పుట:Nanakucharitra021651mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరుతప్పక మాకు సాయముచేసి మమ్ము దేల్చువారెవరులేరు నాయనా నీయావచ్ఛక్తి వినియోగించి నాబిడ్డతో నెట్లు చెప్పవలయునో యట్లు చెప్పి వాడీ యూరునుండి పోకుండునట్లుచేసి పుత్రభిక్షము పెట్టుము. నీకెంతో బుణ్యముండును" రాయబులారు త్రిప్తాదేవి మాటలచేత బరవశుడై నానకును జూచి నీతల్లి యభీష్టమెట్లయిన నెరవేర్ప గలవాయని యడిగెను, అడిగి యంతట నూరకుండక రాయబులారు వెండియు నిట్లనియె. "నాకు విస్తారము సేవ్యము జేయదగిన భూమిగలదు. అందుకొంత నీ కుచితముగ నిచ్చెద. నీవు శిస్తు నీయనక్కరలేదు. కావలసిన పాలేళ్ళను బంపెదను. నీవేమియు శ్రమపడనక్కరలేదు. అది శేవ్యము చేయించుచు నిచ్చట నుండగలవా."

అతనిమాటలకు గురువిట్లు బదులు చెప్పెను. "అయ్యా! భగవన్నామ స్మరణమే విత్తన మగుగాక సంతుష్టియే నాగలి యగుగాక! వినయమే కలుపు తీతయగుగాక ఇట్లు కృషిచేసిన నీభక్తివిశేషము చేతను దైవానుగ్రహము చేతను మంచిపంట పండగలదు. నీయిల్లు నిత్యకళ్యాణ సదనమై వర్థిల్లగలదు" అప్పలుకులు విని దాపుననున్న పినతండ్రి నానకుతో మెల్లగ నిట్లనియె. నీవు వ్యవసాయము వంటి కష్టపు బని జేయలేని యెడల మంచియంగడి నొకదానిం బెట్టి సుఖముగ గూర్చుండి పనిచేయు చుండుము. అనవుడు గురువు పినతండ్రికిట్లనియె.