పుట:Pranayamamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంటె శ్రేష్ఠమైనదని చెప్పెదరు. ఈ ఆసన సిద్ధి పొందినవారికి చాలసిద్ధులు లభించును. దీనిని అనేక సిద్ధులు వేయుటచే, సిద్ధాసనమని అనుచున్నారు.

లావుగా వుండి మిక్కిలి లావుగా వుండెడి తొడలుగల వారుకూడ దీనిని అభ్యసించ వచ్చును. ఇది కొందరకు పద్మాసనము కంటె ఎక్కువ అనుకూలముగ వుండును. యువబ్రహ్మచారులు దీనిని అభ్యసించుట వలన బ్రహ్మచర్యమును కాపాడు కొనవచ్చును. కాని, ఈ ఆసనము స్త్రీలకు తగదు.

ఎడమకాలి మడమును గుదమువద్ద పెట్టుము. కుడి మడమను జననేంద్రియ మూలమువద్ద పెట్టుము. పాదములను కాళ్ళను చీల మండల అతుకులు రెండునూ ఒకదానిని మరొకటి తాకు లాగున వుంచుకొనుము. చేతులను పద్మాసనములో వలె పెట్టుము.

స్వస్తికాసనము

‘స్వస్తికము’ అన శరీరమును నిఠారుగా వుంచుకొని సుఖముగ కూర్చొనుట. కాళ్ళను ముందుకు చాపుము. ఎడమ కాలును ముడుచుము. ఆ పిదప ఆపాదమును కుడితొడ కండరముల దగ్గరగా ఆనించుము. అదేవిధముగ కుడికాలిని మడచి, ఆపాదమును తొడకు పిక్కకు మధ్యగా వుంచుము. అప్పుడు నీరెండుపాదములు కాళ్ళయొక్క తొడలు పిక్కలకు మధ్యగా వుండగలవు. ఇది ధ్యానము చేయుటకు అనుకూలముగ వుండ గలదు. చేతులను పద్మాసనములో వలె వుంచుము.