పుట:Womeninthesmrtis026349mbp.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా పండ్రెండేండ్ల వయస్సుగలదై యుండవలెను. పండ్రెండేండ్లు వచ్చిన బాలికకు రజోదర్శనము కాకున్నను నామె రజస్వల యైనట్లే భావింపవలెనని కొన్ని స్మృతులు సూచించుచున్నవి.

      ప్రాప్తేతుద్వాదశే పర్షేయ: కన్యాంనప్రయచ్ఛతి
      మాసిమాసి రజస్తస్యా: పితాపిబతిశోణితం
                                     (పరాశర. 8- 5)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానముచేయడో యాతండ్రి ప్రతి మాసమునను నామె రజస్సును త్రాగుచున్నాడు.)

దీనిని బట్టి పండ్రెండేడ్ల బాలిక రజస్వలయే యని తేలుచున్నది. పైకి రజోదర్శనము కాకున్నను లోన రజస్స్రావమైనట్లే భావింపవలెనని దీని యభిప్రాయము. ఆవయస్సున వివాహమగు వథువునకు సమావేశనము కావచ్చునని గృహ్య సూత్రకారుల మతమని యూహింపవచ్చును. అంతకుపూర్వము వివాహమగుదానికి సమావేశనము లేదని యీవిధముగ నూహింపవలసి యున్నది. ఈ సమావేశనము వివాహాంగమేయని చెప్పవలెను. ఈసమావేశమైన పిమ్మట రజోదర్శనానన్తరము ఋతుకాలములోనే సమావేశనము జరుగును. ఈలోపున జరుగదు. రజోదర్శనానన్తరము చతుర్థ రాత్రమున భర్త చేయవలసిన కృత్యమును వర్ణించుచు బోధాయనుడు,