పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జామున నాలుగుగంటలకు లేవవలెనని యనుకొనుట యొకటి అట్లు లేచియుండుట మరియొకటి. అవిద్యను సత్యముచే దూరముచేయుటయే మోక్షము. దానికి మార్గము యోగము. అద్వైతమార్గమున జీవుని అవిద్యనుండి విడిపించుటకును, ద్వైతమార్గమున జీవుని కర్మబంధమునుండి తప్పించుటకును, రెంటికిని మార్గమొకటే. అద్వైతమార్గము విని 'అవు' నని చెప్పిన తోడనే అవిద్య తొలగిపోదు. సత్యముగ నది తొలగవలసిన యెడల కర్మబంధమునుండి తొలగుటకు ద్వైతవాదు లేమేమి చేయవలెనని చెప్పియున్నారో, వాటినన్నిటిని అద్వైతవాదియు చేయవలసియున్నది. ఇట్లు చేసినయెడల మోహమనునది తొలగును. అనగా కర్మబంధమును దానిని తొలగించు కొనుమార్గములు ద్వైతపద్ధతినిగాని, అద్వైతపద్దతినిగాని, వ్యత్యాసములు కలిగియుండవు. ఇదియే ఆచార్యులవారి ఉపదేశము.


ఎల్లప్రాణుల విషయమందును జీవకారుణ్య భావము కూడ మనస్సున లేకుండినయెడల, జీవుడును, పరమాత్మయు నొకటియను యద్వైతజ్ఞానము చాలదూరమగును. ఆచార్యులువారు వ్రాసిన గ్రంథములనుండి జీవుడను బ్రహ్మమును సత్యముగ నొకటేయని మతసంప్రదాయమునుబట్టి తెలిసికొనుట వేరు, సత్యమైన జ్ఞానప్రకాశము వేరు. జ్ఞానప్రకాశము నొందుటకు తెలివికావలెను. కాని తెలివిమాత్రమే సరిపోదు.