పుట:Womeninthesmrtis026349mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

స్మృతికాలపుస్త్రీలు

ఆపస్తంబుని మతములోగూడ నరజస్వలకే వివాహము చేయవలెనని తేలుచున్నది, ఎట్లన: ఆపస్తంభ గృహ్యసూత్రములో తురీయ పటలములో నష్టమఖండములో పదవసూత్రములో 'తిస్రోజసిత్వా' యను మాటలతో వివాహ ప్రయోగము ముగింపబడినది. 'యద్దామల వద్వాసాఃస్యాత్‌' అను పండ్రెండవ సూత్రములో రజస్వలా విషయము చెప్పబడినది. కాన వివాహమునకు పిమ్మటనే రజస్వల యగుటయే క్రమమని తేలుచున్నది.

(2) కన్య రజస్వలయైన వెంటనే వివాహము చేయుట దోషము లేదనియు నటుపిమ్మట నుపేక్షించుట దోషమనియు చెప్పుచున్న వారు నారద గోభిలులు . ప్రథమ రజస్వలయైన వెంటనే కన్యను దానము చేయవలెననియు ప్రథమర్తుకాల మతిక్రమించినను దాతకు భ్రూణహత్యా దోషము వచ్చుననియు వారి యభిప్రాయము.

     కన్యావర్తుముపేక్షతబాంధవేభ్యోనివేదయేత్
     తేచేన్నదద్యుస్తాంభర్త్రే తేన్యుర్భ్రూణహభిస్సమాః

(నారద. స్త్రీపుంసయోగమను ద్వాదశవ్యవహారపదము 24)

(కన్య ఋతువు నుపేక్షింపక బంధువులకు తెలుపవలెను. వారామెను భర్తకు దానముచేయరేని భ్రూణహత్యచేసినవా రగుచున్నారు.)

ఈయభిప్రాయమే మఱింత స్పష్టముగ నీక్రింది శ్లోకములో చెప్పబడినది.