పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188 సాహిత్య మీమాంస

ఇట్లైనచో నిక ఆ దంపతులకు వియోగ మెక్కడిది?

2. ఆశుతోషుడు (ఉబ్బులింగడు)

శివు డాదర్శపతి కావడము నిస్తులపత్నీ ప్రేమయున్నూ పత్నీ రక్షణచేతనే కాదు. రూపగుణసంపదచేతకూడా అత డార్య యువతీవతంసముల మానసము లకర్షించును. రూపమున నాత డద్వితీయుడు, ప్రేమస్వరూపుడు, సర్వాంగసుందరుడు. రాధకళ్ళకు శ్యామసుందరుడు మదనమోహనుడు, భవానికన్నులకు పరమేశ్వరుడు లోకైకసుందరుడు; ఇద్దరూ వారివారి భార్యలకు జగన్మోహనసౌందర్యసారరూపులు. అట్టి ప్రేమమయుడగు పతి తనకు లభించవలెనని ప్రతిహిందూబాలికయూ కోరుచుండును. పతిప్రేమను బడసినవెన్క తదితరప్రపంచమంతా సోరహీన మనిపించజాలు పతిలబ్ధికై మంచిమంచివ్రతములూ నోములూ సల్పుదురు. ప్రేమమయుడగు భర్త ఎట్టివాడు? శివుని గుణములే అతని కందము తెచ్చెను. అందు ముఖ్యమైనది సహజప్రసన్నత. ఆశుతోషున కన్యములగు అందములేల? అవగుణములెన్ని ఉన్నా ఆశుతోషణ మఖిలసుగుణముల కాకరము. అల్పసంతుష్టుడగువాని సరసనుండుట సకలసుఖములను జూరగొనుటయే; అతడు: సంతతప్రపుల్లుడు, అనవరత ప్రసన్నుడు; అట్టివానితోటి కాపురము అమిత సుఖావహము; అల్పసంతోషి నారాధించుట అతిసుకరము, సుఖకరము-అందు చేతనే ఉబ్బులింగనివంటిభర్త తమకు ప్రాప్తించుగాక అని యెల్లప్పుడూ హిందూబాలిక లాశవహించి యుందురు.