పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

స్వీయ చరిత్రము.



ఐకమత్యమున కేమియు కొఱఁతరాలేదు. కోదండ రామయ్యగారి వీవాహము నిమిత్తమయి కన్యను తీసికొని రావలసినదని నేను పులవర్తి శేషయ్యగారిని పంపినప్పు డాయన సంకోచింపక పెండ్లికూఁతురువారి వస్తువులను సహితము కొంతదూరము సంతోషపూర్వకముగా మోచుకొనివచ్చుట యీ యైక మత్యమున కొక నిదర్శనముగా చెప్పవచ్చును.............................................................................. కోదండ రామయ్యగారి వివాహమయిన రెండుమూడు మాసములలో కొన్ని కలహకారణములు గలిగినవి. లోకములో వైరమునకును నేరములకును ఏవికారణములు గానుండునో తెలిసినవారికీ వైరమునకుఁ గల కారణమును తెలుపవలసిన పనియుండదు."

ఈ కారణము ధనాశయని నాయాశయము. ఈవితంతువివాహ ప్రయత్నమునకు నేను పూనినప్పుడు పామరులును పూర్వాచారపరాయణులు నయిన విపక్షులవలనిదూషణములకును బాధలకును నేను సంసిద్ధుఁడ నయితినిగాని స్వపక్షములోనివారు నాకు తొందరలిచ్చి నన్ను బాధింతురని స్వప్నా వస్థయందును దలఁపలేదు. అందులోను ముఖ్యముగా నావలన బహులాభములనుపొంది లోకోపకారార్థమే తాము సర్వకష్టములకును లోనుగా నున్నట్టు పలుమాఱు పలుకుచుండువారు నా కాయాసము కలిగింతురని నేను బొత్తిగానే తలఁప లేదు. అన్నియు మనము తలఁచుకొన్నట్టు జరగవు. మనుష్యుఁడు తానొకటి తలఁచిన దైవమింకొకటి తలఁచును. నేను నరసాపురము వెళ్లియుండినప్పుడు 1884 వ సంవత్సరము మెయినెల 6 వ తేదిని పులవర్తి శేషయ్యగారు నాకు వ్రాసిన యుత్తరమునకు 8 వ తేదిని నేనిచ్చినప్రత్యుత్తరములో నతఁడు వ్రాసిన యుత్తరము స్వబుద్ధిచేతఁగాక పరుల ప్రోత్సాహముచేత వ్రాయఁబడినదని నేను వ్రాసితిని. (అతని యుత్తరమును నాప్రత్యుత్తరమును ఏలూరి లక్ష్మీనరసింహముగారు నామీఁద తెచ్చిన మాననష్టపు వ్యాజ్యములో దాఖలు చేయఁబడి నాయొద్దకు మరల రాలేదు.) ఆతని నాయుత్తరము వ్రాయునట్లు ప్రోత్సాహపఱచినవారు కోదండరామయ్యగారని నేను నమ్మితిని. అయినను