పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126 సాహిత్య మీమాంస

భక్తిసంయతమైన ప్రేమ

ఆర్యసాహిత్యమందలి ప్రేమచిత్రము లన్నియు ఆత్మసంయమ ప్రభావగౌరవాన్వితములు. భక్తిచేతను ఆత్మనిగ్రహముచేత నెట్లు ప్రేమ సంయతమగునో చూడవలెనన్న ఒక్క కౌసల్యాపాత్రమునే కాక వాల్మీకి రచితములగు సీతాసుమిత్రల పాత్రములను కూడా పరిశీలించవచ్చును. వేదవ్యాసరచితములగు కుంతి, ద్రౌపది, గాంధారి, అరుంధతి, సావిత్రి, దమయంతి మొదలగు పాత్రము లన్నియూ ఉత్కృష్టోదాహరణములు. పురుషులలో రాఘవులు, దుష్యంతుడు, ద్రౌపదీవస్త్రాపహరణదృశ్యమున పాండవులూ అగుపరచిన ఇంద్రియనిగ్రహము అనిర్వచనీయము. భీముడు కోపావేశమున పండ్లుకొరుకుచు యుధిష్ఠిరునిపై దృష్టునినిల్పి ఆత డించుక కనుసన్న చేసెనేని ధార్తరాష్ట్రుల నందరినీ మట్టిలో కలిపివేయుటకు సిద్ధుడై యుండెను; జగదేకవీరుడగు విజయుడును కనులెఱ్ఱజేసి ధర్మజు నాజ్ఞను ప్రతీక్షించుచు దాయలనస్త్రాగ్ని కాహుతి జేయ సింసిద్ధుడై యుండె; ఈదృశ్యమున ఎట్టి ధైర్యము, ఎట్టి ఆత్మనిగ్రహము, ఎట్టి భ్రాతృభక్తియు ప్రతిఫలిస్తూన్నవో చూడండి. గుణవతియు, పతివ్రతయు నగు ద్రౌపది కెట్టి ఆపద ఘటిల్లినదో చూడండి! పాండుకుమారుల బలవిక్రమముల నూహించండి ! వారియొడళ్ళు ప్రతిక్రియాగ్నిచే భగ్గున మండుచుండుటచేత ఉష్ణరక్తము ప్రతిరోమకూపమును నించినది, శత్రువులు అధికారగర్వమున నవ్వుతూ గేలి చేస్తున్నారు,