పుట:Gurujadalu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: మీరే హాశ్యాలాడుతున్నట్లున్నది. పెళ్లి అయి పదిరోజులైంది. మీరీ సంబంధం అక్కరలేదని వుత్తరము వ్రాసినారట. అందుపైని గుంటూరు నుంచి వొక శాస్త్రుల్లు వస్తే ఆయన కొమార్తెను పన్నెండువందల రూపాయలు యిచ్చి పెళ్లాడాడు.

అగ్నిహో : అన్నగారూ హాశ్యం ఆడుతున్నారు - న్యాయంగాదు సుమండీ.

రామప్ప : గాయత్రీసాక్షి, నేను యెప్పుడూ అబద్దం ఆడి యెరుగను. నా మాట నమ్మకపోవడం ధర్మమేనా?

అగ్నిహో : గుండెలు తీసినపని. రండీ గాడిదకొడుకుని యెమికలు విరగకొడతాను.

రామప్ప: నేను రానండి - గుంటూరు సంబంధం చేయ్యవద్దంటే నాతో దెబ్బలాడాడు. అప్పటి నుంచీ నాకూ అతనికీ మాటలులేవు - మీరు వెళ్లి మాట్లాడి రండి. సూర్యోదయము అయేసరికి వచ్చి కలుసుకుంటాను.

అగ్నిహో : గాడిదకొడుకింత స్వామిద్రోహం పని చేస్తాడూ? నా కేమీ నమ్మకము లేకుండా వుందీ - నిజమైతే పులుసులోకి యెమికలు లేకుండా విరిచేస్తాను.

(నిష్క్రమించును)

రామప్ప: పిశాచంలాగు వెళ్లుతున్నాడు - కంటె యివ్వనందుకు తగినశాస్తి అవుతుంది-నా సంగతి చూస్తే ఆవు పెయ్యాకాదు - గేదెపెయ్యాకాదు, దీక్కుమాలిన పెయ్యలాగున్నది. ఇంటికి వెళ్లితే కంటెకి తాపులాట తప్పదు. వెళ్లకపోతే కనిష్టీబు ప్రవేశిస్తాడేమో అన్న బెంగ.

ఏడవ స్థలము - రామప్పంతులు ఇల్లు

(రామప్పంతులు వెనుక ప్రక్క నుంచే తొంగితొంగి చూచుచు నిన్ముళముగా అడుగువేయుచు ప్రవేశించును)

రామప్ప: మధురవాణీ.

మధుర: అయ్యా?

రామప్ప: యెవరు యింట్లోంచి నల్లకోటు తొడుక్కుని వెళ్లిపోతున్నాడు?

మధుర: ఇల్లుతుడిచేదాన్ని కాబోలు చూచీ ఆలాగనుకున్నారు. మీ కంతకంతకు మతిపోతూంది. నా కంటేదీ? తాకట్టు పెట్టేశారు. నాకు తెలుసును. అది అడుగుతానని యీ వేషాలు వేస్తూన్నారు. యీ సరుకులు మీరు తీసుకోండి - మీరు నన్ను సార్లా చెయ్యరు - నేను నూతులో బడిపోతాను (అని యేడ్చును)

గురుజాడలు

186

కన్యాశుల్కము - తొలికూర్పు