పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దకు వ్యాఖ్య వ్రాయుటకై కొన్నిసంవత్సరములు చదివితిని; వ్యాఖ్యనుమాత్రము ఆఱునెలలలో వ్రాసితిని' అని నాకొకమారు చెప్పినారు. ఒకదినము నిదురలేచినదిమొదలు వ్రాయుచునేయుండి మధ్యాహ్నముమీద నిదురబోయి సాయంకాలము ఆఱుగంటలకులేచి అప్పుడే తెల్ల వాఱినదని తలంచి దంతథావనము చేసికొనుట కారంభించిరి. 'తాతగారూ, ఇప్పుడు సాయంకాలముగదా. ఇంక క్షణముండిన చీకటిపడును' అని నేను హెచ్చరించితిని. చీకటిపడినవెనుక వారికి బోధపడినది.

ఒకమారు పరథ్యానముగా పోవుచు వెనుకవచ్చు ట్రాము కారును సైతము తెలిసికొనక ఆట్రాము తన్ను తాకునంతదూరము వచ్చినవెనుక నులికిపడి తప్పించుకొనిరి. ఆసమయమున వారేదో గ్రంథమును థ్యానించుచుండిరి.

ఆవెనుక సాహిత్యదర్పణము నాంధ్రీకరించుటకు 2-2-21 నాడు ప్రారంభించి 11-4-21 తారీఖున పూర్తిగావించిరి. ఈకాలముననో లేక కొంతముందో శారదాకాంచిక, షష్ఠకింకిణి, ఆంధ్ర వ్యాకరణసర్వస్వవిమర్శను వ్రాసినట్లు తోచుచున్నది. ఐదవకింకిణి యేదియో నాకును ఇంకను తెలియలేదు. బహుస: శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి మోచాకుసుమముపై వ్రాసిన 'మోచాకుసుమామోదవిచారము' అగునేమో. ఆంధ్ర హితోపదేశచంపువును సయితము ఇప్పుడేవ్రాసిరి. నెల్లూరికేగిన వెనుక గ్రంథరచనచేయలేదు.


__________