పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవప్రకరణము.

స్త్రీపునర్వివాహ సంస్కారప్రయాసదశ.

క్రీస్తుశకము 1880 వ సంవత్సరము మొదలుకొని 1890 వ సంవత్సరమువఱకు.

మావివేకవర్ధని సంఘదురాచారసంస్కారకరణమునిమిత్తము మొదటి నుండియు పాటుపడుచుండినట్టు మాచదువరు లీవఱకే తెలిసికొని యుండ వచ్చును. అతిబాల్య వివాహములు, అతివృద్ధవివాహములు, కన్యాశుల్కము మొదలయినవానివలనియనర్థములను బోధించుటకయి బ్రాహ్మవివాహము ప్రకటింపఁ బడినది. అది చదువుకొనువారి యొక్క వేడుక కొఱకు మాత్రమే యుపయోగపడెను గాని యంతకంటె నెక్కువ ప్రయోజనము దానివలనఁ గలుగలేదు. ఒకరు తా నుపదేశించినదాని ననుష్ఠించి చూపినంగాని కేవలశుష్కోప వ్యాసమువలనను పుస్తకప్రకటనమువలనను కార్యముండదు సంస్కారకరణమునం దత్యంతాభినివేశముగల మే మిద్దఱుముగ్గురము మొట్టమొదట చిన్న చిన్న సంస్కారముల నారంభించి పనిచేసి చూపవలెనని యుద్దేశించుకొంటిమి కాని దానికి మాకు మార్గము కనఁబడలేదు. బాల్యవివాహములను మాన్పవలె నందుమా మేముపనిచేసి చూపుటయెట్లు ? మాలోఁ గొమార్తెలున్న వా రొకవేళఁ దమకొమార్తెలకు పదిపండ్రెండేండ్ల ప్రాయమువఱకును పెండ్లిచేయక యట్టెయుంచినను, అది సంస్కారమెట్లగును ? రెండుమూడు నాలుగేండ్లపిల్లలకు వివాహములు మాన్పుటకది మార్గదర్శక మెట్లగును ? కన్యావిక్రయ పరాయణు లనేకు లెక్కువధనము వచ్చునని తమకూఁతులను పదుమూడు పదునాలుగేండ్లు వచ్చువఱకు నుంచుచుండ లేదా ? రెండుమూడేండ్ల బాలికలకు వివాహము చేసినవారిని, శుల్కమును గ్రహించి తమకొమారితలను వృద్ధులకును వికలాంగులకును కట్టిపెట్టినవారిని, బహిష్కరించెదమని కులమువారు పనిపూనినం