పుట:Naayakuraalu.Play.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

నాయకురాలు

పా: ఆయన యీ పహరాలోనే తనిఖీకి వస్తాడు. వేళయింది, పహరా మార్చుకొన్నట్టు దస్కతుబెట్టు.

కా: ఉఁ-దూరంగా అలికి డవుతున్నది.

పా: వస్తున్నట్టున్నాడు. పారా వెయ్యి.

కా: ( తిరుగుతూ) ఎవరువారు ? జవాబు చెప్పి కదులు. మిత్రుడవా, శత్రువువా ?

కే : మిత్రుణ్ణే ; కేతురెడ్డిని. అంతా క్షేమమా?

కా: అంతా క్షేమమే.

కే: అత డెవరు ? మాచర్లమనిషి లాగున్నా డే ?

కా: పొదిలె పాపన్న ; ఇప్పుడే పారా వదిలాడు.

కే: ఆహా ! కోటముఖస్థలాన యిద్దరు పగవాండ్లా కావలి గాయడం?

పా : పగవాండ్లమే. ఇక మాకు గంగధారిమడుగు, పాముల మడుగు, పిల్లేటినీళ్లు విషాలు ; గురిజాల పరదేశం.

కా: పెద్ద లేమైనా మార్గం యోచించారా ?

కే : ఒకటేమార్గం; పరాయిల చేజిక్కింది, వూరికే వస్తుందా ?

పా: రాదులే. యేమయినా తేలిందా?

కే: నరసింగరాజుగారు చాలా పట్టుదలగా వున్నారు. నాగమ్మగారు పొద్దున కాశీనుంచి తిరిగివచ్చారట. వెళ్లి మాట్లాడుదా మనుకొంటున్నాము. మీ సలహా ఏమని?

పా: ఇందరి మాటలూ, సలహాలూ వద్దు. నిర్ధారణ చెయ్యండి. మేము దేనికయినా సిద్ధమే. ఆలస్యం చేయవద్దు. పని వేడిలో జరగాలె.