పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ విగ్రహ నిర్మాణము అనేక ఆగమ సూత్రములతో ముడిపడి యున్నది. అందువలన మన స్థపతి (విగ్రహ నిర్మాణకర్త) తన శిల్పనాచాతురినంతనూ ఈ ఆగమ సూత్రములకు లోబడియే చేయవలసియున్నది. కనుకనే స్థపతి ప్రతిమా లక్షణములను విస్తృత పరచుటయందు, వాటిని అలంకారముతో శృంగారించుట యందు తన ప్రతిభను ప్రజ్ఞాపాటవమును చూపించినాడు. రేఖా సూత్రములకు ప్రాథాన్యమిచ్చిన మన స్థపతి అవే సూత్రములద్వారా అతి సుందరమూ, సౌకుమార్యము కలిగిన శిల్పములను తయారు చేసి నాడు.

మ్యూజియం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయుట యనునది ఈ శతాబ్దపు నినాదము. ఈ నినాదము నిజము కావలెనన్న, ప్రతి వస్తువునకు దానిని గురించిన పూర్తి విపులీకరణ యుండవలయును. అందు కనుగుణముగా ఈ మ్యూజియంనందు వస్తు వివరణ జరిగియున్నది. ఇదియే ప్రేక్షకునియందు విషయ పరిజ్ఞానమునకై ఆసక్తిని దృఢతరము చేయును.


-<•>-