పుట:Pranayamamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహార నియమములు

యోగశాస్త్రములో ప్రవీణుడు కాదలచువాడు, యోగసాధనకు హానిని కలిగించు ఆహారపదార్థములను అన్నిటిని విసర్జించవలెను. ఉప్పు, ఆవాలు, పులుపు కారముగాగల వస్తువులు, ఘాటుగను, చేదుగను వుండువస్తువులు, ఇంగువ, అగ్ని పూజ, స్త్రీసేవ, అతిగా నడచుట, సూర్యోదయ సమయమందు స్నానముచేయుట, ఉపవాసమువల్ల శరీరమును కృశింపజేసికొనుటలను మానవలెను. సాధనయొక్క ప్రారంభ దశలో పాలు నెయ్యిని ఆహారముగా తీసికొనవలెను. గోధుమలు, ఆకుకూరలు, దంపుడుబియ్యము, సాధనకు తోడ్పడును. వీటివలన శరీరమునకు బలము చేకూరును. అందువల్ల గాలిని ఎక్కువసేపు కుంభించి వుంచగలడు. ఈ రీతిని ఎక్కువసేపు కుంభించి గలుగుటవల్ల కేవల కుంభకము (ఉచ్ఛ్వాస నిశ్స్వాసలు లేకుండుపోవుట) సిద్ధించును. ఇట్టి సిద్ధిని పొందినవానికి మూడులోకములందును పొందవలసినది ఏదియు వుండదు. సాధన మొదలిడగానే చెమట పోయును. కప్పవలె, పద్మాసనస్థుడగు యోగి కొద్దికొద్దిగ భూమినుండి పైకి కదలుచుండును. మరికొంతకాలము సాధనచేసినచో, భూమిపైనుండి పైకి లేవగలుగును. ఇటుల భూమినుండి పైకి లేవగలిగినవాడు అనేకములగు వింతలను చేయకలుగును. ఏ విధమగు బాధయు, అతనికి వేదనను కలిగించదు. మలమూత్రములు, నిద్రలయొక్క పరిమాణము తగ్గిపోవును. కన్నీరుకారుట, కంటిపుసి, చొంగకారుట, చెమట, శరీరదుర్వాసన, నోటి దుర్వాసనలు లేకుండ పోవును. ఇంకను అధికముగ సాధనచేయుటచే భూచరసిద్ధి లభించును. ఇందువల్ల భూమిపై సంచరించు ప్రతిప్రాణి అతనికి