికల్పము లైనబాణముల్
పరువడి నేయుచుం బనసుపై నడరం బనసుండు నార్పుతో
నరదము నుగ్గుగా నతిరయంబునఁ దాఁచి కఠోరముష్టిని
ర్భరహతి వానిఁ గూల్చె రుధిరంబులు ముక్కున నోరఁ గ్రక్కఁగన్.

683


క.

అలిగి వపాశుఁడు వానర, బలములఁ బొరిగొనుచు గజుఁడు పై వైచుమహా
శిల లెడఁబడ నేయుచు న, బ్బలువీరునిఁ దోస నొంచెఁ బదిబాణములన్.

684


చ.

బలువిడి నొంచి మించి పటుబాణము లే డుర ముచ్చిపాఱు నై
దళికము దూఱ నేసి నిఖరలాంగకముల్ గొన నేయ నమ్మహా
బలుఁడు సుపర్ణవేగమునఁ బాఱి నిశాచరురత్నకుండల
జ్వలితశిరంబు వే పెఱికి వైచె నభంబు సెలంగ నార్చుచున్.

685


ఆ.

గజునిమీఁద [58]మత్తగజలీల శతమాయుఁ, డడర నడరెఁ బరిఘహస్తుఁ డగుచు
నతఁడుఁ బనసవృషభశతవలిప్రముఖులు, తోన తరులు గిరులుఁ బూని నడవ.

686


వ.

అప్పు డారాక్షసుండునుం దనమాయాబలంబున శరశక్తిగదాచక్రపరిఘముసల
తోమరభిండివాలప్రముఖప్రహరణంబులం గపుల సుడివడ బడలువడం జేయుచుఁ
దనమీఁద నంగదుఁ డనేకయూథపసహితుం డై కురియునుత్తాలసాలాదిపాదపం

బులం గత్తివాతిదూపులం దునుమాడి తోడన గవాక్షుండు గిరిశృంగంబును
వృషభుండు వృక్షంబును బనసుండు గండశైలంబును గజుండు పరిఘంబును శత
వలి శతాంగచక్రంబును గ్రోధనుండు తోమరంబును వైవ నవియును దెగ నేసి
విజృంభించుచుం బురోభాగంబున నున్న యనేకబలీముఖుల శిలీముఖంబులఁ బొలి
యించుచుండఁ గ్రోధంబునం గ్రోధనమేఘపుష్పులు ధూమ్రదుర్ధరులరథంబుల
కుడికి కులిశసమస్పర్శంబు లగుకరతలంబులం దలలు పగులఁ జఱిచి చంపినం
గనుంగొని ధనుర్గుణంబు మొరయించుచుఁ గోపాటోపంబున.

687


సీ.

ఒక్కొక్కతూపున నొక్కట నూర్వుర, నొక్కలావున గ్రుచ్చి యొక్కమాటు
మూఁడును బదియు నమ్ములు గొని సంధించి, కోల నొక్కొక్కనిఁ గూలనేసి
యిషువు లైదైదుల నింద్రుమన్మనిఁ దొమ్మి, దింట గవాక్షుఁ బందింటఁ బృథుని
నేడిట ఋషభుని నిరుమూఁట గజు రెండు, పదులఁ బనసు గృధపత్ర మైన
చండకాండమొకట శతవలి నొప్పించి, శతసహస్రసంఖ్య లతులగతుల
సాయకములు పఱపి చంపుచుఁ గపిసేన, బాణమారుతమునఁ బాఱ నూఁదె.

688


క.

ఆయెడఁ గొందఱు గపులు ప, లాయనముగఁ దారకొడు కలంతయు వ్రీడం
జేయ జయో వాస్తు మృతి, ర్వా యన యూథపులు నిలిచి వైచిరి శిలలన్.

689


ఉ.

వైవఁగ వాఁడు భల్లముల [59]వారిఁ దెరల్చి సహస్రమార్గణిన్
వేవుర వీరులం గెడపి వెండియు మండుచుఁ గోల నొక్కనిం
నా వెస నెల్లయూథపులఁ గన్కని నేసి చెలంగి యొత్తె నా
శావియదంతరం బద్రువ జైత్రవిశృంఖలవృత్తి శంఖమున్.

690


క.

ఉరవడి నప్పుడు పైఁబడి, పరిగొని పృథుఁ డాయుధములఁ బడగ గజుండున్
హరుల గవాక్షుఁడుఁ బనసుం, డు రథంబును సూతు ఋషభుడుం బొలియింపన్.

691


సీ.

శతవలి నిర్ఘాతసమముష్టి శతమాయుఁ, బెలుచమస్తకము నొప్పింప మఱియుఁ
గ్రొవ్వాలుఁబలుకయుఁ గొని మీఁది కెగయఁగ, నొకనిఖడ్గంబు దా నొడిసికొనుచు
నెగసి [60]రాక్షసుఁడ యెం దేఁగెదు నిలుమంచుఁ దలపడి పోరుచోఁ దనదువ్రేటు
ఖేటంబుచేఁ దప్పఁ గీశ కొ మ్మని యుర, స్స్థలము వ్రేసిన నెడఁ దప్పఁ దొలఁగి
శిరమునకుఁ జూపి దిగువ లక్షించి వ్రేయఁ, దొడలు తెగి వాఁడు గరుడునితుండనిహతిఁ
బడుమహాఫణిగతి సుడివడుచు వచ్చి, నేలఁ దలక్రిందుగాఁ బడి ధూళి బ్రుంగె.

692


వ.

ఇట్లు శతమాయుండు గూలినం బ్లవంగపుంగవులు చెలంగి రక్షోబలంబుల వధియిం
పఁ దదీయవిజృంభణంబునకుం దనమంత్రులపాటునకు రోషవిషాదంబులు వొడమ
ననుజసహాయుం డగుమహాకాయుఁ డింద్రచాపకల్పం బగుధనువు సారించుచు సా

రథిం జూచి యమోఘబాణంబుల సుగ్రీవాంజనేయప్రముఖవలీముఖులయు రా
ఘవులయుఁ బ్రాణంబులు గొనియెదం పేరు వోవనిమ్మని నియోగించిన వాఁడును
యుగ్యంబులపగ్గంబులు వదలి యట్ల చేయ బలువిడిఁ దరుచరులు గురియుమహా
పాషాణపాదపంబులు శరపరంపరలు నుగ్గు సేయుచుఁ గాంచనపుంఖంబులు వెలుం
గ వివిధవర్ణంబులు గలుగుమయూరపత్రచిత్రితంబు లగుశిలీముఖంబులు నిగుడ
మిడుతపరి గవియున ట్లంబరంబు నాచ్ఛాదించుచు బలువలలం బడినపులుఁగుల
తెఱంగున నద్రిచరుల దైన్యంబు నొందించుచు ఘోరప్రకారంబున.

693

అంగదుండు మహాకాయుం జంపుట

మ.

భ్రమదాలాతముకైవడిం బసిఁడిచాపం బాతతాకృష్టివే
గమునం జూడ్కికిఁ దోఁప వెండియుఁ దటిత్కల్పోరుమౌర్వీవిరా
వ మఖండం బగుచుండ సాంద్రకరకావర్షంబుచేతం బతం
గము [61]లె ట్టట్టయి కూల నేసెఁ గపులం గాండప్రకాండాహతిన్.

694


ఉ.

అయ్యెడ వృక్షఖండనిచయంబులుఁ బర్వతకూటకోటిపె
న్వ్రయ్యలుఁ గృత్తవానరశిరశ్చరణాదులు నేమిఘట్టనం
గ్రయ్యలు గట్టి యున్న రుధిరస్థలులుం బతితాస్త్రపంక్తులుం
గయ్యపునేల నుగ్రగతిఁ గానఁబడం దఱు చయ్యె నెంతయున్.

695


క.

వ్రేలిడ నెడ లేకుండఁగఁ, గోలలు గాత్రములఁ గాఁడి కుసుమితవాతా
స్ఫాలితరక్తాశోకాం, దోళనగతిఁ బొల్చి రసముతో యూథపతుల్.

696


శా.

వారిం జూచి ముహూర్తమాత్రము శరవ్రాతంబు సైరింపుఁడీ
మీ రే నొక్కఁడఁ బూని వీని రణభూమిం గూల్తు నాపాలివాఁ
డీరాత్రించరుఁ డంచు వాలితనయుం డేఁ దున్నయ ట్లున్నమై
ఘోరాస్త్రంబులు వో విదిర్చికొనుచుం గ్రోధాతిరేకంబునన్.

697


క.

నిడు పొకయోజన మగుశిల, వడిఁ గొని యోరోరి దీనివాటునఁ బొడియై
పడి తనుచు వైవ వాఁడును, నడుమన భల్లములఁ ద్రుంచె నాశైలంబున్.

698


క.

వక్ష మొకట నుదు రొక్కట, దక్షిణభుజ మొంట రెంట దట్టించుచు నా
వృక్షచరవీరు నేసె న, లక్షితసంధానహస్తలాఘవ మొప్పన్.

699


ఆ.

అట్టు దూల నేయ నాతండు మనసిల, కఱచి ధైర్య మూఁత గాఁగ నిలిచి
నిటలతలము గంటినెత్తురు మోముపైఁ, దొరఁగ నల్లఁ గేలఁ దుడిచికొనుచు.

700


ఉ.

వాలుమగంటిమిం గడఁగి వారక సాలరసాలతాలహిం
తాలముఖద్రుమంబుల రణం బొనరింప నతండు తత్కరో
న్మూలితచాలితోత్థితసముజ్ఝితవృక్షము లొక్కమాటు బ
ల్లోలలఁ ద్రుంచి వైచి నెఱఁకుల్ వడిఁ దూఱఁగ నేయ నయ్యెడన్.

701

తే.

మొదలఁ బిడుగు వేసినవానిఁ బిదపఁ గొఱవిఁ, జూఁడిన ట్లన్నకును నెడ సొచ్చి మూడు
నేడునమ్ముల నదరంట నేసి దర్ప, మున మహానాదుఁ డార్వ నవ్వనచరుండు.

702


క.

కనలి యొకగండశైలము, గొని తేరికి వైవ వాని ఘోరగదాఘ
ట్టన నదియు రాలి పొలియుట, గని పై కుఱికి విలు విఱిచి గ్రక్కున నతనిన్.

703


క.

తల యొడిసి పట్టి గగన, స్థలి జిఱజిఱఁ ద్రిప్పి రక్తధారలు మెదడుం
బెలుచ వెలి కుఱుక లోనె,మ్ములు నుగ్గుగ నేలతోడ మోఁది వధించెన్.

704


క.

అంత మహాకాయుఁడు గడు, నంతస్తాపంబు సేయు ననుజునిపా ట
త్యంతక్రోధముఁ బెనుపఁగ, నంతకుగతిఁ గదిసి గుదియ నంగదు వ్రేసెన్.

705


సీ.

వ్రేయ నవ్వీరుండు వివశుఁ డై పడ నద్రి, చరు లది చూచి పాషాణవృక్ష
వృష్టిని దను ముంప వెస గవాక్షునిఁ బది, శరములఁ బృథు నైదుసాయకములఁ
గ్రోధను నేఁబదికోలల వృషభు నె, న్మిదిపదులమ్ముల మేఘపుష్పు
గజుని నేనూఱంబకకమ్ముల శతవలి, బాణత్రయమ్మునఁ బనసు నేడు
మార్గణముల నొంచి మఱియును నొక్కొక్క, ములికి నెల్లకపుల ముడుఁగు నేసె
నంతలోనఁ దెలిసి యంగదుండును గదా, పాణి యగుచు రథముపైకి నుఱికి.

706


చ.

వికటవిశంకటభ్రుకుటి వీరరసోద్భటవీచివిస్ఫుర
ద్వికృతి నటింపఁ గట్టలుక వేయిహయంబుల సూతుఁ జంపి కా
ర్ముకమును గేతనంబు రథమున్ వితథంబులు చేసి వైచి సీ
సక మెడలించి నెత్తి పెలుచన్ దగవ్రేయుచు దాఁటె నుర్వికిన్.

707


మ.

విరథుం డై రజనీచరుండును గదావిస్ఫూర్తు లారన్ వసుం
ధరకున్ గ్రక్కున దాఁట నొక్కొకని దోర్దండప్రహారంబు లొం
డొరుబల్వి ళ్లితరేతరప్రహతు లన్యోన్యప్రహింసల్ పర
స్పరధిక్కారము లొప్ప వారికి మహాసంగ్రామ మయ్యెం దగన్.

708


ఉ.

అప్పుడు దీప్తహేమవలయద్యుతు లాకస మంటఁగా గదల్
ద్రిప్పుట లెత్తి వ్రేయుటలు దీవ్రగతం బయి దాఁటి పోవుటల్
తప్పఁ దొలంగుటల్ బహువిధంబుల నొంచుట లార్చి వ్రేసినం
[62]జిప్పలు వాఱ నొగ్గుటలుఁ జెల్లఁగ నిద్దఱుఁ బోరి రుద్ధతిన్.

709


క.

మఱియుఁ దముఁ బొదువుమూర్ఛల, తెఱవులఁ గైకొనుచు వారు దెగఁబోరి గదల్
విఱిగి పడ బాహుయుద్ధము, నెఱపఁ దొడంగిరి కడంగి నిష్ఠురభంగిన్.

710


క.

అత్తఱి నెగసినధూళి వి, యత్తలభూభాగమధ్య మంతయుఁ గప్పం
దత్తిమిరతిరోహితు లై, మత్తద్విరదములకరణి మలసి బెరయుచున్.

711


క.

పొడుచుచు వ్రేయుచుఁ బట్టుచు, విడుచుచుఁ గ్రొ వ్వెసక మెసఁగ వెసఁ దాఁకుచు బ
ల్విడిఁ దిరిగి మడమ దాఁచుచుఁ, బడవైచుచుఁ గ్రింద మీఁదఁ బడుచు నెగయుచున్.

712

శా.

హాహాకారము లారఁగా నుభయసైన్యశ్రేణు లగ్గించును
త్సాహోక్తుల్ ఘనపాదఘట్టనలు నుద్యత్పాతముల్ హుంకృతుల్
బాహాస్ఫాలనముల్ మహాహతులు శుంభద్గర్జనల్ తర్జనో
గ్రాహూతుల్ వికటాట్టహాసములు మ్రోయం బోరి రత్యుద్ధతిన్.

713


వ.

ఇత్తెఱంగునం బోరి వెండియు.

714


ఉ.

శోణితధారలం బుడమి జొత్తిలఁ గూర్పరజానుముష్టిదోః
పాణితలప్రకోష్ఠనఖపాదశిరఃకరభోగ్రఘాతము
ల్ప్రాణములం గదల్పఁగఁ జలంబున ధైర్యము నిక్కుఁ బెక్కు వి
న్నాణము లొప్పఁగా సరిఁ బెనంగ నలుం డెలుఁగెత్తి యి ట్లనున్.

715


ఉ.

వాలితనూజ దోర్బలజవంబుల వాలికి నెత్తు వత్తు నీ
వాలమునన్ భవజ్జనకుఁ డట్టిమహోద్ధతుఁ డైనదుందుభి
న్లీల వధింపఁడే యితని నీవును నింక వధించి దిక్కులన్
వాలినతండ్రికీర్తులకు వన్నియ పెట్టుదు గాక నావుడున్.

716


తే.

పొంగి లంఘించి యక్కపిపుంగవుండు, రక్తధారలు వదనరంధ్రముల వెడలఁ
జటులతర మై మహాశనిస్పర్శ మయిన, పాణితలమున నడినెత్తిఁ బగుల వ్రేసె.

717


క.

వ్రేటునకు వాఁడుఁ బిడికిటఁ, బోటుగొనం గిట్ట పట్టి పొరిఁ బ్రాణంబుల్
పేటెత్త నెత్తి మృతి క, ప్పా టొక్కఁడ చాల నేలఁ బడవైచి వడిన్.

718


క.

ఉర మెక్కి పశువుఁ జంపిన, కరణిం జెయి గాలు మాఱు గదలుప నెమ్మై
వెరవెడలఁ బొదివి వానిం, బరుషగతిం జంపి భూతబలి గావించెన్.

719


వ.

అట్లు మహాకాయుండు పొలిసినం గనుంగొని వనచరులు సింహనాదంబులు సే
యుచు నిశాచరులం దోలి వాలినందనుం గొనియాడుచుఁ దత్పురస్సరంబుగా
రామచంద్రుసమీపంబునకుం జనుదెంచి సమరవృత్తాంతంబంతయు విన్నవించిన.

720


ఉ.

ఆవసుధేశుఁ డంగదుని నప్పుడు గౌఁగిటఁ జేర్చి యట్లు సం
భావన మొప్ప నంచితకృపామతిఁ జూడఁగ లక్ష్మణుండు
గ్రీవుఁడు వాయునందనుఁడుఁ ద్రిక్కినవారును గారవించి రం
దావిజయంబుపెంపు గొనియాడి విభీషణుఁ డప్పు డి ట్లనున్.

721


క.

జననాథ మహాకాయుం, డు నిశాచరభటులలోఁ గడుం బ్రబలుం డా
ఘనభుజుఁడు సచ్చినప్పుడ, యనిఁ జచ్చినవాఁడు సూ దశాస్యుం డింకన్.

722


వ.

అనిన విని రాముండు సంతోషంబున నుండె నంత లంకాపురంబున.

723


తే.

దీనవదనులు శోణితదిగ్ధతనులు, నై నిశాచరుల్ వడిఁ బాఱి యట్లు కయ్య
మున మహాకాయశతమాయముఖ్యులయిన, రక్కసులపాటు చెప్పిన రావణుండు.

724


ఉ.

కొఱవులవేఁడిమిం గడచుఘోరపుఁబల్కులు కర్ణరంధ్రముల్
చుఱచుఱ దాఁకి పాఱి మదిఁ జూఁడిన మోములు వాంచి మిన్ను పై

నొఱగినయట్టిచందమున నొక్కఁడుఁ బల్కక కొంతసేపు ని
వ్వెఱపడి తూలుచుండెఁ బృథివీస్థలిఁ జూడ్కులు నిల్పి కొల్వునన్.

725


క.

అద్దశముఖుఁ డ ట్లొందువి, పద్దశ పరికించి ఱిచ్చవడి మంత్రులు దా
రెద్దియును బల్కకుండిరి, పెద్దదడవు వింజ మాఁక పెట్టినభంగిన్.

726


వ.

అంత దిగ్గనం గొలువు విరిసి యంతఃపురంబున కరిగి.

727


చ.

పరిభవచింత చిత్తమున బల్పుకొనం దలపోఁతలన్ వగల్
గరుసులు దాఁట నించుకయుఁ గంటికిఁ గూరుకు రాక శయ్యపైఁ
బొరలుచు లేచుచున్ మరలఁ బొందుచుఁ గూ ర్కొకభంగి నవ్విభా
వరిఁ గ్రమియించె రావణుఁ డవారితశోకసమాకులాత్ముఁ డై.

728


వ.

ఇట్లు వేగించి ధైర్యంబు దెచ్చుకొని నిజనికేతనంబు వెడలి రథారూఢుం డై
సమస్తమంత్రులు సామంతులుఁ గొలువ నరిగి కోటచుట్టు నున్నసైన్యంబులం
గనుంగొనుచు నయ్యైగుల్మంబులం దగినయెడలకు వలయువారిం బయికాపు
లుండ నియోగించి కొలువు చొచ్చి కొండొకదడవునకుఁ బ్రృహస్తు నవలోకించి.

729


తే.

ఏను గుంభకర్ణుండును నింద్రజిత్తు, నీవు నీనికుంభుడుఁ దక్క నిట్లు పురము
బలసి విడిసినకపిసేనఁ బాఱఁ దోల, నన్యు లిం కెవ్వరును గల్గ రట్లు గాన.

730


ఉ.

నేఁడు బలంబు నెల్లఁ గొని నీ నీవు మహార్చులఁ బేర్చుచిచ్చుచే
మాఁడిన కాననంబుగతి మర్కటసైన్యము సొంపు దూల నీ
వేఁడిమి సూపి యూథపులవి త్తడఁగం దునుమాడి వైవు క్రొ
వ్వాఁడిశరంబులం గడిమి వాలినవాలితనూజుఁ డాదిగన్.

731


శా.

నిస్సాణంబుల దుస్సహధ్వనులచే నీసేన లందంద రో
దస్సంధుల్ పగిలించుచున్ నడువఁగాఁ దత్సంభ్రమం బోర్వ కం
తస్సారంబులు దక్కి పాఱుదురు సుత్రామాదు లైనన్ భవ
న్నిస్సీమప్రకటప్రతాపమునకు న్వీ రెంతవా రారయన్.

732


చ.

అమితబలాఢ్య నీకు విజయంబు నిజం బటు గాక నీదుచి
త్తమున నజయ్యు లానృపులు తా రని యున్న మదీయబాహుశౌ
ర్యము గడుఁ దూల వారికి ఖరాదులచావులు దక్కిపోవఁ గ
ష్టమునకు నోర్చి సంధికి నొడంబడఁ జెప్పిన నట్ల చేసెదన్.

733


వ.

అనినఁ బ్రృహస్తుఁ డి ట్లనియె.

734


క.

అస్తోకమతులచేత స, మస్తముఁ బరికించి యుక్త మగుసామ ముప
న్యస్తం బయి మనచేత ని, రస్తం బయినది కదా దశానన మొదలన్.

735


క.

మెచ్చగునె సాహసానకు, వచ్చినతఱి సంధి మనల వారలకొలఁదుల్
నిచ్చయము సేసి యిటువలెఁ, జొచ్చితి మన కింక నొండుచొప్పులు గలవే.

736


శా.

నీచే మన్నన గన్నదానికిఁ దగన్ నేఁ డాజి విద్యున్నట

జ్జ్యాచంచద్ధనురభ్రముక్తవిశిఖాసారంబు ఘోరంబుగా
వీచీబంధురరక్తసింధువులు గావింతుం బ్లవంగాంగముల్
వే చెండాడుదుఁ దెత్తు దీనదశకున్ వే యేల భూపాలురన్.

737


క.

ధనములపైఁ దనయులపై, వనితలపై బంధుమిత్రవర్గముపైఁ [63]బు
ట్టినప్రియమునకంటెను నీ, కనిఁ బ్రాణము లిచ్చునదియ కడుఁబ్రియ మధిపా.

738

ప్రహస్తుండు నీలునితో యుద్ధము చేసి చచ్చుట

వ.

అని పలికి బలాధ్యక్షులం జూచి మీరు సర్వసన్నాహసమేతులరై సేనలం గొని
రం డని నియోగించిన నాకు నట్ల కావింప నప్పంక్తికంధరు వీడ్కొని పటహాది
మహాభైరవారావంబులు సెలంగం జనుదెంచి.

739


సీ.

నేమిఘట్టనముల నేల వ్రక్కలు సేయఁ గడఁగుచందమునఁ జక్రంబు లెసఁగ
గరువలిజవమును గడచను నన్నట్లు, తరళితగతుల రథ్యములు మెఱయ
భానుబింబము నుద్దిపట్ట నూఁకించుపొ, ల్పున నహిధ్వజము నాలుకలు గ్రోయ
నితరరవంబుల నెల్ల నుల్లసమాడు, క్రియ మణిరణితకింకిణులు మొరయ
[64]హేమరశ్ములు హిమధామురశ్ములచెల్వు, గెలువ సూతుఁ డప్పు డెలమిఁ దేరు
పన్ని తేర నెక్కి బలములతోఁ బ్రహ, స్తుండు వెడలె లంకతూర్పుగవని.

740


క.

వెడలి మహోత్పాతము లెడ, నెడఁ బెక్కులు గనియు వాని నింతయుఁ గొన కె
క్కుడువడి సేనాభరమునఁ, బుడమి వడంకాడ నతఁడు పోరికి నడచెన్.

741


వ.

అప్పుడు.

742


క.

 జననాథుండు విభీషణుఁ, గనుఁగొని యీవచ్చుసమరగర్వితుఁ డెవ్వాఁ
డనిన నితండు ప్రహస్తుం, డనువాఁడు సమస్తసేన కధిపతి వీటన్.

743


ఉ.

మూఁడవభాగ మీబలసమూహము రావణుసేనలోన నే
నాఁడు దశాస్యుఁ డీతనిన నచ్చి మదోద్ధతవృత్తి నుండు నె
వ్వాఁడును నింతచెల్లుబడివాఁడు నరేశ్వర లంకలోపలన్
లేఁ డితఁ డెప్పుడున్ సమరలీలల ముక్కునబంటి వజ్రికిన్.

744


తే.

అనఁగ నసిగదాముసలచక్రాదిసాధ, నములు మెఱుఁగులు వాఱంగ నలిఁ జెలంగి
యామినీచరుల్ ద్రోచిన నద్రిచరులు, వీఁక నార్పులతో వచ్చి తాఁకి రపుడు.

745


సీ.

ఏనుంగు లడరిన నెసఁగుబొందులు రూపు, సెడి నల్గడలఁ జెల్లచెదరు గాఁగ
నరదంబు లురవడి వడరినపట్టులఁ, బీనుంగుపెంటలు పెల్లు గాఁ గ
సొరిది ఘోటకములు సొచ్చినచోటులు, నవయవభేదంబు లరుదు గాఁగఁ
గాల్వు రొక్కుమ్మడిఁ గడఁగినఠావుల, నెత్తురువఱదలు నెఱవు గాఁగ
రక్కసులు విక్రమింప మర్కటులు గడఁగి, విపులపాషాణపర్వతవృక్షవృష్టి

హతులఁ జతురంగబలసమూరహములు పెక్కు, మడియ రణకేళి సల్పిరి మచ్చరమున.

746


వ.

అంతఁ బ్రహస్తునిమంత్రులు నరాంతకుండును గుంభహనుండును మహానాదుం
డును సమున్నతుండు ననునలువురుఁ జెలంగుచుం బ్లవంగబలంబుల సమయింపం
దొడంగిన.

747


సీ.

ద్వివిదుండు గిరిశృంగతీవ్రపాతంబున, నేల నరాంతకుఁ గూలవైచెఁ
దారుండు దారుణగతరలీల నిరుగేలఁ, గొని సాలమునఁ గుంభహను వధించె
జాంబవంతుఁడు శిలోచ్చయమున వక్షము, నలిపి మహానాదుఁ బొలియఁజేసె
దుర్ముఖుం డనువాఁడు దోర్బల మెసఁగ స, మున్నతుఁ దరువున మోఁది కెడపె
నిట్లు విక్రమించునేపు ప్రహస్తుండు, సూచి కపిబలంబు సుడివడంగ
గగన మంపగములఁ గప్పుచుఁ గోదండ, గుణము మొరయఁ బేర్చి రణ మొనర్చె.

748


క.

పెల్లుగ నట భల్లాదుల, డొల్లుతలలుఁ జిక్కువడి పడుభుజాజంఘల్
వెల్లువ లగుశోణితములు, ద్రెళ్లుశరీరములు నుగ్రరేఖం జేయన్.

749


మ.

హరివీరావయవంబు లోలి రథరథ్యాపార్శ్వభాగంబులం
దఱు చై యుండ ఘనాస్రపంకములు మేదఃఫేనముల్ వక్త్రతా
మరసశ్రేణులుఁ గృత్తమస్తకవపుర్మత్స్యంబులుం గల్గి నె
త్తురుటేఱుల్ శరవృష్టిచే నొదవె దోషాచరుం డేయఁగన్.

750


స్రగ్ధర.

ఆలోఁ బుంఖానుపుంఖం బగుచు మథనవేళార్ణవాకీర్ణవీచీ
జాలశ్రీలట్టు పైపై శరము లడరఁగా వైఁచి కట్టల్కతోడన్
నీలుం డుత్తాలసాలాన్వితభుజ మెసఁగ న్వీఁకమైఁ దాఁకి వాజుల్
వ్రాలన్ సూతుండు గూలన్ రథము వితథమై మ్రగ్గ విల్ దూల మోఁదెన్.

751


వ.

ఇటు విరథుం జేసినఁ బ్రహస్తుండును ముసలహస్తుం డగుచు నిలాతలంబున కుఱి
కి తఱిమె నప్పు డవ్వనచరనిశాచరు లిరువురు నుభయబలంబులవారును దత్ప్ర
హారంబులకు మెచ్చుచు నచ్చెరువంది కనుంగొనుచుండం బ్రచండభంగిం గడంగి.

752


క.

బలుపులులపగిది మదగజ, ములకైవడి దృప్తసింహములచందమునం
గలయఁబడి పోరఁ దొడఁగిరి, బలరిపువృత్రులకు వారు పాటి యనంగన్.

753


చ.

అసమున నట్లు పోరుసమయంబున రక్కసుఁ డల్కతో మహా
యసముసలంబు హేమవలయద్యుతు లారఁగఁ ద్రిప్పి వీఁకమై
నొస లవియంగ వ్రేయఁ గడు నొచ్చియు నాతఁడు వానిఁ గ్రమ్మఱన్
వస మఱఁజేతివృక్షమున వక్షము బల్విడి వైచె నార్చుచున్.

754


ఉ.

దానికి మా ఱొనర్ప భయదక్రియ రోకలి రెండుచేతులం
బూనఁగ వెండియుం గనలి భూరిమహీధరశృంగ మెత్తి య
వ్వానరపుంగవుండు వెస వైచుడు వానిశిరంబు వ్రక్క లై
ఫేనిలరక్తపూరములు పెల్లుగఁ గ్రక్కుచు వ్రాలె నేలకున్.

755

క.

తరుగిరివర్షము గురియుచు, హరివీరులు వెనుకఁ దగులునప్పుడు లంకా
పురితెరువు పట్టి పాఱిరి, ధరణీతల మద్రువ యాతుధానులు భీతిన్.

756


వ.

ఇట్లు ప్రహస్తుండు వడినం జూచి రామలక్ష్మణులును సుగ్రీవాదులును నీలు ను
చితవాక్యంబులం గొనియాడి రంత నక్కడ రావణుండు నంతవృత్తాంతం బెఱిం
గి మాతులవధప్రకారంబునకు శోకించి పరాజయక్రోధంబున నాస్థానంబు గల
యం గనుంగొని.

757


ఉ.

ఇట్టితెఱంగులుం గలిగెనే మనవీటికి నాఁడు వాసవుం
దొట్టి నిలింపసైన్యములఁ దోలిన వీరవరుం బ్రహస్తు నేఁ
డెట్టొకొ చంపె నీలుఁ డని నీగతిఁ గ్రోతులచేతఁ బోయి నా
చుట్టలు సేనలుం బడఁగఁ జూచెదఁ జూచితిరే నిశాచరుల్.

758


క.

నావా రనిఁ బడి రోడిరి, నా వారనివగలఁ బొగుల నాకుం జనునే
దేవారికిఁ దేజము గల, దే వారికి నిట్లు సెల్ల నిచ్చినమీఁదన్.

759


క.

ఏన చని వట్టిపోయిన, కానలఁ గార్చిచ్చు కాల్చుకైవడి మద్బా
ణానలమున నానరులను, వానరులను నీఱు సేసి వచ్చెదఁ గడిమిన్.

760


మ.

చతురంగంబులు పన్ని తెండు జవనాశ్వంబుం బతాకాభిశో
భితముం జాపశరాదిసాధనచయస్ఫీతంబు గావించి మీ
రతివేగంబునఁ దేరు తేరఁ జనుఁ డధ్యక్షుల్ దగన్ మీరు నా
యిత మై రండు సమస్తసైన్యములతో నేపారఁగాఁ బోరికిన్.

761


వ.

అని పలికి సమరంబునకు నరుగువాఁడై నిశ్చ యించునంత నంతయు నెఱింగి మం
దోదరి యంతఃపురంబు వెడలి యూపాక్షుండు మొదలగు మంత్రులం గొని ధవ
ళచ్ఛత్రచామరంబులు మెఱయ ముందట నెడగల్గి కొంద ఱాయుధపాణులతో
డ నతికాయుండు నడవ నేతెంచి చిత్రధ్వజమాలికలం బొలిచి కనత్కనకసో
పానశోభితంబులగు నెనుబదితెరువులు గలిగి యున్నయాస్థానమండపంబుఁ జొ
త్తెంచి దౌవారికులు జడియ మస్తకన్యస్తహస్తు లగుచు రక్షోవీరు లోసరింప
గద్దియం గదిసిన నద్దశాననుం డాదరంబున నద్దేవి నర్ధాసనాసీనం జేసి వచ్చిన
దొరల నర్హపీఠంబుల నుండ నియోగించి తదాగమనప్రయోజనంబు దెలియు
తలంపున.

762

రావణునకు మందోదరి నీతి చెప్పుట

క.

వనితా నీవును వీరును, జనుదెంచిన కార్య మేమిచందమొ నాకున్
వినిపింపు మనిన నమ్మయు, తనయ దశగ్రీవుతోడఁ దా ని ట్లనియెన్.

763


క.

న న్నధిప నీవు పెద్దయు, మన్నించుటఁ జనవు మెఱసి మంత్రులఁ గొని యే
విన్నపము సేయ వచ్చితి, విన్నం గుల మెల్ల బ్రతుకు విశ్రుతలీలన్.

764


తే.

కలన ధూమ్రాక్షుఁడాదిగాఁ గలుగువీరు, లద్రిచరులచేఁ బొలియుట కలిగి నీవు

వారిపై నెత్తిపోనున్నవార్త కేను, వెఱచి వచ్చితి మఱియుండుతెఱఁగు గాదు.

765


శా.

రాముం బుణ్యగుణాభిరాముఁ ద్రిజగద్రక్షైకదీక్షాగురున్
సామాన్యక్షితినాథుఁ గాఁ దలఁచి తత్సామర్థ్య మూహింప కా
భూమీశాగ్రణిదేవి నుత్తమసతిం బూతవ్రతన్ నీకుల
క్షేమం బొల్లనిభంగిఁ దెచ్చితి [65]ప్రభుశ్రీ నింత గర్హింతురే.

766


చ.

ఇనకులనాథు మున్ను వినమే మన మట్టిఖరాదులన్ రణం
బునఁ దునుమాడఁడే యొకఁడ పూని విరాధుఁ గబంధుఁ దాటకా
తనయు వధింపఁడే వినుము తక్కినవేయును నేల యమ్మహా
వనచరు నొక్కతూపునన వాలిఁ బరాక్రమశాలిఁ గూల్పఁడే.

767


ఉ.

ఆరసి చూడ లక్ష్మణుఁడు నమ్మహితాత్మునియట్టివాఁడ దు
ర్వారబలాఢ్యు లాకపులు వారలలావులు మున్ను మీరు గ
న్నారును వేయునేల నరనాయకుఁ డల్పుఁడు గాఁడు భూతసం
హార మొనర్ప నైనఁ గలఁ డల్గిన [66]వాలియ సాక్షి దానికిన్.

768


క.

సౌమిత్రి గొల్చిరా వన, భూమికిఁ దనతండ్రియాజ్ఞ భూసుతతోడన్
రాముఁడు సనుదెంచినవాఁ, డీమిషమున సురల మునుల నెల్లను బ్రోవన్.

769


ఆ.

కాన విగ్రహంబు కార్యంబు గాదు నీ, తిజ్ఞు లయినవారితెరువు దలఁచి
వలయువారిఁ బుచ్చ వలయు సామమునకు, రాముకడకు మనకు రాక్షసేంద్ర.

770


చ.

ఇదియ మతంబు మంత్రులకు హేమమహామణిముఖ్యవస్తువు
ల్మొనలుగ సీత నాసకలలోకశరణ్యున కిచ్చి పుచ్చి నె
మ్మది మముఁ బ్రోవు [67]మీవనితమాటలు ద్రోచితి గాక నీతికో
విదుఁడు విభీషణుండు మును వేయివిధంబులఁ జాటి చెప్పఁడే.

771


మ.

అతికాయుండును మాల్యవంతుఁడును యూపాక్షుండు నీమువ్వురున్
మతిమంతుల్ మన కెంతయున్ హితులు సామం బెట్లుఁ గావింప నే
రుతు రచ్చోన విభీషణుండు నయధుర్యుం డున్నవాఁ డాతఁ డే
గతి నైనన్ సమకొల్పఁ జాలుఁ దను నైక్ష్వాకుండు మన్నించుటన్.

772


చ.

సమరమునందు శాత్రవులె చత్తు రనం జన దాత్మహానియున్
సమకొను గెల్పు సందియము సన్నుతి కెక్కినసామభేదదా
నము లవి యుండఁగా మొదలు నాలవవెంట సమస్తబంధునా
శమునకు నోర్చి రాజు లిటు సాహసవృత్తిఁ దొడంగు టొప్పునే.

773


క.

మనవారలు ధూమ్రాక్షుం, డు నకంపనుఁడుం బ్రహస్తుఁడు మహాకాయుం
డును లోను గాఁగ సమరా, వనిఁ జచ్చిరి దీన నేమి వచ్చెం జెపుమా.

774


ఉ.

ఒక్కఁ డొకండ దిక్పతుల నోర్చినవారు ప్రహస్తముఖ్యు ల

య్యెక్కుడువీరు లాహవమహీస్థలి శత్రులచేత నీగతిం
జిక్కుట చూచియుం జలము సేసెద వింతకు మున్ను వారిలో
నొక్కరుఁ డైన వీరిగతి యూథపుఁ డీల్గినవాఁడు గల్గెనే.

775


ఆ.

వెర వెఱింగి కార్తవీర్యునితోఁ గార్య, సిద్ధికొఱకు సంధిఁ జేసికొనవె
పరశుజితసహస్ర[68]బాహు రాముని మీఱు, రాముఁ డేల తగఁడు సామమునకు.

776


ఉ.

ఎట్టు ఘటిల్లు సంధి గడునె గ్గొనరించిననన్ను నేల చే
పట్టు నతండు నా వలదు ప్రాంజలి యై తనుఁ గన్నమీఁద ని
ట్ట ట్టనువాఁడు గాఁడు శరణాగతవత్సలుఁ డమ్మహాత్ముతోఁ
బుట్టువు లక్ష్మణుండు దలఁపోయ గుణాఢ్యుఁడు మీఱఁ డన్నకున్.

777


క.

సింధురరథఘోటకభట, బంధురబలతతులు సుతులు బంధులుఁ దెగినన్
సంధికి రిపు లొల్లరు దశ, కంధర పద నిదియె సంధికార్యంబునకున్.

778


క.

ఎన్నివిధంబుల నైనం, దన్న కదా కావవలయుఁ దాఁ గల్గినమీఁ
ద న్నిఖలము గల దని హిత, వు న్నీతియుఁ దగవు భయము పుట్టఁగఁ జెప్పెన్.

779


వ.

ఇ ట్లనేకప్రకారంబుల నమ్మయుతనయ చెప్పిననయనిష్ఠురోక్తులు మనసునం బెట్టక
నిట్టూర్పు నిగిడించి కొండొకసేపు విచారించి రావణుండు.

780


ఉ.

నీవు హితోక్తు లీపగిది నీతిపథంబునఁ బెక్కు చెప్పి తా
త్రోవకు నేగతిన్ మనసు దూఱదు మున్ను సురాసురాదులం
జేవ లడంచి లావునఁ బ్రసిద్ధికి నెక్కిన నేను లోకపా
లావలి నవ్వ నవ్వనచరాశ్రితు నేగతిఁ గాంతు మానవున్.

781


ఉ.

[69]తోలితి నింద్రు నగ్ని యము దుష్టనిశాచరు నబ్ధినాథునిన్
గాలిఁ గుబేరుఁ డత్సఖు నఖండబలంబులఁ ద్రుంచి మించి నే
వాలితి నేల యేలితి ధ్రువంబుగ నేఁబదిలక్షలేండ్లు నేఁ
డాలము వచ్చినం గడఁగి యంగన నిచ్చిన నన్ను నవ్వరే.

782


చ.

ఎఱిఁగి యెఱింగి ము న్నతఁడె యె గ్గొనరించెను దానికై కదా
చెఱగొనివచ్చితిం బిదప సీత వృథాకథ లింక నేల పెం
పఱు బ్రదు కింత తీయనె ఖరాదులచావున కేమి చింత నీ
మఱఁదలిబన్న మేపగిది మానిని యీఁగుదు సంధి చేసినన్.

783


క.

రామున కే మ్రొక్కిన సు, త్రామాదులు నాకు వెఱతురా యిం కిట నీ
వేమియుఁ జింతింపకు సం, గ్రామం బొనరింతు నృపులఁ గపులం ద్రుంతున్.

784


తే.

చెలువ నీతనూభవు నింద్రజిత్తుఁ జెనయు, వాఁడు మూఁడులోకములందు లేఁడు నాకు
నింతవిలుకాఁడు గలుగంగ నంతరాదు, తలఁక వల దని దేవి లోపలికి ననిచి.

785


వ.

అనంతరంబ దశాననుండు చింతాకులమానసుం డగుచుఁ గొండొక విచారించి

ధైర్యోత్సాహంబులు దెచ్చుకొని రాక్షసుల నవలోకించి.

786


ఆ.

కంచుకంబు లూడ్చి కాలోరగంబు లు, త్కటవిషంబు లెగయఁ గవియుకరణి
దొనలు వెడలి నాదుతూవులు మిడుఁగుఱు, లెగయ రాముమీఁద నిగుడు నేఁడు.

787


చ.

ఎఱిఁగి యెఱింగి మృత్యువుపయిం జనుదెంచునె యెట్టినాఁడు ని
ట్లుఱక సురాసురాదులకు నొట్టినచి చ్చగుచున్ననన్ను నె
త్తెఱఁగున నోర్వ వచ్చునొకొ తెంపున రాముఁడు వచ్చుగాక నేఁ
డెఱిఁగెదు గాక నాకొలఁది యెక్కుడుమాటలు వేయు నేటికిన్.

788

రావణుఁడు యుద్ధసన్నద్ధుఁ డై వానరసేనం గవియుట

క.

అని పలికి శైలజీ మూ, తనిభాకృతు లైనయాతుధానులు గొలువం
గనకాచలశృంగోన్నతిఁ, దనరురథోత్తమము నెక్కి దారుణభంగిన్.

789


సీ.

శంఖభేరీముఖసంకులధ్వనుల లో, కాలోకగుహల సింహములు బెదర
రథనేమిహయఖురరయసముద్ధూతమ, హీరేణుపటలి [70]మిన్నేఱు గలఁగ
నానాచమూభారనమ్రభూవలయకం, పమునఁ గులాద్రులపాఁతు గదలఁ
[71]భటభుజోద్భాసితబహుహేతిరోచుల, వేల్పుటింతులకును వెఱపు వెరుఁగ
సూతవందిమాగధజనస్తుతులుఁ గలయ, వివిధజయకేతువులుఁ గ్రాల వెడలె లంక
యుత్తరద్వారమున దర్ప మొప్ప [72]దివిజ, రాజవిద్రావణుం డగురావణుండు.

790


క.

వెడలి కడ లడరువారిధి, వడువున నెడపడక మ్రోయుతవానరసేనం
బొడగని నడవఁగ నబ్బలు, విడి గనుఁగొని రఘువరుండు విస్మితుఁ డగుచున్.

790అ


వ.

విభీషణుం జూచి మనమీఁద నిత్తెఱంగున నేతెంచుమహాసైన్యంబువాఁ డెవ్వం
డవ్వీరు లెవ్వరెవ్వ రనిన ని ట్లనియె నట్లు నీలుచేతం బ్రహస్తుఁడు గూలినం బౌల
స్త్యుండు మాతులవధాభిమానంబు మానసంబునం బూని తానే సమరంబు సే
యువాఁడై వచ్చుచున్నవాఁడు నాదృష్టిపథంబునం బడినవారి దేవర కెఱింగించెద.

791


తే.

నడవు గోపంబు గలకొండ నాఁగఁ గలిత, దాననిర్ఘరార్ద్రం బగుతనగజంబు
లీల నంకుశాహతిఁ గెరలించుచున్న, వాడు యూపాక్షుఁ డనువాఁడు వసుమతీశ.

792


ఉ.

ఉరుతరహేమదండరుచి నొప్పుచు సింహపతాక మింటితో
నొరయఁగ రోహిణాచలసముజ్జ్వల మైనరథోత్తమంబుపై
నరుదుగఁ జాప మింద్రధనురాకృతి నెత్తి చెలంగుచున్న పో
టరి యతఁ డింద్రజి త్తనికి డాయరు వీని సురాసురాదులున్.

793


మ.

వితతోల్కాతతు లక్షు లీనఁగ నొడల్ వింధ్యాద్రియుంబోలె న
ద్భుతరేఖం దనరార వీనులు జడీభూతంబు లై యుండ ను
ద్యతకోదండ మతిప్రచండముగ మ్రోయం జేయునత్తేరివాఁ
డతికాయుం డనువాఁడు వీఁ డతిబలుం డాలంబులన్ రాఘవా.

794

క.

మేదురతరాట్టహాసము, రోదసిఁ బగులంగ నట్లు మ్రోఁగుచు ఘంటా
నాదితరథుఁ డగువాఁడు మ, హోదరుఁ డనుయాతుధానుఁ డుర్వీనాథా.

795


తే.

సంజమొగులునిద్దంపుఁగెంజాయమేను, గలుగుతురగరత్నము చిత్రగతుల మెఱయ
వడి మహాశనివడువున వచ్చునన్ని, శాతకుంతహస్తుండు పిశాచరాజు.

796


క.

నిశితత్రిశూలరోచులు, దిశలకు నెసఁగించుమృగపతిసమారూఢుం
ద్రిశిరుఁ డనువానిఁ గంటే, దశకంఠునిసుతుఁడు వీఁడు ధరణీనాథా.

797


ఆ.

ఉరగరాజు కేతనోజ్జ్వలమై వచ్చు, తేరిమీఁద విల్లు దిప్పుచున్న
భూరిమేఘసన్నిభుఁడు గుంభుఁ డనువాఁడు, కుంభకర్ణుపెద్దకొడుకు వీఁడు.

798


క.

ధూమధ్వజలాంఛన మగు, భీమధ్వజ మొప్పుదేరఁ బృథుపరిఘముతో
ధూమలతాయితశిఖివిధ, మై మండెడు నదె నికుంభుఁ డనువాఁ డనికిన్.

799


ఆ.

కేల విల్లు గ్రాలఁ గీలాకరాళాగ్ని, దీప్త మైనపసిఁడితేరు సూతుఁ
డార్చి తోల వచ్చునతఁడు నరాంతకుఁ, డనఁగ ననిఁ బ్రసిద్ధుఁ డయినవాఁడు.

800


క.

తను నానాఘోరమృగా, ననములభూతములు రథము నలుగడఁ గొలువం
దనరునతఁడు దేవాంతకుఁ, డనువీరుఁడు పంక్తికంఠుకనాత్మజుఁ డితఁడున్.

801


క.

మఱియు రథదంతిహయములు, మెఱయుచుఁ గైదువులు వాఁడిమెఱుఁగుల నీనం
దఱుచుగ గర్జిల్లెడునం, దఱు రక్షోనాథువీటఁ దగియెడువీరుల్.

802


సీ.

కీలితస్యందనకింకణీరవములు, ఘననేమినినదంబుఁ గ్రందుకొనఁగ
మహనీయభూషణమణిగణస్ఫూర్తులుఁ, జటులాయుధార్చులు సందడింప
నద్భుతభ్రుకుటిరేఖాభీలలీలయుఁ, [73]గార్ముకోచ్చాలనకగతియు బెరయఁ
జారుమౌక్తికసితచ్ఛత్రచంద్రికయును, గర్వాట్టహాసంబుఁ గలయఁబడఁగఁ
గనకదండప్రచండకేతనము గ్రాలఁ, గాలనిభమూర్తు లయినరకక్కసులనడుమ
[74]వాఁడితేజంబుతో వచ్చువాఁడు లోక, కంటకుం డైనయద్దశకంఠుఁ డధిప.

803


క.

నేఁ డనికిఁ దాన వచ్చిన, వాఁడు మహావీరు లైనవారలతో నీ
వేఁడీమి ఘనశరవృష్టిం, బోఁడిమి దూలంగ నార్చి పుచ్చఁగ వలయున్.

804


చ.

అని విని యమ్మహీరమణుఁ డచ్చెరు వందుచుఁ బంక్తికంధరుం
గనుఁగొని యిట్లనుఁ బ్రభలక్రందున రూప మెఱుంగరానిసూ
ర్యునిగతి నొప్పు తేజమున నుజ్జ్వలుఁ డై యిటు లున్నవాఁ డితం
డనఘచరిత్రుఁ డైన జగ మంతయు నేలెడువాఁడు గాఁ దగున్.

805


క.

అక్కజపువీరు లారయఁ, ద్రిక్కినరక్కసులు వారిదిక్కున ధర్మం
బొక్కటియ లేమి దైవము, చక్కటి యేగతియొ కాని సంగ్రామమునన్.

806

వ.

అని పలికి లక్ష్మణసమేతుం డై కవచధారణాదిసన్నాహంబునం బొలిచి నిలిచినం
దరుచరు లందఱు శిలావృక్షహస్తు లయి నింగిఁ జెలంగునార్పులతోడం గడంగి
రప్పు డప్పౌలస్త్యుండును సమస్తనిశాచరులం గనుంగొని యేన రాఘవుల వాన
రుల వధించెద మీర లిందఱుం జూడుం డనుచు నిలువ నాజ్ఞాపించి సూతుండు
దేరు దోల శింజిని మ్రోయించుచు శరాసారఘోరంబుగాఁ గవిసిన.

807


చ.

కనుఁగొని భానుసూనుఁ డలుకన్ నగశృంగము రెండుచేతులం
గొని దెస లార్పులం బగుల ఘోరరయంబున మేఘమాలికల్
గనుకనిఁ దూల వైచె దశకంఠుఁడుఁ దోడన దానిఁ దప్తకాం
చనమణిచిత్రపుంఖశరసంఘమునం దునుమాడి వెండియున్.

808


ఉ.

కాలభుజంగకల్ప మగుకాండ మమర్చి మహోత్కటాశని
జ్వాలలు వాఱ నేయుటయు వక్షము బల్విడి నుచ్చి పాఱ మూ
ర్భాలసు డై విశాఖవిశిఖాహతి వ్రస్సినక్రౌంచశైలముం
బోలెఁ జలించి యత్తరణిపుత్రుఁడు వ్రాలె సురారు లార్వఁగన్.

809


వ.

ఇట్లు సుగ్రీవుండు మూర్ఛిల్లినం జూచి ఋషభగజగవయగవాక్షసుదంష్ట్రనల
జ్యోతిర్ముఖులు ముఖంబులం గోపంబులు ముడివడఁ బ్రచండగతిఁ గొండ లొక్క
టం గొని వైవ దశగ్రీవుండు నవి నడుమన వెడఁదవాతితూపులం దునుమాడి
వారి నేడ్వుర నొక్కొక్కమెఱుంగునారసంబునం జచ్చినట్లుండఁ గెడపి మఱియు
విజృంభించి.

810


మ.

అరుదుందూపుల గ్రుచ్చె వానరులఁ బె ల్లన్యోన్యసంఘట్టనం
బరుషజ్వాలలు భూరజస్తిమిరముం బాపంగ నుద్యద్గరు
న్మరుదాభీలరయంబు నిర్జరవిమానశ్రేణిఁ దూలింప ని
ష్ఠురమౌర్వీనినదంబు సాగరరవాటోపంబు భంజింపఁగన్.

811


వ.

అప్పుడు.

812


క.

శరములు నిగిడెడు తెరువులు, పరికించి యెఱుంగ లేక పైపైఁ బడియుం
దెరలియు మరలియు నొచ్చియుఁ, దరుచరు లొగి విఱిగి వచ్చి తనవెనుకఁ జొరన్.

813


శా.

ఉర్వీనాథుఁడు వారిదైన్యమున కోహో యంచుఁ జంచద్ధను
ర్మౌర్వీసారణ సేయ ని ట్లను సుమిత్రాపుత్రుఁ డి ట్లేచునీ
గర్వాంధున్ శరవృష్టి ముంచి మనపై గర్జిల్లునీసేనలన్
సర్వంబుం గడతేర్చి పుచ్చెద ననుజ్ఞాతుండ నే నావుడున్.

814


ఉ.

వీఁకకు మెచ్చి నవ్వి రఘువీరుఁడు [75]తమ్మునిఁ జూచి వత్స వే
తాఁకు దశాస్యు నేమఱకు తచ్ఛరమార్గము లస్త్రసంపదం
దేకువఁ బెద్ద యై యతఁడు దేవగణాదులతోడఁ బోరి ము

క్కాఁకలుఁ దేఱినాఁడు బలుగయ్యములం దని పల్కి వెండియున్.

815


వ.

మహాధనుర్ధరు లయినవారికిఁ బరాస్త్రప్రయోగంబులు నరాతులు ప్రయోగించి
నం బ్రతివిధానంబు లొనర్చు తెఱంగులు నెఱింగి దృష్టిముష్టిసంధావస్థిరత్వదృఢ
త్వంబులు మెఱయం జిత్రకలాకలాపనైపుణ్యంబులు సూపవలయు ననుచు నుచి
తోపదేశంబు సేసిన నలరి వినయంబున నన్నచరణంబుల కెరఁగి దశముఖున కభి
ముఖుం డై కడంగునెడ నతని వారించి సమీరనందనుండు.

816

రావణహనుమంతులయుద్ధము

క.

రక్షోనాథున కెదు రై, దక్షిణభుజ మెత్తికొనుచు ధరణి చలింపన్
వృక్షచరు లార్వ నశనిస, దృక్షత్వరఁ బాఱుతెంచి తెంపునఁ బలికెన్.

817


మ.

మును బృందారకదానవోరగముఖుల్ ముబ్బాములం బడ్డవా
రని నాచే నని యుండు దోరి కుటిలరవ్యాపార వేడ్కం బరాం
గనలం జూచినయట్లు గా దిదియుఁ జక్కం జూడుమా తెంపు మే
కొన నీ కెత్తినకాలదండ మగునాయుద్ధండదోర్దండమున్.

818


చ.

వెఱచినఁ బోవ నీ ననిన వింశతిబాహుఁడు నవ్వి యోరి న
న్వెఱవక వ్రాయు మున్ను మఱి నిన్ను వధించిన నన్న బంట వౌ
టెఱుఁగుదు లేర మ్రుచ్చిలి మహీసుతఁ దేఁ జనునే దురాత్మ
వెఱుఁగవె నన్ను [76]నక్షకుపయిం దొలువ్రే టలనాఁడు చెల్లదే.

819


ఉ.

అంచు రథంబుపై కెగయ నల్కఁ దలంబుగఁ బెన్నురంబు న
క్తంచరుఁ డెత్తి వ్రేసిన నతండు చలించుచు వానిపైకి లం
ఘించి పవిప్రచండ మగుకేలన మా ఱొనరింప మూర్ఛ త
న్ముంచిన వ్రాలె వాఁడును గనుంగొని యార్చిరి నింగి నిర్జరుల్.

820


తే.

అంత నద్దశకంధరుం డంతలోన, తెలిసి హనుమంతుఁ జూచి నీబలము మెచ్చు
వచ్చె నీదువ్రేటునఁ బంక్తివదనుఁ డమర, వైరి ప్రేతలోకముఁ జూచి వచ్చె నౌర.

821


క.

నావుడుఁ గపివరుఁ డిట్లను, రావణ యిది యేటివ్రేటు ప్రాణముతోడన్
నీ వుండఁగ నిట్టులు నా, లా వేమి నుతించె దేను లజ్జింప నిసీ.

822


క.

అని పలికి యింకఁ బిడికిటఁ, గొను మొకపో టనిన నతఁడుఁ గొను మంచు నురం
బున కెత్తి వొడువ నప్పా,వని రక్కసు లార్వ నేల వస మఱి వ్రాలెన్.

823


వ.

ఇట్లు విసంజ్ఞుం డై పడినహనుమంతుఁ గనుంగొని చెలంగుచు రావణుండు ప్రహ
స్తాంతకుపైఁ దేరు దోలించి మహోరగసంకాశంబు లగుశిలీముఖంబులు పరఁ
గింపఁ జలియింపక యతండును లంకామలయశిఖరిశిఖరంబు పెఱికి చద లద్రు
వం బూచి వైచిన.

824


ఉ.

ఏడువెడందతూపుల సురేంద్రవిరోధియు దానిఁ దోన తు

న్మాడఁగ నంతలోనఁ బవనాత్మజుఁడుం దెలివొంది కయ్యపుం
బాడి దలంప శత్రుఁ డొరు పాల్పడి యుండఁగ వానిపైఁ జనం
గూడదు తప్పెఁ దప్పె నని కోల్తల గోరుచు నుండె నత్తఱిన్.

825


సీ.

వెండియు నీలుండు వివిధవృక్షంబులు, పెఱికి పై వైచినఁ బెలుచ వానిఁ
బంక్తికంఠుఁడు పెక్కుభల్లసంహతులచేఁ, గ్రొక్కారుమేఘంబు కొండనిండ
బలువాన గురిసినపగిది నమ్ములఁ గప్పు, నప్పు డవ్వీరుండు నల్పగాత్రుఁ
డై దిక్కు లద్రువంగ నార్చుచు లంఘించి, మొగి ధనుఃకోటిపై ముకుటపంక్తి
పైఁ [77]బతాకపై గొడుగుపై బహువిచిత్ర, భంగి దాఁటుచు లక్షింపఁబడక తప్పి
పడక వ్రేటు పోటున కగపడక లీల, సలిపె నుభయసైనికులు నాశ్చర్య మంద.

826


ఉ.

అంత నిశాచరేంద్రుఁ డనలాస్త్రము నారి నమర్చి యోరి నీ
గంతు లడంగిపోవ నినుఁ గాలునిఁ గూర్చెద నంచు నేయ మే
నంతయు నర్చులం గమర నాకపివీరునిఁ గప్పె నాశరం
బంతియ కాని జీవమున కల్గదు తత్పితృశక్తి గావునన్.

827


వ.

ఇట్లు మహాస్త్రజ్వాలావృతుం డగుచు నీలుండు.

828


శా.

తాఁకెం జి చ్చదె సచ్చె వీఁడు రిపుచేతం జూడుఁ డంచున్ దెసల్
సోఁకం బెద్దయెలుఁగునం దరుచరస్తోమం బొగిం బల్కఁగాఁ
దోఁకం బుట్టినమంట యుల్కపగిదిం దోపంగఁ బెన్మ్రోఁతతో
మోఁకా లూఁదుచు నేల మోవఁ బడియెన్ మూర్ఛాదశామగ్నుడై.

829


ఆ.

అతఁడు వడినఁ జూచియార్చుచు మేఘంబు, పగిదిఁ దేరు మ్రోయఁ బంక్తిముఖుఁడు
సంగరాభిముఖుని సౌమిత్రిఁ జటులటం, కారఘోరచాపుఁ గదిసి నిలిచి.

830

రావణలక్ష్మణులయుద్ధము

ఉ.

పుట్టల రోఁజుచున్ నిదురవోవుమహాహులభంగిఁ దూణులం
బెట్టిన మోఁగుచున్నయవి పెక్కుదినంబుల కేని నాజు లే
పట్టున లేక నాకినుకఁ బడ్డజటాయువునీఁకలం గఱుల్
గట్టిన క్రొత్తబాణములు కాంచనపుంఖములన్ వెలుంగుచున్.

831


చ.

కుడువవు కట్ట వన్నపయి కూరిమి నీవిధి ద్రిప్పి తేరఁగా
నడవుల నాకలంబు దిని యంతట నుండక చిచ్చువాతికిన్
మిడుత గడంగుచందమున మృత్యుముఖం బగునాదుచూడ్కికిన్
వడిఁ జనుదెంచి [78]నాతెరువు వచ్చితి చచ్చితి గాక నావుడున్.

832


క.

నిను నీవ పొగడుకొనియెదు, ఘను లాత్మస్తుతికి నన్యగర్హ కుఁ జొర రే
ధనువు గొని యుండ రజ్జుల, పని యేటికి వత్తుగాక బవరంబునకున్.

833


సీ.

అని లక్ష్మణుఁడు పల్క నద్దశకంధరుం, డేడుగ్రబాణంబు లేయుటయును

గనుఁగొని యాతండు గరుడతుండాహతిఁ, బడగలు దెగిపడ్డపన్నగముల
గతి గానఁబడ నవి ఖండంబులుగ నెల, వంకకోలలఁ ద్రుంచివైచి మఱియు
మిడుఁగుఱు లెగయంగక మిడుతలతఱుచుగా, నుడుమార్గ మద్రువంగ నుగ్రభంగి
మెఱయఁ బింజపింజ గఱచుచుఁ బాఱ నం, దంద పఱపుమెఱుఁగుంటంపగములు
నడుమ నఱకి వైచి నానాశిలీముఖ, వృష్టి నతనిఁ గప్పి విక్రమించె.

834


ఉ.

దానికి నద్దశాననుఁడు తద్దయు విస్మయ మంది తాను న
మ్మానవవీరుఁ డేయుశరమండలి ద్రుంచి విరించిదత్తకా
లానలకల్పబాణహతి నాతనిఫాలము నొంచె మూర్ఛకున్
లో నయి చాపముష్టి వదలుం గనుమూఁతయుఁ గల్గునట్లుగన్.

835


వ.

ఇట్లు విసంజ్ఞుం డై కొండొకవడికం దెలిసి రఘువీరానుజుండు.

836


క.

విలు నడిమికిఁ దెగిపడ నొక, బలుతూ పడరించి మూఁడుబాణమ్ము లుర
స్స్థలి దూఱ నేయ మూర్ఛా, కులుఁ డై యతఁ డెట్టకేలకుం దెలిసి వెసన్.

837


చ.

జలరుహజన్ముచేఁ గనినశక్తి కరంబునఁ బూని ధూమసం
జ్వలితపటుచ్ఛటచ్ఛటరవప్రచురజ్వలనోద్భటచ్ఛటా
కులముగ వైవఁ బైఁ బఱపుకోలలఁ జిక్కక వచ్చి బి ట్టురః
ఫలకము దూఱినం బడియెఁ బర్వినమూర్ఛ నతండు భూస్థలిన్.

838


వ.

ఇట్లు పడినం గనుంగొని సౌమిత్రిం బట్టికొనిపోవువాఁ డై యన్నిలింపారాతి
తేరు డిగ్గనుఱికి కదిసి యపుడు కఱచి పొదివి యెత్త శక్తిపాతసమయంబున నరా
తిదుర్ధరంబుగా వైష్ణవం బగుమహాతేజంబు ప్రవేశించుటం జేసి యిట్టట్టుం గద
ల్పం జాలక కైలాసశైలం బెత్తిన భుజదండంబులు బెడువడం బెనంగునెడ
హనుమంతుండు పఱతెంచి నిశాట విడువిడువు మనుచుం దిరిగిపడం బిడికిట
వక్షంబు పొడిచి సురగణంబు లార్వ నన్నరేంద్రనందనుం గొని రామచంద్రు
సమీపంబునకుం జనియె నమ్మహాశక్తి యు నతని విడిచి మగిడి వచ్చె రావణుం
డునుం దెలిసి రథారూఢుం డై పొలిచె నాసమయంబున.

839


క.

జననాథుఁ డనికిఁ గడఁగఁగ, హనుమంతుఁడు కేలు మొగిచి యవనీశ దశా
ననుఁడు రథి గాన యే వా, హన మయ్యెద నీకు ననిన నగుఁ గా కనుచున్.

840


తే.

అతనివె న్నెక్కి యైరావృతాధిరూఢుఁ, డైనజంభారిచెలువున నగ్గలించి
శింజినీఘోరటంకృతుల్ సెలఁగ నన్న, రేంద్రనందనుఁ డెలుఁగెత్తి యిట్టు లనియె.

రామరావణులప్రథమయుద్ధము

ఉ.

నాకు మహాపకారము మనంబున నోడక చేసి తింక నే
లోకము దూఱువాఁడవు వెలుంగుచు నీవెనువెంట నాశరా
నీకము వచ్చినం దులువ ని న్నిట నెవ్వరు గాచువారు ది
క్కాకమలాసనప్రభృతు లైన వధింపక రాముఁ డేఁగునే.

842

క.

నీవా రైనఖరాదుల, త్రోవయె నీ కనిన నధికరోషముతో నా
రావణుఁడు విల్లు మ్రోయం, బావకపటుబాణపంక్తిఁ బావని నేసెన్.

843


వ.

అప్పు డారఘువీరశేఖరుండు గన్నుఁగవఁ గెంపు నిగుడం గనుంగొనుచు నప్పౌ
లస్త్యుం గదిసి.

844


ఉ.

ఒక్కట నారిఁ బోసి వివిధోగ్రశరంబులఁ దేరిచక్రముల్
చెక్కలు సేసి పై పొడవు చిందఱవందఱ లాడి వాజులన్
ప్రక్కలు వాపి సూతుఁ బడవైచి పతాక దళించి కైదువుల్
చక్కుగఁ ద్రుంచి యెల్లి పలుచందములం బొలియించి వెండియున్.

845


తే.

అశనిసంకాశ మగునొక్కనిశితశరము, గొని రయంబున నుర మేసి కొంకఁ జేసి
యర్ధచంద్రబాణమునఁ దీవ్రార్చు లడరఁ, దోన కోటీరపంక్తియుఁ ద్రుంచివైచె.

846


వ.

ఇట్లు రావణుండు పరిభవింపంబడి కోఱలు పెఱికినమహాసర్పంబు తెఱఁగున దర్పం
బుడిగి మనంబున.

847


చ.

వరుణునిపాశముం ద్రిదశవల్లభువజ్రముఁ గాలుదండమున్
సురలసమస్తశస్త్రములుఁ జూచినవాఁడన కాదె యీరఘూ
త్తరువిశిఖంబులంతబెడికదంబులు గా వని నాకు నంచు మై
విరవిరవాఱఁ జే సడలి విల్లు పడం గని రాముఁ డి ట్లనున్.

848


అ.

ఇంతదాఁకఁ గయ్య మినసుతాదులతోడఁ, జేసి యలసినట్లు చేష్ట దక్కి
యున్నవాఁడ వగుట ని న్నింక నే నేయ, డప్పి దీర్చుకొని కడంగు మనిన.

849


క.

మీఱినభయమున రామునిఁ, దేఱి కనుంగొనఁగ నోడి ధృతి కడుఁ దూలన్
వేఱొకనితేరిపైఁ బడి, పాఱి యతఁడు లంక సొచ్చెఁ బౌరులు బెదరన్.

850


వ.

అంత నమ్మహీకాంతుండును సౌమిత్రిమిత్రనందనాదుల విశల్యులం జేసి యరయు
చుండె రావణుండును బరాజయఖిన్నమానసుం డగుచు నాస్థానంబు సొచ్చి వచ్చి
సింహాసనంబున నుండి కొండొక చింతించి రాక్షసుల నవలోకించి.

851


సీ.

నలినగర్భునిచేత నాకన్నవరము సు, రాసురగంధర్వయక్షసిద్ధ
విద్యాధరాదులవెంట నేభయమును, లేకుండ నింతియ లెక్కగొనక
నరుల వానరుల నేనాఁడు వాక్రువ్వన, యటు గాన నేఁ డింత లయ్యె మనల
గెలిచినయలదశగ్రీవుండు మర్త్యుల, కుగ్రాహవక్రీడ నోడె ననుచు
నాకు నొవ్వనిదిక్పతుల్ నవ్వ నట్లు, పూని చేసినతప మెల్ల బూడ్డఁ గలయ
నిట్టిదురవస్థఁ బొందితి నేమి సెప్పఁ, గలదు కుంభకర్ణుని మేలు కనుపుఁ డింక.

852


ఉ.

నిర్జరదానవాదుల ననిం దృణరూపముగాఁ దలంచున
త్యూర్జితబాహువీర్యుఁ డతఁ డుండఁగ నన్యులఁ బంచి రాఘవుల్
దుర్జయు లంచుఁ జిత్తమునఁ దూలఁగ నేటికి నెన్నిభంగులం
గర్జము సూడఁగా నిదియ కాలము దెల్పఁగ నమ్మహాబలున్.

853

కుంభకర్ణుని మేల్కొలుపుట

వ.

అని పనిచిన యూపాక్షమహోదరు లాదిగా రక్షోవీరు లనేకంబు లగుభోజ్య
వస్తువులు గొని చని పుణ్యగంధప్రవాహతరంగితద్వారంబును సమంచితకాం
చనకుట్టిమంబును మాణిక్యదీపకళికాభిరామంబును యోజనత్రయవృత్తంబును
నైనతదీయశయనగృహమహాద్వారంబుం బ్రవేశించి పురోభాగంబున.

854


సీ.

శ్వాసమారుతవేగవశమున ముకుఁగ్రోళ్ల, వెలికి లోనికి జంతువితతి వాఱఁ
బొరి గుఱు పెట్టుచోఁ బొగరించురవమున, గహ్వరవివరంబు గలయఁ జెలఁగ
ఘుటఘుటాయితదంతకోటిఘట్టనఁ గల్గు, వదనవిక్రియఁ గాపువారు బెదర
గీర్వాణసంగరక్రీడలు వాక్రుచ్చు, కలవరింతల భూతగణము గలఁగ
భూరిఫూత్కృతు లురగేంద్రబుద్ధిఁ జేయ, నుగ్రగతి నిద్రవోవుచు నుండఁ గాంచి
రద్భుతాకారసమరాట్టహాసదళిత, ఘోరదిక్కుంభికర్ణు నక్కుంభకర్ణు.

855


ఉ.

కాంచి నిగుడ్చునూర్పుబలుగాలిమొగంబున కోసరించి శం
కించుచుఁ జేరి చేరి తమకించుచుఁ దెచ్చినపచ్చిమాంసముల్
గాంచనపర్వతోన్నతముగాఁ బెను ప్రో విది మద్యభాండముల్
డించి మహారవంబుగఁ బఠించిరి తద్విజయాంకగీతముల్.

856


తే.

అంతఁ దెలియకున్న నార్పులు బొబ్బలుఁ, బరుషభంగి బెరయఁ బటహమురజ
శంఖకాహళాదిసంకులరావముల్, మొరయఁ జేసి రొక్కమ్రోఁత గాఁగ.

857


ఉ.

ఆనినదంబు లంకఁ గలఁ యంతయు నిండి మహోగ్రసాగర
ధ్వానము మ్రింగ వెండియు నతండు వొగర్చుచు నున్నఁ జూచి తో
డ్తో నురుడిండిమప్రముఖతూర్యరవంబులు మ్రోయుచుండఁగా
వీనులక్రింద బిట్టు పదివేవురు రాక్షసు లార్చి రేపునన్.

858


సీ.

అంత లేవక యున్న నచలశృంగములు పై, నెత్తి వైచియు నోలి నినుపగదలు
గుదియలు రోఁకండ్లుఁ గొని వీఁక మోఁదియుఁ, బిడికిళ్లఁ బొడిచియుఁ బృథులహస్త
తలములఁ జఱిచియు దంతావళంబులఁ, గొలిపి మట్టించియు ఘోటకముల
మేను ద్రొక్కించియు మీనలు దిగిచియుఁ, గాజుల నిఱికియు గర్దభముల
మహిషముల మీఁదఁ దోలియు మఱియు నాసి, కాబిలంబులగ నూర్పులు గడలుకొనఁగ
జెరమ లొక్కలావున నొత్తి చెవులలోనఁ, గూల్చి రుడికెడితైలంపుఁగుంభశతము.

859


వ.

ఇవ్విధంబున నందఱు నిశాచరులు మేలుకనుప నెట్టకేలకు నద్దశగ్రీవానుజుండు.

860


చ.

తెలిసి మహాసమీరగతి దీర్ఘతరం బగునూర్పు పుచ్చి బా
హులు ఫణిరాజభోగతులికతోగ్రతఁ జాఁగఁగ నీల్గి బాడబా
నలశిఖిమాడ్కి వక్త్రగుహ నాలుక దోఁపఁగ నావులించి దీ
ప్తు లడర విచ్చె నూతననభోమణిమండలచండనేత్రముల్.

861


ఆ.

అంత రజనిచరులు నత్యంతభక్తిమై, హస్తయుగము మొగించి యంత నంతఁ

బాసి నిలువ శయ్య నాసీనుఁ డగుచు న, వ్వీరుఁ డిట్టు లనియె వారిఁ జూచి.

862


శా.

నన్నుం గార్యములేక మేలుకనుపన్ నక్తంచరేంద్రుండు ము
న్నెన్నండుం బనుపండు [79]మార్పడఁగ నయ్యింద్రాదు లుద్వృత్తిమై
నున్నారో మనతోడ దానవులు దా రొండెన్ విరోధించిరో
సన్నంపుంబని గాదు చూడ నది యేచందం బెఱింగింపుఁడా.

863


వ.

అనిన యూపాక్షుం డి ట్లను రాఘవులు వనచరులం గూడుకొని సముద్రంబు గట్టి
కడచి వచ్చి మనపురంబు దిరిగిరా విడిసి మహాభయంబు సేయుచున్నవారు నేఁడు
పంక్తిగ్రీవుండు సంగ్రామంబున రామున కోహటించి పరాజయదైన్యంబు నహిం
పంజాలక నిన్ను మేల్కనుపం బనిచె మఱియును గలుగువిశేషంబు లతనిచే
తన వినం దగు ననుచు విన్నవించిన.

864


ఉ.

మానసగూఢరోమశిఖి మండఁగ నూఁదినచంద మై కనుం
గోనల విస్ఫులింగములు ఘోరగతిం జెదరంగఁ దీవ్రదం
ష్ట్రానిబిడోరురోచులు గడల్కొన నౌడులు దీడికొంచు నే
మీ నరు లిట్లు క్రొవ్వి పులిమీసల నుయ్యెల లూఁగఁ జూచిరే.

865


క.

అన్నరులఁ గపిబలంబుల, ము న్నాఁకలి వోవ మ్రింగి ముదమున మఱి మా
యన్నం గొలువఁగ వచ్చెద, నన్న మహోదరుఁడు పల్కె నాతనితోడన్.

866


వ.

మిమ్ము మేలుకనిపి తోడి తెమ్మని రాజు మమ్ముం బనిచినాఁడు మీకు నతండు సెప్ప
వినవలసిన కార్యంబులు గలిగి యుండు నారగించి విచ్చేయుదురు గా కనిన ముఖ
ప్రక్షాళనాదికృత్యంబులు సలిపి ము న్నమర్చిన పచ్చిమాంసరాశికి మద్యభాండం
బులకుం దోడు పదికాఱెనుఁబోతులు ముయ్యేడ్గురు మనుష్యులు నేనూ ఱజం
బులు వేయివరాహంబులు రెండువేలు చరణాయుధంబులు దావాగ్ని తృణం
బునుం బోలె నమలి యారెండువేలఘటంబుల[80]పిశితాసవంబులుఁ బెక్కుకడవల
నెత్తురుఁ ద్రావి రక్షోభటపరివృతుఁడై రాజమార్గంబున మిన్నందినపొడవునం
బొలిచి దశముఖునాస్థానంబునకుం జనుదేర లంక వెలి నున్న బలీముఖులు గనుం
గొని భీతిం బఱవ రఘువరుండును ధనుఃపాణి యగుచు విభీషణున కి ట్లనియె.

867


సీ.

ఇది యేమహాభూత మీయద్భుతం బేమి, నక్తంచరోత్తమ నాకుఁ దెల్పు
మనుడు దశగ్రీవుననుజుండు నా కగ్ర, జుఁడు గుంభకర్ణుఁ డన్ శూరుఁ డితఁడు
రక్కసులం దెల్ల నెక్కుడులావును, ఘనతరదేహంబుఁ గలిగి యుండు
జననాథ యితనికి సహజశక్తియ కాని, తపమునఁ గన్నసత్త్వంబు గాదు
జనన మైనయపుడు జంతుకోటుల మ్రింగ, వాసవుం డెఱింగి వచ్చి వజ్ర
మలుక వైవ దాని 5 కడల కివ్వీరుండు, ధరణి యద్రువ నతనిదంతి కెగిరి.

868


క.

తనతనువు దాకిఁ మెదలిఁకి, జన విఱిగినదానిదంతశకలంబు వెసం

గొని యురము వేయ నింద్రుం, డనిమిషయుతుఁ డగుచుఁ బాఱి యజునకుఁ జెప్పన్.

869


క.

ధాతయుఁ దనసమ్ముఖమున, కీతనిఁ బిలిపించి చూచి యేమీ నిన్నున్
మీతండ్రి విశ్రవసుఁ డిటు, భూతద్రోహంబు సేయఁ బుట్టించెనొకో.

870


తే.

అనుచుఁ గోపించి చచ్చినయట్లు నిద్ర, వోవుచుండు నీవని పల్క నావులింత
లడరఁ బెనుమ్రబ్బువొడమిన నపుడ వ్రాలె, నంత నద్దేవుకడకు దశాస్యుఁ డరిగి.

871


క.

తన పెట్టినచె ట్టెవ్వఁడు, ననుకంప దొఱంగి పెఱుకునా ఫలకాలం
బున నెంతతప్పు గలిగిన, మనమున సైరింపఁ దగదె మనుమఁడు గాఁడే.

872


క.

అప్పుడు వెడలినమీపలు, కెప్పాటను దప్ప దింక నీనిద్దుర వీఁ
డెప్పుడు దెలియు విహారం, బెప్పుడు గను భోజనాదు లెప్పుడు సలుపున్.

873


తే.

అనిన నప్పితామహుఁ డిట్టు లనియె నాఱు, నెలల కొకనాఁడు భోజనాశదులకుఁ దెలియు
నాఁడు వీఁ డజయ్యుఁడు రిత్తనాఁడు దెలుప, బలిమిఁ దెలియు నాఁ డీతనిబలము దూలు.

874


చ.

అన నతఁ డాతనిం బురికి నప్పుడు తెచ్చి మహాగుహాంతరం
బున జతనంబుతో నిదుర వోవఁగ రక్ష యొనర్చి మున్ను మే
ల్కనుపక యుండు నెంతపని గల్గిన నేఁ డిటు తెల్పినాఁడు నీ
కనితల నోడి పాఱి సమయంబున కోడక సాహసంబునన్.

875


వ.

నేఁడు జాగరదినంబు గాదు గావున నితండును దేవరచేతఁ జచ్చు నవశ్యంబు
నంత కివ్వనచరులు బెదరకుండ నిది యొక్కదారుయంత్రం బని మనవీటం జాటం
బంపవలయు ననిన నన్నరేంద్రుండు నీలునకుఁ దత్ప్రకారం బాన తీ నతండును
నట్ల కావించి ఋషభశరభాంజనేయగంధమాదనమైందద్వివిదకుముదపనసనల
సుషేణధూమ్రజాంబవత్ప్రముఖంబుగా దళంబుల గవంకులకు నడపించె నచ్చటఁ
గుంభకర్ణుండుఁ బురాంగనావిరచితమంగళోపచారంబు లెడనెడఁ గయికొనుచు
నాస్థానంబు సొ త్తెంచి యన్నచరణంబుల కెరఁగి తదీయనియోగంబున నర్హపీఠం
బునం బొలిచి కొండొకదడవున కి ట్లనియె.

876


క.

నను నిట్లు మేలుకనుపం, బనిచితి నిను నల్గఁ జేసి ప్రాణము లిపు డొ
ల్లనివాఁడు దేవ యెవ్వం, డనపుడు నయ్యనుజుతోడ నతఁ డి ట్లనియెన్.

877


క.

అద్రిచరసేనఁ గొంచు స, ముద్రము బంధించి కడచి మువ్వరుసఁ ద్రికూ
టాద్రి బలసి యున్నా రదె, ముద్రితలంకాకవాటకముగ దాశరథుల్.

878


ఉ.

ఇందుఁ బ్రహస్తుఁ డాదిగ ననేకులు రాక్షసు లాహవంబునన్
మందిరి పేర్కొనం బరఁగు మర్కటవీరుఁడు నన్నవాఁడు లేఁ
డం దొకరుండు నా కిటు మహాబలశాలివి నీవు గల్గ సం
క్రందనుఁ జీరికిం గొనని గర్వము సర్వముఁ దూలె నే మనన్.

879


స్రగ్ధర.

శస్త్రాస్త్రప్రౌఢిఁ దూలం జమరుము నరులం జంపు శాఖామృగాలిన్
నిస్త్రాసుం జేయు నన్ను న్వెసఁ జను మనికి న్వేళ గా కుండియున్ ర

క్షస్త్రాణార్థంబు ని న్మేల్కనుపవలసె లంకాచరుల్ [81]బాలవృద్ధా
న్తస్త్రీశేషంబుగా నందఱుఁ బొలిసినవెన్కన్ జయం బేల నాకున్.

880

కుంభకర్ణుఁడు రావణునకు నీతి చెప్పుట

వ.

అనిన నవ్వైశ్రవణుండు రావణుం గనుంగొని.

881


తే.

మీఁదికార్య మేను మీమంత్రసమయంబు, నంద చెప్పి పోయినాఁడఁగాదె
తగవు మాని మేరఁ దప్పి మోహంబునఁ, జేసి తా ఫలంబు సేరె నిపుడు.

882


శా.

కామక్రోధమదాతిరేకమున నేకగ్రాహి వై యుండుని
న్నేమార్గంబునఁ దెల్పవచ్చు నధికుం డె గ్గేల సైఁచుం బర
స్త్రీ మాయం గొనివచ్చు టేతగవు నీచేఁ గాక సామంతమి
త్రామాత్యాదులు నేఁడు శాత్రువులచే నా చచ్చి రూహింపఁగన్.

883


ఆ.

మొదల వలయువిధము పిదపఁ గావించుట, తుది నొనర్చుదాని దొలుతఁ జేఁత
సంధివిగ్రహాదిసమయజ్ఞు లగునీతి, శాస్త్రవిదులు నడచుసరణి గాదు.

884


వ.

రాజులకు ధర్మార్థకామంబు లర్హకృత్యంబు లం దెద్ది దొడంగిన నితరబాధకంబు
గాకుండ నాచరించు టొప్పు నట్లు చొప్పడకున్న దేశకాలంబు లెఱింగి ప్రబల
త్వదుర్బలత్వంబులు చింతించి గరిష్ఠం బయినవిధంబు పట్టవలయుఁ ద్రివర్గసిద్ధికిఁ
బరమకారణంబు నీతియ దానికి నితాంతమంత్రపర్యాలోచనంబును దదనుష్ఠా
నంబును గృతసమయరక్షణంబును విశేషపరిజ్ఞానంబును మిత్రభావవివేకంబును
ననం గల్గునైదుయోగంబు లవయవంబులు మంత్రుల మనుచు వృథాభిమానం
బున నర్థశాస్త్రతత్త్వంబుల నెఱుంగనిమొఱుకులు చనవున బీఱువోవం బలు
కుదురు కాదేని హితులట్ల యనుకూలశాత్రవంబు జరపుదు రీరెండుదెఱంగులవా
రలం దెలిసి కార్యవ్యవహారంబుల రహస్యబాహ్యులం జేయనివానిసమస్తకృత్యం
బులు నిరర్థకంబులు గావున సామదానభేదదండంబులు క్రమంబునం గావింపందగి
యుండ మొదల నపాయబహుళం బగు చతురోపాయంబున కనుమతించి నీవారు
నీవును ముంగొంగునఁ జిచ్చు ముడిచికొన నపేక్షించినా రెవ్వాడు విహితమార్గ
మ్ము విడిచి వర్తించు నమ్మూఢుండు తనయత్నంబు లెల్ల విఫలంబు లై పోవం జెడి
పోవునని నయనిష్ఠురంబుగాఁ బలికిన బొమలు ముడివెట్టుచు నద్దశగ్రీవుం డి ట్లనియె.

885


ఆ.

పెద్దవాఁడు నాక పెంపు దూలఁగ నాకు, నీతి గఱప నేల నీకు నిపుడు
పగఱవలన నయిన భయము వాపుట దక్క, కొండుమాట లాడ నుచిత మగునె.

886


చ.

అనిన నతండు గేల్మొగిచి యన్నకు నిట్లను నొక్కనాఁడు మే
ల్కని వనభూమి నే మెలఁగఁ గా నట నారదుఁ డంబరంబునం
జని చని తాన నాకడకు సమ్మద మారఁగ వచ్చినం గనుం
గొని యెటునుండి రాక మునికుంజర నా కెఱిఁగింపు నావుడున్.

887

వ.

మేరుశైలంబున దేవసభనుండి రాక విను మచటివృత్తాంతంబు లోకంబులకు
మీరు సేయునపకారంబులు సహింపం జాలక హరిహరహిరణ్యగర్భులు లోక
పాలురు దివాకరప్రభృతిగ్రహంబులు మరుద్వసుగంధర్వగుహ్యకగరుడోరగప్ర
ముఖామరగణంబులు నఖిలమునులునుం గూడి విచారించుసమయంబున బృహ
స్పతి వేల్పులెల్ల విన రావణుం డింద్రు భంగించి హుతాశను నోటువుచ్చె నంత
కుం బఱపె వరుణుం బరిభవించె జగత్ప్రాణు ధిక్కరించెఁ గుబేరు నాక్రమించె
జంద్రాదిత్యులతేజంబు లడంచె జన్నంబులు చెఱిచె నందనోద్యానంబు పెఱికె
దివ్యాంగనలం జెఱలుపట్టె మఱియు ధర్మాత్ముల ననేకులం జంపె నింక వానివ
ధోపాయంబు చింతింపుఁడనినం బితామహుండు మదీయవరంబున నాఁడు సురా
సురుల కజయ్యుండు నరవానరులచేతం బిచ్చు నది గారణంబుగా విష్ణుండు దశ
రథునకుఁ బుత్రచతుష్టయంబుగా జనించు నిలింపులు తరుచరులై జనియించి
యాతనికిఁ దోడ్పడుం డనుచు నంతర్హితుఁ డయ్యె నంత నందఱుం దమతమ
మందిరంబులకుం జని రని యమ్మహానుభావుండు చెప్పినాఁడు గావున రామచం
ద్రుండు నారాయణుండు బలిముఖులు బర్హిర్మఖు లిది నిక్కు వంబు న న్ననుగ్ర
హించి విగ్రహంబు విడిచి సీత నిచ్చి పుచ్చి రాక్షసకులంబును లంకను రక్షిం
పుము మనకొలుచుబ్రహ్మకు నుపాస్యుం డగునద్దేవదేవునకు నమస్కరించిన
నేమి కొఱంత యన్న నట్టికర్ణకఠోరంబు లైనకుంభకర్ణువచనంబులకుఁ గొండొక
తడవు వితర్కించి.

888


ఉ.

అక్కట నీకు నిట్లు భయ మందఁగ నేటికి వచ్చె రాఘవుం
డెక్కడ దేవతామహిమ మెక్కడ నారదువార్త వోవ ని
మ్మిక్కథ లేల విష్ణుఁ డన నెవ్వఁడు వేలుపుమేన నుండఁగా
మ్రొక్కనివాఁడ నాతనికి మొక్కుదునే మనుజత్వ మొందినన్.

889


క.

విను రాముఁడు విష్ణుం డా, తనితమ్ముఁడు లక్ష్మణుండు దా నలజిష్ణుం
డినసుతుఁడు భర్గుఁ డైన, వనరుహగర్భుండు జాంబవంతుం డైనన్.

890


ఉ.

నీ విటు విన్నవాఁడవఁట నిక్కము గా దన నాకు నేటికిన్
దేవహితంబుగా మనుజదేహము గైకొని వచ్చుటం బ్రతి
జ్ఞావిధి చొప్పడన్ మనలఁ జంపక విష్ణుఁడు రిత్తవోవునే
వేవురు చెప్పినం గృపణవృత్తి కొడంబడ నీను జానకిన్.

891


ఉ.

వామనమూర్తియై మొదల వచ్చి పదత్రయమాత్ర మర్థియై
భూమి నొసంగ వేఁడి పరిపూర్ణమనోరథుఁ డయ్యు నంతఁ బో
కామహితాత్ముఁ డైనబలి నంటఁగఁ గట్టి రసాతలంబున
న్బామఱఁ ద్రోచునట్టి కుహనాపరు సంధికి నమ్మవచ్చునే.

892


ఆ.

కాన విష్ణుఁ డైనఁ గానిమ్ము రాముతో, విగ్రహంబె కాని వినయ మొల్ల

ననికిఁ జాలుదేని చను చాలవేని నీ, పోటు వచ్చె నిదురవోవఁ బొమ్ము.

893


చ.

వెఱచిన నే మనం గలదు వే చను మెన్నఁడుఁ జావు లేదు ని
న్నెఱిఁగి యెఱింగి నిద్రితుని నెవ్వరుఁ జంపరు నీకు సేమ మెం
దఱు రిపు లెత్తి వచ్చిన మందం బడఁగించెద నేన విష్ణునిం
బఱపెద విష్ణులోకములు భస్మము సేసెదఁ గీర్తి మించెదన్.

894


క.

మును నాకు నోడి పోయిన యనిమిషు లఁట గ్రోఁతు లైన నఁట లా వెక్కెన్
మనుజాశను నోర్వఁగ హరి, మనుజుం డయ్యెనఁట యిట్టిమాటలు గలవే.

895


తే.

జనకసుత లక్ష్మి రాముండు వనజనాభుఁ డగుట నిక్క మెఱింగియు నితనిచేత
బవరమునఁ గూలి కైవల్యపదము నొంద, సీతఁ దెచ్చితి నిం కేమి సెప్పఁ బొమ్ము.

896


చ.

అనవుడుఁ గుంభకర్ణుఁడు దశాస్యుఁ గనుంగొని దేవ నీమనం
బునఁ బరితాప మేటికిని బొందెద వెట్లును సామ మొల్ల వే
నను వెసఁ బంపు రాఘవులనామ మడంచెద భానుసూనుము
ఖ్యనిఖిలవానరావళుల నాఁకలి వోవఁగ మ్రింగి పుచ్చెదన్.

897


క.

వారిధిఁ గలఁచెద వసుధ వి, దారించెద దిక్కరులమదం బడఁచెద నే
మేరువుఁ బెఱికెదఁ గూల్చెదఁ, దారాహిమధామతీక్ష్ణధాముల నెల్లన్.

898


క.

పొడగాన రాఁడు రణమునఁ, బడఁడు గదా పంక్తికంఠపరిపంథుల పై
నడరి విభీషణుఁ డే ని, న్నడిగెద నెఱిఁగింపు మనఁగ నతఁ డి ట్లనియెన్.

899


క.

కొలువున నా కప్రియములు, వలికిన నే నలిగి తన్నుఁ బదహతిఁ జేయన్
నలువురు మంత్రులతో నిలు, వెలువడి రఘురాముశరణు వేఁడఁగఁ జనియెన్.

900


వ.

అనిన నతం డొక్కింత విచారించి దేవా సహోదరస్నేహంబున నీవు మన్నిం
చుటం జేసి విన్నవించితి నిటమీఁద నా చేయుసంగ్రామం బవధరింపుము శూల
హస్తుం డయి నీయనుజుండు కడంగిన శూలికిం దక్కఁ దక్కొరుల కేల సహిం
పం జొప్పడు నరవానరు లెంతవా రే నాయుధంబులు ధరింపక భుజాయుద్ధంబు
నన వారిం బరిమార్తు ననుచు విజృంభించి పలుక మహోదరుం డి ట్లనియె.

900అ


చ.

[82]హరి గిరి వహ్ని గిహ్ని మఱి యంతకు గింతకు దైత్యు గీత్యు వా
ర్వరు గిరు గాడ్పు కీడ్పు ధనవల్లభు గిల్లభు రుద్రు గిద్రు సం
గరమున నోర్చినట్లు దశకంధర నీకు జయింప వచ్చునే
సురనగధీరు నుగ్రరణశూరుఁ బయోధిగభీరు రాఘవున్.

901


ప్రబలుం డెంతయు రాముఁ డారణకళాపారంగతున్ గెల్వ బా
హుబలం బొక్కఁడ నమ్మి పోఁ దలఁచునీయుత్సాహ మేనీతి స
ర్వబలోపేతుఁడ వై కడంగి రిపుగర్వస్ఫూర్తి వారింపు దై
వబలం బున్నటు లుండెఁ బౌరుషముత్రోవం బోక యుక్తం బగున్.

902

చ.

అనవుడు వానిమాటలకు నాతఁ డదల్చుచు నన్నతోడ ని
ట్లను శరదంబుదంబుక్రియ నాడెడుగర్వము లిప్పు డేటికి
న్వినియెదుగాక నీ వధిప నీచెవు లారఁగ నేఁడు నన్ను ము
న్నని మనవారి నందఱ శరార్చుల నేర్చినరాము నోర్చెదన్.

903


వ.

అని పలికిన నారావణుండు సంతోషించి నీయంతవీరుం డెవ్వం డేను మదీయ
కార్యసిద్ధి బుద్ధిం దలంచి నిన్ను మేలుకనుపం బంచితి నాకుం బ్రియంబు సేయను
నీకుం బేరు సేకొనను నిదియ సమయం బసహాయశూరుండ వగు దైనను సేనా
సమేతుండ వయి చను మనుచుఁ దాను బూనినమణిహారం బఱుతఁ బెట్టి మఱి
యు ననేకదివ్యాంబరాభరణంబు లిచ్చి గారవించి వీడ్కొలుపుటయు నతనికిం
బ్రణమిల్లుచుఁ బ్రదక్షిణంబుగా వచ్చి బహువిధాశీర్వాదంబులు సూతవందిమా
గధస్తోత్రంబులు వినుచుఁ దదాస్థానమండపంబు వెడలి సంధ్యాభ్రతిరోహితమ
హీధరంబుతెఱంగునం గాంచనకవచధారణంబున ధనుశ్శతపరిణాహంబును సప్త
శతవ్యాయామప్రమాణంబును నైనమేను వెలుంగ సహస్రభారాయసకల్పితం
బును దేవదానవభయంకరంబును నద్భుతానలచ్ఛటోద్గారకరాళంబును గనత్క
నకాలంకృతంబును రక్తమాల్యాభిశోభితంబును నింద్రాయుధసముజ్జ్వలంబును
ననేకప్రాణిశోణితదిగ్ధంబును నగుశూలంబు కేలం గ్రాలఁ గరవాలభిండివాలప్ర
ముఖప్రహరణంబుల నడరులు సెదర మాతంగతురంగాదిబలంబులతోడ రక్షో
భటులు రా శంఖభేరీముఖతూర్యరవంబులు గ్రందుకొనం జమూసముద్ధూతధూళి
ధూసరితదిశాముఖుం డగుచు నద్దశముఖానుజుం డెడనెడఁ బెక్కుదుర్నిమిత్తం
బులం గనుంగొనియు వానిఁ గైకొనక లంకాప్రాకారంబుఁ జెంగగొని నిజదర్శన
భయంబున వానరులు పెనుగాలిం దూలుమేఘంబులుంబోలెఁ గనుకనిం బఱవఁ
బ్రళయభైరవాడంబరంబున నార్చె నాసమయంబున.

904

కుంభకర్ణునియుద్ధము

క.

కొందఱు మూర్ఛం జెందిరి, కొందఱు డెందములు పగులఁ గూలిరి భీతిం
గొందఱు దిగ్భ్రమ నొందిరి, కొందఱు రఘువీరువెనుకకుం జనిరి కపుల్.

905


క.

నిండం బూచినకింశుక, షండంబులపగిది నుభయసైన్యములు శిలా
కాండప్రముఖప్రహరణ, చండహతులు నమరఁ దుములసమరం బయ్యెన్.

906


ఉ.

అత్తఱిఁ గుంభకర్ణుఁడు భయంకరహుంకృతితో మహాశిలా
వృత్తకఠోరవక్షమున వృక్షచరావలి వైచుశైలముల్
దుత్తుము రై వడిం జెదరి తూలఁగఁ దాఁకె నుదగ్రవృత్తి ది
గ్భిత్తినిపాతనోగ్రగతికిం దగ నార్చుచుఁ దీవ్రకోపుఁ డై.

907


వ.

ఇట్లు సమయింపం దొడంగిన దదీయవిజృంభణంబు సైరింపం జాలక.

908


చ.

కదిసినభీతి వానరులు కన్కనిఁ బాఱియు గహ్వరంబులం

దొదిఁగియు వాఁగువ్రంతఁ బడి యుండియుఁ జచ్చినయట్టు లుండియుం
జెదరి పయోధి సొచ్చియును సేతువు పట్టియు దైన్య మొంద నం
గదుఁడు చలింప కత్తెఱఁగు గన్గొని తా నెలుఁగెత్తి యి ట్లనున్.

909


ఉ.

పాఱకుఁ డేల పాఱెదరు ప్రాణము లెన్నఁటి కింక నీగతిం
బాఱిన భూతముల్ నగవె పార్థివునమ్ములు వీనిపై వడిం
బాఱెడునంతదాఁక ధృతి పట్టఁ దగుం దశదిక్కులం గొనల్
మీఱెడుమీయశంబులకు మే లగుపెంపు దలంపుఁ డీయెడన్.

910


ఆ.

పలువు రొకని కిట్లు పాఱిన నే మను, వారు మనకుఁ బూని వచ్చువారు
పాఱి లోకనిందఁ బడుకంటె ననిఁ జచ్చి, బ్రహ్మలోకపదముఁ బడయు టుఱదె.

911


క.

తాతలతండ్రులసమర, ఖ్యాతులు సెఱుపకుఁడు రాముఁ డనిలోఁ దనము
త్తాత యగుధాత గాచిన, నీతనిఁ దునుమాడు మగుడుఁ డిందఱు ననుడున్.

912


చ.

ఎఱిఁగి యెఱింగి జీవమున కెగ్గు దలంచి దవానలంబులో
నుఱుకుదు రే రణంబుతెరు గొల్లము దుర్జయుఁ డైనవీనితో
నుఱక పెనంగ మాకుఁ జలమో ఫలమో తగ నీవు నిట్టు లీ
మొఱకుఁదనంబు దక్కు మిట ముందర నీఁగుద మంతభంగమున్.

913


క.

అనిన విని మఱియు నడ్డము, సని నిలుపన్ నిలిచి వృక్షచరులును మది నూ
ల్కొని పెద్దశిలలుఁ దరులుం, గొని యార్చుచు నొక్కపెట్టఁ గో ల్తల నేయన్.

914


సీ.

అప్పుడు పౌలస్త్యుఁ డధికరోషంబునఁ, బేర్చి వా రందంద పెలుచ వైచు
నచలశృంగంబులు నంఘ్రిపంబులు శూల, మునఁ ద్రుంచి తనమీఁద మునుఁగఁబడఁగఁ
బలువురు గుదులుగా బలువిడి గ్రుచ్చుచు, నెత్తురువఱదలు నేల నిండఁ
బీనుఁగుపెంటలు ప్రేవులప్రోవులు, మస్తిష్కపటలముల్ మానసమున
కరుడు సేయుచుండ నట్టహాసంబులఁ, గర్ణపుటము లవియఁ గపిబలంబుఁ
బ్రళయసమయకుపితభైరవభైరవా, డంబరమున నుబ్బడంచి మఱియు.

915


ఉ.

ఒక్కొకవేటునం బుడమి నొక్కట నూఱులు వేలు మొత్తముల్
క్రిక్కిఱియం బడల్పడఁ బొరిన్ గద వ్రేయుచు బాహువీథికిం
జిక్కినఁ గౌఁగిటం జదియఁ జేయుచు మ్రింగుచు విక్రమింపఁగా
నక్కడ నిక్కడన్ నిలిచి రత్తఱి గుంపులు గట్టి వానరుల్.

916


క.

ద్వివిదుఁ డొకగండశైలము, జవమునఁ గొని యురము వైవఁ జలియింపఁడ వై
శ్రవణుఁ డది మిట్టిపడి బి, ట్టవుల రథావలులఁ గరుల హరులం జదిపెన్.

917


ఉ.

ఘోరశరంబులం దలలు గుంభినిఁ బెల్లుగ డొల్ల నేయుచుం
[83]దేరులు యామినీచరులు దీవ్రగతిం బఱపంగ వానరుల్
భూరుహపాణు లై కదిసి భూరిబలోద్ధతు లొప్ప నార్చుచున్

వారణముల్ వరూథములు వాజులుఁ గాల్వురుఁ బైపయిం బడన్.

918


చ.

అనిలతనూజుఁ డొక్కగిరి హస్తయుగంబునఁ బూన్చి కైకసీ
తనయుని వైచె నాతఁడును దానికి నించుక స్రుక్కి యంతలో
నన ఘనశూల మెత్తి కఠికనం బగువక్షము నొంప సైఁప క
వ్వనచరవీరుఁ డద్భుతరవంబున ఱోలుచు వ్రాలె భూస్థలిన్.

919


క.

నీలుఁ డది సూచి మండుచు, శైలంబున వైవ దాని శతఖండము లై
తూలి కపులపైఁ బడ నా, భీలత నారక్కసుండు పిడికిటఁ బొడిచెన్.

920


వ.

అప్పుడు నలశరభవృషభగవాక్షగంధమాదనులు గదిసి పాషాణపాదపప్రహారం
బుల నొంపఁ జలింపక జానుముష్టిప్రకోష్ఠపాణితలపరిరంభణంబుల నయ్యేవురం
జచ్చినట్లుండఁ గెడపి విజృంభించి మఱియు నిఖిలబలీముఖులుఁ దెంపునం దనపై
నుఱికి పొడువం దరుతిరోహితం బగుమహామహీధరంబుచందంబు విడంబిం
చుచు వారి నందఱం బట్టి పాతాళసన్నిభం బైనతనకంఠబిలంబున దిగవైచి
మ్రింగుచుం దప్పిచని నాసాకర్లకోటరంబుల వెడలువారి నొడిచి కొని చదియ
నమలుచుఁ గరాళదంష్ట్రాంతరాళంబుల వెడలి పడినవారిం గాల నేలఁ జమరుచు
సమరక్షోణి మేదోమాంసశోణితమేదురప్రదేశంబుల నెఱయ మెఱయం బ్లవం
గబలంబులం దోలుచు నిట్లు [84]కాలాంతకాకృతి నద్దశగ్రీవానుజుండు చరింప సుగ్రీ
వుండు గనుంగొని.

921


మ.

పటుశూలంబునఁ గీలజాల మెసఁగం బైపై దలం బై సము
ద్భటనేత్రాంచలవీథులన్ మిడుఁగుఱుల్ వాఱంగ నందంద మ
రటయూథాధిపు లార్చి వైచునగవృక్షశ్రేణులం చేర్చుచుం
జటులాస్ఫోటనఁ గుంభకర్ణశిఖి మత్సైన్యంబు ని ట్లేర్చునే.

922


సీ.

అనుచు నున్నత మగుతనచలాగ్ర మొక్కటి, కొని వెసఁ బఱతెంచి కోప మెసఁగ
నిలిచి యోరాక్షస నెట్టన నాసేన, నధికుండ వై గెల్చి యసము మిగిలి
యున్నాఁడ వింక నీయుగ్రభంగికిఁ దగ, సన్నంపువారితో సమర మేల
వచ్చితి నిదె నాదువా టోర్వు నీ వన్న, నక్తంచరుఁడు సాల నవ్వి నీవు
బ్రహ్మమనుమఁడ వెఱుకయుఁ బౌరుషంబుఁ, గలఘనుఁడ వేటికిని వృథాగర్జనములు
వైతు గా కని పల్కఁ దద్వక్ష, మతఁడు, వైచె దానికిఁ జలియించి వాఁడు నడరి.

923


శా.

జ్వాలాజాలము మిన్ను ముట్టికొనఁగా శాఖామృగాధీశుపై
శూలం బాతఁడు వైచెఁ దోడన మరుత్సూనుం డెడం బట్టి మ్రోఁ
కాలం బెట్టి చెలంగి దాని విఱువం గట్టల్క మూర్ఛాలసుం
గా లంకామలయాద్రిశృంగనిహతిం గావించె నయ్యర్కజున్.

924


వ.

అప్పుడు విసంజ్ఞుం డై పడినయంభోజమిత్రసంభవుం గుంభకర్ణుండు గదిసి మూఁ

పునం బెట్టికొని నిశాచరు లార్వ గంధర్వసిద్ధచారణాదివియచ్చరు లచ్చెరువంద
లంకాభిముఖం డై చన నంతయుం జూచి ధీమంతుం డగుహనుమంతుండు చిం
తాక్రాంతుఁ డగుచు నంతర్గతంబున.

925


చ.

ఇటు రవిసూతిఁ బట్టికొని యీతఁడు పోవ నుపేక్ష సేసి యే
నటఁ జని యేమి సెప్పుదు నృకపాగ్రణి కిప్పుడు వీనితోడ నె
క్కటి సమరంబు సేసి కడఁకన్ విడిపింతునొ దుర్జయుండు మ
ర్కటవిభుఁ డెట్లునుం దెలిసి రాఁ గలఁ డాతనితెంపు సూతునో.

926


క.

వానరులు సంతసిల్లుదు, రే నీతని కడ్డపడిన నిది కార్యం బౌ
నైన నపకీర్తి గావున, మానధనుఁ డితండు నన్ను మది నే మనునో.

927


ఆ.

కాన వేగపడుట కార్యంబు గా దని, విగతసంజ్ఞు లైనకవృక్షచరులఁ
చేర్చుచుండె నట్లు దేవారితమ్ముఁడు, లబ్ధవిజయుఁ డగుచు లంక సొచ్చె.

928


మ.

తనమీఁదం బురకామినీజనులు సౌధశ్రేణులం బొల్చి నూ
తనపుష్పాంజలు లోలిఁ జల్ల నగుచుం దద్రాజమార్గంబునం
జన సుగ్రీవుఁడుఁ దేఱి వానిఘననాసాకర్ణముల్ తీవ్రదం
తనఖాగ్రంబులఁ ద్రెంచికొంచు మగుడన్ దాఁటెన్ మదోద్యద్గతిన్.

929


వ.

అప్పుడు కుంభకర్ణుండు వికర్ణనాసాముఖుండును శోణితదిగ్ధాంగుండును విషాద
రోషాకులుండు నగుచు నంతర్గతంబున.

930


చ.

చెలియలిముక్కు వోయె ననుసిగ్గున నె గ్గొనరించి రాముతో
వలవనివైర మెత్తుకొని వారక పోరుచు నున్నయన్నకుం
దులువలు నవ్వ నేమొగముతోఁ బొడసూపుదు నింక నమ్మహా
బలుఁ డగుభానుసూను జనకపాలుర మ్రింగెదఁ గాక పోయెదన్.

931


క.

అని తలఁచి మగిడి సైన్య, ధ్వను లులియఁగ నేఁగుదెంచి వడిఁ దలపడియెన్
వనచరులతోడ నప్పుడు, దన కూఱట యగుచు యాతుధానులు దఱుమన్.

932


ఉ.

అత్తఱి రెండుసేనలకు నచ్చెరు వై సమరంబు సెల్ల ను
ద్వృత్తి నతండు పేర్చి పరవీరభటగ్రసనంబు సేయుచుం
గుత్తుకబంటిగా నటులు గ్రోలిన నెత్తుట మిన్ను దాఁకి యు
న్మత్తదశన్ నిశాచరుల మర్కటులం బొరి మ్రింగఁ జొచ్చినన్.

933


మ.

ఉర మేడమ్ముల నేసి లక్ష్మణుఁడు పై నొండొండ నారాచముల్
పరపం దోడన రాముఁడుం గడఁగి యప్పొలస్త్యువక్షంబునం
దరుదారం గులిశప్రచండ మగురౌద్రాస్త్రంబు గీలించి వే
శరవర్షంబులఁ గప్పె నాతతధనుష్టంకారఘోరంబుగన్.

934


క.

అతఁ డయ్యిరువుర బాణా, హతుల ముఖజ్వాల లెగయ నద్రిచరపర
శ్శతముల రూ పడఁచుచు న, ద్భుతముగ యూథాధిపతులఁ దోలుచు రాఁగన్.

935

క.

కనుఁగొని సౌమిత్రి నరేం, ద్రునితో ని ట్లనియె వీఁడు క్రోధావేశం
బున మ్రింగెడుఁ దనవారల, మనవారల రక్తపానమత్తుం డగుచున్.

936


ఉ.

ఇక్కపు లెల్ల నిత్తఱి మహీధరసన్నిభ మైనవీనిమే
నొక్కటఁ బ్రాఁకి నొంప బహుయూథభరంబునఁ జిక్కఁబోలు నా
గ్రక్కున వారు పాఱి మునుఁగంబడ నెక్కిన బిట్టు దూలి న
ల్దిక్కులఁ గూల గాత్రము విదిర్చె నతండు మదద్విపాకృతిన్.

937


సీ.

అది సూచి భూనాథుఁ డనుజసమేతుఁ డై, సుగ్రీవముఖ్యులు చుట్టు బలసి
కడుగట్టిమొనలతో గాసిల్లఁ గన్నులఁ, గెంజాయ వొడమంగఁ గినుకతోడ
విల్లు మ్రోయించుచు విక్రమక్రీడకుఁ, గడఁగ నుజ్జ్వలగదాకలితహస్తుఁ
డగుచు విభీషణుఁ డందఱఁ దలమీఱి, యనికి నేతంచిన నలరి కుంభ
కర్ణుఁ డి ట్లనుఁ దమ్ముఁడ కదిసి నన్ను, వ్రేయు సోదరస్నేహంబు విడువు నీవు
యామినీచరాన్వయబీజ మంతరింప, కుండ రామునికృప లంక నుండఁ గలవు.

938


క.

ధర్మానుపాలనం బతి, నిర్మలమతిఁ జేయుచుండు నిత్యోన్నతస
త్కర్మఫలసిద్ధి సేకుఱు, ధర్మ మెచట నుండు నచట దైవము నుండున్.

939


క.

మనవంశము రక్షించుట, కినవంశజు నాశ్రయింప నేతెంచితి గా
వున రక్షణీయుఁడవు నీ, వనఘాత్మా తొలగి చూడు మటు మీయన్నన్.

940


చ.

అనవుడుఁ గేలు మోడ్చి యతఁ డాతనిఁ జూచి దశాస్యుఁ డట్లు సే
సిన కొఱగామిఁ బాయవలసెన్ మిము నందఱ నిట్లు రాక నా
కనుచిత మెట్లుఁ దప్పు గల దంచు నొకింత దొలంగి సంగరా
పని గద మోపి మోము దిగవైచి విషాదము నొందుచుండఁగన్.

941


సీ.

కోపచేష్టాఘోరకుటిలోరుదంష్ట్రల, మిడుఁగుఱుల్ వాఱంగ మిన్ను దాఁకి
పరుషగర్జితమున బ్రహ్మాండకోటర, మనిసిన ట్లద్రువఁ గల్పావసాన
సంభూతజీమూతసంభ్రమంబునఁ బేర్చి, భూతములకు భయాద్భుతము లొదవఁ
దనమేనినెత్తురు దావాగ్నిశిఖఁ బోలు, నాలుక నందంద నాకికొనుచు
నెదురుపడినవారి నెల్ల మ్రింగుచు నేడ, దాశరథులబాణతతులు గొన్న
లెక్కగొనక సమరలీలావిజృంభణ, మంతకంత కెసఁగ ననుజుఁ గడచి.

942


మహాస్రగ్ధర.

హరిసేనం గుంభకర్ణుం డని దిగిభనిభోగ్రాకృతిన్ రాముకోలల్
బరిగోలల్ వోలె రేఁపన్ బలువిడి నిగుడుం బట్టు నందంద మట్టుం
బొరి వ్రేయున్ నుగ్గుసేయుం బొడుముగఁ జదుముం బ్రోవులై ప్రేవు లుండన్
ధర నొత్తున్ మీఁది కెత్తుం దలలు నమలు నుద్యద్గతిన్ వీచివైచున్.

943


వ.

మఱియు ననేకప్రకారంబుల వనచరులు సమయించుచు సమరవిధి విశృంఖలవృ
త్తిం జనుదేర రఘుకులదీపకుండు గోపంబునఁ జాపంబు సారించుచు నప్పౌల
స్యుం గనుంగొని.

944

క.

ఆదిక్కు సనకు వేగమ, నాదిక్కున కేఁగుదెమ్ము నక్తంచర పో
రాదు నను మిగిలి విను బ్ర, హ్మాదులలోకములు సన్న నైన వధింతున్.

945

శ్రీరాముఁడు కుంభకర్ణుం జంపుట

క.

అన విని కోపాటోపం,బున మర్కటభటులడెందములు బి ట్టవియం
బెనునవ్వు నవ్వి పరుష, ధ్వని నజ్జననాథుతోడ వాఁ డి ట్లనియెన్.

946


తే.

వీఁడు గుంభకర్ణుఁడు సుమ్ము విక్రమంబు, [85]దూల నీచేతఁ బడ విరాధుండు గాఁడు
ఖరుఁడు గాఁడు మారీచుఁడు గాఁడు మనుజ, వర కబంధుండు గాఁ డల్ల వాలి గాఁడు.

947


మ.

ఇదె నీతో సమరంబు సేయుటకునై యేతెంచి యున్నాఁడ నా
గద నెవ్వాఁడు సహించువాఁడు దివిషద్గంధర్వదైత్యాదుల
న్మద మేదించితి దీన నన్నఁ గపిసైన్యం బెంత నీయస్త్రసం
పదయున్ నీవిలునేర్పుఁ జూచి మఱి దర్పం బొప్ప నిన్ మ్రింగెదన్.

948


క.

అనుచుం బఱతేర మహా, శనివేగము లయిన ఘోరశరములు వాలిం
దునిమిన బాణము మును గాఁ, గ నరేంద్రుం [86]డేసి వాఁడు కంపింపమికిన్.

949


చ.

మఱియును బైపయిం బఱపుమార్గణవర్గము లొక్కమ్రోఁతతోఁ
దఱుమ నమోఘమేఘజలధారలు వారిధి డిందుచందమైఁ
గఱు లఱివోవ వానిపులకవ్రజకంటకితాంగయష్టిపై
గిఱిగొని లో నడంగఁ దొడఁగెం గపు లచ్చెరు వంది బెగ్గిలన్.

950


క.

అప్పుడు మెఱుఁగులు సుడివడఁ, ద్రిప్పుచు గద నడుమ నిగుడుతీవ్రాశుగముల్
దప్పఁగ జడియుచుఁ గన్నుల, నిప్పు లురుల నతఁడు గదియ నృపపుంగవుఁడున్.

951


క.

వాయవ్యాస్త్రము కొని వల, చేయి దునుమఁ జెలఁగువాని సింహధ్వనితో
మ్రోయుచు నది వడిఁ బడియె గ, దాయుత మై యచటికపివికతతి రూపడఁగన్.

952


వ.

ఇట్లు వికలహస్తుం డగుచు నప్పౌలస్త్యుండు.

953


ఆ.

కులిశపాతభగ్నకూట మయ్యును జూడ్కి, కరుదు సేయునద్రికరణిఁ దోఁచి
యున్నకేల నొకమహోత్తాలసాలంబు, పెఱికికొనుచు నతఁడు బీఱువోక.

954


క.

ఆభీలాకృతిఁ బఱతే, నాభుగ్నభ్రుకుటి యగుచు నైంద్రమున విభుం
డాభుజముఁ గూలనేసె మ, హాభుజగము గరుడతుండహతిఁ గూలుగతిన్.

955


క.

వడి నదియును దనమునుమునఁ, బడిన మహాశిలలు పగులఁ బాదపవితతుల్
పొడి గాఁగ నుభయసేనలు, నడఁగఁ జదిపికొనుచు డొల్ల నాలో విభుఁడున్.

956


చ.

కనుఁగొని యర్ధచంద్రవిశిఖంబులు రెంటను గాళ్లు రెండు వే
తునిమి భయంకరాకృతి విధుం గబళింపఁ గడంగుసైంహికే
యునిగితి మింటికిన్ నెగయు నుజ్జ్వలపుంఖశరాళి నించె నె
ట్టన వికటాట్టహాసము లడంగఁ దదాననగహ్వరంబునన్.

957

సీ.

దానికి మూర్ఛిల్లుతఱి భానుకిరణసం, కాశంబుఁ బవనవేగంబు బ్రహ్మ
దండచండము నింద్రదత్తము నగుకోల, వక్షంబు గొని పాఱి వసుధఁ గాఁడ
నిగిడించి తోడన నిర్ఘాతగతిఁ బొల్చు, యామ్యాస్త్ర ముగ్రార్చు లడరఁ బఱపి
పర్వతకూటనిభం బైనతలఁ ద్రుంప, నదియు లంకాసాలహర్మ్యపంక్తిఁ
[87]గూలఁ ద్రోచికొనుచుఁ గొఱలురక్తము నంబు, జంతుకోట్లు గ్రోల జలధి మునిఁగె
నద్భుతంపుమ్రోఁత నాతనిమేనును, బడియెఁ గోటికపులు పుడమిఁ జదియ.

958


క.

పడి కుంభకర్ణుశిర మ, ప్పుడు జలములు గ్రోలఁ బృథులబుద్బుదములచ
ప్పుడు దోడ్తోడం బొడమెను, బడబాగ్నిఁ బయోధి యుడుకు పట్టె ననంగన్.

959


ఉ.

అంత వలీముఖుల్ సురగణాదులు భూగగనాంతరాళ మొ
క్కంతర మై పయిం దఱుచుటార్పుల రాముఁ బ్రశంససేయువా
క్సంతతులం జెలంగఁగ నిశాచరు లుర్వి చలింపఁ బాఱి ర
త్యంతభయంబుతోడ విగతాయుధు లై తల లూడ లంకకున్.

960


వ.

అట్లు పాఱి కుంభకర్ణునిపా టెఱింగింప రావణుండు బిట్టు మూర్ఛిల్లి తనతనయు
లు దేవాంతకుండును నరాంతకుండును ద్రిశిరుండు నతికాయుండును మహో
దరుఁడును మహాపార్శ్వుండు నయ్యవస్థం జూచి శోకించుచుఁ దెలుప నెట్టకేల
కుం దెలిసి దెసలు సెలంగఁ బేరెలుంగున.

961


ఉ.

హా రిపువీరదర్పహర హా ఘనవిక్రమకేళిలోల హా
శూరవరేణ్య నీ కిటులుఁ జొప్పడునే ననుఁ బాయ నింక లం
కారజనీచరావళికిఁ గావలి యెవ్వనిబాహుదండ మె
వ్వా రిటమీఁద నాకుఁ గలవారు రణంబునకున్ మహాబలా.

962


క.

అకట సురేంద్రునివజ్రము, నొకచీరికిఁ గొనవు కపిబలోగ్రాటవిఁ బా
వకుభంగి నేర్చి నరనా, యకుసాయకవృష్టి నెట్టు లాఱితి తండ్రీ.

963


ఉ.

ఆలములోన భూతబలి యైతె నిశాచరవీర నిర్జరుల్
గేలిగొనం బులస్త్యకులకేతువ రామశరానిలంబున
న్వ్రాలితె కైకసీతనయ నాదగుదక్షిణబాహుశాఖ భూ
పాలుఁడు ద్రుంచెనే యిటు విపద్దశఁ ద్రోచితె నన్నుఁ దమ్ముఁడా.

964


క.

ఇదె నీవు సనిన భీతి, ల్లెద రెల్లనిశాచరులు నిలింపులు లీలం
జదల విహరించెదరు ప్రాఁ, కెద రార్పులతోడఁ గోట గిరిచరవీరుల్.

965


ఆ.

ఇంక నీవు లేని యీలంక నా కేల, సీతచింత యేల జీవ మేల
సంగరమున నిన్నుఁ జంపినరామునిఁ, జంపఁ దగదు గాక చావఁ దగదె.

966


ఉ.

అప్పుడు సర్వకార్యవిదుఁ డైన విభీషణుఁ డన్నిభంగులం

జెప్పఁడె చాటి మీఁద నగుచేటు నయజ్ఞులమాట లేటికిం
దప్పు నవజ్ఞమై నకట ధర్మపరుం డగునట్టివాని కే
నొప్పమి సేసి తత్ఫలము నొందితి నిందకు నైతి నే మనన్.

967


వ.

అనుచు ననేకప్రకారంబుల విలపింపఁ ద్రిశిరుం డి ట్లనియె నీవాక్యంబులు నిక్కం
బు లగు నైనను గడచనినదానికి శోకం బేల మూఁడులోకంబులు గెలువంజాలునీ
యట్టిమహావీరుండు ప్రాభవంబు దూల నుత్సాహంబు విడుచు టేవెరవు నీవు కై
దువు ధరియించిన సురాసురాదులు సన్న్యస్తశస్త్రు లగుదురు రాముఁ డన నెంత
నాకు బ్రహ్మదత్తంబు లైనశరశరాసనశక్తికవచంబులు నశ్వసహస్రయుతం బగు
దివ్యరథంబును గలవు నన్నుం బంపు నీపగ దీర్చెద ననిన నతికాయదేవాంతక
నరాంతకు లట్ల పలుక నప్పౌలస్త్యుండు నిరస్తశోకుం డగుచు న ట్లేకమనస్కులు
నంతరిక్షచరులు మాయావిశారదులు వివిధాయుధప్రవీణులు జవసత్త్వసంప
న్నులు దేవదర్పఘ్నులు విజయగర్వితులు లబ్ధవరులుఁ గీర్తికాములు నయి సం
గ్రామంబునకు వేడ్కయు వెరవునుం గల యక్కొడుకుల బహుప్రకారంబుల మ
న్నించి వీడ్కొలిపి మహోదరమహాపార్శ్వులఁ దోడు పనుప నయ్యార్వురు నేన
నేన రిపులరూ పడంతు ననుచు గర్జిల్లుచు వెడలి రందు మహోదరుం డైరా
వతకులంబునఁ బుట్టినసుదర్శనం బనునేనుంగును నరాంతకుండు వెలిమావును
దక్కిననలువురు నరదంబులను నెక్కి ధవళచ్ఛత్రంబులు మెఱయఁ గ్రూరగ్రహం
బులుంబోలె వెలుఁగొందుచుఁ జతురంగంబులతోడఁ గడంగి నడచుసమయంబున.

968

దేవాంతకనరాంతకమహాపార్శ్వాదులయుద్ధము

సీ.

మదసౌరభంబులు మధురింప నెడఁ జేయు, గంధవాసనలకు గర్వ మొసఁగఁ
జెన్నొందుపుష్కరశీకరోత్కరములు, దుహినయంత్రములకుఁ దోడుపడఁగఁ
గర్ణవ్యజనములు ఘనతాళవృంతరా, జికిఁ బూని మేనుల చెమట లార్ప
దానలీలాహూతతరుణాళిఝంకృతుల్, సూతగీతములకు సొం పొనర్పఁ
గరులు నాయుధశాలలకరణిఁ జారు, [88]మణిమయస్యందనమ్ములు మహితరేఖ
లమర లఘుచిత్రగతులఁ జెల్వారుహరులు, జమునిచెలు లనఁ దగుభటుల్ సందడింప.

969


చ.

వెలిగొడుగుల్ శరద్ఘననవీనవిలాసము దోఁప నంబర
స్థలి మెఱయం గిరీటమణిజాలమరీచులు భానుదీప్తులన్
గెలువఁగ విస్ఫులింగపటుకీలలు గైదువు లీన సేనతో
వెలువడి రార్పులన్ దెరలు వ్రీలఁగఁ జేయుచు నన్నిశాచరుల్.

970


ఉ.

అద్భుతసింహనాదముల నబ్ధి గలంగఁ బ్లవంగవీరులున్

హృద్భరితోగ్రకోపముల నేచి శిలాతతు లెత్తికొంచుఁ జం
చద్భిదురప్రచండగతిచందము చొప్పడ వీఁకఁ దాఁకి ర
త్యుద్భటవైరిహుంకృతులకతోఁ దొడరన్ వికటాట్టహాసముల్.

971


వ.

అంతి నుభయబలంబులు గలయ బెరయుసమయంబున.

972


సీ.

అరదంబు లడరిన నశనివేగోద్ధతు, లుఱ మీఁద నుఱుముగా నుఱుకువారు
దంతులు ద్రోచినఁ దాలసాలాదుల, మొగదప్ప బలువిడి మోఁదువారు
నాశ్వికు లఱిమిన హయములకడగాళ్లు, వెసఁ బట్టి నేలతో వ్రేయువారుఁ
గాల్వురు గడఁగిన ఘనముష్టినిహతులఁ, గీలాలములు గ్రక్కఁ గెడపువారు
మఱియుఁ దఱుచు మొనలు దఱిమిన నందంద, శిలలు గురియువారు నలుఁగు లొడిసి
పాఱవైచువారుఁ బటుదంతనఖకేళి, సలుపువారు నైరి శైలచరులు.

973


చ.

అఱిమి విభావరీచరులు నమ్ములమర్మము లాడునేటులన్
గఱులు మునుంగఁ దూలుసెలకట్టియవాటులఁ గుంతశూలముల్
దఱుచుగఁ దాఁకుపోటుల గదాపరిఘాదులవ్రేటులన్ మొనల్
పఱిపఱిగా బలీముఖులకపాటులుఁ జెల్లఁ బెనంగి రయ్యెడన్.

974


క.

తరుచరరజనీచరు లొం, డొరుచేతుల యాయుధములు నుర్వీజములుం
బొరి నొడిసికొనుచుఁ బోరఁగఁ, బరస్పరాహతుల నవియు భగ్నము లయ్యెన్.

975


ఆ.

రిక్తహస్తు లైన నక్తంచరులు వృక్ష, చరునిఁ బట్టి వృక్షచరునితోడ
వ్రేసి వ్రేసి సమరవీథి విశృంఖల, లీలమైఁ జరింపక లెక్క గొనక.

976


ఉ.

ఏపునఁ గిట్టి యేనుఁగున నేనుఁగు వైచుచు వాజి వాజిచే
రూ పడఁగంగ మోఁదుచును రోదసి మ్రోయ రథంబుపై రథ
క్షేప మొనర్చి తుత్తుమురు చేయుచు రక్కసుతోడ రక్కసుం
బ్రోపడ వేయుచుం గపులు పోరుచు నుండఁగ నన్నిశాచరుల్.

977


వ.

అర్ధచంద్రక్షురప్రభల్లప్రముఖశిలీముఖంబుల బలీముఖులు బహుముఖంబులం గురి
యుశిలాతరుషండంబులు ఖండించుచుఁ దఱుమ నుభయసైనికులు నితరేతరహ
తుల మూర్ఛలకు డాసియుఁ దోన పాసియుఁ బరస్పరజయేచ్ఛలం జలంబు లెక్కఁ
బెనంగి రత్తుములసమరంబునకుం బొంగి నింగి నిర్జరు లార్చి రాసమయంబున.

978


సీ.

విఱిగినరథములు నొఱగినహయములుఁ, గ్రందుగాఁ ద్రెళ్లినకరటిఘటలుఁ
దఱుచు గాయము లొప్పఁ దెఱువులు లేకుండఁ, బడిననిశాటులుఁ బ్లవగభటులు
బుఱియలు పఱియ లై యుఱికినమస్తిష్క, పంకముల్ బహురక్తపల్వలములు
నఱకినతరుశిలల్ నఱుమైనకైదువుల్, గిఱిగొన్నగొడుగులుఁ గేతనములుఁ
గలయఁ బ్రేవులప్రోవులుఁ గలిగియున్కి, నధికదుర్గమ మగుసంగరాంగణమున
నార్చి తురగంబుఁ బఱపి నరాంతకుండు, శైలచరసప్తశతిఁ గూల్చె శక్తి వైచి.

979


చ.

మఱియు విచిత్రవల్గనసమక్రియ ఘోటక మొప్ప నబ్ధిఁ బెం

జొఱ దఱియంగఁ జొచ్చుగతి చొప్పడ వానరసేనఁ జొచ్చి పై
నఱిముఱి వైచుపాదపశిలావలిఁ బ్రాసము ద్రిప్పి తప్పిపోఁ
జఱుచుచు విస్ఫులింగములు సల్లుమొనం బొరిఁ దట్టిపుచ్చుచున్.

980


లయగ్రాహి.

[89]వ్రేటు భుజదండములఁ బోటు ఘనముష్టి నగకూటములఖండములవాటు లఱచేతం
జాటుగొన డగ్గఱువనాటభటులం దనదుపోటు మునుగాఁ బెలుచ గీ టడఁచుచుం బై
పాటుఁ దలపాటు నగపాటుఁ గనునాఖచరకోటి మది నచ్చెరువురపా టొదవ వీటం
బాటి గలపోటరుల మేటిగములం గదనపాటవము సెల్ల విటతాటనము సేయన్.

981


క.

మును కుంభకర్ణు నురవడిఁ, గనుఁగొని వడిఁ బాఱినట్లు కపు లధికభయం
బునఁ బాఱిరి సుగ్రీవుని, వెనుకకు నద్దాశకంఠి వెంటం దగులన్.

982


ఉ.

అప్పుడు భానుసూనుఁడును నంగదుఁ జూచి కుమార సైన్య మీ
చొప్పునఁ బాఱుచున్నయది చూచితె వీనిమదం బడంతు గా
కిప్పుడు నీవు నావుడు దినేంద్రుఁడు మేఘచయంబుఁబోలె నే
ర్పొప్పఁగ సేన వెల్వడి మృహోగ్రగతిం బఱతెంచి ముందటన్.

983


క.

నిలువఁబడి యోరి కడున, ల్పులఁ గొండఱఁ జంపి మనముతిలో గర్వింపన్
వల దిదె నాయుర మదె నీ, వలచేతం బ్రాస మెత్తి వైపు మనవుడున్.

984


తే.

అట్టహాసంబుతోఁ బ్రాస మలుకఁ బూఁచి, రక్కసుఁడు వైవఁ దన పెన్నురంబు బిట్టు
దాఁకి యది తుత్తునియ లయి ధరణిఁ బడినఁ, గేలి దోఁపంగ నవ్వి యవ్వాలిసుతుఁడు.

985


క.

వడి నెగసి హస్తతలమునఁ, బిడుగుగతిం జఱువ నెత్రు పె ల్లై గ్రుడ్డుల్
మిడిసి తల పగిలి తురగము, నడునాలుక గఱచికొని రణస్థలిఁ బడియెన్.

986


ఆ.

వాజి వడినఁ బడక వాఁడు పై లంఘించి, కఠినముష్టి మస్తకంబు వగులఁ
బొడువ నొడలు దడియగ వెడలునెత్తుటితోడఁ, దొడరు మూర్ఛ గవిసిక తోన తెలిసి.

987


క.

వాలితనూజుఁడు పిడికిట, వ్రీలఁగ వక్షంబుఁ బొడువ వెస రోఁజుచుఁ గీ
లాలము ముక్కున వాతం, గూల నతఁడు గూలి తన్నికొనుచుం జచ్చెన్.

988


వ.

అట్లు నరాంతకుండు గూలినం బ్లవంగపుంగవులు సిద్ధచారణాదులుం జెలఁగుచు
నంగదు నగ్గించునెలుంగులు నిశాచరులభయశోకారావంబులు భూనభోంతరా

శంబు గ్రందుకొన నత్తెఱంగునకుం గ్రోధాభిమానంబులు మాననంబున నిండ
దేవాంతకుండు పరిఘం [90]బంకించుచు నడవఁ దోడన త్రిశిరుండు తేరు దోలుచు
మహోదరుండు గజంబు డీకొలుపుచుం గదిసి రప్పు డప్పౌలస్త్యులం గనుంగొని.

989


క.

ఒకఘనవృక్షము కపినా, యకసూనుఁడు పెఱికి వైచె నార్చుచు దేవాం
తకుపయి నడుమన త్రిశిరుఁడు, శకలంబులు సేసె దాని శరసంఘములన్.

990


సీ.

అది యట్లు వమ్మైన నమరేంద్రుమనుమఁడు, వెండియుఁ గడుమండి విపులశిలలు
భూరిభూరుహములుఁ బొరిఁబొరిఁ గురియంగ, లఘుగతి వాఁడు భల్లముల నవియుఁ
ద్రుంచుచుఁ గ్రొవ్వాఁడితూపుల నవ్వీరు, నవయవమర్మంబు లదర నేసె
దేవాంతకుండు నద్దెస వచ్చుపాదపా, దులు పరిఘంబునఁ దూల జడిసి
కొనుచుఁ బఱతెంచెఁ దద్ఘాతమునఁ [91]గెరల్చి, యోసరించిన భ్రాతృవ్యయుగమునకును
దోడుపా టొప్పఁ గరిఁ ద్రోచి తోమరముల, నురము నొప్పించె నొగి మహోదరుఁడు గడఁగి.

991


ఉ.

అంత మహోగ్రవేగమున నక్కపిసింహుఁడు సింహలీల న
ద్దంతికి దాఁటి బి ట్టొఱల దట్టనతో నఱచేత వ్రేసి త
ద్దంతము బల్విడిం బెఱికి తన్ మును రేఁచి తొలంగి యున్నదే
వాంతకు డాసి వ్రేసె వడఁ కాడుచు నెత్తురు గ్రక్కునట్లుగన్.

992


చ.

పడివడి యాన మీల్కఱచి పట్టుచు వాఁడును నెట్టకేలకున్
పడికొని బాహుగర్వ మొదవం బరిఘంబున నేసె నాతఁడున్
[92]ముడుసులు నేలమోవఁ బడి మూర్ఛకు మున్ నెగయంగఁ బుంఖముల్
గడవ లలాట మేసె నలుకం ద్రిశిరుండు నిషుత్రయంబునన్.

993


క.

అత్తెఱఁగు సూచి కడును, ద్వృత్తి దిశావలయ మద్రువ దేవాంతకుపై
నొత్తిలి యార్చుచుఁ గడఁగె మ, రుత్తనయుఁడు సమరపరుషరోషం బెసఁగన్.

994


క.

అంగదుఁ డట్టులు నొచ్చుట, కుం గనలుచు ననిలసుతుఁడు కొండతునియ వై
చెం గత్తివాతితూపున, నింగలములు పెదరఁ ద్రిశిరుఁ డెడ నది త్రుంచెన్.

995


వ.

ఆసమయంబున.

996


మ.

పరిఘం బుద్ధతిఁ జండతుండగతి నొప్పం బొల్చుదేవాంతక
ద్విరదంబుం గని పొంగి నింగి హనుమత్సింహంబు దాఁటెం గృశో
దరముం జాలితదీర్ఘవాలము బలోద్దామైకవేగంబు భీ
కరదంష్ట్రాలముఖంబుఁ బెన్నఖములుం గన్పట్టఁ గట్టల్కతోన్.

997


సీ.

అమరారిసుతుఁడు దా నతులవేగంబునఁ, బరిఘంబు మెఱుఁగులు వాఱఁ ద్రిప్పి

బలువిడి వైవ నప్పవమానసూనుండు, కులిశకఠోరప్రకోష్ఠనిహతి
భగ్నంబు సేయుచుఁ బఱతెంచి ఘనముష్టి, వడి నెత్తి నడునెత్తి వ్రయ్యఁ బొడువ
నురురక్తధారల నొడ లెల్ల జొత్తిల్ల, మెడ గ్రుంగ వీనుల మెదడు వెడల
నిడువెడందజిహ్వ నడుకొనఁ బండులు, గఱచి వెలికి గ్రుడ్డు లుఱుక సమర
రోషఘటితకుటిలభీషణభ్రుకుటిప, తాకతోన తిరిగి ధరణిఁ బడియె.

998


వ.

ఇట్లు దేవాంతకుఁడు పడినం గోపించి.

999


క.

నీలునివక్షము ద్రిశిరుఁడు, వాలమ్ముల నుచ్చిపాఱ వడి నేసెం ద
జ్జాలకములఁ బటుసాయక, జాలములు మహోదరుండు జవమున నేసెన్.

1000


ఆ.

అతఁడు నవశుఁ డగుచు నాలోనఁ దెలివొంది, వడి నగంబుఁ బెఱికి వైవ శిరము
పగిలి గజముతలయుఁ బఱియలై యమ్మహో, దరుఁడు దానితోన ధరణిఁ బడియె.

1001


మ.

త్రిశిరుం డాతనిపాటు సూచి మదిలో దీపించుకోపంబుతో
[93]నశనిస్ఫీతము లైనపాతములుగా నందందఁ దా వేగ తీ
వ్రశరవ్రాతము లాంజనేయునిపయిన్ వర్షించె నవ్వీరుఁడున్
దశనాగ్రంబులు దీఁడుచున్ వయిచె నుత్తాలాద్రికూటంబునన్.

1002


క.

అది తునియ నతఁడు నుగ్ర, ప్రదరంబులు పఱపి మఱియుఁ బావనిమీఁదం
జద లద్రువ నేసె నప్పుడు, చిదురలు గా నాప్లవంగసింహుం డంతన్.

1003


ఉ.

తేరికి దాఁటి చండగతిఁ దీవ్రనఖంబులఁ బెల్లుగా నసృ
గ్ధారలు నేలఁ గూలఁ దురగంబులు వ్రచ్చి తొలంగి భీకరో
ల్కారయ మార శక్తి గొని లక్షితవక్షము వైచె దాని న
మ్మారుతి కేల బట్టి నడుమం దునుమాడిన వాఁడు వెండియున్.

1004


క.

ఉఱక తనశక్తి పొలిసిన, నొఱఁ బెట్టినవాలు పెఱికి యుడుపథమునకున్
మెఱుఁగు లెగయ జళిపించుచు, నుఱికి మరుత్తనయువక్ష మురవడి నేసెన్.

1005


ఉ.

ఆతఁడు దానికిం గనలి హస్తతలంబునఁ బూఁచి మేటిచ
ట్రాతికిఁ బాటిగాఁ దగువెడందయురస్స్థలి వ్రేసి మూర్ఛమైఁ
జేతికృపాణమున్ విడువఁ జేసి విజృంభణ మొప్ప రాక్షస
వ్రాతముఁ దోలఁ జొచ్చె ననివారణఁ దత్కరవాలహస్తుఁ డై.

1006


వ.

అట్లు విసంజ్ఞుం డగుచుఁ దెలిసి నిశాచరుండు హనుమంతుం గనుంగొని.

1007


క.

వడి నెగసి వచ్చి వక్షము, బెడిదం బగుపిడుగుఁబోనిపిడికిటఁ బొడువం
బొడమినమూర్ఛం గరువలి, కొడుకు గడుం దూలి తేఱి కుపితుం డగుచున్.

1008


మ.

ప్రకటమదోద్ధతిం గడఁగి పంక్తిముఖాత్మజుపైకి లెక్కసే
యక వెస దాఁటి ఘోరకులిశాహతి నింద్రుఁడు విశ్వరూపుమ
స్తకమును ద్రుంచినట్టు బడిదంబున నొక్కటఁ ద్రుంచెఁ దత్త్రిమ

స్తకి వడి భీకరభ్రుకుటిచాపకలాపలలాటపట్టికన్.

1009


ఆ.

మస్తకంబు లట్లు మహనీయబహురత్న, రచితకుండలములరుచులఁ బొల్చి
ధర నలంకరింపఁ బొరి రక్తధారలు, గురియఁ ద్రిశిరుఁ డాజిఁ గూలె నపుడు.

1010


శా.

కీశశ్రేణులసింహనాదములఁ గిష్కింధావిభుం డుబ్బి యా
కాశం బందఁగ నందు వేల్పుగములం గ్రం దై హనుమత్ప్రశం
సాశబ్దంబులు నింగి ముట్ట రజనీచారుల్ భయం బంది రా
దాశగ్రీవి రణస్థలిం బడిన నార్తధ్వానముల్ సేయుచున్.

1011


వ.

అవ్విధం బంతయుం జూచి విషాదరోషంబులం బొందుచు మహాపార్శ్వుండు.

1012


క.

అమరాసురదర్పఘ్నియుఁ, గమనీయసువర్ణవలయకలితయు దిగిభా
స్రమలీమసయును నగునొ, క్కమహాగదఁ గొనుచు గవిసెఁ గపినాథునకున్.

1013


క.

వడి నట్లు గవియ నతనికి, నెడసొచ్చి చెలంగి ఋషభుఁ డెదు రై నిలిచెం
గడఁగి నిశాచరుఁడును న, బ్బెడిదపుగదఁ బూన్చి వైచెఁ బెన్నుర మవియన్.

1014


చ.

ఋషభుఁడు దత్ప్రహారము సహింపక మూర్చిలి యెట్టకేల కు
న్మిషితవిలోచనుం డగుచు నెత్తిపయిం బడ మోఁదె నాసుర
ద్విషుఁ దన కెత్తునగ్గదయ వే కొని నెత్తురు వాఱ నాసికా
సుషిరములం బొరింబొరి వసుంధరఁ గూలఁగ ఱోలుచుం బడెన్.

1015


వ.

ఇట్లు మహాపార్శ్వుండు వడినఁ బుడమి నాయుధంబులు వైచి నిశాచరులు పఱవ
నతికాయుండు కోపంబునఁ జాపం బెత్తి వారి మ్రోయించుచు వనచరబలంబు
మీఁదఁ దేరు దోలించినం గలంగి వనచరులు కుంభకర్ణుండు మగుడఁ బ్రాణం
బులు వచ్చి వచ్చెనొకో యనుచుఁ బాఱి రామచంద్రువెనుకఁ జొచ్చిన నవ్వీ
రుండు వారి వెఱవకుండు వెఱవకుం డనుచు విభీషణుం గనుంగొని.

1016


శా.

వి ల్లాఖండలచాపతుల్యముగ మౌర్వీరేఖ సౌదామినీ
వల్లిం బోలఁగ మేను మేఘవిపులత్వం బొంది శోభిల్లఁగా
నెల్లిం జంద్రిక మించునీరథమువాఁ డెవ్వాఁడు దిగ్భిత్తులం
బెల్లల్ రాలెడు నిష్ఠురస్తనితగంభీరాట్టహాసంబునన్.

1017


తే.

కేతనాగ్రంబుపై సైంహికేయుఁ డమర, బహుతురంగముల్ పూనిన పసిఁడితేరు
నగ్నికీలలు నిగుడు సర్వాయుధములు, నొప్ప నుజ్జ్వలుఁడై వచ్చుచున్నవాఁడు.

1918


చ.

అన విని యాతఁ డీతఁడు దశాస్యునకుం దనయుండు ధాన్యమా
లినికి జనించినాఁడు భుజలీలల రావణుఁ బోలువాఁడు వీఁ
డనికిఁ గడంగినప్పుడు సురాసురముఖ్యులుఁ దల్లడింతు రీ
ఘను నతికాయుఁ డండ్రు ఘనకాయమునుం గలవాఁడు కావునన్.

1019


వ.

రఘువరా విను మితం డచలనిష్ఠం బరమేష్ఠి నారాధించి యవధ్యాశ్వసహస్రం
బగునరదంబు నవార్యంబు లగుననేకాస్త్రంబుల వెలుంగుతూణీరంబు లిరువది

యును బదు నెనిమిది శరాసనంబులుఁ బిడిపట్టుహస్తచతుష్టయంబు నిడుపుపది
చేతులుం గరకరాళకరవాలంబులు రెండు నభేద్యకవచంబును బడసినాఁడు వీఁడు
తురగకరిరథారూఢుం డైనప్పుడు ఖడ్గకంపణకార్ముకసమరంబులం బ్రవీణుం డిమ్మ
హాబాహుం డస్త్రధరశ్రేష్ఠుండు నార్యసేవానురక్తుండును బహుశ్రుతుండును నీతి
శాస్త్రకోవిదుండు ననం బ్రసిద్ధుం డితనిభుజబలంబున లంక నిరాతంకం బై యుండు
వీనిబాణంబుల వజ్రప్రముఖదివ్యాయుధంబులు నిష్ప్రభంబు లైనవి కావున దేవ
మీ రివ్వీరునం దధికయత్నంబు సేయునది కార్యం బని చెప్పె నాసమయంబున.

1020


క.

మిడుతగమి వాఱుతఱుచున, నుడుమార్గము నిండి పాఱునుగ్రాస్త్రములన్
మిడుఁగుఱులు రాలఁ గపులను, సుడిపడి వడిఁ బాఱ నేయుచుం గట్టల్కన్.

1021


క.

ఘననేమిఘట్టనధ్వని, వనధిధ్వానంబు నడఁప వడిఁ జూపజ్యా
నినదంబు దాని లోఁగొన, వనచరబల మతఁడు సొచ్చి వ్రచ్చెం గడిమిన్.

1022


అ.

అప్పు డార్పు లెసఁగ నందఱు నతనిపై, నుక్కు మెఱసి వచ్చి యూథపతులు
మార్కొనంగ నందు మైందద్వివిదనీల, శరభకుముదు లద్రిచరులు గడఁగి.

1023


క.

తరులును గిరిశృంగంబులు, నురవడిఁ గొని మీఁద వైవ నురుభల్లములన్
మురియలు సేయుచు [94]నయ్య, చ్చరకొడుకు ధనుఃకలావిశారదుఁ డగుచున్.

1024


క.

ఒక్కొకనెఱనారసమున, నెక్కుడువడి వారియురము లేసి నిలుపుచున్
స్రుక్కించెం గరలాఘవ, మక్కజముగఁ గోలఁ గోల నందఱు కపులన్.

1025


వ.

అట్లు విక్రమించి గర్జించినం బ్లవంగపుంగవులు చేయునది లేక కంఠీరవభైరవా
రావంబు విన్నకురంగంబులతెఱంగు నొంది రప్పౌలస్త్యుండును జేర నేతెంచి
రఘువరుం గనుంగొని.

1026


మ.

శరచాపంబులు గేలఁ బూని రథి నై సంగ్రామ మర్థించి భూ
వర నీపై నిదె వచ్చినాఁడ మొదలన్ వారాశిపై వాలిపై
ఖరుపై నేసినకోల లేయు మిటఁ జక్కం గమ్ము నాయమ్ము లిం
కొరుపైఁ బాఱవు దేవదానవజయోద్యోగాభిమానంబునన్.

1027

లక్ష్మణుం డతికాయునిఁ జంపుట

ఉ.

నా విని లక్ష్మణుండు నరనాథున కడ్డము చొచ్చి నిల్చె రో
షావిలమానసుం డయి కులాచలగహ్వరదిగ్దిగంతదం
తావళకర్ణకోటరవితానవియద్భరితంబుగా గుణా
రావము సేయుచుం బటుశరంబు గరంబున నల్లఁ ద్రిప్పుచున్.

1028


తే.

అప్పు డవ్వింటిమ్రోఁతకు నఖిలరజని, చరులు భీతచేతస్కు లై సంభ్రమింప
నద్దశాననతనయుఁడు నరుదుతోడి, మెచ్చు మనమునఁ బొడమ సౌమిత్రిఁ జూచి.

1029


ఉ.

పిన్నవు మున్ను గయ్యములు పెక్కు లెఱుంగవు దివ్యబాణసం

పన్నుని నన్ను నోర్తు నని బాణములున్ విలుఁ గేలఁ బూని మీ
యన్నకు నడ్డమై నిలిచి తౌ నవు నంతనె పంత మెక్కె నిన్
మన్నన సేసితిం దొలఁగుమా యతికాయుఁ డెఱుంగు నల్పులన్.

1030


శా.

ప్రాణంబుల్ వలతేని రాముదెస సౌభ్రాత్రంబు వోఁబెట్టి నీ
బాణశ్రేణులతోడఁ దూణయుగమున్ బాణాసనంబున్ రణ
క్షోణిం బెట్టి తొలంగు నాపటుశరస్తోమంబు రా కుండ ని
ద్రాణక్రూరభుజంగముం దెలుపుయత్నం బిట్లు నీ కేటికిన్.

1031


శా.

కేలం బుంఖమణిప్రభన్ మెఱయఁగాఁ గీలోద్గమాభీలలీ
లాలోలం బయి నీదుప్రాణములు గ్రోలన్ నాలుకల్ గ్రోయుచుం
గాలవ్యాళముఁబోలె నున్నయది చక్కం జూడు నాసాయకం
బాలం బెక్కడ మర్త్యుఁ డెక్కడ భుజాహంకార మిం కేటికిన్.

1032


వ.

అనిన విని సక్రోధంబుగా నవ్వి యవ్వీరుం డి ట్లనియె.

1033


క.

అధముఁడు దనుఁ దాఁ బొగడిన, నధికుఁడు గాఁ డల్పుభంగి నాత్మశ్లాఘా
విధికిఁ జొరఁ డుత్తముం డ, వ్విధ మొప్పఁ జేయుటను వివేకవిహీనా.

1034


ఆ.

విల్లు గేల నుండ వీటిఁ బోయినవట్టి, మాటలందుఁ గలదె మగతనంబు
శస్త్రబలము సూపఁ జాలక వినువారు, లజ్జఁ బొంద రిత్తరజ్జు లేల.

1035


క.

ఇదె విలునమ్ములుఁ గొని నీ, యెదురను నిలుచున్నవాఁడ నేవిద్యాసం
పద వాసికి నెక్కిన నీ, మదిఁ గలగర్వంబుఁ జూపుమా సర్వంబున్.

1036


ఉ.

వంచన నన్యకాంతఁ గొని వచ్చినతుచ్ఛుని మీదశాననుం
గొంచెపువానిఁగాఁ దలఁచుకకొ మ్మిట నల్పులు లేరు విన్ము న
క్తంచర బాహువిక్రమము గాక శరీరమహత్త్వ మేటి కూ
హించినఁ గొండ యెంత పిడు గెంత నినుం దెగటార్చి పుచ్చెదన్.

1037


ఆ.

పక్వతాళఫలముభంగి నీతల గూల్పఁ, బిన్నతనము నీదుపెద్దతనము
నీవ కనియె దిట్లు నీ కేను మృత్యు వై, వచ్చినాఁడ ననికి క వత్తు గాక.

1038


వ.

అని పలుకుసమయంబున.

1039


ఉ.

కాంచనపుంఖ మై వెలుఁగుకాండము మంటలు వాఱ వింట సం
ధించి గరుత్సమీరమున దిక్కులు మ్రోయ నిశాచరుండు గ
ట్టించుచు నల్కతోడ నిగిడించిన దాని వెడందతూపునం
ద్రుంచుచు రాముతమ్ముఁడును దోడన యేసె లలాట మొక్కటన్.

1040


ఆ.

రక్కసుండు నిటలరక్తచ్ఛటోద్గమ, మద్భుతావకాశ మగుచు మెఱయ
హరునివైష్ణవాస్త్రహతి మంట లెగసిన, త్రిపురగోపురంబుతెఱఁగు నొందె.

1041


వ.

ఇట్లు విక్రమించిన దశకంఠనందనుండు దశస్యందననందనుం గనుంగొని.

1042


క.

విలుకాఁడ వౌదు నన్నుం, జలియింపఁగఁ జేసి తిట్లు శస్త్రప్రౌఢిం

గలఁగి తొలంగక నాతో, [95]నిలిచి రణము సేసినపుడ నిను నే మెత్తున్.

1043


తే.

అనుచు నొక్కటియును మూఁడు నైదు నేడు, గా ననేకసాయకములు ఘనపథమ్ము
నిండ నిగిడించె మర్మప్రచండకిరణు, కిరణజాలప్రసారవిస్ఫురణ మమర.

1044


వ.

అవియు నవ్వీరుం డర్ధచంద్రాస్త్రంబులం ద్రుంచిన.

1045


క.

కనలి నిశాచరుఁడు మహా, శనికల్పం బగుచు వెలుఁగుశర మొక్కటి వే
కొని బలుతెగఁ బెన్నురమునఁ, జొనిపి సుమిత్రాతనూజు స్రుక్కం జేసెన్.

1046


తే.

బాణహతి నించుకయ డిల్లపాటు గలిగి, తోనతిర మైనధైర్యంబుతోడఁ బొలిచి
తొరఁగు నెత్తుట నొడ లెల్లఁ దోఁగ నట్లు, [96]నెఱనునో గొన్నయక్కోలఁ బెఱికివైచి.

1047


శా.

నిండం గీలలు గ్రమ్మ రాకొమరుఁ డాగ్నేయాస్త్ర ముద్దండదో
ర్దండాటోపము సూపఁ జండతరకోదండప్రకాండంబుఁ జే
ర్పం డంకారభయంకరాయతధనుర్జ్యావల్లి సంధించెఁ బ్ర
హ్మాండం బెల్ల వెలుంగ ఘోరముగ రౌద్రాస్త్రంబుఁ బౌలస్త్యుఁడున్.

1048


చ.

ధనువుల నిట్లు బాణములు దారుణలీల నమర్చి బల్దెగల్
గొని నిగిడింప రెండుఁ బ్రతికూలగతిం గులిశద్వయంబుచా
డ్పునఁ బఱతెంచి మంటలు మిడుంగుఱులుం బెదరంగఁ దాఁకి వే
పొనుపడి భస్మ మై పొలిసి పోయెఁ బరస్పరతుల్యశక్తులన్.

1049


క.

దోషాచరుఁ డప్పుడు పై, నైషికబాణంబు వఱప నైంద్రాస్త్రమునన్
రోషాకులుఁ డగుచు మహా, భీషణగతి లక్ష్మణుండు పెలుచం ద్రుంచెన్.

1050


శా.

ఆయేటుం దనకోలపాటుఁ గని యామ్యాస్త్రంబు సంధించి వాఁ
డేయం గ్రమ్మఱ నమ్మహాభుజుఁడు లో నేపారుకోపంబుతో
వాయవ్యాస్త్రముచేత దాని నడుమన్ వారించుచుం గప్పె వి
ల్మ్రోయం బె ల్లగుచిత్తజల్లుగతిగాఁ గ్రొవ్వాఁడిబాణంబులన్.

1051


ఆ.

అవియు వానిదివ్యకవచంబుపైఁ బడి, బిట్టు మొనలు దునియ మిట్టిపడిన
మఱియు నలుక నేసె నెఱనారసములను, గంకటమున కవియుఁ గాక చెదరె.

1052


వ.

అట్లు కవచంబు భేదింపంజాలక విస్మితుం డగుచుండ వాయుదేవుండు సనుదెం
చి యిది యనన్యాస్త్రభేద్యంబు బ్రహ్మాస్త్రప్రయోగంబున వీని వధియింతు గా
కనుచు నుపదేశించి చనియె నంత నాసుమిత్రాపుత్రుండును.

1053


క.

బ్రహ్మకు డాక న్నదరఁగ, బ్రహ్మాండము ప్రభలు నిండక బలుపుట్ట మహా
జిహ్మగము వెడలుగతి నా, బ్రహ్మాస్త్రముఁ దూణిఁ దిగిచి పటువేగమునన్.

1054


చ.

నిరతము గాఁగ వింటఁ దొడి నిండుదెగన్ వడి నేయ నమ్మహా
శర మెడమాఱుసేయునిషుశక్తిగదాదులఁ గాల్చుచున్ భయం
కరగతిఁ బాఱి రక్కసునికంఠము ద్రుంచెను మేరుశృంగము

న్దొరయుపసిండిబొమ్మికముతోడిశిరంబు వసుంధరం బడన్.

1055


వ.

ఇ ట్లతికాయుండు గూలినం బ్లవంగపుంగవులు సిద్ధచారణాదులు నుచితవాక్యం
బుల సౌమిత్రిఁ గొనియాడి రతం డరుదెంచి యన్నచరణంబులకుం బ్రణమిల్లిన
నమ్మహాత్ముండు గాఢాలింగనపూర్వకంబుగా దమ్ముని గారవించె నంత హతశేషు
లయినదోషాచరులు విఱిగి పాఱి లంక సొచ్చి సమరనృత్తాంతం బెఱింగించిన
రావణుండు శోకమూర్ఛితుం డై కొండొకదడవునకు బాష్పాకులలోచనుం
డగుచు మంత్రులం గనుంగొని.

1056


క.

కదనంబున ధూమ్రాక్షుఁడు, మొదలుగఁ గల రాక్షసోత్తములు శస్త్రకళా
విదు లహితులచేతం బొలి, సెదరే యిటు పోయి పోయి సేనలతోడన్.

1057


ఉ.

నాసుతుఁ డింద్రజిత్తు కదనంబునఁ బన్నగపాశబద్ధులం
జేసిన నిర్జరాదులకుఁ జెల్లదు వీడ్వడ పట్టికట్టులుం
బాసి పరాక్రమించెదరు పంక్తిరథాత్మజు లింక వీరితో
నీ సొనరించువీరవరు నెవ్వనిఁ గాన జగత్త్రయంబునన్.

1058


తే.

మున్ను నాదాడి కెప్పుడు మూసియుండు, దివిజపురివాకి లిప్పుడు దెఱచినారు
లంక ఘటితకవాటమై సొంక మడఁగి, యుండ రిపు లిట్టు లుండ నే నున్నవాఁడ.

1059


క.

నడురేయి సంజవడున, ప్పుడు వేగెడువేళఁ జొచ్చి పోటునకు రిపుల్
గడఁగుదురు మీరు నాయిత, పడి యుండుం డెల్లవారు బలములతోడన్.

1060


వ.

అని పలికి యంతఃపురంబునకుం జని చింతాకులమానసుం డై నిట్టూర్చు నిగిడిం
చిన మేఘనాదుండు తండ్రి కి ట్లనియె.

1061


ఉ.

ప్రాకృతునట్లు నీవు ధృతి పట్టక ప్రాభవ మెల్లఁ దూలఁగా
శోకముఁ బొందె దాలముల శూరులు చచ్చుట లింత వింతలే
నీకోడు కింద్రజిత్తు రజనీచరనాయక దివ్యసాయకా
నీకముతోడ వీఁడె పగ నీఁగఁ గలండు విచార మేటికిన్.

1062


తే.

దివిజదనుజయక్షాదులఁ దృణము సేయు, నాశరాగ్నులు సైప వానరులు నరులు
నెంతవా రింతఁ జింతింప వింక నైన, రాజధర్మంబు పరికింపు రాక్షసేంద్ర.

1063

ఇంద్రజిత్తు రెండవయుద్ధము

క.

అని నేఁడు దాశరథులను, వనచరసైన్యంబుఁ గూల్చి వచ్చెద సంక్రం
దనముఖ్యులు వెను కై నను, విను నాదుప్రతిజ్ఞ యనుచు వీడ్కొని కడిమిన్.

1064


వ.

చతురంగబలసమేతుం డై ధవళచ్ఛత్రచామరంబులు మెఱయ శంఖభేరీమృదం
గాదితూర్యరవంబులు భూనభోంతరాళంబు నిండం బ్రచండగతి లంకానగరంబు
వెడలి సమరభూమి నుచితప్రదేశంబునం దేరు డిగ్గి తనచుట్టును గరితురగాది
సైన్యంబుల నుండ నియోగించి యగ్నిప్రతిష్ఠాపనంబు సేసి మంత్రతంత్రకలా
పంటులు నెఱయ మెఱయ విహితప్రకారంబున.

1065

క.

శరములు నెత్తురుచీరలు, శరపత్రావళులుఁ దాడిసమిధలు నసితో
మరపరిఘాదులు వెల్వఁగ, నరుదుగ మండుచుఁ బ్రదక్షిణార్చులతోడన్.

1066


ఉ.

ఆహుతు లగ్ని యందుకొన నచ్చపునల్లనిమేఁకపోతుఁ బూ
ర్ణాహుతి సేసి బ్రాహ్మ్య మగు నస్త్రవరేణ్యము నిష్ఠతోడ నా
వాహన చేసి చాపశరవర్గరథాన్వితుఁ డైనతన్ను నం
దాహుతిగాఁ దలంచుకొని యాహవకేళికి నుత్సహించుచున్.

1067


చ.

రథసహితం బదృశ్య మయి రాక్షసరాజసుతుండు తారకా
పథమును బొంద శూలములుఁ బ్రాసములుం బరిఘంబులుం బర
శ్వథములు భిండివాలములు శక్తులు లోనగునాయుధంబులం
బృథురుచు లారఁ దాఁకి రతిభీమగతిం గపిసేన రక్కసుల్.

1068


ఆ.

తరులు గిరులుఁ గొంచు హరులుఁ గడంగిన, నధికతుములసమర మయ్యె నపుడు
మింటితుద నడంగి మేఘనాదుండును, ఘోరబాణవృష్టి గురియఁ దొడఁగె.

1069


క.

గిరు లశనిహతిం గూలిన, కరణిం బొరి నతనిచండకాండాహతి వి
స్వరముగ వాపోవుచుఁ గూ, లిరి భూభాగం బద్రువ బలీముఖవీరుల్.

1070


చ.

మఱియును బైపయిం బఱపుమార్గణవర్గము లంబరంబునన్
గిఱిగొనుచుం బ్రచండగతిఁ గీలలు వాఱఁగ వచ్చి వక్షముల్
దెఱపులు సేయుచున్ మెడలు ద్రెంచుచుఁ బొట్టలు సించుచుం దొడ
ల్విఱుచుచు మస్తకంబు [97]లగలించుచు నిట్లు వధింపఁ జొచ్చినన్.

1071


క.

నానాభంగుల మెఱయుచు, వానరయూథపులు వృక్షవర్గము రక్ష
స్సేనపయిఁ గురియ నలుఁగుల, వానఁ గలంచెం బ్లవంగవాహిని నెల్లన్.

1072


వ.

అప్పుడు సుగ్రీవాంగదగంధమాదనజాంబవదాంజనేయసుషేణమైందద్వివిదగజ
గవయగవాక్షకుముదాక్షకుముదహరిరోమకేసరివేగదర్శివిద్యుద్దంష్ట్రసూర్య
ప్రభదధిముఖజ్యోతిర్ముఖప్రముఖు లైనబలీముఖవీరుల నభిమంత్రితగదాశూల
ప్రాసాదిప్రహరణంబులఁ దూల నేయుచుఁ దరణికిరణసంకాశంబు లగుమహాశు
గంబులఁ దమ్ముఁ గప్పి నొప్పింపఁ దదీయశరవేగంబు సహింప కచ్చెరు వందుచు
రఘువరుండు లక్ష్మణుం గనుంగొని నేఁడు శత్రుండు బ్రహ్మాస్త్రంబు నాశ్రయించు
టం జేసి యెవ్వరికి నజయ్యుం డయ్యె నయ్యస్త్రంబు మనకు మాననీయం బగుం
గాక యని యుపదేశించుచు.

1073


చ.

కడిమి నతండు బ్రహ్మవరగర్వమునం బొడలేక మింటిలో
నడఁగి విచిత్రవేగమున నాశుగజాలము లంతకంతకున్
జడిగొనఁజేయుచుం బ్లవగసైన్యము దైన్యము నొంద నీ గతిం
గెడపెడునే రణాంగణము గ్రిక్కిఱియం బడి రెల్లవీరులున్.

1074

సీ.

అని కడుఁ జింతింప నతఁడు వెండియు గంధ, మాదను ముయ్యాఱుమార్గణముల
వృషభనీలాంగదద్వివిదసుగ్రీవులు, ముప్పదేనేసియమ్ముల మహోగ్ర
శరములఁ బదిటను జాంబవంతుని మైందు, బాణసప్తతి నస్త్రపంచకమున
[98]గజునిఁ దొమ్మిదిసాయకమ్ముల నలు నేసి, పటుశిలీముఖపరంపరల దెసలు
నాకసంబు నిండి నందంద పఱపుచు, యూథపతుల నెల్ల నుర్విఁ గూల్చె
సకలభూతతతులఁ జండాట్టహాసంబు, చేసి చేసి బెదరఁ జేసి చేసి.

1075


చ.

ఉఱుముచుఁ గాలమేఘము మహోగ్రతరాశనిపాతఘోర మై
మెఱయుతెఱంగు దోఁప నట మింటఁ బొరింబొరిఁ జాపటంకృతుల్
గిఱిగొనుచుండ నల్దెసలఁ గీలలు వాఱుశరంబు లేసి క
న్దెఱవనిమూర్ఛ గాఁగ జగతిం బడనేసె నృపాలసూనులన్.

1076


వ.

ఇట్లు విక్రమించి మేఘనాదుండు సింహనాదంబు సేయుచు లంకకుం జనిన బ్ర
హ్మాస్త్రమంత్రజపంబున నస్త్రపాతంబునకుం దప్పినవిభీషణుండు దదాచరణశర
ణుం డైనహనుమంతుం గనుంగొని.

1077


చ.

పడిరి విరోధిచేత నిటు పార్థివసూనులు సేన లన్నియున్
మడిసెఁ బ్లవంగయూథపులు మందున కొక్కఁడు లేఁడు సూడఁగాఁ
బొడవడకుండ నుగ్రగతి భూస్థలిఁ గూలిరి జాంబవంతుఁ డె
య్యెడఁ బడినాఁడొ కార్య మతఁ డెల్లదియుం గనుఁ జావకుండినన్.

1078


చ.

ఇఱుముకొనం దొడంగె దెస లేచినచీఁకటి నంచుఁ జేతులం
గొఱవులు పట్టి క్రుమ్మరుచుఁ గొండొకప్రాణము లున్న బాణముల్
వెఱుకుచుఁ బెంట లై పడినపీనుఁగులం గలయంగఁ జూచుచున్
నెఱఁకులఁ జండకాండములు నిండినయాఘనుఁ గాంచి రొక్కెడన్.

1079


క.

కని కదిసి విభీషణుఁ డి, ట్లనియె విభీషణుఁడ నే నజాత్మజ ప్రాణం
బున నున్నాఁడవె మనవా, రనిఁ గూలిరి మేఘనాదునమ్ములవానన్.

1080


చ.

అఱువదియేడుకోటు లరయన్ే సురసంభవు లైనయూథఫుల్
నఱు మయి రన్యజాతులు రణంబునకుం గలవీరు లెంద ఱం
దఱుఁ బడి రమ్మహాబలుఁడు దత్తవరుం డని బ్రహ్మవాక్యమున్
గుఱిచి విసంజ్ఞ నొందిరి రఘుక్షితినాథులు నేమి సెప్పుదున్.

1081


వ.

అనిన విని యెట్టకేలకు నెలుంగు దెచ్చుకొని రక్షోవీర ని న్నెలుంగున నెఱిఁగితిం
గన్ను లమ్ములుగొనుటం దెఱవరాదు హనుమంతుండు బ్రదికెనో యే మయ్యె
నో చెప్పవే యతనిసేమం బనవుడు నప్పౌలస్త్యుండు.

1082


క.

ధరణీనాయకు లుండఁగ, హరిపతి సుగ్రీవుఁ డుండ నంగదముఖ్యుల్
తరుచరు లనేకు లుండఁగఁ, గరువలిసుతు నడుగ నేమికారణ మార్యా.

1083

వ.

అనిన జాంబవంతుం డి ట్లనియె.

1084


చ.

రజనిచరేంద్ర కయ్యమున రావణనందను బాణవృష్టి న
క్కజముగ నందఱుం దెగినఁ గ్రమ్మఱఁ బ్రాణము లెత్తు నంజనా
త్మజుఁ డతఁ డొక్కడుం గలుగఁ దక్కినవీరులతల్లు లెల్ల సు
ప్రజలు నజీవులు మృతులు భానుసుతాదు లతండు దప్పినన్.

1085


వ.

అని పలుక నాంజనేయుండు గోత్రనామంబులు సెప్పి నమస్కరించుటయు నభి
నందించుచుఁ దన్నుఁ బునర్జాతుంగాఁ దలంచుకొని జాంబవంతుం డి ట్లనియె.

1086


శా.

తండ్రింబోలెఁ జరించు నెవ్వఁడు విశుద్ధఖ్యాతి వంశోత్తరుం
డం డ్రాపుణ్యుని భూతకోటులకు న ట్లాధార మై యున్కి మీ
తండ్రిం బంకజసంభవాదులు జగత్ప్రాణుండు నా రే మముం
దండ్రీ యెత్తుదు గాక నీవును విభుల్ ద క్కెవ్వ రిక్కీర్తికిన్.

1087


క.

క్రిక్కిఱియ సమరతలమున, నిక్కయివడిఁ బడినమమ్ము నెప్పటి వడయం
దక్కినవెర వెద్దియు లే, దొక్కఁడు దివ్యౌషధప్రయోగము దక్కన్.

1088


క.

వాయుసుత మేఘనాదుని, సాయకములఁ దెగినకపుల సప్రాణుల భూ
నాయకసుతులను బ్రదుకం, జేయం గొనివత్తుగాక సిద్ధౌషధముల్.

1089


వ.

తదీయమార్గంబు విను మిక్కడలి గడచి చక్క నుత్తరాభిముఖుండవై చనం జన
హిమవంతం బక్కొండ కాకడ బహుకూటశోభితం బగుహేమకూటం బన్న
గంబున కపుల ఋషభాచలంబు దాని కాదిక్కున మేరు వాగ్రావగ్రామణి కద్దెసఁ
గైలాసం బాశిఖరికులశేఖరంబున కట నధికదూరంబున శృంగవంతం బగ్గిరి కుత్త
రోత్తరంబులై నీలశ్వేతకనకాకరంబు లనుశైలంబులు నుత్తరలవణసముద్రంబు
ను శాకద్వీపంబును క్షీరసాగరంబును బొలుచు వానిం గ్రమంబున నతిక్రమించి.

1090


ఉ.

సంద్రము దుగ్ధబిందువులు సల్లెడునుత్తరతీరభూస్థలిం
జంద్రనగంబు ద్రోణగిరి నందున నొప్పు మహోదయాద్రి యం
దింద్రునియాజ్ఞఁ బెం పెసఁగు నెఱ్ఱనిపువ్వులఁ బచ్చపండులం
జంద్రమరీచులం దెగడు చల్లనియాకుల నోలి నోషధుల్.

1091


వ.

అవియు నమ్మహీధరంబు దక్షిణశృంగంబున విశల్యకరణియు సంధానకరణియు
సావర్ణ్యకరణియు సంజీవకరణియు నన నాలుగుదెఱంగు లై వెలుంగు మఱియు
నొక్కవిశేషం బెఱింగించెద నాకర్ణింపుము.

1092


ఉ.

ఈరజనీచరేంద్రుపురి $ కేఁబదిలక్షలయోజనంబులం
చార లధిత్యకాతరువితానలతాంతములో యనంగఁ బెం
పారుచు నుండు నయ్యచలమందుల మందులు రాత్రివేళలం
దారయ శక్తిమంతము లహస్సమయంబుల శక్తిహీనముల్.

1093


క.

కావున నీ వీరాతిరి, వేవెడునీలోనఁ బోయి వెస నౌషధముల్

దేవలయుఁ బోయి ర మ్మని, దీవించుచు వీడుకొలుపఁ దిర మగు వేడ్కన్.

1094

హనుమంతుండు సంజీవనిఁ దెచ్చుట

క.

వే చని చేయుదు నిప్పని, కేచింతయు నేటి కనుచు నేతెంచి నట
ద్వీచీసంఘట్టనమున, వాచాలం బైనలవణవారిధిచెంతన్.

1095


క.

అమరుసువేలము గని వేగమ యాగిరి యెక్కి రాముకార్యము నిర్వి
ఘ్నముగం జేయం గృపసే, యుము భూధర నాకు ననుచు నుత్సాహమునన్.

1096


ఉ.

పుట్టినవిక్రమస్ఫురణఁ బొంగినమే నతిఘోరభంగికిం
[99]బట్టుగ నేపుమై నిలిచి బాహులు సాంచి మహాట్టహాససం
ఘట్టన లంక గ్రక్కదలఁగాఁ గపివీరుఁడు దాఁటె [100]దాఁటునన్
మెట్టినకొండ గ్రుంగఁబడి మేదిని బీఁటలు వాఱ మింటికిన్.

1097


క.

వడి దాఁటుమేనిగాలిం, గడలెత్తి పయోధి మ్రోయఁ గా మేఘంబుల్
సుడిగొనుచుఁ జెదరి దిక్కులు, గడవం బఱవం బ్రచండగతి నటు చనుచున్.

1098


చ.

కలధౌతాద్రితటాంతరిక్షమునఁ జక్కం బాదముల్ మీఁదుగాఁ
౦దె
దలక్రిం దై కరపద్మముల్ నుదుట నందం బొంద జేపెట్టుచున్
లలి నాశంకరుశైలముం గడచి [101]బాలస్వేద మాస్యంబుపై
వలియం గ్రమ్మఁగఁ గ్రమ్మఱం దిరిగి పోవం బోవఁగా ముందటన్.

1099


మ.

అమృతాంశుద్యుతిజాలశీతలవికీర్ణాంభఃకణస్యంది యై
చెమటార్పన్ వలిగాలి రాఁగ నెదురన్ క్షీరాబ్ధిఁ గాంచెన్ నగో
త్తమమంథక్షుభితాంతరంగము ధరదైత్యారిశయ్యాభుజం
గము నుత్తుంగతరంగముం గృతవియృద్గంగాపరిష్వంగమున్.

1100


క.

కని యాజలధికి మ్రొక్కుచు, జని యుత్తరతీరభూమి సరి మూఁ డద్రుల్
ఘనవీథి దాఁకి యుండఁగ, వినువీథిం జేర నరిగి వికసితముఖుఁ డై.

1101


క.

కెలఁకులఁ జెన్నగునీనగ, ములు చంద్రద్రోణశైలములు మధ్యమునం
బొలుచు నిది యౌషధాచల, మలఘుతరద్యుతులు వెలుఁగు నవి యాతీఁగల్.

1102


క.

అనుచు నగోపరిభాగం, బునకుం జనుదెంచి వాయుపుత్రుం డచటన్
మును వెలిఁగెడునాలతికలు, కనుఁగవకుం దోఁపకున్నఁ గడువిస్మితుఁ డై.

1103


సీ.

కొండొక చింతించి కొండతో నిట్లను, హనుమంతుఁ డనువాఁడ నఖిలలోక
[102]కంటకుఁ డగుదశకంఠునిఁ దెగటార్ప, నాలంకపై దొర లట్లు విడిసి
సంగరక్రీడల శత్రువీరులచేతఁ, బోటేటుఁ బడి తూలి పుడమిఁ బడిన
వారి నందఱఁ దేర్పవలసినమందులు, నీయందుఁ గలుగుట నిక్క మెఱిఁగి
వచ్చినాఁడ నింక వంచన యేటికి, నెలమి నౌషధంబు లిత్తుగాక

రాజవృషభుఁ డైనరామునికార్య ము, పేక్షణీయమే నగేంద్ర నీకు.

1104


క.

ప్రాలేయాద్రియు మేరువు, గైలాసముఁ జూడ కేను గార్యాతురతన్
శైలోత్తమ వచ్చితి నీ, పాలికి న న్ననుపు మనినఁ బటురోషమునన్.

1105


క.

ఏమీ మందులు గొనిపో, నా మర్కట నీవు వచ్చినాఁడవు [103]నగితిన్
బో మహి నీ వెవ్వండవు, రాముం డన నెవ్వఁ డేల రాముఁడు నాకున్.

1106


క.

నాకనివాసులు నింద్రుఁడు, నాకడఁ బదిలంబు చేసినమహౌషధముల్
మీ కేటికి దొరకొను నివి, నీ కిచ్చుటకంటె నాకు నేరము గలదే.

1107


క.

లాఁతిఁ గని యిచటిక్రోఁతులు, [104]కూఁత లిడున్ నిలువవలదు కూయక పోపో
క్రోఁతులకుఁ గాయొ పండో, బ్రాఁతిగ నాతేనెపెఱయొ పరమౌషధముల్.

1108


వ.

అనిన విని కోపాటోపంబున నట్టహాసంబు చేసి.

1109


క.

ఓరి కఠినాత్మ నన్ను వి, చారింపవు నీవు రామచంద్రు నెఱుంగన్
మేరువవో హిమగిరివో, గౌరీపతినిలయ మైనకైలాసమవో.

1110


క.

దిట్టతనంబున గర్వ, మ్మిట్టుండఁగ నిన్నుఁ బెఱికి యేఁ గొని పోదుం
బెట్టుదు రఘుపతిముందటఁ, బెట్టిన నెఱిఁగెదవు గాక ప్రియమున రామున్.

1111


చ.

అనుచు నుదగ్రసాను వగునన్నగ మాయతబాహుశాఖలం
బెనఁగొనఁ బట్టి లావుమెయిఁ బెట్టినపాదము లూఁది మూఁపు లే
పున నెగయించి ఘోరగతిఁ బొంగినవాలము మీఁది కెత్తి మ్రేఁ
గినబలదర్ప మొప్పఁ బెఱికెం బృథివీస్థలి వ్రయ్య నయ్యెడన్.

1112


సీ.

కనుఁగొని ముందటఁ గాపున్న గంధర్వు, లాయుధపాణు లై యలుకతోడ
నోరోరి వానర మోట లే కీ విట్లు, దివిజనాయకునాజ్ఞ ధిక్కరించి
క్రొవ్వున నిక్కొండఁ గొనిపోవుచున్నాఁడ, వెట పోవవచ్చు మాయెదుర నీకు
ననుచు నొక్కుమ్మడి నందంద దిక్కులు, పగులంగ నార్చుచు బరవసమున
వచ్చి తాఁకిరి తాఁకినవారి నచటఁ, గడిమిఁ దెగటార్ప నొల్లక కాలపాశ
తులితవాలమారుతమునఁ దూలఁ దోలె, నల్పతరతూలికలభంగి ననిలసుతుఁడు.

1113


ఉ.

అప్పుడు దోఁచునోషధుల నద్రి వెలుంగుచు వేయిధారలన్
వి ప్పగుచక్ర మై మెఱయ వెన్నునికైవడి నేఁగుదేరఁగాఁ
దప్పక చూచి రావణివిదారణదారుణబాణవృష్టికిం
దప్పినవానరుల్ దెసలు తల్లడిలం గడువీఁక నార్చుచున్.

1114


క.

ఆహవభూమి నిశాచర, దేహంబులు వెదకి వెదకి తెచ్చి మహోగ్ర
గ్రాహములు మ్రింగ బాహుబ, లాహంకృతి వీచివైచి రంబుధిలోనన్.

1115


క.

ఆలోన సముద్రంబు సు, వేలాద్రియుఁ గడచి వచ్చి వెరవున డించెన్
లీలాలసగతి నతఁ డా, శైలము గపిసేననడుమ సన్నుతు లెసఁగన్.

1116

వ.

ఇట్లు మహౌషధంబులు దెచ్చి మూర్ఛల మునింగియున్న యన్నరేంద్రనందను
లకు సుగ్రీవాదులకు నాంజనేయుండు నమస్కరించె నాసమయంబున.

1117


చ.

మెలఁగెడు నౌషధానిలము మెల్లనిచోఁకున మర్మసంధులన్
బలువిడిఁ గొన్నశస్త్రములఁ బాసి శరీరము లొప్పఁ బ్రాణము
ల్నెలకొని కాలు సేయి గదలించుచు నూర్పులు వుచ్చి లోచనో
త్పలములు విచ్చి చూచి రొగిఁ బర్వినమూర్ఛలు దేఱి రాఘవుల్.

1118


తే.

తరుచరావలియు విశల్యకరణివలన, నెఱఁకులాడిన యలుఁగులు పెఱికిపోయి
తుడిచినట్టుల గండ్లును నడఁగి మేని, గనియ లన్నియు సంధానకరణి నదికి.

1119


క.

సావర్ణ్యకరణి నయ్యై, పావనతనుకాంతు లెసఁగఁ బ్రాణంబులు సం
జీవనిచే నెలకొన ని, ద్రావస్థలఁ బాసినట్టు లమరెం జూడన్.

1120


సీ.

అప్పుడు సుగ్రీవుఁ డాదిగా నగచరు, లినసుధాంశులభంగి నెసఁగి వెలుఁగు
పార్థివసుతులకుఁ బ్రణమిల్లి హనుమంతుఁ, గొనియాడి రా రాజకులవిభుండు
పవననందనుఁ జూచి పాకశాసనునాజ్ఞ, నెమ్మితో మనకు మన్నింపవలయు
నీకొండఁ దొంటిచో నిడిరమ్ము నావుడు, వెస నాతఁ డట్ల కావించి వచ్చె
నంత నుదయాద్రిమీఁదికి నరుగుదెంచె, దాశరథులముఖారవిందంబు లలరఁ
గపులు మగుడఁ బ్రాణంబులు గలిగి వెలుఁగు, కడఁకఁజూడ నేతెంచినకరణిఁ దరణి.

1121


చ.

నగచరనాథుఁ డంత రఘునాథుఁ గనుంగొని కుంభకర్ణుఁ డా
దిగఁ గలవీరు లెల్లఁ గడతేఱి రనేకులు శూరశూన్య మీ
నగరము లంక నింకఁ గదనం బనుమాటలు సిక్కె నేగతిన్
మొగియఁడు పంక్తికంఠుఁడు సముద్ధతి పెం పఱి యుద్ధకేళికిన్.

1122


ఆ.

కాన నేఁటిరాత్రి గాకుత్స్థకులవీర, కపుల నెల్ల లంక గాల్పఁ బనుపు
మనిన నాన రేంద్రుఁ డట్ల నియోగించె, సకలవృక్షచరుల సమ్మదమున.

1123


ఉ.

అంత నిశాచరేంద్రుపుర మంతయుఁ గాల్పఁ బ్లవంగవీరు ల
త్యంతకుతూహలంబున దినాంతము గోరఁగ నంతరిక్షగో
శాంతరవీథి శోభిలుచు నంబుజబంధుఁడు వారుణాంబుధిన్
ప్రాంతము సేరె జక్కవలు పశ్చిమభాగము సూడ నోడఁగన్.

1124


ఆ.

అట్లు సేరి యంత కంతకు నరుణిమం, బెసఁగ నస్తశిఖరి కెరఁగి క్రుంకె
నింక మంట లడరు లంక ని ట్లనుభంగిఁ, బరఁగె సంజకెంపు పశ్చిమమున.

1125


క.

ఘనముగ సంధ్యారాగము, నినుపార నిషిద్ధవేళ నిద్దుర వోవం
గని కమలంబుల నగువిధ, మునఁ గుముదము లొయ్యనొయ్య మూతులు విచ్చెన్.

1126


క.

దిక్కాంతలు గాటుకఁ గడుఁ, బిక్కటిలం గరవటమునఁ బెట్టినగతి నీ
ది క్కాది క్కనకుండఁగ, నక్కజ మగునంధకార మఖిలముఁ గప్పెన్.

1127


వ.

ఇత్తెఱంగున రోదోంతరంబు నిరంతరధ్వాంతం బగుటయుఁ గనుంగొని.

1128

వానరులు లంకఁ గాల్చుట

క.

ఏపునఁ గొఱవులు గొని లం, కాపురగోపురము లెల్ల కపులుం గోపా
టోపమునఁ గదిసి యక్కడఁ, గా పున్ననిశాటకోటిఁ గడతేర్చి వడిన్.

1129


క.

తలుపులు తుత్తునియలుగా, బలువిడిఁ బడఁదాఁటి చొచ్చి పటువేగమునం
బెలుకుఱఁ బట్టి వధించిరి, తల లూడఁగఁ బాఱ నెగిచి దౌవారికులన్.

1130


చ.

అదటునఁ గోట సొచ్చి కపు లార్చుచుఁ జిచ్చులు వైచి రెల్లచో
నదె రథశాలలం గవిసె నగ్నులు ఘోటకశాల లెల్లఁ బె
న్నదరులు దంతిశాల లటు లాకస మంటినమంట లాపొగల్
గదిసెను ధాన్యశాలలను గర్వ మడంగిరి పో నిశాచరుల్.

1131


క.

పొగులుచు మిడుఁగుఱు లెగయఁగఁ, బొగలు నభోంతరము నిండ భూరిజ్వాలల్
దెగిపడి దరికొనఁగ భుగుల్, భుగు లనుచుం గాలఁ జొచ్చెఁ బురిమందిరముల్.

1132


ఉ.

ఇంక బలీముఖుల్ బలసి రెక్కడిరావణుఁ డేటిలంక పొం
డింకెను మేఘనాదునగ రీపెనుమంటలతోడిచిచ్చు ల
భ్రంకషశాతకుంభశిఖరం బగుమోసలఁ గంటి రెట్లు నా
వంకఁ జరింప దగ్ని యవి వారి విభీషణుపుణ్యగేహముల్.

1133


ఉ.

[105]శ్రీనుతమూర్తి యైనరఘుశేఖరుతేజముఁబోలెఁ బర్వుచున్
భానుసహస్రమండలవిభాసిసమగ్రతరప్రకాశుఁ డై
మానుగ మింటితో నొఱయుమంటలు దిక్కులఁ గ్రమ్మ నుగ్రవై
శ్వానరుఁ డేపుతో నెసఁగె వానరరోషసముత్థుఁడో యనన్.

1134


మ.

పొగ లెచ్చో నెగయుం గృశానుఁ డచటన్ భూమార్చి యై మండు మా
నుగ భీతిల్లినవాఁడపోలెఁ [106]గదియు న్ము న్పారివాహాంగ మై
తగ వూహింపక నాశహేతు వగుధూర్తవ్రాత మాత్మీయహా
నిగ వర్తించునకాదె లోలుఁడు జగన్నింద్యుం డగుం జూడఁగన్.

1135


క.

వితతాగ్నిఁ గరఁగి పిండీ, కృతము లయినచారుకనకగేహంబులు వి
శ్రుతహాటకగిరితటవి, చ్యుతఘనతరశిలలభంగిఁ జూడఁగ నొప్పెన్.

1136


మ.

కనదభ్రంకషతుంగసౌధములపైఁ గాంతాసమేతంబుగాఁ
దనివోవన్ సురతోపభోగముల నిద్రాపారవశ్యంబుఁ బొం
దినదైత్యేంద్రులు మ్రగ్గ నగ్ని వికసద్దీప్తోష్మలుం డై వెసం
గనలెన్ రామునివాళిచందమున లంకాత్రాససంపాది యై.

1137


సీ.

ప్రళయకాలమునాఁడు బలువేది మేరువు, బహుభంగి వ్రక్క లై పడియెనొక్కొ
సంవర్తసంభ్రాంతజలదముక్తంబు లై, మెఱుపులు గిఱిగొని మెఱసె నొక్కొ

భర్గులలాటంబుఁ బాసి కృశానుండు, చదల నుద్దతితోడఁ బొదలె నొక్కొ
సలిలంబు ద్రావ వే సఱిబాడబము వచ్చి, పురవరం బురవడిఁ బొదివెనొక్కొ
యింక నీచిచ్చుబారి కేవంక నొదుఁగ, వచ్చునెక్కడ వెరవుతోఁ జొచ్చువార
మనుచు నక్కడనక్కడ నసురు లెల్ల, దిక్కు గానక తమలోనఁ దిరుగఁబడఁగ.

1138


మ.

శరదభ్రంబులతోడ సాటి యగుప్రాసాదంబులున్ హేమసుం
దరగేహంబులు రత్నరాజియుతనూత్నస్తంభసంభారగో
పురముల్ మండపచైత్యముల్ ధనగృహంబుల్ దుర్దమాట్టాలకో
త్కరముల్ గాలి మహీస్థలిం బడియె నుగ్రం బైనయాచిచ్చునన్.

1139


సీ.

ఘనసారచందనకస్తూరికాగురు, కుంకుమాదులు గాలెఁ గొలఁది మిగుల
వజ్రవైదూర్యప్రవాళముక్తాపద్మ, రాగమహానీలరాసు లగలె
వెలలు సేయఁగరాని వివిధచీనాంశుక, చిత్రాంబరాదులచెలువు దీఱె
సొలవక ము న్నున్నసొమ్ములతోడన, భాండగేహంబులు భస్మ మయ్యె
విపులధాన్యగృహంబులు [107]వెలయునెఱి న, పూర్వవస్తునిచయములపొలుపు గనలె
సుభటవర్మంబు లొక్కొట సొబగు మాలెఁ, గరటితురగేంద్రరాజిపక్కెరలు మ్రగ్గె.

1140


క.

అసిముద్గరకుంతశరే, ష్వసనపరశ్వథగదామహాతోమరప
ట్టిసములు గాలెను దైత్యులు, వస మఱి వగ నొంది పొగిలి వనరుచు నుండన్.

1141


క.

వదలక పెనుఁబొగ కన్నులు, బొదివినఁ జీకాకు పడుచుఁ బొగులుచు శోకా
స్పదులై ముందఱఁ గానక, యుదితాగ్నికి శలభవృత్తి నొందిరి దైత్యుల్.

1142


సీ.

సొరిది మద్యము గ్రోలి చొక్కెడివారును, బలునిద్రచేఁ దొట్రుపడెడువారు
లలనాగ్రభుజలతాలంబితవస్త్రులుఁ, గార్ముకముద్గరఖడ్గధరులు
భామలఁ గూడి తల్పముల నిద్రితులును, బుత్రదారలఁ దేరఁ బోవువారు
బొగ సుట్టుముట్టినఁ బోలేనివారును, గరమును బిమ్మిటి గదియువారు
జేరఁగారానిసెగ దాఁకి చిక్కువారుఁ, బొదలుమిడుఁగుర్లతాకునఁ బొగులువారు
నైనదైత్యులు పదివేవు రగ్నియందుఁ, బండుటాకులకైవడి భస్మ మైరి.

1143


క.

మణికనకకలితమందిర, గణములు దరికొనినపావకముచేఁ గనలెం
బ్రణుతదవానలవృతరో, హణగిరిశృంగములపోల్కి యనుమతి సేయన్.

1144


తే.

అనలదందహ్యమానంబు లగుచు నేలఁ,[108] గూలె రత్నవిచిత్రితగోపురములు
కులిశసాధనుదంభోళిఁ గలయవ్రాలు, కుధరకూటము లెన యనఁ గొమరు మిగుల.

1145


క.

రమణీరమణీయమణి, క్రమశుభకాంచీరవములుఁ గంకణఝంకా
రములును నూపురకనినా, దములును నొకమాత్రఁ బొలిసె దహనునిచేతన్.

1146


క.

నలిఁ గాలి పగులురత్నం, బులు జీవము లెగయుభంగి బొరి నెగసె మహో
జ్జ్వలవిస్ఫులింగములు ను, ల్కలుఁబోలె దశాస్యునాశలక్షణ మొదవన్.

1147

శా.

విశ్రాంతద్విరజేంద్రఘోటకరవావిర్భూతనాదంబు గా
లాభ్రాదభ్రరవంబుతో నొరయుచున్ వ్యాధూతమంథానశై
లభ్రాంతిక్షుభితాంబురాశికరణిన్ లంకాపురం బార్తర
క్షోభ్రాజిష్ణుత లేకయున్ వెలిఁగె సంక్షోభీకృతాగార మై.

1148


చ.

ఘనతరనిక్వణం బొదవఁ గాలుచుఁ దోరణముల్ మహేంద్రనీ
లనిచయమేచకంబులు విలగ్నమహాగ్నిశిఖాళిచేఁ దటి
త్త్సనితసముల్లసజ్జలదసంఘముఁ బోలుచు హేమసానుమం
డనశుభనీలభూధరవిడంబన [109]మొప్ప వహించునట్లుగన్.

1149


తే.

పరఁగఁ బాలిండ్ల పయ్యెద దరికొనంగ, ఘనకబరికాభరంబును గమరిపోవఁ
బ్రియుల బిడ్డల సుడివడఁ బిలిచి పిలిచి, దానవీచయ మంతంతఁ [110]దఱలఁబాఱె.

1150


సీ.

సరభసోత్థితభృంగపరిశూన్యగతి నున్న, కటముల ధూమంబు గలయఁబర్వ
దాసజంబాలితాలానంబు లందంద, విఱిచి శాలలలోను వెడలి వచ్చి
యపరాంగలూనలుగ్నాందూనినాదంబు, లులియఁ గ్రంతలు వట్టి కలయఁ బాఱి
కర్ణతాలోత్థితోదీర్ణమారుతమున, నగ్ని యభ్రంకషావాప్తిఁ బొదలఁ
[111]దిరుగఁ జొచ్చెఁ గరులు దిక్కులు గానక, బృంహితంబు లొదవఁ బృధువిషాద
మంది తొట్రుపడుచు నందంద కన్నీరు, దొరఁగ నిర్ఝరాంకగిరులఁఁబోలె.

1151


వ.

అంత మర్కటులపయిం బేర్కొని మార్కొను దైత్యులును వనచరుల వధింపం
గడంగురక్కసులును నపత్యంబులు సిక్కె నని గేహంబుల కరుగుదానవులును
సమాక్రందనంబులతో బాలకులు వెంటఁ జనుదేరం బఱుచునిశాటులును జని చని
నడుమ దహనదాహంబున నీలుగుయాతుధానులును నాసురీజనంబుల నోడకుఁ
డోడకుం డనుచుఁ బాణిపల్లవంబులు బలువుగా నవలంబించి యొండుదెసల కరుగ
నచ్చో నప్పుడు మెండుకొని మండుచు నెదురు వచ్చుచందంబునకుం గృశానుం డకృ
శార్చియై యేర్చిన రూపు చెడుదైతేయులును గోటఁ బ్రాఁకి యగడ్తల కుఱికిచ
నుచుఁ గపివీరులచే సమయువారును బాఱుచుం దాఱుచు దశవదనునవినయంబు
దూఱుచుం బ్రేలుచు శిఖాహతిం గాలుచు శాఖామృగంబులు నిందించుచు దం
దహ్యమానాజ్యతైలగుడాదిద్రవ్యంబులకుఁ బొగులుచుఁ బగిలి విశీర్ణంబు లై యు
న్నరత్నరాసులకు వగచుచుం దమతమపాలిదైవంబుల కేడ్చుచు దౌర్భాగ్యంబు
లకుం బొక్కుచుఁ బ్రాణంబులు గలిగె నింతియ చాలు ననుచు ధైర్యంబులు సి
క్కం బట్టుచుఁ బుత్రమిత్రకళత్రపితృభాత్రాదివినాశంబునకు శోకించుచు విధి
చేఁతకుం దిట్టుచుఁ దడఁబడఁ బుడమి మెట్టుచు నక్కడక్కడ నీభంగి బహుప్రకా
రంబులం దిరుగుడువడిరి తదనంతరంబ.

1152

చ.

సురిఁగెడువారి గొందులకుఁ జొచ్చుచు డాఁగెడువారి నుద్ధతా
తురమునఁ బాఱువారి నతిదూరము లేఁగినవారిఁ గ్రంతలం
దిరిగెడువారి [112]మాటుకొని త్రిమ్మరువానిని బట్టి కీశు లు
ద్ధురగతి మంటలోపలను ద్రోతురు విక్రమదుర్నివారు లై.

1153


చ.

అంత ననంతసాహసు లహంకృతితోడుత రామలక్ష్మణుల్
సంతతశింజనీరవవిశంకటకార్ముకృహస్తు లౌచు రో
దోంతర మెల్ల నిండ నహిమాంశుసమద్యుతిబాణకోటులన్
సంతమసం బడంచిరి నిశాచరలోకవినాశకారు లై.

1154


క.

భూనాథతనయులపటు, జ్యానిర్ఘోషంబు బహునిశాచరకోటి
ధ్వానంబు నార్తరవమును, వానరనిస్వనముఁ గూడి వడి నొకటయినన్.

1155


మ.

కదలెన్ భూమి గలంగె వార్ధులు వడిం గంపించె నాకంబు వే
చదిసెన్ శేషునిమస్తకంబులు దిశాచక్రంబు భేదిల్లె ను
న్మదదిగ్దంతులు మ్రొగ్గె నాదివరకూర్మంబుం గడున్ స్రుక్కెఁ బెం
పదరెన్ ధైర్యము దక్కి కాలగళుచిత్తాంభోరుహం బత్తఱిన్.

1156


క.

ఆరాముచాపనిర్గత, ఘోరాస్త్రచ్ఛటలఁ గూలె గోపుర మంతం
బౌరందరదంభోళి, స్ఫారాహతిఁ జేసి వ్రాలుశైలమపోలెన్.

1157


క.

గృహముల విమానముల నతి, బహుళము లగురాముబాణపంక్తులు గొన స
న్నహనములు గలిగె దివిజని, వహములకు[113]ను విక్రమోత్సవ మ్మొదవంగన్.

1158


వ.

అంతఁ దపనతనయుండు బలీముఖుల కి ట్లనియె.

1159


చ.

గవఁకుల వెళ్లురక్కసులఁ గావలివారలలోన నొక్కనిన్
జవమును బీరమున్ మెఱసి చంపక పోవఁగ నిత్తురేని రా
ఘవుచరణంబు లాన యనుకంప యొకింతయు లేక వాని నేఁ
దవిలి ప్రశాస్యుఁగాఁ దలఁతుఁ [114]ద ప్పిది సైఁపఁగ నోప నావుడున్.

1160


క.

కొఱవులు సేతులఁ గొని కొం, దఱు లంకాగోపురంబు దడయక కదియన్
నెఱి మండెడునడగొండల, యొఱపు దలఁపఁ బట్టు గలిగె నూహింపంగన్.

1161


వ.

తదనంతరంబ.

1162


శా.

ప్రౌఢాఖండలదోరుదీరితపవిప్రవ్యక్తగర్జారవ
వ్యూఢం బై విలయోత్థశూలిహతఢక్కోదీర్ణ మై పర్వుచున్
రూఢం బైనకపీంద్రనాయకచమూరోషాత్థితధ్వాన ము
ద్గాఢం బై వినిపించినం గినిసి యుద్యత్క్రోధదుష్ప్రేక్షుఁ డై.

1163


ఉ.

కుంభనికుంభులం బనిచెఁ గ్రూరతరాత్ముల సంగరక్రియా
రంభతృణీకృతామరుల రాజితకర్కశకార్ముకోగ్రదో

స్స్తంభుల జంభవైరిపవిదంభవిజృంభణులం బ్రకల్పితా
లంభులఁ గుంభకర్ణసుతులన్ దశకంఠుఁ డకుంఠవీర్యులన్.

1164

కంపనుఁడు మొదలగు రాక్షసులు వానరవీరులతోఁ బోరి చచ్చుట

చ.

ఘనుని నిలింపకంపనునిఁ గంపనునిన్ శరలూనవైరిజం
ఘుని నభయుం బ్రజంఘుని విఘూర్ణితభీషణవృత్తశోణితా
క్షుని నలశోణితాక్షుఁ గరిఘోటకకోటిశతాంగపంక్తిసం
జనితమహీప్రకంపముగ సత్వరు లై కదలంగఁ బంచినన్.

1165


క.

చాపాభ్యసనోపమితవి, రూపాక్షుఁడు చక్రసమవిరూపాక్షుఁడు సా
టోప మగుబలము గొలువ వి, రూపాక్షుఁడు గదలెఁ జూడ్కి రోషం బొదవన్.

1166


చ.

పరశుగదామహేష్వసనపాశకృపాణికభిండివాలము
ద్గరశితశూలపట్టిసవికస్వరకుంతకరాళపాణు లై
దురధిగమప్రతాపపరిదూషితనిర్జరు లాజి దుర్జయుల్
పొరయఁగ వాద్యఘోషములు భూషణదీప్తులు నోలిఁ గ్రాలఁగన్.

1167


వ.

కల్పాంతసమయంబున విడివడి మెఱసి గర్జిల్లుజీమూతంబుల పగిది వివిధాస్త్రప్ర
భలు నిగుడ నార్చుచుఁ గవియునక్తంచరులపైఁ బ్రచండు లైనప్రభంజనులుం
బోలె మర్కటులు మార్కొని వీఁకం దాఁకి రట్టియెడ.

1168


క.

గిరులఁ దరులఁ బిడికిళ్లను, సురరిపులం బ్లవగు లేచి సుడివడఁ జేయన్
శరముద్గరాసిగదలం, దిరుగుడువడఁ జేసెఁ గపుల దితిజబలంబుల్.

1169


క.

అలుకమెయి [115]వానరేంద్రులఁ, దలపడి వడిఁ దూల నేసె దైత్యబలంబుల్
గలఁచియుఁ గఱచియు విఱిచియు, బలువుగఁ బొడిచియును బగఱఁ బఱపిరి కపులున్.

1170


చ.

వడిగొని వానరో త్తము లవారితవిక్రమసాహసాంకు లై
పిడికిట నుద్ధతిం బొడువ బీరము దక్కి నిరస్తజీవు లై
పుడమిపయిన్ వడిం బడిరి పూర్వనిలింపులు వజ్రసంహతిం
దడయక గండశైలములు ధారుణిఁ గూలెడుచంద మేర్పడన్.

1171


క.

నక్తంచరచండధను,ర్ముక్తము లై నిశితభల్లములు వడితోడన్
రక్తము చవిచూడక యు, త్సిక్తము లై శైలచరులజీవముఁ గ్రోలెన్.

1172


క.

ఆరాక్షసులును లంకా, ద్వారంబులు గాచి యున్నతరుచరసేనన్
ఘోరాహవమునఁ బఱపిరి, భూరేణువు నింగి మ్రింగి పొరిఁబొరిఁ బెఱుగన్.

1173


చ.

విఱిగినయాత్మసేనఁ గని వీరుఁడు కేసరియుం బృథుండునున్
మఱి హరిరోముఁడుం గినిసి మత్తగజంబులమాడ్కి వృక్షముల్
పెఱికి నిరర్గళంబుగ నిలింపవిరోధులమీఁద వైవ డ
గ్గఱిరి నిశాటు లస్త్రపరిఘచ్ఛురికాశితశూలహస్తు లై.

1174

లయగ్రాహి.

ఒక్కమొగి వీరతతి నుక్కడఁచుతెంపు గలయక్కజపువీరు లగురక్కసులు మిన్నుం
దిక్కు లద్రువంగ వడి నొక్కటిగ నార్చుచును జిక్కువడ వానరుల లెక్క గొన కాజిన్
నిక్క మగుసారమున మొక్కలము సేయుచును దిక్కరులసత్త్వముల ధిక్కరణతోడన్
నిక్కిరణసీధువులఁ జొక్కి యరివాహినుల కెక్కి నిశితాస్త్రములఁ జిక్కువడఁ జేయన్.

1175


సీ.

నిష్ఠురకరవాలనిశితంబు లై యున్న, ఘోరనఖంబులఁ జీరి చీరి
పిడుగులకంటెను బెడిదంబు లై యున్న, పిడికిళ్ల నందంద పొడిచి పొడిచి
భిదురధారలభంగి భీమంబు లైయున్న, కఠినదంతంబులఁ గఱచి కఱచి
చటులంబు లైనసంపెటలతాఁకులఁ బోలి, వఱలుతలంబులఁ జఱిచి చఱిచి
మొనసి వాలంబు లార్చుచు మోఁది మోఁది, గర మొదవంగఁ బదములఁ దన్ని తన్ని
తరులు గిరులును బైపయిఁ గురిసి కురిసి, కపులు పొలియించి రప్పుడుఁ గడఁగి రిపుల.

1176


చ.

నిలు నిలు పోకు పోకు రజనీచర యెందుఁ జనంగవచ్చు నా
బలముఁ జలంబునున్ మెఱయఁ బట్టి వధించెద నిన్ను రూఢదో
ర్బల మొసఁగంగ నంచు నరిభంజనుఁ డొక్కరుఁ డొక్కరుండు పే
రలుకమెయిన్ వనాటుఁడు నిరంకుశుఁ డై పలుకున్ రణస్థలిన్.

1177


చ.

వనములయందుఁ గ్రుమ్మరుచు వాఁగుల వంతల నీరు ద్రావి పెం
పెనసినపండు గాయ గస రేమియు నైనను నేఱి తించు జీ
వనమున నుంట యొప్పునది వానరులార రణంబుసేఁత మీ
కనుచిత మంచుఁ బల్కిరి నిశాటు లుదగ్రబలాగ్రహంబునన్.

1178


క.

పొడుచుచుఁ బట్టుచుఁ దన్నుచు, నొడుచుచుఁ జంపుచును నిట్టు లొకఁడొకఁడు వెసం
గడిమి మెయిఁ గపియు నసురయు, వడిగొని పోరిరి [116]యుదీర్ణవారక్రము లై.

1179


క.

పదుర నెనమండ్ర నొక్కటఁ, బొదివిరి వానరుల నసురపుంగవులు వెసం
జదిపిరి వనచరు లాక్రియ, నదితిజులం బట్టి బహురణక్రమ మొదవన్.

1180


ఉ.

కూలినదంతులం బడినఘోటములన్ నఱు మైనశస్త్రులన్
వ్రాలినకేతనంబులను వావిరి దక్కినచామరంబులన్
రాలినభూషణాళిఁ జెదరం బడియున్నశతాంగకోటి నా
భీలత నొందె నారణము భీమనిశాచరనాశశంసి యై.

1181


శా.

ఆసౌత్రామిజుఁ డంగదుండు ఘనబాహావిక్రముం డాహవో
ల్లాసవ్యగ్రతతోన కంపనుపయిన్ లాంగూల మల్లార్చి వి

త్రాసుం డై చనుదెంచి తాఁకె బ్రతిఘారక్తాంతదృఙ్మండల
శ్రీసొంపార నఖర్వవిక్రమగుణోత్సేకానుభావంబునన్.

1182


క.

హరియును గుంజరమును ఖగ, వరుఁడును గాకోదరుండు వడిఁ బోరుక్రియన్
హరివరుఁడు కంపనుఁడు ను, ద్ధురభుజబలదర్ప మెసఁగఁ దొడరిరి పెలుచన్.

1183


క.

గద వాఁ డంగదు వ్రేయం, జదికిలఁబడి లేచి యొక్కశైలము రోషం
బొడవ వడితోడ నేసిన, నది యాతని నుగ్గు చేసె నసురులు బెదరన్.

1184


వ.

అంత.

1185


ఉ.

క్రోధనుఁ డేఁగుదెంచి కపికుంభిపతిన్ గద వేయ నుద్ధత
క్రోధముతో నతండు నొకకొండ వడిం బడవైచె వాఁడు దు
స్సాధకఠోరముష్టిహతి శైలము చూర్ణము చేయ వెండియున్
భూధర మెత్తి వానిరథముం దురగంబుల నుగ్గు చేసినన్.

1186


వ.

 క్రోధనుండును గరవాలంబు [117]నొడ్డనంబును గొని లాఘవంబున ధరణికి లంఘించి
యార్చుచుం బేర్చినం జూచి దుందుభివైరిసంభవుండు సంరంభంబున విజృంభించి
సింహనాదంబు సేసి సైంహికేయుండు చందురుం బొదువుచందంబున నరవాయి
గొనక కరవాలంబుఁ దిగిచి పుచ్చుకోని యలికంబు వగులనడిచి [118]యపరిమితవిన్యా
సవిరచనావిశేషంబుల వ్రేసి వానిం గాలుప్రోలికిం గాఁపు పుచ్చి యెదురులేక యసమ
సమరసాహససముత్సాహంబున నమరవైరుల సమయించుచున్నం గని శోణితాక్షుం
డరదంబు వఱపి బెడిదంబు లగుతూపులు పరఁగించిన నతండు దద్రథంబున కుఱికి
కోదండంబు ఖండింప వాఁడును బోఁడిమి వాటించి వాఁడిమి మెఱసి యసిచర్మ
ధరుం డై యుప్పరవీథికి నెగసిన దెప్పరంబునం దోడ నెగసి వానిం బొదివి పెను
మూర్ఛ నొందించె నంత నతిసత్వరులై ప్రజంఘుండును యూపాక్షుండును బఱతేర
మైందద్వివిదు లనువానరాధిపు లిరువురు నంగదునకు సాహాయ్యకం బొనరింప
నట శోణితాక్షుండుం దేఱిన నమ్మువ్వురుదానవులకు వానరత్రయంబునకుం బోరు
ఘోరం బయి వర్తిల్లె నందు.

1187


క.

అంగదమైందద్వివిదులు, సంగరమునఁ దరులు గిరులు సరిఁ గురియింపం
బొంగి శరంబులఁ ద్రుంచిరి, భంగపడక దైత్యవరులు బలములు వొదలన్.

1188


క.

ఎడపక మైందద్వివిదులు, వడిఁ బాదపవృష్టి దుర్నివారతఁ గురియన్
నడుమన త్రుంచెను గద గొని, యుడుగక యాశోణితాక్షుఁ డుద్ధతలీలన్.

1189


మ.

అసి లీలన్ జళిపించుచున్ గురుతరాహంకారుఁ డై సంగరో
ల్లసనం బొప్పఁ బ్రజంఘుఁ డార్చుచు బలాలంకారుఁ డై వచ్చినం
బ్రసరత్సాహసుఁ డంగదుండు సముదగ్రస్ఫూర్తితో మద్దిమ్రా
నసమానోద్ధతి వైచియుం బిడికిటన్ సాటోపుఁ డై దూఁటినన్.

1190

చ.

అడిదము నేల వైచి సముదగ్రత నంగదు నాప్రజంఘుఁడుం
బిడికిట బిట్టుగాఁ బొడువ బిమ్మిటిపోవుచుఁ దేఱి కన్నుల
న్మిడుఁగుఱు లుప్పతిల్ల నతినిష్ఠురవృత్తి శిరంబు నుగ్గుగాఁ
బొడిచిన నంత వాఁడు మృతిఁ బొందెఁ గపీశ్వరు లుబ్బి యార్వఁగన్.

1191


క.

పినతండ్రిచావు గని య, ద్దనుజుఁడు యూపాక్షుఁ డంతఁ దరవరి గొనుచుం
దనరథము డిగ్గి సింహ, ధ్వని యెసఁగన్ ద్వివిదుఁ దాఁకె దర్ప మెలర్పన్.

1192


క.

కోపాటోపము గదురఁగ, యూపాక్షు నతండు [119]పొడిచి యురవడిఁ బట్టెన్
రూపఱ సింహము గలభము, నేపారఁగఁ బొదువుభంగి నిద్ధబలుం డై.

1193


మ.

అనుజుం డుద్ధతి శోణితాక్షుఁడు రణవ్యగ్రాగ్రహోదగ్రుఁ డై
చను దేరంగ లయాంతకోపముఁడు వక్షంబుం బొరిం దాఁచినన్
ఘనసత్తాఢ్యుఁడు మేను జిఱ్ఱ దిరుగంగా మూర్ఛచే వ్రాలినం
జనియెనే నే విడిపించి యద్భుతభుజాశ్లాఘాసముల్లాసి యై.

1194


మహాస్రగ్ధర.

చటులౌద్ధత్యంబుతోడన్ సరభసగతి యై చండదోర్దండసత్త్వో
ద్భటుఁ డత్యుగ్రప్రతాపప్రతిహతదివిజప్రాభవుం డేఁగుదేరం
గుటిలభ్రూవిక్రియాసంక్షుభితదనుజుఁ డై ఘోరముష్టిన్ శిరంబుం
[120]ద్రుటితంబుం జేసి యార్చెన్ ద్రుతగతి నద్రువన్ దోన దిగ్జాల మెల్లన్.

1195


వ.

ఇట్లు ద్వివిదుండు శోణితాక్షుం దెగటార్చె నంత యూపాక్షుండు మైందుతోడం
బోరునవసరంబున.

1196


ఉ.

బల్లిదుఁ డైనవానరుఁడు బాహుబలంబునఁ బట్టి యుద్ధతిం
బ్రల్లదుఁ డైనరక్క సునిపక్కలు వ్రక్కలు గాఁగ నేలతో
గుల్లలతిత్తిగా నదికి ఘోరవధం బొనరించి యల్క సం
ధిల్లఁగ నార్చె దైత్యులు మదిన్ భయ మంది కలంగఁ బాఱఁగన్.

1197


తే.

క్రోలుపులిఁ గన్నమృగములఁ బోలి కన్న, గతులఁ బాఱుచు నున్నరక్కసులఁ జూచి
మగుడఁ బెట్టుటకై వారిబెగడు దెలిపి, నిలువఁబడి యున్నవానరబలముఁ గాంచి.

1198

సుగ్రీవుండు కుంభునిం జంపుట

సీ.

దర్వీకరాధీశదర్పహం బగుచున్న, విపులసారం బైనవిల్లు దాల్చి
[121]కమనీయమణిమయకనకాంగదప్రభా, విలసనంబులు దెసల్ గలయఁ బర్వఁ
దరువంగఁబడుసముద్రముమ్రోఁతవడువున, శింజినీటంకృతుల్ చెలఁగఁజేసి
రోదోంతరవ్యాప్తి రూఢ మై నీరంధ్ర, బాణపరంపరాభరము నిగుడ

మఘవదురుచాపచంచలామహదుదగ్ర, గర్జితాసారములు గలఘనమపోలెఁ
గుంభుఁ డేతెంచె నద్భుతారంభుఁ డగుచుఁ, గపులు గలఁగంగ నసురులు గడఁగి యార్వ.

1199


మ.

హయరింఖాపుటకోటిపాటితధరోద్యద్రేణుజాలంబుల
న్వియదాశాంతర మంతయున్ వరుసతో నిండంగ నానాగతి
ప్రయుతస్యందననేమిఘోష మొదవన్ రక్షోగణోపేతుఁ డై
భయదుం డై వడిఁ దాఁకె వానరులు శుంభద్వేగసంరంభతన్.

1200


క.

శరసంధానవిశేషము, దురమునఁ దెలియంగ రాక తూణీరముఖాం
తరమునఁ దనయంతన చను, కరణిగ నతఁ డేసె నిశితకాండములు వడిన్.

1201


తే.

ఒలసి యాఁకొని పుట్టలోనుండి వెడలు, కాలసర్పంబులో యనఁ గడఁగి యతని
దొనలు వెలువడి శరము లుద్ధురతఁ బేర్చి, యొగిఁ గపీంద్రులప్రాణవాయువులఁ గ్రోలె.

1202


శా.

ఆకర్ణాంతవికృష్టమై కనకదీవ్యత్పుంఖరోచిశ్చటా
లోకం బై కపిదుర్నిరీక్ష్యగతి యై లోలప్రభావల్లరీ
వ్యాకోచస్థితి నేగుఁదెంచి బెడిదం బై యున్న కుంభాస్త్ర ము
త్సేకోదగ్రతఁ దాఁకినన్ ద్వివిదుఁడుం జె య్వేది మూర్ఛిల్లినన్.

1203


వ.

మైందుండు దనతమ్ముం డగుద్వివిదుండు కుంభబాణపీడితుం డగుట సూచి కనలి
యొక్కమహాశిల యెత్తికొని పఱతెంచినఁ గుంభకర్ణనందనుం డేనుశరంబుల నమ్మ
హోపలంబు పగుల నేసి యొక్కసునిశితం బగుసాయకంబున మైందువక్షం బు
చ్చిపో నేసిన వాఁడు నది మర్మభేదకం బగుటం జేసి పడినఁ దారేయుండు విగత
చేతనులై పడియున్న తనమామలం బొడగాంచి భుజైకసహాయుండై యెదుర్కొ
నిన నెనిమిదిశరంబులు నిగిడించి మఱియును బెక్కుదూపుల నొప్పించిన నిరుదె
సలం గానంబడు కాండంబులు శలలమృగంబు ననుకరించుచుఁ బాషాణపాదపం
బులు పఱపిన నద్దనుజుండును బ్రచండటంకపరశుసమవిశిఖషండంబులం బొడి
చేసియుఁ దుమురు గావించియు రెండుబాణంబుల బొమలు బె ట్టేసిన.

1204


ఉ.

ప్రన్ననిదైనధాతుఝరరంజన నొప్పుమహాద్రికైవడిం
గన్నులు రెండునున్ మునుఁగఁ గాఱెడునెత్తురు వాలిపుత్రుఁడున్
సన్నుతలీలఁ బోఁ దుడిచి సాలము వైచినఁ ద్రుంచి తూపులన్
ఖిన్నునిఁ జేసె రక్కసుఁడు పెల్కుఱి యాతఁడు మూర్ఛవోవఁగన్.

1205


సీ.

అంత వానరసైన్య మెంతయు భీతిల్లి, కొంత యంగదుఁ గాచికొనియెఁ గొంత
రామున కెఱిఁగింప రఘుకులోత్తంసుండు, [122]వాలితనుజునకు వనటఁ బొగిలి
భల్లూకనాయకప్రముఖులఁ బంపిన, వారు శిలావృక్షధారు లగుచుఁ
గ్రోధంబు గదురంగఁ గుంభుపై నడిచిన, వాడిబాణంబుల వాఁడు పఱపఁ
దఱిమి కదియలేక తలఁకిన వారలఁ, జూచి యేపు రేఁగి సూర్యసుతుఁడు

కుంభుఁ దాఁకె వేగ కుంజరేంద్రముమీఁది, కెగయుసింహ మనఁగ నెదురు లేక.

1206


ఆ.

తరణిసంభవుండు తరులును శిలలును, గిరులు మీఁద వైవ సరకుగొనక
వాని నెల్లఁ ద్రుంచె వాఁడిశరంబుల, గర్వ మెసఁగఁ గుంభకర్ణసుతుఁడు.

1207


క.

చండతరకాండములు మా, ర్తాండాత్మజుమీఁద వైవఁ దలఁకక యతఁడున్
ఖండించెఁ గుంభు ఘనకో, దండము దుర్వారబాహురదర్పం బెసఁగన్.

1208


వ.

రవినందనుండు సగౌరవంబును సక్రోధంబును సవిస్మయంబునుంగాఁ గుంభున
కి ట్లనియె.

1209


శా.

బాహాసారము ప్రాభవంబు బలముం బ్రౌఢత్వమున్ సంగరో
త్సాహంబున్ విపులప్రతాపము ధనుస్సాహిత్యచాతుర్యమున్
మాహాత్మ్యంబును నీక యొప్పు నెటు లన్నన్ దానవాధీశ నా
తో హేలాగతిఁ బోరి తీవు సరిగా దుర్వారతాశాలి వై.

1210


చ.

చటులతరాస్త్రజాలముల శైలచరావలి రూపుమాపి సం
ఘటితసుశక్తి వైననిను గర్వము దూలఁగఁ బట్టి యేపునం
బటుతరముష్టిఘాతమునఁ బ్రాణము లంగముతోడఁ బాసి యు
త్కటగతి వేగ నీ కరుగఁ గాలునిప్రోలికిఁ ద్రోవ సేసెదన్.

1211


క.

సుగ్రీవుపలుకు విని యతఁ, డాగ్రహమునఁ దేజరిల్లునాజ్యాసారో
దగ్రుఁ డగుదహనుకైవడి, నుగ్రాహవకౌతుకాధికోత్సాహుం డై.

1212


సీ.

ఉద్ధతాకారత నురవడి నేతెంచి, భాస్కరనందనుఁ బట్టికొనిన
నిరువురు గంధసింధురములగతి ఘర్మ, మదసిక్తగాత్రు లై కదిసి పోరి
రురగనాథులుఁబోలె నూర్పులు నిగుడంగఁ, జరణఘట్టనమున ధరణి గదల
నార్పులఁ గమలభవాండంబు భేదిల్ల, రేణుజలముల వారిధులు గలఁగ
నంత సుగ్రీవుఁ డాకుంభు నడరి పట్టి, త్రిప్పి యంబుధిలో వైవ నుప్పతిల్లె
జలము మి న్నంది మందరశైలపాత, భరము దోఁపంగ జలచరోత్కరము [123]గలఁగ.

1213


క.

తడయక యాకుంభుఁడు న, జ్జడనిధిలో వెడలి వచ్చి సక్రోధుం డై
వడి సుగ్రీవునివక్షము, పిడుగుం దడఁ బఱుపఁ జాలు పిడికిటఁ బొడిచెన్.

1214


చ.

మెఱయుచు నున్నవజ్రహతి మేరుతటంబున [124]రాలునమ్మిడుం
గుఱు లన విస్ఫులింగములు కుంభునిముష్టివిఘట్టనంబు
వఱలుచు వానరోత్తమునివక్షమునన్ నెడలెన్ సముద్ధతి
న్మెఱయు ప్రతాపపావకవినిస్స్రుతహేతికణంబులో యనన్.

1215


వ.

దానికిం గినిసి వానరేంద్రుండు కాలాంతకుకాలదండంబుంబోని యుద్దండభుజా

దండం బెత్తి కాఠిన్యాపహసితభిదురం బగుతదీయోరస్స్థలంబు పిడికిటం బొడి
చిన గుంభుండు గతప్రాణుం డై ప్రశాంతార్చి యైనకృశానుండునుఁబోలె
వేఁడిమి దక్కి పుడమిం బడినం జూచి రక్కసులు దిక్కు లద్రువ ధరణి గ్రక్కదల
దిక్కు గానక చిక్కువడి తనమఱువు సొచ్చిన.

1216

హనుమంతుండు నికుంభునిం బరిమార్చుట

సీ.

ఘనతరక్రోధాగ్నికలుషంబు లై యున్న, కన్నుల నిప్పులు గడలుకొనఁగఁ
జటులదంష్ట్రాప్రభాపటలంబు లిరుగెలం, కులఁ జామరచ్ఛాయ లలవరింప
రోదసీకుహరంబు మేదురితంబుగాఁ, బంబినసింహనాదంబు సెలఁగ
భూరిమణిస్వర్ణభూషిత మయి గంధ, కుసుమార్చితంబు నై ఘోర మైన
పరిఘ ద్రిప్పికొనుచుఁ బఱతెంచె గిరులును, గుతల మద్రువఁగా నికుంభుఁ డంతఁ
జండ మైన కాలదండంబు దాల్చిన, దండధరుఁడపోలె మండికొనుచు.

1217


మ.

పరిఘభ్రాంతిఁ జలించె భూమి పగిలెన్ బ్రహ్మాండ భాండంబు వే
తిరిగెం దద్గ్రహతారకాచయము భేదిల్లెన్ దిశాచక్రమున్
విరిసెన్ గోత్రమహీధరంబులు వడిన్ విచ్చెన్ సురేభంబులుం
బొరి వంచెం దల లాభుజంగపతి సంభూతాతిభారంబునన్.

1218


క.

అనుగతి దోఁచుచునుండఁగ, నినసుతునకు వాయుపుత్రుఁ డెడసొచ్చిన న
ద్దనుజుఁడు తద్వక్షంబున, ఘనపరిఘము ద్రిప్పి వైచెఁ గడుసత్వరుఁ డై.

1219


ఆ.

పరిఘ కఠిన మైనపావనివక్షంబు, దాఁకి తునుక లయ్యెఁ దత్క్షణంబ
కుటిలుఁ డయినవానికూరిమియునుబోలె, గాలిఁ దూలుతరువుఁ బోలె నపుడు.

1220


క.

[125]పొలివోవనిధైర్యంబున, బలియుండు నికుంభుఱొమ్ముఁ బగులఁగఁ బొడువన్
నిలువక నెత్తురు గాఱఁగ, [126]నిల నొకయావంత సోలి యేపున మఱియున్.

1221


ఉ.

హర్షము నొంద దానవు లహంకృతితోడ నికుంభుఁ డుద్ధతా
మర్షత వాయుపుత్రు నసమానబలంబునఁ బట్టి యెత్త ను
త్కర్షము గల్గి పావని యుదగ్రతతో విడిపించికొంచు దు
ర్ధర్షుఁడు వాని నొంచె సమరస్థలి వానరు లుబ్బి యార్వఁగన్.

1222


ఉ.

నెట్టన వాయుసూతి రజనీచరు నుద్ధతిఁ బట్టి నేలతో
బిట్టుగ వ్రేసి యెమ్ములు విభిన్నము లై పడ మేను నుగ్గుగా
మెట్టుచు ఱొమ్ముపై నిలిచి మించి వడిన్ మెడ ద్రిప్పి చేతులం
దట్టి శిరంబు ద్రుంచి సముదగ్రత నార్చె ననూనతేజుఁ డై.

1223


ఆ.

దివియు భువియు దెసలుఁ బవిలినగతి మ్రోయ, నిహతశేషు లైననిర్జరారు
లరిగి రావణునకు నంతయు నెఱిఁగింపఁ, బరమశోకరోషభరితుఁ డగుచు.

1224


మ.

ఖరుపుత్రున్ మకరాక్షు బిల్చి సముదగ్రస్ఫూర్తి యై పల్కె ను

ద్ధురలీలం జతురంగసేన గొలువన్ దుస్సాధదోస్సారని
ష్ఠుర[127]భావోచితకార్ముకుండ వయి విస్ఫూర్జద్గతిం బోయి వా
నరులన్ రాఘవుల వడిం దునిమి యానందంబు గావింపుమా.

1225

మకరాక్షుఁడు రామునితో యుద్ధము చేసి చచ్చుట

క.

అని దశకంఠుఁడు పంచినఁ బనివినియెద ననుచు లేచి ప్రణమిల్లి ముదం
బున వెడలి [128]సజ్జరథుఁ డై, దనుజులు వినఁ బలికె నధికదర్ప మెలర్పన్.

1226


క.

దుర్ధర్షవృత్తి మీరు ధ, నుర్ధరు లై కవిసి రణవినోదంబున సం
స్పర్ధమెయి మర్కటావలి, మూర్ధంబులు దునుముఁ డేచి ముదమున నేనున్.

1227


ఉ.

రావణుపంపునం దివిరి రాఘవులన్ రణభూమిఁ గూల్చి స
ద్భావముతోడఁ దండ్రిపగ పన్నుగఁ దీర్పఁగఁ గంటి నేఁడు సు
గ్రీవునిఁ జంపి యూథపులగీ టడఁగించి మహాశరార్చులన్
దావమపోలెఁ గీశసముదాయవనంబుల నెల్ల నేర్చెదన్.

1228


వ.

అని కదలునవసరంబున.

1229


మ.

ఘనదంతావళబృంహితంబులుఁ దురంగవ్రాతహేషామహా
స్వనితంబుల్ రథనేమిఘోషములు రక్షస్సింహనాదంబులున్
వనధిధ్వానగభీరదుందుభివిరావంబుల్ బృహచ్ఛంఖని
స్వనముల్ దిక్కులఁ బిక్కటిల్లఁ గదలెన్ వాఁ డుగ్రుఁ డై యేపునన్.

1230


క.

దుశ్శకునంబులు గనియును, నిశ్శంకతఁ గదియ యామినీచరతతికిన్
దోశ్శక్తి మెఱసి పృథుతే, జశ్శత్రు[129]బలంబుతోడ సరిఁ బో రయ్యెన్.

1231


తే.

కొండలును ఱాలుఁ దరువులుఁ గొనుచు వచ్చి, దానవులమీఁద వైచిరి తఱిమి కపులు
వాని నన్నింటిఁ దునుమాడి రానిశాటు, లురుశరంబుల నొకమాత్ర నుత్సహించి.

1232


సీ.

ఘనగదాహతుల నొక్కట నుగ్గు గావించి, తలలు గూలఁగ నడిదముల వ్రేసి
యురుశక్తిహతి మేను లుచ్చిపోవఁగ నేసి, తఱిమి యందంద కుంతతములఁ బొడిచి
భీమతరం బైనగతోమరంబుల నొంచి, భిండివాలంబులఁ బిండి చేసి
ముసలపాతంబులఁ గసిబిసి గా మొత్తి, సునిశితోద్యతపరశువుల నఱకి
మారి మసఁగినకైవడి బారి సమరె, ఖరతనూజాతుఁ డీభంగిఁ గరుణ లేక
దాని కోర్వక వడిఁ బాఱె వానరాలి, యుబ్బి యసురులు మిన్నంది బొబ్బ లిడఁగ.

1233


చ.

కనుఁగొని రాఘవేశ్వరుఁడు గారుణికాగ్రసరుండు గావునన్
వనచరులార పాఱకుఁడు వారక నేఁ గలుగంగ మీకు నీ
పెనుబెగ డేల యంచు నతిభీషణుఁ డై యని నిల్చి దైత్యులం

దునిమియు నుగ్గు చేసియును దోలియు రూ పఱఁ జేసె నత్తఱిన్.

1234


వ.

ఖరనందనుఁ డతనిపై నతిత్వరితంబున నరదంబు పఱపించి కదిసి రోషారుణిత
నయనుం డై యి ట్లనియె.

1235


శా.

వీరాగ్రేసరు నస్మదీయజనకున్ విఖ్యాతసత్త్వున్ ఖరుం
బోరం జంపితి నామనం బెరియు నేప్రొద్దున్ నరాధీశ నా
నారక్షస్తతి నేచి చంపి తిచటన్ నాపాలిభాగ్యంబునం
జేరన్ వచ్చితి వెందుఁ బోయెదవు నాచేఁ జిక్కి తింకన్ వెసన్.

1236


ఉ.

తండ్రికి సూడుపట్టక వృథాస్థితి నుండితి నింట నిందతో
మండ్రె మహాస్త్రసాధనులు మానము దూలినవాని సజ్జనుం
డండ్రె సభాంతరంబుల మహాత్ములు నేలినవారు వానిఁ జే
కొండ్రె యటుండ మున్ను సమకూఱెను నేఁ డది నాకుఁ జేయఁగన్.

1237


క.

మనిచెద నామానాంగము, నినిచెద భువనములఁ గీర్తి నిష్ఠురగతితో
ననిచెద నిను జముప్రోలికి, నునిచెదఁ బౌలస్త్యు సుఖము లొగిఁ బొందంగన్.

1238


ఆ.

ఖడ్గశక్తి నైనఁ గద నైనఁ జేతుల, నైన వింట నైన నరసి చూడఁ
గడఁగి నీకుఁ బోరఁగా నేర్పు మిక్కిలి, యెందుఁ గలదు దాని నేఱికొనుము.

1239


మ.

అనినన్ రాముఁడు వాని కిట్లనియెఁ గ్రవ్యాదాధమా ఘోరమ
ద్ధనురుచ్ఛృంఖలతీవ్రబాణపటలిన్ దర్పంబు దూలించెదన్
విను నీ కీపలుమాట లేమిటికి దోర్వీర్యంబు గల్గంగ ని
న్ననుమానం బొకయింతి లే కిపుడు యుగ్రాజిన్ వడిం గూల్చెదన్.

1240


వ.

అనునంత ఖరనందనుండు నిశితబాణసహస్రంబులు వఱపి యంబరంబు దీటు కొల్పిన.

1241


క.

చండమకరాక్షశరములు, ఖండించె రఘూద్వహుండు ఖరబాణములన్
మెండుకొని వైనతేయుఁడు, తుండనిపాతముల నహులఁ దునిమినమాడ్కిన్.

1242


సీ.

గరుడఖేచరసిద్ధగంధర్వు లాదిగా, నరుదెంచి యచ్చెరు వంది చూడ
నిరువురకోదండగురుతరజ్యానాద, మడరి బ్రహ్మాండంబు బడలు వఱుప
దోషాచరేంద్రునితూపుల పెనుమంచు, రామార్కుఁ డస్త్రకరములఁ జెఱుప
నరనాయకాంబుదశరకరకావృష్టి, లీల నక్తంచరశైల మోర్చి
రోదసీగర్భగోళంబు మేదురముగ, శరచయంబుల నారామచంద్రుఁ బొదువఁ
గోప మెసఁగిన నానృపకుంజరుండు, వెడఁదతూపున నాదైత్యువిల్లు దునిమి.

1243


క.

ఎనిమిదితూపుల సారథిఁ, దునిమియు నన్నిటన మఱియుఁ దురగంబులఁ ద
ద్ఘనరథముతోన త్రుంచిన, దనుజుండును విరథుఁ డగుచు ధరణికి నుఱికెన్.

1244


వ.

అంత.

1245


శా.

క్రుధ్యద్దానవముక్తశూల మధికక్రూరారవం బై వియ
న్మధ్యం బెల్ల వెలుంగుచుండఁ ద్రిశిరోనాగోపమం బై దృఢా

సాధ్యం బై చనుదేరఁ ద్రుంచెఁ బతియున్ శస్త్రత్రయం బేసి తా
సాధ్యుల్ రాము నుతించి రప్పుడు నరేశవ్రాతచూడామణిన్.

1246


చ.

అడరుచు దానవుండు ప్రళయాంతకుకైవడిఁ దన్ను నుగ్రుఁ డై
పిడికిట బిట్టుగాఁ బొడువ భీషణుఁ డై చనుదేర రాముఁడుం
దడయక పావకాస్త్రమున దైత్యునివక్షముఁ గాఁడనేసినం
బడియె నతండు భూమిపయిఁ బ్రాణము మున్మును దన్నుఁ బాసినన్.

1247


క.

హతశేషు లైనరక్కసు, లతిరయమున లంక కరిగి యంతయు రక్షః
పతి కెఱిఁగించిన శోకా, వృతుఁ డై కోపించి పలికె వృత్రారిహరున్.

1248


చ.

ప్రణుతపరాక్రమాన్వితులు బాహుబలోద్ధతు లైన రామల
క్ష్మణులను వానరాధిపుల సాహససంపదఁ జేసి యోర్వఁగా
రణమున నీవు దక్క మఱి రాక్షసుఁ డెవ్వఁడు గావునన్ మహా
క్వణనము మీఱ దైత్యవరవాహిని గొల్వఁగ నేఁగు ముద్ధతిన్.

1249


వ.

అని దశకంఠుండు నియోగించిన.

1250

ఇంద్రజిత్తు మూఁడవయుద్ధము

శా.

రక్షోనాయకనందనుండు సమరారంభోగ్రుఁ డై వాహినీ
లక్షల్ వే చనుదేర సత్వరవిలోలత్సైంధవస్యందనం
బక్షీణోగ్రత నెక్కి రేణుసముదాయాంధీకృతామర్త్యుఁ డై
సాక్షాదంతకుఁడో యనం గదలె నాశాచక్ర మల్లాడఁగన్.

1251


చ.

సుత్రామారిశిరంబుమీఁదఁ దనరెం జూడం గడుం బాండుర
చ్ఛత్రం బున్నతశైలశృంగ మనఁ జంచచ్చారదాభ్రంబుతో
మైత్రింజేయుచుఁ గుంచె లోలి నిగుడన్ మాద్యన్మరాళోల్లస
ద్గోత్రాధీశసమత్వ మేర్పడఁగ నస్తోకానుభావంబునన్.

1252


క.

ఉత్తరపుగవను వెల్వడి, యత్తఱి నరదంబు డిగ్గి యారణభూమిన్
మొత్తములై దనుజులు దను, నిత్తెఱఁగునఁ గాచికొనఁగ నెంతయుఁ గడఁకన్.

1253


వ.

అక్కడఁ ద్రికోణాకృతిగా నొక్కవేదిక దక్షిణపథంబుగాఁ గావించి శ్మశానాగ్ని
యందుఁ బెట్టి ప్రజ్వలించి రక్తమాల్యాంగరాగాంబరాభరణుం డై యచ్చేరువ
ఖట్వాంగధ్వజమ్ములు నిల్పి కపాలాసనుం డై కంకాలంబులు పరిధులుగాఁ జేసి
దక్షిణపుదిశయందు నలాబూపాత్రలయందు నినుపపాత్రలయందును నల్లనిమేని
వానినెత్తురు మజ్జయుం [130]బోసి నిలిపి మౌనంబు సలుపుచు [131]నాథర్వణమంత్రంబులు
గ్రమంబుగా నుచ్చరించుచు స్రుక్స్రువంబులు దాల్చి తాడిసమిధలును దిలలు
ను సర్షపంబులును సక్షీరంబుగా నాజ్యంబును మానుషి యగువసయును హో
మంబు గావించుచుండ ధూమంబు భూనభోదిగంతరాళంబులం బొదువ నాదహన

మధ్యంబున.

1254


సీ.

మృత్యువుజిహ్వతో మేల మాడెడునసి, దాల్చి కపాలపాత్రంబు పట్టి
బాడబార్చులఁ బోలుపల్లవెండ్రుకలును, జండప్రకాశదంష్ట్రాయుగంబు
మెఱవ మండుచు నున్నమిడిగ్రుడ్లు గనలంగఁ, బెను పైనపునుకలపేర్లు గలిగి
యట్టహాసమున వియచ్చరు లదరంగ, మెట్టినఁ బుడమియు బిట్టు గ్రుంగఁ
గృత్య యేతెంచి యాయుగ్రకృత్యుఁ బలికెఁ, బంపు మెయ్యదియైన నేఁదెంపుతోడ
నిపుడ చేయుదు ననవుడు నింద్రజిత్తు, తేరు వడి నెక్కి శక్తితో దివికి నెగసె.

1255


క.

మఱి దైత్యులు లంకకుఁ గ్ర, మ్మఱి చనినను దాశకంఠి మదమునఁ గపులన్
నుఱుమాడఁ జొచ్చెఁ దూపుల, నెఱయ నదృశ్యత్వ మొంది నిష్ఠురలీలన్.

1256


క.

వడి రాలవాన గురిసినఁ, దడఁబడఁ బడుఖగము లనఁగఁ దరుచరులును బెం
పెడలి చెడ విఱిగి నేలం, బడి కూలిరి శక్రజిత్తుపటుబాణములన్.

1257


తే.

రావణాత్మజుఁ డేసె నారాచతతులఁ, గపులు గొందఱు నెత్తురు గాఱఁ గూలి
తఱుచు జేవుఱుసెలయేళ్ల నొఱపు గలిగి, యున్నకొండలచందంబు నోజ దోఁప.

1258


శా.

సుస్ఫారాస్త్రమహాపరంపర తమస్స్తోమంబు గావింపఁ గృ
త్యాస్ఫీతాంగసమగ్రనీలిమయుఁ దద్ధ్వాంతంబు రెట్టింప మా
యాస్ఫాతిం బొడచూప కాతఁడు ధనుర్జ్యావల్లరీసాంద్రనా
దాస్ఫోటంబున నిశ్చయింపఁ బడె నత్యాసన్నభావంబునన్.

1259


ఉ.

ఇంచుక గాలికిం జొరవ యీక దిగంతనభోంతరంబులన్
ముంచిన దైత్యుబాణములమొత్తము లేచిన నిచ్చఁ జోరు గా
వించుతెఱంగు లేమిఁ గపివీరులు ముందఱఁ గానరైరి వా
రించుతెఱంగు నేరక పొరింబొరిఁ గూలిరి వీతసత్త్వు లై.

1260


సీ.

పిడుగులొకో కావు పొడతేపు ఘనము లు, ల్కాసహస్రంబులో కావు ధరణి
[132]యడలదు కాలసర్పావళులొకొ కావు, పాతాళవివరంబు బయలుపడదు
ఖర మైనముక్కంటికంటిమంటలో కావు, జగదవసానంబుజాడ లేదు
కాలకూటార్చులో కావు [133]మందరగోత్ర, మానితాంభోరాశి గానఁబడదు
మొద లెఱుంగరాదు మునుకొని పుట్టిన, చొప్పు దెలియరాదు చూడ నెచట
నని కపీంద్రు లిట్టు లాజిఁ దల్లడ మంది, రింద్రజిత్తుతూపు లేపు మాప.

1261


వ.

అంతఁ బవనసుతాంగదనలనీలజాంబవత్పనసగజగవయగవాక్షగంధమాదనాది
కపియూథపోత్తములు శిలాపాదపశైలంబుల నాకాశంబు నిరవకాశంబు గావిం
చియు నతనిం గానరైరి వాఁడును వాని నన్నింటిని దుముఱు చేసియు నొంచియుఁ
బొడిచియు వ్రేసియు నేసియు మఱియు వానరకోటిదశకంబు గీటడించిన నిహ
న్యమానమానను లైనవనచరులు రామచంద్రుమఱువు సొచ్చుసమయంబున

ననిలదేవుండు సనుదెంచి యల్లన ని ట్లనియె.

1262


మ.

ఉరుసత్త్వుం డగువీఁడు మాయల నజయ్యుం డేరి కే నింక నాం
గిరసం బైనయమోఘబాణమున న్యాకృత్యం బెడం బాపు భూ
వర వాఁ డంతన కానవచ్చు ననుడున్ వైళంబ యారాఘవుం
డరుదారంగఁ దదస్త్ర మేసె విధిపూర్వాసక్తిగా నత్తఱిన్.

1263


క.

వనజాప్తాన్వయునస్త్రం, బునఁ గృత్యయు నొక్కమాత్రఁ బొలిసిన వేగం
బునఁ గానఁబడుచు దైత్యుఁడు, తనయరదముతోడ వచ్చి ధరపై నిలిచెన్.

1264


వ.

అంత.

1265


సీ.

అష్టాదశాస్త్రంబు లాగంధమాదను, పై నేసి తొమ్మిదిబాణములను
నలు నొంచి యేడుగోలల మైందు ద్వివిదునిఁ, గీలించి యైదింట నీలుఁ బొదివి
శతవలి మూటను [134]బొతము దప్పఁగఁ జేసి, గవయుఁ బండ్రెంటను గడఁక నొంచి
యేడింట నేడింట నేపున నందంద, గొనకొని కపులను గుదులు గ్రుచ్చి
డెప్పరంబు గాఁగ డెబ్బదిశరములు, నినిచె రామచంద్రుననుజుమేనఁ
బద్మజాండ మెల్లఁ బగులంగ నార్చుచు, మేఘనాదుఁ డిట్లు మెఱసి పోరె.

1266


శా.

ఉచ్ఛ్రాయత్వవిజృంభమాణదృఢచాపోన్ముక్తభల్లీకృతో
ద్యచ్ఛ్రీ నెంతయు మించి రాఘవ భుజాదర్పోద్య మన్యక్క్రియా
సచ్ఛ్రేయ:కుతుకంబునం బొలిచె [135]విశ్వవ్యాప్తిమద్భీమలో
లచ్ఛ్రుత్యధ్వసుదుస్సహధ్వనితలీలాభూతజీమూతుఁ డై.

1267


వ.

ఇట్లు కపివాహినీచక్షురంధీకరణపటువిశిఖాంధతమసంబు గావించిన.

1268


సీ.

హనుమంతుఁ డద్రియు నంగదుఁ డుపలంబు, శక్తి నీలుండును సర్జకంబు
నలుఁడు సుగ్రీవుండు నగపరంపరలును, జయశాలి యవ్విభీషణుఁడు గదయు
ననలుఁడు [136]ఘనపనసావనీరుహమును, సంపాతి తాలవృక్షమును నితర
కపియూథపులు మహాఖదిరాదితరువులు, సౌమిత్రి యినుమూఁడుసాయకములు
రామచంద్రుండు మూఁడునారాచములును, శరభజాంబవదాదులు శైలతరులు
నొక్కపరి విూఁద నడరింప నురుశరముల, నుఱక యన్నింటి రావణి నుఱుము సేసి.

1269


తే.

ఒలసి మేనులు నువ్వుగింజలకు నైనఁ, దెఱపి లేకుండ శరములు దీటుకొలిపి
ప్లవగచక్రము నంతయు బడలు పఱిచి, యేఁగి లంకకుఁ గ్రమ్మఱ నింద్రజిత్తు.

1270


క.

అంతయుఁ దన కెఱిఁగించిన, నెంతయు దశముఖుఁడు గినిసి యి ట్లనియె మహా
సంతాపదహనతప్త, స్వాంతోత్థితధూమజాలసాదితతనుఁ డై.

1271


చ.

కొలఁదికి మీఱువానరులఁ గూలిచి వచ్చితి నంచు నేపునం
బలుమఱుఁ జెప్పనేల నినుఁ బంపుట యూరక [137]వచ్చుచుంట కే

నిలుతురె నీ వెదుర్చునెడ నిర్జరు లాదిగఁ గ్రోఁతు లెంత మ
ర్త్యులయుసు ఱేమి చెప్ప వడిఁ ద్రుంపుము పొమ్ము జయించి ర మ్మొగిన్.

1272


మ.

అనిన రావణి తండ్రి వీడుకొని ము న్నాకుంభకర్ణాదివీ
రనికాయంబులు గూలె నింక ననిలో రాముం దదీయానుజున్
ఘనబాహాయుగశక్తి గెల్వఁగ నశక్యం బంచు మాయాబలం
బున నోడింపఁగ నుత్సహించి కదలెన్ భూరిప్రతాపంబునన్.

1273

ఇంద్రజిత్తు మాయాసీతను జంపుట

శా.

మాయాసీత నమర్చికొంచును మహామత్తద్విపేంద్రవ్రజా
శ్వీయస్యందనబృందభీమపలభుక్సేనైకసాహాయ్యక
ప్రాయుం డై కదలెం బ్రచేతసునిదిగ్భాగంబునం దంతలోఁ
బాయం జొచ్చిరి వానరుల్ భయపరిభ్రాంతాత్ము లై యత్తఱిన్.

1274


శా.

హేలోత్పాటితశైలుఁ డై యనిలజుం డేతేరఁగాఁ జూచి నీ
వేలా వచ్చెద వుద్ధతిం గపులతో నీజానకిం జూడుమా
యీలోలాక్షికతంబునం గలిగె మా కీపాట్లు ఖడ్గంబునన్
వే లీలం దల ద్రెవ్వ వ్రేసెద రణోర్విం బూజ యౌ నట్లుగన్.

1275


చ.

పులికడఁ జేరి యున్నమృగిపోలిక నశ్రులు గ్రమ్ముదేరఁగాఁ
దలఁకుచు హా రఘుప్రవర దారుణుఁ డై యిదె యింద్రజిత్తు న
న్నలయక చంపఁగాఁ దొడఁగె నాథ ననున్ విడిపించి కావఁగాఁ
దలఁపఁగదయ్య నాఁగ నతిదర్పితుఁ డై తల పట్టి యీడ్చినన్.

1276


చ.

అనిలజుఁ డంత ని ట్లనియె నాతని కోరి దురాత్మ యక్కటా
దనుజుఁడ వైన నేమి యతిదర్పమునన్ సతిఁ జంపఁగూడునే
యనయము విశ్రవస్సునకు నారయ మన్మఁడ వౌదు వెప్పుడుం
గనికర మేది దైత్యులకుఁ గట్టిఁడిధర్మ మెఱుంగవచ్చునే.

1277


మ.

అనుచుండం బ్రహసించి కై కొనక వాఁ డంకించి ఖడ్గంబునం
దునిమెం గైతవజానకీశిరము వే తూలంగ వాతూలనం
దన నీయేలిక యైనరామునకు నీతన్వీవధం బంతయుం
జని వేవే యెఱిఁగింపు మన్న విని నా సామీరి శోకార్తుఁ డై.

1278


వ.

ధైర్యం బవలంబించి పురోభాగంబున నక్షిగతుం డగుకృతాపరాధు నింద్రజిత్తు
నక్షిగతుంగాఁ దలంచి నలుదెసలం బఱచువనచరానీకంబు ననునయించి మర
ల్చినం దద్బలంబు గృతసన్నాహం బై మహీధరమహోపలమహీరుహాదిసనా
థం బై పరివేష్టింపం బవమానసూనుండు నొక్కమహాపాషాణంబు మేఘనాదు
నరదంబుపై వైవ సతండు మేఘనాదంబు ననుకరించుసింహనాదంబు సెలంగ
రథంబు తొలంగం బఱపి తప్పించిన నది నేలం బడినం గపిబలంబును బిరుసున

రాక్షసానీకంబుపైఁ బాదపాదివర్షంబులు గురిసినం జెదరి పఱచుచున్న నిజసై
న్యంబుదైన్యంబు మాన్చి రావణతనయుండు పరిఘపరశుపట్టిసప్రాసశూలముద్గ
రాదిసాధనంబులం గపులఁ గాందిశీకులం జేసె నంత నాంజనేయుం డలసి సొల
సినశాఖామృగేంద్రుల నివర్తించి వారల కి ట్లనియె.

1279


క.

మీ రేల యిచట నిలువఁగఁ, బో రేల నరేంద్రుకడకుఁ బోరేల విభుం
డేరీతిఁ జెప్పు జరపుద, మారీతిన యంచుఁ బోయి రట రావణియున్.

1280


ఉ.

నిఘ్నతతోడ వీరు కృతనిశ్చయు లై చని రింక నేను ని
ర్విఘ్నమున నికుంభిలఁ బ్రవీణత శత్రువినాశకృత్క్రియో
పఘ్నత హోమకృత్యము విభావముతో నొనరింతు నంచు జం
భఘ్ననిషూదనుం డరిగెఁ బ్రస్ఫురదర్కసమానతేజుఁ డై.

1281


ఆ.

ఆభిచారికక్రియారంభుఁడై వాఁడు, నురుతరార్చి వీతిహోత్రుఁ బ్రీతిఁ
బలలశోణితాదిబహువిధాహుతులచే, నమరఁ దృప్తుఁ జేయునవసరమున.

1282


సీ.

పశ్చిమదిగ్భాగబహుళనినాదంబు, విని రామచంద్రుండు వెఱఁగుపడుచు
ఋక్షనాయకుఁ బిల్చి యి ట్లను హనుమంతు, నకుఁ గీడు గల్గెనో నామనంబు
దలఁకెడు నీ వేఁగి దానిఁ దథ్యంబుగా, నరసి ర మ్మని పంప నాతఁ డపుడ
భల్లూకశతకోటిబలములతోఁ గూడి, పడమటి కరుగుచో నడుమఁ గనియె
వచ్చు వాయుసుతునిఁ జెచ్చెర నాతండు, నింద్రజిత్తుచేత లెల్లఁ జెప్పి
నేను రాఘవులకు నెఱిఁగించి వచ్చెద, నీవు గదలకుండు మిచట ననుచు.

1283


ఉ.

వచ్చుచునున్నవానిఁ గని వారిజబాంధవవంశసంభవుం
డిచ్చమెయిం దలంచె నిపు డీతనిచందము వేఱు గావునం
గ్రచ్చఱఁ గీడు చెప్ప నొకకర్జము దోఁచెడు నంచు నాతఁడుం
జెచ్చెర రావణాత్మజుఁడు సీత వధించినజాడ చెప్పినన్.

1284


ఉ.

అశనినిపాతఘోరతర మైననిజప్రియభామపాత మ
దశముఖసూతి చేసె నని తత్క్షణమాత్రమునన్ విచేష్టుఁ డై
దశరథరాజనందనుఁడు ధారుణిపైఁ బడి మూర్ఛ నొందె దు
ర్దశతనుఁ డై సమీరహతి వ్రాలినభూమిరుహంబుచాడ్పునన్.

1285


క.

హరిసేన వగలఁ బొగులఁగ, నెరియుచు లక్ష్మణుఁడు దుఃఖ మెడలింపంగా
నరుదెంచి తొడలమీఁదట, నిరవుగ రాఘవుని నునిచి యి ట్లని పలికెన్.

1286


ఉ.

సముచితధర్మవర్తనము సల్పుచు సత్యదృఢప్రతిజ్ఞ ను
త్తముఁ డగు నీకు నిట్టి వితతం బగుకీడు జనించె నక్కటా
యమలినధర్మమార్గము జయాస్పద మం డ్రది నేఁడు వైపరీ
త్యము నిటు లొందె సజ్జనుల కాపదలున్ సమకూఱె నీగతిన్.

1287


మ.

భజనీయం బనుచింత లేక మదిలోఁ బ్రాజ్యక్షమారాజ్యముం

ద్యజనీయంబుగఁ జేసి కాఱడవులం దద్భంగి వర్తింపఁగా
నిజ మై యాపురుషార్థముం గలుగునే నిక్కంబు కాదే పుర
స్థజగన్మానితవస్తువుల్ విడిచినన్ సౌఖ్యంబు సిద్ధించునే.

1288


క.

ధనహీనుఁ డైనపురుషున, కనయముఁ జెడుఁ గార్యసిద్ధు లన్నియు గ్రీష్మం
బున సెలయేఱులక్రియ బహు, ధనుఁ డైన నభీష్టసిద్ధి తథ్యమ పొందున్.

1289


సీ.

ఆతండె పురుషుండు నతిగుణాన్వితుఁడును, భాగ్యవంతుండును బండితుండు
సర్వసంపన్నుండు సరసుండుఁ గులజుండు, శూరుం డుదారుండు సువ్రతుండు
మాననీయుండును మహితచారిత్రుండుఁ, బ్రాజ్యుండు జగదేకపూజ్యతముఁడు
సకలకలావంతుఁ డకలంకమతిశాలి, రూపింపఁగా శుభరూపయుతుఁడు
మిత్రు లతనికి బంధులు [138]మేటిసఖులు, ఘనయశఃఖ్యాతిబలధర్మకామములును
బరమసౌఖ్యంబు లుపభోగభవ్యములును, ధనికుఁ డెవ్వఁడు మిక్కిలి ధరణిలోన.

1290


క.

ఎదిరికి వచ్చినరాజ్యము, మదిమది నటు గోలుపోయి మానము దూలం
జదు రేది కాననమునకు, ముదమునఁ జనుదెంచుకంటె మోసము గలదే.

1291


వ.

అది య ట్లుండె.

1292


మ.

నికృతిప్రోద్ధతుఁ డైనరావణునకున్ నీచేతఁ జా కుండ న
త్యకలంకం బగుసచ్చరిత్రమున నిత్యాసక్త యై యున్నజా
నకికిం గూడనిచావు గల్గె నవసానం బైనఁ దప్పింప నే
రికి శక్యంబును గాదు దైవఘటనారిష్టంబు సామాన్యమే.

1293


క.

అనుచును శోకావేశం, బునఁ బొగులుచు లక్ష్మణుండు భూపుత్రియెడం
బెనువగలఁ బొందురఘుపతి, సమునయమునఁ దేర్చుచున్న యాసమయమునన్.

1294


శా.

కాలోత్తాలపయోదమధ్యగతశక్రస్పర్ధి యై సాహసా
భీలాస్త్రాశను లేఁగుదేర నడుమం బెంపారుమత్తద్విప
శ్రీలీలన్ దశకంధరానుజుఁడు వచ్చెన్ రాఘవుం గానఁగాఁ
బ్రాలేయాంచితపద్మతుల్యవిగళద్బాష్పాంబుసిక్తాననున్.

1295


చ.

కని యది యేమియో యనుచుఁ గారణ మారయఁగాఁ దలంచి చ
య్యన నరుదెంచి రాఘవనరాధిపుచంద మెఱుంగ వేఁడి య
ల్లన తను వంతతో నడుగ లక్ష్మణుఁ డి ట్లను నింద్రజిత్తు దా
ననిమొన సీతఁ జంపె నని యాహనుమంతుఁడు చెప్పె నావుడున్.

1296


శా.

భూనాథోత్తమ సీతచా వరయఁగా బొం కౌట తథ్యంబు మా
యానిష్ణాతుఁడు మేఘనాదుఁ డనపాయప్రౌఢిఁ దా హోమతం

త్రానూనత్వము నిర్వహింపఁగ నుపాయం బిట్టు చింతించె దే
వా నాప ల్కిది నమ్ము ధీరునకు నీ వంతం బడం బోలునే.

1297


క.

కావున వేలిమి విఘ్నము, గావింపఁగ వలయుఁ గపినికాయము నెల్లన్
రావించి వేగ పనుపుము, భూవల్లభ తడవుసేఁత పోల దరయఁగన్.

1298


శా.

గృద్ధోలూకగరుత్సమీరవిచలత్కేతువ్రజంబున్ గల
త్వధ్రిచ్ఛేదవివల్గనోద్ధతహయవ్రాతంబు దైన్యోపసీ
దద్ధ్రస్వీభవదార్ద్రదానజలమాతంగంబు గాఁ బోరిలో
సధ్రీచీనతఁ దాల్పఁగాఁ బనుపుమీ సౌమిత్రితో సైన్యముల్.

1299


చ.

గొనకొని హోమకృత్యము నికుంభిలయం దొనరించు చున్నయ
ద్దనుజునిఁ గూల్ప లక్ష్మణు నుదగ్రతఁ బంపుము వేగవత్కన
త్కనకమనోజ్ఞపుంఖశరతాడితుఁ జేయుఁ బ్రచండమూర్తి యై
మొనసి నఖంబులన్ హరి సముద్ధతి మై గరిఁ ద్రుంచుచాడ్పునన్.

1300


మ.

వినుమా రాఘవ దాశకంఠి మును దోర్వీర్యం బఖర్వంబుగా
నొనరింపంగఁ దలంచి చేసెఁ దప మత్యుగ్రంబుగా దాన మె
[139]చ్చినవాఁ డై సరసీజయోని వెస నిచ్చెం గామగాశ్వంబు లిం
పొనరన్ బ్రహ్మశిరోస్త్రముం దగ నజయ్యుం డేరికిం బోరులన్.

1301


ఉ.

కీశచమూసమేతముగఁ గింకను లక్ష్మణుఁ డాజిలోన నా
కీశనిషూదనుం గదిసి యేపునఁ దూపులపాలు చేయఁ గీ
నాశనివేశనంబునకు నమ్మిన కాఁ పగుపంక్తికంఠుఁడున్
నీశరవృష్టి నీల్గు నిది నిక్కము గాఁగఁ దలంపు మాత్మలోన్.

1302


వ.

అనిన విని దశరథనందనాగ్రజుం డనుజున కి ట్లనియె.

1303


చ.

అరయఁగ మేఘమండలమునందుఁ దిరోహితుఁ డైనభానుతో
నొరయుచు మాయలం దనరి యుద్ధము సల్పెడు మేఘనాదుతో
దొరయఁగ లేరు దిక్పతులు దోర్బల మొప్పఁగ నీవు వాని ను
ద్ధురతరసాయకావలులఁ ద్రుంచి వధింపుము తెంపుపెంపునన్.

1304


చ.

జయ మొసఁగున్ రమావరుఁడు శంకరుఁడున్ సుఖ మిచ్చు నగ్నియున్
నియతము దేజ మొప్పఁ గరుణించుఁ జిరాయురుపేతుఁ జేయు బ్ర
హ్మయు నని పెక్కుదీవనల నాపతి తమ్ముని గారవించె వే
డ్కయుఁ గృపతోడినెయ్యము బెడంగున ముప్పిరి గాఁగ నెంతయున్.

1305


మ.

హరుచాపం బనఁ బోలువిల్లు నశనివ్యాఘాతబృందంబుతో
సరిఁ జేయం దగుసాయకంబులు నుదంచద్భీమనక్తంచరో
త్కరముం గూలుపఁ జాలుఖడ్గము సముద్యద్వజ్రసంఘాతభా

స్వరసారం బగుజోడుఁ దాల్చి తనరెన్ సౌమిత్రి చూడం గడున్.

1306


మ.

అనపాయం బగురామచంద్రునియమోఘాశీర్వచోవిభ్రమం
బున నత్యంతముఁ దేజరిల్లుచు మహాభూరిప్రతాపంబుచే
ఘనుఁ డై శారదచండభానుకరణిం గ్రవ్యాదసేనాతమో
హననుం డై కపివక్త్రపద్మములకున్ హర్షంబుఁ బెంపారఁగన్.

1307


ఉ.

అన్నకు మ్రొక్కి నిల్చి వినయంబున రాఘవునాజ్ఞ నెంతయుం
బ్రన్ననయించి విష్ణుఁడు సుపర్ణుని నెక్కినమాడ్కి వేడ్కతోఁ
బన్నుగ వాయుసూతిపయి భాతిఁ దనర్చుచు లక్ష్మణుండు మే
రూన్నతశృంగదేశమున నొప్పుమృగేంద్రునిఁ గ్రేణి సేయుచున్.

1308

లక్ష్మణుఁడు వానరసైన్యముతో నికుంభీలకుఁ బోవుట

క.

కదలె రభసమున ధర గ్ర, క్క దలఁగ శేషుండు [140]శిరము లల్లన వంపం
బదిలంబులేక కూర్మము, చదికిలఁబడ దిగ్గజములు సరి మ్రొగ్గతిలన్.

1309


క.

గోలాంగూలబలంబులు, నాలము లల్లార్ప జాంబవత్ప్రముఖమహా
భీలతరభల్లయూథము, కోలాహల మొదవఁ గదలెఁ గోటులసంఖ్యల్.

1310


క.

చటులతరసమయజయలం, పటపటుతరబాహుదండభాసురశైలో
త్కటకోటికూటపాటన, నటనం బొనరంగఁ గదలె నగచరబలముల్.

1311


క.

శుండాలసములును దటి, న్మండలనిభు లైనఋక్షనగచరవీరుల్
మెండుగఁ గదలిరి కాటుక, కొండలలోఁ గలయుపసిఁడికొండ లనంగన్.

1312


తే.

ఉగ్రవేగులు ముప్పదియోజనములు, నొక్కనిమిషంబులోపల నుక్కు మిగిలి
కదియఁ దరువులు వడిఁ జాఁప కట్టువడియెఁ, బాదఘట్టనఁ బొడి యయ్యెఁ బర్వతములు.


వ.

అంత.

1313


సీ.

ధీరసత్త్వంబుల దిగ్గజంబుల కైన, సిగ్గు పుట్టించెడిసింధురములు
గతివిశేషంబుల శతమఖుతురగంబుఁ, దలవంపఁ జేయుసైంధవగణంబుఁ
జటులజవంబునఁ జండభానునితేరు, సరకు సేయనిమహాస్యందనములు
భూరిపరాక్రమంబున సింహములతెంపు, కలిమి మెచ్చనియట్టికాల్బలంబు
బృంహితంబులు హేషలుఁ బృథులనేమి, సింహనాదంబు లందంద సెలఁగ ఘోర
సమరసన్నద్ధ మైనరాక్షసబలంబు, రమణ ముందటఁ బొడగాంచె రాజసుతుఁడు.

1314


క.

వడిఁ దఱిమికొనుచు నదియును, నడతెంచెన్ వెల్లివిరిసి నాదము లెసఁగన్
జడనిధులు మీఱి కపులను, సుడిగొలుపుచు నసమసమరశుంభద్గతి యై.

1315


చ.

దరువులుఁ గొండలుం బెఱికి దారుణభంగి నిశాటకోటి పైఁ
గురిసిరి వానరాధిపులు కుప్పలుగా నట రాక్షసాలియుం
బరశుగదాస్త్రముద్గరకృపాణములన్ వడి మర్కటేంద్రులం

బొరిఁ గడవంగఁ జొచ్చె సురబృందము లుబ్బుచు స్రుక్కుచుండఁగన్.

1316


చ.

అదలుపులం బ్రచండ మగునార్పుల లంకయు నీవలావ లై
కదలినభంగిఁ దోఁపఁ బరిఘంబుల నీఁటెల ముద్గరంబులన్
గదలను భిండివాలముల గ్రక్కునఁ గూర్చుచు వాఁడితూపులన్
గుదులుగ గ్రుచ్చె నాదితిజకోటి వనాటులఁ జేటుపాటుగన్.

1317


ఉ.

గ్రక్కున వానరాధిపులు గర్వమునం దమలావుపెంపున
న్లెక్క యొకింతలేక యతినిష్ఠురతం గడకాళ్లు పట్టి యే
దిక్కునఁ దార యై చదలఁ ద్రిప్పుచు వీచి వధించి రేపునన్
ముక్కులఁ గన్నులం జెవుల మోముల నెత్తురు లొల్క దైత్యులన్.

1318


శా.

ఖేలద్విక్రమ మైనదైత్యబలముం గీశావలిం గిన్కతోఁ
గేలన్ వ్రేయుచుఁ దూపు లంగములలోఁ గీలించుచుం దెంపునం
గాలన్ మట్టుచు నిట్టు నట్టుఁ గదలం గా నీక యుద్వృత్తిఁ గీ
లాలంబుల్ దొరఁగంగ నొక్కవడి నేలం గూల్చెఁ బెల్లార్చుచున్.

1319


క.

ఎరగలి యెండినయడవుల, దరికొనుచందంబు మిగుల దర్పము పెరుఁగన్
హరిసేన గడఁగి దైత్యులఁ, బొరిమార్పఁగఁ జొచ్చె ముష్టి భూరుహగిరులన్.

1320


ఆ.

శైలతటము దాఁకి సలిలప్రవాహంబు, మిగులజవము దక్కి మగిడి పాఱు
కరణి దైత్యబలము కపినికాయంబుతోఁ, దెగువఁ బొడిచి యోడి తిరిగి చనిన.

1321


చ.

పదిలముతోడ నాహుతులు పావకులో హరివైరి నూటతొ
మ్మిది దగ వేల్చి యంతటను మిక్కుట మై కపు లేఁగుదెంచినం
బదరుచు స్రుక్స్రువంబు లటు పాఱఁగ వైచి రథంబుపై రణో
న్మదసముదగ్రవృత్తి నురుమాయుఁడు నిల్చెఁ బ్రతాప మేర్పడన్.

1322


సీ.

కోపంబు గదిరిన గొలుముల కెన యైన, కన్నుల నిప్పులు గడలుకొనఁగ
మెఱుఁగారుకోఱల మించులు గదురంగ, నతిభీషణంబుగా నవుడు గఱచి
పెనుపొందఁగా మృత్యుభీషణభ్రూలతా, విభ్రమం బగుచున్నవిల్లు దాల్చి
కడఁగి కాలాంతకుకడగంటిచూడ్కులఁ, దలఁపించుశరములదర్ప మెసఁగ
గుణవిరావంబు లెల్లదిక్కులను నిండ, బద్మజాండంబు నొక్కటఁ బగుల నడువ
రౌద్రమున వచ్చునయ్యాదిరుద్రుఁ డనఁగ, నిట్టు లేతెంచె నేడ్తెఱ నింద్రజిత్తు.

1323


వ.

వచ్చి తోరంబు లగుశరాసారంబుల రోదోంతరంబు నీరంధ్రంబు గావించి
కపిసేనకుం గవిసి.

1324


ఉ.

కట్టలుకం బ్రచండతరకాండము లొక్కొకనందు నేవునం
గట్టలు గాఁగ నేసి తమకం బొదవం గడుదుర్నివారుఁ డై
చట్టలు చీరియుం దొడలు చక్కులు చేసియుఁ జెండి వైచియుం
బొట్టలు సించియు మెడలు బోరనఁ ద్రుంచియుఁ బో రొనర్పఁగన్.

1325

వ.

అయ్యవసరంబున ననిలనందనుం డొక్కమహామహీధరంబు వెఱికి కదిసి దా
నవులం జదుపుచు వ్రేయుచుఁ బడలుపఱుచుచుం గసిమసంగి బారిసమరునప్పు
డు గినిసి యొక్కమొగిం జుట్టుముట్టి శూలపరశుకరవాలపట్టిసప్రాసపరిఘభిండి
వాలచక్రశరముష్టికరతలప్రహారంబుల నొప్పించిన నవి గైకొనక వారల సమ
యించుచున్నం గని మేఘనాదుం డాంజనేయున కభిముఖుం డై తనసారథి నర
దంబు వఱప నియోగించిన వాఁడు నట్ల చేయ నిజానుజాక్షవధంబు దలంచి బహు
విధాయుధంబులు పరఁగించి క్రమ్మఱి యవశిష్టం బగుహోమంబు సంపూర్ణంబు
సేయం దలంచి యరిగిన నెఱింగి విభీషణుండు సౌమిత్రి నచటికిం దోడ్కొనిపోయి
వానిహోమంబు సూపి యి ట్లనియె.

1326


సీ.

మున్ను వీఁ డిచ్చోన మునుకొని హోమంబు, సలిపి భూతములకు బలుల నొసఁగి
సంప్రాప్తకాముఁడై సంగ్రామమున నదృ, శ్యాకారుఁడై పేర్చి యమరనాథు
నోడించెఁ బలుమాఱు నోలి దిగీశుల, తోన కావునఁ గడుదుర్జయుండ
యిదె కంటె యిప్పుడు నీహుతాశనులోన, నరుదార వెడలెడి నురురథంబు
రక్తలోచనాంగరాగమాల్యాంబర, కవచములును నసితకాయుఁ డైన
సూతుతోడ రక్తసురుచిరాశ్వములతో, [141]నగ్నివర్ణభాతి ననుకరించి.

1327


ఉ.

ఈరథ మెక్కి వీఁడు రణ మేపునఁ జేయఁగ వచ్చెనేని బృం
దారకనాథముఖ్య లగుదానవవైరులు నిల్చి గెల్వఁగా
లే రది గావునన్ నృపనిలింపకులాధిప యింతలోన నీ
ఘోరశరాబ్ధి ముంచి వడి గూల్పుము విక్రమ మొప్ప నావుడున్.

1328


చ.

ప్రణుతపరాక్రమార్కుఁ డగు రాజకుమారమృగేంద్రుఁ డవ్విభీ
షణుపలు కంతయున్ విని ససారశరాసనచారుశింజినీ
రణనముచేత రోదసి విరావము నొందఁగ దిక్తటాత్తవా
రణములు మ్రొగ్గతిల్లఁగ ధరావలయంబు వడంకునట్లుగన్.

1329


వ.

నిశితప్రచండకాండసహస్రంబులు పరగించి యాహ్వానంబు సేసినం బరిత్యక్త
హోమవిధికలాపుం డై.

1330


ఆ.

అంత నగ్నివర్ణ మయినరథం బెక్కి, ఘోరుఁ డైనయంతకుండపోలె
నరుగుదెంచి పలికె నవ్విభీషణుఁ గాంచి, యింద్రజిత్తు రోష మినుమడింప.

1331


క.

పినతండ్రి వయ్యు నక్కట, కనికర మొకయింత లేక కడఁగి వధింపం
బనిచెదవు మానవాధము, నను గెలువఁగ వశమె దేవనాథున కయినన్.

1332


క.

పొం దైనబంధువర్గము, పొం దొల్లక యన్నతోడిపొత్తు విడిచి చే
రం దగనిమనుజుఁ జేరుట, నిందకు నొడికట్టి తీవు నీచచరిత్రా.

1333


వ.

అనిన నప్పలుకులు విని విభీషణుం డతని కి ట్లనియె.

1334

చ.

పరులధనంబు కొంచుఁ బరభామలఁ బట్టుచు విప్రులన్ మునీ
శ్వరుల వధించుచుం ద్రిదశవర్గముతోడుత విగ్రహించుచుం
గరుణ యొకింత లేనిదశకంఠుని చెయ్వులఁ జేసి నామనం
బెరియుచునుండ నిఫ్డు ధరణీశ్వరు రాఘవు నాశ్రయించితిన్.

1335


చ.

నిను వధియించు లక్ష్మణుఁడు నీ వెట కేఁగెద వింక నోరి నీ
కును నిటఁ దొంటికైవడి నికుంభిలకుం జొరరాదు మిన్ను సొ
చ్చిన జలరాశిలోపల వసించిన దిక్కులయందు డాఁగినన్
వెనుకన వచ్చి కూల్చు నృపవీరునిబాణ మమోఘ మై వెసన్.

1336


వ.

అనినఁ బంక్తికంధరనందనుండు గినిసి యి ట్లనియె.

1337


చ.

నమలెదఁ గాలమృత్యువును నామ మడంగఁగఁ బట్టి కాళ్లచేఁ
జమరెద బాడబానలముఁ జండత భైరవు రూపుమాపెదన్
సమయఁగఁ జేసెదన్ విబుధసంఘము నెల్ల నవక్రవిక్రమ
క్రమమున భద్రకాళిఁ గడకాలన మట్టెద నొక్కవ్రేల్మిడిన్.

1338


ఉ.

పంతముతోడ దిక్కరులఁ బన్నుగఁ జేతులఁ బట్టి తాఁకులా
డింతునె యేడువార్ధులఁ గడిందిమగంటిమిఁ జొచ్చి రొంపి గా
వింతునె నింగియున్ భువియు వేడుకఁ దాళము చేసి బిట్టు వా
యింతునె కొంకు లేక వడి నీభువనంబులు మ్రింగిపుత్తునే.

1339


శా.

ఓహో చాలును బెక్కుపంతములు శౌర్యోద్వృత్తిమై నున్ననా
బాహాసత్త్వము నీకుఁ గానఁబడఁగా బాణావలిన్ వానర
వ్యూహంబుం బొలియించి రామువిజయోద్యోగంబు మాయించెదన్
హాహాకారము పుట్టఁజేసెద నిలింపాధీశలోకంబునన్.

1340

ఇంద్రజిల్లక్ష్మణులయుద్ధము

మ.

అనుచుఁ జేరఁగ వచ్చి లక్ష్మణ వృథాయాసంబు నీ కేల వే
చను మెచ్చోటికి నైన నీతరమె దోస్సారంబునం బోరఁగా
నను ము న్నీవు నెఱుంగు దారయఁగ నానాగాస్త్రపాశంబు లే
పున బంధించిన వన్నియున్ మఱచితే మోహంబునం గల్గెనే.

1341


క.

నాకార్ముకముక్తము లై, భీకరబాణములు నిన్నుఁ బిడుగులుఁబోలెన్
వేకూల్చి తనివి సల్పుం, గాకోలూకోగ్రజంబుకంబుల కాజిన్.

1342


క.

అన విని లక్ష్మణుఁ డి ట్లను, గనునట్లుగ నెదురు నిల్వఁగా లేక మమున్
గనుమొఱఁగి పాడి దప్పుచు, నని చేసిన నిన్ను శూరుఁ డండ్రే చెపుమా.

1343


క.

ఉరుబలుఁడ వయ్యుఁ దస్కర, చరితంబునఁ బొడిచి తీవు చటులాస్త్రమునన్
ధరఁ గూల్తు నిన్ను ననవుడు, నరుదెంచి యుదంచితాట్టహాసం బొదవన్.

1344


క.

కోపంబు గదుర దృఢతర, చాపము తెగనిండఁ దిగిచి శరములు గురియన్

భూపసుతుఁ గాఁడి మఱియును, నేపున ధరఁ జొచ్చి చనియె నెంతయు వడితోన్.

1345


వ.

మఱియు మూఁ డేసి యంతం బోవక నిశితశరపరంపరలు నిగిడింప నవియు నత
నియంగంబులందుల శోణితంబునం దడియక భూవివరంబు సొచ్చె నంత రుధిర
ధారాసిక్తాంగుం డై సధాతునిర్ఝరం బైనధరాధరంబునుంబోలె సౌమిత్రి సక్రో
ధుం డై చండభానుని కెదురు మండునట్టి నిశితకాండంబున వానివక్షంబు గాఁడ
నేసిన రుధిరోద్గారం బొదవ మూర్ఛిల్లి యంతన తెలిసి.

1346


మ.

రభసోదంచితిసింహనాదము ధనుర్జ్యారావమున్ వజ్రస
న్నిభబాణౌఘవిఘట్టనధ్వనితమున్ నీరంధ్ర మై కల్పసం
క్షుభితోదగ్ర[142]తరాంతకప్రహసితక్రూరక్రమం బై వెసన్
నభమున్ దిక్కులు భూమియుం బగిలెనో నాగం బ్రవర్తిల్లఁగన్.

1347


ఉ.

లావును విక్రమంబును బలంబును బీరము నొప్పఁ దేజముం
జేవయు మత్సరంబుఁ దమచిత్తముకింకయు నొక్కరూపుగా
రావణుకూర్మినందనుఁడు రాఘవుతమ్ముఁడుఁ బోరి రుగ్రసం
భావనతోడ బాణశతపాటితవిహ్వలితోరుగాత్రు లై.

1348


చ.

అరయ ననూన మైనవిజయంబుఁ బరాజయమున్ సమంబు లై
పరువడితోడ నివ్వటిల భానుకులుండును దాశకంఠియుం
దిర మగుసత్ప్రభుత్వమున ధీరత నొచ్చెము లేమిఁ జెందుచున్
సరసిజమిత్రుచందమును జందురుచందముఁ దాల్చి రెంతయున్.

1349


సీ.

పెనుమంచు గవిసిన మునిఁగి కానఁగరాని, భూధరంబులతోడి పోల్కి గలిగి
మిగులదట్టము లైన మేఘమండలముల, నడిమి చంద్రార్కులకబెడఁగు గలిగి
ప్రథితమహాయసపంజరంబులలోని, వరమృగేంద్రంబులకరణి గలిగి
యొగిఁ బ్రమాదంబున [143]నోదంబులోఁ జిక్కు, సామజంబులతోడి సాటి గలిగి
దశరథాత్మజుండు దశకంఠసూనుండు, మొగిఁ బరస్పరాస్త్రములను జేసి
యతితిరోహితాంగులై తమస్సంఛన్న, పరపదార్థము లనఁ బఱపు దక్కి.

1350


వ.

మఱియును.

1351


క.

ధీరోద్ధతు లురుగర్జా, ధారులు నరదైత్య రాజతనయులు బాణా
సారములు దఱిమి కురియుచు, ధారాధరము లనఁగా నుదారక్రము లై.

1352


క.

రవికిరణంబులు దూఱక, పవనునకుం జొరవ లేక బాణావలిచే
నవిరళతిమిరము గవిసెను, భువనోదర మెల్ల నిండఁ బృథుసంచర మై.

1353


మ.

బలగర్వంబుల వీఁడు లోకములకుం బాటిల్లుహృచ్ఛూల మై
బలభిద్భేదము సేసె వీనిఁ దగ నీబాణానలోగ్రార్చులన్
శలభప్రక్రియ నీఱు సేయు మని కీశవ్రాతముల్ పెక్కుభం

గుల దీవించిరి రాఘవానుజు బలోగ్రున్ వీరచూడామణిన్.

1354


క.

బాహాసారము నురుస, న్నాహంబును జాపనైపుణంబును విజయో
త్సాహంబు మెఱయ లక్ష్మణుఁ, డాహవమునఁ దేజరిల్లు నర్కుఁడుఁబోలెన్.

1355


సీ.

చెలువారు జయలక్ష్మి చేయూతగాఁ దగు, విలసితకార్ముక మలవరించి
విక్రమశ్రీకంఠవిపులగుణం బైన, గొనయంబు [144]సారణంబును నొనర్చి
నీరంధ్రసాంద్ర [145]మౌ ధీరనాదంబునఁ, దిగిచి కర్ణాంతంబు తెగకుఁ దార్చి
పుంఖానుపుంఖ మై పొరిఁ దమయంతన, వెడలె నా నర్చుల వింటఁ బేర్చి
వడి రసాతలభాగంబు వెడలి వచ్చి, కడిఁగి కన్నుల విషములు గ్రక్కునట్టి
కాలభీషణభుజగులకంటె బెడిద, మైనతూపులు సౌమిత్రి పూని యేసె.

1356


చ.

గిరిశుఁడు నంధకాసుగుఁడుఁ గేసరియున్ మదసింధురంబు నా
హరియును వృత్రుఁడున్ ఖగకులాధిపుఁడున్ భుజగంబు నేపుతో
నురవడిఁ బోరుచందమున నుద్ధతవిక్రము డైన మేదినీ
శ్వరతనయుండు దైత్యకులపర్యతనూజుఁడుఁ బోరి రుగ్రతన్.

1357


లయ.

చండతరసారవినుతుం డగుసమీరతనయుండు ఫణిరాజభుజదండములు గ్రాలన్
మెండుకొని రక్కసులగుండె లగలం బొడిచి కొండలను మ్రాఁకులను నిండఁ బడఁగా ను
ద్దండముగ గీటడఁచి దండి గలదానవుల నొండెడకుఁ బాఱఁ గని చెండి తనసత్త్వో
చ్చండిమకు సాటిగ నఖండరణవిక్రముఁడు చండకరుభంగి నరిచండుఁ డయి క్రాలెన్.

1358


చ.

మఱియు విభీషణుండు దనమంత్రులుఁ దానును గూడి నేపునం
దఱిమి నిశాతహేతివితతస్ఫురదస్త్రము లేసి దైత్యులన్
నుఱుముచు రూపుమాపుచును నొంచుచుఁ ద్రుంచుచుఁ బేర్చి కంఠముల్
నఱకుచు నొక్కపెట్టను రణంబునఁ గూల్చె నుదగ్రమూర్తి యై.

1359


ఆ.

ఇంద్రజిత్తు ముంప నెంతయుఁ గోపించి, యతనిమీఁద వాఁడు వితతశరము
లేసి వాయుసూను నేపున నొప్పించి, చిత్రగతుల రాజపుత్రు నొంచె.

1360


వ.

సౌమిత్రియు నమిత్రకులనిషూదనంబు లగుశరంబుల నతనికాండంబుల ఖండిం
చుచు నర్ధచంద్రాననంబు లగుశిలీముఖంబుల వానికార్ముకంబు దునిమి దశవిశి
ఖంబుల నురస్స్థలి గాఁడ నేసి చటులజవంబు లగుఘోటకంబులం జతుశ్శరంబుల
నొప్పించి యభ్రంకషం బగు కేతనంబు పంచసాయకంబుల నఱికి యొక్కశరం

బున సూతుశిరంబు డొల్ల నేసి సింహనాదంబు సెలంగించిన నవ్వీరుండు పొలి
వోనివిక్రమంబున నాక్రమించి తాన సారథ్యంబునుం బ్రవర్తించుచు నుల్కాస
మానంబు లైనశరంబులు కోపంబున నతనిమేనఁ గీలుకొల్పిన నమ్మేటిమగం
డు గండుమిగిలి ఘోరనారాచధారాసారంబులు గాఢంబుగా నో నేసిన వాఁడు
సొమ్మసిల్లి యంతన తెలిసి యాత్మగతంబున.

1361


చ.

హరి ననలుం గృతాంతు దనుజాధిపు నవ్వరుణున్ సమీరుఁ గి
న్నరవరు నీశ్వరున్ బహురణంబుల గెల్చితి నోట లేక యి
న్నరుఁ డిటు నన్ను నొంచెడు ఘనంబుగఁ దూపులఁ గాల మెవ్వరుం
దిరుగఁగఁ బెట్ట లేరు విధిత్రిప్పులు [146]దప్పి చనంగ నేర్చునే.

1362


ఆ.

అనుచు నాత్మలోన నచ్చెరు వందుచుఁ దనబలావసానమునకు వగచి
నిగుడుకోపమునను నిట్టూర్పు లెగయఁగ, నెఱఁకు లాడ నేసె మఱియు నతఁడు.

1363


సీ.

కడువాఁడితూపులఁ గడఁగి విభీషణు, ఘనలలాటస్థలి గాఁడ నేసి
నిశితాగ్ర మై యున్నవిశిఖంబు గొని రాజ, పుత్రునురం బుచ్చి పోవ నేసి
నెఱిమూఁట మూఁటఁ గ్రమ్మఱ వారి నొంచి వా, తూలనందను నటు తూలఁ జేసి
నింగియుఁ బుడమియు నిశితాస్త్రముల నించి, యేదిక్కుఁ దానయై యెదురు లేక
ప్రల్లదంబున బ్రహ్మాండభాండ మెల్లఁ, బగుల నార్చిన దశకంఠుపట్టి వక్ష
[147]మేనుదూపుల లక్ష్మణుఁ డెగువ నేసె, సోలి యాలోన తెలివొంది శూరవరుఁడు.

1364


క.

నాగాస్త్ర మింద్రజిత్తు ప్రయోగింప నుదగ్రవిక్రమోద్ధతశత్రు
ప్రాగల్భ్యము సైరింపక, సాగరగంభీరఘోష సమనాదుం డై.

1365


ఉ.

కాలవిలోలదీర్ఘతరకాయము లై విగళన్మహావిష
జ్వాలలతోడి ధూమములు వావిరి దిక్కుల నెల్లఁ బర్వఁగా
నాలుక లోలిఁ గ్రోయుచు ఘనస్ఫుటనిశ్శ్వసితానలంబులం
దూలిచె దేవయానములఁ దోరము లైనభుజంగసంఘముల్.

1366


క.

గరుడాస్త్ర మంత నురవడి, నరనాయకతనయుఁ డేసె నానాస్త్రమహా
స్ఫురణంబు దూలి పోవఁగ, దరహసితము మోముదమ్మిఁ దళుకొ త్తంగన్.

1367


సీ.

పక్షవిక్షేపజపవనవేగంబున, విఱిగి వృక్షంబులు వెనుకఁ దూలఁ
దోయధిసలిలంబు పాయ యిచ్చినయంత, ఫణిరాజలోకంబు బయలుపడఁగ
గ్రహమండలముఁ దారకాచక్రమును దమ, గతి దప్పి విభ్రాంతిఁ గలఁగి పఱవఁ
దునుక లై చెదరిన తోయదంబులతోన, దివిజయానంబులు దిరుగువడఁగ
ఖరము లగుమహానఖరముల ముక్కులఁ
జీరి పొడిచి బిట్టు చించి త్రుంచి
యక్కజంబు గాఁగ నహిసమూహము నెల్ల

సమయఁజేసె విహగసముదయంబు.

1368


తే.

అమరవైరియు నటు కుబేరాస్త్ర మేయ, భానుకులదీపకుఁడు యామ్యకబాణ మేసె
నడరి దివ్యశరంబులు నసుర వఱవఁ, బ్రతిశరంబుల నతఁడును బరిహరించె.

1369


శా.

చాపాభ్యాసవిశేష మిం పొదవ నుత్సాహంబు నాయోధనా
టోపంబుం జలము నిలింపతతిచూడ్కుల్ చూఱపట్టన్ జయ
వ్యాపారంబుల మించి యొండొరులదివ్యాస్త్రంబులం ద్రుంచుచుం
గోపం బారగఁ బోరి రిద్దఱును దిక్కూలంకషధ్వాను లై.

1370


ఉ.

పెల్లుగఁ బెద్దసేపు రణభీషణలీలఁ జెమర్చి డస్సియు
న్బల్లిదుఁ డైన రాజవరనందనుపై రణతాంతి మాన్పఁగా
ఫుల్లసరోజగంధముల పొత్తు వహించుచు గంధవాహుఁడుం
జల్లఁదనంబు మీఁద వెదక చల్లుచు నింపుగ వీచె మెల్పునన్.

1371


శా.

వి ల్లాకర్ణముగా వెసం దిగిచి మౌర్వీరావ మేపారఁగా
భల్లంబుల్ పరఁగించి రోష మొదవన్ బ్రహ్మాండభాండంబు భే
దిల్లన్ బెట్టగ నార్చి పేర్చి ప్రళయోద్వృత్తాంతకాకారుఁ డై
మొల్లం బైనబలంబునం బొలిచె [148]సమ్మూర్ఛత్ప్రతాపంబునన్.

1372


సీ.

కడఁగి కానన మేర్చుకార్చిచ్చుకైవడి, మిగుల నుద్దతిఁ దనమేను వెంచి
జయలక్ష్మివిహరణరశైలంబు లన నొప్పు, గలయంసములు దలకడచి పెరుఁగ
మేరుసారం బగుమేటిచాపము దాల్చి, శక్రుచేఁ గొన్నయస్త్రంబు దొడిగి
మూఁడులోకము లింక మోదించుఁ గావుత, మని పల్కి మఱియును మనములోన
రామచంద్రుండు సద్ధర్మరతుఁడయేని, సీత సుచరిత్ర సాధుత్వశీలయేని
వెలయ దైవంబుకృప నాకుఁ గలిగెనేని, యిది మహేంద్రాదిసురులకు హితమయేని.

1373


క.

అని దశరథభూవరనం, దనుఁ డేకాగ్రతఁ దనర్చి దర్పం బెసఁగం
దనదృష్టి రాక్షసేంద్రుని, తనయునిపై నిలిపి యేసెఁ దచ్ఛరవరమున్.

1374


వ.

అదియును నిర్ఘాతసంఘాతపాతభయానకం బై ప్రచండచండకరశతావిర్భావం బై
మణిచిత్రితపుంఖప్రభామండలమండితం బయి సుపర్ణోదీర్ణతూర్ణం బై ప్రళయ
దహనదాహావహంబై మహావిషోదగ్రభుజంగరాజభీషణం బై యనేకముఖంబుల
మండుచుఁ జదలును దెసలును బుడమియుం బగులం బఱతెంచి.

1375


ఉ.

అనుపమ మైనతేజము మహత్త్వమునున్ జవముం బ్రతాపముం
దనరఁగఁ గ్రొమ్మెఱుంగు లొగి దట్టము లై తొరఁగంగ నుద్ధతిన్
గొనకొని హేమచారుమణికుండలమండిత మైనయింద్రజి
త్తునితల తతక్షణంబున త్రుంచి ధరం బడఁగూల్చెఁ బెల్చనన్.

1376


క.

మొరసెన్ దుందుభు లత్తఱిఁ, బొరిఁ గురిసిరి పుష్పవృష్టి బృందారకులున్

సరి నాడిరి సురసతులును, సరసంబునఁ [149]బొగడె నంతఁ జారణతతియున్.

1377


తే.

అపరవారాశిలోఁ గ్రుంకునర్కుఁ డనఁగ, నాజితలమున నాదైత్యుఁ డస్తమించి
యధికతేజోమయాత్ముఁ డై యాక్షణంబ, పరమవైష్ణవసాయుజ్యపరము నొందె.

1378


శా.

ఆసౌమిత్రియు నంత వానరనికాయంబుల్ ప్రశంసింపఁగా
నాసామీరియు నావిభీషణుఁడు నత్యాసన్ను లై రా జయ
శ్రీ సొంపారఁగ వచ్చి సంభ్రమయుతస్నేహంబుతో నన్నకుం
జేసెన్ సన్నతి రక్తశోభితగళత్స్వేదానువిద్ధాంగుఁ డై.

1379


ఉ.

నిక్కువ మైనకూర్మి గలనిండుమనంబున రాఘవేశ్వరుం
డక్కునఁ జేర్చి లక్ష్మణు నిజాంకముపై నిడి మోదబాష్పముల్
చెక్కుల నిండ గద్గదిక చె న్నెసలారఁగఁ బల్కె వేడ్కతో
నక్కమలాప్తసూను నసురాధిపుఁ గన్గొని [150]ధీరనాదుఁ డై.

1380


మ.

ఘనమాయుం డగునింద్రజిత్తు ననిలో గాలుండపోలెన్ వడిం
దునిమెన్ లక్ష్మణుఁ డింక నే దశముఖున్ దోర్వీర్య మేపారఁగా
ననిలోఁ గూల్చెదఁ బేర్చి యీనడుమ దైత్యానీకముం బట్టి నె
ట్టనఁ బో నీక వధింపుఁ డొక్కమొగిఁ గట్టల్కం గపివ్రాతముల్.

1381


వ.

అనియె నంత.

1382


సీ.

హతశేషు లైనయాదితిజులు లంకకుఁ జని దశాననుఁ గాంచి సభయు లగుచు
దనుజకులేంద్ర నీతనయుండు రణమునఁ, బ్లవగకోటుల నెల్ల బారిసమరి
మనలంకఁ గాల్చినమారుతాత్మజు నొంచి, యవ్విభీషణుమేన నధికశస్త్ర
చయములు గీలించి చటులబలుం డైన, సౌమిత్రి తోడుతఁ జాలఁ బ్రొద్దు
సమరలీల సల్పి చండప్రతాపుఁ డై, ఘోరభంగిఁ బేర్చి కొంతవడికిఁ
బ్రథితలక్ష్మణాస్త్రకపావకజ్వాలల, శలభవృత్తిఁ దాల్చెఁ బొలుపు దక్కి.

1383

ఇంద్రజిత్తుచావునకు రావణుండు దుఃఖించుట

వ.

అని విన్నవించిన.

1384


చ.

విని విన నంతలోన తనవీనులు వ్రయ్యగ మేను
దుర్విషం
బునఁ బరివీత మైనక్రియఁ బొ ల్పగలం బ్రళయాపతన్మహా
శనిహతిఁ బొందుచాడ్పున నిశాతతరక్రకచంబుకోఁతలం
దునిసినభంగి నెమ్మనము దూలఁగ వ్రాలె నతండు భూస్థలిన్.

1385


చ.

తెలియక కొంతసేపునకుఁ దేఱి దెసల్ పరికించి చూచి మి
క్కిలి యగుశోకవేగమునఁ గీడ్పడి సాహసధైర్యవిక్రమం
బులు జయలక్ష్మితోఁ దొలఁగి పోయినచందము దోఁప నెంతయుం
బెలుకుఱి పెక్కుభంగి విలపించె దశాననుఁ డీక్రమంబునన్.

1386

ఉ.

హా జగదేకవీరవర హా కులసాగరపూర్ణచంద్రమా
హా జితలోకపాలగణ హా భుజగేంద్రలసన్మహాభుజా
హా జనితప్రభావయుత హా సమరార్ణవకర్ణధార నీ
తేజము విక్రమంబు ఘనధీరతయుం దెగటాఱె నక్కటా.

1387


సీ.

విలసితం బైననీవిపులప్రతాపంబు, భానుతేజమునకుఁ బాయుత్రోవ
యురుతరం బైననీయుత్సాహసంపద, పరఁగ జయశ్రీకిఁ బట్టుకొమ్మ
యనుపమం బైననీఘనతరక్రోధంబు, వీరులధైర్యంబు వీడుకోలు
గురుబలం బైననీయురుభుజాయుగ్మంబు, శేషభోగీంద్రునిసిగ్గుపాటు
అట్టి నీపెంపు లెచ్చోట నడఁగిపోయె, సమరకౌశల మెక్కడ సమసిపోయె
నస్త్రశిక్షయు నేభంగి నఱిగిపోయె, మాయలన్నియు నెచ్చోట మాయమయ్యె.

1388


సీ.

సురకులాధీశునిసొం పెల్లఁ దూలించి, కడిగి పావకుఁ బట్టి కాలఁ జమరి
యేచి కృతాంతునియేపు రూపతఁ జేసి, నిరృతిసత్త్వంబును నేలఁ గలిపి
వరుణునిశౌర్యంబు వఱితిపాలుగఁ జేసి, యనిలునియుద్ధతి నంటఁగట్టి
ధననాథునిధులను దక్కోలుగాఁ గొని, శూలిఁ గాఱడవులపాలు చేసి
మెఱసి వీరలయువిదలఁ జెఱలుపట్టి, జగము లన్నిటి నొక్కట బెగడుపఱిచి
[151]యొప్పునాపట్టి యెచ్చట నున్నవాఁడ, వెలమి సొంపార నిందుల కేల రావు.

1389


మ.

అకటా భాగ్యము లేమిఁ జేసి పటుమాయాసంప్రయోగంబునుం
బ్రకటం బైనబలంబు బాహుయుగళస్రవ్యక్తసారంబు సై
నికసన్నాహము నస్త్రశస్త్రవిభవోన్మేషంబు నీభంగి నూ
రక పోయెన్ విధిచేఁత దప్పఁ దిరుగన్ రా దంట దా మిథ్యయే.

1390


చ.

తలఁచిన నిఫ్డు నావలనఁ ద ప్పొకయింతయు లేదు నీకు ని
ట్టలుగఁగ నేల తొంటివినయంబును భక్తియు నెందుఁ బోయె న
న్నలజడిపాలు చేయఁ దగునయ్య రయంబున రాఁగదయ్య నీ
కలుషత మాని రాగమునఁ గౌఁగిటఁ జేర్పఁగదయ్య పుత్రకా.

1391


శా.

సారోదగ్రుఁడ వైననీకతమునన్ సంగ్రామరంగంబులో
నారాముం బొలియించి కీశపతిసైన్యంబున్ వెసం గూల్చి లం
కారాజ్యంబు తిరంబు సేయుదు ననం గా నింతలో దుష్టదై
వారంభంబున నిట్టికీ డొదవె వీతాధారతం జెందితిన్.

1392


క.

ఉరుబాహుబలము గల్గియు, వెరవిఁడి నై తేరకానివిధమున నకటా
కరుణ యెదలోనఁ దలఁపక, దురమున జమువాత నిన్నుఁ ద్రోచితి పుత్రా.

1393


క.

నా కెవ్వరు ది క్కింకను, శోకాంబుధిఁ గడతు నెట్లు శూరతమై భూ
లోకాధిపసుతు ననిలో, నేక్రియ నిర్జించువాఁడ [152]నెట్టిది తెఱఁగున్.

1394

క.

అని తలమునిఁగిన వగలం, దను మఱచి దశాసనుండు ధరపై మూర్ఛి
ల్లిన నంత మంత్రివర్గము, సనయంబునఁ దెలిపి పలుక సంరబ్ధుం డై.

1395


తే.

తెలిసి యేదిక్కు చూచె నాదివిజవైరి, పఱచి రద్దెస దనుజులు భయము నొంది
చటులతన్ముఖనిశ్శ్వాసజవనపవన, ధూతు [153]లగుమాడ్కి లఘుతూలభాతి గలిగి.

1396


చ.

కుటిలభ్రూకుటిలక్ష్యధూమపటలీక్రూరంబు దుర్లక్ష్యదృ
క్పుటలౌహిత్యకరాళకీలలహరీపూరంబు లోలద్విశం
కటనిశ్శ్వాససమేధితం బగుసమగ్రక్రోధసప్తార్చిచే
జటిలుం డై దశకంఠుఁ డంతఁ బలికెం జండాహవోల్లాసి యై.

1397


మ.

నినుపారం దప మాచరించి గిరిశు న్మెప్పించి శస్త్రాస్త్రము
ల్గొని శక్రాదిసురేంద్రదుర్జయుఁడ నై లోకంబులన్ నాదుశా
సనమార్గంబున నిల్పి యుద్ధముల దుస్సాధుండ నై ఘోరదుః
ఖనినాదంబులు లేక యుంటి నవిభంగప్రాభవం బొప్పఁగన్.

1398


క.

తనయుల మిత్రుల భృత్యుల, ననుజుల ననిఁ గూల్చె రాముఁ డవనీసుత కై
దనుజు లెట దానవులభో, జన మగునరు లెచట నిట్టిచందము గలదే.

1399


క.

శిలలు సలిలములఁ దేలెడుఁ, జలమున నరు లసురవరులఁ జంపెదరు ప్లవం
గులు పను లొనరించెదరు గు, టిల మయ్యెం గాలగతియు డెప్పర మొదవన్.

1400


వ.

అని ము న్నింద్రజిత్తుండు మాయాసీతం దునిమె నది బొం కగుటం జేసి యిప్పు డది
యే నిజంబ కావించెద నని రోషంబున దశముఖంబులం బొమలు ముడివడ [154]దం
ష్ట్రామండలంబులు గనల నుల్కలుంబోలె లోచనంబులు మిడుంగుఱు లురులఁ
జంద్రహాసంబుఁ గేలఁ దాల్చి పదవిన్యాసంబులు బుడమి గ్రుంగ వృద్ధప్రధానవ
ర్గంబు లిది యనుచితం బనుచుండ నాగ్రహంబున.

1401

రావణుఁడు సీతఁ జంపఁ బోవుట

సీ.

పెరిఁగినయాఁకటిపెల్లున బెబ్బులి, వడి బాలమృగిఁ బట్ట వచ్చుకరణిఁ
గోపంబు గదిరిన ఘోరమై సింహంబు, కరిణిఁ గాఱింపఁగఁ గదియుపగిది
మదము గ్రాలంగ సామజయూథనాథుండు, గమలినిఁ బేటాడఁ గడఁగుమాడ్కి
గరళంబు మొగమునఁ గ్రమ్మ భుజంగమ, మడరి శారిక మ్రింగ నరుగుభంగిఁ
గరుణ లేక మిగులఁగఠినాంతరంగుఁడై, రభస మొదవఁ జేరె రావణుండు
పరమసాధ్వి రాముభార్య భయంబున, డెంద మదరి తల్లడిల్లుచుండ.

1402


వ.

అయ్యవసరంబున.

1403


క.

వడి వీచుగాడ్పుతాఁకునఁ, బుడమిం బడుకదళిపోల్కి భూనందన త
ల్లడ మంది యొఱగె నిఁక నీ, వడువున దశముఖునిసిరియు వ్రాలు ననంగన్.

1404

ఉ.

వ్రాలి నిజాంతరంగమున వారనిశోకముచిచ్చుపెల్లునం
బ్రేలుచు దైత్యనాథుఁ గని బిమ్మిటిఁ బొందుచు దిక్కు లేమికిం
జాలఁగఁ బొక్కుచున్ వగల సందడిచిక్కులఁ జిక్కి యెంతయుం
దాలిమి దక్కి సీత వితతం బగుకంపము నొంది యి ట్లనున్.

1405


చ.

చలమున రావణుండు వడిఁ జంపఁగ నుగ్రత వచ్చె నాత్మజుం
డిలిగినశోకవేగమున నెంతయుఁ గోపము పట్టలేక వీఁ
డలిగిన వాసవాదిసురులైనను నోర్తురె నన్నుఁ గానఁగాఁ
గలరొకొ దిక్కు మృత్యువుముఖంబునఁ జిక్కితి నెల్లభంగులన్.

1406


చ.

గొనకొని యల్లనాఁడు పగ గొన్నవిధంబున నోటలేక నా
లినచల మొప్ప నూరు వెడకలించి వనంబులపాలు చేసి యీ
దనుజునియింట నిట్టి చెఱఁ దార్చితి వేర్పడ నింత చేసియుం
దనియక చంపఁ దెచ్చితివి దారుణచేష్టితఁ బాపు దైవమా.

1407


చ.

[155]కరమును బాపజాతి నయి కట్టిఁడి నై తగునాకతంబునన్
ధరణివిభుండు రాఘవుఁడు తమ్ముఁడు దాను ననేకభంగులం
బొరిఁబొరి నిట్టియాపదలఁ బొందుచు నుండుటఁ జేసి యాత్మలోఁ
[156]బురపురఁ బొక్కుదుం దనదుపూర్వకృతంబు గలంచి స్రుక్కుచున్.

1408


చ.

కడవఁగ రానినెవ్వగలక్రందున నుండుటకంటె వీనిచే
నడిదపుధారపాలు వడి ప్రాణము లిమ్మెయి నొక్కమాత్రలో
విడిచెద నెల్లజన్మముల వీరుఁడు రాముఁడ నాకు భర్త య
య్యెడు మని యాత్మలో నిలిపె నీశ్వరు రాఘవు నేకచిత్త యై.

1409


వ.

అంత నచ్చేరువ నున్నదానవులు తమలో ని ట్లనిరి.

1410


మ.

మది ఘోరం బనుచింత లేక కడుదుర్మానంబునం జేరె ను
న్మదుఁ డై యింతి వధింపఁ గా దనక యన్యాయంబు మైకొన్న నా
పద లేతెంచుట కేమి సందియము పాపం బిట్లు చేయం దలం
చి దశాస్యుండు దురాగ్రహంబునకుఁ జొచ్చెం గీడు వాటిల్లదే.

1411


క.

వల దని మానుప నెవ్వరు, గల రిక్కడ ననఁగ నంతఁ గడఁగి సుపార్శ్వుం
డలుక శమింపఁగ ని ట్లని, పలికె దశముఖుని నీతిపథధర్మమునన్.

1412


ఉ.

తాత పులస్తి నీకు గుణధాముఁడు విశ్రవసుండు తండ్రి నీ
వాతతవేదశాస్త్రములు సాంగముగాఁ దగ నభ్యసించి వి
ఖ్యాతిగ ధర్మమార్గములయందుఁ బ్రవీణుఁడ వయ్యు నక్కటా
నాతి వధింపఁగాఁ దగునె న్యాయము దప్పినఁ గీడు పుట్టదే.

1413

ఉ.

ఆలములో నరేంద్రసుతుఁ డాత్మజుఁ గూల్చిన మాఱుసేయఁగాఁ
జాలక శోకరోషములసందడి కోర్వక రావణుండు దు
శ్శీలమునం బ్రచండగతి సీత వధించె ననంగ నిట్టి నిం
దాలయ మైనదుర్యశము నందుదురే యిది నీకుఁ బాడియే.

1414


క.

[157]ఎల్లి రణంబునఁ గోపం, బెల్లను రాఘవులమీఁద నిందఱు నెఱుఁగం
జెల్లింపు మనుచు మగుడను, బల్లిదుఁ డై తోడి తెచ్చెఁ బంక్తిగ్రీవున్.

1415


ఆ.

మఱవరానిపుత్రమరణశోకాబ్ధిలో, మునిఁగి తెలిసి రోషఘనతరంగ
తతుల హతులఁ జేసి దరిచేరుకైవడి, మలసి రావణుండు కొలువు చొచ్చి.

1416


సీ.

రోషాధిదేవతారుధిరోపహారపా, త్రలభంగి నెఱ్ఱ కన్నులకుఁ దెచ్చి
ముడివడ్డబొమలచే క మొగములు ఘనరుద్ధ, విలయార్కమండలము లనఁ దనరి
దిగ్గజాధిపదంతదీర్ఘంబు లగుచున్న, కోఱలఁ గ్రొమ్మెఱుంగులు వెలుంగ
రదనఘట్టనములఁ బొదలినమిడుఁగుఱు, గము లోలి మిన్నెల్లఁ గలయఁబర్వ
జగము లన్నియు నొక్కట సమయఁ జేయ, నప్పళించుకృతాంతుని ననుకరించి
కలయ రాక్షసకోటులఁ బలికె నిట్లు, ధీరవారాశినాదంబు తేటపడఁగ.

1417


ఉ.

లెండు నిశాటులార యవలీలమెయిన్ బహుసైన్యయుక్తులై
పొండు ప్రతాప మేర్పడఁగ బోరిన రాఘవులన్ వధించి వే
రండు నిరర్గళం బగుపరాక్రమ మిం పెసలార నంత నా
ఖండలముఖ్యనిర్జరులగర్వములుం బొలివోవుఁ జెచ్చెరన్.

1418


వ.

అని యాజ్ఞాపించునవసరంబున.

1419


క.

కరితురగరథపదాతి, స్ఫురణంబులు చెలఁగ భూనభోవలయదిగం
తరములు నిండఁగ నార్చుచు, సురవైరులు గూడి రాజి శుంభద్గతు లై.

1420


క.

పటుభేరీభాంకృతులును, బటహనినాదములు శంఖబహురావంబుల్
కటుకాహళనాదంబులుఁ, జటులము లై పర్వె నోలి జగములు నిండన్.

1421

మూలబలములయుద్ధము

సీ.

బృంహితంబులతోన పృథులఘంటారావ, ములు పదిదిక్కులఁ గలయఁ బర్వ
ఖురపుటధ్వనులతోఁ బర పైన హేషిత, ఘోషముల్ భూధరగుహల నిండ
[158]ఘనతరకింకిణీస్వనములతోఁ గూడ, నేమిశబ్దంబులు నింగి ముట్ట
నిగిడినశింజినీనిస్వనంబులతోన, సింహనాదంబులు చెలఁగుచుండ
గజము లశ్వంబు లరదముల్ కాల్బలంబు, పుడమి యీనినచాడ్పునఁ బొలుపు మిగిలి
యెన్నఁగా గోచరము గాక యేపు మీఱి, లంక వెలువడె నెంతయు శంక లేక.

1422


తే.

ఇంతసేనకుఁ బోరంగ నిమ్ము సాల, దారణస్థలిఁ గావున వారిరాశిఁ
గలను గావింపఁ బూనినకరణి నెగసెఁ, జదలు మ్రింగుచుఁ బెల్లైనసైన్యరజము.

1423

క.

ఆవానరబలవారిధిఁ, ద్రావఁగ లంకాబ్ది వెడలె దర్పం బెసఁగన్
దేవారిబాడబాగ్నులు, వావిరి శస్త్రార్చు లేచి వడి మండంగన్.

1424


మ.

ఘనవాలమ్ములు దాకి చుక్క లురులంగా నుద్యమత్పాదఘ
ట్టనలన్ ధారుణి గ్రుంగ శైలములు చూడన్ నేలపై వ్రాల లం
ఘనచాతుర్యము నింగి క్రిందుపఱుపంగా వానరానీకముం
గినుకం బొంగుచు నేఁగుదెంచి వడిఁ దాఁకెన్ వీఁకమై నత్తఱిన్.

1425


మ.

దివిష ద్వైరులమీఁద వానరవరుల్ దెంపారఁ దోరంబుగా
నవనీజంబులు పర్వతంబు లసమానానేకపాషాణము
ల్దివి నీరంధ్రముగా వెసం బఱపి ధూళీజాలముల్ నేల బి
ట్టవియంగా నెరయించి పేర్చిరి రణవ్యాపారపారీణు లై.

1426


మ.

దనుజానీకము నాగ్రహంబున భుజాదర్పానురూపంబు గాఁ
దనువుల్ దాల్చినయంధకారములచందంబుల్ గడున్ వింతగా
ధనురాద్యాయుధరోచు లోలిఁ జదలన్ దట్టంబు లై పర్వఁ గాఁ
జనుదెంచెం దటిదుజ్జ్వలాసితఘనశ్లాఘైకజంఘాల మై.

1427


లయగ్రాహి.

అంట వడిఁ దాఁకి యద రంటఁ బడవ్రేసి పెనుమంట లెగయం జఱి
చిదంటతన మొప్పన్
వెంటఁబడి పట్టుకొని గొంటుతన మేర్పడఁగ గంటిపడఁ దాఁచుచు మగంటిమి దలిర్పన్
వెంటిగొనఁగా నులిచి మింటి కెగయన్ వయిచిమంటఁ లయంగ జదిపి బంటుతన మిట్లే
వెంటఁ దనరారగను గంటకితులై విబుధకంటకులు వానరులు నొంటిమెయిఁ బోరన్.

1428


సీ.

రాక్షసీకబరీభకరంబులచాడ్పున, విపులాంధకారంబు విరియఁ బాఱ
దానవీహారముక్తాఫలంబులక్రియఁ, బొరిఁబొరిఁ దారలపొలుపు దొలఁగ
నసురీముఖోజ్జ్వలహాసంబుకైవడి, నిండారువెన్నెలనిక్కు దక్క
నక్తంచరీలోచనంబులపోలికి, నసితోత్పలంబులపసను బొలియఁ
గపులముఖములతో గూడఁ గమలచయము, లోలి వికసింప నభ్రంబునొఱపుతోన
జనపతులనెమ్మనములు ప్రసాద మంద, నుదయశైలంబుపైఁ దోఁచె నుష్ణకరుఁడు.

1429


వ.

అంత నయ్యుభయబలంబులుఁ దలపడునప్పుడు కొండలపాటులం జదియువారును
దరువులవ్రేటుల వ్రాలువారును గండశైలంబులతాఁకున గుండుగిలువారును ము
ష్టివిఘటనంబులు బి ట్టవిసిపడువారును జానుఘాతంబుల రోఁజువారును జరణతా
డనంబుల మరణంబు నొందువారును గులిశకఠినమస్తకాభిఘాతంబుల నురం
బులు పగులువారును బార్ష్ణిఘాతంబులఁ బంచత్వంబు నొందువారును గూర్పర

ప్రహారంబుల నూర్పులకుఁ బాయువారును నాభీలవాలకాలపాశంబులఁ బొడ వ
డంగువారును ఖరనఖరవిదారణంబులం గూలువారును గరవాలంబులఁ ద్రెళ్లువా
రును దారుణదంతనిపీడనంబులఁ దెరలువారును గడకాళ్లు వట్టి వీచివైచినం జది
యువారును నగురాక్షసులును, దైత్యనికాయంబులగదాఘాతంబులఁ గదల లేని
వారును ముసలంబులమోఁదులం గసిబిసియగువారును ముద్గరంబుల మూర్ఛిల్లు
వారును భిండివాలంబుల గుండె లవియువారును దోమరంబుల నామం బడంగువా
రును బరశువుల నఱకంబడువారును గరవాలంబులఁ దుత్తునియ లగువారును
గుంతంబుల గుదులై కూలువారును గటారుల మర్మంబులు విచ్చి త్రెళ్లువారును
జక్రంబుల ఖండితు లగువారును భల్లంబుల లూనమూర్థు లగువారును నై
యున్నబలీముఖులును గలిగి, మఱియును దెగినచరణంబులును దునిసినజంఘ
లును విఱిగినతొడలును రెం డై యున్నమధ్యంబులును బగిలినయురస్స్థలంబు
లును మురిసినమణిబంధంబులును బరిచ్ఛిన్నంబు లగుకూర్పరంబులును నికృత్తం
బు లగుభుజమూలంబులును విపాటితంబు లగుశిరంబులును గలిగి యవిచ్ఛిన్న
రుధిరప్రవాహంబు తరంగిణియును శరకుంతఖడ్గంబులు మీనంబులును గళేబ
రంబులు మకరంబులును శిరస్త్రాణంబులు గమఠంబులును దుమురు లైనభూషణ
మణిసమూహంబు లిసుకయు వికీర్ణంబు లగుమస్తకంబులు పుండరీకంబులును
బ్రకీర్ణకంబు లగు ప్రకీర్ణంబులు హంసలును విలోలంబు లగుకేశసముదాయం
బులు శైవాలంబును మేదోమాంసమస్తిష్కపటలంబు కర్దమంబునుం గా ని
ట్లపూర్వంబును మహాఘోరంబును నగుసంగ్రామరంగంబున.

1430


తే.

గిరులు గిరులును గరులును గరులు హరులు, హరులు శరభములును వరశరభములును
గండభేరుండములును భేరుండములును, బోరుకైవడి నిరువాఁగుఁ బోరె నెలమి.

1431


చ.

కరిఁ గరితోడ వ్రేసి తురగంబును నొక్కతురంగమంబుతో
బొరిగొని తేరు తేరిపయిఁ బొ ల్పగలించి యదల్చి దైత్యు నొ
క్కరునిపయిన్ మరొక్కరుని గ్రచ్చఱఁ దాఁచి వధించి రిట్లు వా
నరులు వివర్ధమానజయనాదతిరోహితరోదసీకు లై.

1432


చ.

చలముం జేవయు బీరమున్ బిరుదులున్ సంరంభముల్ సాహసా
చలభావంబులుఁ బంతముల్ నెఱపుచున్ శస్త్రాస్త్రజాలంబులం
గలయం గప్పుచుఁ ద్రుంచుచున్ నుఱుముచున్ ఖండించుచుం జీరుచుం
బెలుచం జంపెను వానరాలిఁ బలభుగ్బృందంబు దుర్వార మై.

1433


సీ.

రథులు గుఱ్ఱములు సారథులును రథములుఁ, గూలంగఁ గొండలు గుప్పి గుప్పి
యారోహకులతోన యగ్గజంబులు మ్రగ్గ, సాలవృక్షంబులఁ జదిపి చదిపి

రౌతులతోన తురంగముల్ చదియంగ, నడరుచుఁ బిడికిళ్లఁ బొడిచి పొడిచి
వరపదాతుల ఘనవాలాగ్రములఁ గట్టి, తిగిచి జీవము పోవఁ ద్రిప్పి త్రిప్పి
తన్ని చీరి కఱచి తాటించి యొండొంటి, తోన విసరి వైచి దోర్బలంబు
మెఱసి పోరి రిట్లు నెఱయఁగఁ బ్లవగులు, మిగుల నమరగణము పొగడుచుండ.

1434


లయవిభాతి.

తఱిమి వెస రక్కసుల వెఱచఱవఁ బట్టుకొని పఱిపఱిగ వే తలలు నుఱిపి యవలీలన్
నుఱుములుగఁ ద్రొక్కి పడి నెఱఁకు లగలం జదిపి నెఱి చెడఁగ నెమ్ము లొగి విఱిగి తునియంగాఁ
బఱపి గజబృందముల కుఱికి ఘనదంతములు పెఱికి తెగిమోఁది మద.... మఱిగి ధర మ్రొగ్గన్
నెఱపి తురగమ్ములకుఁ జుఱు కొదవ నెత్తురులు వఱద లయి పాఱఁ గపు లుఱక సమయింపన్.

1435


క.

ఏచినబలములతో రజ, నీచరులుం జలము గలిగి నిష్ఠురతరనా
రాచములు మునుఁగ నేసిరి, చూచుసురల్ దల్లడిల్ల స్రుక్కక హరులన్.

1436


మ.

పరిఘప్రాసకఠోరకోణపరశుభ్రాజిష్ణుశూలాస్త్రము
ద్గరచక్రక్రకచోగ్రశక్తిముసలోద్యద్భిండివాలాసితో
మరభల్లాతతఖేటపట్టిసకచర్మప్రోద్యమత్కార్ముక
క్షురికాద్యాయుధహస్తు లై దితిజు లస్తోకప్రభావంబునన్.

1437


ఉ.

వ్రేసియుఁ జీరియం బొడిచి వీచియు గ్రుచ్చియుఁ
యుఁ జించి త్రుంచి బి
ట్టేసియుఁ గూల్చియుం బగుల నెమ్ములు రాల్చియు గ్రుచ్చి నుగ్గుగాఁ
జేసియుఁ గంఠముల్ దునిమి చిందఱవంగఱ గాఁగఁ దోలినం
గీశులు భీతిఁ బొంది తమకించుచు రాఘవుమర్వు సొచ్చినన్.

1438

శ్రీరాముఁడు మూలబలంబుల నుగ్గాడుట

చ.

వెఱవకుఁ డంచు వానరుల వీరవరేణ్యుఁడు పల్కి కిన్క పెం
పెఱుకపడంగఁ గన్నుఁగవ నించుక యెఱ్ఱఁదనంబు తోఁపఁ గ్ర
చ్చఱఁ దనక్రేవ నున్నఘనచాపము దాల్చి యసంభ్రమంబునం
జిఱునగ వొప్పఁగా వితతశింజినిరావము చేసె నత్తఱిన్.

1439


మహా.

కుతలం బట్టిట్టు వీఁగెం గులగిరు లొఱగెం గూర్మనాథుండు గ్రుంగెం
జతురంభోధుల్ గలంగెన్ సకల మగుదిశాచక్ర మల్లాడె దిగ్దం
తితతుల్ చెల్వేది మ్రొగ్గెన్ దినమణి యదరం దేరు దప్పంగఁ బాఱెన్
దితిజానీకంబు లెల్ల ధృతి సెడి బెదరం దేజముల్ మాయఁజొచ్చెన్.

1440


క.

పెనుమంచు గవియుచందం, బున శరములు దఱుచు పఱవ భూగగనంబుల్
చన నిశ్చయింప నరుదుగ, ఘనతిమిరము పొదివె దిశలఁ గలయఁగ నంతన్.

1441

క.

గిఱిగొన్న యంపకోలల, తఱుచున దానవులు తెరువు దప్పుచు రామున్
నెఱియారఁ గానఁగా లే, కఱిముఱి గా విఱిగి చెదరి రందఱుఁ బెలుచన్.

1442


క.

చాపాభ్యాసప్రౌఢిమ, చూపఱు మెచ్చంగ రాజసూనుఁడు దైత్యా
టోపంబు పెంపు దూలఁగఁ, దూపులు గీల్కొలిపె సమరదుర్దమలీలన్.

1443


మ.

నిమిషార్ధంబున నబ్బలంబు గలయన్ నిస్సీమబాణాళి భూ
రమణుం డేసిన రోమకూపముల దుర్వారంబుగా నాటి దు
ర్గమభావంబున నంబరంబు దెసలుం గానంగ రాకుండఁ గ
ప్పె మహాధ్వాంతము దుర్విభేదగతితో భీమత్వసంపాది యై.

1444


క.

అనిఁ గూలుదితిజతతియా, ర్తనినాదము రామవిభుశరంబులు వే నిం
డినఁ బట్టక వడిఁ బగిలెడు, వనజభవాండంబురవము వడువునఁ దనరెన్.

1445


క.

పరివేషమధ్యగతుఁ డగు, తరణిక్రియన్ మండలీకృతస్థిరచాపాం
తరమున రఘుపతి పొలిచెను, వరకరసాయకసహస్రవలయము మెఱయన్.

1446


సీ.

నిడుదబాణంబులు నెఱఁకులు నాటినఁ, గాలుసే యాడక సోలువారుఁ
బరుషనారాచాదిపరిపీడితాంగు లై, వస మఱి యూరక వనరువారుఁ
గ్రూరార్ధచంద్రాస్త్రకృత్తోరుబాహు లై, మునుకొని మురముర మూల్గువారు
నురుసాయకంబుల నురములు పగిలిన, మొనసి నెత్తుటిలోన మునుఁగువారు
సొలసి మూర్ఛిల్లి యొక్కింత దెలియువారు, దెలిసి కైదువు లంకించి నిలుచువారు
నిలిచి యెప్పటి పోరంగ నిగుడువారు, నిగిడి జమునిల్లు చేరఁగ మొగియువారు.

1447


వ.

అయిరి మఱియును.

1448


తే.

ఒక్కశరమునఁ బెక్కండ్ర నుక్కడంచుఁ, బెక్కుతూపుల నొక్కని స్రుక్కఁ గూల్చు
ఘోరశరములఁ గొందఱ గుదులు గ్రుచ్చు, నస్త్రశయ్యలఁ గొందఱ నడఁగ నునుచు.

1449


ఆ.

చెలఁగి కృషికుఁ డొక్కచేను చేయఁగఁ బూని, తఱుచుటడవి గలయఁ దఱిమి నఱక
నొక్కటొకటి మీఁద నొగిఁ గూలుచాడ్పునఁ, బడుగుఁ బేక పగిదిఁ బడిరి రిపులు.

1450


చ.

చలమున నస్త్రపాణు లయి జన్యతలంబున మానవాధిపు
న్గెలిచెద మంచు వచ్చి చొరనేరక దట్టము లైనరాముపె
న్ములుకులపాలివార లయి మోక్షముఁ [159]జుబ్బన చూఱ గాఁగ దై
త్యులు నొకమాత్రలో నిలిగి రుగ్రరణంబున నివ్విధంబునన్.

1451


వ.

మఱియు రఘునాథుండు సాయకంబులం దలలు నఱకియు మెడలు ద్రుంచియుఁ
జేతులు ఖండించియు నురంబులు వ్రచ్చియు నుదరంబులు చీరియుఁ దొడలు దు
మురుచేసియు జంఘలు విఱిచియుఁ జరణంబులు గుత్తులకుం ద్రెంచియు మర్మం

బులు నొప్పించియుఁ జర్మంబులు సించియు బొమిడికంబులు పగిలించియు ధను
రాదిసాధనంబులు నుగ్గు సేసియు గొడుగులు గూల్చియుఁ గిరీటమణులు రాల్చి
యుఁ జామరంబులు ద్రుంచియుఁ గేతనంబులు దునుమాడియు విహరింపఁ బును
కలతునుకలుఁ బ్రేవులప్రోవులు నెమ్ములయిమ్ములును మెదళ్లకుదుళ్లును బీనుంగు
లైనయేనుంగులును జిఱ్ఱనం దిరిగి కూలుగుఱ్ఱంబులును మనోరథంబులతోన
భగ్నంబు లగురథంబులును నొక్కండ కావించి యుగావసానసమయసమవర్తి
యుంబోలె విజృంభించిన.

1452


చ.

ఇదె రఘుపుంగవుం డెదిరె నెక్కడికిం జనవచ్చు నింక న
ల్లదె రఘునాథు బాణతతి యక్కడివాఁ డెట కేఁగెనొక్కొ వాఁ
డిదె యదె వచ్చెఁ బోయె మఱి యెప్పటి ముందర నున్నవాఁడు వే
చదుపఁగఁ జొచ్చె నంచు దనుజప్రవరుల్ గలయంగఁ బాఱఁగన్.

1453


ఆ.

సమరదుర్జయుండు సమ్మోహనాస్త్రంబు, మెఱసి దనుజకోటిమీఁదఁ బఱపె
నెదిరిఁ దమ్ము నాజి నెఱుఁగక [160]తమలోన, బ్రమసి పోరి కులుకుక్రమము దోఁప.

1454


వ.

సమ్మోహనం బగునగ్గాంధర్వాస్త్రంబుసామర్థ్యంబునం జేసి.

1455


చ.

ఒకఁడు పదుండ్రు నూర్వురు సముద్ధతి వేవురు నోలి లక్షలుం
బ్రకటము గాఁగఁ గోట్లు నయి రాఘవుఁ డాహవభూమి దైత్యసై
నికులకుఁ గానఁగాఁబడియె నిక్కువ మై బహుసంగరక్రియా
ధికనిపుణత్వ మేర్పఱిచి ధీరత నెక్కడఁ జూడఁ దాన యై.

1456


వ.

పదునాలుగువేలు గుఱ్ఱంబులను బదునెనిమిదివేలు మత్తగజంబులను లక్షరథంబు
లను రెండులక్షలు మహావీరరాక్షసులను నొక్కనిమిషంబున సమయించి యార
సాతలంబుగా ధరాతలంబున మస్తిష్కమాంసాస్థిమహారాసులు గావించి యు
లాసహస్రసమంబు లై తేఱిచూడఁ దరంబుగాక తటిద్వల్లీనిభంబు లై మిడుఁ
గుర్లు వెదచల్లుచు నురవడిం దాఁకురఘుపుంగవుశరంబుల కోర్వక హతశేషు
లయినయాతుధానులు గపు లార్వ లంక సొచ్చిన.

1457


క.

సురవిద్యాధరకిన్నర, గరుడోరగయక్షసిద్ధగంధర్వాదుల్
సరసిజహితవంశధురం, ధరు రాము నుతించి రెలమిఁ దత్తద్భంగిన్.

1458

లంకాపురస్త్రీలు శ్రీరాముపరాక్రమంబు గని చింతించుట

ఉ.

అంతట లంకలోనఁ దగ నక్కడ నక్కడ వాడవాడలం
గ్రంతలఁ గ్రంతలన్ నిలిచి క్రచ్చఱ మూఁకలు గట్టి క్రవ్యభు
క్కాంతలు విస్మయంబు నధికం బగుశోకముఁ బొంది యాత్మలో
నెంతయుఁ దూఱఁగా వగచి యి ట్లని పల్కిరి పెక్కుభంగులన్.

1459


మ.

తరుణీ చూచితివే రఘూద్వహుభుజాదర్పంబు నీచంద మి

ద్ధరణిం గంటిమె వింటిమే త్రిజగతీధౌరేయభావంబు ను
ద్ధురకోదండసమగ్రకౌశలము నస్తోకప్రభావంబు సం
గరచాతుర్యము నస్త్రసంపదయు నుగ్రస్ఫారవిశ్రాంతియున్.

1460


చ.

అరుదుగఁ జెప్పనైనఁ దడవయ్యెడు రాముఁడు విల్లు పట్టినన్
దురమునఁ దిట్టినట్టు గతదోర్బలు లై రజనీచరుల్ పొరిం
బొరి నిమిషార్ధమాత్రమునఁ బొల్పును రూపును దప్పి సంగర
స్ఫురణము దూలి వే పొలిసి పోయిరి కాలునిప్రోలు సూడఁగన్.

1461


క.

వరవారణాయుతంబులు, నురుతరజవతురగవివిధయూథశతంబుల్
గురురథసహస్రములుఁ గా, ల్వురలక్షలుఁ గూలె రాఘవునిరణలీలన్.

1462


శా.

వాలాగ్రంబునఁ బంక్తికంఠుని వెసన్ వ్రాలంగ బంధించి నా
నాలీలం జతురంబురాసుల ననూనస్ఫూర్తియై ముంచి యు
ద్వేలం బైనభుజాబలంబున జగద్విఖ్యాతుఁ డై యున్న యా
వాలిం గూలిచె నొక్కబాణమున దుర్వారుం డితం డెన్నఁగన్.

1463


క.

పుష్కలకరుణాసంధా, విష్కరణము తేటపడఁగ వేడుకతోడన్
దుష్కరముగ రవితనయుం, గిష్కింధకు రాజుఁ జేసెఁ గేవలనరుఁడే.

1464


సీ.

కమలజాండము నొక్కకడి చేసికొని మ్రింగ, నరుదెంచుచున్నకాలాంతకుండొ
జగము లన్నియు నొక్కమొగి సమయింపంగ, మెయికొని గమకించుమృత్యువొక్కొ
భూతకోటుల నెల్లఁ బొరిఁబొరి నొకమాత్ర, రూపఱఁ జేయునారుద్రుఁడొక్కొ
కమలగర్భుఁడు వినోదమునఁ జేసిన వచ్చు, పొలుపైన[161]జంత్రంపుబొమ్మయొక్కొ
యనఁగ నింద్రాదిసురులకు మనసులోనఁ, గలయ నాటినశల్యంబుకరణి నున్న
కుంభకర్ణునిరణమునఁ గూల్చె నితఁడు, గులిశహస్తుండు కుదరంబుఁ గూల్చుపగిది.

1465


మ.

కులగోత్రప్రతిమానసారుఁ డనియుం గోదండపాండిత్యని
శ్చలసత్త్వుం డనియున్ భుజంగకులరాజస్ఫీతదృప్యద్భుజా
ర్గళరూఢుం డనియున్ రఘుప్రవరు నాకర్ణించియున్ నేరమిం
జల మొక్కింతయు డింపఁ డిట్లు దనకున్ శక్యంబు గా కుండఁగాన్.

1466


చ.

అతులపరాక్రమాప్రతిము నయ్యతికాయుని మేఘనాదు న
ప్రతిహతశౌర్యభూషణుఁ [162]డపారబలుం డగులక్ష్మణుండు సం
తతశితబాణపూరముల దర్ప మడంచి వధించె వానరుల్

దితిజులఁ బట్టి కూల్చెదరు దేవబలంబునఁ జేసి యెంతయున్.

1467


క.

సుతులు మృతు లయిరి తమతమ, పతు లీల్గిరి సోదరులును బడి రని లంకన్
వితత మగువగలఁ బొగులుచుఁ, బ్రతిహతమతి నున్న యట్టిప్రమదాజనముల్.

1468


క.

తనపాలిమృత్యు దేవతఁ, గొనివచ్చినమాడ్కిఁ బాపకుటిలాత్మకుఁ డై
యనయమున సీతఁ దాఁ దె, చ్చిననాఁటంగోలెఁ జేటు చేకుఱఁ జొచ్చెన్.

1469


తే.

గుణగణోత్తరుఁ డగువిభీషణునిపలుకు, వినక చెడియెను దశకంఠుఁ డనయవృత్తి
విధికృతంబునఁ జెడ నున్నవేళలందు, బుద్ధిఁ బరికింప కూరక పొలియుఁ గాదె.

1470


తే.

ఎంతయేనియుఁ దగబుద్ధిమంతుఁ డయ్యు, మెఱయనియవిధి దప్పక మెలఁగి చేయు
నేర్పుగలఁడయ్యుఁ జెడువేళ నిహతమతికిఁ, దవిలి సద్బుద్ధు లెవ్వియుఁ జెవులఁ జొరవు.

1471


క.

అమరాజయ్యులు దితిజులు, సమరంబున నాడునాఁడు సమయుచు నుండన్
సమకొనఁడు సీతఁ బుచ్చఁగ, బ్రమసియొకో యకట యిట్టిపాపము గలదే.

1472


వ.

అని మఱియుఁ బెక్కుభంగులఁ బలుకుచు వగచుచుఁ దనదుర్వినయంబుల దూ
ఱుచు స్వజనమరణశోకంబులం దాఱుచు నున్న పురనక్తంచరీజనంబులకలక
లం బాకర్ణించుచు లంకావల్లభుండు రోషశోకపరాభవంబులు ముప్పరిగొన సం
వర్తానలుభంగిఁ గనలుచు యుగాంతసమయసముత్థితద్వాదశార్కమండలంబు
లొక్కటి యైనచందంబునం బ్రకామంబున దురవలోకుం డయి కల్పాంతకుపితుం
డగుఫాలాక్షుపగిది దుస్సహుం డై మత్తవేదండగమనుం డగునున్మత్తుని సింహ
సంహననుం డగువిరూపాక్షునిఁ బిలిచి మీర లపరిమితవాహినీసమేతుల రయి
సమరంబునకుం జనుండు నాకు నొక్కజైత్రం బగురథంబు దేరం బనుపుం డని
తానును యుద్ధసన్నద్ధుం డయి.

1473

రావణుఁడు రెండవమాఱు యుద్ధమునకు వచ్చుట

సీ.

నేఁ డాజిలోపల నృపకుమారులఁ బట్టి, శరపరంపరలచే సమయఁ జేసి
వివిధమహాభూతబేతాళడాకినీ, గణము లన్నియు నన్నుఁ బ్రణుతిసేయఁ
బలలంబు నెత్తురు బహువిధమస్తిష్క, మేదఃప్రపూరంబు మేదురముగ
బలు లిచ్చి వనచరకబలనికాయంబున, కాయఖండంబులు గలయ దెసలఁ
గాకజంబుకకౌశికకంకగృధ్ర, ములకు నెంతయుఁ దృప్తిగా ముదము మీఱఁ
జల్లుఁబోరాడి బహుపిశాచములు మెచ్చఁ, జించి చీరెద నొంచెదఁ జెదరిపఱవ.

1474


క.

నిస్సీమాభిక్రమమున, దుస్సహనిరపాయవిపులదోస్సారమునన్
నిస్సహశరశక్తుల నే, దుస్సాధుఁడఁ జక్రి కయిన ధూర్జటి కయినన్.

1475


శా.

గీర్వాణాధిపుఁ డస్మదున్నతధనుఃక్రేంకారరావంబునన్
గర్వం బేది తొలంగఁబాఱి ముఖరంగద్బాణధారాహతిన్
దుర్వారప్రథితప్రతాపశిఖినిర్ధూతార్చియై యార్చినన్
సర్వాంగీణసమగ్రకంపమున నాశంకార్తుఁ డై పాఱఁడే.

1476

ఉ.

దండధరుండు మున్ను దనదండము నాపయి వైవ నుద్ధతి
న్మండుచు వచ్చుదానిఁ గని నాద మెలర్పఁగఁ బట్టి క్రమ్మఱం
జండతరంబుగా నతని సైరిభనాథుని వ్రేసి వాని ను
ద్దండతఁ గిట్టి నేలఁ బడఁ దన్నిననాకు సమానుఁ జూపుఁడా.

1477


చ.

వననిధినాయకుండు మును వారక పాశము మీఁద వైవ [163]దా
నన వల వైచి వాని జతనంబుగ మద్రథకేతుయష్టితో
డన తగులంగఁ గట్టి వికటభ్రుకుటీకుటిలాస్యవిస్ఫుర
ద్దనుజులు సేయుతర్జనలఁ దాలిమి దూలఁడె నిర్విచేష్టుఁ డై.

1478


చ.

బెగడక శూల మెత్తుకొని భీమతరంబుగ నోర మంటలుం
బొగలును గ్రమ్ముదేర మును బోరన మృత్యువు వచ్చి తాఁకినన్
దిగు లొదవించి పెద్దగదఁ ద్రిప్పుచు నొంచి ధర్మిఁ గూల్చి పె
ల్లుగ నెడలించి నాలుక విలూనము సేయక కాచి పుచ్చితిన్.

1479


క.

సుగ్రీవుని దగ నొంచి య, సుగ్రీవుం జీయువాఁడ సుదృఢాస్త్రములన్
[164]నిగ్రీవునిఁ గాఁ జేసెద, నుగ్రాహవసంప్రధారణోత్సాహమునన్.

1480


వ.

అని రణవ్యగ్రాయమానచేతస్కుం డై.

1481


సీ.

చండభానుప్రభామండలంబులఁ బోలు, కుండలంబులచేతఁ గొమరు మిగిలి
దిగ్దంతికరగండదీర్ఘహస్తంబునఁ, గమనీయమణిమయాంగదము లమరఁ
దపనీయగిరితటవిపులవక్షంబునఁ, దారహారంబులు దళుకు మిగుల
నుదయాద్రిశిఖరసమున్నతశిరముల, దశకిరీటంబులు దనరుచుండఁ
బరశుపట్టిసకరవాలపరిఘశూల, చక్రకార్ముకతోమరశక్తికుంత
సాయకాదికసాధనసహితుఁ డగుచు, ననుపమేయత దశకంఠుఁ డొనరె నంత.

1482


సీ.

పక్వ మై పగిలెడు బ్రహ్మాండ మనఁ బటు, పటహనిక్వణము లుత్కటము గాఁగ
ఘూర్ణమానార్ణవఘుమఘుమాయితము లై, భేరీనినాదముల్ బిట్టు మ్రోయ
దట్టించులయభైరవాట్టహాసముక్రియ, శంఖనాదంబులు సరవి నిగుడ
సంవర్తఘనముక్తచటులాశనులఁ బోలి, కాహళరవములు గలయఁ బర్వ
సమరకౌతుకమునఁ జతురంగసేనలుఁ, దన్ను బలసి కొల్వ దశముఖుండు
నురుజవంబుతోడ నుత్తరద్వారంబు, నందు వెడలుచున్నయవసరమున.

1483


మ.

వసుధామండలి సంచలించెఁ గలయం, వారాశి ఘూర్ణిల్లె నా
కస మెల్లం బొరిఁ గప్పెఁ జీఁకటులు దిక్చక్రంబు గంపించె న
శ్వసమూహంబులు మ్రొగ్గె మత్తకరటివ్రాతంబు దూలెన్ రథా
త్తసమస్తాంగము భగ్న మై పడియె నుత్పాతప్రవేగంబుగన్.

1484


మ.

కురిసెన్ నెత్తురువాన మేఘగణముల్ క్రూరాశనిస్తోమముల్

దొరఁగెన్ మిన్నక జంబుకవ్రజములుం దోడ్తోన వాపోయె ని
ష్ఠురభంగిం బడియెన్ మహోల్కలు పరిక్షోభంబుగా గాలియుం
బరుషప్రక్రియ వీచె శర్కరిల మై ప్రత్యంతదేశంబునన్.

1485


వ.

అంత నిశాచరచక్రంబు కార్చిచ్చు కాననంబునకుం గవియుకరణిఁ గపినికాయం
బునకుం గవిసి యరవాయిగొనక కరవాలంబుల ఖండించి గదలఁ జరిపి మున
లంబుల విసరివైచి కూల్చి యత్తలంబులు నెత్తి వియత్తలంబునకుఁ బోఁ జిమ్ము
చు ముద్గరంబుల మొగ్గరంబులు విరియఁ దట్టుచుఁ బంతంబు లొదవఁ గుంతం
బులఁ బొడుచుచు నంకుశంబులఁ గొంకుగొనక నొప్పించుచుఁ దోమరంబుల భీ
మరంధ్రంబులు సేయుచుఁ బట్టిసంబులు గిట్టి పట్టి సమయించుచుఁ గఠారంబులఁ గ
ఠోరంబుగా గ్రుచ్చుచుఁ గుఠారంబుల హఠారంభంబుగా నఱకుచుఁ బరిఘంబులఁ
బరిఘట్టనంబు సేయుచుఁ [165]దలపాటు గలంపక తలపాటు సేయ వనచరులునుం దల
పడి సాలంబులు వైచియు రసాలంబులు గురిసియుఁ దాలంబులు పఱసియు హిం
తాలంబులు వేసియుం గుద్దాలంబులు నిగిడించియుఁ దమాలంబుల నొప్పించి
యుఁ గృతమాలంబుల స్రుక్కించియు నసనంబుల నసము దింపక మోఁదియు
ఖదిరంబులఁ జఠరంబులుగా గొట్టియు వక్షంబుల వక్షంబులు నొగిలించియుఁ
బర్వతంబుల గర్వతంత్రంబులు మాన్పియు నుపలంబుల నుపలంఘనంబులు దప్పిం
చియుఁ దలప్రహారంబులఁ దలలు పగిలించియు [166]విజృంభించునవసరంబున.

1486


శా.

ముల్లోకంబుల కెల్లనాఁ డెడందలో ము ల్లైనపౌలస్త్యుఁడున్
భల్లంబుల్ వడి వెల్లిగొల్పి సమరప్రారంభవేల్లద్ధను
ర్వల్లీజ్యాఘనసారమేదురనభోరంధ్రంబుగాఁ గీశులున్
భల్లానీకము నొల్లఁబోవ శరసంపల్లంపటాస్ఫోటుఁ డై.

1487


తే.

అడరి యొక్కొక్కనిశితసాయకము వఱపి, నిక్కి పెక్కండ్ర నొక్కట నుక్కడంచి
గురుశరంబులఁ గొందఱ గుదులు గ్రుచ్చి, నిమిషమాత్రన కపిసేన నెఱయఁ ద్రుంచె.

1488


క.

తరువులు దునుకలు సేయుచు, గిరివరముల నుగ్గు సేసి కీశబలంబున్
వెరవారఁ బించ మడఁచుచు, శరములు నిగిడించి భువియుఁ జదలును నిండన్.

1489


వ.

గంధమాదనుఁ బంచవిశిఖంబులఁ బ్రత్యేకంబ నలనీలపనసులను దశాశుగంబుల
ద్వివిదు షడస్త్రంబుల వినతు సప్తసాయకంబుల మైందుఁ బంచమార్గణంబుల
గజుని సప్తరోపంబులఁ గుముదునిం బంచపృషత్కంబుల శరభుని బంచాశత్ప్రద
రంబులం దారక్రతుల నేకైకకలంబంబున నంగదునిఁ బదిబాణంబుల నాంజనే

యుని వింశతిశస్త్రంబుల గవాక్షు దశనారాచంబులఁ గ్రథను నవతిభల్లంబుల
నొప్పించి మఱియు వివిధప్రకారంబుల నంపగములు నించుచుండ.

1490

సుగ్రీవుఁడు విరూపాక్షోన్మత్తులఁ జంపుట

సీ.

శిరములు దెగిపడ ధర మగ్గువారును, మొగిఁ బాదములు ద్రవ్వక మ్రొగ్గువారు
జంఘలు విఱిగినఁ జనలేనివారును, నూరులు నుగ్గైన నొరగువారు
నడుములు రెండైనఁ బడి చచ్చువారును, నురములు పగిలినఁ దెరలువారుఁ
గరములు దునిసిన మురువు దప్పినవారుఁ, బొట్టలు చీలినఁ దొట్టువారు
నోలి నెత్తురుటేటిలోఁ దేలువారు, మొనసి మాంసపురొంపిలో మునుఁగువారుఁ
జేతులాడక యూరక చిక్కువారు, వెడఁదపోటులఁ బ్రాణముల్ విడుచువారు.

1491


క.

అనిలోన దానవేశ్వరు, ఘనశరముల కోర్వలేక కపిసైన్యంబుల్
కనుకనిఁ బఱవఁగఁ గని యా, యినసూనుఁడు మగుడనిల్పె నెంతయుఁ గడఁకన్.

1492


శా.

హేలోత్పాటితశైలుఁ డై కపికులాధీశుండు సుత్రామశుం
డాలోదారగతిక్రమంబున నిరూఢక్రోధుఁ డై వచ్చుచో
నాలోనం గుపితాంతకుం డన విరూపాక్షుండు దా వచ్చి యా
భీలత్వంబున వానిమీఁదఁ బఱపెన్ భీమాస్త్రముల్ చెచ్చెరన్.

1493


చ.

అనిమొన వానిఁ గైకొనక యగ్గిరితోడన లాఘవంబునన్
దనుజునితేరిపై కుఱికి తద్రథసారథితోడ మావులం
దునియలు సేయ వాఁడు విరథుం డయి భూమికి వచ్చి బాణముల్
సొనువుచు నంత నొక్కకరిఁ జొప్పడ నెక్కి యుదగ్రవేగుఁ డై.

1494


చ.

వడిగొని తీవ్రబాణము లవార్యపరాక్రమసాహసంబు లే
ర్పడఁ గపికోటిపైఁ బఱపఁ బన్నుగ మేఘము వృక్షపంక్తిపైఁ
బడ వడగండ్లు రాల్చుక్రియ బాహుయుగంబులతీఁట వోవఁగా
సుడివడ దంతి డీకొలుపుంచుం దనుజుం డసమానవేగుఁ డై.

1495


ఉ.

అక్షతవిక్రమం బొదవ నాజి వినోదము సల్ప నవ్విరూ
పాక్షు వధింప నర్కసుతుఁ డాత్మఁ దలంపఁగ నంతలోన హ
ర్యక్షముఁ బోలుచుం గ్రథనుఁ డన్కపివీరుఁడు దంతికుంభముల్
వృక్షమునన్ వడిం బగుల వ్రేసెఁ బరాసుత నొందునట్లుగన్.

1496


మ.

అది నేలం బడునంత దైత్యుఁడు గదాహస్తాఢ్యుఁ డై పాసి యు
న్మదలీలం జనుదెంచి యాక్రథను దుర్మానంబునం దాఁక నే
ర్పు దలిర్పన్ రవిసూనుఁడుం గినిసి యార్పుల్ నింగి ముట్టంగ దు
ర్మదుఁ డై శైలము వైవ బాణములఁ గ్రమ్మం జేసెఁ జూర్ణంబుగన్.

1497

తే.

[167]దైత్యుఁబెడకాల మఱియును దాఁచె వాఁడు, నడిదమున వ్రేసె నిద్దఱు నవనిఁ దూలి
తేఱి యొక్కట పడి లేచి తెంపు మిగిలి, బలిమిఁ బోరిరి గజములభంగి దోఁప.

1498


సీ.

మల్లయుద్ధము సేయు మదిఁ గోరి యిద్దఱుఁ, దివురుచు విడుచుచుఁ దెఱపి గొనుచుఁ
బెడకేల వ్రేయుచుఁ బిడికిటఁ బొడుచుచుఁ, బుడమిపైఁ బడఁ దాఁచి యెడసి పాసి
కడిమి మీఁదికిఁ జిమ్మి కరములఁ దట్టుచుఁ, గాళ్లఁ దన్నుచును మోఁకాళ్లఁ జదిపి
బలుగేల వ్రేసినఁ బడుబంతికయివడి, నెగసి [168]లాగము గొని యేపు మిగిలి
దైత్యుఁ డర్కసూనుఁ దలమునఁ జఱచిన, సోలి తెలిసి పేర్చి సురలు వొగడ
నురము వ్రేసె వాఁడు నొగి నెత్తు రుమియుచుఁ, గొండ యొఱగుభంగిఁ గూలె నంత.

1499


క.

మద మఱి దైత్యులు పాఱిరి, ముదమునఁ గపు లార్చి రంతు మొగములు గనలం
ద్రిదశేంద్రవైరి గని తన, మదిఁ గోపం బొదవఁ బలికె మానము వెఱుగన్.

1500


శా.

ఆసామర్థ్యము దూలిపో నిట విరూపాక్షుండు గూలెన్ గదా
ప్రాసోదంచితు లైనదైత్యు లనిలో భస్మంబు లై పోయి ర
త్యాసక్తిం బ్లవగాలి పె ల్లుఱికి ప్రౌఢాహంకృతిన్ సేనలన్
గాసింబెట్టెడి నీకుఁ జూడ నగునే కారింపఁగాఁ బోలదే.

1501


చ.

అన నున్మత్తుఁడు నుత్సహించి సమరవ్యాపారసన్నద్ధుఁడై
యనిలోఁ గూలినయన్నఁ జూచి ఘనరోషాయత్తుఁ డై రామభ
ద్రునితోఁ బోరఁ డలంచి వానరబలస్తోమంబు బాణావలిం
దునిమెం జించె వధించెఁ గూల్చెఁ బఱపెం దూలించెఁ జెండెన్ వడిన్.

1502


శా.

ఆలోనన్ రవిసూనుఁ డాదనుజుపై నంకించి రోషంబునన్
శైలం బొక్కటి వైవ వాఁడు విశిఖాసారంబునం గూల్చినన్
లీలన్ వానిరథంబుపై కుఱికి యక్లేశంబునన్ సూతు న
శ్వాలిన్ విల్లును ద్రుంచి యార్చె ఘనగర్జాడంబరస్పర్ధి యై.

1503


వ.

అంత నయ్యిద్దఱు బరిఘగదాహస్తు లై తలపడి మహోరగంబులక్రియ ని
ట్టూర్పులు నిగిడించుచుం బ్రస్వేదసిక్తాంగు లై మదకుంజరంబులక్రియం బ్రవ
ర్తించుచు సమరసముత్సాహపులకితగాత్రు లై కంఠీరవంబులకరణిఁ బ్రహారంబు
లఁ దలలు పగిలి నెత్తురు గాఱ నడజేవుఱుఁగొండలచాడ్పున లంఘనలాఘవంబు
లు గలిగి గరుడులచందంబు దోఁప సింహనాదంబుల జీమూతంబులకైవడిఁ బర
స్పరంబు జంఘల నొప్పించుచు జానుప్రదేశంబుల నొగిలించుచు సూరుల భేదిం
చుచుం గటిప్రదేశంబులఁ బగిలించుచు నుదరంబులఁ గలంచుచు నురంబుల న
గలించుచు బాహుల స్రుక్కించుచుఁ గంఠంబులఁ జఱుచుచుఁ జరణంబుల బి ట్ట
డుచుచు ఫాలతలంబుల నలంచుచు శిరంబుల నెత్తురు జొత్తిల్ల మొత్తుచు సోలుచు
వ్రాలుచుఁ దెలియుచు మలయుచుఁ దేఱుచు మీఱుచుఁ గేరుచు నితరేతరజ

యకాంక్ష లినుమడింపఁ జలంబు డింపక తెంపు పొంపిరివోవ మండలక్రమభేదం
బులు సూపుచుం బెద్దసేపు పోరి.

1504


సీ.

కరికరాయతమహాకరముల ముసలంబు, వెస దానవుఁడు ద్రిప్పి విసరివైవ
దాన సుగ్రీవుఁడుఁ ధరఁ గూలి వెస లేచి, పరిఘంబు వానిపైఁ బఱపెఁ బెలుచ
వాఁడును శితకరవాలంబు వైచిన, వడి వచ్చుదానిన యొడిసి పట్టి
జళిపించి పెల్లార్చి సైన్యంబు చెలఁగంగ, దితిజాధమునితల ద్రెవ్వ వైచె
మణికిరీటహేమమయచారుకుండలమండితంబు నగుచు మంట లెగయ
నవనిఁ ద్రెళ్ల రోహిణాచలశృంగంబు, వజ్రనిహతిఁ జేసి వ్రాలుకరణి.

1505

సుపార్శ్వుఁ డంగదునిచే మడియుట

క.

విఱిగి నిశాటులు రావణు, మఱువున కేతేరఁ జూచి మనమునఁ గోపం
బెఱుకపడ సుపార్శ్వుఁడు వడిఁ, బఱపెన్ వానరులమీఁదఁ బటువిశిఖంబుల్.

1506


క.

వడితోడ గాలి వీవఁగఁ, బడలువడం దొరఁగుతాటిపండులక్రియఁ గ్రొ
వ్వడర సుపార్శ్వుఁడు శరములఁ, బడనేసం గపులతలలు పఱపులు గొనఁగన్.

1507


ఉ.

వాలిన తెంపునం గినిసి వాలితనూజుఁడు వానితేరిపైఁ
దేలి యదల్చి ముద్గరము తీవ్రత నేసిన వాఁడు నేలపై
వ్రాలిన నొక్కకొండ వడి వైచిన సారథితోన గుఱ్ఱముల్
దూలెను నుగ్గునూచ మయి తోడన వాఁడును దేఱి చెచ్చెరన్.

1508


క.

పదితూపుల నయ్యంగదుఁ, బ్రదరత్రయమున సరోజబంధుతనూజున్
బెదరంగ నైదుకోలలఁ, బొదివె గవాక్షుని నుదగ్రభూరిబలుం డై.

1509


ఆ.

వాలిసూనుఁ డలిగి వానిం బరిఘమున, మోఁదెఁ గరుణ లేక మూర్ఛవోవఁ
జెఱకుఁగోల పెల్లు విఱిచినకైవడి, మించి దైత్యువిల్లు ద్రుంచివైచె.

1510


క.

తెలిసి పరశువున వక్ష, స్స్థలి వ్రేసిన నంగదుండు చలియించుచు భూ
స్థలమున వెస మూర్ఛిల్లెం, బెలుచని నక్తంచరుండు బెట్టుగ నార్వన్.

1511


చ.

అడరుచు నంతలోఁ దెలిసి యంగదుఁ డంతకృతాంతుకైవడిన్
వడి నరుదెంచి బిట్టు ఘనవక్షము వజ్రసమానముష్టిచేఁ
బొడిచిన దైత్యపుంగవుఁడు బోరన నెత్తురు లోలిఁ గ్రక్కుచుం
బడియె గతాసుఁ డై ధరణి భారమునన్ వెసఁ గ్రుంగునట్లుగన్.

1512


వ.

అట్లు విరూపాక్షోన్మత్తసుపార్శ్వులు కూలినం గినిసి దశముఖుండు.

1513


శా.

కోపాటోపము మోములన్ ముడివడన్ ఘోరాంతకాకారుఁ డై
యాపౌలస్త్యుఁడు రక్తలోచనవినిర్యద్విస్ఫులింగోగ్రుఁ డై
పై పై నూర్పులు గ్రమ్మఁ గోఱలరుచుల్ భాసిల్లఁగా సంగర
వ్యాపారంబున దుర్నిరీక్ష్యవిభవుండై సూతుతో నిట్లనున్.

1514


ఉ.

నేరుపు నశ్వశిక్షణవినిర్ణయముం దనరారునట్లుగాఁ

దేరు రయంబునం బఱపు తీర్చెద నాపగ యెల్ల నెమ్మెయిం
బోర వధింతు రాఘవుల భూరుహసాధను లైనవానరుల్
బీరము దక్కి దిక్కులకుఁ బెల్కుఱి పాఱఁగ నెల్లభంగులన్.

1515


మ.

అతితుంగధ్వజయష్టి మి న్నొఱయ నశ్వానీకలోలత్ఖుర
క్షత మై భూమిరజంబు పె ల్లెగసి యర్కస్ఫూర్తి మాయింప నూ
ర్జితనేమిధ్వని దిక్కులందుఁ బెరుఁగం జిత్తానుకూలోల్లస
ద్గతి యై క్రాల రథంబు సూతుఁడు సముద్దామంబుగాఁ దోలినన్.

1516


సీ.

పటహకాహళశంఖపటునినాదంబులుఁ, జటులకార్ముకపృథుజ్యారవంబుఁ
గుటిలరాక్షసకోటికోలాహలంబులుఁ, గరటిఘటానీకఘనరవములు
వలమానఘోటకవరహేషితంబులు, నిష్ఠురరథనేమినిస్వనములు
సూతమాగధజయస్తుతివిరావంబులు, మంజులమంజీరశింజితములుఁ
గలయ బెరయఁ బంక్తికంఠుఁడు సనుదేరఁ, గపులు లయకృతాంతుఁ గనినయట్లు
తలఁకి పఱచి రంతఁ బులిఁ గాంచి మృగములు, బెవరి పాఱుభంగిఁ బెంపు దక్కి.

1517


చ.

కనుఁగొని రాఘవేశ్వరుఁడు కన్గవ నెఱ్ఱఁదనంబు దోఁపఁగా
ధను వవలీలఁ బుచ్చుకొని ధారుణి తల్లడ మంద వానరు
ల్వినుతులు సేయుచుండఁగ నిలింపులు సంతస మంది చూడఁగా
మునుకొని బాణవర్షమున ముంచె నభోవలయంబు దిక్కులున్.

1518

రామరావణులద్వితీయయుద్ధము

ఉ.

తేఁకువ పెంపు గల్గి జగతీతలనాథుఁడు పంక్తికంఠుఁడుం
దాఁకిరి బాణపంక్తి వితతంబుగ దేవవిమానకోటిపైఁ
జోఁకఁగఁ గ్రొమ్మెఱుఁగు లొగి సొంపు వహించుచు నుండ వేడుకన్
మూఁకలు రెండు నుద్గతవినోదము నొంది చెలంగి చూడఁగన్.

1519


మ.

మింటం బర్వుచు జృంభమాణగరుదున్మేషంబు లై పేర్చి యొం
డొంటిం దాఁకుచుఁ దొట్టి మిట్టిపడి యత్యుగ్రంబు లై యేపునన్
మంటల్ దిక్కుల నిండ నెంతయు నసామాన్యంబు లై తూపు లే
వెంటం బాఱఁ దొడంగె దైత్యనృపదోర్వీర్యంబు లేపారఁగన్.

1520


క.

ఇరువురబాణములు దిగం, తరములుఁ బుడమియును మిన్నుఁ దలముగఁ బొదువన్
గురుతరతిమిరము గవిసెం, బర పగునడురేయివోలెఁ బరువడితోడన్.

1521


మ.

నలినీబాంధవుఁ డస్తమించిన ననూనం బై తమం బెల్లచో
గలయం బర్వినభంగి [169]నంతసమయాకారంబుచందంబుగా
గెలువన్ దైత్యుఁడు దామసాస్త్రము ప్రయోగించెం బ్లవంగేంద్రు లం
ధులమాడ్కిన్ మును గాన లేక ధరణిం దోడ్తో [170]వెసన్ మ్రొగ్గఁగన్.

1522

సీ.

కెందమ్మిఱేకులయందంబు గలిగిన, కనుఁగవ రోషాగ్ని గడలుకొనఁగ
దండభృత్పురవరద్వారతోరణ మన, మొగమునఁ బెనుబొమముడి దలిర్ప
గరళకంధరవృషస్కంధాంసయుగళంబు, ఘనతరంబుగఁ దలకడచి పెరుఁగ
సౌదామినీలతాసమమైన గొనయంబు, సారించి దైత్యుల సమయఁజేయఁ
బదులు నూర్లు వేలుఁ బఱఁగించెఁ దూపులు, పిడుగుఁదునియ లనఁగఁ బెల్లు గడఁగి
వెలయ నేర్చియున్నవిలువిద్య మెఱయుచు, వివిధగతులు నెఱసె వీరవరుఁడు.

1523


క.

ఇనకులుఁ డేసినశరములు, దునిమె దశాననుఁడు గడఁగి దుర్దమశక్తిన్
వనసింధురంబు బలువడి, వనరుహనాళంబు ద్రుంచి వైచినకరణిన్.

1524


క.

దశముఖుఁడు దఱిమి తూపులు, దశరథనందనునిమీఁదఁ దఱుచుగఁ బఱపెన్
నిశితార్ధచంద్రశరముల, విశకలితము లయి పడంగ వెస నతఁ డేసెన్.

1525


క.

ప్రతిరోమకూపములపై, నతులితగతిఁ దనర మనుకులాధిపుఁడు శర
ప్రతతులు రావణుమేనం, జతురంబుగఁ గీలుకొల్చె సంరబ్ధుండై.

1526


క.

రౌద్రాస్త్ర మేసి రిరువురు, రౌద్రరసం బొదవ రెండు రభసమునఁ గృతో
పద్రవము లగుచు నొక్కట, నుద్రేకము లుడిగి పడియె నురుజవ మెడలన్.

1527


వ.

అంత దశరథతనయదశకంఠు లకుంఠితవిక్రమం బొప్పఁ గంఠీరవంబులచాడ్పునం
బరస్పరవిజయసముత్కంఠితు లయి కృతాంతభూవిభ్రమంబులు గలచాపంబు
లఁ దదీయకటాక్షపాతంబులం బోనిమహోగ్రసాయకంబులు పఱపుచు సము
ద్రంబులచందంబున ఘూర్ణిల్లుకోదండంబులవలనం గల్లోలంబులం బోనిభల్ల
పరంపరల వెల్లిగొల్పుచుఁ బైపైఁ దిమిరంబులు గల్పించుచు రేలుం బగళ్లు
నొక్కొక్కముహూర్తంబనఁ గావించుచుండ నంత లంకావల్లభుండు ఘోరనా
రాచపరంపరల రాముఫాలభాగంబు గంటి చేసిన నతండు నిందీవరదామంబు
దాల్చువిధంబునం దనరి కోపించి రవికరంబులం బోనివేఁడిమిగలవాఁడికోలల
వానికంకటంబు చించి నొప్పించిన.

1528


ఆ.

సర్పముఖము లయినశరములు నృపుమీఁద, నేసి యార్చె దానవేశ్వరుండు
వాని నడుమఁ దునియఁగా నేసె రఘుపతి, పరఁగుచున్న నిశీతభల్లతతుల.

1529


ఆ.

ఆసురాస్త్ర మంత నాదైత్యుఁ డేసిన, నడరి యేఁగుదెంచె నంబరమున
జడధి వెడలివచ్చు బడబాగ్నికైవడి, నంబుదంబువలనియశనిపగిది.

1530


సీ.

ప్రాకటంబుగఁ బుండరీకాననంబులు, వఱలఁగఁ బంచాస్యవదనములును
భీకరాకృతి దోఁప సూకరాస్యంబులు, వరమహోరగతుల్యవక్త్రములును
జటులదంతావళసన్నిభముఖములు, విపులోగ్రభేరుండలపనములును
భల్లూకభీషణబహుళముఖంబులు, శరభసముత్కరాస్యములు మఱియు
గాకకంకగృధ్రకౌశికజంబుక, శునకముఖము లైనఘనశరముల
నొక్కమాత్రలోన నుర్వీశతిలకుండు, వాని నెల్లఁ ద్రుంచివైచి యార్చె.

1531

శా.

మాయాగ్రేసరుఁ డైనరావణునిదుర్మానంబు దూలన్ యుగ
ప్రాయోదారభుజుండు రాఘవుఁడు శుంభద్వేగుఁ డై పేర్చి రో
షాయత్తం బగుమానసంబున జయవ్యాసక్తి రాజిల్ల నా
గ్నేయాస్త్రంబు సమంత్రకంబుగఁ బ్రయోగించెం బ్రయోగించినన్.

1532


సీ.

తఱుచుగా గిఱిగొన్నమెఱపులు నెఱుపుచుఁ దోరంపుధూమకేతువులుఁబోలె
నుగ్రతేజముతోడి యుల్కల నీనుచుఁ, బెల్లుగాఁ బిడుగులు వెల్లిగొల్పి
బహుభేదభాస్వరగ్రహములఁ బోలుచు, వితతోగ్రతారకాతతుల మీఱి
భానుమండలకోటిభాసురాననము లై, విలయాగ్నిముఖము లై కలయఁ బర్వి
జానకీజానియాగ్నేయసాయకములు, పొదలి రావణుశరములఁ బొలియఁజేసె
వైదికాగమపరిశుద్ధవాక్యతతుల, నోజ దక్కినసౌగతయుక్తు లనఁగ.

1533


క.

ఆసుర మాగ్నేయమునన్, గాసిం బొందిన సమస్తకపివరులు సము
ల్లాసంబు నొంది యార్చిరి, త్రాసము రాక్షసుల కొదవ ధరణి వడంకన్.

1534


మ.

మయమాయమయశక్తినిర్మితము భీమప్రాభవంబున్ మహా
రయసంపజ్జితవాతచక్రము సురవ్రాతాసురానీకదు
ర్ణయసంరంభము భానుబింబసమతేజం బైనయస్త్రంబు భూ
రియశోధాముఁడు రావణుండు సమరోద్రేకంబుతో నేసినన్.

1535


చ.

పరశుగదాకృపాణశరపట్టిసముద్గరశక్తికుంతతో
మరవరభిండివాలములు మంటలు నొక్కట నుప్పతిల్ల నం
బరమును దిక్కులుం గలయఁ బర్వుచు నుగ్రభుజంగమండలో
దురగతి నేఁగుదెంచె వడితోడ నుదారశరంబు చెచ్చెరన్.

1536


శా.

దుర్వారక్రమవిక్రమంబు పెరుఁగన్ దోర్వీర్య మేపారఁగా
గీర్వాణుల్ దివి మెచ్చి యచ్చెరువడం గేలీగతిన్ వీఁకతో
నుర్వీచక్రము గ్రుంగఁ బాదయుగ మత్యుల్లాసి యై యూఁది గాం
ధర్వాస్త్రంబు నరేంద్రుఁ డేసెఁ గపిబృందం బుబ్బి గర్జిల్లఁగన్.

1537


క.

ఆయస్త్రనిహతి నప్పుడు, మాయామయసాయకంబు మాయం బయ్యెం
దోయదపటలము దుస్సహ, వాయువుచే విరిసి పాఱువడువున నంతన్.

1538


ఉ.

రావణుఁ [171]డేయ నుగ్ర మగురౌద్రశరంబునఁ దోఁచె మింట నా
నావిధభానుమండలఘనద్యుతిపుంజము లైనచక్రముల్
పావకసన్నిభంబు లగుబాణము లుగ్రభుజంగమంబులున్
వావిరి సింహముల్ బహురవం బొదవన్ జనియించె నత్తఱిన్.

1539


క.

మించినయాచక్రాదుల, నంచితదివ్యాస్త్రనిహతి నన్నియుఁ దూలం
ద్రుంచె రఘుపుంగవుఁడు రా, యంచ మృణాళములు ద్రుంచునాక్రియ దోఁపన్.

1540

సీ.

మిక్కిలి కోపించి యక్కజంబుగ దశ, కంఠుఁడు రాముపైఁ గడఁగి యార్చి
నిశితనారాచముల్ నిగిడించి మర్మముల్, నొప్పింప రాముండు దెప్పరముగ
మంచుముంచినమాడ్కి నించుక యెడలేక, భూనభోవివరంబు మునుఁగ నేసె
నెఱఁకులు దూలంగ నిష్ఠురాస్త్రంబులు, మేదురంబులు గాఁగ మేన గ్రుచ్చెఁ
బరఁగ నిరువురు నన్యోన్యబాణహతులఁ, బుష్పితాశోకకింశుకస్ఫురణ గల్గి
శాల్మలీతరుసముదగ్రశలలమృగము, లనఁగ నొప్పిరి జయకాంక్ష లినుమడింప.

1541


వ.

అయ్యవసరంబున గిరిగుహకుహరంబు వెడలి వచ్చుమృగేంద్రంబు ననుకరించు
చు నంభోధరమండలంబు పాసి చనుదెంచుదంభోళిం బోలి సాగరంబు వెడలి
యేతెంచుబడబానలంబుమాడ్కిఁ బాతాళవివరంబువలన నరుగుదెంచుమహా
నాగంబుపగిదిఁ బ్లవంగబలమధ్యంబువలన నేఁగుదెంచి విక్రమోద్ధతతేజోదృష్టి
భీషణుండై లక్ష్మణుం డెడచొచ్చి యొక్కభల్లంబునం గనత్కనకమణికుండలమం
డితం బగుతత్సారథిమస్తకంబు దునిమి మేరుసారం బగుతదీయకార్ముకంబు నొ
క్కసాయకంబునఁ ద్రుంచి యభ్రంకషం బగుకేతనం బొక్కయర్ధచంద్రసాయ
కంబునం గూల్చి యతివిశాలకదనం బగువశకంఠువక్షంబు పంచవిశిఖంబుల
నొప్పించె నంత విభీషణుండును నీలజీమూతనీకాశంబులును బర్వతప్రమాణగా
త్రంబులును నగురథతురంగంబుల నొక్కటఁ జదియ గద వ్రేసిన విరథుండై లం
కేశ్వరుండు మహీధరోపరి భాగంబున నుండి లంఘించుశరభంబు చాడ్పున నిల
కుఱికి నిలిచి.

1542


మ.

స్ఫుటరోషంబున నవ్విభీషణునిపై భూవిభ్రమాడంబరో
త్కటుఁ డై పంక్తిముఖుండు శక్తిఁ బఱపన్ దంభోళిసంరంభసం
ఘటనాకారత నేఁగుదేరఁ గని యుగ్రస్ఫూర్తి సౌమిత్రి దాఁ
బటుబాణత్రయ మేసి త్రుంచెఁ నది భూభాగంబునన్ వ్రాలఁగన్.

1543


సీ.

జంభారిచే నున్నదంభోళికైవడి, మెఱుఁగుఁదీగలు మిఱుమిట్లు గొలుప
నీలకంఠునిచేతిశూలంబుచాడ్పున, మంటలు దోడ్తోన మింటఁ బొదలఁ
గాలాంతకునిచేతికాలదండముఁబోలెఁ, జూపఱకును దేఱిచూడరాక
జలజలోచనుచేతిచక్రంబువడువునఁ, గడునమోఘం బయి కడలుకొనుచు
మయవినిర్మిత మై మహామహిమఁ దనరిఁ, భూరిమాంసాస్త్రముల నోలిఁ బూజ నొంది
పూని విజయైకసాధన మైనశక్తి, వడి విభీషణుపై వైవ నడరె నతఁడు.

1544


చ.

అనయము నెల్లనాఁడు శరణాగతరక్షకుఁ డైనవానికిం
దను నభయంబు వేఁడినఁ బదంపడి కాచుట ధర్మువే కదా
యని రఘునందనావరజుఁ డారజనీచరనాథుతమ్మునిన్
వెనుకకుఁ ద్రోచి నిల్చి పటువీర్యమునన్ విశిఖంబు లేసినన్.

1545


శా.

విల్లుం గోలలుఁ దాల్చి నీవు భువిలో వీరుండపోలెన్ సమీ

కోల్లాసంబున నవ్విభీషణునకై యూహింప కేతెంచుచోఁ
జెల్లింపం దగు నీకు నీప్రతిన నాచేఁ జావు సిద్ధంబు నీ
పెల్లెల్లం బొలియించుశక్తి యని సుస్ఫీతంబుగాఁ బల్కుచున్.

1546

రావణునిశక్తిచేత లక్ష్మణుండు మూర్ఛఁ బొందుట

సీ.

ప్రళయోగ్రమార్తాండపరివేషమండల, దీప్తులు సుడివడఁ [172]ద్రిప్పి వైవ
నష్టఘంటానాద మవనిభూధరగుహా, గర్భగేహంబులఁ గలయఁ బర్వఁ
గల్పాంతపావకకల్పమహాజ్వాల, లంబరంబుననుండి యవులఁ జనఁగ
శేషభోగీశ్వరజిహ్వాకరాళ మై, చనుదేరఁగా రామచంద్రుఁ డప్పు
డడరి సౌమిత్రి చావకుండెడు మనంగఁ, గపులహాహారవంబులు గలసి బెరయ
శరములన్నియుఁ జదువుచు శక్తి వచ్చి, యురము గాఁడిన లక్ష్మణుం డుర్విఁ గూలె.

1547


చ.

బలపరిణాహసంపదయు బంధురబాహుసమగ్రశక్తియుం
బొలిసిన నిర్విచేష్టుఁ డయి భూస్థలిపైఁ బడె సంక్షయంబునన్
నిలువక కూలుమేరుధరణీధరమో యనఁ గూర్మితమ్మునిం
దరలక చూచి నెమ్మనము తాలిమి దూలఁగ రామభద్రుఁడున్.

1548


చ.

వనజదశాగ్రభాగముల వావిరిఁ గ్రమ్ముహిమంబుచాడ్పునం
గనుఁగవ లశ్రుబిందువులు గాఱఁగ డెందము తల్లడిల్లఁగా
బెనుపగ చిమ్మచీఁకటులపెల్లు వివేకదినేశమండలం
బునఁ దొలఁగంగఁ ద్రోచి గుణభూషితధైర్యసఖావలంబుఁ డై.

1549


చ.

వనరుహమిత్రసన్నిభునికవక్షము పెల్చన దూఱి భూమి గాఁ
డినఘనశక్తియుం బెఱుక డెప్పర మైనఁ గపీంద్రు లూరకుం
డినఁ జనుదెంచి రోషము నటింపగ వే పెకలించి త్రుంచె నే
పున వినతాసుతుండు ఫణిపుంగవముం దునుమాడుకైవడిన్.

1550


శా.

ఆలోనన్ రజనీచరేశ్వరుఁడు కర్ణాంతోపసర్పద్గుణా
భీలుం డై ఫణిరాజసన్నిభధనుర్భీమత్వసంపాది యై
కీలాలంబులు మేనఁ గ్రమ్మి తొరఁగం గీలించె నారాచము
ల్భూలో కాధిపుమీఁద మత్సరకరాళుం డై రణవ్యగ్రతన్.

1551


మ.

కరకావర్షము లద్రి యోర్చుకరణిన్ గర్వాంధనక్తంచర
స్ఫురదస్త్రంబులు లెక్క సేయక జగత్పూర్ణానుభావుండు భూ
నరుఁ డామారుతుకూర్మినందనుని భాస్వత్సూనునిం గాంచి సం
గరసంరంభరసంబు వెల్లివిరియం గా వారితో ని ట్లనున్.

1552


చ.

గొనకొని శోకవేగమునకున్ సమయం బిది గాదు విక్రమం
బున కగువేళ గావునఁ బ్రభూతభుజాయతశక్తి చూపెదన్

మునుకొని మీర లిందఱును మోసము నొందక మించి నేర్పుతో
నొనరఁగఁ జేరి కాచుకొని యుండుఁడు లక్ష్మణు నేకచిత్తు లై.

1553


సీ.

రమణీయ మగుమహీరాజ్యంబు వోనాడి, యడవుల నిడుమలు గుడిచి డస్సి
దండకావనములో నుండి ప్రాణమ్ముల, కంటెఁ బ్రియం బైనకాంతఁ గోలు
పోయి వియోగార్తిఁ బొంది మీతోఁ గూడి, వాసవనందను వాలిఁ జంపి
వారాశి బంధించి వడితోడ లంఘించి, నెట్టన నీలంక చుట్టుముట్టి
కడఁగి యనిలోనఁ బెక్కురక్కసులఁ ద్రుంచి, కుంభకర్ణాదివీరులఁ గూల్చి యింద్ర
జిత్తు వధియించి ముదమునఁ జెలఁగునంత, నిట్టియాపద చనుదెంచె నివ్విధమున.

1554


క.

నాకన్నులయెదురం బడి, యేక్రియ మెయిమెయిన బ్రదికి యేఁగెడు నింకన్
లోకంబు లెల్ల సుఖముం, జేకొనఁ జిత్తమున వేడ్క సిద్దింపంగన్.

1555


క.

నీచాత్ముఁ డైనయీరజ, నీచరుతో నాదుయుద్ధనిపుణత వేడ్కం
జూచుచు నుండుఁడు విస్మయ, గోచరు లై మీర లెలమిఁ గుతుకితమతు లై.

1556


తే.

మీర లిందఱు వినుచుండ మెఱసి యొక్క, ప్రతిన చేసెద దుర్వారబాహుశక్తి
నెరయ నేర్చినవిలువిద్య నేర్పు గలిగి, పో రొనర్చెద సురకోటి పొగడుచుండ.

1557


సీ.

వనరుహబాంధవవంశంబునందు నే, జననంబు నొందుట చనునయేని
ధర్మలోలుం డైనదశరథేశ్వరునకు, నాత్మసంభూతుండ నయితినేని
ననిలోన నేపున నాదశకంఠుండు, నెఱి దప్పి పాఱక నిలిచెనేని
తగవును సత్యంబుఁ దగుభంగి నేప్రొద్దు, వదలనిప్రీతిఁ జల్పుదునయేని
రాముఁడొండెను భువిలోన రావణుండు, నొండె నింతియ యిరువురు నుండు [173]టెట్లు
గలుగనేర్చును గావునఁ గడఁగి వీని, నేపుమాపెదఁ దూపుల ప్రేఁపు లెగయ.

1558

రావణుఁడు రామశరవిద్ధుం డై కాందిశీకుం డగుట

మ.

అని యారాఘవుఁ డంత రోషవివశోగ్రాకారుఁ డై వింటినే
ర్పును దోస్సారము నొక్కరూపుగ వెసం బుంఖానుపుంఖంబుగాఁ
గనదస్త్రంబులు రాక్షసేశ్వరునిపై గల్పాంతదంభోళిగ
ర్జనసంరంభము లేర్పడం బఱపె నూర్జత్సత్త్వసంపన్నుఁ డై.

1559


క.

ఇరువుర బాణావళు లం, బరతలమునఁ గలయ నిండఁ బర్వుచు నితరే
తరహతులఁ జేసి నేలం, దొరఁగె మహోల్కాసమానదుస్సహరుచు లై.

1560


శా.

ఆనక్తంచరరాజరాఘవులదృప్యత్సారబాణాసన
జ్యానిర్ఘోషములం గలంగె జలధుల్ సర్వంసహాచక్రమున్
దూనం బై కదలెం గులాచలములుం దోడ్తోన వ్రీలం బడెన్
హీనత్వంబు భజించి వంచె భుజగాధీశుండు మూర్ధంబులన్.

1561


సీ.

మండలీభూతకోదండుఁ డై పైపయిఁ, జండకాండంబులు మెండుకొలిపి

చండాంశుదీధితిమండలంబులఁ బోలు, వేఁడిచూడ్కులు మీఁద వెల్లి గొలిపి
యన్యోన్యధిక్కరణాదివాక్యంబుల, నూతనస్థితితోడ నూలుకొలిపి
సింధుగంభీరోగ్రసింహనాదంబుల, నోలి భూతములకు జాలిగొలిపి
దశరథాత్మజుండు దశకంధరుండును, హరులు రాక్షసులును నడరి పొగడ
నేపు మిగిలి చూడ నిరువురుఁ దుల్యు లై, కోరి పోరి రిట్లు కొంతసేపు.

1562


వ.

అంత నతికఠోరంబు లగురామునిబాణపాతంబుల జర్జరీభూతసర్వావయవుం డై
కుసుమితపారిభద్రంబు ననుకరించుచు సర్వతోధికంబులై పఱతెంచుసీతావల్లభు
ఘోరనారాచధారల కోర్వక దశశిరంబుల కేశకలాపంబులు వెన్నునం దూల
మణిమకుటదశకం బెడలిపడ నిలువంబడినం బరిధానాంచలంబు సమరతలంబునఁ
గేతనపటాకారం బమరింప ధరణి గంపింప నసహ్యవిక్రమం బైనసింహంబుఁ
బొడగాంచి పఱచుకుంజరంబుచాడ్పున నసురులు బెదరఁ గపు లార్వఁ గాందిశీకుం
డై లంకేశ్వరుండు మగిడి లంక సొచ్చి యంతఃపురంబున కరిగి సేద దీర్చుకొని
డెందంబుతల్లడం బుడిపికొని లజ్జ యుజ్జగించి మందోదరి రావించి పెద్దయుం
బొద్దు చింతించి యి ట్లనియె.

1563


స్రగ్ధర.

ప్రౌఢాహంకారయుక్తప్రథితగురుభుజాప్రాభవోదారసార
వ్యూఢోరస్కుండు చాపాభ్యుపగమచతురత్వోర్జితుం డాజిఁ బ్రత్యా
లీఢస్థానోగ్రుఁ డై శూలిక్రియ నతికరాళీభవల్లోచనశ్రీ
గాఢుం డై రాముఁ డత్యుత్కటగతి శరముల్ గాఁడ నొప్పించె నన్నున్.

1564


ఉ.

నీతిరహస్యసారకృతనిర్ణయబుద్ధివివేకశాలి సం
ప్రీతిమెయిన్ విభీషణుఁడు పెక్కువిధంబుల నాహితంబు సం
స్ఫాతి దలిర్పఁ గోరి మును వల్కిన చందము లాత్మ మేలు నా
నైతి వివేకశూన్యమతి నై తలపోయక వారిజాననా.

1565


చ.

ఘననిభుఁ గుంభకర్ణుని నకంపను విక్రమశాలి నింద్రజి
త్తుని నతికాయు శౌర్యవినుతుం డగుకుంభు నికుంభునిం బ్రహ
స్తుని నభయున్ నరాంతకునిఁ ద్రుంచిరి యానరవానరాధము
ల్మనమునఁ గిన్కయున్ వగయు లజ్జయు నిప్పుడు నాకు నయ్యెడిన్.

1566


సీ.

బలభేది వ్రేసినకులిశంబునకు నోర్చి, యనలునిశక్తి గైకొనక జముని
దండంబు సైరించి దైత్యేంద్రుఖడ్గంబు, సరకు సేయక పేర్చి వరుణుచేతి
పాశంబునకుఁ జిక్కువడక ప్రభంజను, భంజించి ధననాథుబాహుగదకుఁ
దలఁకక యీశానుదారుణశూలంబు, లెక్క సేయక తొల్లి యుక్కు మిగిలి
గరుడసిద్ధసాధ్యగంధర్వయక్షుల, గెలిచి యున్ననాకు బలము దూల
నొక్కనరునిచేత నోటమి సిద్ధించె, నిట్టిపోరు లెన్నఁ డే నెఱుంగ.

1567


క.

పిడుగులకంటెను మిక్కిలి, బెడిదము లై వచ్చు రాముభీమాస్త్రంబుల్

సుడిగొని నెఱఁకులు నాటఁగ, వడి దప్పక నిలిచి యోర్చువాఁడుం గలఁడే.

1568


క.

తురగములమీఁద మదకం, జరములపై రథములందుఁ జదలను ధరణీ
ధరములయందును రత్నా, కరమందు నృపాలుఁ డపుడు గానంబడియెన్.

1569


తే.

అడరి యెయ్యది చూచిన నదియ నాకు, రాఘవాకృతియై తోఁచు రణములోన
నివుడు రామసహస్రంబు లెల్లచోట్లఁ, గానవచ్చుచు నున్నవి కమలనయన.

1570


సీ.

కావున నే నింకఁ గందర్పదర్పఘ్ను, భసితాంగరాగసంభరితగాత్రు
భుజగకులాధీశభూషణభూషితుఁ, గమనీయశశిఖండకలితమాళి
నీలజీమూతవినీలలసత్కంఠు, సునిశితవరమహాశూలహస్తు
నభ్రగంగాసలిలార్ద్రజటాజూటు, శైలజముఖచంద్రచలచకోరు
దేవదేవు నభవుఁ ద్రిణయనుఁ ద్రిపురాంత, కరు వరేణ్యు వరదుఁ బరమధాము
నజరు నాదిమధ్యమావసానరహితుఁ, గొలుతు నాత్మ భక్తి నెలకొనంగ.

1571


సీ.

మును నాదుసంగీతమును మెచ్చి వర మిచ్చె, నగసుతానాథుండు నాకుఁ బ్రీతి
నరులకు నీ వోడు నప్పుడు ననుఁ గూర్చి, హోమంబు విధితోడ నొనరఁ జేయఁ
దివిరి గ్రక్కున నొక్కదివ్యరథం బందు, జనియించు నురుజవాశ్వములతోడఁ
గమనీయ మగుమహాకవచంబు మాహేశ్వ, రం బగుదివ్యచాపంబు గలుగు
నడుమ విఘ్నంబు గాకుండ నడిచెనేని, జయము చేకుఱు ననయంబు సంగరముల
ననియెఁ గావున నేఁడు నా కట్లు చేయ వలయు నీపగ దీర్పంగ వలను గలుగ.

1572

మందోదరి రావణునకు హితము చెప్పుట

వ.

అని స్నానంబు సమాచరించి హోమంబు యథాపూర్వంబుగాఁ బ్రవర్తించి
భూసురుల కనేకధనంబు లొసంగి రక్తమాల్యాంబరాభరణయజ్ఞోపవీతాలంకృ
తుండై పరమేశ్వరాలయంబున కరిగి యచ్చో నచ్చుపడ నొక్కవేదిక నిర్మాణం
బు సేసి దర్భసమాస్తరణంబు గావించి సర్వతోధికంబుగాఁ దనకు రక్షణార్థం
బు నక్తంచరులఁ బెక్కండ్ర నియోగించి హోమంబు ప్రవర్తింప సమకట్టునిజ
వల్లభుం డైనలంకానాథునొద్దకు నేతెంచి సింహకృశోదరి యైనమందోదరి
యి ట్లనియె.

1573


మ.

అకటా చాపవిశేషకౌశలము మాయాకృత్యపాండిత్యమున్
వికటాస్త్రావలిపెంపు దుర్దమభుజావీర్యాదిసామగ్రియుం
బ్రకటాడంబరఘోరసైన్యములశుంభచ్ఛక్తియుం గల్గి యూ
రక నీ కీమునివృత్తి నొందఁ దగునే రక్షోగణాధీశ్వరా.

1574


క.

హేలావిక్రమ మొనరఁగఁ, గైలాసనగేంద్ర మెత్తి ఘనవిఖ్యాతిం
ద్రైలోక్యంబుల నుద్ధతిఁ, గ్రాలినహస్తములు గలుగఁగా భయ మేలా.

1575


సీ.

నీవు గోపించిన నిర్జరాధిపుఁ డైనఁ, గుంభినీధరములగుహల నడఁగు
దహనుండు వేఁడిమిదళము చూపఁగ లేఁడు, పద్మబంధుఁడు దపింపంగ వెఱచుఁ

గడఁగి సదాగతి కదలఁగ బెగడొందుఁ, దోయరాశియు నుబ్బి మ్రోయనోడు
పొలు పేది జముఁడును బొడసూపఁ దలఁకును, వసుమతీస్థలి నడవడ వడంకు
నెరయ నీపేరు వినుమాత్ర నిలువలేరు, సురమహోరగగంధర్వవరులు నాజిఁ
జెలఁగి వైరులశక్తి నిర్జింతు గాక, తాపసత్వము నీ కేల దనుజనాథ.

1576


క.

నీ కింత బెగడు గలిగిన, లోకోత్తరుఁ డయిన రాములోలాక్షి వెనం
జేకొని తెత్తువె తెచ్చితి, వీకార్పణ్యంబు నొంద నిం కేమిటికిన్.

1577


క.

రాముఁడు సమస్తజగదభి, రాముఁడు గాంభీర్యధైర్యరాజితసుగుణో
ద్దాముఁడు దనుజానీకవి, రాముఁడు సామాన్యుఁ డగునె రాక్షసనాథా.

1578


మ.

పురుహూతుండొ కృశానుఁడో శమనుఁడో పూర్వామరాధీశుఁడో
వరుణుండో యనిలుండొ యక్షపృతనావర్యుండొ యీశానుఁడో
దొరయన్ నీకు రఘూద్వహుం డలుకచే దోర్వీర్యమున్ వింతయే
ఖరునిం గూల్చినవాఁడు నీ వెఱుఁగవే కారింపఁగా శక్యమే.

1579


క.

మునిచందము వీడు మింకను, మునుపటితాలిమి వహింపు మోదంబున నె
మ్మనమున ధైర్యము విడిచిన, నిను నగరె సుపర్వు లైన నిర్జరవైరీ.

1580


ఆ.

పెక్కుమాట లేల నిక్కువం బగు పల్కు, వినుము భుజబలంబు వెలయుచుండఁ
బగఱ నొడుచు టొప్పుఁ బందతనంబున, విమల మయినయశము వెలయఁగలదె.

1581


క.

అని మందోదరి చెప్పిన, విని దైత్యుఁడు సిగ్గు నొంది వెలఁదియుఁ దానుం
జనె నభ్యంతరమునకును, మనమున జయకాంక్ష మిగుల మల్లడిగొనఁగన్.

1582


ఉ.

అత్తఱి రాముఁ డుగ్రసమరాంగణధారుణిఁ గూలి నెత్తుటన్
జొత్తిలి ధూళి బ్రుంగి వివశుం డగుతమ్ముని జూచి నెమ్మనం
బుత్తలపాటు నొంద మది నోర్వక ధైర్యము దూలి పోవఁ బై
నెత్తిన పెల్లు నెవ్వగల ని ట్లనుచున్ విలపించె దీనుఁ డై.

1583


ఉ.

ఆలములోన దైత్యులఁ గృతాంతునికైవడి నుగ్రభంగి బా
ణాలి నిమేషమాత్రఁ దెగటార్చి ప్రియం బొనరింతు నిచ్చలున్
వాలుమగం డితం డనఁగ వాసికి నెక్కి దశాస్యుశక్తిచే
నేలకు వ్రాలి మేల్కననినిద్దుర నొందితివయ్య తమ్ముఁడా.

1584


ఉ.

చండమృగేంద్రభల్లవృకసైరిభసూకరపుండరీకభే
రుండతరక్షుశల్యపటురోషమహాశరభోగ్రమత్తవే
దండవిభీషణాటవులఁ దద్దయు నన్ను భరించి దీర్ఘదో
ర్దండసమగ్రసార దిగఁ ద్రావి చనం దగునయ్య యిక్కడన్.

1585


చ.

ఘనభుజ నీవు నేను మును గానకు నై చనుదెంచి యిక్కడన్
నిను నిటు గోలుపోయి ధరణీతలరాజ్యము సౌఖ్యశక్తియున్
జనకజయుం బ్రవృత్త మగుసంగరకృత్యము నేటి కింక జీ

వన మిది యేల కూడ నిదె వచ్చెదఁ దమ్ముఁడ కూడ నీఁ గదే.

1586


చ.

అడవికి వచ్చునాఁడు నయ మారఁగ నిన్ దగ నప్పగించె నా
కడలుచు నేను నట్ల యగు నంటి నయోధ్యకు నింక నేఁగఁ ద
ల్లడమున నిన్నుఁ గాన కొగి $ లక్ష్మణుఁ డేఁ డనుచున్ సుమిత్ర న
న్నడిగిన నేమి చెప్పుదు దశశాననుచే ననిఁ గూలె నందునే.

1587


క.

ననుఁ బాయలేక యడవికిఁ, జనుదెంచి పరాసుఁ డయ్యెఁ జయ్యన యే నీ
తనిఁ గూడఁ బోవకుండిన, నను జనులు కృతఘ్నుఁ డనరె నానాభంగిన్.

1588


క.

ఎలనాఁగలుఁ జుట్టంబులుఁ, గలుగుదు రెచ్చోట నయినఁ గర మరుదారం
దలఁప సహోదరు నెలమిం, గలుగఁగ నెచ్చోటఁ బడయఁగాఁ దర మగునే.

1589


వ.

అని బహుభంగుల విలపించుచు నెవ్వగలం బొగులుచు బాష్పధారాసిక్తాననుం
డగురఘువీరుం గనుంగొని డెందంబువంత దొలంగించుచు సాంత్వనపూర్వకం
బుగా సుషేణుం డి ట్లనియె.

1590


తే.

తగునె యీక్రియ రఘుకులోత్తంస వగవ, నరయ దేవర యెఱుఁగనిదియుఁ గలదె
సర్వకార్యములకు వినాశకర మయిన, శోక ముడుగుము ధైర్యంబు ప్రాకటముగ.

1591


శా.

మేనం బ్రాణము లున్న వీతనికి నున్మేషక్రియాసుందరం
బై నేత్రద్వయ మబ్జపత్రసదృశం బై యున్న దాస్యంబు రా
కానీహారకరోపమంబు గరయుగ్మంబుం బ్రవాళప్రతీ
తానూనచ్ఛవి నొప్పుచున్నయది వీతాసుత్వ మిం దున్నదే.

1592


తే.

నిద్ర నొందినచందంబు నెరయ నితని, హృదయపంకజ మల్లన యదరుచున్న
దినకులేశ్వర నావాక్య మెలమి నమ్ము, మితఁడు సప్రాణుఁడై యుంట యింతనిజము.

1593


సీ.

అని హనుమంతుతో నాసుషేణుం డను, జాంబవంతుఁడు మహౌషధులవిధము
మును నీకు నెఱిఁగించె మునుకొని సావర్ణ్య, కరణియు సంజీవకరణియు మఱి
సంధానకరణి విశల్యకరణి దెచ్చి, సౌమిత్రి బ్రతికింపు సరభసమున
లవణపయోరాశి లంఘించి యాకుశ, ద్వీపంబు దాఁటి యుద్వేల మయిన
పాలవెల్లి గడచి యోలి నుత్తరమునఁ, బరఁగు ద్రోణచంద్రగిరివరమ్ము
లమృత మచట నుండు నందు నీమందులు, గలవు రాత్రులందు వెలయుచుండు.

1594


వ.

అక్కడ గంధర్వరాజులు పెక్కండ్రు తద్దివ్యౌషధంబులు గాచుకొని యుండుదు
రు వారలతోడఁ బోరు గలుగు మఱియు నడుమఁ గామరూపధరులు వివిధమా
యావిశారదులు నగువిభావరీచరులతోడం గయ్యంబు ప్రవర్తిల్లు నప్రమత్తుండ
వయి యరుగు మిచటికి మూడులక్షలు నిరువది వేలు యోజనంబులు నీకు రాక
పోకల నినుమడించు.

1595

తే.

ఒగి విభావరి యవసాన మొందకుండ, రవియు నుదయాద్రిమీఁదికి రాకమున్న
యింతలోనన రమ్ము కపీంద్రతిలక, తడవు సేసినఁ గార్యంబు దప్పిపోవు.

1596


క.

ఆకులు మిక్కిలి తెల్లన, ప్రాకటముగ వానిపండ్లు పచ్చన పుష్పా
నీకమ్ము లరయ నెఱ్ఱన, నీ కెఱిఁగించితిని వాని నిజ మగుచిహ్నల్.

1597


శా.

ఈచందంబున నాసుషేణుఁ డన ధాత్రీశుండు సామీరితో
నీచే నీపని సిద్ధిఁ బొందు టిది దా నిక్కంబు వే పొమ్ము ర
మ్మా చిత్రమ్ముగ నాకు సోదరుని నిమ్మా ద్రోణశైలంబు దె
మ్మా చిత్తంబు ప్రమోద మొందఁగ నసామాన్యప్రభావోదయా.

1598


క.

సోదరుల మేము నలువుర, మైదవతో డగుదు వీవు ననయముఁ జేతో
మోదంబు మిగులఁ గలుగున్, నాదెసఁ గృప సేయవయ్య నగచరవర్యా.

1599


మ.

అని యారాముఁడు పల్క నాతఁడు [174]సమగ్రానందుఁ డై యుబ్బి యా
ర్చినఁ గంపించెను లంక వారి కలుషిoచెన్ దిక్కు లల్లాడె భూ
మి నగంబుల్ చలనంబు నొందెఁ బగిలెన్ మి న్నంతలోఁ బుష్పవృ
ష్టి నిలింపుల్ గురియించి గోలి మొరసెం జెల్వారఁగా దుందుభుల్.

1600


వ.

అంత హనుమంతుండు మేదినీకాంతున కి ట్లనియె.

1601


శా.

సప్తద్వీపసముద్రముద్రితమహీ[175]చక్రంబునన్ వేగఁ బ
ద్మాప్తుండుం బొడతేకమున్న యణుమాత్రార్ధంబునన్ వత్తు నే
నాప్తుండం గలుగంగ నౌషధగిరివ్యావృత్తి దా నెంత [176]సం
ప్రాప్తప్రాణునిఁగాఁ దలంపవె యమోఘారంభు నీలక్ష్మణున్.

1602


క.

అనవుడు నాతని నుపగూ, హనమున మన్నించి రఘుకులాధిపుఁడు ముదం
బున నాశీర్వాదంబులు, మన మారఁగ నొసఁగె ననుపమానప్రీతిన్.

1603


సీ.

హరి శిర మాదిత్యుఁ డాననపద్మంబు, శశి మనోవృత్తియు శైలతనయ
కటియు వాయువు వీఁపు కామారి వాలంబు, నగ్ని పాదంబులు నబ్జభవుఁడు
మతిఁ బాశహస్తుండు మహనీయశక్రియుఁ, బంకజనాభుండుఁ బాణియుగము
గజముఖుఁ డుదరంబుఁ గడఁకతో నేప్రొద్దుఁ, గాతురు నినుఁ బ్రీతిఁ బ్రోతు రెపుడు
ననిన నుత్సుకుఁడై యాతఁఁ డడరి యుబ్బి, వినయసంభ్రమసద్భక్తివివశుఁ డగుచు
వీరశేఖరుపాదారవిందములకు, నెరఁగి వానరకోటులు నెలమిఁ జెలఁగ.

1604

హనుమంతుఁడు రెండవసారి సంజీవనిఁ దేఁబోవుట

సీ.

శేషాహి వ్రేఁగున శిరములు వంపంగ, నవనీధరంబుపై నడ్గు నూఁది
సురరాజకరికరస్థూలహస్తంబులు, మింటితో నొరయంగ మీఁది కెత్తి
వాసుకి కెన యన వాలినవాలంబు, పెఱిగి చుక్కలతోడ నొరయుచుండ

మేరుశైలంబుతో మేలమాడెడిమేని, [177]మెఱుఁగుల మిఱుమిట్లు గిఱిగొనంగ
నడు మొకింత వంచి మెడయు సంకోచించి, నెగసెఁ దోన గిరులు నెగసి వెంటఁ
దగిలి పఱవ నభ్రతటినీజలంబులు, గలఁగి దిశలఁ గడచి కడలు కొనఁగ.

1605


చ.

సరసిజనాభముక్త మగుచక్రముకైవడి దుర్నిరీక్ష్యుఁ డై
[178]సరభసవృత్తి గంధవహుచాడ్పున నేఁగుచుఁ గాంచె మేదినీ
ధరములుఁ గాననంబులు నగరంబులుఁ బుణ్యనదుల్ మహాసరో
వరములు నూళ్లుఁ [179]బల్లెలును వాసికి నెక్కిన దేవభూములున్.

1606


క.

అట వేగరు లగువారలు, పటురయమున నేఁగుదెంచి పంక్తిముఖున క
చ్చటిరాముకార్యగతు లు, త్కటమున నెఱిఁగించి రతఁడు తల్లడ మందన్.

1607


క.

విని యాచారులఁ బోవం, బనిచి విచారించి విగతపరిచారుం డై
చనుదెంచెఁ జంద్రహాసము, గొని యల్లన కాలనేమిగృహమున కంతన్.

1608


ఆ.

అర్ధరాత్రిసమయ మగుట నచ్చో నున్న, కాంత లెల్ల నతనిఁ గాంచి కాలుఁ
డరుగుదెంచె ననుచు నంతంత నడఁగంగ, నెఱుఁగనట్లు పోలె నిల్లు చొరఁగ.

1609


చ.

వినయముతో నెదుర్కొని ప్రవీణతమైఁ దగఁ గాలనేమి యా
దనుజకులాగ్రగణ్యునకుఁ దద్దయుఁ బెంపున నర్ఘ్యపాదముల్
మన మలరంగ నిచ్చియు సమాదరణంబునఁ గేలు మోడ్చి యి
ట్లనియెఁ దదీయమానసమునందుఁ గుతూహల ముప్పతిల్లఁగన్.

1610


క.

నడురేయిఁ బిలువఁ బంపక, కడుకొని నీ వరుగుదెంచుకత మెయ్యది యేఁ
దడయక చేసెద నోపిన, నెడపక నీరాక నాకు నెఱిఁగింపు తగన్.

1611


వ.

అనిన దశముఖుం డతని కి ట్లనియె.

1612


చ.

అనుజుఁడు నాదుశక్తిఁ దెగరటాఱినచో బ్రతికింపఁ బూని నేఁ
డనిలజుచేత రాముఁడు మహౌషధశైలము దేరఁ బంపినం
జనియెడు నాతఁ డిప్పుడు సరసంభ్రముఁ డై వడి వాని నీవు చం
పిన నది మేలు వైరిగణభీషణబాహుబలంబు చొప్పడన్.

1613


క.

ఏవెంట నయిన విఘ్నము, గావింపుము భానుఁ డుదయగతుఁ డగునేనిన్
జీవింపఁడు విమతుం డది, గావున నాకోర్కి దీర్పఁ గాఁ దలకొనుమా.

1614


సీ.

ఆద్రోణగిరిక్రేవ నడవిలో నొకసరో, వరము దేవాసురవిరచితంబు
గల [180]దందులో మహోగ్రగ్రాహి యది యుండి, వడిమ్రింగు వనగజావలులనయిన
దానికి వెఱచు సుత్రాముండు నీశుండు, నైనను నరయ వనాటుఁ డెంత
మసలక యాహనుమంతు నాకొలనిలోఁ, జొచ్చునట్లుగఁ జేయు సురుచిరముగ
నీవు దప్ప నాకు నీవేళ నెవ్వఁడు, తెఱఁగుతోడఁ గోర్కి దీర్చువాఁడు

  1. బయలు మ్రింగ
  2. పలుకుల, య్యుదధిచండధ్వని
  3. గపిబలం బుదధికి సుద్ది యగుచు
  4. జీకువాయ
  5. కమ్మదావిపొలపంబున
  6. ముప్పెట్టునన్
  7. దుర్వారముగఁ దూఱి పాఱిన
  8. సీత నీ విచటికిఁ జెఱదెచ్చినది మొదల్, హోమా
  9. బూది నిడిన
  10. ఈకుండలీకరణములోనిది కొన్నిప్రతులం గానిపింపదు.
  11. సహవాసమునకంటెఁ గడఁగి నీతో నిట్లు
  12. కర్మఠుం డై
  13. గొల్పు నీవు మది యిం పరయన్
  14. దశరథేశ్వరునానకుఁ దప్పినాఁడ
  15. డురవో నరుం డురవొ బుద్ధిం
  16. 'సావనమున' వ్రా. ప్ర.
  17. కలితాసృగ్ఝరు లాజ్య. అ. ప్ర.
  18. పెనఁచి నొప్పించుటయు
  19. జిహ్వలు రెండువేల్ శరములు
  20. గతి నుండుఁ గాన తఱుఁగం బెరుఁగం గడచూప నేరికిన్.
  21. 'ద్రుమకుల్య' మని మూలము
  22. కాంతార మ్ముపహితమ్ముగా
  23. గలకూపం బయ్యె నధ్వగర్హిత మగుచున్
  24. ‘గడఁబాఱుచుం గుభృత్కూటములుం.' వ్రా. ప్ర.
  25. అయినను నది యెంతకేని మెయి...మెలఁగం గని పైపయి ..... వయిచిన నది తూలఁ జడియఁబడి తెర లెత్తున్.
  26. ఇదియే 'దర్దుర' మని మూలము.
  27. ట్లొంటికిఁ గాదు
  28. సేతువుఁ గట్టి మెచ్చువారు
  29. పూరణింప
  30. వారు దలలను వ్రాలవై చూరకున్న నింద్ర
  31. ‘పెన్వెరసుల సంఖ్యలున్' అ. ప్ర.
  32. రున కఱువదివేలు నేలు రుక్మాచలమున్
  33. నుఱు మింకన్.
  34. గవిసె నదె ధూళి గప్పినకతనన్
  35. విడు విడు మంచు మిట్టిపడువిక్రమ
  36. డయ్యింద్రజిత్తుఁడు నిలుచు పశ్చిమ
  37. దొడరు లేక
  38. నురగేంద్రదుర్ధరధరణీధరముతోన
  39. ర్మపుఁబొడవుం
  40. మెచ్చినవిధాతృనిఁ జొచ్చిన నెందుఁ
  41. వాలమునఁ జుట్టి
  42. గడు నబ్బలంబులన్
  43. డచలకూటంబున
  44. బంటుతనంబు డింపక గవాక్షుండు
  45. డీకొలుప నుగ్రం బై కరుల్ మ్రొగ్గఁగా
  46. దూలుతేరుల
  47. నారిఁ బొడ వడఁగింపన్
  48. నింద్రజిత్తునిమీఁదన్; ఇంద్రజిత్తుఁడనియే వ్రాఁతప్రతులందు గనుపట్టెడిని.
  49. గరులు గాఁడి యుల్కలు
  50. దిగు లనుచు బెట్టు
  51. నిశ్చయముగ నిల్చి తలయూఁచి
  52. ద్రెళ్లుదురే యటే - ద్రెళ్లుటయే యెడం - దగవు
  53. బొరి వివిధా... నలుకఁ గూల్చి రందు హరులు మఱియు
  54. డొకమహాశిలఁ గ్రమ్మఱ వైచె
  55. దనధనుఃకౌశలమునకుఁ దదనుచరులు, సంతసిల్లంగ నన్నిశాచరవరుండు.
  56. పడవైచుచుం జనఁగ శుంభద్వేగుఁ డై యామరుత్సూనుండు
  57. సంగరోత్సాహంబుం దక్కక పోరఁ దొడంగిరి
  58. నంత గజలీల ...డలుక వడరె నతఁడు... ప్రముఖులతోన మనసు లగలఁ బూని కడఁగ.
  59. వాని నడంచి
  60. రక్కస యెక్క డేఁగెదు
  61. లె ట్టట్టన
  62. జిప్పలు వోవ మ్రొగ్గుటలు
  63. బుట్టినప్రియము దైనకంటెను, ననిఁ బ్రాణము లిచ్చునది ప్రియము నా కధిపా.
  64. మోమురశ్ముల హిమధాము
  65. ప్రభుస్త్రీ
  66. వార్ధియ
  67. నీ వతనిమాటలు
  68. బాహుని మీఱినరాముఁడు
  69. ఈపద్యము కొన్నిప్రతులం గానిపించెడిని.
  70. మున్నేఱు
  71. బటుభుజోచ్చాలితబహు
  72. నఖిలదేవవిద్రావణుండు
  73. గార్ముకహేలనగతియు
  74. 'వాఁడె తేజంబుతో నిట వచ్చు లోక' అ. ప్ర.
  75. తమ్మునితెంపుఁ జూచి వే
  76. నక్షకుని నే పఱఁగాఁ దొలువ్రేటు లాడఁగన్.
  77. బతాకపై గొడుగులపై విచిత్ర
  78. తీతెఱుఁగు వచ్చితి
  79. మార్పఱచిరో యింద్రాదు లుద్వృత్తులై
  80. శిశిరాసవంబులు
  81. 'బాలవృద్ధార్తస్త్రీ' అనియుం గలదు.
  82. ఈపద్యము కొన్నిప్రతులం గానిపించెడి.
  83. దేఱినయా...గతిన్ నడవంగ
  84. కల్పాంతకాలాకృతి
  85. దూలి నీవాత బడ
  86. వేసె వానిఁ గంపింపఁగన్.
  87. కూలఁద్రోచుచుఁ జని శిరఃకోటరంబు, జంతుకోటులఁ గ్రోలుచు జలధి మునిఁగి
    నద్భుతపుమ్రోఁతగా వచ్చి యతని మేను, పడియెఁ బదికోటియగచరుల్ పుడమిఁ జదియ.
  88. మణిమయస్యందనమ్ముల మహితనేము, లమితలఘుచిత్ర
  89. వ్రేటు భుజదండమునఁ బోటు ఘనముష్టి నగకూటమున ఖండమున వాటు నఱచేతం
    బోటుగొన దగ్గఱువనాటభటులం దఱటువాటు మునుగాఁ
  90. బంకించుకొనుచుఁ ద్రిశిరుండు
  91. దెరల్చి, యోసరించిన సోదరయుగళమునకును
  92. ముడుసులు...ము న్నెనయంగ
  93. నశనిస్ఫీతముగా వెసం దఱుముచున్ నందంద
  94. నారాత్రించరుకొడుకు
  95. జలిపి రణము నిలిచినపుడ చాలఁగ మెత్తున్.
  96. నెఱఁకు లోఁగొన్న
  97. లు దళించుచు
  98. 'దొమ్మిదిబలుసాయకమ్ముల నలు నేసి' అ. ప్ర.
  99. బ ట్టగుమూఁపునై నిలిచి
  100. దాపునన్ మెట్టిన
  101. ఫాలస్వేద
  102. కంటకు దశకంఠుఁ గడతేర్ప లంకపై, విడిసిన యారఘువీరు బంట, సంగర
  103. గాఁ బో వీమహి
  104. లిడం కూఁత బ్రేలవలదు
  105. ఈఘట్టమువఱకు హుళిక్కి భాస్కరకవివిరచితము. ఇది మొదలు కడవఱకు వేదగిరినాయనింగారి ప్రేరణమున నయ్యలార్యుఁడు రచియించినది.
  106. నది మున్ను వారివాహంగమై, తగ వూహింపఁగ
  107. వెలయ మఱి యపూర్వ
  108. గడసె రత్నవిచిత్రితగృహచయములు
  109. శోభన మొప్పునట్లుగన్.
  110. 'దరలి చేర' అ. ప్ర.
  111. దిగులు సొచ్చి కరులు దిక్కుఁ గానక దీనబృంహితంబు..... గన్నీరు దొరఁగు.
  112. 'దాఁటుకొని,' అ. ప్ర.
  113. నభిక్రమోత్సవం
  114. దద్విధి సైఁపఁగరాదు నావుడున్.
  115. వానరేంద్రులతలలు వడిం దూల నేసె దైత్య
  116. ‘యుదీర్ణవరవిక్రము లై' అ. ప్ర.
  117. 'నడ్డనంబును' అ. ప్ర.
  118. యు ఫలితవిన్యాసవిరచనాశేషంబున
  119. నొడిసి ..... వేపారఁగఁ బట్టుభంగి
  120. ద్రుటితం బైపోవఁ జేసెం దెస లద్రువఁగ నందీకృతాశేషుఁ డౌచున్.
  121. కమనీయతరకనత్కనకాంగద
  122. వాలితనూభవులవలనఁ బొగిలి
  123. లీల్గ
  124. వెళ్లునమ్మిడుంగు
  125. పొలివోవని ధైర్యమున న, నిలసుతుఁడు నికుంభువక్ష మెడలఁగఁ బొడువన్
  126. నిం కొకసేపంత
  127. బాణార్చితకార్ముకుండ
  128. సజ్యధనుఁ డై
  129. భయంబుతోడ
  130. సురయుం బోసి
  131. నాథర్వణవేదంబు లగుమంత్రంబులు చదివి విక్రమంబుగా నుచ్చరించుచు
  132. చక్రంబ యడలదు సర్పావళులో కావు
  133. 'మంథరసూత్రమానితాహీనుఁడు గానఁబడఁడు'. అ.ప్ర.
  134. జలము డింపక నొంచి గవయు
  135. శశ్వద్వ్యాఘ్రవద్భే
  136. మహదసనావనీరుహమును
  137. వచ్చుపొంటికే
  138. మేలుసతులు ....... ఖ్యాతిబలవర్ధకాముకులును.... డెవ్వఁడు వానిని ధరణిలోన.
  139. చ్చినవాఁ డౌచు సరోజయోని
  140. దలలు గదలుప సరసన్
  141. నగ్నివర్ణజాతు
  142. తరాట్టహాసహసిత
  143. నోదంబులోపలఁ బడుగజంబులతోడి పాటి గలిగి
  144. సారణంబున నమర్చి
  145. మూఁడులోకంబులు మునుమిడి కలఁగంగ, వరసింహనాదంబు వరుసఁ జేసి
  146. ద్రిప్పఁగ నేరవచ్చునే
  147. మైదుతూపుల లక్ష్మణుఁ డగలఁజేయ, సోలి
  148. సమ్మోదప్రతాపోగ్రుఁ డై.
  149. బొగడి రంతఁ జారణపతులున్.
  150. ధీరతాత్ముఁ డై.
  151. యుఱక యెచ్చోటనో పట్టియున్నవాఁడ, వేమి సొంపారు
  152. నెట్టి తెఱంగో.
  153. లఘుతూలజాలవిభాతిఁ గలఁగి
  154. దంష్ట్రాగ్రంబులు దాటించుచు నుల్కాపాతంబులుంబోలె లోచనంబుల
  155. కరమును బాపజాతియను గట్టిఁడియ న్నగునా
  156. బురపురఁ బొక్కుచుందుఁ దనపూర్వ...స్రుక్కుచున్.
  157. ఎల్లిటిరణమున
  158. వరధుర్యకింకిణీ
  159. నబ్బిన సూర గాఁగ
  160. పడియును, బ్రమసి పోరు గలుగుక్రమము
  161. సూత్రంపుబొమ్మ
  162. నిరర్గళసత్యుఁడు లక్ష్మణుండు
  163. దానన దలవైచి
  164. విగ్రీవు నొందఁ జేసెద
  165. నున్నం దలపాటు దప్పక తలపాటు చేయువానరులును
  166. దంతంబుల ముష్టిఘాతంబులఁ బాదంబుల నాలంబుల దైత్యసమూహంబుల నొప్పించి విజృంభించు
  167. దైత్యుఁ బిడికిట రవిజుండు దాఁచె
  168. లాఘము గోరి
  169. సంతమస మాకారంబు
  170. మునుంగన్ వెసన్.
  171. డేసె నుగ్ర మగు...... శరం బరివోసి మింట
  172. దీర్చి త్రిప్పి
  173. టెట్లుఁ గలుగ నేర్చునె
  174. సమగ్రారంభుఁడై
  175. చక్రంబు వేగంబ పద్మా
  176. "సంప్రాప్తప్రాణుఁ దలంపు లక్ష్మణు నమోఘారంభసంభావనా”. అనియే వ్రా. ప్ర.
  177. మెఱుఁగులకుప్పలు గిఱిగొనంగ
  178. సరభస మైనయాకసముచాడ్పున
  179. బట్నములు
  180. దందులో మహాగ్రాహి మకరి యుండు, నది మ్రింగు వనగజహరుల నైన