పుట:Gurujadalu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: బాగా ఆలోచించుకోండి నావల్ల చాలా వుపకారం పొందినారు.

(లుబ్ధావధానులు తలుపువేసుకొని లోపలికి వెళ్లిపోవును)

రామప్ప: ముసలిగాడిద టంగాడుకాడు. రేపు రాత్రి బయలుదేరి వెళ్లిపోతానంటూన్నాడు. వీడు వెళ్లిపోయినట్టైనా నా కంటెకు నీళ్లధారే - ఇంటిదగ్గిర రోజూ మధురవాణి ఘాలివాన పెట్టేస్తూ వున్నది. యీ రాత్రి అదన్నమాటలుచూస్తే దానిని పొడిచేసి పొడుచుకోవాలని బుద్దపుట్టింది. వీడు వెళ్లేలోగా ఆకాశరామన్న అర్జీ అంది పోలీసువస్తే బాగుండును. ఈ వేళ దశమికాదూ; ఆ! అయితే ఫర్వాలేదు. ఈ రాత్రి అగ్నిహోత్రావధానులు తోటలో దిగుతాడు. అక్కడ యేదైనా పన్నాగం పన్నాలి. ఇప్పుడు యింటికి వెళ్లితే మధురవాణి పేడనీళ్లు పట్టుకువస్తుంది నాకు యేమీ తోచకుండావున్నది తెల్లవారగట్ల కావచ్చినది. కాలోచిత కృత్యములు తీర్చుకోవడముకు చెరువుకు వెళ్లుదాము.

***

ఆరవస్థలము - తోట - పెళ్లి వారి బళ్లు చెరువుగట్టుమీద నుండును.

అగ్నిహో : బళ్లుదింపండి - బళ్లు దింపండి - సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డవున్నది. చెరువు, స్నానానికి మహాబాగా వున్నది. యెవరయ్యా చెరువు గట్టుమీద?

రామప్ప: నా పేరు రామప్పంతులంటారు.

అగ్నిహో : లుబ్ధావధానులుగారు మిమ్ములను పంపించారా యేమిటి?

రామప్ప: యెందుకండీ?

అగ్నిహో :మేమొస్తామని లుబ్ధావధానులుగారు యెదురుచూస్తూ ఉండలేదూ? నా పేరు అగ్నిహోత్రావధానులంటారు.

రామప్ప: మీరేనా అగ్నిహోత్రావధానులుగారు యేమి వచ్చారేమిటి?

అగ్నిహో : పెళ్లిమాట మీకు తెలియదా యేమిటి?

రామప్ప: పెళ్ళెవరికండీ?

అగ్నిహో : మీదీవూరు కాదా యేమిటండీ? మా పిల్లను లుబ్ధావధానులుగారికిస్తాము.

రామప్ప: లుబ్ధావధానులుగారికి పెళ్లి అయిపోయిందే?

అగ్నిహో : పంతులుగారాశ్యాలాడుతున్నారు -హాశ్యాలకేమిగాని ప్రయత్నాలు యేలాగు జరుగుతున్నాయి యేమిటండీ? లుబ్ధావధానులుగారు బహుసామంతులనీ వింటున్నాము?

గురుజాడలు

185

కన్యాశుల్కము - తొలికూర్పు