పుట:Venoba-Bhudanavudyamamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16


వలెనని కోరిరి. ప్రార్థన సమావేశములో దాత అయిన శ్రీ వి. రామచంద్రారెడ్డిని అందరకు పరిచయ మొనర్చిరి.

ఆరాత్రి వినోబాజీ దీర్ఘచింతనలో జాగరముచేసిరి. ఈఆశ్చర్యకర మైన సంఘటనకు పరమేశ్వరుడే కారణభూతుడని, తాను భగవంతుని సేవకుడననే గాఢమైన అనుభూతి గల్గెను. ఆవిధముగా ప్రధమ భూదానము శ్రీ వి. రామచంద్రారెడ్డిగారు 18 ఏప్రిల్ 1951 తేదీన సమర్పించిరి. రెండవదినము మరొక గ్రామముచేరి. శ్రీ రెడ్డి ఉదారతను తెల్పుచూ, ఆగ్రామ ప్రజలనుకోరగా, అచ్చటకూడా దానము లభించెను. ఆదేవిధముగా శాంతి, ప్రేమసిద్దాంతములను ప్రచారము చేసుకొనుచు, నలగొండ, ఒరంగల్లు జిల్లాలు పర్యటించిరి. ప్రతిదినము దానము లభించుచునే వుండెను. స్వాతంత్ర్య భారతదేశపౌరులుగా ప్రజలకర్తవ్యాన్ని వివరించుచూ, వినోబాజీ వారిని ప్రభోదించుచుండెడివారు. వరంగల్లుజిల్లా "తళికెల"లో వుపన్యసించుచూ, వినోబాజీ యిలాఅన్నారు..

"పూర్వకాలంలో అరాచక సమయములలో మనపూర్వకులు యజ్ఞములు చేయుచుండెడివారు. నేడుకూడా యజ్ఞము చేయదలంచి, యీభూదాన ప్రయోగమును ప్రారంభించితిని. ప్రజలను దానమిచ్చుటకు కోరితిని, ప్రజాభ్యుదయమునకై కొనసాగింప బడుచున్న యీయజ్ఞములో ప్రతిఒక్కరు పాల్గొనవలెనని మనవిచేయుచున్నాను. యజ్ఞములలో మన భాగము విచ్చేయునట్లే, భూమిగలవారు భూమిహేనులకు భూమి నివ్వాలి. సాధారణముగా ప్రజలు కలియుగములో దానమెవ్వరుయివ్వరని అంటూవుంటారు. కాని ఆడిగేవారన్న ప్రజలు తప్పక యివ్వగలరని నావిశ్వాశము. ఇప్పటివరకు నాకు 3,500 ఎకరముల భూదానము లభించినది.”

అవిధముగా ప్రచారము చేసికొనుచు, వినోబాజీ శాంతిదేవతగా తెలంగాణాలో పర్యటించిరి. భూదాన వార్తలు ప్రజలను ఆశ్చర్యచకీతుల నొనర్చినవి. ఏభూమికొరకైతె సోదరులే పరస్పరం తగవులాడు కొందురో, ఆభూమిప్రేమతో, కోటిసోదరులైన దరిద్రనారాయణునకు దానమివ్వబడు చున్నది. తమ ప్రచారములో వినోబాజీ కమ్యునిష్టు సోదరులను కొందరిని కలిసిరి. వారియందు, వారిసిద్దాంతములయందు వినోబాజీకెన్నడు ద్వేషభావములేదు. "చందుపుట్ట” అను గ్రామములో మాట్లాడుచూ,