పుట:Gurujadalu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ : దట్ ఈజ్ రైట్. ఆవులనెందుకు చేశాడు?

వెంకటే: పాలు యివ్వడముకు.

గిరీశ : పెర్‌ఫెక్ట్‌లీ రైట్. ఆడవాళ్ల నెందుకు చేశాడు?

వెంకటే: వంట చెయ్యడానికి.

గిరీశ : నాన్‌సెన్స్. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ గనుక పెండ్లాడకుండావున్న వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు.

(అగ్నిహోత్రావధానులు ప్రవేశించుచున్నాడు)

అగ్నిహో : ఏమండీ గిరీశంగారూ మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ.

గిరీశ : ఘంటసేపాయి చెపుతున్నానండీ.

అగ్నిహో : యేదీ నేకూడా వింటాను కొద్దిగా చెప్పండీ.

గిరీశ : మైడియర్ బోయ్, గాడీమేడ్ క్రియేషన్. సృష్టియెవడు చేసినాడూ?

వెంకట్ : దేవుడు.

గిరీశ : ఫాదర్ ఈజ్ నెక్‌స్ట్‌టుగాడ్. దేవుని తర్వాత ముఖ్యం యెవరూ? సే ఫాదర్.

వెంకటే : తండ్రి.

అగ్నిహో : మొత్తముమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదీలాగే కనబడుతూన్నది. భాష భేదంగానీ మనముక్కలే వాళ్లవిన్నీ

గిరీశ : వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమి వస్తువులున్నవి? సే కోర్ట్‌స్.

వెంకటే: వెధవలు.

గిరీశ : నాన్ సెన్స్ సే కోర్ట్స్.

అగ్నిహో : యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు, ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనాయేమిటి వున్నది.

గిరీశ : వేధ్వల్ అన్నదీ లాటిన్ మాటండి - ఆమాట కర్డు కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి?

వెంకటే: దావాలు తేవడముకు.

గిరీశ : దట్ ఈజ్ రైట్ - చూచారండీ మీవాడికి కచేరీల భోగట్టాలుకూడా నేర్పుతున్నాను.

అగ్నిహో : అయితే మనదావా విషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగా చూశారా.

గురుజాడలు

167

కన్యాశుల్కము - తొలికూర్పు