పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగదత్తుని కథ

131

తొలిప్రాయములో నుంటివి నీజవ్వనమంతయు అడవిగాసిన వెన్నెలవలె నిష్ప్రయోజనము చేయుచుంటివేమి? నిన్ను జూచినప్పుడెల్ల నాయుల్లము దల్లడిల్లుచున్నది. మంచిపరువమున సరసమగు రతిసుఖ మనుభవింపని తరుణీమణి జన్మ మేటికి? నీ పూర్వవృత్తాంత మెద్దియో నాకు దెలియదు అదియునుగాక కాలానుగుణ్యముగా బ్రవర్తింపవలయును. ఇప్పుడు మాలో గలిసితివి మామకధర్మములనే అనుసరింపవలయును. నీవు సమ్మతింతువేని ధనికులైనవారి బెక్కండ్ర విటకాండ్ర రప్పింపగలను. నీకు దెలియకున్న మదీయధర్మములన్నియుం బోధించెద. వైశికప్రకరణ మంతయు మాకు గంఠస్తమైయున్నది. వశ్యౌషదములు మాయొద్ద బెక్కులుగలవని యెన్నియో చెప్పినది. కాని దానిమాటలేమియు చెవినిబెట్టక దాని కేమియు సమాధానము సెప్పక అప్పటికెద్దియో పని గల్పించుకొని యావలకుం బోయితిని.

మఱియొకనాడు సాయంకాలమున నాగదత్తుడు పట్టాభిషిక్తుండై మత్తగజ మెక్కి యూరేగుచుండగా నాజనసంఘములో దేవరయుందురేమో అను నాసతో మేడయెక్కి తొంగిచూచితిని.

ఆ యంతఃపురములో అతండు గజముపై నుండి నన్ను జూచెను. నేనును వేశ్యవాటికలో నుండుటచే నన్నును వేశ్య అనుకొని ఆతం డారాత్రి రుక్మవతికివార్త పంపెను.

అదియు నాయొద్దకువచ్చి ముద్దుగుమ్మా! నిన్ను నాగదత్తుడు చూచి మోహించి యిప్పుడు వార్తనంపెను. నేనేమి చేయుదును? రాజశాసన మనతిక్రమణీయమైనది గదా? నీవు సమ్మతింపవేని దప్పక ముప్పురాగలదని చెప్పిన అప్పుడు నేనుమనంబున అయ్యో? ఈచెడిపె నన్ను బలుమారు నీచకృత్యములకు బ్రోత్సాహపరచుచున్నది. నాకతంబున ధనము సంపాదించుకొనవలయునని దీనికి బుట్టినది. ఇంక నిందుండ రాదు. ఆ రాజువచ్చిన బాదంబులంబడి నా వృత్తాంతమంతయుం జెప్పి రక్షించుమని వేడుకొనియెద న్యాయముగా బ్రజలబాలించు నతనికి నాయందు దయపుట్టకుండునా? అని పెద్దతడవు విచారించి దానికేమియు బ్రత్యుత్తర మిచ్చితినికాను.

అప్పుడది అదియే మదీయాంగీకారసూచనముగా దలంచుకొని యారాత్రియే వచ్చునట్లు నాగదత్తునకు బ్రత్యుత్తర మంపినది. అతండును రహస్యముగా నొక్కరుండ యా రాత్రి మా యింటికి వచ్చి లోపల నడుచునపుడు చూడక త్రోవలో యావుదూడను ద్రొక్కెను. ఆక్రేవు అంబా అని అరచి వీడెవ్వడో వేగముగా బోవుచు నన్ను ద్రొక్కెనె అని తల్లితో జెప్పెనట. ఆ మాటవిని యా ధేనువు అయ్యో కూనా! వాడు మాత్రుసంగమము చేయుటకై అరుగుచున్నవాడు నిన్ను ద్రొక్కుట కేమిశంక వానికి గ్రిందును మీదును గనంబడుచున్నదా అని పలికినదట ఆరెండుమాటలును విని తనకాభాష వచ్చుచే నాగదత్తుడు సంశయించుచు అయ్యో! నేనిప్పుడు వారకాంత యింటికి వచ్చితిని. వీండ్రకును మాకును వావిలేక ఒకవేల నేను కోరినదాని మా