పుట:Pranayamamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలబంధమును చేయుట మంచిది. ఉడ్యాణబంధము కుంభకమును ముగించబోవు నప్పుడును, గాలిని బయటకు విడువ బోవునప్పుడును చేయవలెను. ఇటుల చేయుటవలన ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించును. వజ్రాసనములో కూర్చొని కాలిబొటన వ్రేళ్ళను రెంటిని చేతులతో చీలమండల వైపు తిరిగి యుండులాగున గట్టిగా పట్టుకొనుము. ఆ పిదప పొట్ట యొక్క పైభాగము (బొడ్డుకు పైభాగము)ను వెనుకకు సరస్వతీ నాడిని ఒత్తిపట్టులాగున చేయుము. (క్రమక్రమముగ) ఆ పిదప యీ ఒత్తి పట్టుటను హృదయమువరకును, అచ్చటి నుండి మెడవరకును చేయుము. ఇటులచేయుటచే ప్రాణవాయువు బొడ్డుయొక్క సంధిని జేరును. ఇందువల్ల నాభికి సంబంధించిన వ్యాధులు క్రమక్రమముగ లేకుండపోవును.

జాలంధరబంధమును పూరకము చివరకు చేయవలెను. మెడ నరములను గట్టిగా నొక్కి, పైకి బిగపట్టి, వాయువు ప్రవహించు గొట్టమును పైకి ఎగతన్ని యుంచుటనే జాలంధర బంధము అందురు. మెడను క్రిందికి వంచి, రొమ్మునకు గడ్డమును నొక్కి పట్టుట మూలముగ, మెడ బిగలాగి యుంచుట వలన, ప్రాణము బ్రహ్మనాడిగుండ ప్రవహించును. ఇదివరలో చెప్పినరీతిగా, ఆసనములో కూర్చొని, సరస్వతీ నాడిని నొక్కిపట్టి ప్రాణవాయువును వశములోనికి తెచ్చుకొనుము. మొదటిరోజున కుంభకమును నాల్గుమారులును, రెండవనాడు పదిమారులను, ఆ తరువాత ఐదుమారులు కొంతసేపాగియు చేయుము. మూడవరోజున ఇర్వైమారులు చేయుము. ఆ పిమ్మట బంధనముల సహితముగ కుంభకమును చేయుచూ రోజుకు రెండుమారులు చేయుచుండుము.