పుట:Womeninthesmrtis026349mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

63

ఏమన: వధూవర నిర్ణయమంతకు పూర్వమే జరిగి యుండవలెను. అట్లు కానిచో వివాహము జరుగుకాలమున వథూనిర్ణయము చేయుట యసంభవము. వివాహము జరుగుటకు కొంతకాలము పూర్వము వధూవరనిర్ణయము జరుగుటయేకాక యానిర్ణయము సామాన్య పరిస్థితులలో ననుల్లంఘ్యమను నంశముకూడ స్మృతులవలన తెలియుచున్నది. అట్టి నిర్ణయమైనది మొదలు వివాహమగు లోపల నేవైన కొన్ని యసాధారణ పరిస్థితులు గల్గుచో మాత్రమే యాసంబంధ నిర్ణయమును మార్చుటకు స్మృతులంగీకరించుచున్నవి. అట్టి నిర్ణయము జరుగుటకును వివాహమగుటకును నడుమ కొంతకాలము గడచుట గలదని యీ క్రిందిశ్లోకమువలన తెలియు చున్నది.

     ప్రతిగృహ్యచయః కన్యాంవరో దేశాన్తరంవ్రజేత్
     త్రీనృతూన్ సమతిక్రమ్య కన్యాన్యం వరయేద్వరం
(నారద 12-24)

(ఏవరుడు కన్యను స్వీకరించి దేశాన్తరము పోవునో యట్టివరునిరాకకై కన్య మూడు ఋతుకాలములు వేచియుండి యాతడప్పటికిని రానిచో మఱొక వరుని కోరుకొనవలెను.)

'వరుడు కన్యను స్వీకరించి' యని చెప్పుటచే నిచటికన్య కింకను వివాహము కాలేదనియు నామెవాగ్దత్త మాత్రమే యైనదనియు తెలియుచున్నది.