పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130 సాహిత్య మీమాంస

పిన్న వయసుననే బాలకులకు వివాహ మొనర్తురు. యవ్వన స్రోతముప్రవహించి రిపుషట్కముప్రబలునప్పటికే దంపతులు సంసారశృంఖాలాబద్ధు లయ్యెదరు, ఆ సంకెళ్లు తెంచుటకు తగినసామర్థ్యము వారి కలవడదు - అన్నివైపులా ఆలానములే, వాటి నూడబెరుకుట సామాన్యులకు వశము కాదు; పరమ భాగవతు లట్లు చేయగలరే కాని ఇతరుల కది చేతకాదు. ఇట్టి నిర్బంధమే లేకుంటే హిందూకుటుంబము లొక్క అడుగు ముందుకు వేయలేవు. యౌవన మంకురించినతోడనే యథేచ్ఛాచరణ మలవడుట హిందూసంఘమం దసంగతము. ఇట్టి కట్టుబాటులతో విలసిల్లు సంఘమున ప్రేమను దండోరా వేసి చాట నక్కరలేదు. అది బాల్యముననే అంకురించి, యౌవనమున వెలుగొంది, సంఘనియమానుసారము అభివృద్ధి చెందుతూ సంసారమను మహాయజ్ఞమున సంపూర్ణవికాసము నొందును. దంపతీప్రేమ పిన్ననాడే అంకురించి, నిరంతరమూ కలిసిమెలసి యుండుటచేతనూ, గృహకృత్యముల నిర్వహించుచుండుట వల్లనూ, సంతానము కని పెంచుచుండుటచేతా కాలక్రమమున పెంపొంది, బంధుసంపర్కము సాంద్ర మైనకొద్దీ మమత హెచ్చి రోగము, శోకము, సేవ, యత్నము మొదలగువాటిచే పరిపూర్తి చెందును. ఇది ఒకటి రెండు వత్సరములలో అంతరించేది కాదు, యావజ్జీవము సాగుచుండ వలసిందే!

ఐరోపీయ సంఘములం దిట్లుండదు. స్త్రీపురుషులు