పుట:Pranayamamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యామోహములకు లోనైవున్నవారితో అమితముగ సంబంధము కలిగివుండువారు, క్రూరులు, పరుషముగ మాట్లాడువారు, తిండిపోతులు, వ్యర్థవ్యవహారములు చేయువారు, వీరు ప్రాణాయామములోగాని, తదితర యోగసాధనలలోగాని ఎన్నటికీ జయమును పొందజాలరు.

అధికారులు మూడురకములు

1. ఉత్తముడు, 2. మధ్యముడు, 3. అధముడు అని. వారి సంస్కారములు, బుద్ధి, వైరాగ్యము, వివేకము, ముముక్షుత్వములయొక్క పరిమాణము, సాధానాశక్తినిబట్టి - పైరీతిని విభజించవలెను.

యోగశాస్త్రమును జీర్ణముచేసికొని, సాధించిన గురువు వద్దకు వెళ్ళుము. అతని పాదములవద్ద కూర్చొనుము. అతనిని సేవించుము. తెలివిగలిగి, తగు ప్రశ్నలనువేసి, ఆతనినుండి నీ సంశయములను తీర్చుకొనుము. అతనినుండి సాధనా విధానమును చెప్పించుకొని, సంతోషము, శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, విశ్వాసములతో అభ్యసించుము.

ప్రాణాయామాభ్యాసి ఎల్లప్పుడు మధురముగను, ప్రేమతోను మాట్లాడవలెను. ప్రతి వానియందు దయగలిగి వుండవలెను. అందరిని ప్రేమించవలెను. నిష్కపటిగా వుండవలెను. నిజము పలుకవలెను. వైరాగ్యము, ఓర్పు, శ్రద్ధ, భక్తి, కరుణ మొదలగు లక్షణములను వృద్ధిచేసికొనవలెను. బ్రహ్మచర్యమును పూర్తిగా పాటించవలెను. గృహస్థాశ్రమములో వుండి ప్రాణాయామమును చేయు సాధకుడు, అభ్యాసకాలములో చాల మితముగ సంభోగము చేయవచ్చును.