పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156 సాహిత్య మీమాంస

పుత్రశోక కాతరహృదయుడై యున్నప్పుడు తపస్స్వాధ్యాయ నిరతుడైన నారదమహాముని ఆరాజర్షుల ఇతిహాసములను వివరించి అతనికి చిత్తశాంతి చేకూర్చెను.

క్షత్రియులలో ననేకులు బ్రహ్మవీర్యసంపన్ను లైనట్లే పరశురాముడు, ద్రోణుడు మొదలగు బ్రాహ్మణశ్రేష్ఠులు క్షాత్రవీర్యము నార్జించి యశస్సంపన్ను లైరి. ముచుకుందు డను రాజశ్రేష్ఠుడు ఒక వంక మంత్రశక్తి, తపోబలమూ, వేరొక వంక అస్త్రబలము, బాహుబలమున్నూ ఊతగా గొని ప్రతాపార్జిత పృథ్వీఖండమును పాలిస్తూండెనని భీష్ముడు చెప్పెను. ప్రజాపాలనమున వసిష్ఠుని బ్రహ్మబలము ముచుకుందుని క్షాత్రబలమునకు సహాయ మవుచుండెనట. వాస్తవముగా అప్పటి హిందూరాజులకు రెండుతెరగుల బలమూ ఆవశ్యకమై యుండెను. "అనలున కనిలుడు సాయపడితే అరణ్యమంతా అరగడియలో దగ్ధమగులాగున బ్రాహ్మణులు క్షత్రియు లేకమైనయెడల శత్రుచయము నంత మొందింప వచ్చు"నని సనత్కుమారు డన్నాడు. శ్రీరామునియం దిట్టి రాజాదర్శము చిత్రింపబడెను. యూరపుఖండమున నిట్టి యాదర్శ మెక్కడిది? రోము రాజ్యము వీడి కొందరు రాజులు సరళజీవయాత్ర సల్పినారు, కాని అది రాజ్యాభిషేకసమయమున కాదు. శ్రీరాముని సంయమము తపోబలమును వేరొకచోట కానరావు. అతని కతనే సాటి.