పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటి కింకను స్వతంత్రనాటకములు వెలువడలేదు. శాస్త్రులవారు నూతనమార్గములను కోరినవారు. "దృష్ట బహుప్రయోజనంబుగావునను, ముఖ్యముగా నానందనిష్యందిగావునను, పెద్దనాది లక్షణకారులచే ననుజ్ఞాతంబుగావునను, మఱియుం బ్రబంధములతో బ్రాణము విసిగిపోయినది గావునను, నాటకము మనకు ఉపాదేయమే." అని ఎల్లవారును నాటకములు వ్రాయవలసినదని తమ యభిప్రాయమును విశదీకరించుచు పలుతావుల ఉపన్యాసము లీయసాగిరి.

నాగానంద నాటకమున శాస్త్రులవా రొక క్రొత్తమార్గ మవలంబించినారు. సంస్కృతనాటకముల మర్యాదప్రకారము మూలములో సంస్కృతముండుచోట్ల సలక్షణభాషయు, ప్రాకృతాది భాషాభేదములుండుచోట్ల తెలుగు గ్రామ్యభేదములనుం బ్రయోగించి అనువదించిరి. ఆంధ్రవాఙ్మయమున పాత్రోచిత భాషయందు రచియింపబడిన ప్రథమనాటక మిదియే. శాస్త్రులవా రవలంబించిన యీక్రొత్తమార్గముంగని సహృదయులు కొందఱు పండితు లామోదించిరి.

మ.రా.రా శ్రీ వడ్డాది సుబ్బారాయకవిగారు శాస్త్రులవారికి ఇట్లువ్రాసిరి.-

"పండితోత్తమా, భవద్విరచితమగు నాగానందనాటకము పుటములుదీరిన హాటకమువలె గావ్యేందిర కలంకారమై ప్రకాశించుచున్నది.