పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెలకొనియున్న అనేక దేవాలయములకు, మఠములకు వివిధ కైంకర్యములు చేసి నటుల ఇచ్చట అనేక శాసనములు తెలుపుచున్నవి. ఎక్కువ శాసనముల వలన ఇచ్చట అంబిక దేవాలయమునకు అనేక కైంకర్యములు చేసింటుల తెలియుచున్నది.[1] చాళుక్య, కాకతీయ ప్రభువులు ఈ దేవతకు అనేక కైంకర్యములు చేసిరట. స్వామివారికి ఎనలేని కైంకర్యములు చేసిరి. కొన్ని సుంకములను దానము చేసిరి. క్రీ. శ. 12 వ శతాబ్ధి అంతమునుండి మాత్రము జైనమత ప్రాబల్యము చాలవరకు తగ్గిపోయినటుల శాసనాధారములు కనుపించు చున్నవి. బహుశ: ఇది శైవమత ప్రాబల్యము వలన కలిగియుండ వచ్చును. అంబిక దేవాలయ వినాశము గూడా ఈ మత వైషమ్య ఫలితమై యుండవచ్చును.

భారతీయ శిల్ప శైలులను గురించి వ్యాఖ్యానించుచూ ఆచార్య రాధా కమల్ ముఖర్జీ పండితుడు ఈ విధముగా చెప్పినాడు. మన దేశమందు కనిపించు శిల్ప సంపద యావత్తూ మన భావనా జగత్తుకు, కల్పనా చాతుర్యమునకు గీటురాళ్ళు.[2] యుగ యుగములుగా వచ్చుచున్న వేదాంత పాఠము గాని, యోగాచారములు గాని ప్రజలలో భారత ప్రజలంతా ఇకటేనని గ్రహింపు కలిగించ జాలరు. కాని కాకతీయ శిల్ప కళా ఖండులను తరచి చూచిన కొద్దీ మనకు ఒకటే ఊహ కలుగును. వివిధ శైలులందు ఏకత్వము గోచరించును. అందువలననే కావచ్చును వివిధ మనములవారు, వివిధ భాషలను మాటలాడువారు అందరు కూడ ఈ మ్యూజిమంను చూచుటకు విచ్చేయు చున్నారు. వీరు అందరూ సోమేశ్వరుని మీది భక్తి తత్పరతతోనే ఇచ్చటికి వచ్చుట లేదు. ఎక్కువ మంది ఇచ్చట ఒక చోట చేర్చబడియున్న అనేక శిల్పములను చూచి ఆనందించుటకై కూడ వచ్చు చున్నారు. ఈ విధముగా చూచిన భారతీయులందు గల విభిన్నత్వమందలి ఏకత్వము (సమైక్యతా భావన) కనుపించు చున్నది.[3]

  1. అంబిక జైనుల ఇరువది నాలుగవ తీర్థంకరుడైన మహావీరుని శాసన దేవత. ఈమె మామిడిపళ్ల గుత్తిని చేతియందు ధరించి, తన ఇరువురు కుమారులతోను, సింహము రూపు ధరించిన తన భర్తతో పరివేష్టించియుండును.
  2. రాధా కమల్ ముఖర్జీ:.... ప్లవరింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్.
  3. గాంధార శిల్ప సాంప్రదాయము. మధుర శైలి. అమరావతి, నాగార్జునకొండ మొదలగునవి చాళుక్య, కాకతీయ శైలులు అన్నీ కొన్ని విభిన్నరీతులను సంతరించుకొన్నను, లోతుగా చూచిన మనకు తెలిసినది ఒకటే. వివిధ శైలులు వేరు వేరు గాక, ఒక దానినుంచి కొంత గ్రహించి నూతన పోకడలను సంతరించుకొని తమ ప్రతిపత్తిని నిలుపుకొన్నవి అని మాత్రమే.