పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
299

మ్రొక్కఁ జాలనివారిఁ జక్కిఁ జేరిన వారిఁ
         బాలించి లోపాలు వాపుమేటి!

పాలు పాలంచు విసమున్న పాలొసంగఁ
గేలి దరిఁజేరు పాతకి బాల హంత
పాలతోఁగూడఁ బ్రాణాలు లీల నొడిసె
బాలుఁడైయున్న త్రిజగతీ పాలకుండు.

శ్రీ కృష్ణుడు కంసుని వధించిన క్రమమిట్లు తెలుపంబడెను:-

బడుగుం బీదలఁ దల్లిదండ్రులఁ జెఱం బట్టించె మిమ్మింతకున్
గడపంజూచె బదాఱువేల సతులం గాఱించె నీ దుష్టు నీ
చెడుగుం గంసుని ద్రుంతునంచుఁ గరిపై సింగంబనన్ శారి తాఁ
బెడకేలన్ సిగబట్టి తట్టి యడచెన్ భీమాట్టహాసంబునన్.

అభిమన్యువధయందు యుధిష్ఠిరుఁడభిమన్యునిఁ పద్మవ్యూహమును భేదింపుమని యడిగినట్లు చెప్పిన యీ పద్యమును కనుఁడు.

గురుఁడల కౌరవేశ్వరుని కోరికపై ననుఁబట్టఁ దమ్మి మొ
గ్గరము ఘటించె శౌరియును గాండివియుం జని రన్యకార్యము
న్నెఱపఁగఁ దద్విభేదనము నేరరొరుల్ మఱియేమి చెప్ప ను
ర్వర మము నీట ముంచినను బాలను ముంచిన నీవె పుత్రకా!

అభిమన్యుడు పద్మవ్యూహమును గూర్చి రథమును బోనిమ్మనిన సారథి వారించిన క్రమమిట్లు తెలుపంబడెను:-

బాలుఁడవునీవు దుర్వార బలులు వార
లెదిరి బలమును దనబల మెఱుఁగ కుండ
సాహస మొనర్చినం గీడు సంభవించుఁ
బాటి సేయుము నామాట పార్థ తనయ!