పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33 ఆదర్శము

దైవబలమునూ నమ్ముకొని యున్న పాండవపక్షమునకు సమకక్షియై నిలువ గలదా? కురుపక్షమున ధర్మవీరులు లేరు; దైవసహాయము లేదు; కనుకనే దానికి సర్వనాశము సంభవించెను.

సాహిత్యమున దేవత్వము -

మహాభారతమునకు నాయకు డెవఁడు? భీముడా? అర్జునుడా? వారిరువురూ యుధిష్ఠిరుని యధీనమందలివారు కావున నాయకులు కాజాలరు. యుధిష్ఠిరుడా? ఆతడు శ్రీకృష్ణు నధీనమున నుండె కావున అతడూ కాజాలడు. శ్రీకృష్ణునే నాయకునిగా నెంచవలయును. విశ్వమున కంతకు అధీశ్వరుడై బ్రహ్మాండమున కెల్ల నాయకుడై, సర్వశక్తుడు, సర్వవ్యాపియునగు భగవత్స్వరూపుడు శ్రీకృష్ణుడే భారతకథానాయకుడు. అతడు ధనస్సు ధరింపకున్నా అందరి యంత:కరణములందును అన్ని చోటులను అతనిశక్తియు కౌశలమును అఖండ రూపమున తేజరిల్లుచుండెను. అయుతసంఖ్యాకులు అస్త్రశస్త్రధారు లగు వీరులు నిరస్త్రుడగు నాతనికి సాటిరారు. అతని శక్తి కౌశలములకు ఇరువీడుల వీరశిఖామణులు "జితోస్మ:" అనవలసినవారే. మహాభారతమున అడుగడుగున ఆతని ప్రభావమున కచ్చెరువు వడుచుందుము. ఇట్టి చిత్ర మాంగ్లసాహిత్యమున లభించునా? కల్ల. మిల్టన్ రచించిన మహాకావ్యమున భగవంతుడు నిర్జీవప్రతిమవలె ఏమూలనో నిమిడి యుండును.