పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51 రక్తపాతము

వలె వా రెవరును వధింపబడ లేదు. వాల్మీకి అతి సుందర దృశ్యకల్పనమున సీతను అంతర్ధాన మొనర్చెను. సరళస్వభావ పాపవిదూరయు అగు డెస్‌డెమోనా నిష్ఠురరూపమున నిహితయై స్వర్గముచేర, సీత వాల్మీకికల్పితవిమానరూఢయై, ఆనందధ్వనులు చెలగుచూ పుష్పవృష్టి గురియు చుండ స్వర్గారోహణ మొనర్చెను. కాని జన్మదు:ఖినియగు సీతా లలామదు:ఖము మనహృదయమున పాదుకొని ఆమెయెడ నిరంతర సానుభూతి పుట్టించు చున్నది.

సీతదు:ఖము చూచి గుండె లవిసి ప్రతిఘట్టమున వాల్మీకితో కన్నీరోడ్చి, ఆమె పూతచరిత అని విశ్వసించి, తచ్ఛీల మాహాత్మ్యము మన హృదయములు నుద్బోధింప తత్సుగుణపుంజమున పక్షపాతము జనించి, అశోకవనమున ఆమె సజీవ యై యుండుట ఎరిగి పరమత్రిజటలతో సంతసించి, వనవాస మామె సల్పునెడ లక్ష్మణునితో విలపించి ఆమె జగన్మోహనమూర్తి మన మనో మందిరముల నెల్ల కాలము అచ్చొత్తి యుండుటచే ఆమె గుణములనే ప్రశంసిస్తూ సదా జపించు చుందుము.

ఈ విషయమున వ్యాసవాల్మీకులతో షేక్స్‌పియరు సరి రాడు. అతని కవితయందు మఱపురాని గుణము లనేకములున్నవి. అతడు మహాకవి, కాని శోకరసమున గూర్చి చర్చించునపుడును, సంతాపము స్థాయీభావముగా నుండదగు పట్టులయందున్నూ కవిత్వముమాట తలప పనిలేదు.