పుట:Womeninthesmrtis026349mbp.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

స్మృతికాలపుస్త్రీలు

(స్త్రీకి వ్యయమందు చేయి వదలుగా నుండరాదు)

భర్త ప్రవాసమున కేగునపుడు తిరిగివచ్చువఱకు గృహ నిర్వహణమునకు వలయు ధనమును భార్య కిచ్చి యేగవలెనని పూర్వాధ్యాయమున చూచియుంటిమి. భర్త యట్లు ధనము నిచ్చి పోనిచో గృహిణి నింద్యములు కాని నూలు వడకుట మున్నగు శిల్పములతో ధనసంపాదనము చేసికొనవలెను.

ప్రోషితేస్వ విధాయైవ జీవేచ్ఛిల్పైర గర్హితైః

(మను. 9-75)

భర్త ప్రవాసమున కేగినపుడే కాక యాత డింట నున్నపుడు గూడ ధనార్జనమున కర్హలగు స్త్రీలు (గొల్ల మున్నగు జాతులవారు) కొందఱు గలరని 'ధన' మను నధ్యాయమున చూచియుంటిమి. రాజాస్థానములు మున్నగు చోట్ల స్త్రీ సేవకురాండ్రుండుట కాననగుచున్నది. వారు తమ యధికారికి విసరుట, నీరిచ్చుట, ధూపము వేయుట మున్నగు పనులు చేయుచుండెడివారు. రాజున కీ పనులను చేయు స్త్రీలు రాజునకు ద్రోహము చేయకుండునట్లు పరీక్షింపవలెనని మనుస్మృతి చెప్పుచున్నది.

పరీక్షితాః స్త్రి యశ్చైనం వ్యజనోదక ధూపనైః

మను. 7-219)

స్త్రీలయం దిట్టి యవిశ్వాసము మనుస్మృతిలో చాలచోట్ల కాననగుచున్నది. కావుననే వారు బాహ్య ప్రపంచములో చాల పనుల కనర్హలని కూడ తేలుచున్నది.