పుట:Womeninthesmrtis026349mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యిఱువది యెనిమిది స్మృతులలోను గర్గవిష్ణు దేవల పులస్త్యకాశ్యపప్రాచేతన స్మృతులను దక్క మిగిలినవాని నన్నిటిని పరిశోధించియే నే నీగ్రంథమును వ్రాసియున్నాను. ఈ దేవలాదిస్మృతులు ప్రస్తుతము లభ్యములు కాకుండుటయే వీనిని వదలివైచుటకు కారణము. దేవలస్మృతి యను పేర నొకస్మృతి యిపుడుగలదు. కాని యది సరియగు దేవలస్మృతి కాదని యందఱు నంగీకరించియున్నారు. పైన పేర్కొన బడిన స్మృతులనే కాక హిరణ్య కేశి బోధాయనాపస్తంబాది విరచితములైన గృహ్యసూత్రములను గూడ పరిశోధించి యందు స్త్రీలనుగూర్చి గల యంశములను గూడ తీసికొంటిని. కొందఱు ధర్మశాస్త్ర కారులే గృహ్యసూత్రములను గూడ వ్రాసియున్నారు. గృహ్యసూత్రములు కూడ స్మృతులవలెనే ప్రమాణములు.

పై గ్రంథము లన్నిటిని మూలములోనే పరిశోధించితిని కాని భాషాన్తరీకరణములను తీసికొనలేదు. వీని నర్థము చేసికొనుటలో ముఖ్యముగ స్వబుద్ధినే యుపయోగించితిని. భాషక్లిష్టముగ నున్నచోటులలోను కొన్ని యితరస్థలములలోను వ్యాఖ్యానములను జూచియున్నను మూలగ్రంథా ధారము లేకుండ వ్యాఖ్యాత లేమి చెప్పినను నేను తీసికొనలేదు.