పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోబుద్ధి సూక్ష్మములు మొదలగువాని కన్నిటికిని ప్రకృతి యనిపేరు. ఒక్కొక్కప్రాణిలోను యజమానిగానుండి దానిని నడిపించి దానిమూలమున విషయముల ననుభవించుచు వచ్చు వాడు జీవుడు. ఆప్రకృతి, జీవుడు ఈరెంటికిని వెనుక మరుగుపడి యుండి, నిలుకడలేక మారిమారి వచ్చు ప్రపంచమునంతటిని దాల్చి యొకనియమముతో పరిపాలించుచు మారుదలయు నాశమును లేనిపరమాత్మ కీశ్వరుడనియు, శ్రీమన్నారాయణు డనియు నింకను నెన్నోపేళ్ళున్నవి. 'వాడు' అనువాడు వస్తువునకు లోపల మరుగుపడి అడగియుండును; ఏప్రమాణ మునకును ప్రాణముగా నిలిచియుండును; ప్రత్యేకముగగూడ నిలిచియుండును.

జగత్తునియమముగురించి గీతలోని 7, 9, 13. 15 అధ్యాయములలో చెప్పబడియున్నది. వానిని దెలిపినమీదట వానియర్థము చెప్పబడుచున్నది. ముఖ్యములైన శ్లోకములు;


ప్రకృతిం పురుషంచైవ విద్ధ్యనాదీ ఉభావపి
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధిప్రకృతి సమ్భవాన్.


ప్రకృతి, పురుషుడు, ఈరెండును అనాదులని తెలియుము. రూపముయొక్క మార్పును, గుణములును ప్రకృతి వస్తువులందుండునవని తెలియుము. 13-20